5, మార్చి 2021, శుక్రవారం

అదిగదిగో రాయితీ... అందాల ఓ సతి!

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

*నాకు నచ్చిన శ్రీమతి శశికళ ఓలేటి గారి కథ* 

              🌷🌷🌷

అదిగదిగో రాయితీ... అందాల ఓ సతి! 


( చిట్టి మందారం...కొత్తకథ)


ఉమ్మడి కుటుంబం లో... పెద్దగా సయోధ్య లేని ఆ ఐదుగురు తోడికోడళ్ళను... కలిపి ఉంచే... ఒకే ఒక అభిరుచి... షాపింగ్ ! 

ఇంచుమించు ప్రతి నెల మొదటి వారం ...తమ మగమహారాజుల జేబూలు.. జీతాలతో నిండడమేమిటి...ఈ అమ్మలక్కలు ఐదుగురూ., ఒక శుభమధ్యాహ్నం ... వారం-వర్జ్యం చూసుకుని మరీ..తమ మామగారి కారు లోనో...

 లేదా ఓ రెండు ఆటోలు మాట్లాడుకునో... జగదాంబ జంక్షన్ కు ...షాపింగ్ కోసం బయలుదేరుతారు! 


దానికి ముందే.. ఈనాడు పేపర్ లో... సిటీ ఎడిషన్ ఎదురుగా పరుచుకుని ...ఏషాపులో  ఏ విధమైన రాయితీలు... డిస్కౌంట్లు ప్రకటించారో.. ఎంత ప్రకటించారో... ఇత్యాదివి చూసుకొని ...మరీ బయలుదేరుతారు! 


ఆ నగరంలో ...ఆ ఒక్క ఇంట్లోనే ఐదుగురు ఉంటే... మొత్తంనగరం లో అలాంటి షాపింగ్ శిరోమణులు మరి ఇంకెంతమంది  ఉండాలో కదా ! 


వీరంతా ప్రతి మధ్యాహ్నం... 12 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ...ఆ  వ్యాపార సముదాయాలను ...వెలుగులతో నింపి... ఖాళీ అయిన పర్సులు ..బరువైన  బ్యాగులు మోసుకుంటూ... ఇళ్లకు చేరుతారు ఏ అర్ధరాత్రో! 


ఆ మర్నాడు ఉదయమే... మళ్ళీ., వారి సున్నితమైన మనసులను పాడుచేస్తూ...అన్ని టీవీ ఛానల్స్ లో... సర్వాంతర్యామి ...సర్వవ్యాపి ..లాగా ..ఫలానా సవితా జువెలరీ సేటు ఒకాయన..." బంగారం నాణ్యత చూసుకోండి... మోసపోకండి.. మాషాపులోనే కనుక్కోండి... తరుగు తక్కువ ..మెరుగు .. ఎక్కువ. మా ఆడపడుచుల కోసం మజూరీని రద్దు చేసాము ...రండి బాబు రండి!"... అంటూ మెస్మరైజింగ్ గా...పిలుస్తూ ఉంటే.. నాగస్వరం విన్న నాగుపాము ల్లాగా ... మారిపోతారు మహిళా లోకం!


...తమ ఇళ్ళల్లో ఉన్న పాత బంగారాలు ..విరిగిపోయిన ,నల్ల పడిపోయిన ...పిల్లలగొలుసులు ,మురుగులు ...ఇంట్లో భర్త గారి మండ చెయిను ...ఉంగరాలు, బొంగరాలు...అత్తగారి అరిగిపోయిన దుద్దులు ...పెరిగిపోయిన నానుతాడు...చంటి పిల్లాడి మొలతాడు తో సహా... సమస్తం... లాక్కుని.. పీకేసుకుని ...ఉదయం 10

 గంటలు కొట్టేటప్పటి కల్లా .... భోజనం కేరేజీల తో సహ వచ్చేసి...సవిత జువెలరీ కొట్టు ముందు... షట్టర్లు తెరవమని ...సెక్యూరిటీతో వాదిస్తూ తోసుకుంటూ ...కుమ్ము కుంటూ..  ...అక్కడే టెంట్లు వేసుకుని కూర్చుంటారు! ఈ దృశ్యం ఏ పట్టణంలో నైనా నగరంలోనైనా  సర్వసాధారణం!  ఆ ఆవరణొక ఆభరణ మహిళా తోరణం! 

 


ఇంతలో ... తెలుగు రాష్ట్రాలలో...చారుమతీ దేవి కథలో చెప్పినట్టు... స్త్రీలందరూ ఎంతగానో ఎదురు చూసేటటువంటి... వరలక్ష్మీ వ్రతం... శ్రావణ మాసంలో.. రానే వచ్చింది!  ఇహ చూడాలి మన  కాంతామణులందరి  హడావిడి ...ఆత్రుత! 


మన ఐదుగురు తోటి కోడళ్ళు వీరికి భిన్నం ఏమాత్రం కాదు! కానీ వీరి ముందు..  పాపం వీరి షాపింగ్ వినిమయ నియంత్రణకై... అనేక అడ్డంకులు! 😞!  


మొట్టమొదటి సవాలు.... బడ్జెట్! అవసరం ఉన్నా లేకపోయినా ...అయినదానికి కానిదానికి .. డిస్కౌంట్ సేల్.. అంటూ పరిగెట్టి ..   అడ్డమైన సరుకు ఖరీదు చేస్తున్నారని ...వీరి భర్తలకు ...అత్తమామలకు.. వీరిపై చాలా గుర్రుగా ఉంది ! వీరి కొనుగోళ్ల జోరుకు ఆనకట్ట వేస్తూ ...ముందు వీరి షాపింగ్ కొరకై కేటాయించే ...బడ్జెట్ మీద కోత విధించి తీరాలని తీవ్ర నిర్ణయం తీసుకున్నారు  వారు! 


    ఈ అన్యాయాన్ని తీవ్రంగా నిరసిస్తూ...సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించి నప్పటికీ లొంగనందువలన ...తక్షణ కర్తవ్యం ఆలోచించి కార్యోన్ముఖులు అవ్వడం కోసం.... ఐదుగురు కోడళ్ళు ...డాబా మీదకు చేరారు! ఆ సమాలోచన లో భాగంగా...


" చీరకు 5000/- ఇచ్చాడు అక్కయ్యా మా ఆయన!  దానితో పట్టుచీర కాదు కదా పట్టురుమాలు...కూడా రాదు ! అందుకే పొమ్మన బ్రదర్స్ లో ..80% డిస్కౌంట్ ఇస్తున్నారు కదా... ఈసారికి అక్కడే కొనేసుకుందామని అనుకుంటున్నాను "..అంది..అందరిలోకి చిన్న కోడలు కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకుని! 


" అరే పిచ్చి మొహమా! తొందర పడిపోకు! లక్ష రూపాయల దాకా సంపాదించే మార్గం నా దగ్గర ఒకటుంది ".. అంది పెద్ద తోటి కోడలు...! ఆమె కన్నీరు తుడుస్తూ 


" ఎంతైనా సీనియర్స్ సీనియర్సే!  చెప్పక్కా చెప్పు!".. అంటూ మిగిలిన అందరూ ప్రాణాలు లేచొచ్చి.. ముక్తకంఠంతో అరిచారు! 


" ఏం లేదర్రా ! మన ఇంట్లో మగవారివి.  వాడని వాచీలు, బెల్టులు , బ్రీఫ్ కేస్ లు..బూట్లూ, సూట్లు ,పర్సులూ, కెమెరాలు, పాత కంప్యూటర్లు , సెల్ ఫోన్లు...అన్నీ కూడా ...ఓఎల్ఎక్స్ లో గప్ చుప్ గా పెట్టేద్దాం !ఎవరో ఒకళ్ళు కొనడానికి రాకపోరు!".... ఆవిడ ఐడియా చెప్పగానే... మిగిలిన వారందరికీ మరింత హుషారు వచ్చింది! 


" కార్ షెడ్ లో పడేసిన యాంటిక్ ఫర్నిచర్ అమ్మేద్దాం అక్కా...!..అంది రెండో ఆవిడ! 


" మన పాత పట్టుచీరలు  అమ్ముదాం"


" ఆడపిల్లల గాగ్రాలు ..మగ పిల్లల పాత సైకిళ్ళు అమ్మేద్దాం".... 


"చంటి పిల్లల బొమ్మలు అమ్మేద్దాం"...అనుకుంటూ...ఈ విధంగా.. ఇంట్లో ప్రస్తుతం ఏవేవి వాడకంలో లేవో ..అవన్నీ కూడా అమ్మేద్దామని రహస్యంగా నిర్ణయించుకున్నారు! 


" ఈ డబ్బు మన పట్టు చీరలు కి ,వర్క్ బ్లౌజెస్ కి సరిపోతుంది ! మరి బంగారం కోసం ఏం చేద్దాం?".. అని అడిగింది నాలుగవ తోటికోడలు దిగులుగా! 


ఆఖరి తోడికోడలు సిసింద్రీ ! అందిస్తే అల్లుకు పోగలదు!   ఆమె అందుకుని..." మీరంతా తిట్టనంటే.. అంటే .....నా దగ్గర ఒక బ్రహ్మాండమైన ఉపాయం ఉంది! మన పెళ్లిళ్లలో మనఅత్తారు పెట్టిన నగలన్నీ ...మోటుగా.. పాత మోడల్స్ లో.. పెట్టుకోవడానికి వీలుగా లేకుండా ఉన్నాయి!  పాత బంగారం నాణ్యం...అంటూ...మార్చకుండా మనను ఆపుతున్నారు ఇన్నాళ్ళూ!  మనం ఇంట్లో...ఎవరికీ చెప్పకుండా ..పదేసి తులాల నగలు మార్చేసి ...మంచి టెంపుల్ డిజైన్ ... తంజావూరు మోడల్సు...  రెడీమేడ్ లో కొనుక్కుందాం! వాటి గురించి అడిగితే.. అప్పటికి ఏదో ఒక కట్టుకథ చెప్పేయొచ్చు!" ... అంటూ తన సూపర్ ఐడియా వాళ్ల ముందు ఉంచింది! అందరూ సంతోషంగా సమ్మతి తెలిపారు! 


ఓఎల్ఎక్స్ లో వాళ్ళు అనుకున్న దానికంటే.. కాస్త ఎక్కువే వచ్చింది డబ్బు! పండుగ  మరొక నెలలోనే.. ఉన్నందువలన ...వెంటనే బట్టల షాపింగ్కు

కు బయలుదేరారు! 


ప్రతి చోటా మైళ్ళ పొడవున క్యూ లే !  ఆ జాతరలో ... పద్మవ్యూహాలన్నీ  ఛేదించుకుని.... పొమ్మన బ్రదర్స్ లో 80 %.. నార్త్ ఇండియా షాపింగ్ మాల్ లో.. 50% డిస్కౌంట్ తో ...తలొకరూ..రెండేసి పట్టుచీరలు  కొనుక్కుని బయట పడ్డారు! చీరల ధరలతో సరి తూగే ...ఖరీదు పెట్టి.. బ్లౌజులు డిజైన్ చేయడానికి ఇచ్చుకున్నారు! 


ఇక్ఠడ...చీరల సెలక్షన్ లో.. మీకు ఒక ముచ్చట చెప్పి తీరాలి! అక్కడ  ఏ ఒక్కరికి ...తమ సొంత ఎంపిక నచ్చదు! పక్కవారు తీసుకున్నదే... తమకు కావాలని లాగుతూ ఉంటారు! ఈమె కావాలని ..ఆమె ఇవ్వనని.. పెద్ద పోట్లాటలూ... వాగ్వివాదాలు అవుతూ ఉంటాయి! సాధించిన ఆ చీరను తీసుకోకుండానే ...చివరకు..కౌంటర్ దగ్గర ఉన్న గుట్టల్లో...పడేసి పోతారు చాలామంది! స్త్రీ సహజమైన విచిత్రమైన మానసిక పరిస్థితి అది!😃😉


పండగ వారం ఉందనగా పాత బంగారాలు పట్టుకుని సమత జ్యువెలర్స్ చేరారు ఐదుగురు! తరుగులో 60 శాతం మజూరీలో 50 శాతం రాయితీలతో బంగారం కొనబోతున్నామని ..చాలా ఉద్వేగానికి గురయ్యారు తోడికోడళ్ళు! 


 అక్కడ లోపల నున్న జన సందోహాన్ని దాటి కౌంటర్ను చేరడానికే చాలా కష్టపడాల్సి. వచ్చింది!  వీరు తెచ్చిన  పాత బంగారాలను  చూసిన సేల్స్ మన్ కు కళ్ళు జిగేల్ మని మెరిసాయి!  అది పైకి కనిపించనీకుండా... నిర్లక్ష్యం గా మొహం పెట్టి ...బంగారానికి గీటు పెట్టి ... దానిలో బంగారం 60 శాతం కన్నా లేదని ..మిగిలినదంతా రాగి  అంటూ...తీసి పడేసాడు! తన క్యాలిక్యులేటర్ లో ఏవేవో లెక్కలు వేసి ..ఇంత అమౌంట్ వస్తుంది అని చూపించాడు! 

తమ బంగారం ఖరీదు కి సరిపడా... టెంపుల్ డిజైన్  నగలు చూపించమని.. అడిగారు వీళ్ళు! 


పండుగ సీజన్లో సేల్స్  ఎక్కువగా ఉండడంతో..కొత్త డిజైన్ నగలు అన్నీ అయిపోయినట్టున్నాయి! .. ఏవో పాత మోడల్స్ లో కొన్ని నగలు తీసి చూపించాడు సేల్స్ మాన్!  వీరికి నచ్చకపోయినా... పెద్ద ఛాయిస్ లేకపోయినా.. సవిత జువెలర్స్ లో కొన్నామన్న పేరు కోసం... ఐదుగురు 5 హారాలను సెలెక్ట్ చేసుకున్నారు! ఇంతా చేసి ఒక్కో హారం నాలుగు తులాలు కూడా తూగలేదు! 


 మజూరి, తరుగు బాగా పెంచేసి... దానిమీద దొంగ రాయితీలు ఇచ్చారు వాళ్ళు ! దానితోపాటు సేల్స్ టాక్స్ అని ..వాట్ అని.. రకరకాల పన్నులు  వేసి... మొత్తం మీద ...10 తులాల పాత బంగారానికి ...నాలుగు తులాల గొలుసులు చేతిలో పెట్టారు ! డల్ గోల్డ్ లో పాత డిజైన్లలో... పేలవంగా ఉన్న ఆ హారాలు ...బంగారం బేరాలు ...తోటి కోడళ్ళకు... తీవ్రమైన అసంతృప్తిని మిగిల్చాయి! 


      మానసికంగా..భౌతికంగా ..అలిసిపోయి ,మొహాలు వ్రేలాడేసుకుని ఇంటికి చేరారు ! ఇంతలో టైలర్ దగ్గర నుండి ఫోను ! వీరు కొన్న పట్టు చీరలు ..జాకెట్ తో సహా... 5 గజాలు మాత్రమే ఉన్నాయని ...ఆ జాకెట్ కూడా 60 సెంటీమీటర్లు మాత్రమే ఉందని... జాకెట్లు కుట్టడం సాధ్యం కాదని ఆ ఫోన్ కాల్ సారాంశం! కింకర్తవ్యం.. అనుకుంటూ తలపట్టుకు కూర్చున్నారు ఐదుగురు! 


అంతకు ముందే .... వెయ్యిరూపాయలకు ఆరుచీరల స్కీమ్ లో.....”పీకే బ్రదర్స్” లో పనిమనుషుల కోసం కొన్న సింథటిక్ చీరలు .... వాళ్ళకు నచ్చక.... తమ మొహానే కొట్టి.... తలో వెయ్యిరూపాయిలూ పండుగచీర నిమిత్తం ఎత్తుకుపోవడం గుర్తుకు తెచ్చుకున్నారు!  


రాత్రి భోజనాలయ్యాక...ఐదుగురు తోటికోడళ్లూ...మరోసారి.. డాబా మీదకు చేరారు!  ఐదుగురు ..తమ చేతులు చాపి.... ఆకాశంలోకి చూస్తూ

.." దేవుడా! చచ్చినా.. ఇకమీదట ...ఆఫ్లైన్ లో కానీ ...ఆన్లైన్ లో కానీ.. డిస్కౌంట్ ల మీద... సేల్లో ...బట్టలు కానీ.. నగలు గాని ..వస్తువులు గాని కొననే కొనుము! కొంటే... గింటే.... మా పాత బంగారంషాపు “ మంగళం జువెలరీస్ “లో కానీ...”చిరుగుల బాబూరావ్ & సన్స్ “ బట్టల కొట్టులో కానీ కొనుక్కుంటాం!మా భర్తల మీద ప్రమాణం చేస్తూ... ఇదే మా ప్రతిజ్ఞ!"... అంటూ ఒట్లు వేసుకుని...దుఃఖాశృవులు తుడుచుకుంటూ... భారమైన మనసులతో....కిందకు పోయారు! 


అదిగదిగో రాయితీ...

అందాల ఓ సతి...

లేదమ్మా పరిమితి...

పోగొట్టును మీ మతి...

 వేసారును నీ పతి...

 పెరిగి పోవు భారమితి...

 దాటబోకు నీ మితి...

 ఎండమావి రాయితీ...

 వ్యాపారంలో లేదు నీతి...

 తెలుసుకోవె పడతి! ...

 పడ బోకుము గోతిలోకి!


 ధన్యవాదాలతో

 

 *ఓలేటి శశికళ*

కామెంట్‌లు లేవు: