18, డిసెంబర్ 2025, గురువారం

పెన్షనర్ల కష్టాలు

 . పెన్షనర్ల కష్టాలు 

          *********************

          (ఆట వెలదులు)

1) పెన్షనరుకు ఉన్న పెనుబాధలన్నియు 

ముసలితనమునందు ముంచుకొచ్చు 

ఎవరినడుగ లేరు యేడికీ పోలేరు 

అండ ఉంటెగాని అడుగు పడదు !

2)

నడవలేని కాళ్ళు నిలువనీయని వొళ్ళు 

ప్రకృతి పిలుపులన్ని పడక యందు 

ధైర్యమిచ్చువారు దరిలేక తండ్లాట 

కాయమరుగు వరకు కంటనీరు !

3)

పెన్షనరుకు హక్కు పెన్షను పొందుట 

బిక్షగాదు సేవ భుక్తి యగును 

నాయకులకు యేల నాలుగు పెన్షన్లు?

దోచుకొనుటకేన దొరల నీతి !

4)

నాయకుని చికిత్స నయముగాదిచ్చట 

అన్యదేశమెళ్ళి హాయి గడుపు 

ఎంత ఖర్చునైన ఏలోటు రాకుండ 

ఉన్నదంత తిందురుచిత సొమ్ము !

5)

పెన్షనరుకు జబ్బు పెనుబాధను తెచ్చు 

ఉచిత వైద్యమునకు ఊత మియరు 

పేరుకే ఉచితము పెనుభారమగు చుండు 

ముందు డబ్బు లిస్తె మందులిచ్చు !

6)

అంత ఉచితమంటు "ఆరోగ్యశ్రీ" వల్ల 

"ఉచిత భీమ" లేమి ధీమ నిచ్చు?

హెల్తుకార్డులేమి హెల్పుచేయుట లేదు 

ఆచరించు చోట అమలుగాదు !


                  ........... కోట పెంటయ్య 

     విశ్రాంత భాషోపాధ్యాయులు. కారేపల్లి. ఖమ్మం జిల్లా.9014977041

కామెంట్‌లు లేవు: