🕉 108 శ్రీవైష్ణవ దివ్యదేశాలు ::
106వ దివ్యదేశము 🕉
🙏శ్రీ నవమోహన కృష్ణ పెరుమాళ్ ఆలయం – ( తిరువాయిపాడి ),
గోకులము.
ఉత్తర ప్రదేశ్ 🙏
@ ప్రధాన దైవం: నవమోహన కృష్ణ
@ ప్రధాన దేవత: రుక్మిణీ-సత్యభామ
@ పుష్కరిణి: యమునానది
@ విమానం: హేమకూట విమానము
@ ప్రత్యక్షం:
నందగోపునకు, యశోధకు (విశ్వరూపం) ప్రత్యక్షము.
🛎 స్థలపురాణం :
👉శ్రీమహావిష్ణువు యొక్క శ్రీకృష్ణావతారమును సంపూర్ణావతారము.
👉 ఆ కృష్ణ భగవానుడు కంసునిచే కారాగృహమున బంధించబడిన దేవకీ వసుదేవులకు అష్టమ గర్భమున జన్మించి , వసుదేవుని ద్వారా నంద గ్రామమున యశోద పొత్తిళ్లలోనికి చేర్పించుకొని , నందరాజు యశోదలకు ఆనందము నిచ్చు విధముగా వారి వద్ద పెరుగుచు బాల్యము నుండియే ఎన్నియో మహిమలను ప్రదర్శించెను .
ఎందరో రాక్షసులను హతమొనర్చి జన కళ్యాణ కార్యములను చేసెను . బ్రహ్మదేవేంద్రాదులకు విశ్వాసము కలుగచేసి , వారి అజ్ఞానమును పారద్రోలి పరమాత్ముడైన తన విభూతులను దర్శింప చేసి . మాయా లీలా వినోదుడై గోవులతో ఆనందించుచు , గోవులను మందలుగా మేతకు కొనిపోవుచు ఇతర గోపాలకులతో క్రీడించెను .
👉త్రేతాయుగమున శ్రీరామావతార సమయమున లక్ష్మణునిగా అవతరింప చేసిన ఆదిశేషుని ఈ కృష్ణావతారమున అన్న బలరామునిగా అవతరింప చేసి ( తమ్మునిగా లక్ష్మణుడు చేసిన సేవలకు ప్రతిగా , బలరాముని అగ్రజునిగా గౌరవించి సేవించు నిమిత్తము ) , బాల్య క్రీడలలో బలరామాది ఇతర బృందములతో గొల్లవాడలో వెన్న దొంగిలించి తాను తిని స్నేహబృందములో అందరకు తినిపించి గొల్ల భామలను ఆట పట్టించెను . గోప స్త్రీలకు పరతత్వమును గోపికా వస్త్రాపహరణ సందర్భమున బోధించెను . తల్లి యశోదకు నోటిలో చతుర్దశ భువనములను మన్ను తినిన సన్నివేశమున చూపించెను . తన ఆగడములకు తల్లి యశోద రోలునకు కట్టి వేయగా లాగుకొని మద్ది చెట్ల నడుమకుపోయి ఆ చెట్లను కూలద్రోసి గంధర్వులకు శాప విమోచనమును ప్రసాదించెను . నీటి మడుగులో విషము వెలువరించుచుండిన సర్పరాజు కాళీయుని పడగలపై నాట్యము చేసి ఆసర్పమును సకల భార్యలు పరివారముతో సహా పాతాళమునకు తరిమివేసెను . అసంఖ్యాక మహిమాన్విత , పరాక్రమోపేత లోక కళ్యాణ కార్యములొనర్చి బాల్యమును గడపినదే ఈ దివ్య దేశము అయిన గోకులము - నందగ్రామము .
👉రాధ కృష్ణుల పవిత్ర ప్రేమకు పుట్టినిల్లు గోకులం.
ఆ గోకులమును ప్రస్తుతము పురాతన గోకులము అను నామమున వ్యవహరించుచున్నారు . ఆ స్థలమును దర్శించుకొనుటలో ఎంతో అనుభూతికి లోనై మహదానందమును పొందుదుము .
👉శ్రీ నవమోహన కృష్ణ పెరుమాళ్ ఆలయం ఉత్తర ప్రదేశ్ లోని మధుర జిల్లా యమునా నది ఒడ్డున ఉంది.
👉ఈ దేవాలయాన్ని గోకులం, తిరువైపాది దేవాలయం, గోకుల్ దేవాలయం, అయ్యర్‌పాది దేవాలయం మరియు బ్రజ భూమి అని కూడా పిలుస్తారు.
👉గోకులమునకు 1 కి.మీ దూరములో పురాణ గోకులము గలదు. అచట ఆలయమునకు ముందుభాగమున యమునానది ప్రవహించును. నందగోపులు, యశోద, బలరాములు-ఊయలలో శ్రీ కృష్ణుడు ఉంటాడు. ఇచట రెండు సన్నిధులు ఉన్నాయి. భక్తులు రెండింటిని దర్శిస్తారు. ఇది శ్రీకృష్ణుడు పెరిగిన స్థలము-బలరాముని అవతార స్థలము. ప్రతి ఆదివారము రాసక్రీడ, జలక్రీడ ఉత్సవములు జరుగుతుంటాయి.
🔔 గోపికాలోలా.... శ్రితజనపాలా...🔔
ద్వాపరయుగం శ్రీకృష్ణుడు పేరు చెప్పగానే వెంటనే మన కళ్ళముందు వ్రేపల్లె , గోకులం,కృష్ణుని అష్టమహిషులు, రాసక్రీడలాడే పదహారువేలమంది గోపికలు గోచరిస్తారు.
గోకులంలో జన్మించిన ఈ గోపీ జనమంతా శ్రీమహావిష్ణువు ఎత్తిన పలు అవతారాలలోని ఆయన దివ్యమంగళ విగ్రహాన్ని చూసి సమ్మోహితులై ఆ భగవానుడి కరుణా కటాక్షాలతో ఆయన పొందులో శాశ్వతంగా తరించాలని తపించిపోయినవారే.
ఈ గోపికలలో రకరకాల గోపికలు వున్నారు.
🔅శృతి గోపికలు
🔅ఋషి గోపికలు
🔅మైధిలి గోపికలు
🔅కోసల గోపికలు
🔅అయోధ్యా గోపికలు అని అనేక వర్గాలు.
వారిలో ముఖ్యమైన వారి వివరాలేమిటో సంక్షిప్తంగా తెలుసుకుందాము.
👉ఋషి గోపికలు..
త్రేతాయుగంలో మహావిష్ణువు రామావతారం ధరించి వనవాసం చేసిన సమయంలో, ఆయా వనాలలోని ఋషి పుంగవులంతా రాముని సౌందర్యం చూసి " పుంసా మోహన రూపాయ" అని
మోహితులైనారు. తామంతా రామునికి దేవేరులై సేవచేసే భాగ్యం కల్పించమని వేడుకున్నారు. రాముడు తాను ఏకపత్నీ వ్రతుడనని వారి కోరిక కృష్ణావతారంలో
నెరవేరగలదని వాగ్దానం చేశాడు.
ఆ వాగ్దానం ప్రకారం వంగ దేశంలో మంగళుడు అనే గొల్లవానికి పుత్రికలుగా
రామాయణ కాలం నాటి ఋషులంతా జన్మించారు.
పుత్రికలు జన్మించగానే తన ప్రారబ్ధ కర్మ వలన మంగళుని సంపదలన్నీ తరగిపోయాయి. వారిని పెంచి పెద్ద చేయలేక తన పుత్రికలందరినీ రాజైన జయుడి ద్వారా నందగోపుని వద్దకు పంపించివేశాడు. అక్కడ ఆ గోపికలకు తమ పూర్వజన్మ స్మృతి కలిగింది.
శ్రీ కృష్ణుని పొందాలనే కోరికతో కృష్ణుడు మేపే గోవుల పేడతో మహావిష్ణువు మూర్తిని తయారు చేసి యమునా నదీతీరాన ప్రతిష్టించి విష్ణువు అంశయైన కృష్ణునిలో లీనమవ్వాలనే కోరికతో పూజలు చేశారు. వారి పూజల ఫలితంగా, పూర్వపుణ్య ఫలితంగా వారు కోరుకున్నది లభించింది..
👉మైధిలి గోపికలు..
మహాబలవంతుడైన రావణుడు ఎత్తలేక పోయిన శివ ధనస్సును శ్రీరాముడు సునాయాసంగా ఎత్తిన రాముని భుజ బల వీర పరాక్రమాన్ని , సౌందర్యాన్ని చూసి మోహించిన మిధిలా నగర సుందరీమణులు రాముని భర్త కావాలని తపమాచరించారు.
వారి తపో ఫలితంగా నవ నందనులు పేరిట తొమ్మిదిమంది గృహాలలో జన్మించి మార్గశిర మాసంలో యమునానదీ తీరాన కాత్యాయనీ వ్రతం చేయ ఆరంభించారు.
ఈ గోపికల వస్త్రాలనే కృష్ణుడు దాచివేసి వారి భక్తిని పరీక్షించినట్లు భాగవతపురాణం వివరిస్తోంది. విల్లిపుత్తూరు ఆండాళ్ కూడా యీ గోపికలను మార్గదర్శకం చేసుకుని మార్గశిర మాసంలో కాత్యాయనీ నోము నోచి భగవంతుని చేరుకున్నది.
👉కోసల గోపికలు,
అయోధ్యా గోపికలు, ..
వీరు అయోధ్య రాజ్యంలో నివసించే ప్రజలు శ్రీరాముని రూపలావణ్యం కి మోహితులై ఇటువంటి భర్తని పొందాలి అనుకున్నారు....అలాంటి వారు కూడా గోపికలు గా గోకులం లో పుట్టారు.
👉శృతి గోపికలు :
సకల వేదాలు, శాస్త్రాలు , శృతి, పురాణాలు సైతం..ఆ వేద పురుషుని తమ భర్తగా పొందాలి అనుకున్నాయి.
వాటి తర్వాత అంశ అవతారమే శృతి గోపికలు.
🙏జై శ్రీమన్నారాయణ 🙏
🙏జై రాదా కృష్ణ 🙏