*మల్లాది_రామకృష్ణ* *శాస్త్రిగారు*
🙏
(జూన్ 16, 1905 - సెప్టెంబర్ 12,1965)
-----------------------------------------
తను తెలుగు వాడిగా — తెలుగు వ్రాయగలవాడిగా — పుట్టడం మన అదృష్టం అన్న గర్వంతో మనసు పులకరిస్తుంది ఆయన పేరు వింటే.
మనం తెలుగు వాళ్ళుగా — అంతో ఇంతో తెలుగు చదవగలిగిన వాళ్ళుగా — పుట్టడం మన అదృష్టం అన్న స్పృహతో వళ్ళు గగుర్పొడుస్తుంది ఆయన రచనలు చదివితే.
పానగల్ పార్కులోని పేరు లేని చెట్టును తక్షశిల, నలందా, వారణాశి విశ్వ విద్యాలయాలంత “ఎత్తు”కు పెంచిన కులపతి — పుంభావ సరస్వతి — ఆయన.
రూపాయ చేసే సెకెండు హ్యాండు పుస్తకాన్ని “విలువ” తెలిసి రెండున్నర పెట్టి కొనుకున్న జోహారి — మేలిమి వజ్రాల బేహారి —ఆయన.
తన రచనలు వేరొకరి పేరుతో చెలామణీ అయినా తనకు అందాల్సిన శ్రీ యశః కీర్తులు వేరొకరి పరమయినా చిరునవ్వే సమాధానంగా కూర్చున్న గుప్తదానపథ సంచారవర్తి — సాక్షాత్ శిబి చక్రవర్తి — ఆయన.
సంగీతం కాదు — స్వరం కాదు — గాయనీ గాయకుల కంఠస్వర ప్రతిభా పాటవం అంతకన్నా కాదు — కేవలం — అదునూ పదునూ ఎరిగి ఆయన వేసిన అందమైన మల్లె పూరేకులవంటి మాటల తేటలు చాలు — సినిమా పాటలో మాధుర్యం ఊటలై ఉప్పొంగటానికి.
తెలుగు చిత్ర గీతాలకు సాహితీ పరిమళాలద్దిన రచయిత
తెలుగు సాహితీ లోకంలో కథాసుదలు చిలికన కవితామూర్తి
అచ్చ తెలుగు... జాను తెలుగు... పదహారణాల స్వచ్చమైన తెలుగుకి చిరునామా
ఆ మహానుభావుడు, మరెవరో కాదు…
చిగురాకు పదాలతో —
చలనచిత్ర సాహితీ భారతి పాదాలకు —
చిరకాలం నిల్చిపోయే —చిరువేకువ సిరివెల్గుల పారాణి పూసిన —
వచన రచనాశిల్ప మేస్త్రి - “మేష్టారు” మల్లాది రామకృష్ణ శాస్త్రి!!
భాషా పరశేషభోగి
సంస్కృతాంధ్ర అంగ్లాలతో పాటు…
— తమిళ కన్నడ మలయాళముల వంటి ప్రాంతీయ భాషలూ…
— అస్సామీ, బెంగాలీ, ఒరియా, మరాఠీ, గూజరాతీ, తుళు, ఉర్దూల వంటి జాతీయ భాషలూ…
— అరబ్బీ, పారశీ, జర్మన్, ఇటాలియన్, ఫ్రెంచి, చైనీసు, గ్రీకు, లాటిను, జాపనీసు వంటి పాశ్చాత్య విదేశీ భాషలు…ఇవ్వన్నీ వ్యాకరణాలంకార సహితంగా ఔపోశన పట్టిన అగస్త్యులవారు శాస్త్రి గారు.
తెలుగు పలుకుబడులను రచనలలో పొదిగిన మల్లాది రామకృష్ణశాస్త్రి....తెలుగు సాహితీ లోకంలో ఆయనెప్పుడూ చిరంజీవి......
మాటలతో గమ్మత్తులు చేస్తూ, చమత్కారాలు, సామెతలు, నానుడిలు ఉపయోగిస్తూ సినిమాలకు చక్కని మాటలు, పాటలు కూర్చారు మల్లాది రామకృష్ణ శాస్త్రి. కొన్ని పాటలలో ఆయన పలికించిన భావాలు వల్ల భావకవి అనీ అనిపించుకుంటారు. సినిమాలో, మాటలు, పాటలు రాయడానికి ముందు, పలు పత్రికల్లో వ్యాసాలు, కథలు రాశారు. నవలలు, నాటకాలు రాసి పేరు తెచ్చుకున్నారు.
1945, మార్చి 24న మద్రాసులో అడుగుపెట్టారు. మద్రాసులోని పానగల్ పార్కులో పగలంతా ఒక చెట్టు క్రింద ఉండే రాతిబల్లపై కూర్చుని వచ్చినవారికి మదన శాస్త్రం నుండి మంత్ర శాస్త్రం వరకు బోధించేవారు. ఎంతో మంది వర్ధమాన కవులకు సందేహ నివృత్తి చేసేవారు.
ప్రముఖ రచయిత సముద్రాల సీనియర్‌కి అసిస్టెంట్‌గాను పనిచేశారు. ఘోస్ట్ రైటర్‌గానూ వ్యవహరించారు. ఆయన శైలిని గుర్తుపట్టి ఇది మీరే రాశారా'' అని అడిగితే పాట మీద, లేదా సినిమా టైటిల్స్‌లో తన పేరుంటే తను రాసిందే అని అనేవారట.
మీరు రాసిన పాటకు సముద్రాల పేరు పడిందేమిటి అని మల్లాదిని ఆరుద్ర అడిగితే ఆరుద్రని ఈ రకంగా ప్రశ్నించారట.
నీ అసలు పేరేంటి ?
భాగవతుల శంకరశాస్త్రి.
ఆరుద్ర అని ఎందుకు పెట్టుకున్నావు ?
నా కలం పేరు.
నేనూ అంతే. నా పేరు మల్లాది రామకృష్ణ శాస్త్రి, కలం పేరు సముద్రాల, అంతే - అని చెప్పి ఆరుద్రని అప్రతిభుడని చేసారని మహారథి పేర్కొన్నారు.
మల్లాది రాసిన ఏరు నవ్విందోయ్ వూరు నవ్విందోయ్ పాటని, ఆరుద్ర రాసినట్లుగా 'పల్లె పడుచు' చిత్రంలో, ఈ చిత్రానికి మాటలు మిగతా అన్ని పాటలు, ఆరుద్ర రాయడంతో ఆరుద్ర పేరే టైటిల్స్‌లో వేశారట. ఈ విషయం తెలిసి మల్లాది నవ్వుకున్నారట కూడా అయితే గ్రామఫోన్ రికార్డుపైన వినోదా ప్రొడక్షన్ సౌజన్యంతో రచన మల్లాది రామకృష్ణ శాస్త్రి అని ఉందని వి.వి.కె. రంగారావు పేర్కొన్నారు.
'దేవదాసు' చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావుపై చిత్రీకరించిన 'కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్' పాటకు మల్లాదిని దాని అర్థం ఏమిటని ఆరుద్ర అడిగితే తాగుబోతుల పాటకు అర్థమేమిటి? అని తేలిగ్గా అనేసారని, పాట ఎన్నిసార్లు వింటే అన్ని రకాల అర్థాలు వస్తాయని ఆరుద్ర ఒకసారి అన్నారు. ఈ పాట కూడా మల్లాది రామకృష్ణ శాస్త్రి రాశారని అంటారు.
మహారథి ముచ్చట్లలో మల్లాది గురించి ఇంకో విషయం కూడా వివరించారు. మల్లాది కాళ్లకు వేసుకునే చెప్పులు ఎంత పాతవి అయిపోయినా, రింగు వగైరా ఊడిపోతూ వున్నా, వాటిని తిరిగి కుట్టించుకుంటూ; బాగు చేయించుకుంటూ అవే తొడుక్కుని తిరిగేవారు. ''ఆర్థిక స్థోమత ఉన్నా ఎందుకు పాతవాటితో అవస్థ పడటం'' అని మహారథి ప్రశ్నిస్తే ''చెప్పులు కుట్టే వాడికి పని పెట్టాలి కదా! అతడికి దానం చేస్తే తీసుకోడు మనం ఇవ్వకూడదు. పని చేయించుకుని ఏదైనా ముట్ట చెప్పాలి. కొత్త చెప్పులు కొనుక్కుంటే అతడి బతుకెలా గడుస్తుంది. రిపేరు చేయటం నా వల్లకాదు అని అతగాడు అన్నప్పుడే కొత్తవి కొంటాను'' అనేవారట.
ఘోస్ట్ రైటర్‌గా రచనలు చేసేటప్పుడు కూడా ''నాకు డబ్బు అవసరం. ఆయన ఇచ్చాడు. రాయమన్నాడు రాశాను. ఎవరికి కావలసింది వారికి దక్కింది. అంతే'' అని అర్థం వచ్చేట్టు మాట్లాడేవారే తప్ప ఏయే రచనలు అలా చేశారో మాత్రం చెప్పేవారు కాదట. అయితే మల్లాది వారి రచనాశైలి తెలిసిన వారికి మాత్రం ఆయన రాసిన వాటిని వెంటనే గుర్తు పట్టేవారు అని రావి కొండలరావు వివరించారు బ్లాక్ అండ్ వైట్‌లో.
తన చదువేదో చదువుతూ, పత్రికలకు కథలు, వ్యాసాలు రాస్తూ, సీనియర్ సముద్రాల (సముద్రాల రాఘవాచార్యులు) కి సహాయపడుతూ తద్వారా సినిమా రచనలోని మెళుకువలు తెలుసుకున్నారు మల్లాది. మల్లాదివారు రాసిన వాటికి తన పేరు టైటిల్స్‌లో పడేదనే విషయం సీనియర్ సముద్రాల కూడా అంగీకరించేవారని చెప్పేవారు.
ఘంటసాల బలరామయ్య ప్రతిభా బ్యానర్‌పై రూపొందించిన 'చిన్న కోడలు' చిత్రానికి స్క్రిప్టు రాయడంతో సినిమా టైటిల్స్‌లో పేరుపడి మల్లాదిగారి ఫిలిం కెరీర్ ప్రారంభం అయింది. ఈ చిత్రానికి 11 పాటలు రాశారు మల్లాది. పిల్లనగ్రోవి పాటకాడ, 'రారాదో రాచిలుక చేర', పరువే బరువాయెగా, ఈ చదువింతే కద, ఆశలు బంగారు అందలాలెక్కాయి వంటి పాటలు నచ్చాయి చాలామందికి. జయసింహ చిత్రంలో నడిరేయి గడిచేనే చెలియా' అనే పాట రాశారు. 'కన్యాశుల్కం' చిత్రానికి 'చిటారు కొమ్మన మిఠాయి పొట్లం', బికారి రాముడు చిత్రానికి 'వాడేనే చెలి వాడేనే', రంగేళి లీలల నా రాజా, 'టాక్సీ రాముడు' చిత్రం కోసం రావోయీ రావోయీ మనసైన రాజా - వంటి పాటలు రాశారు.
'చిరంజీవులు' చిత్రంకి మల్లాది వారు రాసిన 11 పాటల్లో ఏ గీతానికి ఆ గీతం చెప్పకోదగ్గది. ఇందులో హిట్ సాంగ్స్ చాలా వున్నాయి. రేచుక్క చిత్రానికి 8 పాటలు రాశారు.
శ్రీ గౌరీ మహాత్మ్యం, శ్రీకృష్ణ రాయబారం, శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం, మోహినీ రుక్మాంగద, శ్రీశైల మహాత్మ్యం, వీరాంజనేయ వంటి పౌరాణిక చిత్రాలకు పాటలు పద్యాలు రాశారు.
ఎప్పుడూ నవ్వుతూ, గ్లాస్కోపంచె, సిల్కులాల్చీ ధరించి, చేతిలో సిగరెట్ల టిన్నుతో కనిపించేవారని చెప్పులు కుట్టేవాడిని వతనుగా కుదుర్చుకున్నట్టే, రిక్షావాలా కూడా వతనుగా మల్లాదికి వుండేవాడని చెబుతారు.
ఆంధ్ర సాహిత్యానికి మహాభారతం రాసిన నన్నయ, తిక్కన, ఎర్రన కవిత్రయం అయితే తెలుగు చలన చిత్ర సాహిత్యానికి కవిత్రయం సముద్రాల, పింగళి, మల్లాది అని రచయిత వెన్నెలకంటి పేర్కొన్నారు.
మల్లాది పలుకుల్లోంచి అమృతం పుట్టింది. అది తెలుగు సినిమా పాటని చిరంజీవిని చేసిందని వేటూరి చెప్పారు.
సినిమా పాటకి కావ్య గౌరవం కల్పించిన మహాకవి మల్లాది అని ప్రముఖ రచయిత తాపీ ధర్మారావు పేర్కొన్నారు.
బాపు రమణలైతే వచన రచనకు మేస్త్రి రామకృష్ణ శాస్త్రి అన్నారు. తక్కువ సినిమాలకు రాసినా విశిష్ఠ రచనలే ఎక్కువ చేశారాయన.
“అర్థం అవుతుంది! అర్థం చేసుకోవాలి!! తెలియక పోతే అడిగి తెలుసుకోవాలి. భాషా, సాహిత్యమూ తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి సినిమా కూడా ఒక సహాయకారి కావాలి” – ఈ మాటలు అన్నది సినిమా కవులందరూ సాహో అని కీర్తించిన మల్లాది రామకృష్ణ శాస్త్రిగారు. సినిమా పాట ద్వారా కూడా చక్కటి భాషా, కవిత్వమూ కుదిరినప్పుడల్లా ప్రదర్శించవచ్చు అని “మల్లాది స్కూల్” కవుల భావన.
ఈ “మల్లాది స్కూల్” కి చెందిన కవే వేటూరిగారు. ఈయన అందరి కంటే ఒక అడుగు ముందుకు వేసి, కుదిరినప్పుడు మాత్రమే కాక, కుదరనప్పుడు కూడా మథురమైన భాషా, లోతైన కవిత్వమూ ఒలికించారు. పాటల్లో తెలుగు సంస్కృతీ విశేషాలు చొప్పించారు. తెలిసి, తెలిసీ “తప్పులు” చేసిన అసాధారణ ప్రతిభాశాలి! సినిమా పాటకు తగ్గట్టు తను మారకుండా, తనకు తగ్గట్టు సినిమా పాటనే మార్చిన ఘనుడు! అందుకే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు చెప్పినట్టు – “వేటూరి వెండి తెరను నల్ల పలకగా మార్చి తిరిగి మనందరిచేతా ఓనమాలు దిద్దించాడు”
అంతే కాదు ఆయనకు పాళీ, పైశాచీ, ప్రాకృతాల వంటి ప్రాచీన జీర్ణ భాషల్ని మధించిన అనుభవం కూడ ఉంది — అట — అని జనాలు చెప్పుకోవడమే గానీ ఏనాడూ తనను గురించి తాను చెప్పుకోలేదు ఆయన.
అయినా ఎవరో చెప్పినట్టు (ఆరుద్ర గారు ?) శాస్త్రి గారిని అగస్త్యునితో పోల్చడం సరి కాదు. అగస్త్యులవారు తాము ఔపోశన పట్టిన సాగరాన్ని మళ్ళీ వదిలి వేస్తే శాస్త్రిగారు మాత్రం తాము త్రాగిన సాహిత్య మహాంబుధులన్నీ తమలోనే భద్రంగా నిక్షిప్తం చేసుకొన్న విజ్ఞాన ఖని. తరగని గని.
“అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతి ఆపలేరు” — ఇది గోడలపై, కొండొకచో ఉడుకు నెత్తురు కుర్రాళ్ళ పుస్తకాలపై, కనిపించే ఒక విప్లవ నినాదం. సర్వ “శాస్త్రి” గారి విషయంలో మాత్రం ఇది పచ్చి నిజం.
ఎంత దాచినా… ఆయా భాషల, విద్యల, శాస్త్రాల సారం శాస్త్రిగారి రచనలో అక్కడక్కడా తొంగి చూస్తూనే ఉంటుంది — వివరం ఎఱిగి చూచే వారిని చిలిపిగా పలుకరిస్తూనే ఉంటుంది.
ఐతే, ఎన్ని భాషలు నేర్చినా ఆయన కథ, కవిత, పాట, పలుకు మాత్రం… అచ్చ తెలుగు వెచ్చదనపు ఊపిర్లు పీలుస్తుంటాయ్.
ఓరోజు మిట్ట మధ్యాహ్నం పూట పడక్కుర్చీలో కూర్చుని పరిచితులతో కబుర్లాడుతున్నప్పుడు ఎవరో అడిగారుట “శాస్త్రి గారు, తమరికెన్ని భాషలొచ్చు ?” అని.
చేతనే ఉన్న తాటాకు విసనకర్ర పై ఆయన రేకుకొక్క భాషలో సంతకం చేస్తుంటే చోటు చాలక విసనకర్ర వెనక్కి త్రిప్పవలసి వచ్చిందట (తాటాకు వీవెనలు చూడని పట్నవాసులకు : లెఖ్కకు దాదాపు ముప్ఫై భాషలకు పైమాటే)!
రామకృష్ణ శాస్త్రిగారు సముద్రుడి కన్నా గొప్పవాడు. తనలో ఎన్నో నిధి నిక్షేపాలున్నా గొప్పవాడినంటూ సముద్రుడిలా ఘోష పెట్టడు. రామకృష్ణ శాస్త్రిగారు అగస్త్యుడికన్నా గొప్పవాడు. అగస్త్యుడు సాగరాలను పుక్కిట పట్టి వదిలి పెట్టేశాడు. శాస్త్రిగారు భాషా సముద్రాలను తనలోనే నిలబెట్టుకున్నారు.
............. మల్లాది వారి గురించి ఆరుద్రగారి మాటలవి.
ప్రౌఢ వాక్యాల తెరల మరగున దోబూచులాడీ.....ముగ్ధ భావాలతో.......
వన్నెలాడిలా...కన్నేలేడిలా...
వయ్యారాలు పోయే తేనె మాటల...తెలుగు మాటల...
రంగుల హోరంగులతో తెలుగువాడి జీవిత
జూమూతాన్ని ఒత్తిగించి....
తెల్లని...చక్కని...చిక్కని...కథాశరశ్చంద్రికలు వెలయించి...
పడుచు గుండెలు గుబగుబలాడించి
మనసుకందని అందాలను భాషకు దించి, భాషలో...కైతలో....
బయోస్స్కోపులో అచ్చరలచ్చల పచ్చ చమత్కారాలు పండించుకుంటూ
అలనాటి పాండురంగ విభుని పదగుంభనలా పాండిబజారు దర్బారులో
నిలిచి... ఎవరన్నా ! మహానుభావకులు ?
ఓహో ! వచన రచనకు మేస్త్రి
సాహో ! రామకృష్ణ శాస్త్రి
- మల్లాది వారి రచనా వైభవాన్ని ముళ్ళపూడి వెంకటరమణ గారు వర్ణించిన విధమది.
జీవిత విశేషాలు
వచన రచనకు మేస్త్రీ - మల్లాది రామకృష్ణ శాస్త్రి. ఆయన విశ్వమానవుడు. వసుధైక కుటుంబకం అనే భావన మదినిండా బలీయంగా కలిగిన మహనీయులు. మల్లాది రామకృష్ణశాస్త్రి 1905, జూన్ 16న కృష్ణా జిల్లా, చిట్టిగూడూరు గ్రామంలో ఒక సంపన్న కుటుంబంలో కనకవల్లి, నరసింహశాస్త్రి దంపతులకు జన్మించారు. మచిలీపట్నంలో బి.ఎ. వరకు చదివారు. తరువాత మద్రాసులో సంస్కృతాంధ్రాలలో ఎం.ఎ.పట్టా పుచ్చుకున్నారు. యడవల్లి సుబ్బావధాన్లుగారి దగ్గర వేద విద్యను, నోరి సుబ్రహ్మణ్య శాస్త్రిగారి దగ్గర మహాభాష్యాన్ని, శిష్ట్యా నరసింహ శాస్త్రిగారి దగ్గర బ్రహ్మసూత్రాలను అభ్యసించారు. నాట్యకళలో, చిత్ర లేఖనంలో, సంగీతంలో కూడా వీరికి ప్రవేశం ఉంది. మొదట మచిలీ పట్నంలోనే స్థిర నివాసం. తర్వాత కొంతకాలం పాటు గుంటూరులో కాపురం. 15వ ఏట పురాణం సూరిశాస్త్రి గారి కుమార్తె వెంకటరమణతో వివాహం జరిగింది. ఈ దంపతులకు నలుగురు సంతానం. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. కొడుకులిద్దరికీ ఒకరికి తండ్రిపేరు (మల్లాది నరసింహ శాస్త్రి), మరొకరికి మామగారి పేరు పెట్టుకున్నారు. మల్లాది రామకృష్ణ శాస్త్రిగారు కొంతకాలంపాటు గుంటూరులో పాములపాటి వెంకట కృష్ణయ్యచౌదరి నడిపే దేశాభిమాని పత్రికకు ఉపసంపాదకుడిగా పనిచేశారు. చిన్నతనంనుంచే వీరు రాసిన వ్యాసాలు, కథలు పలు పత్రికల్లో అచ్చయ్యాయి. శాస్త్రిగారు రాసిన పలు నాటకాలు, నవలలు వారికి చిరకీర్తిని ఆర్జించిపెట్టాయి. కృష్ణాతీరం అచ్చ తెలుగు నుడికారానికి పట్టం కట్టిన రచనగా తెలుగు సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే నవలగా ఖ్యాతి గడించింది. తెలుగు సినీ పరిశ్రమలో దిగ్దర్శకులు గూడవల్లి రామబ్రహ్మం ‘పల్నాటి యుద్ధం’ సినిమా రచనకు సంబంధించి సలహాలకోసం శాస్త్రిగారిని మద్రాసుకు ఆహ్వానించారు. అలా 1945, మార్చి 24న మద్రాసులో అడుగుపెట్టిన రామకృష్ణ శాస్త్రిగారు తర్వాతి కాలంలో తెలుగు చలన చిత్ర సీమకు సరికొత్త భాషాపరమైన సొబగుల్ని మాటలు, పాటల ద్వారా పరిచయం చేసి కొత్త ఒరవడికి నాందీ పలికారు. మద్రాసులో చాలాకాలం పాటు సముద్రాల రాఘవాచార్యకూ మల్లాది రామకృష్ణ శాస్త్రికీ చక్కటి సాన్నిహిత్యం ఉండేది. రామకృష్ణ శాస్త్రి చాలాకాలం పాటు తెలుగు సినీ పరిశ్రమలో "ఘోస్ట్ రైటర్" గా ఉన్నారు. 1952కు ముందు సినిమాల్లో చాలావాటిల్లో వీరి పేరు ఉండేది కాదని పలువురు సినీ ప్రముఖులు చెబుతారు. చిన్న కోడలు చిత్రంతో శాస్త్రిగారు అజ్ఞాతవాసాన్ని వీడి తెరమీదికొచ్చారు. తన సొంత పేరుతో 39 చిత్రాలలో 200కు పైగా పాటలను రాశారు. మద్రాసులోని పానగల్లు పార్కులో ఓ చెట్టుకింద ఉన్న రాతిబల్లమీద కూర్చుని సాయంత్రం వేళ్లలో విద్వత్సభలను నడిపేవారు. ఈ సభల్లో అనేక శాస్త్రాలకు సంబంధించి, అనేక విషయాలకు సంబంధించి, అనేక రంగాలకు సంబంధించి, భాషకు, భావానికీ, అభివ్యక్తికీ సంబంధించి అనర్గళంగా మాట్లాడేవారు. ఎందరో వర్థమాన కవులకు, రచయితలకు సందేహాలను నివృత్తి చేసేవారు. అదిమాత్రమే కాక ఆ సమావేశాలకు హాజరైనవారిలో, పానగల్లు పార్కుకు వచ్చి శాస్త్రిగారిని కలిసిన వారిలో ఆకలిగొన్నవారికి తన బ్యాగులో ఉన్న హోటల్ భోజనం టిక్కెట్ల కట్టలోంచి ఓ టిక్కట్టును చింపి ఇచ్చి వారి కడుపు నింపిన వెన్నలాంటి కన్నతల్లి మనసు ఆయనది. కేవలం ఇలా ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టించడంకోసమే ఆయన తన చేతికి డబ్బు రాగానే పాండీ బజార్ లో ఉన్న హోటల్ కి వెళ్లి ప్రత్యేకంగా భోజనం టిక్కెట్ల పుస్తకాన్ని కొనుక్కొచ్చేవారని ఆయన్ని బాగా ఎరిగినవారు చెబుతారు. అందరినీ తనవాళ్లుగా భావించి ఆదరంగా చూసుకునే మంచి మనసు ఆయనది. రామకృష్ణ శాస్త్రిగారు దాదాపు వందకి పైగా భాషల్లో పండితులని ప్రతీతి. సినీ రచయిత, కవి ఆరుద్ర మద్రాసులో మల్లాది రామకృష్ణ శాస్త్రిగారింటికి తరచూ వెళ్లి అనేక విషయాలు తెలుసుకోవడంలో ఆసక్తిని కనబరిచేవారు. ఓ రోజున ఆరుద్ర నేరుగా "గురువుగారూ మీకసలు ఎన్ని భాషలు తెలుసును ?" అని అడిగారు. దానికి సమాధానంగా శాస్త్రిగారు జాబితా రాసుకోమని చెబితే, అప్పుడు ఆరుద్ర "అలా కాదు. మీకెన్ని భాషల్లో కవిత్వం చెప్పగల సాధికారత ఉందో, అన్ని భాషల్లోనూ ఈ విసనకర్ర ఆకులపై ఒక్కో ఆకుమీద ఒక్కో సంతకం చొప్పున ఆయా భాషల్లోనే చేసివ్వండి" అంటూ తాటాకు విసనకర్రను, ఇంకు పాళీ కలాన్ని ఆయన చేతికి ఇచ్చారు. అప్పుడు శాస్త్రిగారు ఒక్కో ఆకుమీద ఒక్కో భాషలో సంతకం చేస్తూపోతే మొత్తంగా ఆ తాటాకు విసనకర్రకు రెండు వైపులా ఉన్న ఆకులన్నీ నిండిపోయాయి. ఇది స్వయంగా రామకృష్ణ శాస్త్రిగారి పెద్ద కుమారుడు మల్లాది నరసింహశాస్త్రిగారు చెప్పిన విషయం. కనుక రామకృష్ణ శాస్త్రిగారికి వందకు పైగా భాషల్లో కవిత్వం చెప్పగలిగిన పాండిత్యం ఉండేదని నిష్కర్షగా చెప్పొచ్చు.
రచనలు
మల్లాది రామకృష్ణ శాస్త్రిగారు కృష్ణా పత్రికలో ఛందోబద్ధమైన కవిత్వం రాశారు. ఈ పత్రికలోనే చలువ మిరియాలు పేరుతో ఆయన రాసిన వ్యంగ్య వ్యాసాలకు అశేషమైన పాఠకాదరణ లభించింది. తన 19వ ఏటనే కథారచన ప్రారంభించి దాదాపు 125 కథలను రాశారు. వీరు రాసిన డుమువులు కథ 14 భారతీయ భాషలలోకి అనువదింపబడింది. అహల్యా సంక్రందనం, హంసవింశతి గ్రంథాలకు అమూల్యమైన పీఠికలు వ్రాశారు.
సంకలనాలు
చలవ మిరియాలు
నవలలు
కృష్ణాతీరం
తేజోమూర్తులు
క్షేత్రయ్య
నాటికలు
గోపీదేవి
కేళీగోపాలం
బాల
అ ఇ ఉ ఱ్
సేఫ్టీ రేజర్
సినీ సాహిత్యం
బాలరాజు (1948)
చిన్న కోడలు (1952) (గీత రచయితగా తొలిచిత్రం)
కన్యాశుల్కం (1955) (గీత రచయిత)
రేచుక్క (1955) (గీత రచయిత)
చిరంజీవులు (1956) (గీత రచయిత)
కార్తవరాయని కథ (1958) (గీత రచయిత)
జయభేరి (1959) (గీత రచయిత)
తల్లి బిడ్డ (1963) (గీత రచయిత)
జ్ఞానేశ్వర్ (1963) (గీత రచయిత)
దేశద్రోహులు (1964) (గీత రచయిత)
రహస్యం (1967) (గీత రచయిత)
వీరాంజనేయ (1968) (గీత రచయిత)
అత్తగారు కొత్తకోడలు (1968) (గీత రచయిత)
సేకరణ