9, జులై 2025, బుధవారం

వేగ మాంగ్ల మంటె

 వేగ మాంగ్ల మంటె వేగమ్ముకే సిగ్గు

వేస్తె లైఫు లాంగు వేగ మెట్లు

వేగమంటె హోమ్యొ వేగంగ సరిజేయు

సకురు అప్ప రావు సత్య మిదిర!


భావం: "ఇంగ్లీషు మందులతో ఏ జబ్బైనా వేగంగా నయమైపోతుంది" అని ఎవరైనా అన్నారూ అనంటే,వాళ్ళు వట్టి అమాయకులని అర్థం! ఏ చిన్న జబ్బైనా, పెద్ద జబ్బైనా దానికి జీవితాంతం రోజూ వాడుకోమని, కొన్ని మందులు చేతిలో పెట్టి, చచ్చే దాకా అనునిత్యం మందులు వాడిపిస్తూ, ఆ జబ్బును మీకు, మీ వారసులకూ ఆస్తిగా ఇచ్చేదే "ఇంగ్లీషు వైద్యము"! టెంపరరీ రిలీఫ్ ని స్పీడ్ గా ఇచ్చినట్లు బిల్డప్ ఇచ్చి, సంపూర్ణ నివారణ మాత్రం చెయ్యలేక, టెస్టులు, స్కానింగ్ లతో ఎప్పటికప్పుడు షోయింగ్ చేసేదే " ఆంగ్ల వైద్యము"! దీనిని స్పీడ్ అంటే, ఆ స్పీడ్ అనే మాటే సిగ్గుపడుతుంది! రెండు రోజులో, రెండు నెలలో, లేదంటే రెండు సంవత్సరాలో టైము పట్టినా కూడా, ఒక జబ్బు సంపూర్ణంగా, ఏ సైడ్ ఎఫెక్టులూ లేకుండా నయమవ్వాలనుకుంటే, తప్పకుండా హోమియోకి వెళ్ళండి, లేదంటే యోగా, ఆయుర్వేదం, ప్రకృతి వైద్యం ద్వారా కూడా ఎన్నో జబ్బులు సంపూర్ణంగా, సవ్యంగా నయం చేయవచ్చు! అలా కాకుండా ఇంగ్లీషు దొరల చుట్టూ తిరిగితే, మీరు చచ్చినా, మీ జబ్బు మాత్రం చావకుండా, మీ జీన్స్ లో కూడా చేరి, మీ వారసులకు సైతం ఆ జబ్బు వారసత్వంగా ట్రాన్స్ ఫర్ అవుతుంది! హోమియోతో మీ జబ్బు ముదరకుండా మీ దగ్గరే, త్వరగానే, సేఫ్ గా, సమూలంగా (వేళ్ళతో సహా) అంతమౌతుంది! 


సకురు అప్పారావూ ఇది అందరూ తెలుసుకోవాల్సిన నిజం! 


ఈ ఆటవెలది పద్యాల శతక కవి: హోమియో వైద్యులు సకురు అప్పారావు గారు, 9848025870

(ఎంతటి కఠినమైన, అసాధ్యమైన వ్యాధులకైనా దేశంలో ఎంతటి మారుమూల గ్రామంలో ఉన్న వారికైనా, ఇంటి వద్దకే మందులు పంపుతూ, అనునిత్యం ఫోన్ ద్వారా టచ్ లో ఉంటూ, క్షణక్షణం సూచనలిస్తూ, అనేక మంది వ్యాధులను నివారణ చేస్తున్నవారు! అలాగే కుటుంబ సభ్యులలో ఎవరికి ఎటువంటి ఎమర్జెన్సీ మరియు ప్రాణాపాయ ఆపద కలిగినా, ఎవరికి వారే వైద్యం చేసుకుని, ఇంటిలోని అందరినీ కాపాడుకోగలిగే సర్వరోగ నివారిణి లాంటి అమృతాన్ని కనిపెట్టి, "సకురు అప్పారావు గారి 1,2,3 ఫార్ములా ఫామిలీ కిట్" అనే పేరుతో ప్రజలకు అందిస్తున్నవారు!)

రామకృష్ణుని కధామృతంలోని

 రామకృష్ణుని కధామృతంలోని కొన్ని అమృతబిందువులు- 19 .

గృహస్తులకు ఉపదేశం. 


* * * 

శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరాలయంలో, తమగదిలో చిన్న మంచంమీద విశ్రమించి, భక్తులతో సంభాషిస్తున్నారు.  


అప్పుడు ఒకభక్తుని రామకృష్ణులు, ' నీకు సాకార ధ్యానం నచ్చుతుందా, నిరాకారమా ? ' అని అడిగారు. దానికి భక్తుడు, ' స్వామీ ! ఇప్పుడు సాకారం వైపు మనస్సు పోవడం లేదు. నిరాకారంలో మనస్సు నిలవడం లేదు. ' అని తనగోడు వెళ్లబోసుకున్నాడు. 


దానికి రామకృష్ణులు, ' చూశావా ! నిరాకారంలో ఒక్కసారిగా మనస్సు స్థిరం కాదు. ప్రాధమికదశలో సాకారమే మంచిది. అవి మృణ్మయ విగ్రహాలు కాదు, చిన్మయ విగ్రహాలు. ' అని చెప్పారు.   


అంతేకాదు. ' విగ్రహాలపై మనస్సు నిల్వకుంటే, తల్లి గురువు, తల్లి బ్రహ్మ స్వరూపిణి, కాబట్టి, కన్నతల్లి రూపాన్ని అయినా ధ్యానం చేయవచ్చును. ' అని, ఒక భక్తుడు అడిగినదానికి సమాధానంగా చెప్పారు. రామకృష్ణులు. 


* * *

ఆ తరువాత భక్తునికోరికపై, సాకార నిరాకార దర్శన అనుభూతులను గురించి ఈవిధంగా చెప్పారు, రామకృష్ణులు. 


' ఈ విషయాలను లోతుగా అర్ధం చేసుకోవాలంటే, సాధనాలు అవసరం. అది ఎలాగంటే, తాళంవేసి వున్న గదిలో నిధులు కావాలంటే, తాళంతీసి తలుపులు తీయాలి. కేవలం మనస్సుతో తాళం తీసినట్లు, గది తలుపులు తెరచినట్లు ఊహించుకుంటే, నిధి చేతికి అందదు కదా ! '  


' ఒకానొక సమయంలో, శ్రీకృష్ణుడు అర్జునునికి, బ్రహ్మ తత్త్వం ఉపదేశిస్తూ, ' నేను సాకారవాదుల వద్ద సాకారంలో దర్శనమిస్తాను. నిరాకార వాదులకు బ్రహ్మతత్వంలో కనిపిస్తాను. ' అని చెప్పాడు. 


* * *

' యోగులలో రెండురకాలవారు వున్నారు. ‘ బహూదక, కుటీచక ‘ అని.  


‘ బహూదకులు ‘ అనేకతీర్ధాలు దర్శించినా, మనశ్శాంతికై అలమటిస్తూ వుంటారు. ‘ కుటీచక ‘ లక్షణాలు వున్నవారు, కుటీరంలో స్థిరంగా కూర్చుని దైవాన్ని దర్శించేవారు. వీరుకూడా మొదట్లో అన్ని తీర్ధాలనూ దర్శించుకుని, మనస్సు స్థిరపరచుకుంటారు. మనశ్శాంతితో ఒక ఆసనం మీద స్థిరంగా కూర్చుని, భగవంతుడిని ధ్యానిస్తారు. అట్టివారు, ఇక తీర్ధయాత్రలకు పోవలసిన పనిలేదు. కేవలం కొత్త స్ఫూర్తిపొందడం కోసమే అట్టివారు తిరిగి తీర్ధయాత్రలు చేస్తారు. '


* * *


నేను కూడా మధుర్ బాబుతో బృందావనం వెళ్ళినప్పుడు ‘ కాళీయ మర్దన ‘ ఘట్టాన్ని చూసి, యెంతో పారవశ్యంలో మునిగిపోయాను. సాయంత్రం పూట, యమునానదీ తీరాన మేతకుపోయి వస్తున్న గోవులను చూసి, ‘ కృష్ణుడెక్కడ ? కృష్ణుడెక్కడ ? ‘ అని కేకలు పెడుతూ పరుగులు తీసేవాడిని.    


గోవర్ధనగిరి చూసి, నేను ఎక్కిన పల్లకీదిగి ఒక్కపరుగున కొండ యెక్కాను. అలాంటి వాతావరణంలో తిరుగుతూ, ఆ ప్రదేశాలను చూస్తూ, బాహ్యచైతన్యం కోల్పోయాను. కళ్ళవెంట ఆనందబాష్పాలు ధారలు కట్టేవి. 


' కృష్ణా ! ఇక్కడ అన్నీ కనబడుతున్నాయి కానీ, నీవు మాత్రం కనబడడం లేదే ! ' అని యెంతోవేదన చెందేవాడిని. నన్నుచూసి, గంగామాయి అనే ఒక భక్తురాలు, సాక్షాత్తు రాధాదేవి, మానవదేహం దాల్చి మళ్ళీవచ్చింది. ' అని పలికేది. గంగామాయి నన్ను అక్కడే శాశ్వతంగా వుండిపోయే విధంగా ఏర్పాట్లు చేస్తుంటే, నాలో ఘర్షణ మొదలై, కాళీమాత స్ఫురించి, ‘ నేను తిరిగి పోవలసిందే ‘ అని పట్టుబట్టి, తిరిగి దక్షిణేశ్వర్ కి వచ్చేసాను. 


* * *

ఈ విధంగా రామకృష్ణులు భక్తులతో సంభాషించిన తరువాత, భక్తులతో ప్రసాదం స్వీకరించారు. తరువాత తిరిగి సంభాషిస్తూ, మధ్యమధ్యలో ఓంకారాన్ని ఉచ్ఛరిస్తూనో, ' హా ! చైతన్య మహాప్రభూ ! ' అంటూనో వున్నారు.  


స్వస్తి. 

రామకృష్ణుల అనుగ్రహంతో మరికొంత రేపు.

ఉన్నతమౌ ఆశయమున

 *2171*

*కం*

ఉన్నతమౌ ఆశయమున

యున్నతపదవుల విడివడి యొప్పారగ తా

పన్నగ భావించి తనను

కన్నడచేసెడి జనగతి కడచను సుజనా.

*భావం*:-- ఓ సుజనా! గొప్ప ఆశయాలతో ఉన్నత పదవులను విడిచిపెట్టి జీవించే వారిని బానిసగా భావించి హీనంగా చూచే వారి గతి పాడవుతుంది.(పన్న= బానిస,కన్నడ= లోకువ,హీనం,తక్కువ పాటు).

*సందేశం*:-- కొందరు ఉన్నతమైన ఆశయాలతో ఉన్నతమైన పదవులు విడిచిపెట్టి సాధారణ జీవితం గడుపుతూ ఉంటారు, వారి ని లోకువగా చూడటం వలన మనస్థాయి తగ్గిపోతుంది.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: తొమ్మిదవఅధ్యాయం

అక్షరపరబ్రహ్మయోగం:శ్రీ భగవానువాచ:


న చ మత్‌స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరమ్

భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూతభావనః(5)


యథా௨௨కాశస్థితో నిత్యం వాయుః సర్వత్రగో మహాన్

తథా సర్వాణి భూతాని మత్‌స్థానీత్యుపధారయ (6)


ఈశ్వర సంబంధమైన నా యోగశక్తిని చూడు. భూతాలు నాలో లేవు. నా ఆత్మ సమస్త భూతాలనూ సృష్టించి, పోషిస్తున్నప్పటికీ వాటిలో వుండదు. సర్వత్రా సంచరించే మహావాయువు ఆకాశంలో నిరంతరం నిలిచి వున్నట్లే సర్వభూతాలూ నాలో వున్నాయని తెలుసుకో.

శ్రీ ఖండోబా ఆలయం

 🕉 మన గుడి : నెం 1167


⚜ మహారాష్ట్ర : జెజురి 


⚜ శ్రీ ఖండోబా ఆలయం



💠 ఈ పట్టణం రాష్ట్రంలోని అత్యంత గౌరవనీయమైన ఆలయాలలో ఒకటైన ఖండోబాచి జెజురికి ప్రసిద్ధి చెందింది. 

ఈ ఆలయం ఖండోబాకు అంకితం చేయబడింది, దీనిని మల్సకాంత్ లేదా మల్హరి మార్తాండ్ లేదా మైలరలింగ అని కూడా పిలుస్తారు. 

ఖండోబాను 'జెజురి దేవుడు'గా భావిస్తారు 



💠 పురాణాలు మరియు జానపద కథల ప్రకారం, ఖండోబా భగవాన్ శివుని మానవ అవతారం ; అతను ఇప్పుడు మందిర్ ఉన్న జెజురి-గడ్ ( అనువాదం.  జెజురి కోట ) నుండి ఈ ప్రాంతాన్ని నివసించి పాలించేవాడు .


💠 ఈ మందిరాన్ని జెజురి-గడ్ అని కూడా పిలుస్తారు . ఖండోబా రాక్షస సోదరులైన మణి మరియు మల్లలను వారు ప్రజలను వేధించినప్పుడు చంపాడు. 


💠 పురాణాల ప్రకారం, మణి మరియు మల్ల అనే ఇద్దరు రాక్షస సోదరులు తమ తపస్సుతో బ్రహ్మ దేవుడిని సంతోషపెట్టారు . 

బ్రహ్మ వరం ద్వారా, వారు చాలా శక్తివంతులుగా మారి భూమిపై విధ్వంసం ప్రారంభించారు.

ప్రజలను వేధించారు. దీని ఫలితంగా మణి మరియు మల్లలను నాశనం చేయడానికి శివుడు ఖండోబా అవతారంలో భూమిపైకి వచ్చాడు .


💠 భీకర యుద్ధంలో, ఖండోబా ఒక రాక్షసుడిని చంపి, సామాన్య ప్రజలకు సేవ చేస్తానని వాగ్దానం చేసినప్పుడు మరొకరిని క్షమించాడు. 


💠 అతని అవతారం నుదిటిపై అర్ధ వృత్తాకార చంద్రునితో మూడవ కన్ను మరియు పసుపుతో కప్పబడిన శరీరం కలిగి ఉన్నట్లు వర్ణించబడింది. 


💠 ముఖ్యంగా మహారాష్ట్ర మరియు కర్ణాటకలలో శ్రీ ఖండోబా ఆలయాలు చాలా ఉన్నప్పటికీ, జెజురిలోని ఈ ఆలయం అన్నింటికంటే ప్రధానమైనదిగా పరిగణించబడుతుంది. 


💠 జెజురిలోని ఆలయం ఖండోబాకు ప్రధాన ఆరాధన కేంద్రాలలో ఒకటి, దీని ప్రారంభం శివుని రకం మరియు ఉత్తమ రాక్షసుల పౌరాణిక కథలతో ముడిపడి ఉంది.



🔆 చరిత్ర


💠 ఖండోబా ఆరాధన 12 నుండి 13వ శతాబ్దంలో ప్రారంభమైంది. 

దీనిని 17వ శతాబ్దంలో అహల్యాబాయి హోల్కర్ నిర్మించారు. 

ఖండోబా ఆలయాన్ని పేష్వాల పాలనలో పునర్నిర్మించారు . 


💠 1737–1739లో, పేష్వా బాజీ రావు I సోదరుడు చిమాజీ అప్పా , వాసాయి నుండి పోర్చుగీస్ చర్చి గంటలను ఆలయానికి బహుమతిగా ఇచ్చాడు. 

అతను మరియు అతని మరాఠా సైనికులు వాసాయి యుద్ధంలో (1737) పోర్చుగీస్ చర్చిలను ఓడించిన తర్వాత, వాటిని విజయ జ్ఞాపకాలుగా తీసుకున్నారు .



💠 మహారాష్ట్రలో, వివాహానంతరం నూతన వధూవరులు ఖండోబా (శివుని రూపం) కు అంకితం చేయబడిన జెజురి ఆలయాన్ని సందర్శించడం ఒక అర్ధవంతమైన సంప్రదాయం. ఆచారంలో భాగంగా, వరుడు ఆలయ మెట్లు ఎక్కేటప్పుడు వధువును తన భుజాలపై మోసుకెళ్తాడు, ఇది వారి కొత్త జీవితానికి అతని బలం మరియు అంకితభావాన్ని సూచిస్తుంది


💠 భక్తులు దేవునికి నైవేద్యంగా పసుపును గాలిలోకి విసిరేస్తారు మరియు ఫలితంగా కొండ ఆలయం మరియు ప్రాంగణంలోని మెట్లు పసుపు రంగులో ఉంటాయి.



💠 ఈ ఆలయంలో యోధుడి రూపంలో గుర్రం మీద ఎక్కిన ఖండోబా మూర్తి కూడా ఉంది. 

ఖండోబాను పసుపు , మారేడు పండు ఆకులతో పూజిస్తారు మరియు ఉల్లిపాయలు మరియు ఇతర కూరగాయలతో చేసిన నైవేద్యాన్ని నైవేద్యం పెడతారు. 


💠 భక్తులు దేవతకు పువ్వులు మరియు పసుపును అర్పిస్తారు. భక్తులు దేవునికి నైవేద్యంగా పసుపును గాలిలోకి విసిరేస్తారు మరియు ఫలితంగా కొండ ఆలయం మరియు ప్రాంగణంలోని మెట్లు పసుపు రంగును కలిగి ఉంటాయి.


💠 ఇది పూణే నుండి 50 కి.మీ దూరంలో ఉంది . 


రచన

©️ Santosh Kumar

18-41-గీతా మకరందము

 18-41-గీతా మకరందము.

        మోక్షసన్న్యాసయోగము

    

      -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అII లోకములో జనులకు వారి వారి గుణములనుబట్టి కర్మములు విభజింపబడినవని తెలుపుచున్నారు –

బ్రాహ్మణ క్షత్రియవిశాం 

శూద్రాణాం చ పరన్తప! | 

కర్మాణి ప్రవిభక్తాని 

స్వభావప్రభవైర్గుణైః || 


తా:- శత్రువులను తపింపజేయు ఓ అర్జునా! బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులకు వారి వారి (జన్మాంతర సంస్కారము ననుసరించిన) స్వభావము (ప్రకృతి) వలన పుట్టిన గుణములనుబట్టి కర్మలు వేఱువేఱుగా విభజింపబడినవి.


వ్యాఖ్య:- ఇదివఱలో 4వ అధ్యాయమున 13వ శ్లోకమందు చాతుర్వర్ణ్యములవారు వారివారి గుణములనుబట్టి కర్మలనుబట్టి సృష్టింపబడిరని భగవానుడు చెప్పియుండిరి* ఇప్పుడును ఆ భావమునే వ్యక్తీకరించుచు వారివారి జన్మాంతర సంస్కారము వలన నేర్పడిన గుణముల ననుసరించియే వారివారికి ఆ యా కర్మలు, (వానిననుసరించి ఆ యా వర్ణములు) విభజింపబడినవని తెలియజేయుచున్నారు. దీనినిబట్టి పుట్టుకతోనే జాతి ఏర్పడుటలేదనియు, వారి వారి గుణములనుబట్టియే జన్మ, కర్మలు ఏర్పడుచున్నవనియు స్పష్టమగుచున్నది. ఇట్టి పరిస్థితియందు ప్రతివానికిని ఊర్ధ్వస్థితికి బోవుటకు అవకాశము లభించుచున్నది. అనగా జన్మనా నీచజాతియందు పుట్టినప్పటికి తమ తమ కర్మలయొక్క శుద్ధత్వముచే, పారమార్థిక సాధనాతిశయముచే, పవిత్రతచే ఉత్తమవర్ణస్థులుగా తయారుకావచ్చును. ఈ ప్రకారముగ సర్వులకును ఆధ్యాత్మిక ఉన్నతశిఖరముల నధిరోహించుటకు అవకాశములు కల్పించుట గీతయొక్క ఒకానొక విశిష్టతయై యున్నది.


ప్ర:- బ్రాహ్మణాది వర్ణములు దేనిచే నేర్పడినవి?

ఉ:- వారి వారి గుణములచే.

ప్ర:- చాతుర్వర్ణ్యములవారికి కర్మ లేప్రకారముగ విభజింపబడినవి?

ఉ: - వారి వారి (జన్మాంతర సంస్కారము ననుసరించిన) స్వభావమువలన పుట్టిన గుణములను బట్టి ఆ యా కర్మలు వారికి విభజింపబడినవి.

ప్ర: - పుట్టుకచే జాతి ఏర్పడినదా?

ఉ:- కాదు. వారి వారి కర్మలచే.


----------------------------

* చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః (4-13)

తిరుమల సర్వస్వం -295*

 *తిరుమల సర్వస్వం -295*

చరిత్రపుటల్లో శ్రీనివాసుడు-10


మరాఠా ప్రభువు వితరణ

➖➖➖➖➖➖

1740 వ సం. లో మరాఠా ప్రభువు రఘోజీ భోంస్లే వెల్లూరు కోటను ముట్టడించి, అప్పటి నవాబు సఫ్దర్ అలీ నుంచి కోటి రూపాయల భారీ మొత్తాన్ని నజరానాగా స్వీకరించి చిత్తూరు ప్రాంతం నుంచి వైదొలిగాడు. తన ఘనవిజయానికి కృతగ్జ్నతగా శ్రీవారిని సందర్శించి, రఘోజీ సమర్పించుకున్న దాదాపు లక్షన్నర విలువైన (అప్పట్లో సుమారు 150 కిలోల బంగారంతో సమానం) ఆభరణాలు రఘోజీవారి పట్టీ పేరుతో పిలువబడుతూ, ఇప్పటికీ విశేష సందర్భాల్లో శ్రీవారికి అలంకరింప బడుతున్నాయి. ఆ ఆభరణాల గురించి శ్రీవారి ఆభరణాలు అధ్యాయంలో మరింత వివరంగా తెలుసుకుందాం. 


ఈస్టిండియా కంపెనీ హయాంలో తిరుమల

➖➖➖➖➖➖➖

పద్దెనిమిదవ శతాబ్దపు ప్రథమార్థంలో జరిగిన అనేక యుద్ధాల పర్యవసానంగా - అప్పటివరకూ ఆర్కాటు నవాబుల పాలనలో ఉన్న కర్నాటక ప్రాంతం లోని చాలా భాగాలు ఈస్టిండియా కంపెనీ పరమయ్యాయి. ముందు చెప్పుకున్నట్లు, సంధి షరతుల్లో భాగంగా అప్పటి ఆర్కాటు నవాబు తిరుమల క్షేత్రం పై వచ్చే ఆదాయాన్ని కంపెనీ వారికి శాశ్వతంగా కుదువ పెట్టడంతో - దేశవ్యాప్తంగా ఖ్యాతి గడించిన ఒక హైందవక్షేత్ర పాలనా పగ్గాలు ముస్లిం పాలకుల నుండి క్రైస్తవులకు బదిలీ అయ్యాయి. హైందవులందరి ఆరాధ్య దైవమైన అఖిలాండ నాయకుడు అంగడి సరకులా పరాయి పాలకుల చేతులు మారడం అనాదిగా వ్రేళ్ళూనుకున్న ఆర్షసంస్కృతికే మాయనిమచ్చ. అశేషమైన శ్రీవారి భక్తుల హృదయాలను కలచివేసే అపశృతి. ఆ దుర్దినాలు సృష్ట్యంతం వరకూ పునరావృతం కాకూడదని ఆశిద్దాం. 


1758 వ సం. లో అప్పుడు మచిలీపట్నం ముఖ్యకేంద్రంగా గలిగిన ఒక ఫ్రెంచి సైన్యాధికారి కొందరు ముస్లిం పాలకులతో కలిసి తిరుపతి పరగణాపై దండెత్తగా, కొంతకాలం పాటు ఆలయం మరో క్రైస్తవ మతావలంబులైన ఫ్రెంచి వారి అధీనమయ్యింది. అంతకు మించి ఫ్రెంచి పాలనకు సంబంధించిన ఆధారాలు పెద్దగా లభ్యం కాలేదు. దీనిని బట్టి అతి స్వల్పకాలం లోనే తిరుమల క్షేత్రం, అప్పట్లోనే దాదాపు దేశవ్యాప్తంగా విస్తరించిన ఈస్టిండియా కంపెనీ వారి హస్తగతమయ్యిందని భావించవచ్చు. 


వైకుంఠనాథుని వైభోగం

➖➖➖➖➖➖➖

1750 - 60 సంవత్సరాల మధ్యకాలంలో - కొండకోనల్లో, కీకారణ్యం మధ్యన నెలకొన్న, అప్పటికి నామమాత్రపు రవాణా సదుపాయాలు మాత్రమే కలిగి ఉన్న తిరుమల వార్షికాదాయం సుమారు రెండున్నర లక్షల రూపాయలు ఉండగా; అప్పటికే సహస్రాబ్దికి పైగా పల్లవ, చోళ రాజుల ప్రాపకాన్ని, ప్రాభవాన్ని విశేషంగా చవి చూచిన కాంచీపురం మహాపట్టణంలో గల కంచి వరదరాజస్వామి ఆలయ వార్షికాదాయం కేవలం లక్షన్నర రూపాయలు మాత్రమే ఉండేది. దీనిని బట్టి, ఆనాడే తిరుమల ఆలయం ఎంత లోకప్రసిద్ధి గాంచిందో, స్వామివారు భక్తులను, కానుకలను సూదంటురాయిలా ఎలా ఆకర్షించేవాడో అవగత మవుతుంది. 


మాధవుని మడులూ, మాన్యాలు

➖➖➖➖➖➖➖

ఈస్టిండియా కాలం నాటి నివేదికలను బట్టి, పంధొమ్మిదవ శతాబ్దం ప్రారంభానికి ఆలయ మాన్యాలు సువిశాల ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. తూర్పున శ్రీకాళహస్తి వరకూ, ఉత్తరాన వెంకటగిరి సంస్థానం వరకూ, దక్షిణాన నారాయణవనం మరియు కార్వేటినగరం వరకూ, పడమర దిక్కున నేటి వాయల్పాడు ప్రాంతానికి చెందిన నాగపాతాళ దేవరకొండ వరకూ వ్యాపించి ఉన్న 187 గ్రామాలు తిరుమలేశుని హక్కభుక్తంగా ఉండేవి. వీటిలో 124 గ్రామాలు కరకంబాడి, మామండూరు, కాళహస్తి, కార్వేటినగరం పాలెగార్ల (పాలెగార్లంటే ఆనాడు రాయలసీమలో ఉన్నటువంటి ప్రాంతీయ పాలకులు‌. పరిపాలనా కేంద్రం నుండి సుదూరంగా ఉన్న ప్రాంతాల రక్షణ నిమిత్తం విజయనగర రాజుల కాలంలో ఈ వ్యవస్థ వ్రేళ్ళూనుకుంది ) అధీనం లోనూ; 13 గ్రామాలు ఆచార్యపురుషుల (వీరి గురించి శ్రీవారి కైంకర్యపరులు అనే అధ్యాయంలో తెలుసుకుందాం) ఆధ్వర్యం లోనూ; కొన్ని మహంతు మఠానికి చెందిన బైరాగుల వశం లోనూ; మరికొన్ని జియ్యంగార్ల ఆధిపత్యం లోనూ ఉండేవి. దేవాలయానికి దత్తమైన గ్రామాల్లో కౌలు, శిస్తు వసూలు చేయడం; ఆ రొక్ఖాన్ని దేవాలయం బొక్కసానికి భద్రంగా చేర్చడం, సంబంధిత నివేదికలను ఆలయ యాజమాన్యానికి సమర్పిండం ఆయా అధీకృతుల బాధ్యతలు. వారిలో కొందరు పంటభూములకు సాగునీటి వసతిని కల్పించటం, ఆయా గ్రామాల్లో రహదారులను నిర్వహించటం, భక్తుల నుంచి కానుకలను సేకరించి వాటిని దేవాలయానికి చేర్చడం వంటి విధులు కూడా స్వచ్ఛందంగా, ప్రతిఫలాపేక్ష లేకుండా నిర్వర్తించే వారు.


ఈస్టిండియా కంపెనీ వారు ఆలయాభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాల్లో చెప్పుకోదగ్గది రహదార్ల నిర్మాణం, పునరుద్ధరణ. అనాదిగా తిరుమల నుండి ఇతర దక్షిణభారత ప్రాంతాలను చేరుకునే రహదారి మామండూరు పర్వతకనుమ గుండా వెళ్ళడంతో; దేవాలయానికి, యాత్రికులకు, రహదారికి భద్రత కలిగించే బాధ్యతను మామండూరు పాలెగార్లు వహించే వారు. ఈనాడు కూడా చిత్తూరు జిల్లా దాటి కడప జిల్లా లోకి ప్రవేశించాలంటే, పచ్చని కొండలు, పరవశించే ప్రకృతి నడుమ ఒద్దికగా ఒదిగి ఉన్న మామండూరు అటవీశాఖ చెక్ పోస్టు దాట వలసిందే! అక్కడి నుండే పూర్వపు రోజుల్లో తిరుమలకు మరో మెట్లమార్గం కూడా ఉండేది. 


తరువాతి కాలంలో మరాఠా ప్రభువులు మైసూరు నుండి తిరుమల చేరుకోవడానికి పలమనేరు, పుంగనూరు, దామలచెరువు మార్గాన్ని; వెంకటగిరి కోట, గుడియాత్తం మార్గాన్ని ఉపయోగించడంతో - అప్పటివరకూ నిర్జనారణ్యాలుగా ఉండే ఆ మార్గాలు కూడా ప్రయాణ యోగ్యంగా మారాయి. ఆ తరువాత ఈస్టిండియా కంపెనీవారు మొగిలి కనుమ (అవిభక్త చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండలం యందలి మొగిలి గ్రామం లోని ప్రాచీన మొగిలీశ్వరాలయం జిల్లాలోని దర్శించదగ్గ పుణ్యక్షేత్రాలలో ఒకటి), పలమనేరు మీదుగా చిత్తూరు నుండి కోలార్ వరకూ సౌకర్యవంతమైన, విశాలమైన రహదారి నిర్మించడంతో తిరుమల ప్రయాణం సులువై భక్తుల తాకిడి మరింత పెరిగింది. 


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*శల్య పర్వము ద్వితీయాశ్వాసము*


*432 వ రోజు*

అర్జునుడి రథం దగ్ధంకావడము

కృష్ణుడు అర్జునుడితో " అర్జునా ! నీ గాండీవం అక్షయ తుణీరం తీసుకుని ముందు నీవు రథం దిగు తరువాత నేను రథం దిగుతాను అన్నాడు. అర్జునుడు అలాగే అని చెప్పి గాండీవ సహితంగా రథం దిగాడు. తరువాత కృష్ణుడు పగ్గములను నొగల మీద ఉంచి తాను కూడా రథం దిగాడు. కపిధ్వజం మీద ఉన్న హనుమంతుడు భూతగణ సహితంగా తను కూడా రథమును విడిచి వెళ్ళాడు. వెంటనే ఆరథం భగభగ మండి పోయింది. అర్జునుడు ఆశ్చర్యచకితుడై " కృష్ణా ! ఏమిటీ వింత ! " అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు " అర్జునా ! ఇప్పటి వరకు యుద్ధంలో గెలవడం నీ మహిమ అనుకుంటున్నావు. కాని కర్ణుడి అస్త్ర ధాటికి ఈ రథం ఎప్పుడో ధగ్ధం అయిపోయింది. కాని నొగల మీద నేను ధ్వజం మీద హనుమంతుడు ఉన్నాము కనుక ఇప్పటి వరకు నిలిచి ఉంది. అందుకే నేను నీ తరువాత రథం దిగాను. హనుమంతుడు ఎగిరిపోగానే రథం ధగ్ధం అయింది. ఇందులో వింత ఏముంది " అన్నాడు. అన్నాడు.


*కృష్ణుడు అర్జునుడిని ధర్మరాజుకు అప్పగించుట*


కృష్ణుడు ఆతరువాత ధర్మరాజుకు అర్జునుడిని అప్పగిస్తూ " ధర్మరాజా ! యుద్ధారంభంలో ఉపప్లాయంలో నీవు నాన్ను వస్త్రములతో సత్కరించి అర్జునుడిని నాచేత పెట్టి " కృష్ణా ! వీడిని నీవు కాపాడాలి " అని అర్ధించావు. నేను అందుకు అంగీకరించాను. ఇడుగో యుద్ధంలో విజయుడై వచ్చిన అర్జునుడిని సురక్షితంగా నీకు అప్పగిస్తున్నాను " అన్నాడు. ధర్మరాజు " అదేమిటి కృష్ణా ! నీవు లేకున్న మేము ఈ పద్దెనిమిది రోజుల యుద్ధంలో జరిగిన ఈ యుద్ధసాగరాన్ని దాటగలమా ! నాడు వ్యాసుడు చెప్పనే చెప్పాడు. శ్రీకృష్ణుడు ఎక్కడ ఉంటే విజయం అక్కడే అని. నీ కరుణ వలనే కదా ! మాకీ విజయం ప్రాప్తించింది " అన్నాడు ధర్మరాజు. కృష్ణుడు " ధర్మజా ! ప్రారంభంలో అర్జునుడికి యుద్ధం చేయుట ఇష్టం లేదు. నేను గీతను బోధించి అతడిని రణోన్ముఖుని చేసాను. కానీ ఇప్పటికీ అర్జునుడికి ఈ మారణకాండమున యుద్ధమున ఆసక్తి లేదు. లేకున్న ఇంద్రకుమారుడైన అర్జునుడు ఏపని చేటకైనా సమర్ధుడే. ముల్లోకాలను తృటిలో నాశనం చేయగలడు. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు " అన్నాడు. ఆ ప్రకారం అందరూ సరససల్లాపంలో తేలియాడారు. ధర్మరాజు అత్యధిక సంపదలు కలిగిన సుయోధనుడి ధనాగారం స్వాధీనం చేసుకున్నాడు. మిగిలిన కౌరవ సేనలను చూసుకుంటూ ఆనందంగా తిరుగున్నాడు. కృష్ణుడు " ధర్మనందనా ! సుయోధనుడు లేని ఈ మందిరం పాడుబడింది. ఇక ఇక్కడ ఉండటం మంచిది కాదు. వేరొక ప్రశాంత ప్రదేశముకు పోదాము " అన్నాడు. తరువాత కృష్ణుడు పాండవులను ఓఘవతీ తీరానికి తీసుకు వెళ్ళాడు. ధర్మరాజుకు భయం పట్టుకుంది " అర్జునుడు చేసిన సైగతో భీముడు సుయోధనుడి తొడ విరిచాడు. అది చాలక కాలితో సుయోధనుడి తల నరికాడు. కనుక గాంధారి నన్ను శపిస్తుంది. కనుక ఆమెను శాంతింప చేయాలి. ఈ పని చేయడానికి శ్రీకృష్ణుడే తగిన వాడు " అనుకుని శ్రీకృష్ణుడిని హస్థినాపురం పంపాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

రామాయణం

 🌹🌷🏹🪔🛕🪔🏹🌷🌹

*🪷బుధవారం 9 జూలై 2025🪷*

``

           *రామాయణం*


ఒకసారి చదివినంత 

మాత్రాన మనసమస్త 

పాపాలని తీసేస్తుంది.

``

     *వాల్మీకి రామాయణం*                  

            *93వ భాగం*

```

సీతమ్మ స్నానంచేసి అలంకరించుకున్నాక పరదాలు కట్టిన ఒక పల్లకి ఎక్కించి రాముడి దగ్గరికి తీసుకు వెళ్ళారు. అప్పుడు రాముడి ముఖంలో సంతోషం, దైన్యం, కోపం కనపడ్డాయి.

అప్పుడు రాముడు… “మీరు ఆవిడని పల్లకిలో ఎందుకు తీసుకొస్తున్నారు. దిగి నడిచి రమ్మనండి” అన్నాడు.


అలా నడిచి వస్తున్న సీతమ్మని చూడడం కోసమని అక్కడున్న వానరాలు ఒకరిని ఒకరు తోసుకుంటున్నారు (ఆ వానరాలు అప్పటిదాకా సీతమ్మని చూడలేదు). 


అప్పుడు సుగ్రీవుడు కొంతమందిని ఆజ్ఞాపించి ఆ వానరాలని వెనక్కి తొయ్యమన్నాడు.


రాముడన్నాడు… “ఈ సీత కోసం వాళ్ళు తమ ప్రాణాలని ఫణంగా పెట్టి యుద్ధం చేశారు. ఇప్పుడావిడ నడిచొస్తుంటే వాళ్ళని కొట్టి దూరంగా తోసేస్తారా. వాళ్ళందరూ సీతని చూడవలసిందే. ఎవరైనా ప్రియ బంధువులు వియోగం పొందినప్పుడు, రాజ్యంలో క్షోభం ఏర్పడినప్పుడు, యజ్ఞం జరుగుతున్నప్పుడు, యుద్ధం జరుగుతున్నప్పుడు అంతఃపుర కాంతలు బయటకి రావచ్చు. ఇవ్వాళ నేను యుద్ధభూమిలో ఉన్నాను, కనుక భర్త దర్శనానికి సీత అలా రావచ్చు. నా పక్కన ఉండగా సీతని చూడడంలో దోషంలేదు” అన్నాడు.


అప్పుడు హనుమంతుడు… “రామా! ఎవరి కోసం మనం ఇంత కష్టపడి యుద్ధం చేశామో, ఆ సీతమ్మ మీ దగ్గరికి వచ్చింది” అన్నాడు.


అప్పుడు సీతమ్మ రాముడి దగ్గరికి వచ్చి, తన భర్త తన పట్ల ఆనందంగా లేకపోవడం వల్ల ఏడుస్తూ, ఆ ముసుగులో నుంచి… “ఆర్యపుత్రా” అని, అలా నిలబడిపోయింది.


అప్పుడు రాముడు… “శత్రువుని జయించాను, నిన్ను పొందాను. ఏ దైవము యొక్క అనుగ్రహము లేకపోవడము చేత, ఏ దైవము యొక్క శాసనము చేత నువ్వు అపహరింపబడ్డావో దానిని పురుష ప్రయత్నం చేత దిద్దాను. రావణుడిని సంహరించి నిన్ను తెచ్చుకున్నాను. అపారమైన పౌరుషము, పరాక్రమము ఉన్నవాడికి ఏదన్నా అపవాదు వస్తే, వాడు తన ప్రయత్నంతో ఆ అపవాదుని తుడిచిపెట్టుకోకపోతే, వాడు చేతకానివాడు అని ప్రపంచం అంటుంది. అందుకని నా ప్రయత్నంతో వచ్చిన అపవాదుని తుడిచిపెట్టడానికి, రాముడి భార్యని రావణుడు అపహరిస్తే, రావణుడిని రాముడు ఏమి చెయ్యలేదు అని అనకుండా ఉండడం కోసం రావణుడిని సంహరించాను. 100 యోజనముల సముద్రాన్ని గడిచి లంకా పట్టణాన్ని చేరి, హనుమ చేసిన ఈ లంకా భీభత్సం అంతా నేటితో సార్ధక్యాన్ని పొందింది. నేను ఇదంతా కష్టపడి చేసింది నా పేరు ప్రఖ్యాతులు నిలబెట్టుకోడానికి. ఇక్ష్వాకు వంశంలో జన్మించాను కాబట్టి, రాముడు చేతకానివాడు అన్న అపవాదు నా మీద పడకూడదు కాబట్టి ఇదంతా చేశాను. రాముడు సీతని తిరిగి తెచ్చుకోలేకపోయాడు అన్న కళంకం మా వంశంలో ఉండిపోకూడదు, అందుకని నిన్ను గెలిచి తెచ్చుకున్నాను.


సీతా! ఇవ్వాళ నీ చారిత్రము శంకింపబడింది. నువ్వు చాలాకాలం రాక్షసుని గృహంలో ఉన్నావు. నువ్వు అలా ఉన్న కారణం చేత నిన్ను చూస్తున్నప్పుడు నాకు ఎలా ఉందో తెలుసా, కంటియందు జబ్బు ఉన్నవాడు దీపాన్ని ఎలా చూడలేడో, అలా నేను నీ వంక చూడలేకపోతున్నాను. నీకు తెలుసు నాకు తెలుసు, నువ్వు అపార సౌందర్యరాశివి, నిన్ను చూసినవాడు చపలచిత్తుడైతే వెంటనే నీ యందు మనస్సు పెట్టుకుంటాడు. పరమ చపలచిత్తుడైన రావణుడు నిన్ను చూడకూడని చూపు చూశాడు, బలవంతంగా నీ జుట్టు పట్టి ఈడ్చాడు, తన తొడ మీద కుర్చోపెట్టుకున్నాడు, గుండెల మీద వేసుకున్నాడు, అశోకవనంలో పెట్టాడు, 10 నెలలు నిన్ను చూశాడు. నువ్వూ మహా అందగత్తెవి, వయస్సులో ఉన్నదానివి. అటువంటి నువ్వు ఖచ్చితమైన నడువడితో ఉన్నావని నేను ఎలా నమ్మను. అందుకని ఇప్పుడు నీ ఇష్టం, నీకు ఎవరు నచ్చితే వాళ్ళతో వెళ్ళిపో. లక్ష్మణుడితో కాని, భరతుడితో కాని, విభీషణుడితో కాని, సుగ్రీవుడితో కాని నువ్వు వెళ్ళిపోవచ్చు, వీళ్ళు కాదు ఈ పది దిక్కులలో నీకు ఎవరు నచ్చినా వాళ్ళతో వెళ్ళిపోవచ్చు. నేను నీకు అనుమతి ఇస్తున్నాను, నువ్వు వెళ్ళిపోవచ్చు. నీతో నాకు మాత్రం ఏవిధమైన అవసరం లేదు” అన్నాడు.


అప్పుడు సీతమ్మ… “రామా! నన్ను చిన్నతనంలో పాణిగ్రహణం చేశావే, నా చెయ్యి పట్టుకున్నావే, చాలా కాలం కలిసి దాంపత్య జీవనం చేశామే, నేను ఎటువంటిదాననో నీకు తెలియదా, నేనంత చేతకాని స్త్రీలా నీకు కనపడుతున్నానా. నేను నిజంగా అటువంటి చారిత్రము ఉన్నదానిని అని నువ్వు అనుమానించినవాడివైతే ఆనాడు హనుమని నాకోసం ఎందుకు పంపించావు. నేను రాక్షసుల మధ్యలో ఉన్నాను అని హనుమ నీకు చెబితే, మళ్ళీ హనుమతోనే నేను నీ చారిత్రమును శంకిస్తున్నాను అని కబురు చేస్తే నేను ప్రాణాలు విడిచిపెట్టేదాన్ని. అలా చెయ్యకుండా నాకోసం ఎందుకు ప్రాణ సంకటాన్ని పొందావు, ఎందుకు సముద్రానికి సేతువు కట్టి, లంకకి వచ్చి, అంత యుద్ధం చేశావు. యుద్ధంలో జయాపజయములు విధి నిర్ణీతములు, నువ్వు గెలవచ్చు రావణుడు గెలవచ్చు. నాయందు నీకు ప్రేమ ఉంది కాబట్టి అంత ప్రాణ సంకటం తెచ్చుకున్నావు. కాని ఇవ్వాళ ఎందుకింత బేలగా మాట్లాడుతున్నావు. నేను స్త్రీని కాబట్టి ఎలా అయినా మాట్లాడచ్చు అనుకుంటున్నావా. నా భక్తి, నా సౌశీల్యం, నా నడువడి అన్నిటినీ వెనక్కి తోసేశావు. నేను బతికుంటే రాముడికి ఇల్లాలిగా బతుకుతాను, చచ్చిపోయినా రాముడికి ఇల్లాలిగానే చచ్చిపోతాను. ఒకసారి అపనింద పడ్డాక నాకీ జీవితంతో సంబంధం లేదు. లక్ష్మణా! చితి పేర్చు” అంది. 


అప్పుడు లక్ష్మణుడు రాముడివంక కనుగుడ్లు మిటకరిస్తూ కోపంగా చూశాడు. 


రాముడు అంతకన్నా కోపంగా, ఎర్రటి కళ్ళతో లక్ష్మణుడివంక చూసేసరికి లక్ష్మణుడు గబగబా వెళ్ళి చితిని పేర్చాడు.


అప్పుడు సీతమ్మ… “నా మనస్సు రాముడియందే ఉన్నదైతే, సర్వకాలములయందు రాముడిని ధ్యానము చేసిన దాననైతే, పృధ్వీ, ఆకాశము, అష్ట దిక్పాలకులు, అంతరాత్మ, అగ్ని సాక్షిగా ఉండి, ఒక్క క్షణం కూడా నా మనస్సు రాముడిని విడిచిపెట్టనిది నిజమే అయితే ఈ అగ్నిహోత్రుడు నన్ను రక్షించుగాక” అని చెప్పి అగ్నిలో దూకింది.


అలా సీతమ్మ అగ్నిలో దూకగానే బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, దేవతలు మొదలైనవారందరూ అక్కడికి వచ్చారు. 


వాళ్ళకి నమస్కారం చేస్తున్న రాముడిని చూసి వాళ్ళు అన్నారు… “అదేమిటయ్యా రామా అంత పని చేశావు. నువ్వు సాక్షాత్తుగా శ్రీ మహా విష్ణువువి. నువ్వు లోకములను సృష్టించగలిగినవాడివి, లయం చెయ్యగలిగినవాడివి, పరబ్రహ్మానివి. సీతమ్మని అగ్నిలో ప్రవేశించమని ఎలా చెప్పగలిగావయ్యా” అన్నారు.


అప్పుడు రాముడు… “మీరందరూ నేను చాలా గొప్పవాడిని అని అంటున్నారు, నేను పరబ్రహ్మాన్ని అంటున్నారు, కాని నేను అలా అనుకోవడం లేదు. నేను దశరథ మహారాజు యొక్క కుమారుడిని, రాముడిని, నరుడిని అని అనుకుంటున్నాను. నేను యదార్ధముగా ఎవరినో మీరు చెప్పండి” అన్నాడు.


అప్పుడు బ్రహ్మ… “సృష్టికి ముందు ఉన్నవాడివి నువ్వు, స్థితికారుడివి నువ్వు, లయకారుడివి నువ్వు, వరాహమూర్తివి నువ్వు, భూమిని ఉద్ధరించినవాడివి నువ్వు, ఆరోగ్యం నువ్వు, కోపం నువ్వు, రాత్రి నువ్వు, నీ రోమకూపాల్లో దేవతలు ఉంటారు, సమస్తము నీయందే ఉంది, అంత్యమునందు ఉండిపోయేవాడివి నువ్వు, నువ్వు కన్నుమూస్తే రాత్రి, కన్ను తెరిస్తే పగలు” అని రాముడిని స్తోత్రం చేశారు. 


తరువాత అగ్నిహోత్రంలో నుంచి అగ్నిదేవుడు తన తొడ మీద సీతమ్మని కూర్చోపెట్టుకుని బంగారు సింహాసనం మీద పైకి వచ్చాడు. అప్పుడాయన… “రామా! ఈవిడ మహాపునీత. గొప్ప పుణ్యచారిత్రము ఉన్నది, ఈ తల్లి కంటితో కూడా దోషం చెయ్యలేదు. ఈవిడ పాతివ్రత్యం వల్లే రాక్షస సంహారం జరిగింది. ఈ తల్లి మనస్సుతో కాని, వాక్కుతో కాని పాపం చెయ్యలేదు. నేను సమస్త జీవుల యొక్క కర్మలని చూస్తుంటాను, ఈ తల్లియందు కించిత్ దోషం లేదు. రామా! సర్వకాల సర్వావస్తలయందు 

నీ నామం చెప్పుకుని, 

నీ పాదములయందు మనస్సు పెట్టుకున్న తల్లి ఈ సీతమ్మ. నువ్వు ఇంకొక మాట చెబితే నేను అంగీకరించను. ఈమెని నువ్వు స్వీకరించు” అన్నాడు.


అప్పుడు రాముడు… “మీరందరూ చెప్పవలసిన అవసరం లేదు, సర్వకాలములయందు ఈమె మనస్సు నా దగ్గర ఉందని నాకు తెలుసు. సముద్రం చెలియలి కట్టని దాటనట్టు, అగ్నిని చేత పట్టలేనట్టు, సీతని రావణుడు తాకలేడన్న విషయం నాకు తెలుసు. కాని ఈ విషయం రేపు లోకమంతటికి తెలియాలి. చేతకానివాడు రాముడని లోకం అనకూడదు. సీత చారిత్రము ఏమిటో లోకానికి చెప్పాలని భర్తగా నేను అనుకున్నాను” అన్నాడు.


అప్పుడు రాముడు సీతమ్మ భుజం మీద చెయ్యివేసి ఆమెని దగ్గరికి తీసుకున్నాడు. ఈ దృశ్యాన్ని చూసిన వానరులందరూ ఆనందంతో పొంగిపోయారు.```


      *రేపు…94వ భాగం*


*🚩జై శ్రీరామ్.! జై శ్రీ రామ్.!🚩*                           

       *🙏జై జై శ్రీ రామ్.!🙏*


                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏

బుధవారం🪷* *🌷09 జూలై 2025🌷* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

     *🪷బుధవారం🪷*

 *🌷09 జూలై 2025🌷*       

    *దృగ్గణిత పంచాంగం*                  


*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*

*ఆషాఢమాసం - శుక్లపక్షం*


*తిథి  : చతుర్దశి* రా 01.36 వరకు ఉపరి *పౌర్ణమి*

*వారం   : బుధవారం* (సౌమ్యవాసరే)

*నక్షత్రం   : మూల* రా 04.50 తె వరకు ఉపరి *పూర్వాషాఢ*

*యోగం : బ్రహ్మ* రా 10.09 వరకు ఉపరి *ఐంద్ర*

*కరణం   : గరజి* మ 01.11 *వణజి* రా 01.36 ఉపరి *భద్ర*

*సాధారణ శుభ సమయాలు:*

 *ఉ 09.00 - 10.00 సా 03.30 - 05.30*

అమృత కాలం  : *రా 10.00 - 11.43*

అభిజిత్ కాలం  : *ఈరోజు లేదు* 

*వర్జ్యం     : ప 11.46 - 01.29 & రా 03.07 - 04.50*

*దుర్ముహూర్తం  : ప 11.47 - 12.39*

*రాహు కాలం   : మ 12.13 - 01.51*

గుళికకాళం       : *ఉ 10.35 - 12.13*

యమగండం     : *ఉ 07.19 - 08.57*

సూర్యరాశి : *మిధునం*

చంద్రరాశి : *ధనస్సు*

సూర్యోదయం :*ఉ 05.48*

సూర్యాస్తమయం :*సా 06.55*

*ప్రయాణశూల   : ఉత్తరం దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.41 - 08.18*

సంగవ కాలం         :      *08.18 - 10.54*

మధ్యాహ్న కాలం    :     *10.54 - 01.31*

అపరాహ్న కాలం    : *మ 01.31 - 04.08*

*ఆబ్ధికం తిధి         : ఆషాఢ శుద్ధ చతుర్దశి*

సాయంకాలం        :*సా 04.08 - 06.44*

ప్రదోష కాలం         :  *సా 06.44 - 08.56*

రాత్రి కాలం           :*రా 08.56 - 11.51*

నిశీధి కాలం          :*రా 11.51 - 12.35*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.14 - 04.57*

---------------------------------------- --------  

        *🌷ప్రతినిత్యం🌷*

       *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


  *🪷శ్రీ సరస్వతీ కవచం🪷*


*ఓం శ్రీం హ్రీం సరస్వ త్త్యై స్వాహా* 

*శిరో మే పాతు సర్వతః* 


🌷 *ఓం సరస్వత్యై నమః* 🌷


🌷🪷🌹🛕🌹🌷🪷🌷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

    🌹🌷🌹🌷🌹🌷🌹