30, ఏప్రిల్ 2022, శనివారం

పాండురంగ మహత్యం*

 *పాండురంగ మహత్యం*


లోహదండపురంలో మహాభక్తులైన బ్రాహ్మణదంపతులకు పుండరీకుడనే కుమారుడున్నాడు. అతడు యవ్వనంలో అనేక దురలవాట్లకు లోనై తల్లి దండ్రులను కష్టపెట్టాడు. అతడికి చక్కని కన్యను చూచి పెళ్ళిచేశారు. భార్యా వ్యామోహంలోపడి తల్లిదండ్రులను ఇంకా ఇంకా బాధలు పెట్టాడు కుమారుడు.


ఒకనాడు భార్యతో కలసి కాశీక్షేత్రం బయలుదేరాడు. మార్గమధ్యంలో కుక్కుట మహాముని ఆశ్రమం ఉంది. అక్కడ ముగ్గురు స్త్రీలు ఆ ఆశ్రమ ప్రదేశాన్ని ఊడ్చి శుభ్రం చేస్తుండగా చూచి 'మీరెవరు?" అని అడిగాడు.


"నాయనా మేము గంగ, యమున, సరస్వతులం. పవిత్రులమైన మాలో పాపాత్ములు స్నానం చెయ్యటంవల్ల వారి పాపాలు మాకు చుట్టుకుంటున్నాయి. ఆ పాపపరిహారం కోసం ఈ మహాత్ముని ఆశ్రమాన్ని ఇలా ప్రతిరోజూ శుభ్రం చేసి పరిశుద్ధులమౌతున్నాం. అన్నారు వారు. (ఇదే స్థాన శుశ్రూష)"


కుక్కుట మహాముని యొక్క శక్తికి ఆశ్చర్యపోయిన పుండరీకుడు సతీసమేతంగా ఆశ్రమంలో ప్రవేశించాడు. అక్కడ ఆ మహాముని తన తల్లిదండ్రులకు పాదసేవ చేస్తున్నాడు. పుండరీకుడు ఆయనకు నమస్కరించి, మహాత్మా గంగ, యమున, సరస్వతుల పాపాలను కూడా కడిగి వేయగల అద్భుతశక్తిని మీరెలా సాధించగలిగారు? అని అడిగాడు.


దానికా ముని "నాయనా! నాకు ఏ సాధనలు తెలియవు. తల్లిదండ్రుల పాదసేవయే పరమాత్మసేవగా భావించాను. నాకు దీనియందే మనస్సు నిలిచిందిలీ బుద్ధి ప్రశాంతతను పొందింది. ఇంతకన్న నాకు కావాల్సిందేమీ లేదు. తల్లిదండ్రుల పాదసేవ చేసుకొనే అదృష్టం పూర్వజన్మ సుకృతం ఉన్నవారికే కలుగుతుంది" అన్నాడు. దానితో పుండరీకునికి జ్ఞానోదయమయ్యింది. "తానింత వరకు తల్లిదండ్రుల పట్ల చేసిన అపరాధానికి తనను క్షమించ మని ముని పాదాలపై బడ్డాడు పుండరీకుడు. ముని ఆశీర్వాదాన్ని పొంది, కాశీ ప్రయాణం మానుకొని, లోహదండపురం వచ్చి తల్లిదండ్రుల పాదాలను పట్టుకొని తనను మన్నించమని కంటికి మింటికి ఏకధారగా విలపించాడు. తల్లిదండ్రులు కుమారునిలో కలిగిన పరివర్తనకు ఎంతో ఆనందించారు. అది మొదలు చంద్రభాగా నదీతీరంలో ఒక కుటీరాన్ని ఏర్పాటుచేసి తల్లిదండ్రులను అక్కడే ఉంచి, నిత్యం వారి సేవనే చేస్తూ తన జన్మను చరితార్థం చేసుకుంటున్నాడు పుండరీకుడు. అతడి భార్య కూడా అతడికి ఎంతగానో సహకరిస్తున్నది. తల్లిదండ్రుల సేవయే అతడికి జపం- తపం-ధ్యానం.దానితో అతడి అంతఃకరణం శుద్ధమైంది. అహరకారం నశించింది. రాగద్వేషాలు తొలగిపోయాయి. అజ్ఞానం అంతరంగం ప్రశాంతమైంది. ఆత్మానుభూతికి హృదయకవాటాలు తెరుచుకోబోతున్నాయి.


భక్తుని అనుగ్రహించటానికి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఆశ్రమ గుమ్మం దగ్గర ప్రత్యక్షమయ్యాడు. 'పుండరీకా! ఇలా చూడు. నేను జగన్నాథుడను. నీ భక్తికి మెచ్చి నిన్ను అనుగ్రహించుటకు వచ్చాను. నాతో రా! అన్నారు. దానికి పుండరీకుడు "స్వామీ! శతకోటి జన్మల పుణ్యఫలం ఉంటేగాని మీ దర్శనం లభించదు. నాయందు మీకు గల కరుణ వల్లనే నాకీ అదృష్టం కలిగింది. నాజన్మ తరించింది. కానీ. భగవాన్! నీవు నన్ను క్షమించాలి. నీ ఆదేశం ప్రకారం నేను నీతో రావటానికి వీల్లేదు. నేను నా తల్లిదండ్రుల సేవలో పూర్తిగ మునిగి ఉన్నాను. వారిసేవను మధ్యలో ఆపి నేను మీతో రాలేను. ఈ సేవ పూర్తికాగానే తప్పక వస్తాను. అప్పటిదాకా మీరు దీనిపై నిలబడి వుండండి అంటూ ఒక ఇటుకరాయిని భగవంతుని వైపుకు విసిరివేశాడు.


పుండరీకుని సేవాపరాయణతకు సంతసించిన భగవానుడు ఆ ఇటుకపై నిలిచి కటిహస్తుడై (నడుముపై చేతులు పెట్టుకొని) సుందరవిగ్రహంగా నిలిచాడు. ఆయనే పాండురంగడు - పండరినాథుడు.పండరిలో వెలసిన  దేవుడు.


తల్లిదండ్రుల సేవకు ఫలితం భగవత్సాక్షాత్కారం. భగవంతుడే వచ్చి పిలిచినా ఆ సమయంలో కూడా అతడికి తల్లిదండ్రుల సేవ మీదనే దృష్టిగాని ఫలితం మీద లేదు. భగవద్భావనతోనే తల్లిదండ్రుల సేవ చేస్తున్నాడు తప్ప అతడికి శరీరదృష్టి లేదు. (సాక్షాత్ భగవంతుని సేవయే అని చేస్తున్నాడు) తల్లిరూపంలో, తండ్రిరూపంలో, భార్యరూపంలో, భర్తరూపంలో, బిడ్డలరూపంలో, గురువురూపంలో అన్ని రూపాలలో ఉండేది ఆ భగవంతుడే అని భక్తుని అభిప్రాయం. "త్వమేవ సర్వం మమదేవ దేవ!"


పుండరీకుడు భగవంతుని అలా ఇటుక మీద నిలబెట్టినప్పుడు తుకారాం స్వామి అక్కడికి వచ్చాడు. అతడు పుండరీకునితో "ఏమిటోయ్ పుండరీకా! అతడెవరనుకున్నావు? సాక్షాత్తు జగన్నాథుడు, భగవంతుడు, ఏమిటింత నిరాదరణ. ఆయనకు సత్కారాలు చేసి జన్మచరితార్థం చేసుకో!" అన్నాడు తుకారాం. ఆ మాటకు పుండరీకుడు "స్వామీ! వీరు దేవుళ్ళు కారా? ఆయనేనా దేవుడు? ఈ దేవుళ్ళను వదిలి ఆ దేవుణ్ణి పట్టుకోమంటావా? నాది 'ఏ' సిద్ధాంతం కాదు. 'ఊ' సిద్ధాంతం. అతడే దేవుడు అనను. అతడూ దేవుడే అంటాను. నా తల్లిదండ్రులూ దేవుళ్ళే. ఇతడూ దేవుడే అని నాభావన" అన్నాడు. పుండరీకుని కర్మనిష్ట అలాంటిది. అతడికి కర్మయందే ఆసక్తి కర్మఫలంపై ఎలాంటి ఆసక్తి లేదు. అలా చెయ్యాలి కర్మలను.


*యే మనుష్యః మాం ఆశ్రతః!*

*తాన్ సర్వేస్యః కర్మ వినాశనః లభై!!*

మాధవామాసం

 ’వైశాఖే మాధవో, రాధో’


వైశాఖమాసాన్ని ’మాధవామాసం’ అని అంటారు. ఈ మాసంలో విష్ణుస్మరణతో, అభీష్ట దేవతారాధనతో నియమపాలన చేయడం ఇహ పర శ్రేయస్సునిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. వైశాఖమాసాన్ని మహిమాన్వితమైన దివ్యమాసంగా శాస్త్రాలు వర్ణించాయి. ఈ మాసాన ప్రాతః కాలాన లేచి మధుసూదనుని స్మరిస్తూ స్నానం చేయడం విశేష ఫలప్రదం.


ప్రాతః సనియమ స్నాన్యే ప్రీయతాం మధుసూదనః!


అదే విధంలో


"మాధవే మేషగే భానౌ మురారే మధుసూదన

ప్రాతః స్నానేన మే నాథ ఫలదోభవ పాపహన్!! -


అనే ప్రార్థనతో తీర్థాదులలో చేసిన స్నానం దివ్యఫలాన్నిస్తుంది.


తులసీ కృష్ణ గౌరాభ్యాం తయాభ్యర్చ్య మధుద్విషమ్!

విశేషేణ తు వైశాఖే నరో నారాయణో భవేత్!!


మాధవం సకలం మాసం తులస్యాయోర్చయే న్నరః!

త్రిసంధ్యం మధుహంతారం తస్యనాస్తి పునర్భవః!!


వైశాఖమాసమంతా శ్రీ మహావిష్ణువును తులసీ దళాలతో అర్చించితే శ్రేష్ఠం.


ప్రాతః స్నానానంతరం అధికజలంతో అశ్వత్థ (రావి) వృక్షపు మూలాన్ని తడిపి ప్రదక్షిణలు చేస్తే పూర్వీకులంతా తరిస్తారు.


ఈ మాసంలో ఒంటిపూట భోజనం లేదా నక్తం (పగలంతా ఉపవసించి రాత్రి ప్రారంభంలో భుజించడం) ఆచరించడం మంచిది.


ఈ మాసంలో చలివేంద్రాలు, పళ్ళరసాలు, మజ్జిగ వంటి పానీయాల శాలలని నిర్వహించడం, విసనకర్రలు, గొడుగులు, పాదరక్షలు దానం చేయడం పుణ్యఫలాన్నిస్తుంది.


ఈ నెల శివుని అభిషేకించడం సంతతధారగా నీరు పడేలా శివలింగానికి పైన ’గలంతిక’ను (ధారాపాత్ర) ఏర్పాటు చేయడం శుభఫలాన్నిస్తుంది.

శంకర జయంతి

 ॐ  శంకర జయంతి ప్రత్యేకం - 1

    (మే 6వ తేదీ వైశాఖ శుక్ల పంచమి శంకర జయంతి) 


     మన దేశ స్వరూప స్వభావాలు రోజురోజుకీ మారిపోతున్న ఈ పరిస్థితులలో, జగద్గురు ఆది శంకరులు చూపిన బాట అన్ని విషయాలలోనూ, ఎప్పటికీ అందరికీ అనుసరణీయం. 

     అది సర్వులూ వ్యక్తిగతంగానూ, సమాజపరంగానూ అవలంబించి, పరమేశ్వరుని తెలుసుకొని అనుభూతి పొందే  విధానం. దానిలో, 

1. అవతారం - ఆవశ్యకత 

2. శంకరుల కాలం 

3. జాతీయ సమైగ్రత 

4. సాంఘిక దురాచారం - అస్పృశ్యత 

5. వివిధ ఆరాధనలు - పంచాయతనం - సమన్వయం 

6. స్తోత్రాలు - ప్రకరణలు - భాష్యాలు 

7. వివిధ స్తోత్రాలు 

8. అద్వైత సిద్ధాన్తమ్ 

9. మహావాక్య చతుష్టయము 

    (నాలుగు మహా వాక్యాలు) వంటి విషయాలపై, 

      ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయమై తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం. 

    అవి పరిశీలిస్తే, 

    గత కాలమాన పరిస్థితులలో మాత్రమే కాక, 

    ఏ కాలంలో నైనా, 

    ఏ పరిస్థితులలోనైనా,  సర్వమానవాళి సుఖశాంతులతో జీవిస్తూ, తమలోని దైవాన్ని గుర్తించి, తాము బ్రహ్మస్వరూపంగా మారి, జీవన్ముక్తి పొందేవిధంగా ఆదిశంకరులు దేశాన్ని తీర్చిదిద్దారని అవగతమవుతుంది. 

       ఆ జగద్గురువులు అందించిన సామాజిక, సాంస్కృతిక, ధార్మిక, ఆధ్యాత్మిక సంపదలను కులమతాలకతీతంగా భారతీయులంతా గ్రహించి, ఆచరిస్తూ, వసుధైక కుటుంబంగా అందరినీ ఈ విధానంలోనికి తీసుకురావాలి. 

      తద్వారా ప్రపంచశాంతికి మార్గం సుగమం చేయవలసిన బాధ్యత - కర్మభూమిలో పుట్టిన మనందరిదీ! 

      దానికై కృషిచేస్తూ,ఆదిశంకరుల చేత పునరుద్ధరింపబడి, మనవరకూ పెద్దలు అందించిన వైదిక జ్ఞానసంపద తరువాతి తరాలకి అందిద్దాం. అదే జగద్గురువులకు మనం అందించే గురుదక్షిణ. 


        జయజయ శంకర  హరహర శంకర 


                    =x=x=x= 


    — రామాయణం శర్మగా పిలవబడే 

    బొడ్డపాటి శ్రీరామ సుబ్రహ్మణ్యేశ్వర శర్మ 

             భద్రాచలం

తెలుగు వెలుగు

 తెలుగు వెలుగు 


భావాల బదిలీ సాధనం...భాష

అదే మన అందరి నోట పలుకు తెలుగు భాష

ఆంధ్రుల మాట...అమర భాష...తెలుగు యోష 

ఆంధ్ర భాష...సరళ...సుమధురం

భావ ప్రకటనకు తెలుగు భాష అన్వయం..

మృదుమధుర పలుకులు తెలుగు తేనియ ఊటలు 

భాషలందు...తెలుగు లెస్సయే...సందేహరహితమది 

పాళి..ప్రాకృతములు కూడ తెలుగు పిన్నమ్మలే 

తెల్లదొరల వెంట నడచి ఆంగ్ల భాష మోహము 

ఆవహించి...అమ్మ భాషను నెట్టి, అతిథి వశమైనా

నేడైనా నీ భాష శాశ్వతమని జననం నుంచి మరణం

వరకూ వెంటనడచి అమ్మ...నాన్న....పిలుపులోని

మాధుర్యం...గమనించి, గౌరవించి,  ప్రేమించు...

ఆ సవతి ప్రేమ చేటు కాదుగానీ తృప్తిలేనిదని గమనించు

విశ్వభాషలనెన్ని నేర్చిన...మాతృభాష లో బ్రతుకు

సంప్రదాయపు సంబరాలలో సంతోషం కలిగించు 

రాజుల నోట రాజసంగ పలికేను 

కొంగ్రొత్త భావాల నెలవుగా  మారేను 

నన్నయ్యాది కవుల దీవెనలతో ఎదిగేను 

ఆధునిక సాహిత్య తెలుగు శిఖరాలను తాకేను


డాక్టర్ దేవులపల్లి పద్మజ, విశాఖపట్నం

 🌹రామాయణానుభవం_ 40


జాబాలి చేసిన నాస్తిక వాదాన్ని ఖండిస్తూ సమాధానం చెబుతున్నాడు రాముడు....


మహర్షి! నాకు ప్రియం చేద్దామనే ఉద్దేశంతో నువ్వు ఇలా ప్రసంగించావు. అకార్యాన్ని కార్యంగా, అపధ్యాన్ని పథ్యంగా ప్రతిపాదించావు. 

*భవాన్మే ప్రియకామార్థం వచనం యదిహోక్తవాన్.*

*అకార్యం కార్యసఙ్కాశమపథ్యం పథ్యసమ్మతమ్*


దేనిమీదా ప్రమాణబుద్ధిలేని మనిషి  పాపాలు చేస్తాడు. శీల భ్రష్టుడు అవుతాడు. సమాజంలో గౌరవం కోల్పోతాడు. కులీనుడో అకులీనుడో - కులంతో ప్రమేయం లేదు. ధీరుడో భీరువో - దానితోనూ నిమిత్తం లేదు. వాడు శుచియా అశుచియా (మంచివాడా? చెడ్డవాడా?) అనేది వాడి శీలమే చాటిచెబుతుంది.


లోకం కన్నుగప్పి దుర్జనుడు సజ్జనుడుగా చెలామణి కావాలనుకుంటే ఆ అభినయం సాగదు. 


కార్యాకార్య విచక్షణులు

ఉంటారు. వారు పసిగట్టి నిందిస్తారు. నువ్వు చెప్పినట్టుగా పరోక్షాన్ని వెనక్కు పెట్టి, ప్రతిజ్ఞను విడిచిపెట్టి నేను లోకానికి ఏమి ఉపదేశం ఇవ్వగలను? ఎవరికి ఆదర్శంగా నిలవగలను? స్వర్గం పొందగలనా? లోకులు స్వతంత్రులు. రాజునుబట్టే వారి నడవడికా ఉంటుంది. రాజులు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారు. 


సత్యమే సనాతనం. సత్యమే రాజవృత్తం. అంచేత రాజ్యమంటే సత్యస్వరూపం, సత్యంలోనే లోకం బతుకుతోంది (సత్యే లోకః ప్రతిష్ఠితః). ఋషులూ దేవతలూ సత్యమే గొప్పదన్నారు. సత్యవాదికే గౌరవమన్నారు. అదే పరమ ధర్మం. అదే స్వర్గ హేతువు. సత్యమే పరమేశ్వరుడు. అన్నీ దానిమీద ఆధారపడినవే. సత్యంకన్నా గొప్పది మరొకటి లేదు. యజ్ఞాలూ యాగాలూ దానాలూ, ధర్మాలూ, వేదాలూ తపస్సులూ అన్నీ సత్యప్రతిపాదకాలే. కాబట్టి

సత్యపరులం కావాలి.


బ్రతికున్నంతసేపూ భూమి, కీర్తి, యశస్సు, లక్ష్మి ఇవన్నీ పురుషుణ్ని ప్రలోభపెడతాయి. పరలోకానికి ఉపకరించేదీ అక్కడ నిన్ను సేవించేదీ సత్యం ఒక్కటే.


సత్యము, ధర్మము, పరాక్రమము, భూతదయ, ప్రియ వక్తృత్వము, ఆతిథిపూజ - ఇవ్వి స్వర్గప్రాప్తికి సోపానాలని పెద్దలు

చెబుతున్నారు. 

వారే పూజ్యులు, వారే పెద్దలు - అని రాముడు రోషంగా మాట్లాడాడు.


రఘురామా ! నేను నాస్తికుణ్ని కాను. నాస్తిక వచనాలు చెప్పను. కానీ సమయాన్ని సమీక్షించి నేను ఆస్తికుణ్నీ  ఇప్పుడు ధర్మసంకట పరిస్థితి వచ్చింది. అందుకని నిన్ను రాజ్యానికి మరల్చడం కోసం నాస్తిక వచనాలు పలికాను. అంతే సుమా - అన్నాడు జాబాలి

*న చాపి కాలోయ ముపాగతశ్శనైర్యథా మయా నాస్తికవాగుదీరితా.*

*నివర్తనార్థం తవ రామ కారణాత్ ప్రసాదనార్థం చ మయైతదీరితమ్*


రామునికి కోపం వచ్చిందని వసిష్ఠుడూ గ్రహించాడు. రామా ! జాబాలికి అన్నీ తెలుసు. కేవలం నిన్ను మరల్చడానికే ఇలా మాట్లాడాడు.శాంతించు రామచంద్రా అన్నాడు విశిష్టుల వారు......


**

జాబాలి చేసినది నాస్తిక వాదం కాదని ,రాముణ్ణి శాంతిప చేసాడు వశిష్ఠుడు.


 ఒక్కసారి నీ వంశచరిత్రను గుర్తు తెచ్చుకో. ఎంతటి మహానుభావులు అయోధ్యను పరిపాలించారో గమనించు అంటూ మొత్తం వంశక్రమాన్ని తెలియజేశాడు.


రామా! ఈ భూమండలమును వైవస్వతమనువు ఇక్ష్వాకువున కిచ్చినాడు. ఇక్ష్వాకువు అయోధ్యకు మొదటి రాజు. *ఇక్ష్వాకు వంశక్రమము*


ఇక్ష్వాకు, కుక్షి , వికుక్షి , బాణుడు, అనరణ్యుడు, పృథు, త్రిశంకువు, దుందుమారుడు, మాంధాత, 

సుసంధికి ఇద్దరు కొడుకులు ధ్రువసంధి ,ప్రసేనజిత్తు

ధ్రువసంది కొడుకు 

భరతుడు , అసితుడు, సగరుడు, అసమంజుడు, అంశుమంతుడు, దిలీపుడు, భగీరథుడు , కుకుత్సుడు, రఘువు ,  ప్రవృద్ధుడు , శంఖణుడు, సుదర్శనుడు, అగ్నివర్ణుడు , శీఘ్రగుడు, మరువు, ప్రశుశ్రుకుడు, అంబరీషుడు, సహుషుడు, 

నాభాగుడు కి ఇద్దరు కుమారులు అజుడు ,సుప్రతుడు

అజుడి కొడుకు

దశరథుడు


రామా! వంశక్రమేణ ఈ రాజ్యము దశరథునికి సంక్రమించినది. ఆ దశరథుడికి రాముడు అను పేరుగల జ్యేష్ఠపుత్రుడు గా ఉన్నావు.


ఇక్ష్వాకువంశంలో జ్యేష్టుడే మహారాజు.నువ్వు

ఉండగా కనిష్ఠుడికి పట్టాభిషేకం ఎలా జరుగుతుంది? ఈ సనాతన ధర్మాన్ని వంశాచారాన్నీ భంగపరచకు. దశరథుడిలాగే ధర్మబద్ధంగా సమృద్ధమైన ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించు. 

*స రాఘవాణాం కులధర్మమాత్మనః సనాతనం నాద్య విహన్తుమర్హసి.*

*ప్రభూతరత్నామనుశాధి మేదినీం ప్రభూతరాష్ట్రాం పితృవన్మహాయశః*


పుట్టిన ప్రతిమనిషికీ ముగ్గురు గురువులుంటారు- తల్లి, తండ్రి, ఆచార్యుడు.


తండ్రి జన్మనిస్తే అచార్యుడు ప్రజ్ఞను ఇస్తారు. అందుకే గురువు అయ్యాడు. నేను నీ తండ్రికీ నీకూ గురువును. నేను చెప్పినట్టు చెయ్యి. గురువుగారి ఆజ్ఞను తిరస్కరించకూడదు అనే మాటకు అనుగుణంగా వర్తించు. నాయనా! ఈ సభాసదులెవ్వరూ సన్మార్గాన్ని విడిచిపెట్టినవారు కారు. నీ తల్లిమాటనైనా ఆలకించు. యాచిస్తున్న భరతుడి మాటను చెల్లించి నీ ధర్మాన్ని నువ్వుపాలించు.


వసిష్ఠులవారు మృదువుగా మధురంగా ఎంతగానో నచ్చజెప్పారు. అయినా రాముడు అంగీకరించలేదు.

 🌹రామాయణానుభవం_ 39


చిత్రకూటం లో రామ భరత సంవాదం కొనసాగుతోంది....


అన్నయ్యా ! నీవంటివాడు లోకంలో మరొకడు ఉండడు. ఇదేమిటిది! దుఃఖం నిన్ను బాధించడంలేదు. ప్రీతి నిన్ను ఆనందింపజెయ్యడం లేదు. నువ్వు సర్వజ్ఞుడివి, మహాత్మడివి. సర్వదర్శివి, బుద్ధిమంతుడివి, జ్ఞానివి. నిన్ను ఏ దుఃఖమూ ఏమీ చెయ్యలేదు. నా తల్లి చేసిన పని నాకు అనిష్టం. నువ్వు నాపట్ల అనుగ్రహం చూపాలి. దయ తలచాలి. ధర్మబద్ధుణ్ని కాబట్టి ఊరుకున్నానే గానీ లేకపోతే ఈ పాటికి కైకేయిని సంహరించి ఉందును. అటువంటి జుగుప్సితాన్ని రఘువంశంలో పుట్టిన నేనెలా చేస్తాను చెప్పు! 


అలాగే తండ్రినీ నిందించలేక పోతున్నాను. ఇల్లాలికి ప్రియం చెయ్యాలని ఏ ధర్మాతుడైనా ఇలాంటి పాపం చేస్తాడా?. సరే ఏదో అయిపోయింది. తండ్రి చేసిన పనికి ప్రతిక్రియ చెయ్యాలి నువ్వు. అలాచేసి సరిదిద్దినవాడే పుత్రుడనిపించుకుంటాడు. మా అందరికీ నువ్వే దిక్కు. నువ్వే రక్షకుడివి.క్లిష్టమైన ధర్మాన్నే నువ్వు అనుసరించాలి అనుకుంటే రాజ్యపాలనకూడా క్లిష్టమైనదే. ఆశ్రమాలు నాల్గింటిలోనూ గృహస్థాశ్రమమే గొప్పదంటారు. మరి నువ్వు దీన్ని వదిలేస్తానంటే ఎలాగ! అడవుల్లో తపస్విలా గడుపుతానంటే ఎలాగ ! అన్నింటా నీకంటే బాలుణ్ని, నువ్వు ఉండగా నేను ఎలా రాజ్యాన్ని పరిపాలించగలను చెప్పు. 


నువ్వులేనిదే నేను జీవించలేను. క్షాత్రధర్మమైన అభిషేకానికి అంగీకరించు. వీరంతా ఇక్కడే నిన్ను అభిషేకిస్తారు. మంత్ర కోవిదులైన వసిష్ఠాదులు ఉన్నారు. ఋత్విక్కులు ఉన్నారు. అభిషిక్తుడవై అయోధ్యా పరిపాలనకు బయలుదేరు. శత్రువులు భయపడి పారిపోయేట్టు పాలించు. ప్రత్యక్ష ధర్మాన్ని కాదని పరోక్షమూ సంశయస్థమూ అయిన ధర్మాన్ని ఆచరిస్తాననడం సమంజసంకాదు. నన్నూ నాతల్లినీ

దశరథ మహారాజునూ పాపంనుంచి ఉద్ధరించు.


తమ్ముడూ ! నువ్వు చెప్పింది సమంజసంగానే ఉంది. దశరథ మహారాజుకు పుత్రుడవుగదా ! కానీ ఒక్క విషయం గమనించు కైకేయిని రాజ్యశుల్కంతో దశరథుడు వివాహమాడాడు. దేవాసుర సంగ్రామంలో సంతోషించి వరాలూ ఇచ్చాడు. అవి రెండూ ఇలా అడిగింది మీ తల్లి, తండ్రిమాట నిలబెట్టడానికే - సత్యవాదిని చెయ్యడానికి నేను అడవులకు వచ్చాను. నువ్వుకూడా వెంటనే అభిషేకం జరిపించుకుని తండ్రిమాట నిలబెట్టు. నా కోసమైనా మహారాజును ఋణవిముక్తుణ్ణి చెయ్యి. మీతల్లి కి ఆనందం కలిగించు. పున్నామ నరకం నుంచి కాపాడేవాడే పుత్రుడు. తండ్రిని కాపాడు. అయోధ్యకు వెళ్ళు. ప్రజానురంజకంగా పరిపాలన సాగించు. శత్రుఘ్నుడు నీకు తోడుగా ఉంటాడు. 


నువ్వు ప్రజలకు పరిపాలకుడవైతే నేను అరణ్యంలో మృగాలకు పరిపాలకుడనవుతాను. 

*త్వం రాజా భరత! భవ స్వయం నరాణాం* 

*వన్యానామహమపి రాజరాణ్మృగాణామ్.*


నువ్వు అయోధ్యకు వెళ్ళు,. నేను దండకారణ్యాలకు వెడతాను. సితచ్చత్రం నీకు నీడ ఇస్తుంది. వృక్షచ్ఛాయలలో నేను సుఖిస్తాను. 


నీకు శత్రుఘ్నుడు - నాకు లక్ష్మణుడు. మనం నలుగురమూ తండ్రిగారిని సత్యసంధుణ్ని

చేద్దాం. భరతా! విచారించకు.

*శత్రుఘ్నః కుశలమతిస్తు తే సహాయస్సౌమిత్రిర్మమ విదితః ప్రధానమిత్రమ్.*

*చత్వారస్తనయవరా వయం నరేన్ద్రం సత్యస్థం భరత చరామ మా విషీద*


రాముడు భరతుణ్ణి ఇలా ఓదారుస్తుంటే ప్రక్కనే ఉన్న జాబాలి మహర్షి కల్పించుకొన్నాడు.....


**

జాబాలి మాట్లాడుతూ...

రఘురామా ! చాలా గొప్పగా మాట్లాడుతున్నావు. నీ తెలివి తేటలు నిరర్ధకం కాకుండుగాక! ఎవడు ఎవడికి బంధువు? ప్రతిమనిషీ ఒంటరిగా పుడతాడు ఒంటరిగా మరణిస్తాడు. 

*కః కస్య పురుషో బన్ధుః కిమాప్యం కస్య కేనచిత్.*

*యదేకో జాయతే జన్తురేక ఏవ వినశ్యతి*


తల్లి అనీ తండ్రి అనీ ఈ అనుబంధాలన్నీ ఉన్మత్త ప్రలాపాలు. ఎవడికీ ఎవడూ ఏమీకాదు. 

*తస్మాన్మాతా పితా చేతి రామ సజ్జేత యో నరః.*

*ఉన్మత్త ఇవ స జ్ఞేయో నాస్తి కశ్చిద్ధి కస్యచిత్*


గ్రామాంతరం వెళ్ళి ఒకడు ఒకచోట కొంతసేపు ఉంటాడు. మర్నాడు వెళ్ళిపోతాడు. ప్రాణులంతా ఇంతే. తల్లీ, తండ్రీ, ఇల్లూ వాకిలీ, డబ్బూ అన్నీ ఆవాసమాత్రాలే. వీటి విషయంలో సజ్జనులు చిక్కుకోరు. 


వారసత్వంగా వచ్చిన రాజ్యాన్ని విడిచిపెట్టి నువ్వు అడవుల్లో కష్టాలు పడటం ఎంతమాత్రమూ సమంజసం కాదు. 


అయోధ్య నీకోసం ఏకవేణీధరలా నిరీక్షిస్తోంది. అభిషేకం జరిపించుకో. నీకు దశరథుడని ఒకడు లేడు. నువ్వు అతడికి ఏమీ కావు. ఆయనెవరో నువ్వెవరో. ఈ ప్రజలంతా నిన్నే రాజుగా కోరుతున్నారు. అంగీకరించు. చెప్పినట్టు చెయ్యి


ఏ జంతువుకైనా తండ్రి బీజమాత్రమే. శుక్లరుధిరాలు తల్లి అను గ్రహించి జన్మనిస్తుంది. 


ఆ మహారాజు వెళ్ళవలసినచోటికి వెళ్ళిపోయాడు. అది ప్రాణిధర్మం. ప్రకృతి సహజం. మిథ్యాదుఃఖానికి లోనుకాకు.

*గత స్స నృపతిస్తత్ర గన్తవ్యం యత్ర తేన వై.*

*ప్రవృతతిరేషా మర్త్యానాం త్వం తు మిథ్యా విహన్యసే*


సర్వజన సమ్మతమైన సద్బుద్ధిని స్వీకరించు. భరతుడు ప్రసాదిస్తున్న రాజ్యాన్ని అంగీకరించు -


రాముడు శ్రద్ధగా విన్నాడు. నిశ్చలమైన స్వబుద్ధితో ఆలోచించి భక్తిగా సమాధానం చెబుతున్నాడు.....


[శ్రీరామచంద్రుడు అరణ్యవాసమునుండి తిరిగి ఎలాగైనా అయోధ్యకు తీసుకుని వచ్చి పట్టాభిషిక్తుని చేయాలని తలంపుతో భరతునితో కూడావెళ్ళిన పరివారములో ఒకడు జాబాలి మహర్షి, దశరథుని రాచపురోహితుడు. జాబాలి రామచంద్రునితో భౌతికవాదము చెప్పారు. అప్పుడు శ్రీరాముడు కృద్ధుడై "నీవంటి నాస్తికుని మా తండ్రి ఎలా చేరదీశాడు" అంటూ జాబాలి చేసిన వాదన్ని తీవ్రంగా ఖండిచివేస్తాడు. అప్పుడు వశిష్టుడు కలుగచేసుకుని, "శ్రీరామా! నిన్ను అయోధ్యాధీశునిగా పట్టాభిషిక్తుని చేయాలని తలంపుతోనే జాబాలి అలా మాట్లాడాడు గాని, నిజానికి అతను నాస్తికుడు కాడు" అంటూ శ్రీరాముని అనునయిస్తాడు. ]

 🌹రామాయణానుభవం_ 38


తండ్రి మరణ వార్త విని రాముడు మూర్ఛపోయాడు.సోదరులు ముగ్గురూ విలపిస్తున్నారు.సీత దుఃఖిస్తోంది. కొంతసేపటికి తెలివి తెచ్చుకున్న రాముడు...


వనవాసం ముగిసినా నేనింక అయోధ్యకు రాలేను. ఏమి ఉందని అయోధ్యకు రావాలి ! అక్కడ ఎవరు నన్ను ఓదారుస్తారు ! సీతా ! మీ మామగారు వెళ్ళిపోయారు. లక్ష్మణా! తండ్రిలేనివాడవయ్యావు. ఎంత దుఃఖవార్త చెప్పాడో చూడు ఈ భరతుడు - అంటూ విలపించాడు. మధ్య మధ్యలో సీతను తానే ఓదార్చాడు. తర్పణాలకు కావలసిన సంభారాలు తీసుకొని నదీతీరానికి సీతను ముందు నడవమన్నాడు. లక్ష్మణుణ్ని అనుసరించమన్నాడు. ఆ వెనక్కాల తాను బయలుదేరాడు. తండ్రిని తలుచుకుంటూ మందాకినికి చేరుకున్నాడు. అందరూ దక్షిణాభిముఖంగా నిలిచి తర్పణాలు విడిచిపెట్టారు. రాముడు దోసిట్లోకి నీళ్ళు తీసుకుని - తండ్రీ! రాజశార్దూలా ! నేను ఇస్తున్న ఈ విమల జలతర్పణం పితృలోకంలో నీకు చెందుగాక- అక్షయమగుగాక అని వదిలిపెట్టాడు.


ఇంగుదీబదరీ మిశ్రితమైన పిండాన్ని దర్భలమీద వదిలిపెట్టాడు. తండ్రీ! సంప్రీతుడవై ఇది భుజించు. మేము తింటున్నదే నీకు పెట్టాము. యదన్న: పురుషో భవతి తదన్నాస్తస్య దేవతాః అన్నారు కదా ! అంటూ రోదించాడు.


అందరూ మళ్ళీ పర్ణశాలకు చేరుకున్నారు. బోరున విలపించారు. ఆ రోదన ధ్వనులు అడవిలో మారుమ్రోగాయి భరతుడు రాముణ్ని కలుసుకున్నాడని సైనికులు గ్రహించారు. రాముణ్ని చూడాలని ఆశ్రమంవైపు పరుగులు తీసారు. రథాశ్వగజసైన్యమంతా రామాశ్రమం చేరుకుంది. అందరి ముఖాల్లోనూ కన్నీరే. రాముడు అందరినీ కౌగిలించుకున్నాడు. తండ్రిలా తల్లిలా ఆలింగనం చేసుకున్నాడు.


వసిష్ఠుడు ముందుండి రాజమాతలను తీసుకువస్తున్నాడు. మందాకినీ నదీతీరం చేరారు. ఈ నదీజలాలనే నీ కుమారుడు నా కుమారుడికోసం రోజూ తీసుకువెడుతూ ఉంటాడు కాబోలు అని కౌసల్య సుమిత్రతో అంది. దర్బలపై ఉంచిన పిండం చూసారు. ఇది రాముడు దశరథుడికి ఇచ్చింది. అంతటి మహారాజు నేలపై పెట్టిన ఇంగుదీ పిండాన్ని తినవలసి వచ్చిందా అని విలపించింది


ఆశ్రమం చేరుకున్నారు. సర్వభోగాలూ విడిచిపెట్టి తపస్విలా ఉన్నరాముణ్ణి చూస్తూనే రాజమాతలందరూ భోరున దు:ఖించారు. రాముడు అందరినీ ఓదార్చి పాదాభివందనం చేసాడు.


భరతా ! రాజ్యం వదిలిపెట్టి జటాజినధారివై ఈ అరణ్యానికి నువ్వు ఎందుకు వచ్చావో తెలుసుకోవాలని అన్నాడు రాముడు. భరతుడు నమస్కరించి సమాధానం చెప్పాడు


తండ్రిగారు పుత్రశోకంతో స్వర్గస్థులయ్యారు. నా తల్లి కైకేయివల్ల ఈ మహాపాపం జరిగింది. నరకానికి పోతుంది. నేను నీకు దాసుణ్ని. పట్టాభిషిక్తుడివై నన్ను అను గ్రహించు. ఈ తల్లులూ ఈ ప్రజలు అందరూ ఇందుకోసమే నీ దగ్గరకు వచ్చారు వంశక్రమాన్నీ ధర్మాన్ని ఆలోచించి అంగీకరించు. రాజ్యం గ్రహించి అనుగ్రహించు. భూదేవికి వైధవ్యం తప్పించు. ఈ మిత్రులందరితోనూ కలిసి నేను శిరసువంచి యాచిస్తున్నాను. నేను నీ శిష్యుణ్ని, నీ దాసుణ్ని, అనుగ్రహించు. పితృపితామహులనుంచీ అనుసరించి వస్తున్న ఈ పూజ్యులైన మంత్రిమండలి ప్రార్థనను తిరస్కరించకు.


భరతా ! నీవంటి ఉత్తముడు రాజ్యం కోసమని పాపం ఎలా చేస్తాడు ! నీవల్ల రవ్వంతకూడా దోషంలేదు. బాల్యంవల్ల నిందిస్తున్నావు కానీ కైకేయికూడా నింద్యురాలు కాదు. తండ్రిమీద నీకు ఎలాంటి గౌరవం ఎంతకాలం ఉంటుందో అలాంటి గౌరవమే అంతకాలమూ తల్లిమీదకూడా ఉండాలి. ధర్మశీలురైన తల్లిదండ్రులు ఇద్దరూ నన్ను అడవులకు పొమ్మన్నారు. నేను మరొకలా ఎలా చేస్తాను. నువ్వు అయోధ్యలో రాజ్యం చెయ్యాలి. నేను వల్కలాలు ధరించి అడవిలో ఉండాలి - ఇలా విభాగంచేసి ప్రజలందరి ఎదుటా నియమించి మహారాజు దివంగతుడయ్యాడు. 


ధర్మాత్ముడైన మహారాజు లోకగురువు. ఆయనే ప్రమాణం తండ్రి విభాగించి ఇచ్చింది ఇచ్చినట్టు స్వీకరించి అనుభవించడం మన కర్తవ్యం. నన్ను పధ్నాలుగేళ్ళు అరణ్యవాసం చెయ్యమన్నాడు అదే పరమాత్మకుకూడా ఇష్టమని విశ్వసిస్తున్నాను.


సూర్యాస్తమయ మయ్యింది. దుఃఖంతోనే రాత్రి గడిచిపోయింది.....


**

ఉదయం చేయవలసిన కృత్యాలు అన్నీ పూర్తి చేసుకొని  భరత శత్రుజ్ఞ వసిష్ఠులు అందరూ నిశ్శబ్దం గా ఉన్నారు...


కొంతసేపటికి భరతుడు


అన్నయ్యా ! మా అమ్మ నాకు ఇచ్చిన రాజ్యాన్ని నేను నీకు ఇచ్చేస్తున్నాను. అకంటకంగా పరిపాలించు. దీన్ని పరిపాలించే శక్తి నాకు లేదు. నువ్వుతప్ప మరొకడు సమర్థుడు కాదు. నీ పద్ధతిని నేను ఆనుసరించలేను. గుర్రాన్ని గాడిద  అనుసరించలేదు గరుత్మంతుణ్నీ పక్షి అనుసరించలేదు. ఎల్లప్పుడూ ఇతరులకు ఉపయోగపడుతాడో వాడి బ్రతుకు ధన్యం.  తాను నాటినమొక్కే పెరిగి పెద్దదయి మహావృక్షమై నాటినవాడికి అందకుండా పోతుంది. దాని పువ్వులూ పండులూ అతడి అనుభవానికి రావడంలేదు. ఇప్పటి పరిస్థితికి ఇది ఉపమానం. నువ్వు అర్ధంచేసుకోగలవు. 


ఆదిత్యుడిలాగా నువ్వు సింహాసనం మీద ఉంటే నీ వెనకాల మేమంతా మధించిన కుంజరాలుగా ఆదతాం. అంతపురస్త్రీు అనందిస్తారు. ప్రజలంతా సంతోషిస్తారు.(మొక్క నాటినవాడు దశరథుడు, మహావృక్షం రాముడు. పువ్వులూ పండ్లూ అభిషేక పరిపాలనలు) 


భరతుడి బాధను రాముడు గుర్తించాడు. దుఃఖాన్ని ఓదార్చాడు. ఆ ఆత్మజ్ఞాని గంభీరంగా ప్రసంగించాడు.


తమ్ముడూ ! మానవుడు దేనికి కర్తకాడు. అస్వతంత్రుడు. ఇతణ్ని ఎల్లవేళలా యముడు లాగుతూనే ఉంటాడు. నిధులు నశించిపోతాయి. ఎదుగుదలలు పతనమై పోతాయి. సంయోగాలు వియోగాలతో ముగుస్తాయి. జీవితానికి మరణమే ముగింపు.


ముగ్గిన ఫలాలకు రాలిపడటమొక్కటే భయం. పుట్టిన మనిషికి మరణమొక్కటే భయం. గట్టిగా కట్టిన ఇల్లు క్రమ క్రమంగా ఎలా శిధిలమవుతుందో శరీరంకూడా అలాగే జరామృత్యువులతో విశీర్ణం అయిపోతుంది. గ్రీష్మంలో సూర్యకిరణాలు నీటిని హరించినట్టు అహోరాత్రాలు ప్రాణుల ఆయుర్దాయాన్ని హరిస్తాయి. 


నిలబడినా నడుస్తున్నా ఆయుర్దాయం క్షీణిస్తూనే ఉంటుంది. నిన్ను నువ్వు తెలుసుకో. నీకోసం నువ్వు దుఃఖించు. పరితపించు. ఇతరుల గురించి ఎందుకు? జీవి మృత్యువుతోనే తిరుగుతూంటాడు మృత్యువుతోనే కూర్చుంటాడు. సుదీర్ఘంగా ప్రయాణంచేసి చిట్టచివరికి మృత్యువుతోనే నిష్క్రమిస్తాడు. 


ఈ మనుష్యులు సూర్యుడు ఉదయిస్తే సంతోషిస్తారు. అస్తమిస్తేనూ సంతోషిస్తారు. కానీ తమ జీవితం క్షయించిపోతోందని మాత్రం తెలుసుకోలేరు. కొత్తకొత్తగా ఋతువులు వస్తూంటే సంబరపడిపోతారే కానీ తమ ఆయుర్దాయం గడిచిపోతోందని గమనించరు


మన తండ్రి ధర్మాత్ముడు. రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలించాడు. నిండు జీవితం గడిపాడు. యజ్ఞయాగాదులు చేసాడు.


పాపాలు తొలగించుకున్నాడు. స్వర్గానికి వెళ్ళిపోయాడు. జీర్ణదేహాన్ని విడిచిపెట్టి బ్రహ్మలోక విహారిణి అయిన దైవీ సమృద్ధిని పొందాడు. ఆయనగురించి దుఃఖించకూడదు. నీవంటి బుద్ధిమంతుడూ పండితుడు అసలు దు:ఖించకూడదు. ఇటువంటి అనేకదుఃఖాలు అన్నివేళలా ఎదురవుతుంటాయి. నీవంటి ధీరులూ ధీమంతులూ వీటిని పట్టించుకోకూడదు. వదిలెయ్యాలి స్వస్థత పొందు. దుఃఖం తొలగించుకో. అయోధ్యకు వెళ్ళు. తండ్రి ఆజ్ఞను పాటించు. నేనూ అంతే. తండ్రి శాసనాన్ని శిరసావహించి నెరవేరుస్తాను. దాన్ని తిరస్కరించడం నాకు న్యాయం కాదు. నీకూ న్యాయంకాదు. ....

 🌹రామాయణానుభవం_ 37


చిత్రకూట పర్వతం సమీపం లో సైన్యాన్ని ఆపి  భరతుడు విసిష్ఠుడు సుమంత్రుడు కొంత మంది అనుచరులతో చిత్రకూటం వైపు నడవ సాగారు...


ఆ పర్వతంమీద, ఆ వనంలో శచీదేవేంద్రులలాగా నివసిస్తున్నారు సీతారాములు. సీతా!రాజ్యం పోయిందని కానీ, మిత్రులు లేకపోయారనిగానీ నా మనస్సు బాధపడడం లేదు. ఈ గిరిసౌదర్యం ఈ వనసౌందర్యం అన్నింటినీ మరిపిస్తున్నాయి. మరీ మురిపిస్తున్నాయి. 


స్నానాదులు ముగించి సీతారాములు ఆ కొండచరియలో ఒకచోట కూర్చున్నారు. అంటు అంతలో కీ సైన్యఘోష వినిపించింది. ఆకాశంలో కి రేగిన దుమ్ము కనిపించింది. భయపడిన మృగాల అరుపులు వినిపించాయి. లక్ష్మణా ఆ శబ్దం ఏమిటి త్వరగా చూసిరమ్మన్నాడు రాముడు.


అన్నయ్యా ! నువ్వు కవచం ధరించు. ధనుస్సును సంధించు అంటూ చెట్టుమీదనుంచే పెద్దగా అరిచాడు.ఆ సైన్యం ఎవరిదో గమనించమన్నాడు రాముడు. అప్పటికే లక్ష్మణుడు కోపంతో మండిపోతున్నాడు. సర్వసైన్యాన్నీ బూడిదచెయ్యగలిగిన అగ్నిలాగా ప్రజ్వరిల్లుతున్నాడు.


సంపన్న రాజ్యానికి పట్టాభిషిక్తుడై కైకేయి కొడుకు భరతుడు మనల్ని చంపడానికి వస్తున్నాడు. అదిగో కోవిదారధ్వజంతో అతడి రథం, గజాశ్వరథ పదాతి సైన్యం అదిగో. ఎవడికోసం మనకు ఈ అరణ్యవాసం సంప్రాప్తమయ్యిందో ఆ భరతుడు - మన శత్రువు- దొరికాడు. వీడు వధ్యుడు. భరతుణ్ని చంపడంలో ఏ దోషమూ లేదు. మనకు పూర్వాపకారి. అతణ్ని చంపడం అధర్మం కానేకాదు. పైగా ఇప్పుడు ఇలా అధర్మపరుడయ్యాడు. వీడు చస్తే మొత్తం రాజ్యం నువ్వే ఏలుకుందువుగాని, నేనే వీణ్ని సంహరిస్తాను.రాజ్య కాముకు రాలైన కైకేయి కి దుఃఖం రుచి చూపిస్తాను. అసలు కైకేయిని కూడా చంపేస్తాను. దాన్ని దాని నేస్తాలనూ బంధువులనూ చంపేస్తాను. ఈ భూమికి పట్టిన కాలుష్యం తొలగిస్తాను. ఇన్ని రోజులూ నాలోనే అణచుకున్న కోపాగ్నిని శత్రుపైన్యాలమీదకు విరజిమ్ముతాను. ఈ అడవి అంతా శత్రురక్తప్రవాహాలతో తడుపుతాను. నా చేతిలో చచ్చి పడిన ఏనుగుల్నీ గుర్రాల్ని భటుల శరీరాల్నీ ఈ అడవి జంతువులు వీక్కుతింటాయి. ససైన్యంగా భరతుణ్ని చంపి నా ధనుర్బాణాల ఋణం తీర్చుకొంటాను.....


లక్ష్మణుడు కోపంతో ఊగిపోతున్నాడు. రాముడు చల్లార్చి ప్రశాంతంగా నచ్చచెప్పాడు లక్ష్మణా ! భరతుడే స్వయంగా వస్తే ధనుస్సుతో పని ఏముంది? భరతుణ్ని సంహరించి ఆ అపవాదుతో పాందే రాజ్యం

నాకెందుకు? బంధువులు మిత్రులూ నాశనం పొందాక లభించే ద్రవ్యం విషంలాంటిది. అటువంటిదాన్ని నేను స్వీకరించను ధర్మార్థకామాలూ రాజ్యమూ ఏదయినా మీకోసం మాత్రమే నేను కోరుకొనేది. నేను రాజ్యంచేస్తే అది కేవలం మీ సుఖంకోసమే అధర్మంతో మొత్తం భూగోళమే నాకు కైవసమయినా, ఇంద్రపదవి లభించినా అవి నాకు వద్దు. మీ ముగ్గురూ లేని ఏ సుఖమూ నాకు వద్దు. భరతుడు నాకు ప్రాణప్రియుడు. వంశధర్మం తెలిసినవాడు. మనం తాపసులమయ్యామనీతెలిసి చూడటానికి వస్తున్నాడని నా అభిప్రాయం. 


భరతుడిది స్నేహంతో నిండిన మనస్సు. శోకంతో నిండిన హృదయం. మనల్ని చూడటానికే వస్తున్నాడు. మరొకటి కానేకాదు. తనతల్లి చేసిన పనిని నిందించి, పరుషంగా మాట్లాడి, తండ్రిని అనునయించి ఇటు వస్తున్నాడు. రాజ్యం నాకు ఇవ్వడానికే వస్తున్నాడు. మనస్సులో కూడా మనపట్ల అప్రియం ఆచరించడు. ఎప్పుడయినా నీకు అప్రియం చేసాడా? ఎందుకని ఇప్పుడు భరతుడికి భయపడుతున్నావు? శంకిస్తున్నావు? నిష్ఠురంగా మాట్లాడకు. అప్రియంవలకకు. భరతుణ్ని అంటే నన్ను అన్నట్టే. ఎంత ఆపదవచ్చినా పుత్రులు తండ్రిని చంపుతారా?, ప్రాణంతో ప్రాణమైన సోదరుణ్ని సోదరుడు చంపుతాడా?


సౌమిత్రీ! రాజ్యం కారణంగా నువ్వు ఇలా మాట్లాడుతున్నావేమో ! ఒకమాట చెబుతాను విను - రాజ్యం నీకు ఇచ్చెయ్యమని భరతుడికి చెబుతాను. తప్పకుండా ఒప్పుకుంటాడు. సరే అంటాడు

ధర్మశీలుడైన రాముడు ఇంతఘాటుగా మాట్లాడేసరికి లక్ష్మణుడు సిగ్గుపడిపోయాడు. తన శరీరంలోకి తానే కుంచించుకుపోయాడు. రాముడు గమనించాడు......

**


సైన్యాన్ని ఆపి భరతుడు శతృజ్ఞుడితో గుహుడితో మంత్రి పురోహిత లతో చిత్రకూటం మొత్తం వెతుకు తున్నాడు.


సర్వసుఖాలు విడిచిపెట్టి, అన్ని కోరికలూ పరిత్యజించి లో కనాథుడైన మా అన్న శ్రీరాముడు ఈ అరణ్యంలో నివసిస్తున్నాడు. మునిలా జీవిస్తున్నాడు. కనిపించిన వెంటనే సీతారాముల పాదాలమీద పడిపోతాను. బ్రతిమాలుకుంటాను - అని తనలో తానే మాట్లాడేసుకుంటూ, పెల్లుబుకుతున్న దుఃఖాన్ని ఆపుకుంటూ భరతుడు పరిగెడుతున్నాడు. ఎట్ట ఎదుట అపూర్వశోభతో పర్ణశాల కనిపించింది. విశాలంగా ఉంది. దర్భలతో కప్పిన యజ్ఞవేదికలా ఉంది. ధనుర్బాణాలు ఒకవైపున కనిపిస్తున్నాయి. శత్రువులకు దుర్నిరీక్షమై మృగరాజులు నివసించే గుహలా ఉంది.


ఆ పర్ణశాల నట్టనడుమ విశాలమైన వేదిక. దాని ఎట్ట ఎదుటహోమాగ్నికుండం. భరతుడు క్షణకాలం నిలబడిపరిశీలనగా చూసాడు. ఆ వేదికమీద జటామండలధారియై రాముడు కూర్చుని ఉన్నాడు. నారచీరలు ధరించి అగ్నితేజంతో విరాజిల్లుతున్నాడు. సమస్తభూమండలానికీ ప్రభువు కాదగిన ధర్మాత్ముడు- శాశ్వతుడైన బ్రహ్మలా దర్భాసనం మీద కూర్చున్నాడు సీతాలక్ష్మణులు ఇరువైపులా ఉన్నారు. భరతుడు దర్శించాడు. 


శోకమోహాలు పెల్లుబికాయి. ఆపుకోలేకపోయాడు. నావల్ల కదా ఈ మహానుభావుడికి ఈ దురవస్థ వచ్చింది అని విలపిస్తూ పరుగుపరుగున వెళ్లి కాళ్ళ మీద పడ్డాడు. ఆర్యా! ఆర్యా ! అంటున్నాడే తప్ప మరొకమాట పలకలేకపోతున్నాడు. శత్రుఘ్నుడూ అలాగే వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. ఇద్దరినీ లేవనెత్తి కౌగిలించుకొని రాముడు కన్నీరు పెట్టుకున్నాడు. సుమంత్రుడూ గుహుడూ వచ్చి పాదాభివందనం చేసారు. నలుగురి ముఖాలూ కన్నీరుతో నిండాయి


ఇది చూచిన ప్రకృతికూడా విలపించింది.

రాముడు భరతుని శిరస్సు మూర్కొన్నాడు. ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. 


నాయనా! తండ్రిగారు ఎలా ఉన్నారు? నువ్వు ఇటు అడవులకు ఎందుకు వచ్చావు? తండ్రిగారు జీవించి ఉంటే నువ్వు ఇటు రావలసిన పని ఉండదే ! చాలాకాలానికి నిన్ను చూసాను. దశరథుడు క్షేమమేనా? మన కులగురువు వసిష్ఠులవారు కుశలమేనా? తల్లులు ముగ్గురూ సుఖంగా ఉన్నారా? మంత్రి పురోహితాదులను జాగ్రత్తగా చూసుకుంటున్నావా? వాళ్ళు నిద్రపోతూంటేమేల్కొల్పుతున్నావా? అర్ధరాత్రిపూట ఆర్థిక విషయాలను చర్చిస్తున్నావా? మంత్రాంగాన్ని శ్రద్ధగా కాపాడుతున్నావా? 

నీ రహస్యాలోచనలు రాజ్యంలో పొక్కడం లేదుకదా?

 తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలను సాధించే పనులే చేస్తున్నావా పొడిగించడం లేదుకదా? నువ్వు చేసిన మంచిపనులే తెలుస్తున్నాయా, చెయ్యబోయేవి కూడా సామంతులకు తెలిసిపోతున్నాయా? 


వెయ్యిమంది మూర్ఖుల్ని సంప్రదించడంకన్నా ఒక పండితుణ్ని సంప్రదించడం మంచిది. అదే చేస్తున్నావా? మేధావి, సమర్థుడు శూరుడు, విచక్షణుడు అయిన అమాత్యుడు ఒక్కడుంటే చాలు. రాజుకు సకలసంపదలూ చేకూర్చిపెదతాడు. ఇది గుర్తించావా ఏ పనికి ఎవరు అర్హులో గమనించి ఆ పనికి వారినే నియమిస్తున్నావా? వంశపారంపర్యంగా వస్తున్న మంత్రుల్లో శ్రేష్ఠుల్ని శ్రేష్ఠమైన

కార్యాలకే వినియోగిస్తున్నావా?


 ఐశ్వర్యమదమత్తుడై భృత్యుల్ని దూషించే శూరుణ్ని శిక్షిస్తున్నావా? లేకపోతే దెబ్బతింటావు సుమా!


వృద్ధులనూ, బాలురనూ, వైద్యులనూ ఇంకా ఇటువంటి ముఖ్యులనూ త్రికరణశుద్ధిగా గౌరవిస్తున్నావా?

 గురువృద్ధ తాపస, దేవతాదుల్ని నిత్యం నమస్కరిస్తున్నావా? ధర్మార్థకామాలను పరస్పర వైరుధ్యం లేకుండా పాటిస్తున్నావా? విభజించుకుని సకాలంలో సేవిస్తున్నావా? 

పౌరులూ జానపదులూ బ్రాహ్మణులూ నీకు సుఖం కలగాలని ఆశీర్వదిస్తున్నారా?.


రాముడు ఇలా ప్రశ్నల వర్షం కురిపించాడు. భరతుడు క్లుప్తంగా సమాధానం చెప్పాడు


అగ్రజా ! అసలు ధర్మమే లేని నాకు రాజధర్మంతో పని ఏమిటి? మన వంశంలో ఒక శాశ్వత ధర్మం ఉంది. జ్యేష్ఠుడు

ఉండగా కనిష్ఠుడు రాజు కావడానికి వీలులేదు. అందుచేత అయోధ్యకు బయలుదేరు. పట్టాభిషేకం జరిపించుకో. నువ్వు నాకు • దేవుడవు. పురుషోత్తముడవు. నేను కేకయ దేశంలో ఉండగా, నువ్వు అడవులకు రాగా మహారాజు దివంగతుడయ్యాడు.


ఈ మాట వినడం తో మొదలు నరికిన చెట్టులా ఒరిగిపోయాడు. సోదరులు ముగ్గురు విలపించారు. సీతాదేవి దుఃఖించింది......


[అయోధ్యా కాండ 100 వ సర్గ లో భరథుడిని ప్రశ్నించే నెపం తో అనేక రాజ ధర్మాలను ప్రశ్నల రూపం లో అడుగుతాడు రామచంద్రుడు.

దీనిని *కశ్చిత్ సర్గ* గా ప్రసిద్ధి.

రాజ్య పరిపాలనకు సంబందించిన అనేక విషయాలను ప్రస్తావించాడు.]

 🌹రామాయణానుభవం_ 36


ఆ రాత్రి గుహుడు భరతుడు సంభాషిస్తూ ఉన్నారు....

భరతుడు సీత రామ లక్షణుల గురించి అనేక రకాల ప్రశ్నలు వేసాడు....ఎక్కడ పడుకొన్నారు? ఏమేమి భుజించారు? వాటికి అన్నిటికీ గుహుడు తగిన విధం గా సమాధానము చెప్పాడు.....


*ధన్యః ఖలు మహాభాగో లక్ష్మణ శ్శుభలక్షణః*

*భ్రాతరం విషమే కాలే యో రామ మనువర్తతే.*

*సిద్ధార్థాఖలు వైదేహీ పతిం యా నుగతా వనమ్*


ఆహా సీతారాములకు ఎంతటి కష్టమును తెచ్చి పెట్టితిని! నా వంటి పాపి వేరొక్కడుండడు లక్ష్మణుడు ఎంతో ధన్యుడు. కష్టకాలమున రాముని వెంబడి ఉన్నాడు. భర్తను అనుసరించి

అరణ్యమునకు వచ్చిన సీతాదేవి సైతము ఎంతో ధన్యురాలు....


తెల్లవారింది. భరతుడు ముందుగా లేచాడు. శత్రుఘ్నుణ్ని మేల్కొల్పాడు. మన సైన్యాన్ని గంగ దాటిస్తాడు గుహుణ్ని పిలవ మన్నాడు. 


రాత్రి నేను నిద్రపోయానో. మేల్కొని ఉన్నానో తెలియడం లేదు. రాముణ్నే తలుచుకుంటూ గడిపేసాను- అని భరతుడు మాట్లాడుతూండగానే గుహుడు వినయంగా నమస్కరించాడు భరతుడు  గంగను దాటించమని అడిగాడు.....


