10, నవంబర్ 2018, శనివారం

రాముడు కృష్ణుడు

పూర్వం సీతానగరం అనే ఒక చిన్న  గ్రామంలో ఒక ఆమె ఉండేది ఆమె పేరు పార్వతి.  ఆమెకు ఒక చిన్న పిల్లవాడు పేరు రాముడు. దాదాపు 10 సంవత్సరాల లేత వయస్సు వాడు వుండే వాడు. ఆమె భర్త రెండు సంవత్సరాల క్రితం చనిపోయాడు. ఆమె వక్కతె తన పిల్లవాడితో జీవితాన్ని గడుపుతున్నది.  ఊర్లో యేవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ వాళ్ళ బ్రతుకు యిడుస్తున్నరు.  పిల్లవాడికి ఇప్పుడిప్పుడే ఊహలు వస్తున్నాయి. వాళ్ళ ఊరిలో పాఠశాల లేనందున అక్కడికి దగ్గరలోని కొంచం పెద్ద ఊరుకి వెళ్లి చదువుకోవాలి. రాముడిని కూడా పార్వతి ప్రక్కవూరైన నాగలూరుకి పిల్లవాన్ని పాఠాశాలలో చదివించటానికి పంపింది. ఆ రెండు ఊర్ల మధ్య ఒక దట్టమైన అడవి వున్నది. ఆ అడ్డవి దాటితేనే కానీ నాగలూరు రాదు.  రాముడు చిన్న పిల్ల వాడు మరియు వాళ్ళు పేదవారు కావటంతో రాముడిని వెంట తీసుకొని వెళ్ళటానికి మిగితా పిల్లలు వప్పుకొనెవారు కాదు.  పాపం పార్వతి ఎంతోమంది పిల్లలని వాళ్లతోపాటు తన రాముడిని కూడా తీసుకొని వెళ్ళమని వేడుకొనేది కానీ వాళ్ళు సరే అన్న రాముడిని మాత్రం వెంట తీసుకొని వెళ్లే వారు కాదు.  దానితో ఎంతో ప్రేమగా రాముడితో పార్వతి నాన్నా నీవు పెద్ద వాడివి అయ్యావు నీకు ఏమి భయం లేదు నీవు వంటరిగా వెళ్లగలవు అని ఎన్నో రకాలుగా చెప్పి చూసింది.  సరే అనిఅన్నా రాముడికి ఆ అడవి దాటాలంటే చాలా భయం వేసేది. యేవో సాకులు చెప్పి తరచూ బడి ఎగ్గొట్టేవాడు.  దానితో పార్వతికి ఏమి చేయాలో తోయక ఒకరోజు ఈ విధంగా చెప్పింది.  నాన్న రాము నీకు అడవిలో ఒక అన్నయ్య వున్నాడు అతని పేరు కృష్ణుడు.  నీకు అడవి దాటి వెళ్ళేరప్పుడు నీకు తోడుగా ఉండమని నేనుచెప్పాను.  నీకు భయం వేస్తే నీవు పిలిస్తే వెంటనే నీకు సాయంగా వస్త్తాడు అని ఇంట్లో వున్నా కృష్ణుని విగ్రహం చూపించింది.  ఆ మరుసటి రోజు పొద్దున్నే రాముడు లేచాడు కాలకృత్యాలు తీర్చుకొని ఉత్సాహంగా తయారయ్యాడు. చద్దన్నం పెట్టి పిల్లవాడి రెండు బుగ్గలని ఎడమచేతితో పట్టుకొని బొట్టుపెట్టి రాముడిని బడికి పంపింది పార్వతి.  పార్వతికి రాముడి ఉత్సాహంచూసి ముచ్చటేసింది.  రాముడు ఒంటరిగా అడవిదారి నుండి బడికి బయలుదేరాడు.  అతని కన్నులు తన కొత్త అన్నయ్య క్రిష్నుడి కోసం వెతక సాగయ్యే.  నిజంగా కృష్ణ అన్నయ్య ఉన్నాడా తాను వచ్చి తనను అడవి దాటిస్తాడా అని ఆలోచిస్తూ అడవిలో నడుస్తున్నాడు రాముడు.  ఇంతలో ఎక్కడినుండి వచ్చిందో ఒక పెద్ద శబ్దం ఏదో క్రూరమృగం అరుపు.  ఆ అరుపుకి రాముడి ఫై ప్రాణాలు పైనే పోయాయి.  వెంటనే పెద్దగా అన్నయ్య కృష్ణ అన్నయ్య అని తన శెక్తి ఉన్నంత పెద్దగా పిలిచాడు.  ఎవ్వరు రాలేదు భయంతో వణికి పోతున్నాడు.  ఏమి చేయాలో పాలు పోలేదు. మళ్ళా బిగ్గరగా కృష్ణ అన్నయ్య అని పిలిచాడు.  ఈసారి తన గొంతే కొండలనుండి తెరిగి తనకి వినిపించింది.  రాముడు అరచి అరచి సొమ్మసిల్లి మూర్ఛ పోయాడు.  ఏమైందో ఏమో తాను లేచే సరికి తన ప్రక్కన ఎంతో ప్రశాంతంగా వున్నా ఒక వ్యక్తి వున్నాడు.  ఆటను అచ్చంగా ఇంట్లో వున్నా క్రింష్ణుడి విగ్రహంలానే వున్నాడు.  వెంటనే రాముడు అన్నయ్య కృష్ణ అన్నయ్య అన్నాడు అప్రయత్నంగా దానికి తమ్ముడు నేను వచ్చాను నీకు ఏమి భయం లేదు  అన్నాడు. తన అన్నయ్య తన తోడు వున్నాడన్న ధైర్యం రాముడి మొఖంలో కొట్టొచిన్నట్లు కనపడ్డాడు.  రాముడు కృష్ణుడిని గట్టిగా కౌగిలించుకున్నాడు.  అన్నయ్య నీవు నన్ను వదిలి పోవద్దు అన్నాడు.  కృష్ణుడు రాముడి భుజం తట్టి రాము నీకేమి భయం లేదు ఈ అడవి దాటె వరకు నీకు తోడుగా వుంటాను, అంతేకాదు నీకు మంచి మంచి కథలు చెపుతాను అని రాముడి భుజం మీద చేయి వేసి నడుస్తూ భాగవతంలోని కథలు చెప్పుతూ అడవి దాటించాడు. ఆ రోజునించి రాయుడు ఏ విధమైన గొడవ చేయకుండా ప్రతి రోజు బడికి వెళ్లటం పార్వతికి ఆనందాన్ని ఇచ్చింది. కాని రాముడు భయం లేకుండా అడవి ఎలా దాటుతున్నాడో మాత్రం ఆమెకి తెలియలేదు. 
రాముడికి బడికి సెలవ ఇస్తే చికాగుగా ఉండేది. అమ్మా  రోజు బడి వుంటే యెంత బాగుంటుంది అన్నాడు.  వాడికి చదువు మీద కలిగిన శ్రద్ధకు పార్వతి నివ్వెర పోయింది.  రోజుకొక భాగవత కథ తల్లికి వినిపించేవాడు రాముడు.  దానికి కారణం ఏమిటో పార్వతికి అర్ధం కాలేదు.  నాన్న నీకు ఇన్ని కథలు ఎవరు చెప్పుతున్నారు.  మీ స్నేహితులకి ఎవరికి ఇవి తెలియవుకథ అన్నది పార్వతి.  దానికి రాముడు అమ్మ నీవు చెప్పినట్లే నాకు అడవిలో కృష్ణ అన్నయ్య నాతొ పాటు వచ్చి అడవి దాటించటమే కాకుండా నాకు రోజుకొక కధ చెపుతున్నాడు.  అమ్మ అన్నయ్య చాల మంచివాడు అన్నాడు.  అది విని పార్వతి నివ్వర పోయింది.  పిల్లవాడు చెప్పేది నిజామా కాదా అని ఆలోచనలో పెద్దది.  వాడు చెప్పింది నిజం కాకపోతే వాడికి అన్ని భాగవత కధలు ఎలా వస్తాయి? మీ అన్నయ్య ఎలా వున్నాడు అని వాడిని అడిగింది పార్వతి అమ్మ అచ్చంగా మన ఇంట్లో వున్నా కృష్ణుడిలాగానే వున్నాడు అన్నాడు రాముడు.  సందేహం లేదు తన పిల్లవానికి కృష్ణ భగవానుడు కనపడ్డాడు అనుకున్నది ఆ తల్లి.  
రాముడి తోటి పిల్లలకి కూడా రాముడు కొత్తకొత్త కధలు చెప్పటంతో నీకు ఎవరు ఇన్ని కథలు చెప్పారు అన్నారు.  రాముడు తన అన్న అడవిలో వున్నదని ఆ అన్నయ్యే కధలు చెప్పారు అన్నాడు.  ఐతే మీ అన్నయ్యని మాకు చూపించమని తోటి పిల్లలు రాముడిని అడిగారు. రాముడు అడవికి వాళ్ళని తీసుకొని వెళ్లి రోజు అన్నయ్యని కలిసే చోట పెద్దగా అన్నయ్య అన్నయ్య అని పిలిచాడు.  వాళ్ళకి వాడి గొంతే కొండలకి తాకి ప్రతిధ్వనించింది.  మళ్ళి మళ్ళి బిగ్గరగా పిలిచాడు రాముడు.  ఏమి ప్రయోజనం లేదు ఎంతసేపు పిలిచినా కృష్ణుడు రాలేదు.  అందరు రాముడిని నీకు అన్నయ్య లేడు ఎవరు లేరు నీకు పిచ్చి పట్టింది అని ఎగతాళి చేశారు.  రాముడు ఏడ్చుకుంటూ వాళ్ళ వెంట తన ఇంటికి వచ్చాడు.  ఏమి చేయాలో పాలు పోలేదు.  ఎందుకు అన్నయ్య తనకి ఈరోజు కనపడలేదు.  తనని తన స్నేహితులముందు చులకన చేసాడు అని వాడికి కృష్ణుడి పైన కోపం వచ్చింది.  వెంటనే తన ఇంట్లో కృషుడి విగ్రహం వున్నా గదిలోకి వెళ్లి తలుపు వేసుకొని పెద్దగా ఏడవ మొదలు పెట్టాడు.  కానీ కృష్ణుడు కనపడలేదు.  అప్పుడు రాముడు తన తలను కృష్ణుడి విగ్రహం కాళ్ళ దగ్గర బాదుకోసాగాడు.  తలా పగిలి రక్తం కారుతుంది అట్లా కొంత సేపు ఐన తరువాత తమ్ముడు అనే పిలుపు వినిపించింది.  అదే పిలుపు తన అన్న కృష్ణుడి పిలుపు కానీ కళ్ళు తెరిచే ఓపిక లేదు తల మొత్తం రక్తంతో తడిసి వుంది.  అతి కష్టంగా కళ్ళు తెరచి చూసాడు రాముడు.  తన తలని వడిలో పెట్టుకొని నిమురుతూ వున్నాడు కృష్ణ అన్నయ్య.  అన్నయ్య చెయ్యి పడగానే రక్తం మొత్తం కనిపించకుండా పోయంది కొత్త శక్తీ వచినట్లయంది రాముడికి.  అన్నయ్య నీ మీద నాకు కోపం వచ్చింది నా స్నేహితుల ముందర నన్ను అవమానపరచవు అన్నాడు రాముడు.  తమ్ముడు నేను అందరికి కనపడను కేవలం నీ లాంటి మంచి వాళ్లకి మాత్రమే కనపడతాను.  నీ స్నేహితులు నీ లాగా మంచి వాళ్ళు కాదు వళ్ళంతా నిజమైన భక్తి లేని వాళ్ళు.  అందుకే నేను వాళ్లకు కనపడనని అన్నాడు.  రాముడికి తన అన్న మళ్ళి కనపడి తనను ఊరడించినందుకు చాల సంతోషం వేసింది.  అప్పడి నుండి రాముడు తన అన్న విషయం ఎవ్వరికీ చెప్పకుండా తాను తనలో తానే దాచుకొని అన్నయ్య ప్రేమను పొందాడు.  

ఈ కథగుర్చి:-
నేను 1977 వ సంవత్సరంలో చదివిన ఇంద్ర ధనస్సు అనే  మా అమ్ముమ్మ(జి. సీత దేవి)  గారి చిన్ననాటి తెలుగు పుస్తకంలోని ఒక కధ  ఆ పుస్తకంలో ఐదు కధలు వున్నాయి అన్ని ఒకదానికి మించి ఒకటిగా ఉంటాయి.  బహుశా 1930 దశకంలో అముమ్మ గారు  చదివినది కావచ్చు నాకు జ్ఞ్యాపకం ఉన్నంత వరకు నా ఊహతో చెప్పిన కధ, అసలు కధ కొంచెం భిన్నంగా వుండి  ఉండవచ్చు.  

5, నవంబర్ 2018, సోమవారం

శ్రీ రామాయణ రైలు

మన దేశంలో మొట్టమొదటిసారిగా మన సంస్కృతికి నిదర్శనంఐన రామాయణ ఘట్టాలను ఒకే ఒక రైలు ప్రయాణంలో చూసే అవకాశం మన కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ కల్పిస్తున్నది.  ఈ రైలుకి శ్రీ రామాయణ రైలు అని పేరు పెట్టటం విశేషం.  ఈ రైలు ఛార్జి రూ. 15,120 రైలు ఈ నవంబర్ 14వ తారీకునుండి నడుస్తుంది. ఈ రైలు ఢిల్లీ లోని స్ఫదరగంజి స్టేషన్ నుండి బయలుదేరి 16 రోజుల ప్రయాణం ముగించుకొని తిరిగి వాపసువస్తుందిముందుగా డిల్లీ నుండి ప్రారంభమై ఆయొధ్య, నందిగ్రాం, జనకపూర్, సీతామర్రి, ప్రయాగ, వారణాసి, చిత్రకూట్, శ్రింగవేరపుర్, నాసిక్, హంపి ల మీదగా రామేశ్వరం చేరుతుంది …. మరలా అక్కడి నుండి భక్తులను, విమానాల ద్వారా శ్రీలంకకు తీసుకువెళతారు. శ్రీలంకలొని సీతమ్మవారు ఉన్న అశొకవనం ప్రదేశాలను, రాయాయణ యుద్ధం జరిగిన ప్రదేశాలను, అత్యంత ప్రసిద్ధి చెందిన మునేశ్వరం దేవాలయం, రంబొడా, చిలావ్  లను చూపించి, తిరిగి విమానంలొ మన దేశానికి తీసుకు వస్థారు.
ఈ పర్యటనమెత్తం, రైల్వే అధికారులే దగ్గరుండి, ప్రయాణికులకు అన్నీ క్షేత్రాలను చూపిస్థారు. రైల్వే స్టేషన్ల నుండి బస్సుల ద్వారా, ఆయా పవిత్ర క్షేత్రాలకు తీసుకువెళ్ళి దైవదర్శనం, చారిత్రాత్మక కట్టడాలను, గురుతులను దగ్గరుండి చూపిస్థారు.  అంతేకాకుండా ఈ క్షేత్రాలలొని కొన్ని ముఖ్యమైన ప్రాంతాలలొ రాత్రి పూట బసచేసే అవకాశం కల్పిస్థారు. బుకింగులు మొదలైనాయి.  వివరాలకోసం irctc సైటు చుడండి. 



17, అక్టోబర్ 2018, బుధవారం

వీక్షిణులకు విజ్ఞప్తి


ప్రపంచవ్యాప్తంగా ఈ బ్లాగును వీక్షిస్తున్న పాఠకులకు కృతజ్ఞతలు.  రోజు రోజుకు పెరుగుతున్న వీక్షిణికుల సంఖ్య నాకు కొండత అండగా వుంది. దయచేసి మీరు మీ మీఅభిప్రాయాలను  కామెంట్ రూపంలో వ్రాయగలరు.  అది నాకు ఈ బ్లాగును ముందుకి తీసుకొని పోవటానికి సాయపడుతుంది.  మీరు సహృదయంతో  సూచనలను చేయ మనవి.  ఈ బ్లాగ్ తెలుగు  సాహిత్యలోకానిది మీరు దీనిలో భాగస్వాములు కండి.  

13, అక్టోబర్ 2018, శనివారం

విడాకులు



అన్ని కోర్టులకన్నా ఈ రోజుల్లో ఫామిలీ కోర్టులోనే  లిటిగెంట్ పబ్లిక్కుతో కిట కిట లాడుతున్నది. అన్ని జిల్లాల్లో ఫ్యామిలీ కోర్టులు వున్నాయి ఇంకా అదనంగా కొత్త అదనపు కోర్టులు వస్తున్నాయి. నిజానికి రోజు రోజుకి పెరుగుతున్న తగాదాలన్నీ కుటుంబ తగాదాలే అంటే ఏమాత్రం అతిసేయోక్తి కాదు.  అది విజయవాడలోని ఫామిలీ కోర్టు.  జడ్జి రంగారావు గారు ఒక నడివయస్కుడు తనవల్ల ఎవరి కుటుంబం వీడిపోకూడదని భావించే వాడు.  అంతేకాదు తనకి చాతనైనంతవరకు భార్య భర్తలని అన్ని విధాలా కలపాలని చూసే మనస్తత్వం వున్నవాడు.  చట్టానికన్నా మానవత్వానికి మంచితనానికి విలువనిచ్చే స్వభావం అతనిది. భార్య భర్తలు చిన్న చిన్న వివాదాలతో విడిపోకూడదన్నది అతని ఫిలాసఫీ.  ఒకరోజు మధ్యాన్నం ఒక కేసు వచ్చింది అది భార్య భర్తల విడాకుల కేసు.  భార్య భర్తనించి విడాకులు కావాలని వేసిన కేసు.  ఇద్దరి మద్య కౌన్సిలింగ్ కోసం సాయంత్రం తన ఛాంబరులో కేసు ఉంచుకున్నాడు. 

భార్య డాక్టర్ కిరణ్మయి దాదాపు ముప్పే సంవత్సరాల వయస్సు ఉంటుంది. చామనచాయ కానీ చూడగానే ఆకర్షించే ముఖ వర్చస్సు, అందరితోటి కలిమిడిగా మాట్లాడే నైపుణ్యం వున్న మనిషి.  నిజానికి తాను  చేస్తున్న డాక్టరు వృత్తికి కావలసిన అన్ని లక్షణాలు పుష్కలంగా వున్నాయి ఆమెలో.  అందుకే ఆమెకు తన క్లినిక్లో క్షణం తీరిక ఉండదు.  కన్సల్టేషన్ 300 రూపాయలు తీసుకున్న ఎవ్వరు వెనకాడకుండా ఆమె వద్దకే వస్తారు అంటే ఆమె హస్తవాసి మంచిదని విజయవాడ వాళ్ల నమ్మకం.  ఎటువంటి రోగమైన తగ్గిస్తుందని మంచి పేరు వున్నది.  అంతేకాదు తనకు చేతగాని కేసుని మంచి హాస్పిటల్కి రెఫెర్చేస్తుంది.  ఎంతలేదన్నా రోజుకి కనీసం రెండు వందల మందికన్నా ఎక్కువ పేటెంట్లనే చూస్తుంది. అంటే రోజు ఆదాయం ఆరువేల పైనే.  వాయిదాకి కోర్టుకి రావాలంటే ఆమెకు ఇష్టం ఉండదు.  కోర్టులో హాజరు కాకుండా పెటేషన్ వేయంగానే విడాకులు మంజురు చేస్తే బాగుండునుకదా అని అనుకుంటుంది.  ఈ రోజుల్లో అంతా ఆన్లైన్లోనే జరుగుతున్నాయి కదా ఈ కేసులు కూడా ఆన్లైన్లో విచారిస్తే బాగుండును అనుకుంటుంది.  దుర్మార్గుడైన భర్తతో ఎలాగో కాపురం చేయలేము.  విడాకులకోసం ఎందుకు ఇన్ని సంవత్సరాలు తిరగాలి  అన్నది ఆమె అభిప్రాయం. స్త్రీలు యెంత చదువుకున్నా యెంత పెద్ద హోదాలో వున్నా ఏదో తెలియని ఒక అభద్రతా భావం ఉంటుంది.  దానానికి కారణం ఏదో ఎవరు చెప్పలేరు.  ఎక్కడో అరకొరగా కొద్దీ మంది మాత్రమే ఈ సమాజంలో ఎదురు తిరిగి మనగలుగుతారు అటువంటి స్త్రీలను సమాజం గవురవించకపోగా వారిమీద లేనిపోని నిందలు వేస్తారు. నిజాముకన్నా అబద్ధం వేగంగా వెళుతుంది.  నిజం నడుచుకుంటూ వెళితే అబద్ధం విమానంలో వెళుతుంది.  కాబట్టి చాలామంది స్త్రీలు ఈ సమాజానికి భయపడి వారిలోని వేక్తిత్వాన్ని మరుగున పెట్టుకుంటారు.  "నః స్త్రీ స్వతంత్ర మర్హతే" అని ఆడవారిని ఈ సమాజం కాలరాయాలని చూస్తుంది.  నిజానికి స్త్రీని చులకనగా చూడమని మన చెరిత్ర చెప్పలేదు. మన భారతీయ సంప్రాదాయాలు స్త్రీలని గావురావించేవే కానీ చులకన చేసేవి కావు.  భార్య భర్తల అనుబంధాన్ని సరిగా అర్ధం చేసుకోక పోవటంతో ఇరువురి మధ్య విభేదాలు తలెత్తుతాయి. నిజానికి అందరు స్త్రీలు కానీ అందరు పురుషులు కాని చెడ్డవారు కారు.  ఈసంఘంలో రెండే తెగలు  వున్నాయి అవి బాధించే వారు భాద పడేవారు.  అందులో నీవు ఎటు వున్నావన్నదే సమస్య. కొంతమంది  స్త్రీలు  తన భర్త మంచివాడు కాదని అనుకుంటారు.  కానీ తన భర్త కన్నా దుర్మార్గుడు కనపడితే అప్పుడు తన భర్తే ఇంద్రుడు చంద్రుడు లాగ కనపడతాడు.  ఒక వ్యక్తి మీద సరిగా ఆలోచించకుండా ఒక నిర్ణయానికి రావటము మంచిది కాదు. కొందరు వేరే వాళ్ళు చెప్పేది వినకుండా వారి నిర్ణయం వారు తీసుకుంటారు. దానివల్ల వాళ్ళే కాదు ఎదుటివారు కూడా బాధపడతారు. నిజానికి మన డాక్టర్ కిరణ్మయి చాలా మంచి మనిషి కానీ చెంద్రునిలో మచ్చ ఉన్నట్లు ఆమెలో వున్న లోపం ఎదుటివారిని సరిగా అర్ధం చేసుకోక పోవటం మాత్రమే.  నిజానికి దీన్ని మనం లోపం అనకూడదు కానీ ఏంచేద్దాం ఆమెలో వున్న ఈ బలహీనతే ఈ రోజు తన భర్తతో విడాకులు తీసుకునే దాక తీసుకు వచ్చింది.  

తారనాధ్ నిజానికి పేరుకు తగ్గ రూపం మనిషిని చూడంగానే మాట్లాడాలనిపించే  వర్చస్సు అంతేకాదు మాట్లాడినా కొద్దీ వినాలనిపించేలాంటి వాగ్ధాటి కలవాడు.  వెతికి చూసినా కూడా ఎటువంటి చెడ్డ లక్షణం కనపడదు అని అనక తప్పదు.  తారనాధ్ చెడ్డవాడు అంటే కళ్ళు పోతాయ్ అంటారు అతనిగురించి తెలిసిన వాళ్ళు.  నిజానికి ఎర్రని వాడు రూపసి చూసినాకొద్దీ చూడాలనిపించే రూపంఅతను బీటెక్ కంప్యూటర్స్ చదివి ఒక సాఫ్ట్ వేరు కంపెనీలో ప్రోగ్రామరుగా పనిచేస్తున్నాడు.  తన జాబ్ పట్ల వున్న అంకిత భావం అతనిని ఈ రోజు ఇంత మంచి స్థితిలో ఉంచింది. నెలకు లక్ష రూపాయల వరకు సంపాదిస్తాడు చేతినిండా డబ్బు వున్నా భార్యతో సఖ్యత లేక మనిషి చిక్కి సగం అయ్యాడు.  పెళ్లి కాకముందు చుసిన వాళ్ళు ఇప్పుడు అతనిని పోల్చుకోలేరు అంటే అతిసేయోక్తి కాదు.  డబ్బుతో అన్ని కొనొచ్చు అని కొందరు అనుకుంటారు కానీ నిజానికి డబ్బుతో ఆనందాన్ని కొనలేమని తారనాద్ ని చుస్తే తెలుస్తుంది. ముప్పిమూడు సంవత్సరాల వయసుగలవాడిలాగా కనపడనే కనపడడు ఇంకా పాతికేళ్ల వాడంటే నమ్ముతారు.  డాక్టర్ కిరణ్మయి తార నాధ్ లను చూస్తే ఎవరికైనా మేడు ఫర్ ఈచ్ ఆథార్ అనిపిస్తుంది.  

పెళ్లైన కొత్తల్లో వాళ్లిదరు ఎంతోఅన్యోన్యంగా వుండేవాళ్ళు నిజానికి చూసేవాళ్లకు కళ్ళు కుట్టేవి అంటే నమ్మచ్చు.  కానీ పెళ్లైన ఒక ఎడుకే వారిద్దరిమద్య మనస్పర్థలు మొదలైయ్యాయి అది కూడా నిజానికి చిన్న చిన్న విషయాలగూర్చి.  నీ ఆఫీస్ 6 గంటలకి వదిలితే ఎనిమిదింటిదాకా ఎందుకు రాలేదు అని ఆమె అనేది.  నేనేంచేయనే  ట్రఫిక్కులో ఇరుక్కో పోయా అనేవాడు తార నాధ్ కాదు నీకు నామీద మోజు పోయింది అందుకే కావాలనే ఆలస్యంగా ఇంటికి వస్తున్నావు అనేది ఆమె.  ఆలా మొదలైన వాక్యుద్ధం చిలికి చిలికి గాలివానగామారి ఇద్దరు యెడ మొహం పెడ మొహం పెట్టుకునేదాకా వచ్చేది.  ఒక్కొక్క రోజు వాళ్ళ గొడవలతో తిండి తినకుండా పడుకునేవారు.  బాగా అలసి వచ్చిన తార నాధ్ కి  వెంటనే నిద్ర పట్టేది అదికూడా తప్పే ఎందుకంటె నేను పక్కనున్న నీకు నిద్ర ఎలా పడుతుంది అంటే నీకు వేరే ఎవరితోటో సంబంధం వున్నది అనేది.  ఆ మాటలు కూడా వినే అంత స్పృహలో అతను లేడు నిద్ర సుఖమెరుగదు ఆకలి రుచి ఎరుగదు అన్నట్లు అతను పక్క మీద కెక్కగానే అలసటతో ఉండటంతో నిద్ర పట్టేది. ఆడవారికి వాళ్ళ మాటే చెల్లలి ఎదుటి వాళ్ళ మాటలు అస్సలు వినరు అన్నట్లు ఆమె ప్రేవర్తించేది.  మరుసటి రోజు ఉదయం మాట్లాడేది కాదు అలక పునాది ఆటను నానా యాతన పడి  ఆమె అలక తీర్చే వాడు.  మొగవాడు యధాలాపంగా ఏమైనా మాట యిస్తే చచ్చాడన్న మాటే ఎందుకంటె ఏదో జసలో పది తన మాట ప్రకారం నడుచుకోక పోతే మూడవ ప్రపంచ యుద్ధమే.  ఒక్కో రోజు ఆఫిసులో పని తొందరగా అయి ఇంటికి ఐదింటికే వస్తే అదికూడా ఆమె తప్పు పట్టేది.  నీ ప్రేయసి వెంటనే వదిలి పెట్టిందే అనేది.  అమ్మ నాకు నీవు తప్ప వేరే ఎవరితోటి ఎలాంటి సంబంధం లేదు అంటే వింటేనా ససేమీరా వినదు మళ్ళి గొడవ మొదలు.  ఇంట్లో గ్లాసులు కంచాలు కూడా వల్ల చేతి వాటంతో కొట్టుకునేవి.  ముఖ్యంగా ఆమె చేతి దురుసు చెప్పనక్కరలేదు. ఆలా ఒకఎడుకే వాళ్లకి నూరేళ్ళకు సరిపడా తగవులు ఏర్పడ్డాయి.  చివరికి డాక్టర్ కిరణ్మయి వేరే ఇల్లు తీసుకొని వెళ్ళింది.  ఆమె ఎప్పుడు తిరిగి వస్తుందా అని తార నాధ్ ఎదురు చూసాడు.  కానీ ఆమె తెరిగి రాలేదు కానీ ఒక రోజు ఒక లేడి అడ్వకెట్ నుండి శ్రీముఖం వచ్చింది అదేనండి లీగల్ నోటీసు.  నోటీసు చదివి తార నాధ్ నివ్వెర పోయాడు అంతా అబద్ధాల పుట్ట లేని పోనీ కల్పనలు చేసి తార నాధ్ ఒక దుర్మార్గుడు, స్త్రీలోలుడు అని చిత్రీకరించి   అల్లిన కధ నిజానికి ఆ నోటీసు ఎవరైనా చదివితే తార నాధ్ లాంటి దుర్మార్గుడు ఎక్కడ ఉండడు అని అనుకో వచ్చు.  ఈ రోజుల్లో ఇటువంటివి చాల సాధారణం అయిపోయాయి.  బతుకు జీవుడా అని తార నాధ్ తనతో చిన్నప్పుడు చదువుకున్న ఒక అడ్వాకేటు వద్దకి వెళ్లి తన గోడు వివరించాడు.  అంతా విని ఆ అడ్వాకట్ ఆ నోటీసుకి రిప్లై ఇచ్చాడు.  ఇక ప్రశాంతంగా ఉండొచ్చు తన భార్య తన దగ్గరకు వస్తుంది కేవలం నోటీసు తనను బెదిరించటానికే ఇచ్చి ఉంటుంది అనుకున్నాడు.  కానీ తన అంచనా తారు మరు అయ్యిన్ది ఒక వారం రోజుల్లోనే కోర్టు నోటీసు వచ్చింది.  అప్పడి నుండి కోర్టుకి తిరుగు తున్నారు ఇద్దరు. 

ఇంకా వుంది 

6, అక్టోబర్ 2018, శనివారం

పనికి వచ్చే లింకులు

http://andhrabharati.com/dictionary/index.php

http://chandam.apphb.com/

http://www.telugunighantuvu.org/ 


http://www.telugunighantuvu.org/

http://andhraamrutham.blogspot.com




1, అక్టోబర్ 2018, సోమవారం

గగన విహారం

అది ఒక మారుమూల పల్లె ఆ ఊరికి బస్సుకూడా రాదు.  అక్కడికి దగ్గర్లో వున్న వూళ్ళో బస్సు దిగి ఒక అర గంట నడిస్తేకాని ఆ పల్లెకు చేరుకోలేము.  చుట్టూరా అడవి.  వూరు ప్రక్కనే ఎప్పుడు పారె ఒక ఏరు.  ఊళ్లోని వారంతా ఆ యెట్లోకి వెళ్లే ప్రొద్దున్నే కాలకృత్యాలు చేసుకొని స్నానం చేసి వస్తారు. రామదాసు ఒక నడి వయస్సు వాడు.  ఒక చిన్న గుడిసెలో వుంటూ కూలి,నాలి చేసుకొని పొట్ట పోసుకుంటున్నాడు.  అతనికి పెద్దగా ఏమి ఆశలు లేవు.  కానీ ఎప్పుడైనా రైలు ఎక్కాలని మాత్రము అతని కోరిక. కానీ తానువున్న పరిస్థితిలో తన జీవితంలో రైలు ఎక్కలేనని తెలుసుకున్నాడు. జీవితం మాములుగ నడుస్తున్నది రోజులు గడుస్తున్నాయి. ఒకరోజుఎక్కడి నుండి వచ్చాడో కానీ ఒక సాధువు ఆ ఊరికి వచ్చి మర్రిచెట్టు క్రింద వున్నాడని అతను అందరికి వారికి జరిగినవి జరగబోయేవి చెపుతున్నాడని ఊరంతా కోడై కూస్తే రామదాసు కూడా ఆ సాధువుని చూడటానికి వెళ్ళాడు. రామదాసుని చూడగానే ఆ సాధువు అతని జీవితంలో జరిగినసంఘటనలు చెప్పి నీకు రైలు ప్రయాణం చేయాలని  వుంది అవునా అన్నాడు.  దానికి రామదాసు ఆశ్చయపోయి అవును స్వామి నాకు నిజంగా రైలు ఎక్కాలని వుంది నేను నా జీవితంలో రైలు ఎక్కగలనా అని అతృతతో అడిగాడు.  దానికి ఆ సాధువు అతని కుడి చేయిని పరిశీలనగా చూసి నొసలు చిట్లిచ్చాడు.  రామదాసు ఆశ కాస్త అడియాస ఐయ్యింది.  వెంటనే ఆ సాధువు నీవు రైలుఎక్కుతావు అంతే కాదు విమానం కూడా ఎక్కుతావు అని చెప్పాడు.  వెంటనే రామదాసు పెద్దగా నవ్వాడు. ఏమిటి స్వామి రైలు ఎక్కటానికి పైసలు లేని నేను విమానం యెట్లా ఎక్కుతాను అన్నాడు.  నాయన నేను నీ జాతకంలో వున్నది చెప్పాను.  నీవు నమ్మితే నమ్ము లేకపోతేలేదు కానీ ఒక్క విషయం నేను చెప్పింది ఇంతవరకు జరగకుండా ఎన్నడు లేదు.  నిజమే ఆ స్వామి తనగూర్చి చెప్పినవన్నీ నిజానికి చూసినట్లుగా చెప్పాడు అటువంటప్పుడు తాను ఎందుకు తప్పు చెపుతాడు అని అనుకున్నాడు.  తన చుట్టూ ప్రక్కల వున్నవారు కూడా అది విని రామదాసు విమానం ఎక్కుతాడు అని అనటం మొదలు పెట్టారు.  నిజానికి తాను విమానం ఎక్కుతాడో లేదో కానీ ఆ నిమిషంలో మాత్రం రామదాసు మనసు గాలిలో తేలిపోసాగింది.  ఆ నోటా ఆ నోటా పడి ఊరంతా ఆ వార్త గప్పుమన్నది.  ఆ రోజునించి వూళ్ళో వారంతా రామదాసుని ఏదో తెలియని ప్రత్యేకతతో చూడటం మొదలు పెట్టారు.  తాను విమానం ఎక్కటం విషయం దేముడికి తెలుసు కానీ రామదాసుకు మాత్రం విమానం ఎక్కిన దానికన్నా ఎక్కువ ఆనందంగా ఉంది.  తాను రైలు ఎక్కలేదే మరి విమానం యెట్లా ఎక్కుతాను, నిజంగా విమానం ఎక్కుతాన ఎక్కుతే ఎక్కడ ఎక్కుతాను ఎక్కడికి పోతాను. నా దగ్గర అంత డబ్బు లేదే. ఇలాంటి ప్రశ్నలు రామదాసుని పట్టి పీడిస్తున్నాయి.  రోజులు గడుస్తున్నాయి.  ఒక రోజు పెద్ద వర్షం వచ్చింది ఏదో పనిమీద రామ దాసు యేరు దాటి ప్రక్క ఊరికి వెళ్ళాడు.  ఆ వూరు చాల పల్లంగా ఉంటుంది.  రామదాసు వూరు దాదాపు ఒక కొండ లాగ ఉంటుంది.  కాబట్టి యెంత పెద్ద వాన వచ్చినా ఏరుకి వరద వచ్చినా వాళ్ళ ఊరికి యే ప్రమాదం లేదు.  కానీ రామదాసు వెళ్లిన వూరు చాలా పల్లంలో ఉండటంలో తరచూ ఆ ఊరికి యేటి వరద తాకిడికి గురి అవుతుంది.  రామదాసు సాయంత్రం కల్లా తిరిగి వద్దామని ఊరికి వెళ్ళాడు కానీ వచ్చే రప్పుడు యేరు ఉర్రుతలు వూగుతున్నది తాను ఎక్కిన పడవ అటు ఇటు వుగ సాగింది పడవలో వున్న వారంతా దేముడిని తలుచుకుంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వున్నారు. ఒక్క నిమిషములో పడవలోకి నీరు వచ్చి పూర్తిగా పడవ మునిగి పోయింది.  పడవలో వాళ్లంతా నీటిలో కొట్టుకొని పోయారు.  ఎవరికి ఎవరు కనపడటం లేదు అంతా పెద్దగా అరుస్తున్నారు. రామదాసు కుడా వరద ఉధృతికి కొట్టుకొని పోయాడు.  ఈత సరిగా రాదు కానీ ప్రాణాలు కాపాడుకోవటం కోసం చేతనైనంత వరకు ఈత కొట్టి,కొట్టి అలసి పోయాడు.  ఏమైందో ఏమో తెలియతు ఎంతసేపు తానూ నీళ్లలో వున్నది తెలియదు. పూర్తిగా చీకటి మగత నిద్రగా వుంది కాపాడమని అరవటానికి కూడా నోరు రావటంలేదు.  అయోమయం తాను బ్రతికి వున్నది మరణించింది కుడా తనకి తెలియటం లేదు.  ఏమిటి ఈ వింత యెంత సేపు ఆలా గడిచిందో ఏమో రామదాసుకి తెలియదు తన మీద ఏదో ఒక వస్తువు పైనుంచి వ్రాలాడుతూ తాకుతున్నట్లు అనిపిస్తుంది. కళ్ళు తెరిచే శక్తి కూడా లేదు.  అతి కష్టంగా కళ్ళు తెరిచి చూసాడు  కడుపులో ఆకలి దంచుతున్నది.  వంట్లో ఏమాత్రము శక్తి లేదు. కళ్ళు తెరవంగానే సూర్య భగవానుడు తన ఉగ్ర రూపంతో ప్రత్యక్షమైనాడు.  టైం దాదాపు పది పదకొండు కావచ్చు, తాను ఒక చిన్న రాతి కొండపై వున్నాడు చుట్టూరా  నీళ్లు. పైనించి ఒక తాటి నిచ్చెన వ్రాలాడుతున్నది.  దానిని చూడంగానే రామదాసుకి ప్రాణం లేచి వచినట్లయింది.  అది పైన ఎగురుతున్న మిలిటరీ విమానం నుంచి వ్రాలాడుతూ వున్నది.  ఆ విమానం తన చుట్టూ తీరుగుతూ వున్నది. అతి కష్టంమీద ఆ తాటి నిచ్చనని పట్టుకో గలిగాడు రామదాసు. తాను ఆ తాటి నిచ్చనని పట్టుకోవటమే ఆలస్యం అది వెంటనే పైకి పోవటంమెదలైయింది.  ఒక్క నిముషంలో రామదాసు తాటితో పాటు విమానంలోకి వెళ్ళాడు. ఇద్దరు మిలటరీ వాళ్ళు రామదాసు రెండు చేతులని పట్టుకొని విమానంలోకి తీసుకుని విమానం తలుపు వేశారు.  అప్పుడు రామదాసుకి గతంలో సాధువు చెప్పిన జోస్యం జ్ఞ్యాపకం వచ్చింది.  నిజమే తానూ నిజంగా విమానం ఎక్కాడు. రామదాసు తనను తానూ గిల్లుకొన్నాడు అది కల నిజామా అని, నిజమే.  రామదాసుని ఆ మిలటరీ వాళ్ళు తాను ఎలా వరదలో కొట్టుకొని పోయంది అడిగారు.  రామదాసు జరిగిందంతా చెప్పాడువాళ్ళు రామదాసుని ఒక పెద్ద ఊరికి తీసుకొని వెళ్లారు.  వాళ్లే రామదాసుని ఆ వురి రైల్వే స్టేషనుకి తీసుకొని వెళ్లి తన ఊరికి ఎలా వెళ్లాలో చెప్పి రామదాసు ఊరికి దగ్గర్లోని రైల్వే స్టేషన్కి టిక్కెటు కొని యిచ్చి కొంత డబ్బు కుడా ఇచ్చి అక్కడనుండి తన ఊరికి ఎలా వెళ్లాలో చెప్పారు.  మరుసటి రోజు రామదాసు చస్తుపడుతూ తన వూరికిచేరాడు.  ఊళ్లోని వారంతా రామదాసు కూడా మిగిలిన వారితోపాటు పడవ ప్రమాదంలో చనిపోయాడని అనుకున్నారు. రామదాసు ఊర్లోని వాళ్ళకి జరిగిందంతా చెప్పాడు. సాధువు చెప్పినట్లు రామదాసు విమాన ప్రయాణం చేసినందుకు రామదాసుతో పాటు వూరి వాళ్ళు కూడా ఆనందించారు.  అప్పటినుండి రామదాసుని  విమానం రామదాసు అని పిలవటం మొదలుపెట్టారు.  వరద పుణ్యమాని రామదాసుకి జీవిత కోరిక ఐన రైలు ప్రయాణం మరియు విమాన ప్రయాణం చేయగలిగాడు. 

భగవంతుడు దయామయుడు

ఒకరోజు ఒక పెద్ద చెప్పుల షాపు ముందు ఒక పేదవాడు నిలుచుని అక్కడి వివిధ రకాల చెప్పుల్ని చూసి తన కాళ్ళని చుసుకుంటున్నాడు. ఈ విషయం ఆ దుకాణంలో వున్నా యజమాని చూసాడు వెంటనే ఒక నవుకరిని పంపించి అతన్నిలోపలి తీసుకోరమ్మన్నాడు.  వెంటనే ఆ పేదవాడు ఆ దుకాణందారుని ముందుకి తీసుకొని రాబడ్డాడు. అతను దుకాణందారుని చూసి భయంతో వణికి పోతున్నాడు.  దుకాణందారు అతనికి భయపడవద్దని నేనునిన్ను ఏమి చేయను అని ధెర్యం చెప్పి వాణ్ణి ఈ విధంగా అడిగాడు.  నీవు నా కొట్టు వైపు చూస్తూ ఏమని మనసులో అనుకున్నావు చెప్పు  నేను నిన్ను ఏమి ఇబ్బంది పెట్టను నాకు నిజం చెప్పు అన్నాడు.  దానికి ఆ పేదవానికి దుకాణందారుని మీద నమ్మకం కలిగింది.  అతను నేను మీ కొట్టులో రక రకాల చెప్పులు చూసి నా దారిద్య్రాన్ని నిందించుకొని మీరు ఎంత అదృష్టవంతులో కదా ప్రతి రోజు మీకు కావలసిన చెప్పులు వేసుకోవచ్చు అని అనుకున్నాను అని చెప్పాడు.  అప్పుడు ఆ దుకాణం దారు తను వేసుకున్న లుంగీని ప్రక్కకి జరిపాడు.  ఆశ్చర్యం అతనికి రెండు కాళ్ళు మోకాళ్ళ వరకే వున్నాయి.  అది చూసి ఆ పేదవాడు నిస్చేస్తుడై అన్నాడు.  దేముడు నాకే కాదు మీకు కూడా అన్యాయం చేసాడు.  నాకు మంచిగాకాళ్ళు వున్నాయి కానీ కాళ్ళకి చెప్పులు లేవు, మరి మీకు ఎన్నో రకాల చెప్పులు వున్నాయి కానీ వాటిని వేసుకునే అదృష్టం మీకు లేకుండా దేముడు చేసాడు.  అదే దేముడి లీల అన్నాడు.  దానికి ఆ కొట్టు అతను చెప్పాడు దేముడు నీకు కానీ నాకు కాని అన్యాయం చేయలేదు.  నిజానికి మన ఇద్దరికీ ఎంతో మేలు చేసాడు అన్నాడు.  అది ఎట్లా అన్నాడు.  ఎందుకంటె నీకు కాళ్ళకి చెప్పులు కొనుక్కునే స్తొమత లేదు కానీ నీవు చెప్పులు లేకుండా మండుటెండలో నడవ గల శక్తిని నీకు ఇచ్చాడు.  మరి నాకు నేను ఎన్ని చెప్పులైనా వేసుకొనే శక్తీ వుంది కానీకాళ్ళు లేనందువల్ల వాటిని వేసుకోలేననుకోవటం కేవలం బుద్ధితక్కువ నాకు కాళ్లతో పని లేకుండా నన్ను ఎత్తుకొని ఎక్కడికంటే అక్కడికి తీసుకువెళ్లే ఇద్దరు గుణవంతులైన కుమారులని ఇచ్చాడు అని ఆ ప్రక్కనే వున్నా తన కొడుకులని ఎంతో గర్వంగా చూపించాడు. నేను ఎన్నడూ నాకు కాళ్ళు లేవనే ఆలోచనే కలగకుండా నాకు చేసాడు.  చూసావా మన ఇద్దరికీ భగవంతుడు మేలే చేసాడు.  కానీ మనమే దేముడిని అపార్ధం చేసుకుంటాము.  భగవంతుడు ఎవ్వరికీ అన్యాయం చేయడు.  మన ఆలోచన బట్టి మాత్రమే మన మానసిక స్థితి ఉంటుంది అన్నాడు. భగవంతుడు ఎల్లప్పుడు తన భక్తులని కంటికి రెప్పలాగా చూస్తాడు.  కేవలం మనం అర్ధం చేసుకోవాల్సి మాత్రమే ఉంటుంది. 
మీ కామెంటుకి కృతజ్ఞతలు.  
సర్వ్ జనా సుఖినోభవంతు. 

21, సెప్టెంబర్ 2018, శుక్రవారం

దేముడు భక్తుడు

ఒకనాడు కలలో భక్తునికి దేముడుకనిపించాడు.  ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు దేముడు అక్కడి కాలి అడుగులని చూపి ఇది నీ జీవితంలో గడచినాకాలం అని చెప్పాడు.  ప్రతి చోట రెండు జతల అడుగులు వున్నాయి భక్తుడు అడిగాడు ఆ రెండవ జత అడుగులు ఎవరివని.  దానికి ఒకటి నీ కాలిది రెండవది నాది అన్నాడు.  మరి ఆ బురుజగా వున్నప్రదేశం ఏమిటని భక్తుడు అడిగాడు దానికి అది నీ జీవితంలో గడిచిన కష్ట కాలం అన్నాడు.  మరి అక్కడ ఒకే జత అడుగులువున్నాయి అంటే నీవు నేను నా జీవితంలో మంచిగా వున్నప్పుడు నా వెంట ఉండి నేను కష్టంలో వున్నప్పుడు నన్ను వదలి వెళ్లవు అన్నమాట ఎంత మోసగాడివి నీవు అని దేముడిని భక్తుడు తప్పు పట్టాడు . దానికి దేముడు మందస్మిత వదనంతో నేను నిన్ను వదలి వెళ్ళలేదు ప్రియతమా నా కుమారా నిన్ను ఎత్తుకొని నడిచాను.  ఆ అడుగుల ముద్రలు నీవి కావు నావి ఇంకొకటి కూడా చూడు నిన్ను ఎత్తుకోవటం చేత అడుగులు భారంగా పడ్డాయి అందుకే అవి లోతుగా వున్నాయి.  ఆ సమాధానంతో భక్తుడు నిస్తేస్టుడైనాడు.. 
భక్తుడు త్రికరణ శుద్ధిగా ప్రార్ధిస్తే దేముడు ఎప్పుడు నీడలాగా వెన్నంటి ఉంట్టాడు. కావలసింది నిష్కల్మషమైన శ్రద్ధతో కూడిన భక్తి మాత్రమే. 

ఒక ఆంగ్ల కవిత ఆధారంగా 

వివాహాం

పెండ్లి ఇద్దరి బంధం కాదు 
రెండు కుటుంబాల సంబంధం 
అంనందోత్సహాల వేదిక 
సుఖసంతోషాల ప్రతీక 
వందేళ్ల జీవితం 
వంశాభివృద్ధి కోసం 
పిల్లల భవిష్య్తతు కు 
పాటుపడే దంపతులవటం  
ప్రేమ పెళ్లిళ్లు ఎలా ఉంటాయి 
ఫ్యామిలికోర్టు చూస్తే తెలుస్తుంది 

19, సెప్టెంబర్ 2018, బుధవారం

స్వామి వైభోగం  

యాద ఋషి తపస్సుకి మెచ్చి
కొండపై  వెలసిన  స్వామి
తాపసి పేరుతో నే యాదగిరి
ఋషి కోరికపై గోపురం మీద సుదర్శనం
క్షేత్ర పాలకుడిగా హనుమంతుడు
వెలసిన క్షేత్రమే ఈ యాదాద్రి
అనారోగ్య భక్తులకు
గ్రహః పీడా రోగులకు
ఆరోగ్యాన్నిచ్చే స్వామి
ఋషి ఫై అనుగ్రహంతో
పంచ రూపుల్లో వెలసిన స్వామి
మెట్ల దారిన వచ్చే భక్తులకు
మోకాళ్ళ నెప్పులు తగ్గించే స్వామి
గుండంలో స్నానమాడితే
సర్వ పాపాలు హరించే స్వామి
తెలంగాణ వచ్చాక
యాదగిరి యాదాద్రిగా మారింది
దిన దినం స్వామి వైభోగం పెరిగింది
అన్న దాన సత్రాలు
వసతి గదులు, కొత్త రోడ్ల నిర్మాణాలు
భక్తులకు కొంగు బంగారం ఈ స్వామి
నిత్యా కళ్యాణం పచ్చ తోరణం
భక్తుల పాలిట కల్పవృక్షం
శ్రీ లక్ష్మి నరసింహ స్వామి






ఎప్పుడో చదివిన చాటు పద్యము. 
ఒక జమిందారుగారు మధ్యాహ్నం బాల్కనీలో నిలుచొని వాక్కిలి వైపు చూస్తుంటే ఒక పండితుడు కళ్ళకి చెప్పులు కూడా లేకుండా తన ఇంటివైపు రావటం గ్రహించి క్రిందికి దిగి ఎదురేగి ఎవరు స్వామి మీరు ఇంత ఎండలో నడుచుకుంటూ మా ఇంటికి వచ్చారు అన్నారట దానికి ఆ పండితుడు క్రింది పద్యం చెప్పాడట 
నడవక నడిచి వచ్చితి 
నడిచిన నేనడచి రాను 
నడవక నడుచుటెట్ల 
నడవక నడిపింపుము నరవర
ఇల్లు నడవక నేను ఇక్కడకి నడుచుకుంటూ వచ్చాను.  ఇల్లు గడిస్తే రావలసిన పని లేదు. నేను నడవకుండా ఇల్లు ఎలా గడుస్తుంది?  నేను నడవకుండా ఇల్లు నడిపింపుము అంటే తగిన సాయం చేసి నన్ను ఆడుకో అని అర్ధం. 
తెలుగు భాష లోని పద ప్రేయోగాలకి అనేక పద్యాలు  వున్నాయి. ఈ పద్యంలో ఏమైన దోషాలు ఉంటే సవరించగలరు. 

18, సెప్టెంబర్ 2018, మంగళవారం

 భార్యను చంపెడు భర్తలు 
భర్తని చంపించెడు భార్యలు 
తనవారిని నరికెడు  వారును 
ఏమి లబ్ది కొరియో యేరు కెరుక 
చివరికి తను కూడా గతించును కదా  భార్గవ 

17, సెప్టెంబర్ 2018, సోమవారం

మోసం (చిన్న కధ )

అది ఒక చిన్న పల్లెటూరు. చిన్న చిన్న గుడిసెలు మాత్రమే వున్నాయి. ఏ వస్తువు కావాలన్న దాదాపు పది పదిహేను కిలోమీటలు నడిచి వెళ్ళాలసిందే.  అరవై పైన వున్నా వాడు వీరయ్య .వీరయ్యకు  ఇంకా సంపాదించాలనే కోరికఉన్నవాడు.  పొలం పనులు చేయలేని వాడు కావటంతో ఒక చిన్న దుకాణం పెట్టుకున్నాడు.  ఆ దుకాణంలో చాకిలెట్లు, పిప్పరమెంట్లు చిన్నపిల్లల గోళీలు, మెదలైనవి ఉంటాయి.  రోజు రెండు మూడు వందల వరకు అమ్మకం జరుగుతుంది.  ఆ ఊరిలోని పిల్లలందరూ వీరయ్య ని కొట్టు  తాత అని పిలుస్తారు.  ఒక రోజు సాయంత్రం ఆరు ఏడు గంటల సమయంలో ఒక చిన్న పిల్లవాడు దాదాపు 10 సంవస్సరాల వయస్సు ఉండొచ్చు వాడు విరిగాడి దుకాణానికి వచ్చి ఐదు రూపాయల పిప్పరమెంట్లు కొని పది రూపాయలు ఇచ్చాడు.  వీరయ్య వాడి దగ్గర డబ్బులు తీసుకొని తన దగ్గర చిల్లర లేదు రేపు వచ్చి ఐదు రూపాయలు తీసుకోమని చెప్పాడు.  వాడు సరేనని వెళ్ళాడు.  మరుసటి రోజు ఆ పిల్లవాడు తిరిగి రాలేదు.  అంతేకాదు మరొక రెండు రోజుల వరకు కూడా రాలేదు.  దానితో ఆ పిల్లవాడి ఐదు రూపాయలు మిగిలినందుకు సంతోషించాడు.  నిజానికి తన దగ్గర చిల్లర వున్నా ఇవ్వనందుకు వాడిని మోసం చేసానని ఆనంద పడ్డాడు.  నాలుగైదు రోజుల తరువాత సరకు తీసుకోరావటానికి  ప్రక్క ఊరికి వెళ్ళాడు. అక్కడ తానూ ఇన్నాళ్లు సంపాదించిన ఒక్కొక్క రూపాయే కలిపి ఒక వేయి రూపాయలతో సరుకు కొన్నాడు. ఆ దుకాణదారుడు వీరయ్య ఇచ్చిన రూపాయలు లెక్కచూసుకొని ఒక పది రూపాయల నోటు తిరిగి ఇచ్చి ఇది చెల్లదు పిల్లలు ఆడుకొనే నోటు అని తిరిగి ఇచ్చాడు.  దానితో వీరయ్య మొఖం పాలి పోయింది.  వీరయ్య ఎంత ఆలోచించిన ఆ నోటు ఎవ్వరు ఇచ్చారో జ్ఞాపకం రాలేదు.   అది ఆ పిల్లవాడు ఇచ్చాడని వాడే వీరయ్య ను మోసం చేసాడని పాపం వీరయ్య కి తెలియదు.  

16, సెప్టెంబర్ 2018, ఆదివారం

తిమిరంతో పయనం

తిమిరంతో పయనం 

కోటి రతనాల వీణ 
తెగిన తంత్రులతో వికృత రాగాలాలపిస్తోంది.
సమసమాజ భారతికి దారులు వేసిన నేల
విప్లవోద్యమాల పురిటిగడ్డ 
అభ్యుదయ భావజ్వాల 
నేడు మరుభూమిగా మారిపోయింది!

తిరిగొచ్చిన గడీల పాలన
పల్లె పల్లెలో ఫ్యూడల్ భావజాలాన్ని 
పునఃప్రతిష్ఠ చేస్తోంది .

కులం మతం కవల రాక్షసుల్లా 
జనాలను కబళిస్తున్నాయి !

కన్నబిడ్డలనే తెగనరుక్కునే కసాయితనం
నుదిటికుంకుమ చెరిపేసి రాక్షసత్వం 
తలకెక్కిన కులోన్మాదం వికట్టహాసం చేస్తోంది!

అమరుల నెత్తుటితో తడిసిన నేలలో
కుక్కమూతి పిందెలు,పిచ్చిమొక్కలు మొలుస్తున్నాయి.

అంధకారం ఆక్రమించుకుంటున్న నేల 
తిరోగమం లో పురోగమిస్తోంది!

                             ---సత్య భాస్కర్ 

8, సెప్టెంబర్ 2018, శనివారం

ఓ మనిషి మేలుకో

ఓ మనిషి మేలుకో 
సత్యాన్ని తెలుసుకో 
ఆవు పేడతో కళ్ళాపి  
ముగ్గులు కలిగిన ముంగిలి 
ఆరోగ్యం ఇంట్లో ప్రశాంతత మనసులో  
మరి నేడు 
పేడకలరు కళ్ళాపి  
కెమికల్ రంగుల రంగవల్లులు 
ఆకర్షణ బాగుంది కానీ 
అనారోగ్యాన్నిస్తుంది 
మనశాంతి పోయింది 
ఓ మనిషి మేలుకో 
సత్యాన్ని తెలుసుకో 
ఇనప మూకుడులో వేపుళ్ళు 
రాతి రోట్లోని  పచ్చళ్ళు 
చేసేవారికి వ్యాయామం 
తినేవారికి  ఆరోగ్యం 
మరి నేడు 
నాన్ స్టిక్ ఫ్యానులో వేపుళ్ళు 
మిక్సీలో నురటాలు 
చేయటం తేలికే 
కానీ రుచులు శున్యం 
అనీమియా పేషేంటులె అంతా 
ఓ మనిషి మేలుకో 
సత్యాన్ని తెలుసుకో 
ఎడ్ల బండిలో ప్రయాణం 
దంపుడు బియ్యపు ఆహరం 
దృఢమైన కాయాలు 
బలమైన ఆలోచనలు 
మరి నేడు 
విమానాల్లో పయనాలు 
ఫాస్ట్ ఫుడ్ ఫలహారాలు 
ముప్ఫయికే బీపీలు షుగరులు 
అరవైకల్లా అంతిమ యాత్రలే  
ఓ మనిషి మేలుకో 
సత్యాన్ని తెలుసుకో 
ఉత్తరాలతో సమాచారాలు 
పక్కవారితో పరిహాసాలు 
ఐనవారితో ముద్దు ముచ్చట్లు 
మరి నేడు 
సెల్ ఫోనులో చాటింగులు 
లాప్టాప్లలో మీటింగులు 
ప్రక్క వారిని చూసేది ఎవరు 
ఐనవాళ్ళని పలకరించేది ఎవరు 
ఓ మనిషి మేలుకో 
సత్యాన్ని తెలుసుకో 
ఎటు చూసినా పచ్చదనం 
చిలుకల, పక్షుల 
కిలకిలారావాలు 
అంతా  ఆహ్లాదం 
జగమంతా ఆనందం 
మరి నేడు 
ఎటుచూసినా బిల్డింగులు 
మైక్రోవేవ్లతో కాలుష్యం 
సెల్ పోను టవర్లతో 
యూరపిచ్చుకలు బలి 
టెక్నాలాజీతో పచ్చదనం మాయం 
ఓ మనిషి మేలుకో 
సత్యాన్ని తెలుసుకో 
వాయు కాలుష్యంతో 
గ్లోబల్ వార్మింగ్ 
అదే గ్లోబల్ వార్నింగ్ 
క్లోరో ఫ్లోరా కార్బన్ల్ వినియోగం
ఓజోన్ పొరకు చిల్లులు 
అతినీలలోహిత కిరణాలు 
చర్మ వ్యాధులకు  అస్కారాలు 
మనం పీల్చే గాలిలో 
 తగ్గుతున్న ఆక్సిజన్ శాతం 
రేపు గాలికూడా కొనుక్కోవటం ఖాయం 
సైన్సు మన ఆనందాన్ని పెంచాలి 
ఆయుషుని వృద్ధి చేయాలి 
కానీ 
మన మధ్య దూరాన్ని కూల్చొద్దు 
భందుత్వాన్ని రూపు మాపొద్దు 
అభివృద్ధిని ఆహ్వానిద్దాం  
ఓ మనిషి మేలుకో 
సత్యాన్ని తెలుసుకో
నీ జీవితాన్ని కాపాడుకో 

25, ఆగస్టు 2018, శనివారం


 ఉషస్సులోకి

నా నాటకీ పెరుగుతున్న ధరలు
స్వార్ధ రాజకీయాలతో అలుముకొంటున్న అంధకారం
నేటి సంపాదన రేపటి ఖర్చులకు
ఏమాత్రం సరిపోదన్న సామాన్యుడి ఆవేదన
సెక్యూలర్  స్టేటులో  కులాలకుమ్ములాటలు
ప్రతిభకు అనుక్షణం ఆటంకాలు
నీరస పడకు మిత్రమా
లే నిద్రలే ఈ తిమిరాన్ని
చీల్చి చెందాడు
నీ మేధస్సుతో కొత్త సమాజాన్ని నిర్మించు
ఉషస్సులోకి అడుగిడు

 

19, ఆగస్టు 2018, ఆదివారం

హిందూ ధర్మము

ప్రపంచంలో ఎన్నో మతాలు వున్నాయి అలాగే హిందూ మతం కూడా అని అందరు అనుకుంటారు.  కానీ నిజానికి హిందూ మతము కాదు ఇది ఒక సనాతన సంప్రదాయం. ఇది ఒక ధర్మము ప్రతి మనిషి తన జీవితాన్ని ఒక క్రమశిక్షణతో ఆచరించ వలసిన ధర్మము .  అందుకే  హిందూ ధర్మము  అని మనం అంటాము.  ఎందుకంటె ప్రతి మతానికి ఒక ప్రవక్త ఉంటాడు.  అది మనందరికీ తెలిసిందే, మరి హిందూ మతానికి ప్రవక్త ఎవరు చెప్పగలరా చెప్పలేరు.  ఎందుకంటే హిందూ మతానికి ప్రవక్త లేడు.  అందుకే ఇది ఒక ధర్మము యుగాలనుంచి ఆచరిస్తున్న ధర్మము.  హిందువుగా ప్రతి ఒక్కరు కాపాడవలసిన ధర్మం.  ఇది మన ధర్మం.
ప్రతి ఒక మతానికి ఒక మత గ్రంథం  వుంటున్నది.  అది మనఅందరికి తెలిసిందే మరి హిందూ మతానికి ఏ గ్రంధం వున్నది చెప్పండి.  మహాభారతమా, రామాయణమా , భగవతమా, వేదాలా, ఉపనిషత్తులా, పురాణాలా చెప్పండి. ఇందులో ఏది హిందూ మత గ్రంధం.  చెప్పగలరా చెప్పలేరు.  కానీ ఏ  మతాన్ని తీసుకున్న కేవలము ఒకే ఒక్క గ్రంధము ఉంటుంది.  అదే వారి మతానికి మూలంగా ఉంటుంది.   మరి హిందూ మతం విషయంలో ఆలా చెప్పగలరా లేరు.  మన ఋషులు ఎన్నో ఏళ్ళు తపస్సు చేసి ఏర్పాటు చేసిన పరంపరే మన విజ్ఞానం , మన వాగ్మయం.
ఇక దేముడు విషయానికి వస్తే ప్రతి మతము ఒకే ఒక్క దేముడు వున్నాడని  ప్రవచిస్తున్నాయి.  ఆ దేముడినే వారు ఆరాధిస్తారు. మరి హిందూ మతం విషయానికి వస్తే ఎందరో దేముళ్ళు వున్నారు.  కానీ అందరికి మూలం మాత్రం ఆదిపరా శక్తి.  ఆ శెక్తే సర్వ చరా చెర సృష్టికి మూలం.
హిందూ ధర్మంలో ఎందుకు ఇంతమంది దేముళ్ళు వున్నారు.  అన్న విషయాన్నీ పరిశీలిస్తే మనకు తప్పకుండా కారణం తెలుస్తుంది.  అదేమిటంటే ప్రతి దేముడికి ఒక ప్రత్యకత వున్నది.  ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క దేముడు వున్నాడన్నమాట అంటే ఉదాహరణానికి ధనానికి ధన లక్ష్మి, విద్యకు సరస్వతి, శక్తికి పార్వతి;  అలాగే సృష్టికి బ్రహ్మదేముడు, స్థితికి అంటే ఈ జీవరాశిని నియంత్రించటానికి విష్ణుమూర్తి అలానే లయానికి అంటే సృష్టి ముగించటానికి శంకరుడు అన్నమాట.  ఈ రీతిగా ప్రతి విభాగానికి ఒక్కొక్క దేముడు అన్నమాట.
హిందు ధర్మంలో వున్న ఒక ప్రత్యకత ఏమిటంటే మనకు ఏ ప్రయోజనం కావాలో ఆ దేముడిని మనం స్తుతించ వచ్చు.  ఆయా దేముడిని ప్రసన్నం చేసుకుంటే ఆ యా కోరికలను ఈడేర్చుకోవచ్చు. 

హిందుత్వంలో వున్న ఒక గొప్ప విషయం కాల నిర్ణయం.  అంటే పంచాంగం.  ఎటువంటి సైన్సు పరికరాలు లేకుండా ఎన్నో సంవత్సరాలనుండి మన జ్యోతిషులు పంచాంగాన్ని గుణిస్తున్నారు.  వారు శనిగ్రహాన్ని చుట్టూరా   (డిస్క్) ఉంటుందని కనుగొన్నారు.  అంతే కాదు ప్రతి గ్రాహం ఎంత వేగంగా గగనంలో తిరుగుతుందో కనుగొన్నారు.  ఈరోజు మనం టెలిస్కోపుతో చూస్తూ గ్రహణాలు ముందుగా చెప్పగలుగుతున్నాము.  మరి మన హిందూ సంప్రదాయంలో ఎలాంటి పరికరాలు లేకుండా గ్రహణం  ఎప్పుడు పడుతుందో, ఎప్పుడు విడుస్తుందో క్షేణాలతో సహా చెప్పుతున్నారు.  అంటే హిందూ దేశం ఎంత విజ్ఞానం కలిగినదో మనకు తెలుస్తున్నది. సూర్య గమనాన్ని బట్టి ఉత్తరాయణం, దక్షిణాయనం అని సంవత్సరాన్ని రెండు భాగాలుగా చేసారు.  ఉత్తరాయణం పుణ్య కాలంగా పేర్కొన్నారు. 

హిందూ దేశంలో పండగలకు చాల ప్రాధ్యాన్యం వున్నది. 
తోలి ఏకాదశి 

ఇంకా వుంది 

15, ఆగస్టు 2018, బుధవారం

చరిత్ర

ఏ చరిత్ర  చూసినా కనిపించేది ఒక్కటే
ఎండిపోయిన రక్తపు మరకలు
భాదతో నిట్టూర్చే నిట్టూర్పులు
అమాయకుల ఆర్తనాదాలు
కఠినాత్పుల  దుస్చేష్టలు 
దుర్మార్గుల దండనీతులు
బలవంతుల దౌర్జన్యాలు
బలహీనుల బాధలు
మంచివాళ్ళ మౌనాలు 

ఆడుకుంటున్నారు

ఆడుకుంటున్నారు 
బాగా ఆడుకుంటున్నారు
మంచివాళ్ళ మంచితనంతో
అమాయకుల అమాయకత్వంతో
మగువల   శీలాలతో
పేదవారి పేదరికంతో
చిన్నారుల ప్రాణాలతో
ఆడుకుంటున్నారు బాగా ఆడుకుంటున్నారు
ఒక మంచిపని చేయటానికి ఐకమత్యం ఉండదు కానీ
కలసి కట్టుగ మూకుమ్మడిగా
ఎదుటివాడి ధన, మాన, సిరి సంపదలు
దోచుకోవడానికి, మూకుమ్మడిగా దాడులు చేస్తూ
ఆడుకుంటున్నారు బాగా ఆడుకుంటున్నారు
ప్రశాంతంగా వున్న సమాజాన్ని అల్లకల్లోలం చేయటమే వారి ధ్యేయం
వాళ్ల ప్రాణాలకు  ముప్పైనా ఎదుటివారిని  చెంపటమే వారికి  కావలసింది
సమాజం వణికి పోవాలి ప్రజలు భయభ్రాంతులు కావాలి ఇదే వారి లక్ష్యం.
వారి చేష్టలకు అదుపన్నదే లేదు 
మంచితనమా  ఇంకా జాప్యం చేయకు
మానవత్వమా ఇంకా మిన్నకుండకు
జనం నిద్రలేచే సమయం వచ్చింది
సమాజాన్ని ఉద్దరించాలిసిన అవసరం కలిగింది
మనమంతా ఏకతాటిపై నడుద్దాము
రక్కసి ముకలకు వణుకు పుట్టిద్దాము 
వాళ్ళ వీరంగాన్ని  తెలివిగా తిప్పికొడదాం
రండి రారండి అంత కలసికట్టుగా
రండి రారండి నడుము కట్టి రండి 

7, ఆగస్టు 2018, మంగళవారం

సైకిల్ యాత్ర (చిన్న కథ )


నిన్న నేను నిద్రలేచి గానుగ పుల్లతో ముఖం కడుక్కొని ఓక  గిన్నెడు  పాలు తాగి నా సైకిలు మీద ఊర్లోకి వేళ్ళాను.  ఆశ్చర్యము  రోడ్డు మీద అందరూ నావైపె చూస్తున్నారు .  అప్పుడు నాకు కొద్దిగా గర్వాంగా అనిపించింది యెందుకంటే నాజీవితంలో మొదటిసారిగా ప్రపంచం దృష్టి నామీద పడింది. దీనికి కారణం ఏమిటని చూస్తే అందరు నా  సైకిలు చూస్తున్నారు.  అప్పుడు నాకు తోచింది నా సైకిలు పూర్తిగా బంగారపు గొట్టాలతోటి చేసిందని అందుకే అందరూ చూస్తున్నారని.  అప్పుడు నేను నా చినిగిన ప్యాంటు జేబులోనుంచి మాసిన దస్తీ  తీసి నా మొఖాన్ని తుడుచుకున్నాను.   కానీ నాకు ఇంకా చెమట పడుతూనే వున్నది.  అందుకు కారణం నాకు అప్పుడు స్ఫురణకి  వచ్చింది నా సైకిలు బంగారపుదని అందుకే అందరూ  దానినే చూస్తున్నారని ఎవరైనా రవుడీలు నన్ను కొట్టి నా సైకిలు లాగేసుకుంటారేమోనని,  వెంటనే నేను ప్రేత్యకించి ఫిట్ చేసుకున్న ముందు బటన్ని నొక్కటం వెంటనే వెనకనుంచి  రెక్కలు పైకి రావటము వొకేసారి జరిగాయి. క్షణంలో నా సైకిలు ఆకాశంలోకి లేచింది.  అన్నట్లు నేను చెప్పటం మరిచాను నా సైకిలికి ముందర రెండు చిన్న రీఛార్జిబుల్  సేల్సు ఫిట్ చేసివున్నాయి వాటికి మూడు   గంటల ఛార్జింగ్ కెపాసిటీ ఉంటుంది అంటే వక్కసారి ఛార్జి చేస్తే మళ్ళి మూడు  గంటల వరకు పనిచేస్తూ ఉంటాయి. నేను గాలిలో నా సైకిల్ని 900 కిలోమీటర్ల వేగంతో నడుపుతున్నాను. అర గంటలో నేను సింగపూర్లో వున్నాను.  పైనించి నేను సింగపూర్ అందాలని చూస్తూ నా సైకిల్ వేగాన్ని 70 కిలోమీటర్లకు తగ్గించి  గాలిలో చెక్కర్లు కొడుతున్నాను  నేను చూసిన  దృశ్యాన్ని మీకు ఇక్కడ ఫోటో లో చూడవచ్చు.
మీరే చెప్పండి అంత పెద్ద భవనాలను నేను సైకిలు  మీదనుండి చూస్తుంటే కళ్ళు తిరగవా, తప్పకుండా  తిరుగుతాయి నాకు కూడా తిరిగాయి.  చిన్నగా నా సైకిలు వేగాన్ని ఇంకా తాగించి 20 కిలోమీటర్లకు దించి తిన్నగా  నేను భూమికి దగ్గరగా రావటానికి లాండింగ్ గేరు మీద చెయ్యి వేసి చిన్నగా సైకిలుని దించుతున్నాను.  నాకు అప్పుడు సింగపూరులోని నీరు వెదజల్లె  బొమ్మ కనపడింది మీరు చుడండి.
కాసేపు నేను నా సైకిలుని కిందికి దించి సింగపూర్ అందాలని చూసాను.  మల్లి నాకు మొదటి సమస్యే ఎదురైంది, అదేనండీ నా బంగారపు సైకిలు సింగపూర్ జనాలందరూ తిరునాళ్లలో జనాలలాగా నా సైకిలు చుట్టూ మూగారు. నాకు భయమేసింది ఎక్కడ వాళ్ళు నా సైకిలు కాజేస్తారోనని. వెంటనే నేను నా సైకిలు టెక్ ఆఫ్ బటన్ నొక్కాను. వెంటనే నా సైకిలు అతి వేగంగా గాలిలోకి చొచ్చుకొని పోయంది.  అందరు నా సైకిల్నే  చూస్తున్నారు. అప్పుడు నాకనిపించింది వెంటనే అమెరికా వెళదామని, ఎందుకంటె అక్కడ మన తెలుగు వాళ్ళు చాలామంది ఉంటారని.  నా ఫ్రెండు చెప్పాడు.  అమెరికాలో లివెర్ఫోల్ ప్రాంతం అంత తెలుగు వాళ్ళే.అట.   నాకు బాగా ఆకలి అయ్యిన్ది అప్పడికే సూర్యుడు నడి  నెత్తి  మీదకు వచ్చాడు అది అమెరికా కాబట్టి సరిపోయంది లేకపోతే ఎండ అదర కొట్టేది.  కడుపులో నక నక లాడుతుంటే వేరే ఏ జాస  లేకుండా వక  రెస్టారెంటు ముందర  దిగి సైకిలుతో పాటు స్టారెంటులోకి  దూరాను.

చూసారా అక్కడక్కడ వానచినుకులు పడుతున్నాయ్.  నేను సైకిలుతో పాటు  ఆ గొడుగు పట్టుకున్న వాని ప్రక్కనుంచి తలుపులోకి వెళ్ళాను.  వాళ్ళు నన్ను అమాంతం చూసి  ఆశ్చర్యపడ్డారు.  వక  వెయిటర్ నాదగ్గరికి వచ్చి వినయంగా మీకు  ఏమి కావాలి సార్ అని ఇంగ్లిష్ లో అడిగాడు.  నేను ప్లేట్ మీల్స్ అనగానే మనది ఇండియానా సార్ అన్నాడు.  అవును హైదరాబాద్ అన్నాను.  అదా సంగతి అని ఏదో గోనుకుంటు వాక మీల్స్ ఇచ్చాడు.  నేను తినంగానే వాడు నాకు బిల్ ఇచ్చాడు.  నేను నా జేబులో చేయిపెడితే జేబు కాళీ నేను అక్కడ కౌంటరులో కూర్చున్న వానితో నా దగర  డబ్బులు లేవు యిసారి వచ్చినప్పుడు ఇస్తాను అన్నాను.  దానికి వాడు నాకు డబ్బులు అక్కర లేదు నీతో పాటు  సైకిలు మీద తీసుకొనిపో అన్నాడు.  నీ పేరు ఏమిటని నేను ఇంగ్లీషులో అడిగాను, దానికి అతను ఫాక్స్ అన్నాడు.   నాకు ఈ డీల్ మంచిగా అనిపించింది. ఆ వేక్తికి 45 సంత్సరాలు ఉండొచ్చు అతను  నా సైకిలు ఎక్కాలని బాగా ఉబలాటంగా వున్నాడు.  నేను వెంటనే సరే కానీ నాతో  రా అని అతణ్ణి  నా సైకిలు వెనక కూర్చో పెట్టుకున్నాను.  ఎందుకైనా మంచిదని వక తాడు అతనికి సైకిలికి కట్టాను. చెప్పు ఎక్కడికి వెళదాము అన్నాను.  మా మామయ్య కొడుకు కెనడాలో  ఉంటాడు అక్కడికి పోదమన్నాడు.  నీకు అడ్రస్ తెలుసా అన్నాను.  దానికి అతను నా సెల్ ఫోనులో గూగులు మ్యాప్ చూసుకుంటూ వెళదాము అన్నాడు.  చెప్పు మీ మామయ్య అడ్రస్ అన్నాను దానికి  అతను కెనడాలో   టొరంటో లో ఉంటాడని అన్నాడు. నేను వెంటనే నా సైకిలు లోని ఆటో కంట్రోలర్ని  సెట్ చేశాను, స్పీడుని  కూడా ఆటోలోకి మార్చాను.  ఇక చుడండి నా  సైకిలు 1500 కిలోమీటర్ల స్పీయేడు అందుకున్నది.  నాకే భయం వేసిందంటే ఇక ఫాక్స్ పరిస్థితి చెప్పనక్కరలేదు.  అతను వేసుకున్న చొక్కా గాలిలోకి గాలిపటంలా ఎగురుతుంది. దాదాపు వక గంటలో మేము కెనడా చేరుకున్నాము. అక్కడి వాతావరణం పూర్తిగా మంచుతో వుంది అందుచేత మేము కిందికి దిగలేక పోయాము. ఆ విషయమే నేను ఫ్యాక్స్ తో చెప్పను.  దానికి అతను తనని అమెరికాలో దింపి పొమ్మన్నాను.  కానీ నాకు అప్పటికే పొద్దుకూకినట్లు కనిపిస్తుండటంతో నేను ఇప్పుడు అమెరికా రాలేను రేపు చూద్దామని చెప్పి ఇంటికి తిరుగు ప్రయాణం ఐయ్యాను.   మీటర్లో వోల్టాజి చాలా  తక్కువ చూపిస్తున్నది.  నాకు భయం ఐయంది మేము ఇంటిదాకా వెళతామో లేదోనని.  నేను ఆటోకంట్రోలర్ బొట్టన్ నొక్కి ఇంటివివైపు ఫిక్స్ చేశాను.  మార్గ మద్యంలో హిమాలయాల మీదుగా మా సైకిలు వెళుతుంటే చెప్పలేనంత చలి వేస్తున్నది.  అక్కడి హిమ పాతానికి  నా సైకిలు బంగారం అంత తుడిచిపెట్టుకు పోయంది.  కేవలం ఇనప గొట్టాలు కనపడ్డాయి.   కొంతదూరం వెళ్లిన తరువాత నా వెనక కూర్చున్న ఫ్యాక్స్ తాడు తెగి  అతను క్రిందికి జారిపోయాడు.  నేను అతడిని కాపాడాలని అతని చేయ్యి పట్టుకొనే ప్రేయత్నంలో నేను కూడా సైకిలు మీదినుంచి జారాను.  ఇద్దరం పైనుంచి దాదాపు 100 అడుగుల ఎత్తునుంచి క్రింద పడ్డాము.  ముందు  ఫ్యాక్స్ తరువాత అతని మీద నేను పడ్డాను.  నాకు ప్రాణం పోయిందనిపించి పెద్దగా అరిచాను.  అప్పుడు మా అమ్మ అక్కడికి వచ్చి నా  వీపు మీద జబిరి  ఏరా ఏమి కల కంటున్నావు ఇవేళ పనికి పోవ ఏమిటి అని అడిగింది నేను ఫ్యాక్స్ ఫ్యాక్స్ అని అరిచాను.  తీరా చూస్తే నా దిండు కిందపడి వుంది దానిమీద నేను వున్నాను.  ఎంత మంచి కల చెదిరిపోయినందుకు కొంత బాధ పడి  కాలకృచ్యాలు  తీర్చుకొని బొచ్చ పారా పట్టుకొని పనికి బయలుదేరాను.  ఇంతకు నేను చెప్పటం మరిచాను నేను భవననిర్మాణ కార్మికుడిని అంటే తెలియలేదా అదేనండి తాపీ మేస్త్రి హెల్పేర్ని.  నా పేరు సోమయ్య. 


ఇది నా తొలి ప్రయత్నము బుధ జనులు చదివి కామెంటు చేయగలరు.  



21, ఫిబ్రవరి 2018, బుధవారం


https://drive.google.com/file/d/1i2yW4Jf2XZu3Iw4x_3B6uptWWJSJ5oIg/view?usp=sharing_eil&ts=5a833a18

31, జనవరి 2018, బుధవారం

telangana Song Very good and informative


27, జనవరి 2018, శనివారం



https://photos.google.com/share/AF1QipPb1l-ftpOeohouLyBS3KyVasRM7jCM67yp_G5fnsHSc05EzfVe8WMoPozzyzrb7A/photo/AF1QipNdHOlkx3MLziv_nxO5WI33N6p4chYc-fLkwSZo?key=VlZnQmFxTjJPXzl2bnkwdXlGM0VtdUdXWTJ4aDRR 

short filim





     https://www.youtube.com/watch?v=04q0ye4GBR0&t=26s