9, మే 2025, శుక్రవారం

భారతావని నుదుట సిందూరం*

 🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴

*భారతావని నుదుట సిందూరం*


🔥💥

సీ॥

సుందరకాశ్మీరశోభలు చెరుపంగ 

ముష్కరమూకలు పూనుకొనగ 

మహిళామతల్లుల మహితసిందూరమ్ము 

తుడువనెంచగ నేడు ధూర్తపాకి 

మోదీకి చెప్పుకో పోయి వెంటనె యంచు 

వదరిన పాకీకి బలిసె మదము 

మోదీకి చెప్పిరి ముగ్ధలందరు వెళ్ళి 

మోదియు చింతించి పూనె ప్రతిన 

తే౹గీ॥ దిక్కులన్నియు మార్మ్రోగ ధిక్కరించి 

వెలికి చక్రాయుధమ్మును వెడలదీసె 

గొంతు సవరించి గర్జించి యుద్ధతంత్ర 

నియతి బూనుచు విశ్వమ్ము నివ్వెరంద 

🔥💥

శా॥

మా మోదీకి వచించి వచ్చితిమి సన్మానమ్ము జేయన్వెసన్ 

మీ మాత్సర్యము తృప్తిజెందునటులన్ మిమ్మెంచి కీర్తించగా 

మా మోదీ కబురంపె సైన్యమునకున్ మాన్యత్వ మింపొందగా 

నేమాచూపులు? కాచుకొండి యని మిమ్మెంచె మా భారతుల్ 

🔥💥

కం॥

మోదీ షా జైశంకరు 

లా ధోబలుతోడ గూడి యాలోచించన్ 

పాదులు కదిలించగ పా

కీధర నడలంగజేయ కృతనిశ్చయులై 

🔥💥

శా॥ 

అదిగో దూకెను భీకరోజ్జ్వలముగా నాజిన్ విమానమ్ములున్ 

రొదలం జేయుచు విస్ఫులింగముల నిర్మూలించ పాకీస్థలిన్ 

మెదలన్ శక్యము కాని రీతి క్షిపణుల్ మిన్నూడి పడ్డట్లుగా 

కదిలెన్ పాకిభువీస్థలిన్ నగరముల్ కాష్టాలగడ్డవ్వగన్ 

🔥💥

ఉ॥

దిక్కులు పిక్కటిల్లె మన తేజము లొక్కెడ దాడి జేయగా 

కుక్కలు చింపు విస్తరిగ కూలెను పాకి ప్రభుత్వమిత్తఱిన్ 

పిక్కల శక్తిమై పరుగువెట్టెను ప్రాణభయమ్ము తోడుతన్ 

నక్కెనొ? పాఱెనో? యన వినాశము జూచిన పాకినేతయై 

🔥💥

చం॥

త్రివిధదళమ్ములుం గదలి తేల్చెను ముంచెను పాకినేతలన్ 

ఛవులు రహించ ద్రెళ్ళుచు సత్త్వము జూపి విమాన నౌకలన్ 

భవిత హరించి రేవులను భస్మము జేయుచు జృంభణమ్ముగా 

నవిరళదీక్షతో నిగిడి హా! యని త్రేన్చెను నిండుబొజ్జలన్ 

🔥💥

ఉ॥

భారతసైన్యముల్ గదలె భండనవిక్రమపౌరుషమ్ముతో 

ధీరవిచారసారఘనతేజులు మోదియు శంకరేతరుల్ 

దీరి వచింప ముందుకని దిక్కరు లన్నియు గూడినట్లుగా 

భూరిపరాక్రమమ్మున ప్రమోదము బంచగ భారతోర్వికిన్ 

🔥💥

మ॥

జయహో భారత సైనికా! ప్రబలవిశ్వాసమ్మె సంపూర్తిగా 

నియతిన్ సాగుచు మాతృభూమి హితమే నీ ప్రాణమై సాగుచున్ 

రయమున్ శత్రువినాశదీక్ష గొని నిర్వ్యామోహచిత్తాన ని 

ర్భయమున్ మాకు నొసంగు దేవుడవు! గర్వాతీత! నీకున్నతుల్ 

🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴

*~శ్రీశర్మద* 

ది:09-05-2025

సమయం: 

ఉదయం: 03-45.

కామెంట్‌లు లేవు: