30, అక్టోబర్ 2025, గురువారం

పురుషుడు భార్యని

 *పురుషుడు భార్యని ఎలా* 

                                    *చూసుకొవాలి?*


* *స్త్రీ వివాహమైన వెంటనే కోటి ఆశలతో అత్తవారింట్లొ అడుగుపెడుతుంది. తన తల్లిదండ్రులను, తోబుట్టువులను, స్నేహితులను, బంధువులను అందరిని విడచి వివాహము చేసుకొన్న భర్తపై నమ్మకంతో అత్తవారింట్లొకి అడుగుపెడుతుంది. భర్త ,భార్యని భద్రంగా, రక్షణగా మాత్రమే చూసుకొంటాడు. కానీ భార్య భర్త గౌరవాన్ని, సంతానాన్ని, ధనాన్ని, కాపాడుతుంది. సేవకురాలిగా, తల్లిగా, స్నేహుతురాలిగా, మంత్రిగా, వీటన్నింటికి మిoచి ప్రేమగా, భక్తిగా చూసుకుంటుది.*


* *అందువలన భార్యను హక్కుగా భావించి తిట్టరాదు. ఆమె బంధువులతో చీటికి మాటికి కయ్యానికి కాలు దువ్వరాదు.*


* *భార్య వడ్డించిన పదార్ధాలను తినకుండా విమర్శించరాదు.*


* *ఇంటిని భార్య జైలులా భావించే పరిస్తితులు లేకుండా వారానికి ఒక్కసారైనా బైటికి తీసుకెళ్ళాలి.*


* *పిల్లలతొ సరళ సంభాషణలు* *చేయాలి.*


* *పిల్లలు చూస్తుండగా భార్యతో చనువుగా ఉండరాదు.* 


* *ఏకగదిలో కాపురం ఉంటున్నవారు పిల్లలని గమనించి కలవాలి.*


* *భార్యకి ఎంతో కొంత ఆర్ధిక స్వేచ్హ ఇవ్వాలి.*


* *ఆమె అభిప్రాయలను గౌరవించాలి.*


* *భార్యను పరులముందు అవమానించే విధంగా ప్రవర్తించరాదు.*


* *భార్యను ఇంటి యజమానిరాలుగా చూడాలి గాని, అనుమానించే వ్యక్తిగా చూడగూడదు.*


* *భర్త తను తుదిశ్వాస వదిలేవరకు, భార్యను కంటికి రెప్పలాగ, సంతొషంలోనూ, బాధలలోను చేదొడువాదోడుగా ఉండాలి.*


* *భర్త తను మరణించిన తరువాత గూడ, భార్య ఇతరుల మీద ఆధారపడకుండా, కష్ఠాలు పడకుండా ముందు జాగ్రతలు తీసుకొని ఆమెకు తగిన భద్రత మరియు జీవనోపాది కొరకు తగిన ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయలి...*

వంకాయ కూర

 వంకాయ కూర 

అబ్బో వంకాయ కూర అనగానే మీకు నోరూరుతుంది కదా అవును నాకు తెలుసు వంకాయ కూరను  తినమనే వారు   ఇష్టపడని  వారు ఉండరన్నది అందరు ఎరిగిన సత్యమే. మీ ఇంట్లో ఏం చేశారు అని ఎవరినైనా అడిగితె వాడు కనుక వంకాయకూర అని అన్నాడా అబ్బా వీడు నన్ను కూడా భోజనానికి పిలిస్తే ఎంతబాగుండును అని అనుకోని వారు ఎంతమంది వుంటారు చెప్పండి. ఇంకా కొంతమంది సిగ్గు విడిచి అరె ఇవాళ మీ ఇంటికి భోజనానికి వస్తారా అని మరి వాళ్ళ ఇంటికి వెళ్లి వంకాయ కూరను ఆరగించి వచ్చేవారు ఎంతమంది లేరు చెప్పండి. అందుకే కొంతమంది ఇవాళ మీ ఇంట్లో ఏమి చేశారు అని అడిగితె ఏరా నీవు భోజనం చేశావా అని అడిగి వాడు తిన్నాడని నిర్ధారణ చేసుకున్న తరువాత చిన్నగా అప్పుడు చెపుతాడు మా ఇంట్లో వంకాయ కూర అని. అబ్బా ఈ విషయం కొంచం ముందు చెపితే నేను కూడా మీ ఇంట్లోకి భోజనానికి వచ్చేవాడిని కదరా అని అప్పుడు నాలుక కరుచుకుంటాడు. ఇట్లా ఎన్నో సంగతులు వంకాయ కూర మీద ఉంటాయి. వంకాయ కూర రుచిని ఆస్వాదించి ఆనందించి సంతృప్తి చెందిన ఒక కవిగారు ఊరుకొక ఇలా ఒక చక్కని కంద పద్యాన్ని వ్రాసాడు అది మనందఱకు తెలిసిందే 

"వంకాయ వంటి కూరయు, 

పంకజముఖి సీత వంటి భామామణియున్, 

శంకరుని వంటి దైవము, 

లంకాధిపు వైరివంటి రాజును గలడే?" 

ఇందులో కవిగారు ఏమంటారంటే , "వంకాయలాంటి కూర, తామరపుష్పం వంటి ముఖం కల సీత వంటి భార్య, శివుడి వంటి దేవుడు, రావణుడికి శత్రువైన రాముడి వంటి రాజు" వంటివి ఉన్నాయా అని అంటున్నాడు. ఇది అక్షర సత్యం ఒక వంకాయ కూరను సాక్షాత్తు లోకమాత అయిన సీతాదేవితోటి శ్రీ రామచంద్రునితోటి మరియు పరమ శివునితోటి పోల్చి చెప్పాడంటే ఆ కవిగారు వంకాయకూరను తిని పొందిన అనుభూతి  ఎంతదో చెప్పకనే చూపుతున్నది. ఇదండీ ఒక కవిగారి ఆనందంతో తన కలంనుండి జాలువారిన అమృత కవితా ధార . 

ఇక వంకాయకూర గురించి చెప్పాలంటే వంకాయ కూర ఒక కూర కాదండి అది ఒక కూరల సంపుటి. వంకాయలను తరిగి, తరిగిన ముక్కలను నీళ్లలో వేసి పోపు చేసి ముక్కలను వేసి అల్లం పచ్చిమిరపకాయ ముక్కలను వేసి చేసే కూర సాదారణ కూరే కానీ దాని రుచి మాత్రం అమోఘం. ఇది అతి సాధారణంగా చేసే వంకాయకూర 

ఇంకా పల్లీల పొడి ధనియాలపొడి, శనగపిండి, వాము జీలకర్ర పొడులు అన్నే కలిపి పొడుగాటి వంకాయలను తీసుకొని దానిని నిలువుగా నాలుగు పాయలుగా తరిగి మధ్యలో ఈ మసాలాను నూరి గిన్నెలో నూనె వేసి దానిలో వేసి వేయించి తీసిన గుత్తివంకాయ కూర రుచి అద్భుతం , అద్వితీయం. దీనిని తింటూవుంటే స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉన్నట్లు ఉండదా చెప్పండి. 

ఇదికాక ఇటీవల కాలంలో అనేక విధాలైన వంకాయ కూరలు మన పాక శాస్త్రజ్ఞులు కనుగొన్నారన్నది అతిశయోక్తి  కాదు. వంకాయ గ్రేవీ కూర వంకాయ కారం కూర, వంకాయ మసాలా చల్లిన కూర అదోరకం కూర ఇదోరకం కూర అని అనేక అనేక కూరలను చేస్తున్నారు టీవీలలో చూపిస్తున్నారు. యూట్యూబులల్లో చూస్తూ చేస్తున్నారు కూడా 

వంకాయకూరకు దాసుడైన ఒక సినిమా దర్శకుడు తన సినిమాలో ఒక పాటను వంకాయమీద పెట్టి హీరో హీరోయిన్లతో నాట్యం చేయించిన విషయం తెలియని తెలుగువారు లేరు. 

వేద వ్యాసుడు మన తెలుగువారికి సరిగా న్యాయం చేయలేదు అని ఒక సుబ్బారావు ఒక రామారావుతో అన్నాడు. అదేమి పాపం వ్యాస భగవానులు వేదాలను విభజించి వేద వ్యాసుడుగా పేరొందారు, అష్టాదశ పురాణాలను వ్రాసారు, మహా భారతాన్ని రచించారు ఇంకా అయన చేయకుండా మిగిలింది ఏమిటి. ఇప్పటికి పండితులు వ్యాస ఉత్తిష్టం కానిది లేదంటుంటే  మీరు ఇంకా వ్యాసులవారు ఏదో వ్రాయలేదని అంటారేమిటని రామారావు అన్నాడు. దానికి సుబ్బారావు నీకు తెలియదా వంకాయ కూరను వ్యాసులవారు ముట్టుకోలేదు అని అసలు విషయం తెలిపాడు సుబ్బారావు. బలే వున్నది సుబ్బారావుగారు అయితే మీరు భారతం పూర్తిగా చదివినట్లు లేదు అని అన్నాడు రామారావు. భారతంలోనా ఎక్కడ చెప్పండి అన్నాడు. నేను చెప్పేది ఏముంది చాలా బాగా సుస్పష్టంగా వ్యాస భగవానులు వంకాయ కూరను వ్రాస్తేను అని అన్నాడు. అప్పుడు అదేమిటో తెలుసుకోవాలని కుతూహలం సుబ్బారావుకు కలిగింది. అయితే చెప్పండి మహాప్రభూ ఆ కథను అని అన్నాడు. 

అప్పుడు రామారావు సాక్షాతూ శ్రీ కృష్ణ భగవానుడిలాగా ఫోజు పెట్టి అర్జనునికి గీతను బోధిస్తున్నట్లుగా సుబ్బారావుకు చెప్పటం మొదలు పెట్టాడు. నాయనా లక్క  గృహ దగ్డం అయిన తరువాత కుంతీమాతతో సహా పాండవులు ఏకచ్చేక్రపురం అనే గ్రామంలో తలదాచుకున్నారు కదా అవును తెలుసు అన్నాడు అప్పుడు జరిగింది ఏమిటో తెలుసుకదా తెలుసు పాండవులు వున్న ఇంటివాని కుమారుని బకాసురునికి ఆహారంగా పంపటానికి ఆ తల్లిదండ్రులు బాధ పడుతూ బండిమీద బాలుని సాగనంపుతుంటే అవును సాగనంపుతుంటే కుంతీ మాత ఆ తల్లిదండ్రులకు ఊరట కలిగించి ఆ బాలునికి బదులుగా తన కుమారుని పంపుతానని భీముని పంపింది ఇందులో వంకాయ కూర ప్రసక్తి ఎక్కడవుందని సుబ్బారావు అన్నాడు. 

అప్పుడే నాయనా వంకాయకూర వచ్చింది అని రామారావు ఇలా చెప్పాడు. ఆ క్రితం రోజు ఊరివారంతా సమావేశమై బకాసురిని బారి నుంచి తప్పించుకోవటం మన వల్ల కాదు కనీసం వాడిని సమ్మోహితుణ్ణి అయినా చేసి కొంతకాలం వాడు మన ఊరివైపు రాకుండా చేద్దామని అందరు కలిసి వారిలో చక్కగా వంకాయ కూర వండగల సమర్థులను ఎంచుకొని ఒక బాండీ నిండా వంకాయ కూరను వండి మరుసటి రోజు బకాసురిడికి విందుగా పంపే బండిలోకి ఎక్కించారు. నిజానికి తల్లిగారు చెప్పినా బకాసురిడి వద్దకు వెళ్ళటానికి ఇష్టపడని భీముడుగారు ఆ వంకాయ కూర  ఘుమ ఘుమలు ఉరిస్తూవుంటే దానిని సంతృప్తిగా ఆరగించాలని తాను బకాసురిని వద్దకు వెళ్ళాడు. బకాసురుడు చూస్తూఉండగా ఆ కూరను అన్నంలో కలుపుకొని తింటూ వాడిని కూడా ఊరించాడని వాడు అది చూసి సహించక ఓరి మానవ నాకు ఆహారంగా తెచ్చిన వంకాయ కూరను నీవు ఆరగిస్తావా, తిని తిను నీవు తిన్నతరువాట్ నిన్ను నీ కడుపులోని వంకాయకురాను తినేది నేనే కదా అని హా హా కారాలు చేస్తూ భీముని మీద లంకిస్తే ఆకలితో వున్న బకాసురుని వంకాయ కూరను ఆరగించిన భీమసేనుడు అతి సునాయాసంగా  మట్టు పెట్టిన సంగతి అత్యంత రసవత్తరంగా వ్యాసభగవానులు వ్రాసారని దానిని నన్నయ భట్టారకుడు హ్రుద్యంగగా తెలుగించిన విషయం నీకు తెలియదటోయ్ అని సుబ్బారావుతో రామారావు అనేసరికి రామారావు నోరెళ్లపెట్టాడు. అవునండి మీరు చెప్పింది నిజమే వ్యాసభగవానులు వంకాయకూరకు ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇచ్చారు అని ఏదో కొత్త విషయం తెలుసుకున్నట్లుగా మొహం పెట్టి చెప్పాడు. దీనిని  బట్టి తెలిసేది యేమిటంటే వంకాయకూర ఈ నాటిది కాదు ఇతిహాసాల నాటిదని అర్ధమవుతుంది. అని అన్నాడు సుబ్బారావు.

అంతే కాదు సుబ్బారావు వంకాయకూర గురించి కధ ఒకటి అక్బర్ బీర్బలులది కూడా వున్నది అది నీకు తెలియదా అని ఆంటీ చెప్పు చెప్పు అని చెవులు నిక్కపొడుచుకొని వినటానికి సంసిద్దుడైనాడు  ఆ కధ ఏమిటంటే అని చెప్పసాగాడు రామారావు  ఒకసారి చక్కటి వంకాయకూరతో విందు భోజనం చేసిన అక్బరు బాదుషా ఆ ఆనందాన్ని తట్టుకోలేక బీర్బల్ తో బీర్బల్ వంకాయ కూర ఎంతరుచిగా ఉందొ తెలుసా వంకాయ కూర తినని వాడి జన్మ జన్మే కాదు అని అన్నాడట దానికి మన బీర్బల్ జహాపనా మీరు చెప్పింది నిజం వంకాయను కూరలలో రాజు అని పేరు.   అందుకే భగవంతుడు వంకాయను ప్రత్యేకంగా చూసాడు అంతేకాదు దాని తలమీద కిరీటాన్ని పెట్టాడు అని అన్నాడట. అట్లానా  అని బాదుషా బీరుబలును, వంకాయను మెచ్చుకున్నాడట.

సుబ్బారావూ  వంకాయకూర గురించి చెప్పాలంటే ఎంతసేపైనా పడుతుంది. నీకు తెలుసుకదా మన బెజవాడ బెంజ్ సర్కిలులొ వంకాయ విలాస్ అనే ఆంధ్రభోజాన హోటలు వుంది అది వంకాయ కూరకు పెట్టింది పేరు. ఆ హోటల్లో భజనం చేయని బెజవాడ వాస్తవ్యుడు లేదంటే నమ్మండి. ఇంట్లో భార్య వంట సరిగా చేయకపోతే వెంటనే వంకాయ విలాసకు వెళ్లి భోజనం చేసే పురుషపుంగవులు ఎంతమందో నీకు తేలుసా.   ఇటీవల భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేసుకొవటంతో వాళ్లకు దొరికినప్పుడల్లా వంకాయ విలాస్ హోటలు నుంచి భోజనము తెప్పించుకొని తింటూవున్నారు. అందుకే ఇప్పుడు జొమాటో, స్విగ్గి లాంటి సంస్థలు తమ తమ వ్యాపారాలని వృద్దిచేసుకుంటున్నాయంటే దానికి కారణము వంకాయ కూర అంటే నమ్మండి అని అన్నాడు. . హైదరాబాదు నుండిబెజవాడమీదుగా తిరుపతి పెళ్లే యాత్రికులు ఒక పూట బెజవాడలో దిగి వంకాయ విలాసులో వంకాయ కూరతో భుజించి వెళ్ళటం పరిపాటి.  ఇటీవల బెజవాడ వంకాయ విలాస్ హోటలు వాళ్ళు హైదరాబాదులో డిలీషకానగరులో ఒక బ్రాంచి తెరిచారు.  అంతేకాదు మండపేటలో చాలా చోట్ల వీధి బండ్లమీదఁ వంకాయలో మసాలా పెట్టివంకాయ బాజ్జెలు చేస్తారు అవి ఒకసారి తింటే చాలు మళ్ళి మళ్ళి  తినాలనిపిస్తుంది.

మా వూళ్ళో నాగభూషణం అనే వకీలు ఒక ఆయన  అయన దగ్గరికి విడాకులు తీసుకోవటానికి వచ్చే దంపతులకు సర్దిచెప్పి భార్యకు వంకాయకురా మహత్యం చెప్పి చక్కగా వంకాయకూర చేయటం నేర్పించి అది వాళ్ళ భర్తలకు తినిపించమని సలహా ఇచ్చేవాడట అట్లా చేయటం వలన భార్య చేతి వంకాయ కూర తిన్న భర్త భార్యమీద ప్రేమను పెంచుకొని ఇద్దరు అన్యోన్యంగా ఉండేవారని. ఇలా సలహా ఇచ్చినందుకు ఆయన వసులు చేసిన పీజులతో ఒక మూడు అంతస్తుల భవనం నిర్మించాడని దానికి వంకాయ నివాస్ అని పేరు పెట్టాడని చెపుతారు. ఈ విషయం తెలుసుకున్న అనేకమంది భార్యలు తమ తమ భర్తలను వశం చేసుకోవటానికి చక్కగా వంకాయ కూర చేయటం నేర్చుకొని వాళ్ళ భర్తలకు తినిపించి భర్తలను కొంగుకు కట్టుకుంటున్నారని ఒక వదన్తి. 

వకీళ్ళకే కాదు డాక్టర్లకు కూడా వంకాయ కూర కల్పవృక్షం లాంటిది అని రామారావు అన్నాడు అది యెట్లా అన్నాడు సుబ్బారావు నాకు తెలిసిన డాక్టరును నేను నీ ప్రాక్టీస్ ఇంత బాగా వృద్ధిలోకి రావటానికి కారణమ్ ఏమిటని అడిగాను.  దానికి ఆయన నీవు ఎవ్వరికీ చెప్పానంటే చెపుతాను అని నాతొ ప్రామిస్ చేయించుకొని మరి చెప్పాడు అది వంకాయ కూర అని అన్నాడు. అదేమిటి వంకాయ కూరకు నీ ప్రాక్టీసుకు ఏమిటి సంబంధం అని నేనన్నాను. వంకాయ కూర అందరు ఇష్టంగా తింటారా లేదా చెప్పు అన్నాడు తింటారు అని అన్నాను నేను. . అప్పుడేమవుతుంది, ఏమవుతుంది వంట్లో వాతం కఫం అజీర్తి పిత్తం అన్నే ముదిరి సంపూర్ణ ఆరోగ్యంగా వున్న వాడు కాస్త అడ్డం పడతాడు. వాళ్ళ వాళ్ళ వయసుని పట్టి వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి వారి వారి రోగాలు ఆధారపడతాయి. ఇక యెంత చెట్టుకు అంత గాలి అన్నట్లు యెంత రోగానికి అంత ఫీజు నేను వసులు చేస్తాను అని ఆ డాక్టరుగారు చెప్పారు. పేషంటు రాగానే వెంటనే సెలైన్ పెట్టి ముప్పైఆరు రకాల టెస్టులు చేయించి నలభై రకాల మందులు వ్రాసి నాలుగు రోజులు ఆసుపత్రిలో ఉంచుకొని వేలు లక్షలలో ఫీజులు గుంజి వదిలి పెడతాను అని తన వృత్తి రహస్యం చెప్పాడు డాక్టరుగారు. ఎవ్వరికీ చెప్పనని ప్రమాణం చేసాను కాబట్టి నీకు మాత్రమే నేను చెపుతున్నాను అని అన్నాడు రామారావు.  

రామారావు  అంతటితో ఆగలేదు ఇంకా ఇట్లా చెప్పటం మొదలు పెట్టాడు. పెండ్లి చూపుల్లో పిల్లవాడి తల్లి అమ్మాయితో నీకు వంట వచ్చా సంగీతం వచ్చా, డాన్సు వచ్చా టైపింగ్ వచ్చా కంప్యూటర్ వచ్చా అని సవాలక్ష ప్రశ్నలు వేస్తూ వుంటారు కానీ సమర్థురాలైన పిల్లవాని తల్లి ఒకే ఒక ప్రశ్న వేస్తుంది. అదేమిటంటే అమ్మాయి నీకు వంకాయ కూర వండటం వచ్చా వస్తే వంకాయను ఎన్ని రకాలుగా వండుతారు చెప్పమని అడుగుతుంది. అని అన్నాడు. 

ఆ తరువాత రామారావు సుబ్బారావుని నీకు వంకాయలలో రకాలు తెలుసా అని అడిగాడు.  నాకు తెలియదు. అయితే విను మాములుగా మనకు తెలిసిన వంకాయ వంకాయ రంగు వంకాయలు అవి పొడుగుగా ఉంటాయి. అవి కాక గుండ్రటి వంకాయలు, తెల్ల గుండ్రటి వంకాయలు, చారల గుండ్రటి వంకాయలు, తెల్ల వంకాయలు, బొండం వంకాయలు, బజ్జే వంకాయలు ఇంకా కొన్ని కొత్త వంగడాలను మన శాస్త్రవేత్తలు కనిపెడుతున్నారని చెప్పాడు. 

పాఠక మిత్రమా ఇదండీ వంకాయ చెరిత్ర. ఇంకా ఈ రచయితకు తెలియని వంకాయ కూర గురించి మీకు తెలిస్తే చెపితే ఇంకా విస్తృతంగా ఈ రచను చేయగలడు. 

గమనిక: వంకాయను తప్ప ఇతర కూరలను నిందించటం ఈ రచయితా ఉద్దేశ్యం కాదు. కేవలం వంకాయ కూర ప్రాముఖ్యాన్ని తెలపటం మాత్రమే అని తెలుసుకోగలరు.  

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

ఇట్లు 

మీ వంకాయ కూర ప్రియుడు. 

చేరువేల భార్గవ శర్మ 





శుక్రాచార్యుడు

 రాక్షస గురువు శుక్రాచార్యుడు, అతను చెడును కదా ప్రోత్సహించేవాడు,మరి బృహస్పతి వంటి గురువుల కోవలోకి ఎలా చేర్చారు?


~~ జ్ఞానం మరియు తపస్సు :


~ శుక్రాచార్యుడు భృగు మహర్షి కుమారుడు. ఆయన బ్రహ్మ మానసపుత్రుడైన భృగువు వంశంలో జన్మించారు.


~ ఆయన వేదాలు, ధర్మశాస్త్రాలు, నీతిశాస్త్రాలు, రాజనీతి మరియు అనేక శాస్త్రాలలో అపారమైన పరిజ్ఞానం కలిగిన మహాజ్ఞాని. బృహస్పతి కూడా ఇదే విధంగా జ్ఞాన సంపన్నుడు.


~ అపారమైన తపస్సు చేసి, శివుని నుండి మృత సంజీవని విద్యను పొందారు. ఈ విద్య ఆయన గొప్ప శక్తికి, తపస్సుకు నిదర్శనం.


~ రాక్షసులకు గురువుగా ఉన్నప్పటికీ, ఆయన వారికి కేవలం యుద్ధ విద్యలను మాత్రమే కాకుండా, ధర్మాన్ని, రాజనీతిని బోధించారు. కొన్ని సందర్భాలలో, రాక్షసులు ధర్మం తప్పినప్పుడు వారిని మందలించడం లేదా శపించడం కూడా చేశారు ఉదా: యయాతి కథలో శాపం.


~~ గురువుగా అతని స్థానం - దైవత్వం:


~ హిందూ పురాణాలలో గురువు అనే పదానికి వ్యక్తిగత రాగద్వేషాలకు అతీతంగా విద్య, జ్ఞానం బోధించే పవిత్రమైన స్థానం ఉంది. శుక్రాచార్యుడు, బృహస్పతి ఇద్దరూ తమ శిష్యులయిన దేవతలు లేదా ఆసురులకు అత్యున్నతమైన జ్ఞానాన్ని బోధించారు, కాబట్టి వారిద్దరూ గురు పీఠానికి అర్హులే.


~ నవగ్రహాలలో, శుక్రుడు అంటే శుక్రాచార్యుడు మరియు గురుడు అంటే బృహస్పతి అత్యంత ముఖ్యమైన స్థానాలను కలిగి ఉన్నారు. శుక్రుడు సంపద, ఐశ్వర్యం, కళలు, ప్రేమకు అధిపతి. బృహస్పతి జ్ఞానం, బుద్ధి, శుభాలకు అధిపతి. ఇద్దరూ దైవత్వాన్ని పొందినవారు, అత్యున్నత శక్తి సంపన్నులు.


~~ రాక్షసులకు గురువుగా మారడానికి గల కారణం:


~ శుక్రాచార్యుడు మొదట్లో దేవతలకు లేదా మరే ఇతర పక్షానికి వ్యతిరేకి కాదు. ఆయన గురువైన అంగీరస మహర్షి తన కుమారుడైన బృహస్పతి పట్ల పక్షపాతం చూపించారనే భావనతో కలత చెందారు.


~ ముఖ్యంగా, విష్ణుమూర్తి ఒకానొక సందర్భంలో శుక్రాచార్యుని తల్లియైన కావ్యమాతను లేదా ఉశనస భార్యను చంపడం జరిగింది. ఆ పగతోనే శుక్రాచార్యుడు దేవతలపై కోపంతో అసురులకు గురువుగా ఉండాలని నిర్ణయించుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. అంటే, ఆయన వైరాగ్యానికి, అసురులకు మద్దతుగా నిలవడానికి వ్యక్తిగత కారణాలు, వైష్ణవంతో వచ్చిన విభేదాలు ఉన్నాయి, కానీ ఆయన స్వతహాగా "చెడు"ను ప్రోత్సహించేవారు కాదు, జ్ఞానాన్ని బోధించే గురువు.


~ శుక్రాచార్యుడు అసురులకు గురువుగా ఉన్నప్పటికీ, తన శిష్యుడైన కచుడికి ( బృహస్పతి కుమారుడు, దేవతల పక్షం ) కూడా పవిత్రమైన మృత సంజీవని విద్యను బోధించారు. ఇది ఆయనలోని గురు ధర్మానికి నిదర్శనం.


~~ ధర్మ పరిరక్షణ :


కొన్ని సందర్భాలలో, శుక్రాచార్యుడు శిష్యులకు పక్షపాతం చూపినా, ధర్మాన్ని నిలబెట్టడానికి కృషి చేశారు. ఉదాహరణకు, కచుడిని చంపి, మదిరలో కలిపి త్రాగడం ద్వారా జరిగిన అనర్థాన్ని గ్రహించి, ఆపైన రాక్షసులకు సురాపానాన్ని (మద్యం సేవించడాన్ని) నిషేధించారు. అలాగే, మహాబలి చక్రవర్తి వామనుడికి దానం చేసేటప్పుడు, ఆ దానం చేయడం సరైనది కాదని తెలిసినా, ధర్మబద్ధమైన దానం చేయడాన్ని ఆపడానికి యత్నించడం ఆయన రాజనీతిజ్ఞతను తెలియజేస్తుంది.


ముగింపులో,,,,, శుక్రాచార్యుడు రాక్షసులకు గురువైనప్పటికీ, ఆయన ఒక మహర్షి, అపారమైన జ్ఞాని, తపశ్శక్తి సంపన్నుడు. ఆయనలోని 'అసుర గురు' అంశం కేవలం దైవ-దానవ యుద్ధంలో ఒక పక్షాన్ని ఎంచుకోవడం వల్ల వచ్చింది తప్ప, ఆయన గురుత్వం లేదా జ్ఞానం తక్కువైనది కాదు. అందుకే, బృహస్పతి వలె ఆయన కూడా గురు పరంపరలో అత్యున్నతమైన స్థానాన్ని కలిగి ఉన్నారు.