1, ఆగస్టు 2023, మంగళవారం

దేవుడు ఒకడు

 నిత్యాన్వేషణ:


దేవుడు ఒకడు అని తన అద్వైత తత్వశాస్త్రం చెప్పినప్పటికీ ఆది శంకరాచార్యులు వివిధ దేవతల గురించి శ్లోకాలు ఎందుకు రాశారు?



నాకు వీలైనంత చెబుతాను.

ఆది శంకరాచార్యులు చెప్పింది ఇది.


"బ్రహ్మ సత్యం జగన్మిథ్యా, జీవో బ్రహ్మైవ నాపరః".


బ్రహ్మము అన్నదే సత్యం. జగత్తు ఒక మిథ్య. జీవుడికి బ్రహ్మానికి వ్యత్యాసం లేదు. రెండున్నూ ఒకటే.

ఆయన చెప్పింది ఇది. దేవుడు ఒకడని కాదు.

బ్రహ్మం అంటే ఏంటి ? - ఇదొక పెద్ద ప్రశ్న. ఉపనిషత్తులలో సమాధానం దొరుకుతుంది. ఉపనిషత్తులకు ఆది శంకరులు వ్యాఖ్యానం వ్రాశారు.

స్థూలంగా - అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ప్రపంచంలో అన్నింటిని నడిపించే ఒక మూలకారణం.

ప్రతి మనిషి తన మెదడుకు లోబడి నడుచుకుంటాడు. అలా కాక మెదడు, ఆలోచనలు కేవలం పనిముట్లుగా ఉపయోగింపబడే స్థితికి ఎవరైనా చేరుకోగలరా? ఆ స్థితికి చేరుకోగలిగితే దుఃఖము, కోపము, ద్వేషము, అలజడి - ఇత్యాది మనోవికారాలు ఏవీ ఉండవు. ద్వైధీభావరహిత స్థితి.

ఆ స్థితిలోని వ్యక్తి సచ్చిదానంద స్వరూపుడు గా ఉంటాడు. అలాంటి స్థితి బ్రహ్మం. ఆ స్థితి పొందిన జీవుడికి, ఆతడి స్థితికి మధ్య ద్వైధీభావాలు ఉండవు.అదే "జీవో బ్రహ్మైవ న అపరః" అన్న మాటకు అర్థం.

ఆ స్థితియే సత్యం. మిగిలిన జగత్తు మిథ్య. జగత్తు మిథ్య - అంటే కనిపించే వ్యావహారిక ప్రపంచం కాదు. మానసిక ప్రపంచం. జగత్తు మిథ్య అంటే మనస్సులో ఉద్భవించే కామక్రోధలోభమోహాదులు, డబ్బు సంపాదన, పేరుకై వెంపర్లాటలు వగైరా వగైరా. ఇవన్నీ పరమ వ్యర్థం. ఆ స్థితికై యోగ అని, తంత్ర అని, భక్తి అని, ధ్యానం అని ఏవేవో పద్ధతుల ద్వారా సాధారణ మానవుడు ప్రయత్నిస్తూ, తనకు ఏది నప్పుతుందో తెలుసుకుంటూ, అంతర్ముఖుడవాలని మహనీయుల ఉవాచ.

ఇందాక చెప్పినట్టు బ్రహ్మం అనే తత్వానికి ఎంతో అందమైన అర్థాలు ఉన్నాయి. ఈశావాస్యోపనిషత్ లో ఈ శ్లోకం చూడండి.

*తదేజతి తన్నైజతి త్ద్దూరే తద్వంతికే౹*

*తదంతరస్య సర్వస్య తద్ సర్వస్యాస్య బాహ్యతః॥*


అన్నిటికి మూలకారణం అన్నది -

అది కదులుతుంది. అది కదలదు కూడాను. అది సమీపంలో ఉంది, కానీ చాలా దూరం. అది అంతటా వ్యాపించింది. అది మనలో ఉంది, మనకు బయటా ఉన్నది.


ప్రశ్నోపనిషత్ లో కూడా చక్కని వివరణను ఓ కథ ద్వారా చెప్పారు.

ఈ విషయాలు తనంతట తానుగా తెలుసుకోగలిగి ఆ మార్గంలో వెళ్ళేవాడు ఉత్తమాధికారి. గురువు ప్రోద్బలంలో నడిచే వాడు మధ్యమాధికారి. అర్చనలు, పూజలు కర్మకాండల ద్వారా మొదలు పెట్టి ఎదిగేవాడు అధమాధికారి. (ఇవి స్థాయీభేదాలు. అధమా అంటే నీచం అని ఉత్తమం అంటే ఉన్నతం అని కాదు.)

ఆ క్రమంలో భాగంగా దేవతారాధన, అన్ని జీవాలలో, అంతటా ఒక బలీయమైన శక్తిని, ఓ మూలకారణాన్ని చూడమని అధమాధికారి అయిన సాధారణ మానవుడికి ఉపదేశిస్తూ, అనేక దేవతలను ఉపాసించే క్రమాన ఆయా దేవతల స్తోత్రాలను శంకరులు రూపొందించారు. విజ్ఞుడు, విరాగి, లౌకిక వ్యవహారాలు పట్టించుకోని వాడు ఎలానూ పూజలు గట్రా చేసుకుంటూ ఉన్న స్థితి దాటి ఇంకేదో వెతుకుతూ పోతాడు.

**

ఇది నా అవగాహన. అయితే ఆదిశంకరుల స్తోత్రాల్లో అపూర్వమైన భావనాబలం, ఆర్తి, సౌందర్యభావనలు కనిపిస్తాయి. పూర్తిగా భక్తి గట్రా లేని (నా బోంట్లు) వారు కూడా ఆ స్తోత్రాలు కూడా ఆస్వాదించవచ్చు.

***

కామెంట్‌లు లేవు: