ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
9, మే 2025, శుక్రవారం
దేవుని మరువ రాదు*
*దేవుని మరువ రాదు*
మనం ఎంత తెలివైన వారమైనా, భగవంతుని దయ లేకుండా మనము చేపట్టిన పని విజయవంతం కాదని మనం అంటాము. అందుకే, మన పూర్వీకులు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు.
వ్యక్తి జీవితం రథం లాంటిది.రథానికి రెండు వైపులా రెండు చక్రాలు అవసరం.ఆ చక్రాలలో ఏదైనా ఒకటి లేకపోయినా, రథం కదలదు. అలాగే, మానవ జీవిత రథానికి రెండు చక్రాలు ఏమిటని మనం అడిగితే, ఒకటి మన ప్రయత్నం, మరొకటి భగవంతుని దయ. మన జీవిత రథం ఈ రెండు చక్రాలపైనే కదులుతుంది. మనం మన రథాన్ని ఒకే చక్రంతో నడపాలని చూస్తాము. అది సాధ్యం కాదు.
అందుకే కొంతమంది అదృష్టాన్ని నమ్మరు, "నేను మనసు పెడితే ఏదైనా సాధించగలను" అనే అహంకారం కలిగి ఉంటారు.ఇది తప్పు, కొంతమంది ఆలోచిస్తారు, "నాకు దేవుని దయ ఉంటే, ప్రతిదీ జరుగుతుంది, నేను దాని కోసం ఎందుకు కష్టపడాలి?" జాత్యం (జడత్వం) అనే స్వభావం ఉంటుంది.
ఇది కూడా తప్పు. మీరు ప్రయత్నం చేస్తే, దేవుని కృప మీకు తోడుగా (సహాయకుడిగా) ఉంటుంది, కానీ మీరు ప్రయత్నమే చేయకుండా దేవుని కృప మాత్రమే సరిపోతుందని చెప్పకుండా మీరు కూర్చుంటే, ఆ పని జరగదు. కాబట్టి, మనం ఎంత తెలివైన వారమైనా, దేవుడిని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఆయనను నిత్యం స్మరిస్తూ, ఆరాధిస్తూనే ఉండాలి.ఆయన కృపకు పాత్రులు కావాలి.
*— జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామి వారు*
దానగుణ విశిష్టత!
శు భో ద యం 🙏
దానగుణ విశిష్టత!
ఈరోజు దానగుణం ఎంతవిశిష్టమైనదో తెలిసికుందాము.
శా:- ఆదిన్ శ్రీసతి కొప్పుపై, తనువుపై, నంశోత్తరీయంబుపై,
పాదాబ్జంబులపై, కపోలతటిపై, పాలిండ్లపై , నూత్నమ
ర్యాదంజెందు కరంబుక్రిందగుట, మీదై నాకరమబుంటమే
ల్గాదే? రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు వాపాయమే?
శ్రీమదాంధ్రమహాభాగవతము - పోతన- వామనచరిత్రము
వివరణ:- దేవతావిరోధియగు బలిచక్రవర్తని మూడడుగులదానమును వామనుడు అడుగుసందర్భము .
వచ్చినది శ్రీహరియని శుక్రాచార్యులవారు గ్రహించి దానమువలన కలుగు పరిణామము నూహించి
బలిని వలదని వారింపగా బలియన్నమాటలను కవినిపుణముగా వర్ణించినాడు అంత్యప్రాసలతో
నందగించిన పోతనకవితాసౌందర్యము తోబాటుగా బలి పరమౌదార్యమును తెలిసికొనుటకు
ప్రయత్నంచేద్దాము.
వచ్చినవాడు'హరి'దానమీయవలదు అనివారించు శుక్రునితో " శ్రీసతి శిరోజాలంకృతిపై, మేనుపై, భుజములపైనుడు ఉత్తరీయముపైనను ,పాదపద్మములపైనను,బుగ్గలపైనను, పయోధరములపైనను నూత్నమర్యాదలతో సంచరించు నాశ్రీహరి హస్తము క్రిందగుట, మీదుగా నాహస్తమగుట
ఆహా !ఎంతటి అదృష్టము. ఈరాజ్యము శాశ్వతమా? శరీరము అపాయరహితమా? ఏదియేమైనను ఇంతటిమంచి
అవకాశమునువిడువను దానమవస్యముగా నిత్తునని యట్లేయొనరించినాడు .ఆహా!బలియెంతటిమహనీయుడు.
దానముమిగులగప్పది .వేదములు" నకర్మణా నప్రజయా నధనేన దానేనైకేనామృతత్వమానసుః" నీవు
చేయుపనులవలనగానీ, నీసంతానముచేతగానీ, నీకున్నధనముచేతగానీ అమృతత్వాన్ని (అమరత్వము)పొందలేవు.
దానగుణం ఒకటి ఉంటేచాలును అమృతత్వం పొందగలవు. అంటోంది. కాబట్టిఉత్తమ గుణాలలో మిన్నయైన దాన
గుణాన్ని అందరూ అలవరచుకోవటం ఉత్తమం.అది మనకు సమాజానికీ చాలామేలు చేస్తుంది .
"న కర్మణా నప్రజయా న ధనేన త్యాగేనైకేనామృతత్వమానసుః" -అన్నది వేదం.
నేనిన్ని మంచిపనులుచేశాను, ఇంతమంది పిల్లలనుగన్నాను. ఇన్నికోట్లు సంపాదించాను.అంటే లాభంలేదు.మానవుడు అమృతత్వాన్ని పొందాలంటే దానమొక్కటే సాధనమ్.
స్వస్తి!!🙏🌷🌷🌷🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
పోతన విశ్వ రూప
🙏పోతన విశ్వ రూప సందర్శనము🙏
వామనుడు త్రివిక్రముడైన విధానం వర్ణించిన తీరు అద్భుతం. ఇది మూలంలో లేదు. పోతన మహాశయుడు సొంతంగా రచించి మనలకు కన్నులకు కట్టాడు.ఆ పద్యరాజములను చూద్దాము
.
శా. ఇంతింతై వటుఁడింతయై మరియుఁ దానింతై నభోవీధిపై
నంతై తోయద మండలాభ్రమున కల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రుని కంతయై ధ్రువుని పైనంతై మహర్వాటిపై
నంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై!!
ఈ పద్యం ఏదో ఒక సందర్భంలో వినని వారుండరనుకుంటాను. ఒక సామాన్యుడిగా బ్రతుకు ప్రారంభించి. అంచెలంచలుగా ఎదిగి ఉన్నత శిఖరాలకు చేరుకున్న వ్యక్తిని గురించో, అలాగే సన్నగా ప్రారంభమై క్రమక్రమాభివృద్ధి పొంది మిన్నగా రూపొందిన దాన్ని గురించో చెప్పేటప్పుడు ‘ఇంతింతై వటుడింతయై అన్నట్టు ఎదిగిపోయాడు’ అని చెప్పుకోవటం పరిపాటి. అంతగా ప్రజల నాలుకల మీద – కనీసం మొదటి లైను ఐనా – నిలిచిపోయింది ఈ పద్యం. ఈ పద్యంలోని ప్రసన్నమైన శైలి చెప్పకనే చెబుతుంది ఇది బమ్మెర పోతనామాత్యుని పద్యమని. పోతన ఆంధ్రీకరించిన భాగవతం అష్టమ స్కంధంలో – వామనుడు త్రివిక్రముడై పెరిగిపోయే దృశ్యాన్ని అత్యంత సహజసుందరంగా వర్ణించిన పద్యం ఇది.
బలి చక్రవర్తి వద్ద నుంచి మూడడుగుల నేలను దానంగా పొంది, ఒక అడుగును భూమిపై మోపి, రెండో అడుగుతో బ్రహ్మాండాన్ని ఆక్రమించడం కోసం క్రిందనుంచి ఒక్కోదాన్నే దాటుకుంటూ ఎలా విజృంభించాడో, ఏ విశేషణాలూ లేకుండా, ఒక మహాద్భుత దృశ్యాన్ని కండ్ల ముందు రూపు కట్టించాడు పోతన. చేతులతో అభినయంచకుండా ఈ పద్యం బోధించలేము.చేతులతో చూపిస్తూ ముఖం ఆకాశము వైపు ఎత్తవలసినదే.
ఇంతైనాడు, మరిం తైనాడు, ఆకాశానికి అంతైనాడు, మేఘమండలానికి అల్లంతైనాడు, జ్యోతిర్మండలానికి అంతైనాడు, చంద్రుణ్ణి దాటాడు, ధ్రువుని దాటి ఇంకా పైకి సాగాడు, మహర్లోకం దాటినాడు, చూస్తుండగానే సత్యలోకంకన్నా ఉన్నతంగా ఎదిగాడు. బ్రహ్మాండమంతా నిండిపోయాడు – ఇదీ ఒక కుబ్జబాలకుడు క్రమక్రమంగా బ్రహ్మాండ భాండాన్ని ఆక్రమించిన త్రివిక్రమ స్ఫూర్తి. క్రింద మునులూ, బలి చక్రవర్తీ, శుక్రుడూ నివ్వెరపోయి పూర్వం కండ్లముందు నిలుచున్న బ్రహ్మచారి బాలకుడు – ఒక్కసారిగా కాదు – క్రమక్రమంగా ఎదిగి భూనభోంతరాలు నిండిపోవడాన్ని ఇంతకన్నా అందంగా రూపు కట్టించడం అసాధ్యమనుకుంటాను. పద్యం పద పదానికీ విరుగుతూ, వామనుడు పద పదానికీ పెరుగుతూపోయే క్రమతను రూపించింది. ఇంతై, అంతై, దీనికింతై, దానికింతై అంటూ ఒక గొప్ప దృశ్యానికి ప్రత్యక్ష వివరణ, ప్రత్యక్ష ప్రసారము ఏకకాలంలో చేశాడు కవి. ఈ పద్యం మనసున పట్టించుకొని చదువుతూ ఉంటే ఒక గ్రాఫిక్ దృశ్యం కండ్లముందు నిలిచిపోతుంది. నిజం చెప్పాలంటే
కెమెరాలో చిత్రించి చూపించాడు. ఇంతటితో సంతృప్తి చెందలేదు. ఇంకా వివరించాలి అనుకున్నాడు
ఈ పద్యం తరువాతనే మరో పద్యం ఉంది. క్రిందినుంచి వామనుడు క్రమక్రమంగా పైకి పోయే కొద్దీ పైనున్న సూర్యబింబాన్ని ఈ పెరిగే పెద్దమనిషితో కలిపి చూపిస్తూ ఆ రవిబింబపు దశల్లోని వివిధరూపాలని వర్ణించిన పద్యం అది. ఇంతకు ముందు చూపిన దృశ్యాన్నే మరో కోణంలో చూపించడమన్నమాట. వామనుడు పెరిగేకొద్దీ సూర్యబింబం ఎలా ఉందంటే, ముందు ఒక గొడుగు లాగా అతని తలపై కనిపించి, క్రమంగా శిరోరత్నం గానూ, చెవి కమ్మగానూ, కంఠా భరణంగానూ, బంగారు భుజ కీర్తులు లాగానూ, కరకంకణం లాగానూ, నడుముకు కట్టిన మొలతాటి బంగారు గంట గానూ, పాదాల అందె గానూ ఆఖరుకు పాదపీఠం గానూ ఉపమించడానికి యోగ్యంగా కనిపించిందట. ఆ పద్యం కూడా చిత్తగించండి.ఈ పద్యం లో మన దృష్టి సూర్యునిపై కేంద్రీకరింప జేశాడు మీరు సూర్యుణ్ణే చూడమన్నాడు సూర్య బింబము ఎలా మారుతోందో చక్కగా చిత్రీకరించాడు
రవిబింబంబుపమింప బాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై
శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణ కేయూరమై
ఛవి మత్కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటయై నూపుర
ప్రవరంబై పదపీఠమై వటుడుదా బ్రహ్మాండ మున్నిండుచోన్
మహానుభావుడు పోతన. భగవంతుని లీలలను వర్ణించే ఘట్టం వచ్చేసరికి పోతనకి ఒళ్ళు తెలియనంత తాదాత్మ్యం ఆవహిస్తుంది. ఆ తాదాత్మ్యంలో వ్రాసే పద్యాలు గుండెలను పట్టుకునేవిగా రూపొందుతాయి. ఆ పద్యాల్లో గణాలు, యతులు, ప్రాసలు ఇవ్వన్నీ అలవోకగా జేరిపోయి ఒక మహాభక్తుని ఆంతరంగ పారవశ్యం వాటిల్లో పొంగిపొరలుతూ వుంటుంది. భాగవతంలోని అనేక ఘట్టాలు – ప్రహ్లాద చరిత్ర, గజేంద్రమోక్షము, రుక్మిణీ కళ్యాణము, కృష్ణ లీలలు, అంబరీషోపాఖ్యానము లాంటివి – దీనికి తిరుగులేని సాక్ష్యాలు. భాగవతం లాంటి గొప్ప భక్తి పురాణం పోతన చేతిలో పడి తెలుగులోకి రావటం, తెలుగు జాతి చేసుకున్న గొప్ప అదృష్టం
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ
ఆనందో బ్రహ్మేతి
🙏ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్’🙏
భృగువు ఒకసారి తన తండ్రియైున వరుణుని వద్దకు వెళ్లి.. బ్రహ్మమును గురించి తెలుపవలసిందిగా కోరుతాడు. అప్పుడు వరుణుడు పుత్రునితో ‘‘దేనివలన ఈ ప్రాణులు, పదార్థాలన్నీ పుడుతున్నాయో, దేని వలన పుట్టినవి జీవిస్తున్నాయో, దేని యందు లీనమవుతున్నాయో అది బ్రహ్మము’’ అని చెప్పి, ‘దానిని నీవే తెలుసుకో’ అని చెబుతాడు. అప్పుడు భృగువు బ్రహ్మమును తెలుసుకోవడానికి తపస్సు చేస్తాడు. ఆ తపస్సులో ఆయనకు.. అన్నమే బ్రహ్మమని తెలుస్తుంది. ఎందుకంటే ప్రాణుల శరీరాలన్ని అన్నము వలననే పుడుతున్నాయి. పుట్టిన ప్రాణులన్నీ అన్నము చేతనే పోషింపబడుతున్నాయి. చివరకు అన్నము (మట్టి) యందే కలిసి పోతున్నాయి. కాబట్టి అన్నమునే బ్రహ్మముగా తెలుసుకున్నానని తండ్రిని సమీపించి చెబుతాడు. అప్పుడు వరుణుడు ఆయనను ఇంకా తపస్సు చేయమంటాడు.
మళ్లీ తపస్సు చేసిన భృగువు.. ఈసారి ప్రాణమును బ్రహ్మముగా తెలుసుకుంటాడు. ఎందుకంటే ప్రాణము వలనే ప్రాణుల శరీరాలు పుడుతున్నాయి. ప్రాణము చేతనే పుట్టినవి జీవిస్తున్నాయి. ప్రాణములందే లీనమవుతున్నాయి. కాబట్టి ప్రాణమే బ్రహ్మముగా ఎరిగినానని చెప్పగా.. ‘‘ఇంకా తపస్సు చెయ్యి. బ్రహ్మము నెరుగుటకు తపస్సే సాధనం’’ అని వరుణుడు చెబుతాడు. ఈసారి తపస్సులో.. ‘మనసే బ్రహ్మము’ అని భృగువుకు తెలుస్తుంది. ఎందుకంటే మనసులోనే సంకల్పాలు కలుగుతాయి. ఇంద్రియాలన్నింటికీ మనసే ఆధారం. సంకల్పాల కారణంగానే జీవులకు శరీరాలు లభిస్తాయి. కర్మఫలాలను అనుభవించడానికి శరీరస్థితి ఏర్పడుతుంది. శరీరం నశించినప్పుడు జీవుడు వాయురూపంలో వెళ్లిపోతాడు. కాబట్టి శరీరోత్పత్తి, స్థితి, లయములకు మనసు కూడా కారణమవుతున్నది. కావున అది బ్రహ్మమని తలచి తండ్రికి ఆ విషయమే చెబుతాడు. అప్పుడు తండ్రి.. ఇంకా తపస్సు చేయాల్సిందిగా సూచిస్తాడు. ఈసారి విజ్ఞానం బ్రహ్మమని భృగువు తలుస్తాడు. విజ్ఞానమంటే నిశ్చయాత్మక జ్ఞానం. అదే బుద్ధి. ఆ విషయం చెప్తే.. ఇంకా తపస్సు చేయమంటాడు వరుణుడు. తపస్సులో మరలయత్నించిన భృగువు ఆనందమే బ్రహ్మముగా తెలుసుకుంటాడు. ‘ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్’ ఆనంద రూపమగు బ్రహ్మమే కారణమని, బ్రహ్మమే కర్త అని రూఢి చేసుకుంటాడు.
భృగువును వరుణుడు అన్నిసార్లు తపస్సు చేయాల్సిందిగా ఎందుకు ఆదేశించాడంటే.. అసలైన బ్రహ్మము గురించి ఆయన తెలుసుకోవడానికే. భృగువు మొదట అన్నము బ్రహ్మమని ఎరిగినప్పటికీ.. అన్నానికి కారణం ఉంది. బ్రహ్మమంటే కారణం లేనిది. కాబట్టి మరోసారి తపస్సు చేయాలంటాడు. అదే విధంగా ప్రాణం, మనసు, విజ్ఞానం అన్నింటికీ కారణం ఉన్నది. ఔషధుల నుండి అన్నం, అన్నం నుండి ప్రాణం జనిస్తున్నాయి. మనసు, విజ్ఞానం ఆత్మాశ్రితాలు. కాబట్టి, ఆనంద స్వరూపమైన బ్రహ్మమే ఈ జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయములకు కారణమని, బ్రహ్మమునకు ఇంకొక కారణం లేదు అని చివరకు తెలుసుకుంటాడు. ఆనంద స్వరూపమైన బ్రహ్మము నెరిగినవాడు ఆనందంలో ఉండి దానిననుభవిస్తాడు. ప్రపంచంలో ఆనందంగా ఉన్నవాడు తృప్తిగా ఉంటాడు. మనం పొందే ఆనందం ఏదో కారణంచేత కాబట్టి ఆ దొరికిన దానిని బట్టి అది క్షణికమైనది లేదా కొద్దికాలం ఉండేది అవుతుంది. కాబట్టి కారణం లేకుండా ఆనందంగా ఉండడమే మోక్షం అనబడుతుంది.
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ
వేద ఆశీర్వచనం.
*నమస్తే సదా వత్సలే మాతృ భూమే*
*కలియుగాబ్ది 5126*
*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం - వసంత ఋతువు - వైశాఖ మాసం - శుక్ల పక్షం - ద్వాదశి - హస్త - భృగు వాసరే* (09.05.2025)
ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు
*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.
.🙏🙏
భవదీయుడు
దశిక ప్రభాకరశాస్త్రి
9849795167
----------------------------------------------
*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*
పంచాంగం 09.05.2025
ఈ రోజు పంచాంగం 09.05.2025
Friday,
స్వస్తి శ్రీ చాన్ద్రమాన విశ్వావసు నామసంవత్సర: ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాస శుక్ల పక్ష ద్వాదశి తిథి భృగు వాసర హస్త నక్షత్రం వజ్ర యోగః: బాలవ తదుపరి కౌలవ కరణం.
రాహుకాలం : పగలు 10:30 నుండి 12:00 వరకు.
యమగండం: మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.
నమస్కారః , శుభోదయం
భారతావని నుదుట సిందూరం*
🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴
*భారతావని నుదుట సిందూరం*
🔥💥
సీ॥
సుందరకాశ్మీరశోభలు చెరుపంగ
ముష్కరమూకలు పూనుకొనగ
మహిళామతల్లుల మహితసిందూరమ్ము
తుడువనెంచగ నేడు ధూర్తపాకి
మోదీకి చెప్పుకో పోయి వెంటనె యంచు
వదరిన పాకీకి బలిసె మదము
మోదీకి చెప్పిరి ముగ్ధలందరు వెళ్ళి
మోదియు చింతించి పూనె ప్రతిన
తే౹గీ॥ దిక్కులన్నియు మార్మ్రోగ ధిక్కరించి
వెలికి చక్రాయుధమ్మును వెడలదీసె
గొంతు సవరించి గర్జించి యుద్ధతంత్ర
నియతి బూనుచు విశ్వమ్ము నివ్వెరంద
🔥💥
శా॥
మా మోదీకి వచించి వచ్చితిమి సన్మానమ్ము జేయన్వెసన్
మీ మాత్సర్యము తృప్తిజెందునటులన్ మిమ్మెంచి కీర్తించగా
మా మోదీ కబురంపె సైన్యమునకున్ మాన్యత్వ మింపొందగా
నేమాచూపులు? కాచుకొండి యని మిమ్మెంచె మా భారతుల్
🔥💥
కం॥
మోదీ షా జైశంకరు
లా ధోబలుతోడ గూడి యాలోచించన్
పాదులు కదిలించగ పా
కీధర నడలంగజేయ కృతనిశ్చయులై
🔥💥
శా॥
అదిగో దూకెను భీకరోజ్జ్వలముగా నాజిన్ విమానమ్ములున్
రొదలం జేయుచు విస్ఫులింగముల నిర్మూలించ పాకీస్థలిన్
మెదలన్ శక్యము కాని రీతి క్షిపణుల్ మిన్నూడి పడ్డట్లుగా
కదిలెన్ పాకిభువీస్థలిన్ నగరముల్ కాష్టాలగడ్డవ్వగన్
🔥💥
ఉ॥
దిక్కులు పిక్కటిల్లె మన తేజము లొక్కెడ దాడి జేయగా
కుక్కలు చింపు విస్తరిగ కూలెను పాకి ప్రభుత్వమిత్తఱిన్
పిక్కల శక్తిమై పరుగువెట్టెను ప్రాణభయమ్ము తోడుతన్
నక్కెనొ? పాఱెనో? యన వినాశము జూచిన పాకినేతయై
🔥💥
చం॥
త్రివిధదళమ్ములుం గదలి తేల్చెను ముంచెను పాకినేతలన్
ఛవులు రహించ ద్రెళ్ళుచు సత్త్వము జూపి విమాన నౌకలన్
భవిత హరించి రేవులను భస్మము జేయుచు జృంభణమ్ముగా
నవిరళదీక్షతో నిగిడి హా! యని త్రేన్చెను నిండుబొజ్జలన్
🔥💥
ఉ॥
భారతసైన్యముల్ గదలె భండనవిక్రమపౌరుషమ్ముతో
ధీరవిచారసారఘనతేజులు మోదియు శంకరేతరుల్
దీరి వచింప ముందుకని దిక్కరు లన్నియు గూడినట్లుగా
భూరిపరాక్రమమ్మున ప్రమోదము బంచగ భారతోర్వికిన్
🔥💥
మ॥
జయహో భారత సైనికా! ప్రబలవిశ్వాసమ్మె సంపూర్తిగా
నియతిన్ సాగుచు మాతృభూమి హితమే నీ ప్రాణమై సాగుచున్
రయమున్ శత్రువినాశదీక్ష గొని నిర్వ్యామోహచిత్తాన ని
ర్భయమున్ మాకు నొసంగు దేవుడవు! గర్వాతీత! నీకున్నతుల్
🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴
*~శ్రీశర్మద*
ది:09-05-2025
సమయం:
ఉదయం: 03-45.
