23, ఏప్రిల్ 2020, గురువారం

కరోనోపాఖ్యానం

ఒక్క దినంబు  నైమిశారణ్యమందు  శవనకాది మహాఋషులు సూతుని సమీపించి ముచ్చటించు వేళ శవనకుడు లేచి నిలబడి కరములు జోడించి సూతినితో ఇట్లనెను.  ఓ మహర్షి తాము భూత భవిష్యత్ వర్తమానములెఱింగిన మహానుభావులు కాన మీరెరుగని విషయామీ పృద్వితలమున ఉండదు కాన నా యందు ప్రసన్నులై నా సందేహములు తీరుపవేడెదన్. అంత సూత మహర్షి, ఓ మహర్షి మీరు అడుగుటకు నా వద్ద సంసశయమెందులకు మీ బుద్ధికి పుట్టిన సంధేహములను నిస్సంశయముగా అడుగుడి అని ఆనతి నివ్వ అంత శవనకుడు వినమ్రుడై రాబోవు కలియుగంలో ఒకానొక శర్వారి  నామ సంవత్సరములో మానవాళికి తీవ్ర విపత్తు సంభవించు నట్లు నాకు జ్యోతకమౌచున్నది అది ఎంతవరకు యధార్ధము.  అట్లైన ఈ మానవాళిని కాపాడునదెవ్వరు తాము దయతో సెలవిండనెను. అంత మహర్షి దయాళుడై కరోనోపాఖ్యానంను  ఈ విధముగా చెప్పఁన్దోడంగెను. 

జంబూ ద్విపములో భారత వర్షంలో హిమనగానికి ఉత్తర ప్రదేశంలో చెనా అను ఒక రాష్ట్రము గలదు.  అందు బహు సుప్రసిద్ధ పట్టణములు గలవు.  అందులో యువన్ మను ఒక పట్టణము బహు విశాలముగా, అందముగా జనాకర్షణగా సాగర తీరమున గలదు.  ఆ పట్టణ వర్ణన చేయుట మానవ మాత్రుల వశము కాదు.  ఆ నగరిని దర్శించిన రాజులకు అక్కడి సౌధములను చూసుటకు శిరస్సులు పైకి ఎత్త ఆ సౌధాగ్రము ఫై దృష్టిపడ వారి మకుటములు క్రిందపడుచుండెను.  బహు అంతస్తులు, అత్యంత శోభాయమానమైన నిర్మాణములు, గాంచిన వారిని ముగ్దులను చేయుచుండెను.  సాగర తీరము బహు విశాలముగా ఉండి అత్యంత అధునాతన వనములు, భవనములు కలిగి చూపరుల మంత్రముగ్ధుల చేయుచుండెను.  అంతటి చక్కటి పట్టణము బహు జనములతో కిట కిట లాడుచుండెను. అచటికేగిన వారెవ్వరు ఆ నగరిని పొగడకనుండరు.  దేవేంద్రుడు సహితం అచటికి చనిన ఆహ ఈ పట్టణమెంత శోభాయమానంగా వున్నది నా ముఖ్య పట్టణమైన అమరావతిని ఆక్షేపించునట్లున్నదే అనక మానడు. అంతగా అభివృద్ధి చెందిన ఆ నగరిని గాంచిన వారెవ్వరైనా అచటి మానవులు సంస్కార వంతులు, ధర్మపరులు అని భావింపక తప్పదు.  కానీ అక్కడి ప్రజల జీవన విధానము తెలిసిన వారెవ్వరైనా, వారిని ఛీత్కరించక మానరు.  ఏలయన వారి ఆహారపు అలవాట్లు బహు చిత్రముగా మరియు హేయముగా తోచును.  వారు ఈ ధరాతలమున భుజించని జీవి లేదు అన అబ్బరపడనవసరము లేదు.  కప్పలు, పాములు, గబ్బిలములు, సకల జల చరులు, పక్షులు వారి కాహారమగు చుండెను శునకములను కుడా వారు వదలరు.  విశ్వమంతా పాములను చూసి భయపడ వారు ప్రీతితో శిరస్సు తప్ప శరీరమంతా తినుట ఇతర దేశస్తులకు ఆశ్చర్యం కలిగిస్తున్నది.  ప్రపంచమంతా పాముల భారం పడి ప్రాణముల నొడ్డుచుండ వారు ఆ విష సర్పములనే ఆహారరముగా తినుచున్నారన వారాలు ఎట్టి వారో తెలియగలరు. ఒక్క మాటలో చెప్ప వలెనన్న వారు ఈ పృద్విమీద తినని జీవి లేదనిన ఒప్పదగును. 

ఇట్లు ఆ జనులెల్ల జీవులను తమ ఇచ్చానుసారముగా భుజించుచుండ సర్వ జీవులకు ముప్పు వాటిల్లుతుండే . ఒక్కదినంబు భూచరములు, వాయుచరములు, ఉభయచరములు అచ్చటగల శివాద్రి అను ఒక పర్వతమందు చేరి ఈ మానవులనుండి వాటిని రక్షించుకొను మార్గాన్వేషణం చేయ బూనెను. 

సౌలొచ తపోదీక్ష పూనుట 

అట్లు ఆయా జీవులు తలకొక సూచనచేయుచు వాటి రక్షణ నిమిత్తము ప్రయత్నములు చేయగా ఏవియు సరైనవిగా వాటికి  తోచలేదు. అందులకు కారణమేమన ఈ జీవులు శారీరకంగా, బుద్ధికుశలతలోనూ అక్కడి జనుల కన్నా ఎంతో స్వల్పంగా తోచినవి.  కాన ఈ విషమ పరిస్థితికి విరుగుడు ఏమిటని అన్ని జీవులు మరల మరలా యోచించ సాగెను.  అంత  అక్కడ అంతవరకు మౌనంగా వున్న సౌలొచ అను  ఒక చర్మఛర్కము (గబ్బిలం) ఆ జీవ సమూహమును చేరి యిట్లనియె. నేను ఎన్నో ఇతిహాస కధలు తెలుసుకున్నాను.  గతంలో ఎట్టి ప్రమాదము వచ్చినను సర్వ లోకాలకు  పితయేన  ఆ మహాదేవుని కొల్చారని ఆ దేవదేవుని కృప వల్ల ఫలితం పొందారని మనకు తెలుస్తున్నది. దేవాది దేవుడు ఆర్త జన రక్షకుడు, దుష్టజన శిక్షకుడు, భోళా శంకరుడు, గతంలో గజ కోరిక మన్నించి గజాసురుని హృదయంలో కొలువున్నాడు, సాలె పురుగుకు కాలముకు హస్తికి వరములిచ్చి అచట శ్రీకాళేశ్వర రూపమున కొలువున్న ఆ దేముడు తప్ప మనలను కాపాడ అన్యులు లేరని.  కాన మనకు ఈ విషమ పరిస్థితిలో ఆ దేవదేవుని కొలుచుట కన్నా వేరు మార్గాంతరం లేదు అని నుడివి, నేను ఈ నాటినుండి ఆ దేవదేవుని శరణు చొచ్చి మన జీవహరులను నిర్జించు వరంబు పొందెదనని ఆ జీవులకు తెల్పి వాటిని ఊరడించి మీరు నాకు దేవుని వరప్రదానం లభించువరకు ఆ జనులనుండి మిమ్ము మీరు కాపాడుకొనుడని తెల్పి ఆ పర్వత శిఖరమందు గల ఒక బోధివృక్ష శాఖను చేరి తల్లక్రిందులుగా మహా దేవుని గూర్చి ఘోర తపంబుఆచరించే. . 
సౌలొచ తపోజ్వాలతో ఇంద్రలోకం భయకంపితులు కావటం : సౌలొచొనర్చు తీవ్ర తప్పస్సుతో జనించిన తపో జ్వాలలు ఇంతింతయి పెరిగి పెరిగి అవి ఇంద్రలోకాన్నిచుట్టూ ముట్టాయి.  ఆ జ్వాలా ప్రచులిత  తీవ్ర తాపానికి దేవాదులెల్లరు  అతలాకుతలమైరి.  దేవతలు, సప్తఋషులు, నవగ్రహాలు హాహా కారాలు చేస్తూ మహేంద్రుని కడకెళ్లి మొరలిడిరి.  అంత మహేంద్రుడు ఈ జ్వాలా ప్రకోపిత ఉష్ణ తాకిడిని ఎదుర్కొను మార్గము గాంచక ఖిన్నుడాయె.  అంత ముల్లోక సంచారగు బ్రహ్మర్షి నారద మహాముని వచ్చి మహేంద్రునిచేరి  ఇది భూలోకంలో మహా తపస్వి ఆచరించు తపో ప్రభావంబున జనించిన తీవ్రగ్నిగా తెలిపి వీటినేదుర్కొను శక్తి కేవలము ఆ మహా దేవునికి తప్ప అన్యులకు లేదు.  కాన ఆ మహాదేవుని శరణు చొచ్చుమని బోధించే.  వల్లే అని అంత దేవేంద్రుడు తన పరివార సమేతముగా కైలాసముకేగి పరమశివుని శరణు చొచ్చి ప్రభు మేము భూలోకతాపసి తీవ్ర తపోజ్వలోషణముతో భయ కంపితులమౌతున్నాము.  అవి ఇంద్రలోకమును ధ్వంసం చేయకమునుపే మమ్ము కాపాడమని కరములు జోడించిప్రార్ధించే.  సప్త ఋషులు, నవగ్రహాలు ఇతర దేవతలు భయకంపితులై పరమేశుని పాదాలపై పడిరి.  దయాళువైన పరమేశ్వరుడు ఆ జ్వాలల కారణమెఱుంగ అది శివాద్రి అను ఒక    చర్మఛర్కము (గబ్బిలం) చేయు తీవ్ర తప్పస్సు ప్రభావమని యెఱుంగే. అంత పరమేష్ఠి సహితముగా పరమేశ్వరుడు శివాద్రికరిగి ఆ చర్మఛర్కము (గబ్బిలం) నకు ప్రత్యక్షమై ఓ సౌలోచి నీ తపస్సుకి మెచ్చితి నీకెట్టి వరమ్ము కావలెను  కోరుకొమ్మనెను.  ఆ  సౌలొచ నేత్రానందముగా పరమేష్ఠి సహిత పరమేశ్వరుని గాంచి వేనోళ్ల ఆ దేవదేవుని పొగడి పరమేశ్వర నీ దర్శన భాగ్యముగా నా జన్మ తరించింది.  నీ దర్శనముకన్న వేరు వరము నా లాంటి అల్ప జీవులకు కలదేనని.  తాను తపమాచరించు కారణము తెలిపి దేవాది దేవా ఇచ్చోటి మనుజులు ధర్మాధర్మముల విడనాడి దొరికిన జీవినేల్ల భక్షించుచు జీవ జాతిని మొత్తము నశింప చేయుచున్నారు.  వారాలనడ్డగించ మేమశక్తులము.  మమ్ము మేము కాపాడుకొనలేకుంటిమి కాన నేను నీ కృపన్ ఆ దుష్ట మనుజుల నిర్జించ నెంచి ఈ తపమాచరించితి. ఓ దీన రక్షకా ఆపద్బాంధవా దయతో  ఈ క్రూర మానవుల హస్తంబులనుండి మా జీవ సంతతిని కాపాడవె అని వేడెను.  నీవు దక్క నాకు అన్య దిక్కులేదు.  నీవు కాపాడనిచో అనతి కాలములో ఈ సృష్టిలో జీవ జాలము యావత్తు నశించగలదనెను.  అంత ఆ పరమేశ్వరుడు దయాళుడై ఓ సౌలొచ నీ ప్రార్ధనలో అర్ధమున్నది నీవు నీకొరకు కాక యావత్ నీ సోదర జీవుల నుద్ధరించ పూనినావు.  కాన తప్పక నీకు వరమ్మిచెద ననియెను.  మీ జీవ జలమును కాపాడ వలెనన్న ఆ దుష్ట మానవులకు మీ యెడ విరక్తి కలగవలెను.  అప్పుడే వారు మీ జోలికి రారు.  కానీ మీ మాంస రుచిమరిగిన వారు మిమ్ముల నోదులుటకు ఇష్టపడరు,  కన్నా దీనికోకే ఒక ఉపాయము కలదు అది ఏమన మీ మాంస భక్షణ వారి పాలిట ప్రాణహరణ కావలెను.  అట్లయిన వారు మీ జోలికి రారు.  కాన నేను ఒక సూక్ష్మ జీవిని పుట్టించి మీ మాంసమందు పంపెద తత్ కారణంబునఁ మీ మాంస భక్షణం చేసిన వారి ప్రాణముల ఆ క్రిమి హరించ గలదు.  అట్లని పరమేశుడు వరంబియ ఆ సౌలొచ మిగుల సంతసించి పరమేశుని వేనోళ్ల పొగడ  పరమేశ్వరుడు అంతర్దహనమాయె.  అంత ఆ సౌలొచ  తన పరివారంబుని చేరి జరిగిన దంతయు వివరించ జీవులెల్ల సంతసించె. 

పరమేశ్వరుని వరప్రభావమున సూక్ష్మ జీవి జీవించుట.  అంత ఆ జనులు ఇది ఎరుగక వారు ఎప్పటివలె జీవ హింస చేయుచు వివిధ రకముల జీవుల మాంస భక్షణం చేయుచుండిరి.  పరమేశ్వర వరప్రభావముచేత ఒక సూక్ష్మ క్రిమి ఆ మాంసములందు జెనించె.  తత్కారణంబున ఆ మాంసభక్షణ చేసిన వారికి   ఆ సూక్ష్మ క్రిమి సోకి వివిధ రకముల అనారోగ్యములు జెనిచి చివరకు వారలు మరణించుచుండిరి. 

చైనీయులు సుక్స్మక్రిమిని గుర్తించుట:  అంత అనేకులు అకారణముగా అనారోగ్యగ్రస్తులై మరణించుట అచ్చటి మేధావులకు, వైద్యులకు ప్రస్నార్ధకముగా మారినది.  వారు వివిధ పరిశోధనలు చేసి చివరకు ఆ సూక్ష్మ క్రిమి జాడ  కనుగొనిరి. ఇది ఒక నూతనమైన అతి సూక్షమైన క్రిమి దీనికి విరుగుడు ఔషధము వారాలకు తెలియనిదాయె.  అప్పుడు వారలు ఈ జీవికి కరోనా అని నామకరణంచేసి దాని సంహరణమొనర్చ పూనుకొనిరి.  నాటి నుండి అచటి వైద్యులు జనులకు మీరు సర్వ జీవ భక్షణ చేయ ఈ విపత్తు దాపురించే కాన మీరు మాంసాహారము మానుడని సూచించ వల్లే యని అనేక జనులు జీవ భక్షణం వీడిరి.  కానీ పరమేశ్వర వరప్రసాది యగు ఆ సూక్ష్మ క్రిమి నానాటికి విజృభించి యావత్ భూలోకమంతా వ్యాపించెను.  తత్ కారణంబునఁ జీవ భక్షణ చేయని వారాలకు కుడా ఇది ప్రాణాంతకంగా నయ్యెను.  వివివిధ దేశాధీశులు దీని నంతమొందించ జాడ కనక ఖిన్నులై జనులను గృహంబులు వీడి బయల్వెడలవద్దని ఆనతిచ్చిరి.  దేశాధీశులు మాటలు పెడచెవిన పెట్టిన వారికి ఈ వ్యాధి సంక్రమించి విగతజీవులైరి. 

జగన్మాత పరమేశ్వరుని వేడుకొనుట:  ఇది ఇటులుండ భూలోకములో జరుగుచున్న విపత్త్తుని గమనిచిన  జగన్మాత పరమేశ్వరి పతిని జేరి ప్రభు మీరు ఆ సౌలొచన కిచ్చిన వరమ్ము సర్వ మానవాళికి శాపంబాయే.  మీరే సర్వస్వమని నిత్యం మిమ్ములను వేడు మీ భక్తులు కుడా ఈ క్రిమి భారిన పడి వారి ప్రాణములొడ్డుచున్నారు.  కాన దయతో ఈ విపత్తునుండి మీ భక్తులను కాపాడమని వెడుకొన అంత పరమేశ్వరుడు ప్రసన్నుడాయె. 

పరమేశ్వరుడు భక్తులను కాపాడుట: ఓ పరమేష్ఠి నీవు కోరిన కోరిక సమంజసమైనది.  ఇది కేవలము సర్వ జీవ భక్షణ చేయు మానవరూప రాక్షసులను నిర్జించుటకే కానీ శిస్టులను శిక్షించుటకు కాదు.  నేను ఎప్పుడు నా భక్తులకడ ప్రసన్నుడనే. అంతేకాదు శిష్టులు, ధర్మచారులు, ఆచార పరులు, పరహిత పరాయణులను ఏళ్ళ వేళల కాపాడుట నా కర్తవ్యము.  కాన ధర్మ పరులకు ఈ క్రిమి సోకాదని తెలిపెను. 

ధర్మ పరుల కాపాడుట: నిత్యము  సౌచపరులగు ధర్మా చరుణులు ప్రాతః కాలమున లేచి సూర్య భగవానుని స్తుతిస్తు ప్రాఖ్ ముఖులై ఆదిత్యునిప్రార్ధించి పరిశుభ్ర వస్త్రముల ధరించి స్వయంపాకముల భుజిస్తూ, జీవహింస చేయక నిత్యమూ నన్ను శరణు చొచ్చి నా నామ జపము, తపము ఆచరిస్తూ.  పరులకు అపకారము తలపక అత్యాశకు పోక ధర్మ దీక్షా పరతంత్రులై గృహంబు వీడక  జీవింతురో వారికి ఈ సూక్ష్మ క్రిమి వలన ఎట్టి హాని కలగదని తెలిపెను.  అనతి కాలములోనే మానవుల మేధస్సుతో ఈ క్రిమికీ విరుగుడు కనుగొనెదరని,  తత్కాలము వరకు ప్రతి వారు గృహంబుల వీడి వీధులలో విహరించకూడదని పరమేశ్వరుడు పరమేష్ఠికిన్ తెలుప పార్వతియు సంతసించె.  నాటి నుండి శిష్ఠులైన భక్తకోటి ప్రాతః కాలమున లేచి స్నాన సంధ్యాదుల నాచరించి సూర్య భగవానుని ప్రాతః కాలమున స్తుతించి తత్ కిరణ ప్రేరణతో ఆరోగ్యంబున్ చేకూర్చుకొని నిత్యము భగవన్నామ పారాయణము, దైవ చింతనమొనర్చుతూ ధర్మాచరణ బద్ధులై జీవనం గడప మేధావుల కృషిని ఈ క్రిమికీ ఔషధము లభ్యమైయ్యే.  అంత ఆ ఔషధ ప్రభావమున జనులెల్లరు సుకులై పూర్ణాయ్సమంతులై జీవితులైరి అని శవనకాది మహమునులకు    సుతుడు కరోనా ఉద్భావము  దాని ఉపశమనముతెలుపు కరణోపాఖ్యానము తెలుప వారలు నిజాశ్రమములకరిగిరి. 
ఫలశృతి:  ఈ ఉపాఖ్యానం చదివి నిత్యం ధర్మ దీక్ష పరాయణులై మహాదేవుని నిత్యమూ పూజంచు వారాలకు ఈ కరోనా వ్యాధి సోకకుండును గాక.  ఓం తత్సత్. 

ఇది రేవాఖండే ప్రథమాశ్వాసే కరోనోపాఖ్యానం సమాప్తం. 


ఓం శాంతి శాంతి శాంతిహి 
సర్వే జానా సుఖినో భవంతు. 

గమనిక ఇది కేవలము కల్పితము.  ఈ వృత్తాన్తము ఏ పురాణ ఇతిహాసములలోను ప్రస్తావించ లేదు.