25, నవంబర్ 2025, మంగళవారం

సంపూర్ణ మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*



*571 వ రోజు*


*వసుమంతుడు*


భీష్ముడు ధర్మరాజుకు ఇంకా ఇలా చెప్పసాగాడు. ఒకరోజు వసుమంతుడు అనే రాజు వేటకై అడవికి వెళ్ళి అక్కడ భృగువంశ సంజాతుడైన ఒక మునిని చూసి " మునిపుంగవా ! ఈ లోకములో కాని పరలోకములో కాని ఆచరించతగిన ధర్మము ఏదో చెప్పండి " అని అడిగాడు. అందుకు ఆముని " మహారాజా ! మనం ప్రతి రోజు చేసే మంచి పనులు చెడ్డ పనుల వలన మనకు సుఖముదుఃఖము కలుగుతున్నాయి. అత్యాశతోను పనులు చెయ్యాలనుకోవడం తప్పు. తియ్యటి తేనె కొరకు కొండమీదకు ఎగబాకుతున్నామని అనుకుంటారు కాని అక్కడ నుండి జారితే విరగబడతాము తెలుసుకోరు. ధర్మాన్ని జ్ఞానాన్ని నిర్మలమైన మనస్సుతో అభ్యసించాలి. ఎల్లప్పుడూ సత్సంగంతో గడపాలి. అలా చేసిన మానవునికి ఇహలోక సుఖమే కాక పరలోకసుఖము ప్రాప్తిస్తుంది. బ్రాహ్మణులకు హితమైన పనులు చెయ్యాలి. అర్హులకు దానమివ్వాలి. ఇచ్చిన తరువాత దానికి బాధపడకూడదు. క్రోధమును కామమును వదలాలి. మనసు దృఢంగా ఉంచుకోవాలి. మనసికంగా బలహీనుడైనందు వలన పూర్వము మహాభిషుడు బ్రహ్మలోకం నుండి భూమికి జారాడు. యయాతిమహారాజు మనో ధైర్యము ఉండటం చేత ఆపదల నుండి బయటపడ్డాడు " అని చెప్పిన ముని మాటలకు వసుమంతుడు కామక్రోధములను వదిలి మనోధైర్యము పొంది ధర్మ మార్గాన నడిచాడు.


*యాజ్ఞవల్క్యుడు*


ధర్మరాజు " పితామహా ధర్మము అధర్మము అను బేధము లేనిది, చావు పుట్టుకలు లేనిది, సకల సందేహములను నివృత్తి చేయకలిగినది, శుచియై, నిత్యమై, అవ్యక్తమై, ధుఃఖ రహితమై, ఆనందమయమై, పరతత్వమై ఉంటుందో దానిని నాకు వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! నీకు జనకుడు యాజ్ఞవక్యుల మధ్య జరిగిన సంభాషణ గురించి వివరిస్తాను. సకలలోకములలోకెల్లా విజ్ఞానఖని అయిన యాజ్ఞవల్క్యుడితో జనకుడు " మునీంద్రా ! ఇంద్రియములు, అవ్యక్తము అయిన ప్రకృతి, బ్రహ్మము, పరతత్వము, పంచభూతములు ఎలా పుట్టాయి. ఎలా లయమౌతాయి. ఆకాలమును గురించి వివరించండి " అని అడిగాడు. అందుకు యాజ్ఞవల్క్యుడు " మహారాజా ! సృష్టిని, లయమును ప్రకృతి కల్పిస్తుంది. ఒక రోజులో పగలు పది కల్పములు, రాత్రి ఒక కల్పము ఉంటాయి. పగలు సృష్టి జరుగుతుంది, రాత్రి లయము జరుగుతుంది. ఈ లోకము లోని జీవరాశులకు జీవనాధారముగా ఓషధులు సృష్టించబడ్డాయి. సృష్టికార్యము కొరకు బ్రహ్మ సృష్టించబడ్డాడు. ఆ బ్రహ్మ పంచభూతములు సృష్టించాడు. వాటికి శబ్ధ, స్పర్శ, రస, రూప, గంధములు అను గుణములను సృష్టించాడు. వీటిని గ్రహించడానికి పంచ జ్ఞానేంద్రియములను పంచ కర్మేంద్రియములను సృష్టించాడు. ఈ ఇంద్రియములకు మనసు అధినేత. జ్ఞానేంద్రియములైన కన్ను, ముక్కు, చెవి మనసు చేతనే విషయము గ్రహిస్తాయి కాని స్వయముగా ఏమీ చేయలేవు. మిగిలిన అన్ని అవయమలు మనసుచేత నియంత్రించబడతాయి. ఈ విషయము జ్ఞానులు అజ్ఞాలు సమానంగా గ్రహించగలరు. ఇంద్రియములు విశ్రమించినా మనసు విశ్రమించదు. కనుక ఇంద్రియములను ప్రాపంచిక విషయముల నుండి నిగ్రహించి మనసును అదుపులో ఉంచాలి. అది అభ్యాసము మీద అలవడుతుంది.


*ప్రళయము*


ఇక ప్రళయము గురించి వివరిస్తాను. రాత్రి కాగానే అవ్యక్తమైన ప్రకృతి అహంకార పూరితుడైన పురుషుని ప్రభోదిస్తుంది. ఆ పురుషుడు 12 రూపములు ధరించి సర్వభూతములను లయం చేస్తాడు. ఆ తరువాత భూమి అంతా జలమయమౌతుంది. ఆ జలమును కాలాగ్ని ఆవిరి చేస్తుంది. కాలాగ్నిని వాయువు తుదముట్టిస్తుంది. వాయువు ఆకాశంలో లయమౌతుంది. ఆ కాశం మనసులో లయమౌతుంది. ఆ మనసును అహంకార పూరితుడైన పురుషుడు కబళిస్తాడు. ఆ అహంకారం అవ్యక్తమైన ప్రకృతిలో లీనమౌతుంది. ఇలా రాత్రి జరుగుతుంది. తరువాత పగలు రాగానే తిరిగి పునఃసృష్టి జరుతుంది.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: