3, డిసెంబర్ 2025, బుధవారం

ముఖచంద్రకళంకాభమృగనాభివిశేషకా

  🌹ముఖచంద్రకళంకాభమృగనాభివిశేషకా🌹


అష్టమీచంద్రవిభ్రాజదళికస్థలశోభితా।

ముఖచంద్రకళంకాభమృగనాభివిశేషకా। 


వశిన్యాదులు చెప్పిన స్తోత్రంలోని యీ నామం ముఖచంద్రకళంకాభమృగనాభివిశేషకా లో ఉన్న మృగం కస్తూరీ మృగం. మృగనాభం అంటే కస్తూరి. కస్తూరి పరీమళం చాలా గొప్పగా ఉంటుంది.

అసలు సిసలైన పరిమళద్రవ్యాలంటే ఎనిమిదింటిని చెబుతారు. అవి కర్పూరము, కస్తూరి, పునుగు, జవ్వాజి, అగరు, పన్నీరు, గంధము, శ్రీగంధము అనేవి.

సంస్కృతంలో మృగం అన్న మాటకు సాధారణార్థంగా జంతువు అని అర్థం ఉన్నా, విశేషంగా మృగం అంటే జింక అనే అర్థం. స్త్రీని మృగనయన అంటారు అంటే అమ్మాయి కళ్ళు జింక కళ్ళ వలె అందంగా ఉంటాయని పోల్చి చెప్పటం. అంతే కాని ఏజంతువైనా మృగం అంటారు కాబట్టి గేదెకళ్ళు కలది విగ్రహవాక్యం చెప్పకూడదు!

అందుచేత కస్తూరిమృగం అంటే కస్తూరిజింక. జింకల్లో ఒక జాతి. వాటిలోనూ మగ కస్తూరిజింక పురుషాంగానికి కొంచెం పైన ఉన్న ఒక గ్రంథి నుండి వెలువడే ఒక పరిమళభరిత స్రావం.


ఈ మృగమదం అనబడే కస్తూరి పరిమళద్రవ్యాలలోని కెల్లా గొప్పది అన్నది నిర్వివాదం. ఈ రోజుల్లో మనం సంప్రదాయికమైన పరిమళద్రవ్యాల మీద అభిరుచిని కోల్పోయాం. ఏ కంపెనీ సెంటు బాగుంటుందా అనే అలోచన మనది. కాని అవన్నీ కూడా రకరకాల రసాయనాలు కాని సహజమైనవీ నిరపాయకరమైనవీ కానే కావు.

మన కస్తూరి అపాయకరమైనది కాదు కాని అచ్చమైన కస్తూరిని వాసన చూస్తే ముక్కు వెంట నెత్తురు వచ్చే అవకాశం ఉందట! అందుకని సహజమైన కస్తూరిని కూడా సాధారణంగా కొంచెం ఇతరపదార్థాలతో కలిపి కొంచెం సున్నితం చేసే వాడుతారట.

ఈ కాలంలో కస్తూరి పేరుతో చెలామణీ అవుతున్న దానిలో ముప్పాతిక మువ్వీసం నకిలీ. అసలు కస్తూరిమృగం నుండి వచ్చిన పరిమళద్రవ్యం కానే కాదు.

కస్తూరి ఒక పరిమళద్రవ్యం అనగానే అది ఒక అలంకారంగా వాడబడే వస్తువు అని వేరే చెప్పనక్కర లేదు కదా.

మరి అమ్మ కూడా కస్తూరిని ఒక అలంకారంగా నుదుట తిలంగా ధరిస్తుంది అని ఈ నామం ముఖచంద్రకళంకాభమృగనాభివిశేషకా అనే దాని వలన తెలుస్తోంది.

మరి అలా అమ్మ పెట్టుకున్న కస్తూరీ తిలకం గురించి ప్రస్తావించగానే మనకి ఈ ప్రసిధ్ధమైన శ్లోకం గుర్తుకు రావాలి కదా. ఒకసారి చెప్పుకుందాం.


కస్తూరీతిలకం లలాటఫలకే వక్షఃస్థలే కౌస్తుభం

నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం

సర్వాంగే హరిచందనం చ కలయన్ కంఠే చ ముక్తావళీం

గోపస్త్రీపరివేష్టితో విజయతే గోపాలచూడామణిః


ఈ సుప్రసిధ్ధశ్లోకం లీలాశుకుడి శ్రీకృష్ణకర్ణామృతం లోనిది. ఇందులో శ్రీకృష్ణమూర్తి శోభను వర్ణిస్తున్నాడు కవి. ఆయన ముఖాన కస్తూరిని తిలకంగా ధరించి ఉన్నాడట.

దీనిని బట్టి ఒకప్పుడు స్త్రీలూ పురుషులూ కస్తూరీతిలకాలను ధరించే వారని అర్థం అవుతున్నది కదా. ఈ కస్తూరి కేవలం అలంకారసాధనమే కాదు, ఆయుర్వేదవైద్యంలో దీనికి చాలా ప్రశస్తి ఉంది. ఇది ధనధాన్యసౌభాగ్యవర్థకం అన్న ప్రతీతి కూడా ఉంది.

కస్తూరి అలంకారం కావటానికి కారణం అది సువాసనాభరితం కావటమే కాదు, ఆ సువాసన శృంగారోద్దీపనం కావటమూ ముఖ్య కారణమే. 


అమ్మ కస్తూరీ తిలకం ధరించింది కదా, ఆ తిలకం ఎలా శోభిస్తోందీ అంటే వశిన్యాదులు ఒక చక్కని ఊహ చేసి చెప్పారు

స్తీల ముఖాలను చంద్రబింబాలతో పోలుస్తాం కదా. అమ్మముఖం ఐతే చెప్పేది ఏముంది అచ్చంగా పూర్ణచంద్రబింబమే అనవలసిందేను

చంద్రుడు ఎంత అందంగా ఉన్నా ఆ చంద్రబింబంలో ఒక మచ్చ ఉంది అని అందరికీ తెలుసు. కాని చిత్రం ఏమిటంటే మచ్చ ఉన్నా అది చంద్రుడి అందానికి ఏమన్నా లోపమా అంటే కానే కాదు. ఒక్క సినిమా చంద్రుడు మాత్రమే మచ్చ లేని చంద్రుడు కాని ఆకాశం మీద చంద్రుడు మచ్చతోనే ఉంటాడు - ఐనా చాలా అందంగా

ఈ నామం ముఖచంద్రకళంకాభమృగనాభివిశేషకా లో కళంకం అనే శబ్దం ఉంది కదా. కళంకం అంటే మచ్చ. ఈ మాట అందరికీ తెలిసిందే. ఇకపోతే ముఖచంద్ర అనే పోలిక ఉంది. అంటే ముఖం అనే (పూర్ణ)చంద్రబింబం. వశిన్యాదులు కళంకాభం అన్నారు కదా, దాని అర్థం కళకం వంటిది అని.


ప్రశ్న. అమ్మ ధరించిన కస్తూరీతిలకం ఎలా ఉందీ?

జవాబు. నల్లగా ఉంది.


ప్రశ్న. కొంచెం కవిత్త్వంతో చెప్తే ఆ నలుపు ఎలా ఉందీ అంటాం?

జవాబు. అమ్మ ముఖం అనే పూర్ణచంద్రబింబంలో మచ్చలాగా ఉంద

చంద్రుడు మనః కారకుడు. చంద్రమా మనసో జాతః అని వేదం. సమస్తజీవుల సమిష్టి మనో రూపమే చంద్రుడు. అచంద్రుడు అమ్మకు ముఖం. అయన షోడశకళా యుక్తుడు.

🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹

కామెంట్‌లు లేవు: