20, ఆగస్టు 2025, బుధవారం

పోతన

 🙏పోతన విశ్వ రూప సందర్శనము🙏

వామనుడు త్రివిక్రముడైన విధానం వర్ణించిన తీరు అద్భుతం. ఇది మూలంలో లేదు. పోతన మహాశయుడు సొంతంగా రచించి మనలకు కన్నులకు కట్టాడు.ఆ పద్యరాజములను చూద్దాము

.

శా. ఇంతింతై వటుఁడింతయై మరియుఁ దానింతై నభోవీధిపై

      నంతై తోయద మండలాభ్రమున కల్లంతై ప్రభారాశిపై

      నంతై చంద్రుని కంతయై ధ్రువుని పైనంతై మహర్వాటిపై

      నంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై!!

ఈ పద్యం ఏదో ఒక సందర్భంలో వినని వారుండరనుకుంటాను. ఒక సామాన్యుడిగా బ్రతుకు ప్రారంభించి. అంచెలంచలుగా ఎదిగి ఉన్నత శిఖరాలకు చేరుకున్న వ్యక్తిని గురించో, అలాగే సన్నగా ప్రారంభమై క్రమక్రమాభివృద్ధి పొంది మిన్నగా రూపొందిన దాన్ని గురించో చెప్పేటప్పుడు ‘ఇంతింతై వటుడింతయై అన్నట్టు ఎదిగిపోయాడు’ అని చెప్పుకోవటం పరిపాటి. అంతగా ప్రజల నాలుకల మీద – కనీసం మొదటి లైను ఐనా – నిలిచిపోయింది ఈ పద్యం. ఈ పద్యంలోని ప్రసన్నమైన శైలి చెప్పకనే చెబుతుంది ఇది బమ్మెర పోతనామాత్యుని పద్యమని. పోతన ఆంధ్రీకరించిన భాగవతం అష్టమ స్కంధంలో – వామనుడు త్రివిక్రముడై పెరిగిపోయే దృశ్యాన్ని అత్యంత సహజసుందరంగా వర్ణించిన పద్యం ఇది.

బలి చక్రవర్తి వద్ద నుంచి మూడడుగుల నేలను దానంగా పొంది, ఒక అడుగును భూమిపై మోపి, రెండో అడుగుతో బ్రహ్మాండాన్ని ఆక్రమించడం కోసం క్రిందనుంచి ఒక్కోదాన్నే దాటుకుంటూ ఎలా విజృంభించాడో, ఏ విశేషణాలూ లేకుండా, ఒక మహాద్భుత దృశ్యాన్ని కండ్ల ముందు రూపు కట్టించాడు పోతన.  చేతులతో అభినయంచకుండా ఈ పద్యం బోధించలేము.చేతులతో చూపిస్తూ ముఖం ఆకాశము వైపు ఎత్తవలసినదే.

ఇంతైనాడు, మరిం తైనాడు, ఆకాశానికి అంతైనాడు, మేఘమండలానికి అల్లంతైనాడు, జ్యోతిర్మండలానికి అంతైనాడు, చంద్రుణ్ణి దాటాడు, ధ్రువుని దాటి ఇంకా పైకి సాగాడు, మహర్లోకం దాటినాడు, చూస్తుండగానే సత్యలోకంకన్నా ఉన్నతంగా ఎదిగాడు. బ్రహ్మాండమంతా నిండిపోయాడు – ఇదీ ఒక కుబ్జబాలకుడు క్రమక్రమంగా బ్రహ్మాండ భాండాన్ని ఆక్రమించిన త్రివిక్రమ స్ఫూర్తి. క్రింద మునులూ, బలి చక్రవర్తీ, శుక్రుడూ నివ్వెరపోయి పూర్వం కండ్లముందు నిలుచున్న బ్రహ్మచారి బాలకుడు – ఒక్కసారిగా కాదు – క్రమక్రమంగా ఎదిగి భూనభోంతరాలు నిండిపోవడాన్ని ఇంతకన్నా అందంగా రూపు కట్టించడం అసాధ్యమనుకుంటాను. పద్యం పద పదానికీ విరుగుతూ, వామనుడు పద పదానికీ పెరుగుతూపోయే క్రమతను రూపించింది. ఇంతై, అంతై, దీనికింతై, దానికింతై అంటూ ఒక గొప్ప దృశ్యానికి ప్రత్యక్ష వివరణ, ప్రత్యక్ష ప్రసారము ఏకకాలంలో చేశాడు కవి. ఈ పద్యం మనసున పట్టించుకొని చదువుతూ ఉంటే ఒక గ్రాఫిక్ దృశ్యం కండ్లముందు నిలిచిపోతుంది. నిజం చెప్పాలంటే 

కెమెరాలో చిత్రించి చూపించాడు. ఇంతటితో సంతృప్తి చెందలేదు. ఇంకా వివరించాలి అనుకున్నాడు 

ఈ పద్యం తరువాతనే మరో పద్యం ఉంది. క్రిందినుంచి వామనుడు క్రమక్రమంగా పైకి పోయే కొద్దీ పైనున్న సూర్యబింబాన్ని ఈ పెరిగే పెద్దమనిషితో కలిపి చూపిస్తూ ఆ రవిబింబపు దశల్లోని వివిధరూపాలని వర్ణించిన పద్యం అది. ఇంతకు ముందు చూపిన దృశ్యాన్నే మరో కోణంలో చూపించడమన్నమాట. వామనుడు పెరిగేకొద్దీ సూర్యబింబం ఎలా ఉందంటే, ముందు ఒక గొడుగు లాగా అతని తలపై కనిపించి, క్రమంగా శిరోరత్నం గానూ, చెవి కమ్మగానూ, కంఠా భరణంగానూ, బంగారు భుజ కీర్తులు లాగానూ, కరకంకణం లాగానూ, నడుముకు కట్టిన మొలతాటి బంగారు గంట గానూ, పాదాల అందె గానూ ఆఖరుకు పాదపీఠం గానూ ఉపమించడానికి యోగ్యంగా కనిపించిందట. ఆ పద్యం కూడా చిత్తగించండి.ఈ పద్యం లో మన దృష్టి సూర్యునిపై కేంద్రీకరింప జేశాడు మీరు సూర్యుణ్ణే చూడమన్నాడు సూర్య బింబము ఎలా మారుతోందో చక్కగా చిత్రీకరించాడు 

రవిబింబంబుపమింప బాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై

శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణ కేయూరమై

ఛవి మత్కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటయై నూపుర

ప్రవరంబై పదపీఠమై వటుడుదా బ్రహ్మాండ మున్నిండుచోన్

మహానుభావుడు పోతన. భగవంతుని లీలలను వర్ణించే ఘట్టం వచ్చేసరికి పోతనకి ఒళ్ళు తెలియనంత తాదాత్మ్యం ఆవహిస్తుంది. ఆ తాదాత్మ్యంలో వ్రాసే పద్యాలు గుండెలను పట్టుకునేవిగా రూపొందుతాయి. ఆ పద్యాల్లో గణాలు, యతులు, ప్రాసలు ఇవ్వన్నీ అలవోకగా జేరిపోయి ఒక మహాభక్తుని ఆంతరంగ పారవశ్యం వాటిల్లో పొంగిపొరలుతూ వుంటుంది. భాగవతంలోని అనేక ఘట్టాలు – ప్రహ్లాద చరిత్ర, గజేంద్రమోక్షము, రుక్మిణీ కళ్యాణము, కృష్ణ లీలలు, అంబరీషోపాఖ్యానము లాంటివి – దీనికి తిరుగులేని సాక్ష్యాలు. భాగవతం లాంటి గొప్ప భక్తి పురాణం పోతన చేతిలో పడి తెలుగులోకి రావటం, తెలుగు జాతి చేసుకున్న గొప్ప అదృష్టం 

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

అలంకార శాస్త్ర కర్త ,వచన పితామహుడు -దండి


🙏అలంకార శాస్త్ర కర్త ,వచన పితామహుడు -దండి🙏..

ఉపమా కాళిదాసస్య

భారవే రర్థగౌరవం!

దండినః పదలాలిత్యం

మాఘే సంతి త్రయోగుణాః

పదలాలిత్యం అనేది దండి నుండి వచ్చిన గొప్ప కావ్య లక్షణం 

జాతే జగతి వాల్మీకౌ కవిరిత్యాభిదాభవత కవీ ఇతి తతో వ్యాసే కవయస్త్వవి దండిని 

ప్రపంచం పుట్టాక వాల్మీకి కవి (ఏక వచనము)గా పేరు తెచ్చుకున్నాడు.వ్యాసుడు వచ్చాక కవీ (ద్వితీయ వచనము) అని, తరువాత దండితో కలిసి కవులు (బహు వచనము) అని పిలవటం జరిగింది. 

దండి రచించన రచనలు:

దశకుమారచరితము - కథా రూపంలో ఉన్న గద్య పద్యం.కావ్యదర్శ - లక్షణ గ్రంథము అవంతిసుందరికథ - ఒక గద్య పద్యం

ఛన్దోవిచితిః   కళాపరిచ్చేదము

ద్విసంధాన కావ్యము  వాతమందిరము.

వాటిలో మూడు చాలా ప్రసిద్ధమైనవి - దశకుమారచరితం, కావ్యదర్శము,, అవంతీసుందరికథ...

అవంతీసుందరి కథ ప్రకారం,  దామోదరుని నలుగురు కుమారులలో చిన్నవాడు వీరదత్తుడు, అతని కుమారుడు దండి. అతని తల్లి గౌరి. దామోదరుడు భారవరుడికి సన్నిహిత మిత్రుడని చెబుతారు. ఇతను కంచి రాజు, విష్ణు సింహం విష్ణువర్ధనుని సభా పండితుడు. దామోదర కుమారుడైన వీరేశ్వర దత్త కూడా సింఘా, విష్ణువుల కుమారుడైన మహేంద్రవర్మన్ సభలో పండితుడు. అదేవిధంగా, అతని కుమారుడు దండి మహేంద్రవర్మన్, అతని కుమారుడు నరసింహవర్మన్, అతని కుమారుడు రాజవర్మన్ సభకు అధ్యక్షుడిగా ఉన్నారు. నరసింహవర్మన్ పాలన కాలం సుమారు 747-782 AD. అదేవిధంగా అవంతీసుందరి కథలో తెలుపబడింది.ఇందులో వర్ణించబడిన కాదంబరి వర్ణన బాణుడు వర్ణించిన కాదంబరి వర్ణనను పోలి ఉంటుందని దీన్నిబట్టి తెలుస్తోంది. 715 సా.శ.లో బాణుడు దైవికం చెందాడని అంటారు.

దండి యొక్క సరళమైన భాష, ఇది రాజభవన గుణాలతో సమృద్ధిగా ఉన్నందున, ఇతను బాణడు తరువాత కాలం వాడని అనుకుంటారు. దండి సంస్కృత సాహిత్యంలో ఆరాధ్య కవి అని చెప్పబడింది -

కవితా కళా ప్రావీణ్యానికి మూడు ప్రధానమైన హేతువులుండాలని తొలిసారిగా ‘భామహుడు’ అనే ఆలంకారికుడు పేర్కొన్నారు. వీటినే కావ్య హేతువులు, కావ్య సామగ్రి, సాధన సామగ్రి పేర్లతో పిలుస్తారు.

1) ప్రతిభ

2) వ్యుత్పత్తి

3) అభ్యాసం అనేవి భామహుడు పేర్కొన్న కావ్య హేతువులు.ఈ మూడు లక్షణాలు సంపూర్ణంగా కలవాడు దండి మహాకవి 

దండి: ‘కావ్యాదర్శం’లో ‘ఇష్టార్థ వ్యవచ్ఛిన్న పదావళీ కావ్యమ్’.. మనోహరమైన అర్థంతో కూడిన పదాల సమూహమే కావ్యమన్నాడు. అందుకు అనుగుణంగా వ్రాసిన కావ్యం దశకుమార చరిత్ర. 

దండి కవి కాలాన్ని ఇద మిద్ధం గా చెప్పలేక పోతున్నారు .కాని ఆరు ,ఏడు శతాబ్ద కాలం వాడని భావిస్తారు .కొందరు భారత దేశం పై ముస్లిం ల దండయాత్రకు ముందే దండి జీవించి ఉన్నడని అంటారు .దండం చేతిలో ఉన్న వాడిని దండి అంటారని మనకు తెలుసు .ముగ్గురు దండి లున్నారని మరో కధనం .దండి అనేది అసలు పేరుకాక పోవచ్చు .అయిదవ శతాబ్దికి చెందినా‘’సేతు బంధ ‘’కావ్యం లో కావ్యాదర్శాన్ని గురించి ఉంది కనుక అయిదు ఆరు శతాబ్దాల మధ్యకాలమే దండి జీవించిన కాలం అని గట్టిగా చెబుతున్నారు .

 ఈతడు దక్షిణాదికి చెందిన వ్యక్తి అని మాత్రమే తెలిసింది.

దండి యొక్క సరళమైన భాష, ఇది రాజభవన గుణాలతో సమృద్ధిగా ఉన్నందున, ఇతను బాణడు తరువాత కాలం వాడని అనుకుంటారు. దండి సంస్కృత సాహిత్యంలో ఆరాధ్య కవి అని చెప్పబడింది -

పదవ శతాబ్దము వరకు దశకుమార చరిత్రను ఎవరూ పేర్కొనక పోవటం విచిత్రమే .మరికొందరు కాళిదాసు సమకాలీనుడు అన్నారుకాని అది నమ్మ శక్యం కాని విషయమే .వచన కావ్యాలు ,అలంకార శాస్త్రమూ రాసి పేరుపొందాడు .సృజనకు మారుపేరుగా ఆయన వ్రాసిన ‘’దశ కుమార చరిత్ర ‘’నిలబడింది . దండి ని పదలాలిత్యానికి ఉదహరిస్తారు ‘’.కావ్యాదర్శం’’ అనే గొప్ప అలంకార శాస్త్రాన్నికవిత్వం గా సృష్టించాడు .ఇది మొదటి అలంకార శాస్త్రం గా గుర్తింపు పొందింది .తమిళ నాడులోని కాంచీపుర వాసి .భట్టి కావ్యాలకు ఈ అలంకార శాస్త్రం ప్రేరణ నిచ్చింది .ముప్ఫై ఆరు రకాల అలంకారాల గురించి చర్చించాడు .అలంకారాలు కావ్యానికి నిజమైన అలంకారాలని వాటి వలన శోభ కలుగుతుందని దండి భావన .సంక్లిష్ట సమాస రచన దండి ప్రత్యేకత .సుదీర్ఘ వాక్య విన్యాసం తో ఉక్కిరి బిక్కిరి చేస్తాడు .ఒక్కోసారి వాక్యం అరపేజీ దాకా ఉండేట్లు రాసిన సందర్భాలున్నాయి ..అనేక సంయుక్తపదాలను అలవోకగా వాడి నిండుదనాన్ని తెచ్చాడు .


దశ కుమార చరిత్రలో పది మంది యువరాజులు ప్రేమ ,రాజరిక అధికారం కోసం చేసే ప్రయత్నాల కధలుంటాయి .ఆ నాటి సమాజం లోని వివిధ అంశాలకు ప్రతి రూపంగా కమనీయమైన సంస్కృత వచన శైలితో దీనిని తీర్చిదిద్దాడు .సామాన్య జన జీవితాన్ని ప్రదర్శించాడు ఆ కధల్లో .ఇందులో పూర్వ పీఠిక ,దశ కుమార చరిత్ర ,ఉత్తర పీఠిక అని మూడు భాగాలున్నాయి .ముందే చెప్పినట్లు పదలాలిత్యానికి పట్టాభిషేకం చేశాడు దండి .అందుకే ‘’దండినః పదలాలిత్యం ‘’అంటారు.దండి 


దశకుమార చరిత్రం లో మొదటి రెండు అధ్యాయాల్లో ఉపోద్ఘాతంగ కధను చెప్పాడు. .ముసలి రాజు రాజహంస తన కుమారులు చాలాకాలం కనిపించక పోవటం తో ఒక మునీశ్వరుడిని అర్ధిస్తే, వాళ్లు పదహారేళ్ళ తర్వాత తిరిగి వస్తారని ఆయన సెలవి విచ్చాడు .అలాగే వారు చేరుకొని పెద్ద సైన్యం తో వచ్చి శత్రురాజు ‘’మనసార ‘’ను ఓడించి ,అనేక దేశాలను జయించి సుస్తిరం గా దేశసంచారం లో లభించిన విజ్ఞానంతో ప్రజారంజకం గా రాజ్య పాలన చేశారు .

ఆ మహాకవి వ్రాసిన దశకుమార చరిత్ర ప్రారంభ వాక్యాలు చూద్దాము. పదాలతో చేసిన విన్యాసం చూద్దాము.


బ్రహ్మాణ్డచ్ఛతదణ్ణఃశతధృతిభవనామ్భోరుహోనాలదణ్ణ: క్షోణీనౌకూపదణ్ణః క్షరదమర సరిత్పట్టికా కేతుడణ్ణ. జ్యోతిశ్చక్రాక్షదణ్ణస్త్రీభువనవిజయ సమ్భదండో బంఫ్రీదణ్ణః శ్రేయస్త్రి విక్రమ స్తే వితరతు విబుధ ద్వేషిణాం కాలదణ్ణః.


అస్తి సమస్తనగరీనిక పాయమాణా, శశ్వ దగణ్యపణ్య విస్తారితమణిగణాదివ స్తుజాత వ్యాఖ్యాతరత్నాకర మాహాత్యా మగధదేశ శేఖరీభూతా, పుష్పఫురీ నామ నగరీ తత్ర వీరభట పటలసలిలోత్తుఙ్గతుకఙ్గ తరఙ్గ కుజ్జరమకర భీషణ సకలరిపుగణ కటక జలనిధి మథన మన్దరాయమాణసముద్దణ్ణభుజదణ్ణ మణ్ణనః, పుర్వర పురాఙ్గణ వన విహరణ పరాయణ తరుణగణికాజన గీయమానయా –తిమానయా శరదిన్దు కున్ద ఘనసార నీహార హార మృణాళ మరాళ సురగజ నీరక్షీర గిరిశాట్టహాస కైలాస కాశ నీకాశ మూర్త్యా రచితదిగ స్తరాలవూర్త్యా భిత స్సుర భీతః, స్వర్ణోకశిఖరోరురుచిరరత్నరత్నాకరవేలామేఖలా వల యిత ధరణీరమణీసౌభాగ్యభోగభాగ్యవాస్, అనవరతయాగ...........


కేతన కవి తెలుగులోకి పద్య కావ్యం గా దశ కుమార చరిత్రను 1250లో అనువదించాడు

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