5, మార్చి 2021, శుక్రవారం

కాశీలో ద్వాదశ (12) సూర్య దేవాలయాలు

 🙏:కాశీలో ద్వాదశ (12)  సూర్య దేవాలయాలు 🙏


దేశం మొత్తం మీద సుమారు పది దాకా ఆలయాలలో మాత్రమే మూల విరాట్టుగా పూజలు అందుకొనే శ్రీ సూర్య నారాయణ స్వామి, కాశీలో ఏకంగా పన్నెండు ఆలయాలలో కొలువై ఉండటం ప్రత్యేకంగా పేర్కొనాలి. 


1) కేశవాదిత్యుడు: ఆదిత్యుడు ఈ క్షేత్రంలో విష్ణుమూర్తిని (కేశవుడు) గురువుగా స్వీకరించి, తపమాచరించి శివానుగ్రహం పొందాడు. అందుకే ఈయన కేశవాదిత్యుడు. శ్రీ ఆది కేశవ స్వామి ఆలయంలో (రాజ్ ఘాట్ ఫోర్ట్ దగ్గర ---> రాజ్ ఘాట్ వేరు... రాజా ఘాట్ వేరు. గమనించ గలరు..) కొలువైన ఈ ఆదిత్యుని సేవిస్తే సద్గురు కృప లభిస్తుంది. విష్ణుమూర్తి కాశీకి వచ్చి, మొదటగా నివాసం ఏర్పరచుకున్న స్థలం ఈ ఆదికేశవాలయం. కాబట్టి ఈ ఆలయాన్ని ప్రతివారు తప్పక దర్శనం చేయాలి.


2) మయుఖాదిత్యుడు: సూర్య భగవానుడు ధూత్ పాప, ధర్మ నదుల సంగమ స్థానం వద్ద  వైకుంఠ వాసుని ఉపదేశం మేరకు, విశ్వనాధుని అనుగ్రహం ఆపేక్షిస్తూ మహోగ్ర తపస్సు చేయసాగాడు. ఆ తపస్సు వలన రోజురోజుకీ సూర్య కిరణాలు లోకాలు భరించలేనంతగా వేడెక్కిపోసాగాయి. సూర్య తాపాన్ని ప్రజలు తట్టుకోలేక పోయారు. గంగాధరుడు సాక్షాత్కరించి తన చల్లని హస్త స్పర్శతో ప్రచండుడిని చల్లబరిచారు. లోకాలకు ఉపశమనం కలిగించారు. నేటికీ ఈ మాయుఖాదిత్యుని విగ్రహం మీద నిరంతరం నీటి బిందువులు ఉండటం గమనించవచ్చును. ఇదే కిరణా నదీ ప్రవాహంగా మారి పంచగంగా ఘాట్ లో కలుస్తుందట. 


సూర్యుడు ప్రతిష్టించిన పరమేశ్వర లింగం గాభస్తీశ్వరుడిగా, అమ్మవారు మంగళ గౌరి గా పంచ గంగా ఘాట్ లో కొలువు తీరి ఉన్నారు. సూర్యుడు కూడా మయూఖాదిత్యునిగా మంగళ గౌరీ ఆలయంలో వెలిసాడు. ఈ స్వామిని ఆరాధించిన వారికి అనారోగ్యం దరిచేరదు. నిత్య జీవితంలోని అశాంతులు అన్నీ తొలగి పోతాయని విశ్వసిస్తారు.


3) గంగాదిత్యుడు: లలితా ఘాట్ వద్ద గల నేపాలీ మందిరం క్రింద భాగాన ఉన్న గంగాదిత్యుని కొలిచిన వారికి ఎలాంటి ధననష్టం ఉండదని అపమృత్యు భయం ఉండదని చెప్తారు.


4) అరుణాదిత్యుడు: గంగ ఒడ్డున సూర్యుని సహాయం కోరి తపస్సు ఆరంభించాడు ఊరువులు లేకుండా జన్మించిన వినత పుత్రుడైన అనూరుడు. సంతుష్టుడైన రవి తన రధానికి సారధిగా నియమించుకున్నాడు. త్రిలోచన ఘాట్ లో, శ్రీ త్రిలోచనేశ్వర స్వామి మందిరంలో వెనక భాగాన ఉన్న శ్రీ ఆంజనేయుని  విగ్రహం క్రింద ఉన్న ఈ రూపాన్ని పూజిస్తే దారిద్య్రం దాపురించదని, సంపూర్ణ ఆరోగ్యంతో కూడిన పరిపూర్ణ జీవితం సంప్రాప్తిస్తుందని చెప్తారు. 


5) ఖగోళాదిత్యుడు: కద్రువ వద్ద దాస్యం తొలగిన తరువాత, వినత గరుత్మంతునితో కలిసి కాశీ చేరుకొని, తన తప్పులకు పరిష్కారం చేసుకోడానికి సూర్య భగవానుని ఖగోళాదిత్యుని రూపంలో కొలవసాగింది. శుభకరుడు సంతసించి ఆమె కుమారులు లోక పూజ్యులు అవుతారని ఆశీర్వదించాడు. మచ్చోదరి ప్రాంతంలోని శ్రీ కామేశ్వర స్వామి మందిరంలోని ఖగోళాదిత్యుని ఆరాధించిన భక్తుల సంతానం, జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకొంటారని  చెప్తారు. 


6) లోలార్కాదిత్యుడు: తులసీ ఘాట్ వద్ద, అసి మరియు గంగా సంగమ తీరంలో లోలార్క కుండం పక్కన కొలువుతీరి ఉంటారు లోలార్కాదిత్యుడు. నదీ సంగమ జలం అంతర్వాహినిగా కుండం లోనికి చేరుకుంటుంది. కుండంలో స్నానం ఆచరించి స్వామిని సేవించిన వారి కోర్కెలు శీఘ్రంగా నెరవేరతాయని చెప్తారు.

 

7) సాంబాదిత్యుడు: నారదుని కారణంగా తండ్రి శాపానికి గురి అయ్యి కుష్ఠురోగం బారిన పడతాడు శ్రీకృష్ణ జాంబవతుల తనయుడైన సాంబుడు. తర్వాత కృష్ణుడి సలహా మేరకు కాశీ చేరి, విశ్వేశ్వరునితో పాటు, సూర్యనారాయణ స్వామిని కూడా నియమంగా ఆరాధిస్తాడు. ప్రభాకరుని కృపతో కుష్టు రోగం తొలగిపోతుంది. సూర్య కుండం (సూరజ్ కుండ్) వద్ద ఉన్న ఈ ఆదిత్యుని ప్రార్ధించిన భక్తులు దీర్ఘ వ్యాధుల నుండి ఉపశమనం పొందుతారట. 


8 .ద్రౌపది ఆదిత్యుడు: శ్రీ కృష్ణుని సలహా మేరకు ద్రౌపది గంగా తీరాన సూర్య భగవానుని ధ్యానించింది. అభిమానంతో సూర్యుడు ఆమెకు అక్షయ పాత్ర అనుగ్రహించాడు. ఈ ద్రౌపది ఆదిత్యుని కొలిచిన వారి ఇంట ఐశ్వర్యానికి అంతు ఉండదని గ్రంధాలు తెలియజేస్తున్నాయి. అన్నపూర్ణాదేవి ఆలయం మరియు విశ్వేశ్వర స్వామి ఆలయాల మధ్యలో ఒక ఆంజనేయ స్వామి మందిరం ఉంటుంది. అక్కడ ఒక పక్కగా ఈ స్వామి కనపడతారు.


9) ఉత్తరార్క ఆదిత్యుడు: జాతక రీత్యా ఉన్న దోషం కారణంగా చిన్నతనం లోనే తల్లితండ్రులను పోగొట్టుకొన్నది సులక్షణ. నియమంగా గంగా తీరాన సుర్యారాధన చేస్తుండేది. ఆమెతో పాటు ఒక మేక కూడా రోజంతా ఏమీ తినకుండా అలా అక్కడే ఉండేది. కొంత కాలానికి ఆమె దీక్షకు మెచ్చిన ఆది దంపతులు దర్శనమిచ్చి వరం కోరుకోమన్నారు. సులక్షణ, శివ పార్వతులకు మొక్కి తనకు బదులుగా ఆ మేకకు ఉత్తమ జన్మ ప్రసాదించమని కోరుకొన్నది. బాలిక నిస్వార్ధ బుద్దికి సంతసించిన సర్వేశ్వరుడు శాశ్వత కైలాసం ప్రసాదించాడు. మేక మరు జన్మలో కాశీ రాజుకు పుత్రికగా జన్మించినది. స్థానికంగా 'బకరీ కుండ్' అని పిలిచే కోనేరులో స్నానమాచరించి, ఉత్తరార్క ఆదిత్యుని ఆరాధించిన వారికి ఇహ పర సుఖాలు లభిస్తాయట. వారణాశి సిటీ రైల్వే స్టేషన్ కు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలంపూర్ లో ఉంటుందీ మందిరం.


10 విమలాదిత్యుడు: అంతు తెలియని చర్మ వ్యాధితో బాధ పడుతున్న విమలుడు అనే బ్రాహ్మణుడు కాశీ వచ్చి అచంచల భక్తి శ్రద్దలతో దినకరుని ప్రార్ధించసాగాడు. స్వామి అనుగ్రహంతో అతని వ్యాధి సంపూర్ణంగా నిర్మూలించబడినది. విమలుడుకి ఆరోగ్యం ప్రసాదించిన స్వామిని విమలాదిత్యుడు అని పిలుస్తారు. ఖారీకువా గల్లీ (జంగంబారి)లో ఉండే విమలాదిత్యుని సేవించిన వారిని అనారోగ్య బాధలు దరి చేరవని చెప్తారు. 


11) వృద్దాదిత్యుడు: హరితుడు అనే వ్యక్తి నిరంతరం ధ్యానంలో ఉంటూ అనేక దివ్యానుభూతులు అనుభవించేవాడు. జీవులకు సహజమైన వార్ధక్యం కారణంగా గతంలో మాదిరి ధ్యానం చేయలేక ఆదిత్యుని అర్ధించాడు. స్వామి కృపతో పునః యవ్వనాన్ని పొందాడు. శ్రీ కాశీ విశాలాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్ళే దారిలో కుడి వైపుకు తిరిగితే (కనుక్కుంటూ వెళ్ళాలి) అక్కడ పెద్ద హనుమాన్ మందిరం ఉంటుంది. అక్కడ చిన్న గదిలాంటి మందిరంలో ఉన్న వృద్ద ఆదిత్యుని పూజించిన వారికి వృద్దాప్య బాధలు ఉండవని చెప్తారు. 


 12) యమాదిత్యుడు: సూర్యుని పుత్రుడైన యమధర్మరాజు, తండ్రి ఆనతి మేరకు శ్రీ విశ్వేశ్వరుని దర్శనం కొరకు గంగా తీరాన తపస్సు చేసాడు. దర్శన భాగ్యం పొందాడు. యముడు ప్రతిష్టించిన శ్రీ యమేశ్వర స్వామిని, యమాదిత్యుని నిశ్చల భక్తితో వేడుకొంటే, శాశ్వత స్వర్గ ప్రాప్తి లభిస్తుంది అని కాశీ ఖండం తెలుపుతోంది. సింధియా ఘాట్ లోని సంకట దేవి ఆలయం సమీపంలో యమాదిత్యుడు కొలువై ఉన్నాడు                       .🙏శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర పీఠం🙏    ch భాస్కర శర్మ

భారతీయులు వ్రాసిన శాస్త్రాలు..

 ➖➖➖➖➖➖➖➖➖➖

*మన పురాతన భారతీయులు వ్రాసిన శాస్త్రాలు..*

➖➖➖➖➖➖➖➖➖➖

★నేడు అమలులోలేని మనకు తెలియని మన పూర్వీకులు మనకందించిన అపూర్వగ్రంథ శాస్త్ర రాజములు:

నేటి భారతీయులకు ఎంతమందికి తెలుసు మన పూర్వీకుల ఈ విజ్ఞాన సంపద?

క్రింది మన పురాతన భారతీయులు వ్రాసిన శాస్త్రాలు చూస్తుంటే నేడు మనకు ఇవి ఎలా అందకుండాపోయాయా? అని ఆశ్చర్యం కలుగక మానదు.


*1.అక్షరలక్ష:*

ఈ గ్రంథం ఒక ఎన్సైక్లోపీడియా గ్రంథము.రచయిత వాల్మీకి మహర్షి.రేఖాగణితం,బీజగణితం,త్రికోణమితి,భౌతిక గణితశాస్త్రం మొదలైన 325 రకాల గణితప్రక్రియలు, ఖనిజశాస్త్రం,భూగర్భశాస్త్రం,జలయంత్ర శాస్త్రం,గాలి,విద్యుత్,ఉష్ణం లను కొలిచే పద్దతులు మొదలైన ఎన్నో విషయాలు ఇందులో తెల్పబడ్డాయి.


*2.శబ్దశాస్త్రం:*

రచయిత ఖండిక ఋషి.సృష్టిలోని అన్ని రకాల ధ్వనులను,ప్రతిధ్వనులను ఇది చర్చించింది.ఇందులోని ఐదు అధ్యాయాలలో కృత్రిమంగా శబ్దాలను సృష్టించడం,వాటి పిచ్(స్థాయి),వేగాలను కొలవడం వివరించారు.


*3.శిల్పశాస్త్రం:*

రచయిత కశ్యపముని. ఇందులో 22 అధ్యాయాలు ఉన్నాయి.307 రకాల శిల్పాల గురించి,101 రకాల విగ్రహాలతో కలిపి సంపూర్ణంగా చర్చించారు.గుళ్ళు,రాజభవనాలు,చావడులు మొదలైన నిర్మాణవిషయాలు 1000కి పైబడి ఉన్నాయి.ఇదే శాస్త్రం పై విశ్వామిత్రుడు,

మయుడు,మారుతి మొదలగు ఋషులు చెప్పిన విషయాలు కూడా ఇందులో చర్చింపబడ్డాయి.


*4.సూపశాస్త్రం:* 

రచయిత సుకేశుడు.ఇది పాకశాస్త్రం.ఊరగాయలు,పిండివంటలు

,తీపిపదార్థాలు,108 రకాల వ్యంజనాలు మొదలగు అనేకరకాల వంటకాల గురించి,ప్రపంచవ్యాప్తంగా ఆ కాలం లో వాడుకలో ఉన్న 3032 రకాల పదార్థాల తయారీ గురించి చెప్పబడింది.


*5.మాలినీ శాస్త్రం:*

 రచయిత ఋష్యశృంగ ముని.పూలమాలలను తయారుచేయడం,పూలగుత్తులు,పూలతో రకరకాల శిరోఅలంకరణలు,రహస్యభాషలో పూవులరేకుల పైన ప్రేమసందేశాలు పంపడం లాంటి అనేక విషయాలు 16 అధ్యాయాలలో వివరింపబడ్డాయి.


*6.ధాతుశాస్త్రం:* 

రచయిత అశ్వినీకుమార.సహ

జ,కృత్రిమ లోహాలను గురించి 7 అధ్యాయాలలో కూలంకుషంగా వివరించారు.మిశ్

రలోహాలు,లోహాలను మార్చడం,రాగిని బంగారంగా మార్చడం మొదలగునవి వివరించారు.


*7.విషశాస్త్రం:* 

రచయిత అశ్వినీకుమార.32 రకాల విషాలు,వాటి గుణాలు,ప్రభావాలు,విరుగుడులు మొదలైన విషయాలు చెప్పారు.


*8.చిత్రకర్మశాస్త్రం(చిత్రలేఖనశాస్త్రం):* 

రచయిత భీముడు.ఇందులో 12 అధ్యాయాలు ఉన్నాయి.సుమారు 200 రకాల చిత్రలేఖన ప్రక్రియల గురించి చెప్పారు.ఒక వ్యక్తి తలవెంట్రుకలను గాని,గోటిని కాని,ఎముకను కాని చూసి ఆ వ్యక్తి బొమ్మను గీసే ప్రక్రియ చెప్పబడింది.


*9.మల్లశాస్త్రం:* 

రచయిత మల్లుడు. వ్యాయామాలు,ఆటలు,వట్టిచేతులతో చేసే 24 రకాల విద్యలు చెప్పబడ్డాయి.


*10.రత్నపరీక్ష:* రచయిత వాత్సాయన ఋషి.రత్నాలు కల్గిఉన్న 24 లక్షణాలు చెప్పబడ్డాయి.వీటిశుద్దతను పరీక్షించడానికి 32 పద్దతులు చెప్పబడ్డాయి.రూ

పం,బరువు మొదలగు తరగతులుగా విభజించి తర్కించారు.


*11.మహేంద్రజాల శాస్త్రం:* సుబ్రహ్మణ్యస్వామి  స్వామి శిష్యుడైన వీరబాహువు రచయిత.నీటిపై నడవడం,గాలిలో తేలడం వంటి మొదలైన భ్రమలను కల్పించే గారడిలను ఇది నేర్పుతుంది.


*12.అర్థశాస్త్రం:*

రచయిత వ్యాసుడు.ఇందులో భాగాలు 3.ధర్మబద్ధమైన 82 ధనసంపాదనా విధానాలు ఇందులో వివరించారు.


*13.శక్తితంత్రం:*

 రచయిత అగస్త్యముని.ప్ర

కృతి,సూర్యుడు,చంద్రుడు,గాలి,అగ్ని మొదలైన 64 రకాల బాహ్యశక్తులు,వాటి ప్రత్యేక వినియోగాలు చెప్పబడ్డాయి.అణువిచ్చేదనం ఇందులోని భాగమే.

*14.సౌధామినీకళ:*

రచయిత మతంగ ఋషి.నీడల ద్వారా,ఆలోచనల ద్వారా అన్ని కంటికి కనపడే విషయాలను ఆకర్షించే విధానం చెప్పభదింది.భూమి మరియు పర్వతాల లోపలిభాగాల ఛాయాచిత్రాలను తీసే ప్రక్రియ చెప్పబడింది.


*15.మేఘశాస్త్రం:* 

రచయిత అత్రిముని.12 రకాల మేఘాలు,12 రకాల వర్షాలు,64 రకాల మెరుపులు,33 రకాల పిడుగులు వాటి లక్షణాల గురించి చెప్పబడింది.


*16.స్థాపత్యవిద్య:* 

అదర్వణవేదం లోనిది. ఇంజనీ రింగ్,ఆర్కిటెక్చర్,కట్టడాలు,నగరప్రణాలిక మొదలైన సమస్త నిర్మాణ విషయాలు ఇందులో ఉన్నాయి.

ఇంకా భగవాన్ కార్తికేయ విరచిత కాలశాస్త్రం,సామ

ుద్రిక శాస్త్రం,అగ్నివర్మ విరచిత అశ్వశాస్త్రం,కుమారస్వామి రచించిన గజశాస్త్రం,భరద్వాజ ఋషి రచించిన యంత్రశాస్త్రం మొదలగునవి ,ఆయుర్వేదం,ధనుర్వేదం,గాంధర్వవేదం మొదలగు ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి.

నేటి భారతీయులకు ఎంతమందికి తెలుసు మన పూర్వీకుల ఈ విజ్ఞాన సంపద?

వీటిలో చాలా వరకు నేడు అందుబాటులో లేవు​.

             🍃🌷🤗🌷🍃

అదిగదిగో రాయితీ... అందాల ఓ సతి!

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

*నాకు నచ్చిన శ్రీమతి శశికళ ఓలేటి గారి కథ* 

              🌷🌷🌷

అదిగదిగో రాయితీ... అందాల ఓ సతి! 


( చిట్టి మందారం...కొత్తకథ)


ఉమ్మడి కుటుంబం లో... పెద్దగా సయోధ్య లేని ఆ ఐదుగురు తోడికోడళ్ళను... కలిపి ఉంచే... ఒకే ఒక అభిరుచి... షాపింగ్ ! 

ఇంచుమించు ప్రతి నెల మొదటి వారం ...తమ మగమహారాజుల జేబూలు.. జీతాలతో నిండడమేమిటి...ఈ అమ్మలక్కలు ఐదుగురూ., ఒక శుభమధ్యాహ్నం ... వారం-వర్జ్యం చూసుకుని మరీ..తమ మామగారి కారు లోనో...

 లేదా ఓ రెండు ఆటోలు మాట్లాడుకునో... జగదాంబ జంక్షన్ కు ...షాపింగ్ కోసం బయలుదేరుతారు! 


దానికి ముందే.. ఈనాడు పేపర్ లో... సిటీ ఎడిషన్ ఎదురుగా పరుచుకుని ...ఏషాపులో  ఏ విధమైన రాయితీలు... డిస్కౌంట్లు ప్రకటించారో.. ఎంత ప్రకటించారో... ఇత్యాదివి చూసుకొని ...మరీ బయలుదేరుతారు! 


ఆ నగరంలో ...ఆ ఒక్క ఇంట్లోనే ఐదుగురు ఉంటే... మొత్తంనగరం లో అలాంటి షాపింగ్ శిరోమణులు మరి ఇంకెంతమంది  ఉండాలో కదా ! 


వీరంతా ప్రతి మధ్యాహ్నం... 12 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ...ఆ  వ్యాపార సముదాయాలను ...వెలుగులతో నింపి... ఖాళీ అయిన పర్సులు ..బరువైన  బ్యాగులు మోసుకుంటూ... ఇళ్లకు చేరుతారు ఏ అర్ధరాత్రో! 


ఆ మర్నాడు ఉదయమే... మళ్ళీ., వారి సున్నితమైన మనసులను పాడుచేస్తూ...అన్ని టీవీ ఛానల్స్ లో... సర్వాంతర్యామి ...సర్వవ్యాపి ..లాగా ..ఫలానా సవితా జువెలరీ సేటు ఒకాయన..." బంగారం నాణ్యత చూసుకోండి... మోసపోకండి.. మాషాపులోనే కనుక్కోండి... తరుగు తక్కువ ..మెరుగు .. ఎక్కువ. మా ఆడపడుచుల కోసం మజూరీని రద్దు చేసాము ...రండి బాబు రండి!"... అంటూ మెస్మరైజింగ్ గా...పిలుస్తూ ఉంటే.. నాగస్వరం విన్న నాగుపాము ల్లాగా ... మారిపోతారు మహిళా లోకం!


...తమ ఇళ్ళల్లో ఉన్న పాత బంగారాలు ..విరిగిపోయిన ,నల్ల పడిపోయిన ...పిల్లలగొలుసులు ,మురుగులు ...ఇంట్లో భర్త గారి మండ చెయిను ...ఉంగరాలు, బొంగరాలు...అత్తగారి అరిగిపోయిన దుద్దులు ...పెరిగిపోయిన నానుతాడు...చంటి పిల్లాడి మొలతాడు తో సహా... సమస్తం... లాక్కుని.. పీకేసుకుని ...ఉదయం 10

 గంటలు కొట్టేటప్పటి కల్లా .... భోజనం కేరేజీల తో సహ వచ్చేసి...సవిత జువెలరీ కొట్టు ముందు... షట్టర్లు తెరవమని ...సెక్యూరిటీతో వాదిస్తూ తోసుకుంటూ ...కుమ్ము కుంటూ..  ...అక్కడే టెంట్లు వేసుకుని కూర్చుంటారు! ఈ దృశ్యం ఏ పట్టణంలో నైనా నగరంలోనైనా  సర్వసాధారణం!  ఆ ఆవరణొక ఆభరణ మహిళా తోరణం! 

 


ఇంతలో ... తెలుగు రాష్ట్రాలలో...చారుమతీ దేవి కథలో చెప్పినట్టు... స్త్రీలందరూ ఎంతగానో ఎదురు చూసేటటువంటి... వరలక్ష్మీ వ్రతం... శ్రావణ మాసంలో.. రానే వచ్చింది!  ఇహ చూడాలి మన  కాంతామణులందరి  హడావిడి ...ఆత్రుత! 


మన ఐదుగురు తోటి కోడళ్ళు వీరికి భిన్నం ఏమాత్రం కాదు! కానీ వీరి ముందు..  పాపం వీరి షాపింగ్ వినిమయ నియంత్రణకై... అనేక అడ్డంకులు! 😞!  


మొట్టమొదటి సవాలు.... బడ్జెట్! అవసరం ఉన్నా లేకపోయినా ...అయినదానికి కానిదానికి .. డిస్కౌంట్ సేల్.. అంటూ పరిగెట్టి ..   అడ్డమైన సరుకు ఖరీదు చేస్తున్నారని ...వీరి భర్తలకు ...అత్తమామలకు.. వీరిపై చాలా గుర్రుగా ఉంది ! వీరి కొనుగోళ్ల జోరుకు ఆనకట్ట వేస్తూ ...ముందు వీరి షాపింగ్ కొరకై కేటాయించే ...బడ్జెట్ మీద కోత విధించి తీరాలని తీవ్ర నిర్ణయం తీసుకున్నారు  వారు! 


    ఈ అన్యాయాన్ని తీవ్రంగా నిరసిస్తూ...సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించి నప్పటికీ లొంగనందువలన ...తక్షణ కర్తవ్యం ఆలోచించి కార్యోన్ముఖులు అవ్వడం కోసం.... ఐదుగురు కోడళ్ళు ...డాబా మీదకు చేరారు! ఆ సమాలోచన లో భాగంగా...


" చీరకు 5000/- ఇచ్చాడు అక్కయ్యా మా ఆయన!  దానితో పట్టుచీర కాదు కదా పట్టురుమాలు...కూడా రాదు ! అందుకే పొమ్మన బ్రదర్స్ లో ..80% డిస్కౌంట్ ఇస్తున్నారు కదా... ఈసారికి అక్కడే కొనేసుకుందామని అనుకుంటున్నాను "..అంది..అందరిలోకి చిన్న కోడలు కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకుని! 


" అరే పిచ్చి మొహమా! తొందర పడిపోకు! లక్ష రూపాయల దాకా సంపాదించే మార్గం నా దగ్గర ఒకటుంది ".. అంది పెద్ద తోటి కోడలు...! ఆమె కన్నీరు తుడుస్తూ 


" ఎంతైనా సీనియర్స్ సీనియర్సే!  చెప్పక్కా చెప్పు!".. అంటూ మిగిలిన అందరూ ప్రాణాలు లేచొచ్చి.. ముక్తకంఠంతో అరిచారు! 


" ఏం లేదర్రా ! మన ఇంట్లో మగవారివి.  వాడని వాచీలు, బెల్టులు , బ్రీఫ్ కేస్ లు..బూట్లూ, సూట్లు ,పర్సులూ, కెమెరాలు, పాత కంప్యూటర్లు , సెల్ ఫోన్లు...అన్నీ కూడా ...ఓఎల్ఎక్స్ లో గప్ చుప్ గా పెట్టేద్దాం !ఎవరో ఒకళ్ళు కొనడానికి రాకపోరు!".... ఆవిడ ఐడియా చెప్పగానే... మిగిలిన వారందరికీ మరింత హుషారు వచ్చింది! 


" కార్ షెడ్ లో పడేసిన యాంటిక్ ఫర్నిచర్ అమ్మేద్దాం అక్కా...!..అంది రెండో ఆవిడ! 


" మన పాత పట్టుచీరలు  అమ్ముదాం"


" ఆడపిల్లల గాగ్రాలు ..మగ పిల్లల పాత సైకిళ్ళు అమ్మేద్దాం".... 


"చంటి పిల్లల బొమ్మలు అమ్మేద్దాం"...అనుకుంటూ...ఈ విధంగా.. ఇంట్లో ప్రస్తుతం ఏవేవి వాడకంలో లేవో ..అవన్నీ కూడా అమ్మేద్దామని రహస్యంగా నిర్ణయించుకున్నారు! 


" ఈ డబ్బు మన పట్టు చీరలు కి ,వర్క్ బ్లౌజెస్ కి సరిపోతుంది ! మరి బంగారం కోసం ఏం చేద్దాం?".. అని అడిగింది నాలుగవ తోటికోడలు దిగులుగా! 


ఆఖరి తోడికోడలు సిసింద్రీ ! అందిస్తే అల్లుకు పోగలదు!   ఆమె అందుకుని..." మీరంతా తిట్టనంటే.. అంటే .....నా దగ్గర ఒక బ్రహ్మాండమైన ఉపాయం ఉంది! మన పెళ్లిళ్లలో మనఅత్తారు పెట్టిన నగలన్నీ ...మోటుగా.. పాత మోడల్స్ లో.. పెట్టుకోవడానికి వీలుగా లేకుండా ఉన్నాయి!  పాత బంగారం నాణ్యం...అంటూ...మార్చకుండా మనను ఆపుతున్నారు ఇన్నాళ్ళూ!  మనం ఇంట్లో...ఎవరికీ చెప్పకుండా ..పదేసి తులాల నగలు మార్చేసి ...మంచి టెంపుల్ డిజైన్ ... తంజావూరు మోడల్సు...  రెడీమేడ్ లో కొనుక్కుందాం! వాటి గురించి అడిగితే.. అప్పటికి ఏదో ఒక కట్టుకథ చెప్పేయొచ్చు!" ... అంటూ తన సూపర్ ఐడియా వాళ్ల ముందు ఉంచింది! అందరూ సంతోషంగా సమ్మతి తెలిపారు! 


ఓఎల్ఎక్స్ లో వాళ్ళు అనుకున్న దానికంటే.. కాస్త ఎక్కువే వచ్చింది డబ్బు! పండుగ  మరొక నెలలోనే.. ఉన్నందువలన ...వెంటనే బట్టల షాపింగ్కు

కు బయలుదేరారు! 


ప్రతి చోటా మైళ్ళ పొడవున క్యూ లే !  ఆ జాతరలో ... పద్మవ్యూహాలన్నీ  ఛేదించుకుని.... పొమ్మన బ్రదర్స్ లో 80 %.. నార్త్ ఇండియా షాపింగ్ మాల్ లో.. 50% డిస్కౌంట్ తో ...తలొకరూ..రెండేసి పట్టుచీరలు  కొనుక్కుని బయట పడ్డారు! చీరల ధరలతో సరి తూగే ...ఖరీదు పెట్టి.. బ్లౌజులు డిజైన్ చేయడానికి ఇచ్చుకున్నారు! 


ఇక్ఠడ...చీరల సెలక్షన్ లో.. మీకు ఒక ముచ్చట చెప్పి తీరాలి! అక్కడ  ఏ ఒక్కరికి ...తమ సొంత ఎంపిక నచ్చదు! పక్కవారు తీసుకున్నదే... తమకు కావాలని లాగుతూ ఉంటారు! ఈమె కావాలని ..ఆమె ఇవ్వనని.. పెద్ద పోట్లాటలూ... వాగ్వివాదాలు అవుతూ ఉంటాయి! సాధించిన ఆ చీరను తీసుకోకుండానే ...చివరకు..కౌంటర్ దగ్గర ఉన్న గుట్టల్లో...పడేసి పోతారు చాలామంది! స్త్రీ సహజమైన విచిత్రమైన మానసిక పరిస్థితి అది!😃😉


పండగ వారం ఉందనగా పాత బంగారాలు పట్టుకుని సమత జ్యువెలర్స్ చేరారు ఐదుగురు! తరుగులో 60 శాతం మజూరీలో 50 శాతం రాయితీలతో బంగారం కొనబోతున్నామని ..చాలా ఉద్వేగానికి గురయ్యారు తోడికోడళ్ళు! 


 అక్కడ లోపల నున్న జన సందోహాన్ని దాటి కౌంటర్ను చేరడానికే చాలా కష్టపడాల్సి. వచ్చింది!  వీరు తెచ్చిన  పాత బంగారాలను  చూసిన సేల్స్ మన్ కు కళ్ళు జిగేల్ మని మెరిసాయి!  అది పైకి కనిపించనీకుండా... నిర్లక్ష్యం గా మొహం పెట్టి ...బంగారానికి గీటు పెట్టి ... దానిలో బంగారం 60 శాతం కన్నా లేదని ..మిగిలినదంతా రాగి  అంటూ...తీసి పడేసాడు! తన క్యాలిక్యులేటర్ లో ఏవేవో లెక్కలు వేసి ..ఇంత అమౌంట్ వస్తుంది అని చూపించాడు! 

తమ బంగారం ఖరీదు కి సరిపడా... టెంపుల్ డిజైన్  నగలు చూపించమని.. అడిగారు వీళ్ళు! 


పండుగ సీజన్లో సేల్స్  ఎక్కువగా ఉండడంతో..కొత్త డిజైన్ నగలు అన్నీ అయిపోయినట్టున్నాయి! .. ఏవో పాత మోడల్స్ లో కొన్ని నగలు తీసి చూపించాడు సేల్స్ మాన్!  వీరికి నచ్చకపోయినా... పెద్ద ఛాయిస్ లేకపోయినా.. సవిత జువెలర్స్ లో కొన్నామన్న పేరు కోసం... ఐదుగురు 5 హారాలను సెలెక్ట్ చేసుకున్నారు! ఇంతా చేసి ఒక్కో హారం నాలుగు తులాలు కూడా తూగలేదు! 


 మజూరి, తరుగు బాగా పెంచేసి... దానిమీద దొంగ రాయితీలు ఇచ్చారు వాళ్ళు ! దానితోపాటు సేల్స్ టాక్స్ అని ..వాట్ అని.. రకరకాల పన్నులు  వేసి... మొత్తం మీద ...10 తులాల పాత బంగారానికి ...నాలుగు తులాల గొలుసులు చేతిలో పెట్టారు ! డల్ గోల్డ్ లో పాత డిజైన్లలో... పేలవంగా ఉన్న ఆ హారాలు ...బంగారం బేరాలు ...తోటి కోడళ్ళకు... తీవ్రమైన అసంతృప్తిని మిగిల్చాయి! 


      మానసికంగా..భౌతికంగా ..అలిసిపోయి ,మొహాలు వ్రేలాడేసుకుని ఇంటికి చేరారు ! ఇంతలో టైలర్ దగ్గర నుండి ఫోను ! వీరు కొన్న పట్టు చీరలు ..జాకెట్ తో సహా... 5 గజాలు మాత్రమే ఉన్నాయని ...ఆ జాకెట్ కూడా 60 సెంటీమీటర్లు మాత్రమే ఉందని... జాకెట్లు కుట్టడం సాధ్యం కాదని ఆ ఫోన్ కాల్ సారాంశం! కింకర్తవ్యం.. అనుకుంటూ తలపట్టుకు కూర్చున్నారు ఐదుగురు! 


అంతకు ముందే .... వెయ్యిరూపాయలకు ఆరుచీరల స్కీమ్ లో.....”పీకే బ్రదర్స్” లో పనిమనుషుల కోసం కొన్న సింథటిక్ చీరలు .... వాళ్ళకు నచ్చక.... తమ మొహానే కొట్టి.... తలో వెయ్యిరూపాయిలూ పండుగచీర నిమిత్తం ఎత్తుకుపోవడం గుర్తుకు తెచ్చుకున్నారు!  


రాత్రి భోజనాలయ్యాక...ఐదుగురు తోటికోడళ్లూ...మరోసారి.. డాబా మీదకు చేరారు!  ఐదుగురు ..తమ చేతులు చాపి.... ఆకాశంలోకి చూస్తూ

.." దేవుడా! చచ్చినా.. ఇకమీదట ...ఆఫ్లైన్ లో కానీ ...ఆన్లైన్ లో కానీ.. డిస్కౌంట్ ల మీద... సేల్లో ...బట్టలు కానీ.. నగలు గాని ..వస్తువులు గాని కొననే కొనుము! కొంటే... గింటే.... మా పాత బంగారంషాపు “ మంగళం జువెలరీస్ “లో కానీ...”చిరుగుల బాబూరావ్ & సన్స్ “ బట్టల కొట్టులో కానీ కొనుక్కుంటాం!మా భర్తల మీద ప్రమాణం చేస్తూ... ఇదే మా ప్రతిజ్ఞ!"... అంటూ ఒట్లు వేసుకుని...దుఃఖాశృవులు తుడుచుకుంటూ... భారమైన మనసులతో....కిందకు పోయారు! 


అదిగదిగో రాయితీ...

అందాల ఓ సతి...

లేదమ్మా పరిమితి...

పోగొట్టును మీ మతి...

 వేసారును నీ పతి...

 పెరిగి పోవు భారమితి...

 దాటబోకు నీ మితి...

 ఎండమావి రాయితీ...

 వ్యాపారంలో లేదు నీతి...

 తెలుసుకోవె పడతి! ...

 పడ బోకుము గోతిలోకి!


 ధన్యవాదాలతో

 

 *ఓలేటి శశికళ*

మొగలిచెర్ల

 *సీతాలక్షమ్మ గారి సలహా..*


"ఏరా ప్రసాదూ బాగున్నావా?..పదేళ్ల తరువాత ఇప్పుడు కుదిరింది నాయనా ఈ స్వామిని దర్శించుకోవడానికి.." అంటూ సీతాలక్షమ్మ గారు నా ప్రక్కన వచ్చి కూర్చున్నారు..స్వామివారు మాలకొండలో తపస్సు చేసుకునే రోజుల్లో సీతాలక్షమ్మ గారు మా తల్లిదండ్రులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు..సీతాలక్షమ్మ గారింటి ఇలవేల్పు మాల్యాద్రి లక్ష్మీనారసింహుడు..ఆ కారణం చేత ఆవిడ భర్త తో కలిసి ఆరోజుల్లో తరచూ మాలకొండకు వచ్చేవారు..మా తల్లిదండ్రులకు కూడా మాలకొండ వద్దే సీతాలక్షమ్మ గారు, ఆవిడ భర్త లక్ష్మీనరసయ్య గారు పరిచయం అయ్యారు..మాలకొండలో ఒక యువక యోగి తపస్సు చేసుకుంటున్నాడనీ..ప్రతి వారం ఆ యోగి ని తాము కలుస్తున్నామనీ మా అమ్మగారు సీతాలక్షమ్మ గారికి చెప్పడం..ఆ దంపతులు కూడా ఆ యోగిని చూడాలని కుతూహలం చూపడం జరిగింది..ఒక శనివారం మధ్యాహ్నం మూడు గంటల వేళ, సీతాలక్షమ్మ గారి దంపతులను వెంటబెట్టుకొని..స్వామివారిని కలవడానికి మాలకొండకు ఉత్తరం వైపున దిగువున ఉన్న పార్వతీదేవి మఠం వద్దకు మా తల్లిదండ్రులు వెళ్లారు..


ఒక పది పదిహేను నిమిషాల తరువాత స్వామివారు శివాలయం పైన ఉన్న గుహల వద్దనుంచి మెల్లిగా దిగి వీళ్ళవద్దకు వచ్చారు.."శ్రీధరరావు గారూ మీతో బాటు అతిథులను కూడా తీసుకొచ్చారా?.." అని నవ్వుతూ పలకరించారు.."మీగురించి నేనే చెప్పాను నాయనా..మిమ్మల్ని కలవాలని ఆసక్తి చూపించారు..మాతోపాటు వెంట బెట్టుకొని వచ్చాము.." అని మా అమ్మగారు బదులిచ్చారు.."పర్లేదమ్మా.." అని..సీతాలక్షమ్మ దంపతుల వైపు తిరిగి.."అమ్మా..బాగున్నారా?" అని అడిగారు స్వామివారు..సీతాలక్షమ్మ గారికి గానీ..లక్ష్మీ నరసయ్య గారికి కానీ..ఏం మాట్లాడాలో తెలీని అచేతన స్థితిలో ఉండిపోయారు..స్వామివారి చల్లని చూపు వారిని కట్టిపడేసింది..మాటలు కూడబలుక్కుంటునట్లు.."బాగున్నాము స్వామీ.." అన్నారు.."మీ ఇలవేల్పు లక్ష్మీనృసింహుడి పాదాలు విడవకుండా పట్టుకోండి..మీకు ఏలోటూ లేకుండా ఆయన చూస్తాడు..సంతానం కూడా వృద్ధిలోకి వస్తుంది.." అని స్వామివారు ఆశీర్వదించారు..మరో పదినిమిషాల తరువాత అందరూ స్వామివారి వద్ద సెలవు తీసుకొని వచ్చేసారు..


ఆ తరువాత కూడా ఆ దంపతులు స్వామివారిని మాలకొండలో రెండు మూడు సార్లు కలుసుకున్నారు..స్వామివారు మొగిలిచెర్ల లో ఆశ్రమం కట్టుకుని సాధన చేసే రోజుల్లో కూడా వచ్చి వెళ్లారు..స్వామివారు కపాలమోక్షం ద్వారా సిద్ధిపొందిన విషయాన్ని మా నాన్నగారు ఉత్తరం ద్వారా ఆ దంపతులకు తెలియచేశారు..ఆ ఉత్తరం చదివిన వెంటనే మొగిలిచెర్ల వచ్చి స్వామివారి సమాధిని దర్శించుకున్నారు.."ప్రభావతీ..మీ ఇద్దరూ అదృష్టవంతులు..ఈ మహానుభావుడు కొన్నాళ్ళు మీ ఇంట్లోనే వున్నాడు..మీచేతి ఆహారం స్వీకరించాడు.." అని తరచూ చెప్పేవారు.."వీడు కూడా పెట్టి పుట్టాడు ప్రభావతీ..అంతటి యోగిపుంగవుడికి రోజూ అన్నం తీసుకెళ్లి ఇచ్చి వచ్చాడు కదా.." అని నాగురించి చెప్పేవారు..


నేను మొగిలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి మందిర బాధ్యతలు తీసుకున్న తొలినాళ్లలో..అనారోగ్యం తో ఉన్న మా నాన్నగారిని చూడటానికి సీతాలక్షమ్మ గారు భర్త తో సహా వచ్చారు..నాన్నగారిని పరామర్శించి..స్వామివారి మందిరానికి వచ్చారు..స్వామివారి సమాధిని దర్శించుకొని.."జీవితం లో ఇటువంటి అవధూతను చూడగలిగే భాగ్యం మా దంపతులకు మీ తల్లిదండ్రుల వల్ల కలిగింది..మీకు ఏ లోటూ ఉండదు అని ఆరోజు ఈ స్వామివారు చెప్పిన మాట అక్షరసత్యం నాయనా..మా పిల్లలూ సుఖంగా వున్నారు..స్వామివారు మొట్టమొదటి రోజు మమ్మల్ని చూసిన  చూపు ఇప్పటికీ మర్చిపోలేము..మీ తల్లిదండ్రుల లాగే నువ్వుకూడా స్వామివారి సేవ చేసుకుంటున్నావు..జాగ్రత్త నాయనా..ఎక్కడా అహంకరించొద్దు..ఎవ్వరినీ అమర్యాదగా చూడొద్దు..ఈ మందిరానికి వచ్చే ప్రతి భక్తుడినీ గౌరవించు..వాళ్ళు ఎంతో దూరం నుంచి వాళ్ళ బాధలు తీరుతాయనే ఆశతో ఇక్కడికి వస్తారు..నువ్వు పలికే స్వాoతన పలుకులు వాళ్లకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తాయి..అది గుర్తు పెట్టుకో.."అని నా ప్రక్కన కూర్చుని చెప్పారు.."వీలుంటే ఇక్కడ అన్నదానం జరిగే ఏర్పాటు చూడు ప్రసాదూ.." అని సలహా ఇచ్చారు.."అన్నదానం ఖర్చుతో కూడుకున్న పని..ఆలోచిస్తున్నాను.." అన్నాను.."నువ్వు ప్రారంభించు..ఆపై స్వామివారు చూసుకుంటారు..ఇప్పుడు నువ్వు చేస్తున్న పనులన్నీ నీ వల్ల జరుగుతున్నాయా..అంతా ఆయన కృప వలనే నడచిపోతున్నది..ఇదీ అంతే.." అన్నారు..


సీతాలక్షమ్మ గారు భౌతికంగా ఈరోజు లేకపోయినా..ఆవిడ చెప్పిన మాటలు నా చెవుల్లో వినబడుతూనే ఉన్నాయి..ఒక్కొక్కసారి సహనం కోల్పోయి..కొంత పరుషంగా మాట్లాడిన సందర్భాలలో..సీతాలక్షమ్మ గారి సలహా గుర్తుకొస్తుంది..ఒకరకంగా స్వామివారే ఆమెచేత ఆ పలుకులు పలికించారేమో..ఈరోజు అన్నదానం చేయగలుగుతున్నాము..చూడటానికి సీతాలక్షమ్మ గారు లేకపోయినా..ఆవిడ ఆశీస్సులు వుంటాయని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).