24, నవంబర్ 2025, సోమవారం

సంపూర్ణ మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*శాంతి పర్వము షష్టమాశ్వాసము*


*570 వ రోజు*


*ఆత్మ ఏకత్వము అనేకత్వము*


జనకుడు " మహర్షీ ! ఆత్మకు ఏకత్వము అనేకత్వము ఉన్నాయి కదా ! అలాగే విద్య అవిద్య ఉన్నాయి కదా ! నా బుద్ధిమాంధ్యము వలన నేను తెలుసుకొనజాలక ఉన్నాను కనుక క్షరము, అక్షరము, సాంఖ్యము, యోగము గురించి వివరించండి " అని అడిగాడు. వశిష్ఠుడు " జనకమహారాజా ! యోగమనగా ధ్యానము. అది రెండు విధములు. మొదటిది ప్రాణాయామము, రెండవది మానసిక ఏకాగ్రత. మొదటిది సగుణోపాసన రెండవది నిర్గుణోపాసన. ప్రాణాయామము మూత్రవిసర్జన సమయంలో భోజనము చేసిన తరువాత చెయ్యకూడాదు. యోగి మితాహారము తీసుకోవాలి. ఇంద్రియములను నిగ్రహించాలి. శబ్ధ, రస, రూప, గంధాదుల వంక మనసు మరల్చకూడదు. బుద్ధి మనసునందు నిలిపి మనసును ఆత్మ అందు నిలపాలి. కోరికలు విసర్జించి శిలాసదృశ్యముగా ఉండాలి. అలాంటి యోగి పగటికి రాత్రికి భేదము లేక నిరంతర ధ్యానములో మునిగి ఉంటాడు. గాలిలేని చోట వెలిగేదీపంలా నిశచలమనస్కుడై ఆనందం అనుభవిస్తాడు. దీనినే యోగము అంటారు. ప్రకృతివాదులైన సాంఖ్యులు ఈ ప్రకృతిని అవ్యక్తము అంటారు. ప్రకృతికి జన్మనిచ్చే ధర్మము ఉంది కనుక తానుగా బుద్ధి, అహంకారము, పంచభూతములు, విషయవాంఛలు, ఇంద్రియములుగా లోకమంతా విస్తరించి ఉంటుంది. దీనికి పురుషుడు అధిష్టానుడు. ఈ సృష్టి అనులోమానుపాతంగా జరుగుతూ ఉంటుంది. సంహారసమయంలో విలోమానుపాతంగా జరుగుతుంది. జననమరణ సమాయాలలో ప్రకృతి ప్రకోపిస్తుంది. ప్రకృతి, క్షేత్రము, అవ్యక్తము మూడూ ఒకటే. దానిని సత్వము అనికూడా అంటారు. జీవుడికి క్షేత్రము గురించి తెలుసు కనుక అతడిని క్షేత్రజ్ఞుడు అంటారు. జీవుడు ఈ అవ్యక్త పురములో ఉండడం వలన అతడిని పురుషుడు అంటారు. క్షేత్రము క్షేత్రజ్ఞుడు అన్నది తెలుసుకోవడమే జ్ఞానం. పురుషుడికి ఈ జ్ఞానము తెలుసు. ప్రకృతి సగుణాత్మకము పురుషుడు నిర్గుణుడు. 24 వికారములకు సాక్షిగా పురుషుడు నిలిచి ఉంటూ కైవల్యాం పొందుతాడు అదే పునరావృత్తి రహితమార్గము. ఈ సత్యము తెలిసిన వాడికి మరణం అంటే భయం ఉండదు.


*విద్య అవిద్య*


జనక మహారాజా ! నీకు సాంఖ్యమును యోగమును, అక్షరము గురించి వివరించాను. ఇంక విద్య అవిద్య గురించి వివరిస్తాను. విద్య అంటే 25 వ తత్వమైన అక్షర పరబ్రహ్మము. కర్మేంద్రియములకు జ్ఞేనేంద్రియములు, జ్ఞానేంద్రియాలకు మనసు, మనసుకు పంచభూతములు, పంచభూతములకు అహంకారం, అహంకాముకు బుద్ధి, బుద్ధికి అవ్యక్తము, అవ్యక్తముకు 25వ తత్వమైన అక్షర పరబ్రహ్మము వరుసగా విద్యగా పరిగణించబడతాయి. జనకమహారాజా ! నీకు క్షరముఅక్షరము గురించి ఇంతకు ముందు వివరించాను. కొందరు ప్రకృతిని క్షరమని, జీవుడిని అక్షరమని అనుకుంటారు. మరి కొంత మంది ప్రకృతి, జీవుడు కూడా క్షరమని అంటారు. మరి కొంతమంది జీవుడు, ప్రకృతి కూడా అక్షరని అంటారు. రెండింటికీ ఆది అంతము లేక పోవడము, ఈశ్వరతత్వం కలిగి ఉండటం వలన సారూప్యము ఏర్పడింది. జీవుడు, ప్రకృత్తి సహజములైన మహత్తు, అహంకారములతో చేరి, ప్రకృతి తానుగా తలుస్తాడు. అప్పుడు జీవుడు క్షరమౌతాడు. అదే జీవుడు ప్రకృతి వికారములకు లోబడక స్వతంత్రుడైతే అక్షరుడౌతాడు. జీవుడికి జ్ఞానప్రకాశం కలుగగానే ఈ విధంగా అనుకుంటాడు " ఇంత కాలము ప్రకృతి అనుకుంటున్నాను. ఈ ప్రకృతి తన వికృతులతో నన్ను భ్రమింప చేసింది. కాని నీరు నీటిలోని చేప వేరు అన్నట్లు ప్రకృతి వేరు, జీవుడు వేరు. నేను నిష్కళంకుడను, నాకు రూపము లేదు, నాకు ఈ ప్రకృతితో సంబంధం లేదు కనుక నేను దానికి దూరంగా ఉంటాను. అసలు ఈ తప్పు ప్రకృతిది కాదు నాదే, సంగమం అంటే ఏమిటో తెలియని వాడిని ప్రకృతితో ఎందుకు కలిసాను. నాకు ఇన్ని రూపములు సంభవించడానికి కారణం ఈ ప్రకృతే కారణం కదా ! ఈ ప్రకృతితో కలిసిన కారణంగా మమతా మమకారాలు చెలరేగి జన్మ వెంట జన్మ వస్తున్నాయి. ఇప్పుడు నేను ఈ ప్రకృతిని వదిలి నిర్మలంగా ఉన్నాను. అహంకారం మమత కారణంగా ప్రకృతి ఇన్ని రూపాలు ధరించడానికి కారణం అయింది. నేను ఈ రెండింటిని వదిలితే ప్రకృతి నన్ను ఏమీ చెయ్య లేదు. సోమరితనం, చెడు అలవాట్లయందు ఆసక్తి ప్రకృతి లక్షణములు. అందుకే ఈ ప్రకృతిని వదిలి నిశ్చలానందాన్ని పొందాలి " ఇలా ఆలోచుస్తూ జీవుడు అక్షరత్వమును పొందుతాడు. ధర్మనందనా ! పూర్వము ఈ విద్యను బ్రహ్మ వశిష్టుడికి చెప్పాడు, వశిష్ఠుడు నారదునికి చెప్పాడు, నారదుడు నాకు చెప్పాడు, నేను నీకు చెప్పాను. దీని వలన నీకు శాశ్వతానందం కలుగుతుంది.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*


*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: