*వామన జయంతి*
*2025 సెప్టెంబర్ 4 వ తేదీ,*
భాద్రపద మాసంలోని శుక్ల పక్ష ద్వాదశి నాడు వామన జయంతి జరుపుకుంటారు.
విష్ణువు ఐదవ అవతారం వామనుడి అవతారం.
దశావతారాలలో పూర్తి మానవుడిగా అవతరించిన తొలి అవతారం వామనావతారం.
వామన అవతార సమయాన్ని పోతన గారు ఇలా వర్ణిస్తున్నారు...
రవి మధ్యాహ్నమునం జరింప, గ్రహతారాచంద్రభద్రస్థితిన్
శ్రవణద్వాదశినాఁడు, శ్రోణ నభిజిత్సంజ్ఞాత లగ్నంబునన్
భువనాధీశుఁడు పుట్టె, వామనగతిం బుణ్యవ్రతోపేతకున్
దివిజాధీశ్వరు మాతకుం బరమపాతివ్రత్య విఖ్యాతకున్.
పుట్టిన వెంటనే, తన అవతార కార్యాన్ని నెరవేర్చడానికి, వటువు రూపంలో బలి చక్రవర్తి యజ్ఞం చేస్తున్న చోటుకి వెళ్లాడు వామనుడు.
వామనుడిని చూసి అక్కడి వారు,
శంభుండో ,హరియో పయోజభవుఁడో చండాంశుఁడో వహ్నియో
దంభాకారత వచ్చెఁ గాక ధరణిన్ ధాత్రీసురుం డెవ్వడీ
శుంభద్యోతనుఁ డీ మనోజ్ఞ తనుఁ" డంచున్ విస్మయభ్రాంతులై
సంభాషించిరి బ్రహ్మచారిఁ గని తత్సభ్యుల్ రహస్యంబుగన్.
అని ఆశ్చర్యంతో చూస్తున్నారు.
బలి చక్రవర్తి ఉన్న చోటుకు చేరుకుని అతడిని ఇలా, ఆశీర్వదించాడు వామనుడు.
"స్వస్తి జగత్త్రయీ భువన శాసన కర్తకు, హాసమాత్ర వి
ధ్వస్త నిలింపభర్తకు, నుదారపదవ్యవహర్తకున్, మునీం
ద్రస్తుత మంగళాధ్వర విధాన విహర్తకు, నిర్జరీగళ
న్యస్త సువర్ణసూత్ర పరిహర్తకు, దానవలోక భర్తకున్."
అన్నాడు.
అఖండ తేజోమూర్తి అయిన వామనుడిని చూసి బలి చక్రవర్తి ఆశ్చర్యంతో అతని పుట్టుపూర్వోత్తరాలు అడుగుతున్నాడు.
ఎవరివాడవు, ఎక్కడుంటావు, నీ నివాసం ఏమిటి అంటున్నాడు.....
*వడుగా ఎవ్వరివాడవు?*..
వడుగా! యెవ్వరివాఁడ? వెవ్వఁడవు? సంవాసస్థలంబెయ్య? ది
య్యెడకున్ నీ వరుదెంచుటన్ సఫలమయ్యెన్ వంశమున్ జన్మముం;
గడు ధన్యాత్ముఁడనైతి; నీ మఖము యోగ్యంబయ్యె; నా కోరికల్
గడతేఱెన్; సుహుతంబులయ్యె శిఖులుం; గల్యాణ మిక్కాలమున్.
నీ రాకతో నా వంశం పావనమైంది, ఏం కావాలో కోరుకో అంటూ వామనుడిని, బలి చక్రవర్తి అడిగాడు.
వరచేలంబులొ, మాడలో, ఫలములో, వన్యంబులో గోవులో
హరులో రత్నములో రథంబులొ విమృష్టాన్నంబులో కన్యలో
కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో
ధరణీ ఖండమొ కాక యే మడిగెదో ధాత్రీసురేంద్రోత్తమా!
ముందుగా తాను సర్వాంతర్యామినని, అన్నింటా తాన ఉంటానని, తనకు ఒకచోటంటూ లేదని అంటాడు వామనుడు,
"ఇది నాకు నెలవని యేరీతిఁ బలుకుదు?-
నొక చో టనక యెందు నుండ నేర్తు;
నెవ్వనివాఁడ నం చేమని నుడువుదు?-
నా యంతవాఁడనై నడవనేర్తు;
నీ నడవడి యని యెట్లు వక్కాణింతుఁ?-
బూని ముప్పోకల బోవ నేర్తు;
నదినేర్తు నిదినేర్తు నని యేలఁ జెప్పంగ?-
నేరుపు లన్నియు నేన నేర్తు;
అంతే కాదు,, నేనందరి వాడనే..ఒంటి వాడను ,
చుట్టం ఎవరూ లేరు అంటాడు.
నొరులుఁ గారు నాకు నొరులకు నే నౌదు
నొంటివాఁడఁ జుట్ట మొకఁడు లేఁడు
సిరియుఁ దొల్లి గలదు చెప్పెద నా టెంకి
సుజనులందుఁ దఱచు చొచ్చియుందు.
అని అంటూ తనకు మూడడుగులు ఇస్తే సంతృప్తి చెందుతానంటాడు వామనుడు.
ఒంటివాఁడ నాకు నొకటి రెం డడుగుల
మేర యిమ్ము సొమ్ము మేర యొల్ల;
గోర్కిఁదీర బ్రహ్మకూకటి ముట్టెద
దానకుతుకసాంద్ర! దానవేంద్ర! "
అడగడానికి నీకు తెలియకపోయినా, నా అంతటి చక్రవర్తిని ఇచ్చేటపుడు ఘనంగా ఉండాలి కదా ఘనమైనది కోరుకో అంటాడు బలి.
దానికి వామనుడు.
తృప్తి ఎక్కడికి? నాకు మిద్దెలు, మేడలు, ఏనుగులు ఇవన్నీ ఎందుకు ? నాకు మూడడగులు చాలు అంటాడు. మూడడగులే తన పాలిట బ్రహ్మాండం అని పలుకుతాడు వామనుడు. నువ్వు రాజువు అయినంత మాత్రాన నా ఆశకు హద్దులుండాలి కదా. నాబోటి వటువుకు మిద్దెలు ,మేడలు, ఏనుగులు, రత్నాల రాశులు ఏం చేసుకోనయ్యా అంటాడు., తృప్తి ఉండాలి దేనికైనా అంటాడు.
గొడుగో, జన్నిదమో, కమండలువొ, నాకున్ ముంజియో, దండమో,
వడుఁ గే నెక్కడ భూము లెక్కడ? కరుల్, వామాక్షు, లశ్వంబు లె
క్కడ? నిత్యోచిత కర్మ మెక్కడ? మదాకాంక్షామితంబైన మూఁ
డడుగుల్ మేరయ త్రోవ కిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికిన్.
వెంటనే దానవ గురువు శుక్రాచార్యుల వారు, వచ్చిన వటువు విష్ణుమూర్తి అని గ్రహించి, దానం ఇవ్వవద్దని, బలికి సూచిస్తాడు. దానం ఇస్తే దానవ వంశ క్షయం అవుతుందని హెచ్చరిస్తాడు. ప్రాణ రక్షణ సందర్భంలో ఆడిన మాట తప్పినా దోషం అంటదన్నాడు.
*వారిజాక్షులందు...*
వారిజాక్షులందు వైవాహికము లందుఁ
బ్రాణవిత్తమానభంగమందుఁ
జకిత గోకులాగ్ర జన్మరక్షణ మందు
బొంకవచ్చు నఘము పొందఁ దధిప
అని చెప్పి,బలికి నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు.
ఎన్ని చెప్పినా,
బలి తాను ఇచ్చిన మాట తప్పనన్నాడు.
ఎంత సంపాదించినా చివరికి మిగిలేదేమిటన్నాడు.
ఎందరో రాజులు ఈ భూమండలాన్ని పరిపాలించారు, వారంతా ఏం మూటకట్టుకు పోయారన్నాడు.
*కారే రాజులు...*
కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే?
వారేరీ సిరిమూటఁగట్టుకొని పోవం జాలిరే? భూమిపైఁ
బేరైనం గలదే? శిబిప్రముఖులుం బ్రీతిన్ యశః కాములై
యీరే కోర్కులు? వారలన్ మఱచిరే యిక్కాలమున్? భార్గవా!
కాబట్టి మాటతప్పి అపకీర్తి పొందలేనన్నాడు.
సాక్షాత్తు విష్ణుమూర్తి చెయ్యి కింద దాన స్వీకర్తగా ఉండగా, తన చేయి దాత గాపైన ఉండడం కన్న ఇంకేం కావాలన్నాడు బలి చక్రవర్తి.
*ఆదిన్ శ్రీసతి కొప్పుపై...*
ఆదిన్ శ్రీసతి కొప్పుపైఁ, దనువుపై, నంసోత్తరీయంబుపై,
బాదాబ్జంబులపైఁ, గపోలతటిపైఁ, బాలిండ్లపై నూత్నమ
ర్యాదం జెందు కరంబు గ్రిం దగుట మీఁదై నా కరంబుంట మేల్
గాదే? రాజ్యము గీజ్యమున్ సతతమే? కాయంబు నాపాయమే?
తన మాటకు తిరుగులేదంటూ , వామనుడి కాళ్లు కడిగి,
దానం ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు బలి చక్రవర్తి.
విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణు స్వరూపాయ వే
దప్రామాణ్యవిదే త్రిపాద ధరణిం దాస్యామి!" యంచుం గ్రియా
క్షిప్రుండై దనుజేశ్వరుండు వడుగుం జే సాఁచి పూజించి "బ్ర
హ్మప్రీత"మ్మని ధారపోసె భువనం బాశ్చర్యముం బొందగన్..
అంతే, దానం ఇచ్చిన వెంటనే వామనుడు త్రివిక్రముడైనాడు....
*ఇంతింతై వటుడింతై*
ఇంతింతై, వటుఁడింతయై మఱియుఁ దా నింతై నభోవీథిపై
నంతై తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై
నంతై సత్యపదోన్నతుం డగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై.
రవిబింబం బుపమింపఁ బాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై
శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణకేయూరమై
ఛవిమత్కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటయై నూపుర
ప్రవరంబై పదపీఠమై వటుఁడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్
అలా.....వామనుడు బ్రహ్మాండాన్ని ఆక్రమించేసరికి, బలి నిర్ఘాంతపోయాడు.
“దానవ! త్రిపదభూతల మిత్తు నంటివి-
ధరణిఁ జంద్రార్కు లెందాఁక నుందు
రంత భూమియు నొక్క యడుగయ్యె నాకును-
స్వర్లోకమును నొక్క చరణమయ్యె;
నీ సొమ్ము సకలంబు నేఁడు రెండడుగులు-
గడమ పాదమునకుఁ గలదె భూమి?
యిచ్చెద నన్నర్థ మీని దురాత్ముండు-
నిరయంబు బొందుట నిజముగాదె?
రెండు, అడుగులు. ఒకటి భూమిపైన, రెండోది ఆకాశానికి సరిపోయింది, మరి మూడో అడుగు మాటేమిటని అడిగాడు విష్ణుమూర్తి .
తన శిరస్సుమీద పెట్టమన్నాడు బలి. బలి పరిస్థితిని గమనించి బలి తాత ప్రహ్లాదుడు దిగివచ్చి , బలి గర్వం తొలగిందని, ఇక అతనిని అనుగ్రహించమని విష్ణుమూర్తిని వేడుకుంటాడు.
భూతలోకేశ్వర! భూతభావన! దేవ-
దేవ! జగన్నాథ! దేవవంద్య!
తన సొమ్ము సకలంబుఁ దప్పక నీ కిచ్చె-
దండయోగ్యుఁడు గాడు దానపరుఁడుఁ;
గరుణింప నర్హుండు గమలలోచన! నీకు-
విడిపింపు మీతని వెఱపు దీర;
తోయపూరము చల్లి దూర్వాంకురంబులఁ-
జేరి నీ పదము లర్చించునట్టి...
ప్రహ్లాదుడు తదితరుల కోరిక మేరకు బలి ని అనుగ్రహించి అతనికి పరమపథం కల్పించాడు విష్ణుమూర్తి.
పోతన కలంలో వామనావతార ఘట్టం మనోహరంగా రూపుదిద్దుకుంది.
వామన జయంతి సందర్భంగా పోతనామాత్యుడికి మరొక్కమారు ప్రణామాలు తెలియజేసుకుందాం.
వామనావతార ఘట్టం పరమ పావన ఘట్టం
*స్వస్తి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి