3, డిసెంబర్ 2025, బుధవారం

సంపూర్ణ మహాభారతము

  *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*షష్టాశ్వాసం ప్రధమ భాగం*


*578 వ రోజు*


*శుకుడు వైరాగ్యము*


ధర్మరాజు " పితామహా ! వ్యాసపుత్రుడైన శుకునకు వైరాగ్యము ఎలా కలిగింది " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! వ్యాసుడి కుమారుడైన శుకుడు మొదట సాధారణంగానే ఉన్నాడు. అందరితో కలిసి పోయి శరీరము శాశ్వతం అనుకుని తనకు వ్యాధులు, మరణం ఉంటాయన్న విషయం మరచి విషయవాంఛలలో మునిగి పోయాడు. అది చూసిన వ్యాసుడు తన కుమారుడికి వైరాగ్యం బోధిస్తూ " కుమారా ! శుకా ! నీవు ఇంద్రియములను, మనసును తప్పుమార్గమున పోనీయక అదుపులో ఉంచుకుని వాటిని సరి అయిన మార్గములో పెట్టు. కోపరాహిత్యం, సత్యం పలకడం, ఇంద్రియములను అదుపులో పెట్టుకోవడం, ధర్మమార్గంలో నడవడం, సత్ప్రవర్తన కలిగి ఉండటం, తపస్సు చేయడం, అహింసామార్గము అవలంబించడం ఇవి ధర్మమార్గమాలు. వీటిని అవలంబిస్తూ ఆకలి దప్పులను అదుపులో పెట్టుకో. నీవు సంపాదించిన బిక్ష ముందు దేవతలకు సమర్పించి తరువాత అతిథులకు పెట్టి తరువాత నీవు భుజించు. పంజరంలో పిట్టలా శరీరంలో ఉన్న జీవుడిని మరిచి నీ ఇచ్ఛ వచ్చిన రీతిలో చరించడం ధర్మము కాదు. ఒక్కోరోజు గడిచే కొద్దీ కొంత ఆయుస్షు లెక్కన నీ ఆయుస్షు తరుగుతూ ఉంటుంది. చివరకు మృత్యువు నిన్ను కబళిస్తుంది. ఆ విషయం ఎరుగక నిద్రావస్థలో ఉండటం నీకు ధర్మమా ! ఈ శరీరం రక్త మాంసమయం. జగతిన ఉన్న ప్రాణులన్నీ అంతే. శరీరక సుఖములకు అలవడిన మానవుడు పెద్దల మాటను పెడచెవిన పెట్టి లోకము గురించి తలపక తామనుకున్నదే నిజమని భ్రమిస్తుంటారు. శారీరక సుఖమే ప్రధానమని అనుకోవడంలో ముందుగా సుఖం ఉన్నా తరువాత ఆపద కలిగిస్తుంది. కనుక బుద్ధిమంతులు నడిచే తోవను వదిలి దుర్మార్గులు నడచు తోవను నడవడం నీకు ధర్మంకాదు. ధర్మమార్గాన నడిచే సజ్జనుల బాటలో నడుస్తూ వారి ఉపదేశములను విను. సాలెపురుగువలె నీ చుట్టూ బంధనం కలిగించుకోవడం అజ్ఞానుల లక్షణం. సంసారంలో ఇంద్రియములే జలం, కామ, క్రోధ, లోభములే మొసళ్ళు. ఆ సాగరం దాటడానికి జ్ఞానం ఒక్కటే మార్గం. మూఢునిలా కోరికలతో మనసుని తృప్తి పరుస్తూ ఉంటే నీకు తెలవకుండా మృత్యువు నిన్ను కబళిస్తుంది. నీవలా ఉండ వద్దు. బ్రాహ్మణత్వం పొందడం చాలా కష్టం. నీ పూర్వజన్మ సృకృతం వలన నీకీ జన్మ లభించింది. నీవు దానిని వృధా చేస్తున్నావు. నీవు ఇకనైనా దుష్టసాంగత్యం వదిలి త్పస్సు, ఇంద్రియ నిగ్రహం, నిశ్చలత్వం, వివేకము మొదలైన మంచి గుణములను అలవరచుకో. కుమారా ! నీవు బ్రాహ్మణ జన్మ ఎత్తింది శారీరక సుఖము అనుభవించడానికి కాదు. నియమ నిష్టలతో జీవితము గడిపి పరలోక సుఖములు అనుభవించడానికి కదా ! ఇహలోక కామ సుఖములు అనుభవించడం తన మెడకు తాను ఉరి వేసుకోవడమే కదా ! వివేకవంతులు ఆపని ఎన్నటికి చెయ్యరు. ఒక వేళ చేసినా ఆ ఉరిత్రాడు తెంచుకుని జ్ఞానమార్గంలో నడవడం అలవర్చుకోవాలి. మూర్ఖులు మాత్రమే ఈ విషయము గ్రహించ లేక ఉరిత్రాడుకు వ్రేలాడుతూ ఉంటారు. కుమారా ! శరీరంలో ప్రాణం ఉన్నంత వరకే నిన్ను భార్యాబిడ్డలు, మిత్రులు అనుగమిస్తారు. ఆ తరువాత నిన్ను మరచి పోతారు. కనుక వారితో పొద్దుపుచ్చక వైరాగ్యం అలవరుచుకుని నిన్ను నీవు తెలుసుకుని ఆత్మసాక్షార్కారం చేసుకో. ముసలితనము, మరణము పుట్టినప్పటి నుండి నిన్ను వెన్నంటుతూ ఉంటాయి. కనుక మృత్యువు నీ కొరకు వేచి ఉండక ఎప్పుడైనా కబళించ వచ్చు మంచి పనులు చేయడానికి ముహూర్తం కొరకు ఎదురుచూడ వద్దు. కుమారా ! భార్యా బిడ్డలు నీ వెంట రారు. నిన్ను శ్మశానానికి మోసుకు వెళ్ళి అక్కడ కాల్చి వారిదారిన వారు పోతారు. ఇన్ని రోజుల నుండి వెంట ఉన్న నిన్ను అనుగమించని వారి కొరకు తాపత్రయపడుతూ వల్లమాలిన మమకారం పెంచుకోవడం ఎందుకు ? కాలం ఈ లోకాన్ని అతలాకుతలం చేస్తుంది కనుక ధైర్యంతో ప్రాపంచిక విషయములను వదిలి అంతర్ముఖుడవు కా ! కుమారా ! నీవు ఈ జన్మకు ముందు ఎన్నో జన్మలు ఎత్తావు. ఆ జన్మలో భార్యా బిడ్డలు, మిత్రులు ఉన్నారు వారూ మరణించారు. అలాగే ఈ జన్మలోని వారూ మరణించే వారే ! కనుక నీవూ, నీ భార్యా బిడ్డలు, బంధు మిత్రులు నిరంతరం పుడ్తూ చస్తూనే ఉంటారు. ఈ సత్యం తెలుసుకో . వివేక వంతులు" నేను ఎవరిని ? ఎవరి వాడను ? ఎక్కడ నుండి వచ్చాను ? ఎక్కడకు పోతాను ? పుట్టక పూర్వము ఎవరి వాడనో తెలియదు. మరణించిన తరువాత ఎవరి వాడనో తెలియదు. ఎక్కడ నుండి వచ్చానో తెలియదు. ఎక్కడకు పోతానో తెలియదు. అని తలచిన నీకిక బంధనాలు ఉండవు. కష్టాలు భార్యమీద వ్యామోహంతో మొదలై పరలోకం వరకు వెన్నంటి ఉంటాయి. కనుక వివేకవంతులు భార్యా వ్యామోహంలో పడరు. అనుభవించకుండా, దానం చెయ్యకుండా దాచుకున్న ధనం ఎందుకు ? ఇంద్రియములను జయించలేని ధనం, దర్పం ఎందుకు. ధర్మప్రవర్తన లేని వేదాధ్యనం లేని శాస్త్రవిజ్ఞానం నిష్ప్రయోజనం. ఇంద్రియములను జయించ లేని ఆత్మ దర్శనం ఎందుకు. కనుక కుమారా ! సంసారం త్యజించి జితేంద్రియుడవు కమ్ము " అని ఉపదేశించాడు. ధర్మనందనా ! ఇలా తండ్రి వలన బోధింపబడిన వాడై శుకుడు వైరాగ్యం పొందాడు " అని భీష్ముడు చెప్పాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: