🔯🌹🌷🪔🛕🪔🌷🌹🔯
*🕉️సోమవారం 25 ఆగస్టు 2025🕉️*
4️⃣2️⃣
*ప్రతిరోజూ*
*మహాకవి బమ్మెర పోతనామాత్య*
*శ్రీమద్భాగవత కథలు*```
(రామకృష్ణ మఠం, హైదరాబాద్ ప్రచురణ ఆధారంగా)```
*వేదాలు వేయి సార్లు చదివినా లభ్యం కాని ముక్తి, భాగవతాన్ని ఒక్కసారి పఠిస్తే ముక్తి లభిస్తుంది..!*``
*జంబూద్వీపంలో భారతవర్షం కర్మభూమి*
```
వర్షాలన్నింటిలోను భారత వర్షమే కర్మక్షేత్రం. ఏ వర్షంలో ఎవరు ఎలాంటి సుఖదుఃఖాలను అనుభవించినా దానికి కారణాలైన పుణ్యకర్మలనీ, పాప కర్మలనీ ఆచరించే స్థలం భారత వర్షం. మిగతా ఎనిమిది వర్షాలు పుణ్యకర్మలను అనుభవించే స్థానాలు, పుణ్యకర్మలను అనుభవించే స్థానానికి స్వర్గం అని పేరు. ఆ కర్మలో కొంతమేరకు కర్మఫలాన్ని అనుభవించి, మిగులు ఉండగా జీవులు భూమిని చేరుతూ ఉంటారు. అలా చేరి, మిగిలి ఉన్న పుణ్యఫలాలను అనుభవిస్తారు. వాటిని భౌమ స్వర్గాలని అంటారు. అలాంటి భౌమ స్వర్గాలు ఎనిమిది వర్షాలు. దానికి మూలమైన పుణ్యాన్ని ఆచరించే స్థానం భారత వర్షం. ఇక శ్రేష్టమైన భారత వర్షం కథ ఏమిటంటే:
స్వాయంభువ మనువుకు ప్రియవ్రతుడు అనే కొడుకు జన్మించాడు. అతడికి అగ్నీధ్రుడు అనే కుమారుడు పుట్టాడు. అతడికి నాభి అనే వాడు పుట్టి బలి చక్రవర్తితో స్నేహం చేశాడు. సమస్త భూమండలాన్ని పాలించాడు నాభి అతడికి ఋషభుడు అనే సద్గుణవంతుడైన కొడుకు పుట్టాడు. అతడి కొడుకుల్లో పెద్దవాడైన భరతుడు ఘోరమైన తపస్సు చేసి, మనస్సును సంసార బంధాల నుండి మళ్లించి చివరకు వాసుదేవుడిని చేరుకున్నాడు. ఆ పుణ్యాత్ముడు ఏలిన భూమండలానికి అతడి పేరుమీద 'భారతవర్షం' అని ఏర్పడి, క్రమేపీ జగత్వసిద్ధం అయింది.
ఇలావృతం మొదలుగా గల తొమ్మిది వర్గాలలోనూ భగవానుడైన నారాయణుడు అవతరించి, నిత్యం లోకాలను అనుగ్రహిస్తూ, లోకులందరికీ జ్ఞానం ఇస్తాడు. ఇలావృత వర్గానికి అధిపతి త్రిపురాలను హరించిన రుద్రుడు. భద్రాశ్వ వర్షానికి అధిపతి భద్రశ్రవుడు. హరి వర్షానికి అధిపతి నరసింహస్వామి. కేతుమాల వర్షంలో భగవానుడు కామదేవుడు (ఈయన్నే ప్రద్యుమ్నుడు అని అంటారు) అనే పేరుతో లక్ష్మీదేవికి ప్రీతి కలిగిస్తూ ఉంటాడు. ఈ వర్షానికి అధిపతులు ప్రజాపతైన సంవత్సురిడి కుమార్తెలు, కుమారులు. కొడుకులు పగళ్లు, కూతుర్లు రాత్రులు. రమ్యక వర్షానికి అధిదేవత మత్స్యరూపంలో ఉంటాడు. అతడు హరే! ఈ వర్షాధిపతి మనువు. ఇతడు మత్స్యమూర్తిని ఆరాధిస్తుంటాడు. ఇక హిరణ్మయ వర్షం అధినేత కూర్మావతార రూపుడైన పద్మగర్భుడు శ్రీమహావిష్ణువు. పితృదేవతల అధిపతియైన అర్యముడు హిరణ్మయవర్ష పాలకుడు. ఉత్తర కురు భూములకు వరాహదేవుడు అధిపతి. భూదేవి అతడికి పూజ చేస్తుంటుంది. కింపురుష వర్షానికి సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరామభద్రుడు అధిపతి. భారత వర్గానికి అధిపతి నారాయణుడు. బదరికాశ్రమంలో నరుడితో కలిసి తపస్సు చేశాడు. భారత వర్షంలో ఎన్నో పుణ్యశైలాలు, గంబీరంగా ప్రవహించే అనేక నదులు ఉన్నాయి. అవి...
పుణ్యశైలాలు: మలయ పర్వతం, మంగళ ప్రస్థం, మైనాకం, ఋషభం, కూతకం, కొల్లకం, సహయం, వేదగిరి, ఋష్యమూకం, శ్రీశైలం, వేంకటాద్రి, మహేంద్రం, వారిధరం, వింధ్యపర్వతం, శుక్తిమత్పర్వతం, ఋక్షగిరి, పారియాత్రం, ద్రోణపర్వతం, చిత్రకూటం, రైవతకం, కుకుభం, నీలగిరి, గోకాముఖం, ఇంద్రకీలం, రామగిరి మొదలైనవి.
*పవిత్ర నదులు:* పైన చెప్పిన పర్వతాలకు పుత్రికలైన పుణ్యనదులు: చంద్రపట, తామ్రపర్ణి, కృతమాల, వైహాయాసి, కావేరి, వేణి, పయస్విని, పయోద, శర్కరావర్త, తుంగభద్ర, కృష్ణవేణి, భీమరథి, గోదావరి, నిర్వింధ్య, పయోష్ఠి, తాపి, రెవ, సురస, చర్మణవతి, వేదస్మృతి, ఋషికుల్వ, త్రిసోమ, కౌశికి, మందాకిని, యమునా, సరస్వతి, దృషద్వతి, గోమతి, సరయువు, భోగవతి, సుషోమ, శతద్రువు, చంద్రభాగ, మరుద్వరుథ, వితస్త, అసిక్ని, విశ్వ అనే మహానదులు. నర్మదానది, సింధువు, శోణ అనే నదాలు భారత వర్షంలో ప్రవహిస్తున్న మహా ప్రవాహాలు. వీటిల్లో పవిత్రంగా స్నానాలు చేస్తే మానవులు ముక్తిని పొందుతారు.
భారత వర్షం ఎంతో ఉత్తమమైనదని మహాపురుషులు స్తుతిస్తారు. భారత వర్షంలో జన్మించిన వారి భాగ్యాన్ని వర్ణించి చెప్పడం సాధ్యం కాదు. భారత వర్షంలో శ్రీహరి ఎన్నో అవతారాలను ఎత్తి, జీవులకు తత్త్వం ఉపదేశించాడు. అందువల్ల భారత వర్షంలోని జనులకు సాధ్యం కానిదేదీ లేదు. నారాయణుడిని స్మరించడం వల్ల సకల పాపాలు నశిస్తాయి. భారత వర్షంలో ఒక్క క్షణకాలం మనఃపూర్వకంగా సర్వ సంగ పరిత్యాగం చేస్తే, అతడు పురుష శ్రేష్ఠుడు అవుతాడు. ఒక్కమాటలో చెప్పాలంటే, భారత వర్షం మోక్షాన్ని పొందడానికి అనువైన కర్మ భూమి, యజ్ఞాభూమి.
జంబూ ద్వీపానికి చుట్టూ లక్ష యోజనాల మేర ఉప్పు సముద్రం చుట్టి ఉన్నది. ప్లక్ష ద్వీపానికి చుట్టూ చెరకు రసం నిండిన సముద్రం ఉన్నది. అది రెండు లక్షల యోజనాల మేర చుట్టి ఉన్నది. ద్వీప మధ్య భాగంలో పక్షం అనే జువ్వి చెట్టు ఉన్నది కాబట్టి ఈ ద్వీపానికి ప్లక్ష ద్వీపం అన్న పేరు వచ్చింది. అగ్నిదేవుడు దీనికి అధిపతి. (ప్రియవ్రతుడి కొడుకు ఇధ్మజిహ్వుడు దీని పాలకుడు). ఈ ప్లక్ష ద్వీపాన్ని ఏడు వర్షాలుగా విభజించడం జరిగింది. అవి శివ, యశస్య, సుభద్ర, శాంత, క్షేమ, అమృత, అభయ అనేవి.
ఈ సప్త వర్షాలకు సప్త కుల పర్వతాలున్నాయి. వాటి పేర్లు: మణికూటం, వజ్రకూటం, ఇంద్రసేనం, జ్యోతిష్మంతం, ధూమ్రవర్ణం, హిరణ్యగ్రీవం, మేఘమాలం. ఈ వర్షాలకు సప్త మహానదులున్నాయి. అవి: అరుణ, నృష్ణ, అంగిరసి, సావిత్రి, సుప్రభాత, ఋతంబర, సత్యంభర అనేవి. ప్లక్ష ద్వీపానికి ముందు, జంబూద్వీపానికి మధ్య లవణ సముద్రం ఉన్నట్లే, ప్లక్ష శాల్మలీ ద్వీపాలకు మధ్యలో ఇక్షురస జలంతో నిండిన ఇక్షురస సముద్రం ఉన్నది. ఇది రెండు లక్షల యోజనాల విస్తీర్ణం కలిగి ఉంటుంది. ఇక్షురస సముద్రానికి రెట్టింపు వైశాల్యం కలిగినది శాల్మలీ ద్వీపం.
*(సశేషం)*
*🙏కృష్ణం వందే జగత్ గురుమ్!🙏*
*రచన: శ్రీ వనం*
*జ్వాలా నరసింహారావు*
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷``
*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩*
ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

