🙏కాళిదాసు🙏
మొదటి భాగం
కవికుల గురువు కాళిదాసు అందరికి ఆదర్శం. అటువంటి మహాకవి భారత దేశంలో పుట్టడం మన అదృష్టం. అనంతర కవులకు మార్గదర్శి.
కొన్ని వేల సంవత్సరాల తరువాత, ప్రజాజీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుని, ప్రజల్లో జీవితాన్ని పండగలా చేసుకోవాలనే ఆరాటం మొదలైంది. ఆ రసమయ ప్రపంచాన్ని మనకందించడం లోనూ, తన సృజనాత్మకతతో పరిపుష్టం చేయడం లోనూ, అలాంటి జీవితాన్ని ఆనందించడానికి సరైన మానసికస్థితుల్ని తెలియజెయ్యడం లోనూ, మార్గదర్శకుడైన వాడు మహాకవి కాళిదాసు. వాల్మీకి, వ్యాసులని వ్యతిరేకించకుండా, ఆ ధర్మాన్ని చాటుతూనే, జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం అన్న ప్రక్రియని తనవైన కొత్త భావాల్తో కవిత్వరూపంలో ఆవిష్కరించిన స్రష్ట. రసమయ జీవితాన్ని తరవాత తరాల కోసం రకరకాల రంగుల్లో చిత్రీకరించిన తొలికవి. ఆ తరవాత వచ్చిన కవులు ఈతని పంథాలోనే పయనించారు. రసమయ భావప్రపంచాల్ని కావ్యాలుగా మలచారు. కాని, ఏ కవులూ కాళిదాసుకున్న ప్రతిభావ్యుత్పత్తుల్ని ప్రదర్శించలేకపోయారన్నది అందరూ ఒప్పుకున్న సత్యం. ఈ భావాల్నే కొందరు చిన్న శ్లోకంలో చమత్కారంగా చెప్పారు.
పురా కవీనాం గణనా ప్రసంగే కనిష్ఠికాధిష్ఠిత కాళిదాసా
అద్యాపి తత్తుల్యకవే రభావాదనామికా సార్ధవతీ బభూవ
పూర్వం కవుల్ని లెక్క పెడదామని మొదలు పెట్టి, లెక్కపెట్టేవాడు చిటికిన వేలెత్తి ‘కాళిదాసు’ అన్నాడు. తర్వాత పక్కనున్న వేలు ఎత్తి ఇంకో కవి పేరు చెప్పాలంటే (అది ఉంగరం వేలు, చిటికినవేలు కన్న పెద్దది) అంతకన్న పెద్దకవిని లెక్కపెట్టాలి. అలాంటివాడు లేడు కాబట్టి ఆ లెక్కపెట్టేవాడు అక్కడే ఆగిపోయాడు. ఆ కారణం వల్ల ఉంగరం వేలుకి అనామిక (పేరులేనిది) అన్న పేరు సరిగ్గా సరిపోయింది.)
మిగిలిన కవులు కూడా గొప్ప కవిత్వాన్ని సృష్టించారనడంలో సందేహం లేదు. ఈ విషయాన్ని జయదేవుడు ఒక శ్లోకంలో మనోహరంగా చెప్తాడు.
యస్యాశ్చోర శ్చికురనికరః కర్ణపూరో మయూరో
భాసో హాసః కవికులగురుః కాళిదాసో విలాసః
హర్షో హర్షో హృదయవసతిః పంచబాణస్తు బాణః
కేషాం నైషా కథయ కవితాకామినీ కౌతుకాయ
[యస్యాః = ఎవరికి; చోరః = చోరకవి; చికురనికరః = చిక్కని జుట్టో; మయూరః = మయూరుడు; కర్ణపూరః = చెవికమ్మయో; భాసః = భాసుడు; హాసః =నవ్వో; కవికులగురుః = కవికులగురువైన; కాళిదాసః = కాళిదాసు; విలాసః = విలాసమో; హర్షః = శ్రీహర్షుడు; హర్షః = ఆనందమో; బాణః= బాణుడు; హృదయవసతిః = మనసులో నిలచిన; పంచబాణః = మన్మథుడో ; ఏషా కవితాకామినీ = అట్టి ఈ కవితాకామిని; కేషాం = ఎవరికి; కౌతుకాయ = ఉత్సాహము కొరకు (ఉత్సాహమునిచ్చునది); న తు = కాదో; కథయ = చెప్పుము?]
(కవితాకామినికి చోరకవి కేశపాశం, మయూరుడు చెవులకి ఆభరణంలాంటి వాళ్ళు. భాసుడు ఆమె చిరునవ్వు. కవికులగురువు కాళిదాసు ఆమె విలాసం. హర్షుడు ఆమె ఆనందం. బాణుడు ఆమె మనసులో నిలచిన మన్మథుడు. )
ఈ ప్రశంసలో జయదేవకవి ఒక్క కాళిదాసుని గురించి చెప్పినప్పుడు మాత్రమే కవికులగురుః అని సంబోధించాడు.
భాష, భావం, రసఙ్ఞత, దృశ్యచిత్రీకరణ, పరిసరాల పరిశీలన, మనోహరమైన భావవ్యక్తీకరణ, శిల్పసౌందర్యం, రమ్యంగా కథ చెప్పడం, మనోవిశ్లేషణ, విషయపరిజ్ఞానం, … ఇలా ఎన్నో విషయాలు కవితాత్మలో భాగాలు. కాళిదాసు వీటన్నిటినీ నభూతో నభవిష్యతి అన్నట్లు పోషించి ప్రతి కావ్యాన్నీ, ప్రతి శ్లోకాన్నీ, ప్రతి నాటకాన్నీ భారతీయ సంస్కృతికి దర్పణంగా సృష్టించి అర్పించి కవికులగురువయ్యాడు. అంతే కాదు, అలాంటి విద్యని అభ్యసించడానికి పునాదుల్ని వేసి జాతికి అధ్యాపకుడయ్యాడు.
సశేషం
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి