24, నవంబర్ 2025, సోమవారం

భగవంతుడి విభూతులే

 *"స్త్రీల గుణాలు అన్నీ భగవంతుడి విభూతులే !!!”*

                

*నారీణాం… కీర్తి, శ్రీ, వాక్కు, స్మృతి, మేధా, ధృతి, క్షమ..!!*


*'స్త్రీలలో కనిపించే ఈ ఏడు గుణాలు నా విభూతులే!’ అంటున్నాడు భగవానుడు.*


*దీనిని బట్టి ఈ ఏడు లక్షణాలు పురుషులలో కన్నా స్త్రీలలోనే ఎక్కువగా శోభిస్తాయని కావచ్చు. లేదా ఈ ఏడు లక్షణాలు స్త్రీలలోనే ఎక్కువగా కనిపిస్తాయని కావచ్చు. ఇవి స్త్రీలకు సహజ గుణాలు కూడా.*


*'స్త్రీ’ సృష్టిలో అందమైన దేవుడి వరం. స్త్రీ అంటేనే ప్రేమ, అనురాగం. తన జీవిత కాలంలో నిర్వహించే ప్రతి పాత్రను ఎంతో చక్కగా నిర్వర్తిస్తుంది. నాలుగు గోడల ఇంటిని స్వర్గం చేస్తుంది. ఏ పనిలోనైనా రాణించ గలిగే ధైర్యం, సత్తా ఉన్నది స్త్రీకి మాత్రమే! అని చాటిచెబుతుంది స్త్రీ.*


*అద్భుత మూర్తి స్త్రీ. స్త్రీశక్తిని, స్త్రీల గుణగణాలను పొగుడుతూ, ప్రతి వస్తువులోను ఒక్కొక్క విభూతిని చెప్పి, “స్త్రీలలో మాత్రం ఏడు విభూతులుగా నేనున్నాను” అని భగవంతుడు అనటంలో స్త్రీల యొక్క విశిష్ఠతను చాటుతుంది.*


*ఏమిటా ఏడు విభూతులు అంటే...*


*1. కీర్తి :*

*సత్కర్మలు, దానధర్మాలు, పూజాపునస్కారాలు, యజ్ఞయాగాదులు మొదలైన కర్మల ద్వారా, త్యాగ భావన ద్వారా కీర్తిని సంపాదించటం, భర్తకు అనుకూలంగా కుటుంబ నిర్వహణ గావించటం ఇవి స్త్రీ సహజగుణాలు.*


*2. శ్రీ :*

*శ్రీ అంటే సంపద. అంతేకాదు సంపదతోబాటు శరీర సౌందర్యాన్ని కాపాడుకుంటూ అందంగా అలంకరించుకోవటం కూడా స్త్రీ యొక్క సహజ గుణమే. శ్రీ అంటే లక్ష్మి.*


*3. వాక్కు :* 

*వాక్కు అంటే సరస్వతి. విద్య, బుద్ధి, జ్ఞానం సంపాదించటం, చల్లగా, తియ్యగా, మధురంగా మాట్లాడటం కూడా భగవంతుని విభూతియే.*


*4. స్మృతి :*

*జరిగిపోయిన విషయాలను గుర్తుపెట్టుకొనే జ్ఞాపకశక్తి, జ్ఞానాన్ని మరచిపోకుండా ఉండటం. సందర్భానికి తగినట్లు జరిగిన విషయాలను గుర్తు తెచ్చుకోవటం స్మృతి. ఇదీ భగవంతుని విభూతియే.*


*5. మేధా :*

*ధారణాశక్తి. విన్న విషయాలను బుద్ధిలో నిలుపుకొనే శక్తి. జ్ఞాన విషయాలు, తత్త్వవిచారణ చేయటానికి కావలసిన మేధాశక్తి స్త్రీలలో అధికం. ఇదికూడా భగవంతుని విభూతియే.*


*6. ధృతి :*

*ధర్మకార్యాలలో, దైవకార్యాలలో ధైర్యంతో, పట్టుదలతో పాల్గొనటం, మోక్ష సిద్ధికొరకు పట్టుదల. ఇంద్రియ, మనస్సులను నిగ్రహించగల బలం. ఇది కూడా స్త్రీలలో అధికమే.*


*7. క్షమా :* 

*అత్తమామలను ఆదరించటంలోను, భర్తకు అనుకూలంగా నడుచుకోవటంలోను, పిల్లల పోషణలోను, బావలు, మరుదులు, తోటికోడళ్ళు మొదలైనవారితో నేర్పుతో వ్యవహరించటంలోను ఎంతో ఓర్పు ఉండాలి. ఇది కూడా స్త్రీ సహజగుణమే.*


*ఇవన్నీ స్త్రీలలో ఉంటే వాటిని భగవంతుని విభూతులుగా చూడాలి.*


*విశేషార్థం :*

*నార అంటే భగవత్‌ సంబంధమైన.. అని. భగవత్‌ కార్యాలలో, లేదా భగవత్‌ సంబంధమైన జ్ఞానంలో జీవించేవారు పురుషులైనా, స్త్రీలైనా పైన చెప్పిన సద్గుణాలు వారిలో ప్రకాశిస్తే అవి భగవత్‌ విభూతులే.*


*┈┉┅━❀꧁హరేకృష్ణ꧂❀━┅┉┈*

     🙏🏻🙏🏻 🙏🏻సేకరణ🙏🙏🏻🙏🏻

కామెంట్‌లు లేవు: