9, జులై 2025, బుధవారం

తిరుమల సర్వస్వం -295*

 *తిరుమల సర్వస్వం -295*

చరిత్రపుటల్లో శ్రీనివాసుడు-10


మరాఠా ప్రభువు వితరణ

➖➖➖➖➖➖

1740 వ సం. లో మరాఠా ప్రభువు రఘోజీ భోంస్లే వెల్లూరు కోటను ముట్టడించి, అప్పటి నవాబు సఫ్దర్ అలీ నుంచి కోటి రూపాయల భారీ మొత్తాన్ని నజరానాగా స్వీకరించి చిత్తూరు ప్రాంతం నుంచి వైదొలిగాడు. తన ఘనవిజయానికి కృతగ్జ్నతగా శ్రీవారిని సందర్శించి, రఘోజీ సమర్పించుకున్న దాదాపు లక్షన్నర విలువైన (అప్పట్లో సుమారు 150 కిలోల బంగారంతో సమానం) ఆభరణాలు రఘోజీవారి పట్టీ పేరుతో పిలువబడుతూ, ఇప్పటికీ విశేష సందర్భాల్లో శ్రీవారికి అలంకరింప బడుతున్నాయి. ఆ ఆభరణాల గురించి శ్రీవారి ఆభరణాలు అధ్యాయంలో మరింత వివరంగా తెలుసుకుందాం. 


ఈస్టిండియా కంపెనీ హయాంలో తిరుమల

➖➖➖➖➖➖➖

పద్దెనిమిదవ శతాబ్దపు ప్రథమార్థంలో జరిగిన అనేక యుద్ధాల పర్యవసానంగా - అప్పటివరకూ ఆర్కాటు నవాబుల పాలనలో ఉన్న కర్నాటక ప్రాంతం లోని చాలా భాగాలు ఈస్టిండియా కంపెనీ పరమయ్యాయి. ముందు చెప్పుకున్నట్లు, సంధి షరతుల్లో భాగంగా అప్పటి ఆర్కాటు నవాబు తిరుమల క్షేత్రం పై వచ్చే ఆదాయాన్ని కంపెనీ వారికి శాశ్వతంగా కుదువ పెట్టడంతో - దేశవ్యాప్తంగా ఖ్యాతి గడించిన ఒక హైందవక్షేత్ర పాలనా పగ్గాలు ముస్లిం పాలకుల నుండి క్రైస్తవులకు బదిలీ అయ్యాయి. హైందవులందరి ఆరాధ్య దైవమైన అఖిలాండ నాయకుడు అంగడి సరకులా పరాయి పాలకుల చేతులు మారడం అనాదిగా వ్రేళ్ళూనుకున్న ఆర్షసంస్కృతికే మాయనిమచ్చ. అశేషమైన శ్రీవారి భక్తుల హృదయాలను కలచివేసే అపశృతి. ఆ దుర్దినాలు సృష్ట్యంతం వరకూ పునరావృతం కాకూడదని ఆశిద్దాం. 


1758 వ సం. లో అప్పుడు మచిలీపట్నం ముఖ్యకేంద్రంగా గలిగిన ఒక ఫ్రెంచి సైన్యాధికారి కొందరు ముస్లిం పాలకులతో కలిసి తిరుపతి పరగణాపై దండెత్తగా, కొంతకాలం పాటు ఆలయం మరో క్రైస్తవ మతావలంబులైన ఫ్రెంచి వారి అధీనమయ్యింది. అంతకు మించి ఫ్రెంచి పాలనకు సంబంధించిన ఆధారాలు పెద్దగా లభ్యం కాలేదు. దీనిని బట్టి అతి స్వల్పకాలం లోనే తిరుమల క్షేత్రం, అప్పట్లోనే దాదాపు దేశవ్యాప్తంగా విస్తరించిన ఈస్టిండియా కంపెనీ వారి హస్తగతమయ్యిందని భావించవచ్చు. 


వైకుంఠనాథుని వైభోగం

➖➖➖➖➖➖➖

1750 - 60 సంవత్సరాల మధ్యకాలంలో - కొండకోనల్లో, కీకారణ్యం మధ్యన నెలకొన్న, అప్పటికి నామమాత్రపు రవాణా సదుపాయాలు మాత్రమే కలిగి ఉన్న తిరుమల వార్షికాదాయం సుమారు రెండున్నర లక్షల రూపాయలు ఉండగా; అప్పటికే సహస్రాబ్దికి పైగా పల్లవ, చోళ రాజుల ప్రాపకాన్ని, ప్రాభవాన్ని విశేషంగా చవి చూచిన కాంచీపురం మహాపట్టణంలో గల కంచి వరదరాజస్వామి ఆలయ వార్షికాదాయం కేవలం లక్షన్నర రూపాయలు మాత్రమే ఉండేది. దీనిని బట్టి, ఆనాడే తిరుమల ఆలయం ఎంత లోకప్రసిద్ధి గాంచిందో, స్వామివారు భక్తులను, కానుకలను సూదంటురాయిలా ఎలా ఆకర్షించేవాడో అవగత మవుతుంది. 


మాధవుని మడులూ, మాన్యాలు

➖➖➖➖➖➖➖

ఈస్టిండియా కాలం నాటి నివేదికలను బట్టి, పంధొమ్మిదవ శతాబ్దం ప్రారంభానికి ఆలయ మాన్యాలు సువిశాల ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. తూర్పున శ్రీకాళహస్తి వరకూ, ఉత్తరాన వెంకటగిరి సంస్థానం వరకూ, దక్షిణాన నారాయణవనం మరియు కార్వేటినగరం వరకూ, పడమర దిక్కున నేటి వాయల్పాడు ప్రాంతానికి చెందిన నాగపాతాళ దేవరకొండ వరకూ వ్యాపించి ఉన్న 187 గ్రామాలు తిరుమలేశుని హక్కభుక్తంగా ఉండేవి. వీటిలో 124 గ్రామాలు కరకంబాడి, మామండూరు, కాళహస్తి, కార్వేటినగరం పాలెగార్ల (పాలెగార్లంటే ఆనాడు రాయలసీమలో ఉన్నటువంటి ప్రాంతీయ పాలకులు‌. పరిపాలనా కేంద్రం నుండి సుదూరంగా ఉన్న ప్రాంతాల రక్షణ నిమిత్తం విజయనగర రాజుల కాలంలో ఈ వ్యవస్థ వ్రేళ్ళూనుకుంది ) అధీనం లోనూ; 13 గ్రామాలు ఆచార్యపురుషుల (వీరి గురించి శ్రీవారి కైంకర్యపరులు అనే అధ్యాయంలో తెలుసుకుందాం) ఆధ్వర్యం లోనూ; కొన్ని మహంతు మఠానికి చెందిన బైరాగుల వశం లోనూ; మరికొన్ని జియ్యంగార్ల ఆధిపత్యం లోనూ ఉండేవి. దేవాలయానికి దత్తమైన గ్రామాల్లో కౌలు, శిస్తు వసూలు చేయడం; ఆ రొక్ఖాన్ని దేవాలయం బొక్కసానికి భద్రంగా చేర్చడం, సంబంధిత నివేదికలను ఆలయ యాజమాన్యానికి సమర్పిండం ఆయా అధీకృతుల బాధ్యతలు. వారిలో కొందరు పంటభూములకు సాగునీటి వసతిని కల్పించటం, ఆయా గ్రామాల్లో రహదారులను నిర్వహించటం, భక్తుల నుంచి కానుకలను సేకరించి వాటిని దేవాలయానికి చేర్చడం వంటి విధులు కూడా స్వచ్ఛందంగా, ప్రతిఫలాపేక్ష లేకుండా నిర్వర్తించే వారు.


ఈస్టిండియా కంపెనీ వారు ఆలయాభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాల్లో చెప్పుకోదగ్గది రహదార్ల నిర్మాణం, పునరుద్ధరణ. అనాదిగా తిరుమల నుండి ఇతర దక్షిణభారత ప్రాంతాలను చేరుకునే రహదారి మామండూరు పర్వతకనుమ గుండా వెళ్ళడంతో; దేవాలయానికి, యాత్రికులకు, రహదారికి భద్రత కలిగించే బాధ్యతను మామండూరు పాలెగార్లు వహించే వారు. ఈనాడు కూడా చిత్తూరు జిల్లా దాటి కడప జిల్లా లోకి ప్రవేశించాలంటే, పచ్చని కొండలు, పరవశించే ప్రకృతి నడుమ ఒద్దికగా ఒదిగి ఉన్న మామండూరు అటవీశాఖ చెక్ పోస్టు దాట వలసిందే! అక్కడి నుండే పూర్వపు రోజుల్లో తిరుమలకు మరో మెట్లమార్గం కూడా ఉండేది. 


తరువాతి కాలంలో మరాఠా ప్రభువులు మైసూరు నుండి తిరుమల చేరుకోవడానికి పలమనేరు, పుంగనూరు, దామలచెరువు మార్గాన్ని; వెంకటగిరి కోట, గుడియాత్తం మార్గాన్ని ఉపయోగించడంతో - అప్పటివరకూ నిర్జనారణ్యాలుగా ఉండే ఆ మార్గాలు కూడా ప్రయాణ యోగ్యంగా మారాయి. ఆ తరువాత ఈస్టిండియా కంపెనీవారు మొగిలి కనుమ (అవిభక్త చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండలం యందలి మొగిలి గ్రామం లోని ప్రాచీన మొగిలీశ్వరాలయం జిల్లాలోని దర్శించదగ్గ పుణ్యక్షేత్రాలలో ఒకటి), పలమనేరు మీదుగా చిత్తూరు నుండి కోలార్ వరకూ సౌకర్యవంతమైన, విశాలమైన రహదారి నిర్మించడంతో తిరుమల ప్రయాణం సులువై భక్తుల తాకిడి మరింత పెరిగింది. 


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

కామెంట్‌లు లేవు: