25, నవంబర్ 2025, మంగళవారం

సంపూర్ణ మహాభారతము*

 🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*🕉️సోమవారం 24 నవంబర్ 2025🕉️*


             *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

  సరళ వ్యావహారిక భాషలో!


                            5️⃣4️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


    *సంపూర్ణ మహాభారతము* 

        

            *54 వ రోజు*                  

          *జరాసంధ వధ*```


శ్రీకృష్ణుడు భీమార్జునులతో కలసి కపట బ్రాహ్మణ రూపాలలో కపట స్నాతక వ్రతం స్వీకరించారు. జరాసంధుని నగరమైన గిరివ్రజపురం సమీపించారు. ఆ పురం చుట్టూ ఉన్న పర్వతాలు ప్రాకారాలలా ఆ పురాన్ని రక్షిస్తున్నాయి. పక్కనే చైత్యకమనే కొండ ఉంది. దానిపై మూడు ఢక్కలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు భీమార్జునులకు ఆ ఢక్కలను చూపి “భీమా నగరంలోకి ఎవరన్నా కొత్త వారు ప్రవేశిస్తే ఆ ఢక్కలు మోగుతాయి” అని చెప్పాడు. భీమార్జునులు ఆఢక్కలను పగులకొట్టి చైత్యకపర్వత మార్గంలో నగరంలో ప్రవేశించారు. శ్రీకృష్ణుడు భీమార్జునులు సిగలో పూలు అలంకరించుకున్నారు. స్నాతకుల మాదిరి గోశాలలో ప్రవేశించారు. జరాసంధునికి బ్రాహ్మణులంటే భక్తిప్రపత్తులు మెండు కనుక బ్రాహ్మణులు రాజమందిరంలోకి ఎప్పుడైనా వెళ్ళవచ్చు. బ్రాహ్మణవేషాలలో ఉన్న శ్రీకృష్ణుడు  భీమార్జునులకు అర్ఘ్యపాద్యాలను ఇచ్చాడు. వారు వాటిని పుచ్చుకోలేదు. జరాసంధుడు సందేహపడి వారిని “మీరు గంధపుష్పాలు ధరించినా స్నాతకులుగా లేరు. మీ ఆకారాలు క్షత్రియుల మాదిరి ఉన్నాయి. మీరు ఎవరు? ఎందుకు వచ్చారు?" అని అడిగాడు. 


అందుకు శ్రీకృష్ణుడు, భీమార్జునులు 

“మేము క్షత్రియ స్నాతకులము. ముఖద్వారం గుండా మిత్రుల ఇంటికి, దొంగ ద్వారం గుండా శత్రువుల ఇంటికి ప్రవేశించడం క్షత్రియ ధర్మం" అన్నారు. 


జరాసంధుడు "నేను ఎవరికీ అపకారం చేయలేదు. నేను బ్రాహ్మణులకు, దేవతలకు, మునులకు భక్తుడను. ఉత్తమ క్షత్రియ ధర్మాలు ఆచరిస్తున్నాను. మీకు నేనెలా శత్రువునైయ్యాను?" అన్నాడు. 


“ఓ జరాసంధా! ధర్మరాజు 

ఆజ్ఞపై శత్రుసంహారానికి వచ్చాము. ఉత్తమ క్షత్రియుడిని అని చెప్పుకుంటున్న నీవు క్షత్రియులను పట్టి బంధించి శివునకు బలి ఇచ్చి శివపూజలు ఎలా నిర్వహిస్తావు? ఉత్తమ క్షత్రియులు ఇలా చేస్తారా? నిష్కారణంగా సాధు హింస చేసే వారు, జనులను హింసించే వారు అందరికి శత్రువులు కారా? నిర్ధోషులైన సాటి కులం వారిని చంపడం పాపం కాదా. అలాంటి పూజలు ఫలిస్తాయా? నీలాంటి పాపులను విడిచి పెడితే మాకు పాపం వస్తుంది. కనుక నీతో యుద్ధానికి వచ్చాము. నేను కృష్ణుడిని, ఇతను భీముడు, అతడు అర్జునుడు. ఇప్పటికైనా చెరలో ఉన్న రాజులను విడిచిపెడితే సరి లేని యడల వీరు నీ గర్వమణచి వారిని విడిపించకలరు" అని శ్రీకృష్ణుడు అన్నాడు. 


జరాసంధుడు కోపించి “పరాక్రమంతో రాజులను జయించడం నేరమా. పరమ శివునకు బలి ఇవ్వడానికి తెచ్చిన వారిని నేను ఎందుకు

వదిలి పెడతాను. సైన్యంతో వస్తే సైన్యంతో యుద్ధం చేస్తాను. లేనియడల మీ ముగ్గురితో కానీ, ఇద్దరితో కానీ, ఒక్కరితో కానీ యుద్ధం చేస్తాను మీకు ఏది ఇష్టమో చెప్పండి" అన్నాడు. 


శ్రీకృష్ణుడు “ముగ్గురు నీతో యుద్ధం చేయడం ధర్మంకాదు. మా ముగ్గురిలో నీకు సరిజోడుని కోరుకో. అతను మల్ల యుద్ధంలో నిన్ను జయిస్తాడు" అని అన్నాడు. 


జరాసంధుడు “నాకు సరిజోడు భీముడే. కనుక అతనితో యుద్ధం చేస్తాను" అని చెప్పాడు. 


జయాపజయాలు దైవాధీనం కనుక జరాసంధుడు ముందుగా అతని కుమారుడు సహదేవునికి రాజ్యాభిషేకం చేసాడు. పురోహితుల చేత మంగళ శాసనాలు పొంది భీముని మల్ల యుద్ధానికి పిలిచాడు. భీముడు-  జరాసంధుడు ఘోరంగా తలపడ్డారు. ఒకరిని ఒకరు జయించాలన్న కాంక్షతో ఒకరిని మించి ఒకరు భీకరంగా తల పడ్డారు. ఇలా కార్తీక శుద్ధ పాడ్యమి నుండి త్రయోదశి వరకు సాగింది. అప్పటికి జరాసంధుడు అలసి పోయాడు. 


శ్రీకృష్ణుడు “భీమా! జరాసంధుడు అలసి పోయాడు. ఇది తగిన సమయం, అతడిని సంహరించు!” అన్నాడు. 


భీమసేనుడు తన తండ్రి వాయుదేవుని తలచుకుని జరాసంధుని గిరా గిరా తిప్పి నూరు సార్లు విసిరి వేసాడు. అతడి ఎముకలు విరిచి ఘోరంగా సంహరించాడు. జరాసంధుని మృతదేహాన్ని అతని ముఖద్వారం ముందు పడవేశాడు.  


శ్రీకృష్ణుడు మగధవాసులకు అభయం ఇచ్చాడు. జరాసంధుని చెరలో ఉన్న రాజులను విడిపించాడు. జరాసంధుడి కుమారుడైన సహదేవునికి ధైర్యం చెప్పాడు.తరువాత వారు ఇంద్రప్రస్థానికి బయలుదేరాడు. ధర్మరాజుకు జరిగినది చెప్పి విడిపించిన రాజులను చూపించాడు. రాజులంతా వారి వారి రాజ్యాలకు పయనమయ్యారు.  శ్రీకృష్ణుడు ద్వారకకు చేరుకున్నాడు.```


             *(సశేషం)*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

              🌷🙏🌷```

 

*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

కామెంట్‌లు లేవు: