18-41-గీతా మకరందము.
మోక్షసన్న్యాసయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
అII లోకములో జనులకు వారి వారి గుణములనుబట్టి కర్మములు విభజింపబడినవని తెలుపుచున్నారు –
బ్రాహ్మణ క్షత్రియవిశాం
శూద్రాణాం చ పరన్తప! |
కర్మాణి ప్రవిభక్తాని
స్వభావప్రభవైర్గుణైః ||
తా:- శత్రువులను తపింపజేయు ఓ అర్జునా! బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులకు వారి వారి (జన్మాంతర సంస్కారము ననుసరించిన) స్వభావము (ప్రకృతి) వలన పుట్టిన గుణములనుబట్టి కర్మలు వేఱువేఱుగా విభజింపబడినవి.
వ్యాఖ్య:- ఇదివఱలో 4వ అధ్యాయమున 13వ శ్లోకమందు చాతుర్వర్ణ్యములవారు వారివారి గుణములనుబట్టి కర్మలనుబట్టి సృష్టింపబడిరని భగవానుడు చెప్పియుండిరి* ఇప్పుడును ఆ భావమునే వ్యక్తీకరించుచు వారివారి జన్మాంతర సంస్కారము వలన నేర్పడిన గుణముల ననుసరించియే వారివారికి ఆ యా కర్మలు, (వానిననుసరించి ఆ యా వర్ణములు) విభజింపబడినవని తెలియజేయుచున్నారు. దీనినిబట్టి పుట్టుకతోనే జాతి ఏర్పడుటలేదనియు, వారి వారి గుణములనుబట్టియే జన్మ, కర్మలు ఏర్పడుచున్నవనియు స్పష్టమగుచున్నది. ఇట్టి పరిస్థితియందు ప్రతివానికిని ఊర్ధ్వస్థితికి బోవుటకు అవకాశము లభించుచున్నది. అనగా జన్మనా నీచజాతియందు పుట్టినప్పటికి తమ తమ కర్మలయొక్క శుద్ధత్వముచే, పారమార్థిక సాధనాతిశయముచే, పవిత్రతచే ఉత్తమవర్ణస్థులుగా తయారుకావచ్చును. ఈ ప్రకారముగ సర్వులకును ఆధ్యాత్మిక ఉన్నతశిఖరముల నధిరోహించుటకు అవకాశములు కల్పించుట గీతయొక్క ఒకానొక విశిష్టతయై యున్నది.
ప్ర:- బ్రాహ్మణాది వర్ణములు దేనిచే నేర్పడినవి?
ఉ:- వారి వారి గుణములచే.
ప్ర:- చాతుర్వర్ణ్యములవారికి కర్మ లేప్రకారముగ విభజింపబడినవి?
ఉ: - వారి వారి (జన్మాంతర సంస్కారము ననుసరించిన) స్వభావమువలన పుట్టిన గుణములను బట్టి ఆ యా కర్మలు వారికి విభజింపబడినవి.
ప్ర: - పుట్టుకచే జాతి ఏర్పడినదా?
ఉ:- కాదు. వారి వారి కర్మలచే.
----------------------------
* చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః (4-13)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి