రామకృష్ణుని కధామృతంలోని కొన్ని అమృతబిందువులు- 19 .
గృహస్తులకు ఉపదేశం.
* * *
శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరాలయంలో, తమగదిలో చిన్న మంచంమీద విశ్రమించి, భక్తులతో సంభాషిస్తున్నారు.
అప్పుడు ఒకభక్తుని రామకృష్ణులు, ' నీకు సాకార ధ్యానం నచ్చుతుందా, నిరాకారమా ? ' అని అడిగారు. దానికి భక్తుడు, ' స్వామీ ! ఇప్పుడు సాకారం వైపు మనస్సు పోవడం లేదు. నిరాకారంలో మనస్సు నిలవడం లేదు. ' అని తనగోడు వెళ్లబోసుకున్నాడు.
దానికి రామకృష్ణులు, ' చూశావా ! నిరాకారంలో ఒక్కసారిగా మనస్సు స్థిరం కాదు. ప్రాధమికదశలో సాకారమే మంచిది. అవి మృణ్మయ విగ్రహాలు కాదు, చిన్మయ విగ్రహాలు. ' అని చెప్పారు.
అంతేకాదు. ' విగ్రహాలపై మనస్సు నిల్వకుంటే, తల్లి గురువు, తల్లి బ్రహ్మ స్వరూపిణి, కాబట్టి, కన్నతల్లి రూపాన్ని అయినా ధ్యానం చేయవచ్చును. ' అని, ఒక భక్తుడు అడిగినదానికి సమాధానంగా చెప్పారు. రామకృష్ణులు.
* * *
ఆ తరువాత భక్తునికోరికపై, సాకార నిరాకార దర్శన అనుభూతులను గురించి ఈవిధంగా చెప్పారు, రామకృష్ణులు.
' ఈ విషయాలను లోతుగా అర్ధం చేసుకోవాలంటే, సాధనాలు అవసరం. అది ఎలాగంటే, తాళంవేసి వున్న గదిలో నిధులు కావాలంటే, తాళంతీసి తలుపులు తీయాలి. కేవలం మనస్సుతో తాళం తీసినట్లు, గది తలుపులు తెరచినట్లు ఊహించుకుంటే, నిధి చేతికి అందదు కదా ! '
' ఒకానొక సమయంలో, శ్రీకృష్ణుడు అర్జునునికి, బ్రహ్మ తత్త్వం ఉపదేశిస్తూ, ' నేను సాకారవాదుల వద్ద సాకారంలో దర్శనమిస్తాను. నిరాకార వాదులకు బ్రహ్మతత్వంలో కనిపిస్తాను. ' అని చెప్పాడు.
* * *
' యోగులలో రెండురకాలవారు వున్నారు. ‘ బహూదక, కుటీచక ‘ అని.
‘ బహూదకులు ‘ అనేకతీర్ధాలు దర్శించినా, మనశ్శాంతికై అలమటిస్తూ వుంటారు. ‘ కుటీచక ‘ లక్షణాలు వున్నవారు, కుటీరంలో స్థిరంగా కూర్చుని దైవాన్ని దర్శించేవారు. వీరుకూడా మొదట్లో అన్ని తీర్ధాలనూ దర్శించుకుని, మనస్సు స్థిరపరచుకుంటారు. మనశ్శాంతితో ఒక ఆసనం మీద స్థిరంగా కూర్చుని, భగవంతుడిని ధ్యానిస్తారు. అట్టివారు, ఇక తీర్ధయాత్రలకు పోవలసిన పనిలేదు. కేవలం కొత్త స్ఫూర్తిపొందడం కోసమే అట్టివారు తిరిగి తీర్ధయాత్రలు చేస్తారు. '
* * *
నేను కూడా మధుర్ బాబుతో బృందావనం వెళ్ళినప్పుడు ‘ కాళీయ మర్దన ‘ ఘట్టాన్ని చూసి, యెంతో పారవశ్యంలో మునిగిపోయాను. సాయంత్రం పూట, యమునానదీ తీరాన మేతకుపోయి వస్తున్న గోవులను చూసి, ‘ కృష్ణుడెక్కడ ? కృష్ణుడెక్కడ ? ‘ అని కేకలు పెడుతూ పరుగులు తీసేవాడిని.
గోవర్ధనగిరి చూసి, నేను ఎక్కిన పల్లకీదిగి ఒక్కపరుగున కొండ యెక్కాను. అలాంటి వాతావరణంలో తిరుగుతూ, ఆ ప్రదేశాలను చూస్తూ, బాహ్యచైతన్యం కోల్పోయాను. కళ్ళవెంట ఆనందబాష్పాలు ధారలు కట్టేవి.
' కృష్ణా ! ఇక్కడ అన్నీ కనబడుతున్నాయి కానీ, నీవు మాత్రం కనబడడం లేదే ! ' అని యెంతోవేదన చెందేవాడిని. నన్నుచూసి, గంగామాయి అనే ఒక భక్తురాలు, సాక్షాత్తు రాధాదేవి, మానవదేహం దాల్చి మళ్ళీవచ్చింది. ' అని పలికేది. గంగామాయి నన్ను అక్కడే శాశ్వతంగా వుండిపోయే విధంగా ఏర్పాట్లు చేస్తుంటే, నాలో ఘర్షణ మొదలై, కాళీమాత స్ఫురించి, ‘ నేను తిరిగి పోవలసిందే ‘ అని పట్టుబట్టి, తిరిగి దక్షిణేశ్వర్ కి వచ్చేసాను.
* * *
ఈ విధంగా రామకృష్ణులు భక్తులతో సంభాషించిన తరువాత, భక్తులతో ప్రసాదం స్వీకరించారు. తరువాత తిరిగి సంభాషిస్తూ, మధ్యమధ్యలో ఓంకారాన్ని ఉచ్ఛరిస్తూనో, ' హా ! చైతన్య మహాప్రభూ ! ' అంటూనో వున్నారు.
స్వస్తి.
రామకృష్ణుల అనుగ్రహంతో మరికొంత రేపు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి