ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
20, సెప్టెంబర్ 2025, శనివారం
పొరుగింటి పుల్లకూర
శ్రీభారత్ వీక్షకులకు శుభాకాంక్షలు 🌹 పొరుగింటి పుల్లకూర రుచి అంటారు. అలాగే తెలుగు వారికి పొరుగు భాషా పదాలన్నా ఎంతో రుచి. ఉర్దూ, హిందీ, పార్శీ, మధ్య మధ్యలో అరబిక్ పదాలను కలగలిపి మాట్లాడుతూంటాం. ఇంగ్లీషు, సంస్కృతం సరేసరి. అలా ఎన్నెన్ని
మాట్లాడుతూంటామో చక్కగా వివరించారు ప్రముఖ సాహితీవేత్త డా. తిరుమల నీరజ గారు. వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏
ముక్కు మీద చక్కని పద్యం !
శు భో ద యం 🙏
ముక్కు మీద చక్కని పద్యం !
శా: నానా సూన వితాన వాసనల నానందించు సారంగ మే
లా న న్నొల్ల దటంచు ? 'గంధఫలి ' బల్కాకం దపంబంది ,యో
షా నాసాగ్రము బూని , సర్వ సుమనస్సౌరభ్య సంవాస మై ,
పూనెం బ్రేక్షణమాలికా మధుకరీ పుంజంబు లిర్వంకలన్ .
వసు చరిత్రము 2 ఆశ్వాసము- రామ రాజ భూషణుడు.
ప్రబంధకవులు చిత్ర విచిత్రమైన వర్ణనలు చేశారు. కావ్యనాయిక సోందర్య మాధారంగా, వారు (ప్రబంధనాయిక)
అంగాంగ సౌందర్యమును పనిగట్టుకు వర్ణించారు. ఉపమలతో ఉత్ప్రేక్షలతో అతిశయోక్తులతో, అప్పటి ప్రభువుల, ప్రజల అభిరుచులు
అలా ఉండేవన్నమాట.
వసుచరిత్రలో నాయిక గిరిక ఆమె సౌందర్యాన్ని వర్ణిస్తూ కృతికర్త రామ రాజ భూషణుడు. ముక్కుపై నొక చక్కని పద్యం వ్రాశాడు. అదే పైపద్యం.
" గంధఫలి"- అంటే సంపెంగ పూవు. ( ఈసంపెంగలు రెండురకాలు 1 తుప్ప సంపెంగ 2 చెట్టు సంపెంగ. దీనినే మనవారు "సింహాచలం సంపెంగ"- అంటారు. అదే ముక్కును పోలియుంటుంది. ఇప్పుడు దాన్ని గురించే మనం చెప్పుకోబోయేది)
ఆసంపెంగకు తుమ్మెదలపై కోపం వచ్చిందట. ఎందుకు? నానాసూన వితాన వాసనల నానందించు సారంగము(తుమ్మెద) యేలానన్నొల్లదని. అనేక పుష్పాలపైవ్రాలి మకరందం జుర్రుకునే తుమ్మెద నాదగ్గరకు రాదేం? అని దానికి కోపం! యెలాగైనా పట్టుబట్టి సాధించాలిగదా! అందుకనే అది తపస్సు చేసింది. ఆతపః ఫలంగా గిరిక ముక్కుగా నవతరించి ,సకల పుష్పముల సువాసనలను పుణికి పుచ్చుకొని తన ముఖానికిరువైపులా చూపులనే (కన్నులనే) రెండుగండు తుమ్మెదలను కదల కుండా కట్టేసిందట!
ఇంతకీ యిక్కడో విషయం చెప్పుకోవాలి. ఏవిటది? తుమ్మెదలకు సంపెంగికి యెందుకు విరోధం? ఏమో అది ప్రకృతిగతమైనది.సంపెంగ వాసన తుమ్మెదకు పడదు. ఆవాసకది తలదిరిగి పడిపోతుంది. అందుకని అది సంపెంగ దరిదాపులకు రాదు.
దాని నాధారంగా కవి యొక కథనల్లాడు. అదే "తుమ్మెదపై సంపెంగ అలక"
గతంలో సంపెంగ గా ఉండటంతో తుమ్మెదలు దరికి రాలేదు. ఆరువాత తపస్సుచేసి గిరిక ముక్కుగా అవతరించింది. ఇక అప్పుడు తుమ్మెదకు తప్పలేదు. అదిగూడా అందమైన ఆమెకన్నుల వలెమారిపోయింది. అదీ సంగతి!
ఇంతకీ గిరిక ముక్కు సంపెంగి వలె, కన్నులు తుమ్మెదల వలె నున్నాయని చెప్పటమన్నమాట.
ఇంతకీ యీముక్కుపద్యం కర్తృత్వం వివాదాస్పదమైంది. అప్పటికీ యిప్పటికీ ఆవివాదం తెగలేదు. ఈపద్యం నంది తిమ్మన గారిదనీ, ముక్కుమీద పద్యంవలననే ఆయనకు ముక్కు తిమ్మన యనే వ్యవహార నామం వచ్చిందనీ కొందరివాదన.దాన్ని రామరాజభూషణుడు వెలగొని తనగ్రంథంలో వాడుకున్నాడని దానికి సమర్ధింపుగా చెప్పారు.కానీ తిమ్మనగారి పారిజాతాప హరణంలో ఈపద్యం కనిపించదు. కాబట్టి ఈవాదంలో పస గనిపించదు.
మొత్తానికి ముక్కు మీద కూడా ప్రబంధకవులు పద్యాలల్లినది యదార్ధం!
స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
ఉద్దండ కవితా విన్యాసము -2
శు భో ద యం 🙏
ఉద్దండ కవితా విన్యాసము -2
కొందరు పుట్టుకవులుంటారు. మరికొందరు పెట్టుకవులుంటారు. పుట్టుకవులలో ప్రఖ్యాతిగన్న మహాకవి వేముల వాడ భీమ కవి! దక్షారామ భీమేశ నందనుడైన యీకవి 'ఉద్దండ కవితా వేశము కలవాడు. గద్దరించి బెదరించి శాపదిగ్ధమైన కవితలతో నాటిప్రభువుల భరతమును బట్టి తనజీవనమును మహోజ్వలముగా గడపిన మహనీయుడు.
భీమ కవి సంచార శీలుడు. అతడొక మారు కళింగ చొక్కరాజు యాస్థానమునకేగినాడు. ఆప్రభువు వేశ్యాలంపటుడు. భీమకవి యొచ్చువేళకతడు రాజోద్యాన వనమున వేశ్యా సమేతుడై విహరింుసాగెను. ద్వారపాలకుడు భీమకవి యరుదెంచిన విషయమును విన్నవింపగా పొగరుబోతుతనమున ఇక్కడికేరమ్మని కబురంపెను. భీమకవి యరుదెంచి వాని వాలకమునుగాంచి తలవంచి నమస్కరించెను.
" భీమకవీ ! నీగురించి చాలవిన్నాము. నీ టక్కుటమారములు మా*కడ సాగవు. నీవెదియన్న నది జరుగునా? ఓహో! అటులైన యీపందిరి గుంజను మహావృక్షముగావింపుమని "--పల్కెను. ఆసమయమున చొక్కరాజుకాలు మల్లెపందిరి గుంజకానుకుని
యుండెను. భీమకవి గంభీరముగా గళమెత్తి--
"శా: " ఆనీతాభ్యుపదాన శృంఖల పదాభ్యాలంబిత స్తంభమా!
నేనే వేములవాడ భీమకవినేనిం జిత్రకూటంబులో
భూనవ్యాపృత పల్లవోప లతికా పుష్పోప గుఛ్ఛంబులన్
నానా పక్వ ఫల ప్రదాయి వగుమా ! నాకల్ప వృక్షాకృతిన్."---- అనిపద్యం చెప్పాడు. అంతే ఆపందిరి గుంజ కాస్తా మహా వృక్షమైపోయింది. రాజుగారికాలు ఆచెట్టులో యిరుక్కుపోయింది. దెబ్బతో భీమకవి మహిమెంతో ఆరాజుకు తెలిసింది.
"మహాకవీ నాతప్పు మన్నించు. మళ్ళీ వృక్షాన్నిపందిరికి గుంజగాజేసి నన్నుకాపాడమని " ప్రార్ధించాడు. కవి కరుణాళుడై. చొక్కరాజా!
కవుల నెన్నడు నవమానింపకుము. బుధ్ధిగలిగిప్రవర్తింపు మనుచు----
ఉ: " శంభువరప్రసాద కవిసంఘ వరేణ్యుడ నైన నావచో
గుంభన మాలకించి యనుకూలత నొంది యనూన భావనన్
కుంభిని జొక్కనామ నృపకుంజరు పందిటి మల్లెసాలకున్
స్తంభమురీతి నీతనువు దాలిచి యెప్పటియట్ల నుండుమా! "--- అనేపద్యం చెప్పాడు. వృక్షం పందిరి గుంజయిపోయింది.రాజుగారి పాదానికి విముక్తి లభించింది.
భీమకవి మహిమకు అక్కడివారందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు.
ఇదండీ భీమకవిగారి ఉద్దండ కవిత్వం !🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
