21, ఆగస్టు 2025, గురువారం

మకార పంచకం

 మకార పంచకం అంటే ?

బలిమాం సాది పూజేయం విప్రవర్జా మయేరితా అని చండీ సప్తశతి వాక్యం 

పరమేశ్వరి అర్చనలో మకార పంచకము తప్పనిసరిగా ఉండాలి. మకారపంచకము అంటే తంత్రశాస్త్రాలలో


"మద్యం మాంసం తథా మత్స్యం ముద్రా మైధున మేవ చ శక్తిపూజా విధానాద్యైః పంచతత్త్వః ప్రకీర్తితః"


ఈ మకార పంచకాన్ని వాడేటప్పుడు వాచ్యార్ధిని బట్టి వస్తువులను వాడరాదు.అజ్ఞానులు బాహ్యార్ధాన్ని గ్రహించి జుగుప్సాకరము, హింసాత్మకము అయిన పనులుచేస్తున్నారు. దానివల్ల భ్రష్టులవుతారు. శక్తి సంగమతంత్రంలో


బెల్లపు పానకము - మద్యము


తెలకపిండి, గారెలు - మాంసము


వెల్లుల్లి, తిత్తిడిపదార్ధాలు - మత్స్యము


గోధుమలు మినుములచే చేయబడిన పదార్దాలు - ముద్ర


భక్ష్యభోజ్యముల కలయికే - మైధునము


అని చెప్పబడింది. ఇది కౌళాచారము మహానిర్వాణ తంత్రంలో


న మద్యం మాధవీ మద్యం, మద్యం శశికిరణ రసోద్భవం కర్మాకర్మ పశూన్ హత్వా జ్ఞానఖడ్గేన చేశ్వరీ

మనోమీనం తృతీయే చ హత్యాసంకల్ప వాసనః

భక్ష్యభోజ్యాన్నం భక్ష్య మింద్రియనిగ్రహః తాం చతుర్థాం విజానీయాత్ హంసఃసోహం శివః శక్తి శ్చైవ ఆనందనిర్మలః పంచమీంతాం విజానీయాత్


1.చంద్రబింబము నుంచి జాలువారు అమృతమే మద్యము.


2. కర్మాకర్మలను పశువులను జ్ఞానఖడ్గంతో సంహరించటమే మాంసము. 


3. మనస్సే మత్స్యము దాని సంకల్పవాసనలను హరించుటయే మత్స్య సమర్పణ.


4.ఇంద్రియ నిగ్రహమే భక్ష్యభోజ్యాలు .ఇది ముద్ర


5. హంసస్సోహం అనే మంత్రార్థమయిన శివశక్తుల కలయికే మైదునము.


ఇది సమయాచారము. అయితే జ్ఞాని అయినవాడు పరమేశ్వరిని పంచ పుష్పాలతో పూజిస్తాడు. అవి


అహింసా ప్రథమం పుష్పం పుష్ప మింద్రియనిగ్రహః దయాక్షమాజ్ఞానపుష్పం పంచపుష్పం తతః పరమ్ ॥


పరమేశ్వరిని అర్చించేవాడు సత్త్వగుణాన్ని బాగా అలవాటు చేసుకోవాలి. అహింస, ఇంద్రియ నిగ్రహము. దయ, క్షమ, జ్ఞానము అనే ఐదు పుష్పాలతోను దేవిని అర్చించాలి. ఈ విషయాలు తెలుసుకుని పరమేశ్వరిని అర్చన చేసిన వాడికి ముక్తి లభిస్తుంది.అటువంటి సాధకుడికి మాత్రమే అమ్మ అనుగ్రహం కలుగుతుంది 

శ్రీ మాత్రే నమః