వెంటనే ఐదు వందల నావలు సిద్ధమయ్యాయి. ఒక నావ గుహుడు స్వయం గా తెచ్చాడు భరతశత్రుజ్ఞుడు,ముగ్గురు రాణులు వశిష్ఠ పురోహితులు ఆ నావ ను అధిరోహించారు .ఇంకా మిగిలిన వారు కొంతమంది ఈదుకుంటు,కొంత మంది కుండలు లాంటివి కట్టుకొని ఈ దుతూ అవతలి ఒడ్డుకు చేరారు.


మొత్తం అందరూ క్షేమంగా అవతలి గట్టు ఎక్కారు. ప్రయాణం సాగించి ప్రయాగవనం చేరుకున్నారు. భరద్వాజాశ్రమానికి క్రోశం దూరంలో సైన్యాన్ని ఆపి భరతుడు అస్త్రశస్త్రాలు విడిచి తెల్లని వస్త్రాలు ధరించి తన మంత్రులతో పురోహితులతో కలిసి నడిచి వెళ్ళాడు. వసిష్ఠులవారు ముందు నడిచారు. కొంతదూరం వెళ్ళాకమంత్రుల్ని కూడా ఆగిపొమ్మని తానొక్కడే వసిష్ఠునివెంట ఆశ్రమంలో కి వెళ్ళారు.


వసిష్ఠుణ్ని చూస్తూనే భరద్వాజుడు లేచి ఎదురు వచ్చాడు. శిష్యుల్ని అర్ఘ్యపాద్యాలు తెమ్మన్నాడు. తనకు సమస్క రిస్తున్న భరతున్న దశరధుడి కొడుకుగా గుర్తుపట్టాడు. అతిథిపూజలూ, మర్యాదలూ, కుశల ప్రశ్నలు అయ్యాయి.


రాజ్యం ఏలుకునే వాడివి. నువ్వు ఇటు రావడానికి పని ఏమిటి?


స్త్రీ కారణంగా నీ తండ్రి రాముణ్ని అడవులకు పంపేసాడు గదా ! పధ్నాలుగేళ్ళు వనవాసం చెయ్యమన్నాడట! ఆ రాజే

సౌమిత్రికీ ఇంకా అపకారం చేద్దామనీ రాజ్యాన్ని అకంటకం (శత్రురహితం) చేసుకుందామనీ నువ్వు బయలుదేరావా ఇప్పుడు?


ఈ ప్రశ్నలకు భరతుడు కదిలిపోయాడు. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. నిబ్బరించుకుని నోరు విప్పాడు


భగవన్! తమరుకూడా నన్ను ఇలాగే భావిస్తే హతోఽస్మి. నాపట్ల ఏ దోషమూ లేదు. దయచేసి నన్నిలా శిక్షించ నేను లేనప్పుడు మా తల్లి చేసిన దానికి అన్నదానికి నేను బాధ్యుణ్ని కాను. వాటిని నేను సమ్మతించడం లేదు. రాముడి పాదాలకు నమస్కరించడానికి, అయోధ్యకు తిరిగి తీసుకువెళ్ళడానికి బ్రతిమాలుకోవడానికీ నేను బయలుదేరాను.

నన్ను నమ్మండి. కోపం విడిచిపెట్టి అనుగ్రహించండి. మహారాజయిన రాముడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో దయతో నాకు తెలియజెయ్యండి.


భరతా! చాలా సంతోషంగా ఉందయ్యా! రఘువంశంలో పుట్టిన నీకు ఇది తగును. నీ మనస్సు నాకు ముందే తెలుసు అయితే దాన్ని దృఢపరచడానికి అన్నాను అంతే. నీ అన్నగారు చిత్రకూటపర్వతం మీద ఉంటున్నాడు. రేపు ఆక్కడికి వెడుదురుగాని ఈ రాత్రికి నువ్వూ నీ మంత్రులూ సైన్యమూ ఇక్కడే విడిది చెయ్యండి.......

**


భర్వాద్వాజుని ఆజ్ఞ మేరకు భరతుడు కౌసల్య సుమిత్ర కైకేయి ఇతర మంత్రి పురోహితులు సైన్యం  అంత ఆ రాత్రి భారద్వాజాశ్రమం లో విడిది చేశారు.


భరద్వాజుడు తన తపశ్శక్తితో రాజభవనం సృష్టించాడు. అందులో రాజసింహాసనం కూడా ఉంది. భరతుడు మంత్రి పురోహితులతో ప్రవేశించాడు. రాజసింహాసనానికి ప్రదక్షిణం చేసి రాముణ్ని తలుచుకుంటూ నమస్కరించాడు. దానికి సమీపంలో ఉన్న మంత్రి పీఠం మీద కూర్చుని సింహాసనానికి వింజామరలు వీచాడు అదే తపశ్శక్తితో ఆ మహర్షి మొత్తం సైన్యానికి అత్యద్భుతమైనవిందు ఇచ్చాడు. గజాశ్వాలతో సహా కోరుకున్నది కోరుకున్నంతగా లభించింది. 

మద్యాలేమిటి మాంసాలేమిటి ఫలాలేమిటి- అన్నీ పుష్కలంగా లభించాయి. అప్సరసలు ఒక్కొక్క వ్యక్తి దగ్గర ఏడెనిమిది మంది నిలబడి కొసరి కొసరి  వడ్డించి తినిపించారు. వింజామరలతో గీతవాద్య నృత్యాలతో అలరించారు.

 (ఇదే 'భరద్వాజ విందుగా' ప్రసిద్ధికెక్కింది.) అయోధ్యా లేదు. అరణ్యమూ లేదు- ఇక్కడే ఉండిపోతాం. రామభరతులకు జయమగుగాక అంటూ సైనికులు కేరింతలు కొట్టారు. అందరికీ అదొక స్వప్నంలా అనిపించింది. నందనవనంలో దేవతలలాగా ఆనందించారు. రాత్రి క్షణంలో గడిచిపోయింది. అప్సరసలు భరద్వాజుడి దగ్గర సెలవు తీసుకొని వెళ్లిపోయారు.


తెల్లవారుతూనే భరతుడు భరద్వాజుడి దర్శనానికి వెళ్ళాడు. అగ్నిహోత్రం నిర్వహించి ఆ మహర్షి తన పర్ణశాలనుంచి ఇవతలకు వచ్చాడు. తమరు ఆనుమతిస్తే ఇక బయలుదేరతాను. రాముణ్ని చేరుకోవాలి, దయచూడండి. రాముడి ఆశ్రమం ఇక్కడికి ఎంతదూరమో, ఏది మార్గమో సెలవివ్వండి- అని భరతుడు ప్రార్ధించాడు. మహర్షి సవివరంగా చెప్పాడు.


బయలుదేరబోతూ కౌసల్యాసుమిత్రలు వచ్చి మహర్షికి పాదాభివందనం చేసారు. తన కోరిక తీరకపోగా, లోక గర్తితురాలైన కైకేయి సిగ్గుపడుతూనే మహర్షికి సాష్టాంగపడి ప్రదక్షిణంగా వచ్చి భరతుడి వెనక్కాల దీనంగా నిలబడింది. ఈ తల్లులలో ఎవరు ఎవరో తెలియగోరాడు మహర్షి


శోకంతో ఉపవాసాలతో చిక్కి శల్యమైపోయిన ఈ దీనురాలు- ఈ దేవత - పట్టమహిషి పురుషోత్తముడు  అయిన రాముని కన్నతల్లి, కౌసల్యాదేవి. ఆమె ఎడమబుజాన్ని ఆనుకుని వాడిపోయిన పువ్వులా ఉన్నదేవి- సుమిత్ర మహావీరులూ పత్యవరాక్రములూ అయిన లక్ష్మణశత్రుఘ్నులకు జన్మనిచ్చిన భాగ్యశాలిని. రామలక్ష్మణుల వనూసానికీ, దశరథుడి ప్రాణత్యాగానికి కారణభూతురాలై అహంకారమూ ఐశ్వర్య కామమూ మూర్తీభవించిన దుష్టురాలు ఈమె కైకేయి. ఈవిడే నా తల్లి, నా దుఃఖానికి మూలకారణం. పాపాత్మురాలు- అంటూ భరతుడు గద్గదస్వరంలో వివరించాడు. అతడి కళ్ళు ఎరుపెక్కాయి ఆయాసపడుతున్నాడు. అలిగిన పాములా బుసకొడుతున్నాడు.


భరతా! కైకేయిని దోషిణిగా చూడకు. రామవనవాసం శుభదాయకమే అవుతుంది. - అని ధైర్యం చెప్పి సాగనంపాడు భరద్వాజుడు.


చిత్రకూటంవైపు ప్రయాణం సాగింది. భరతుడి మనస్సు తేలికపడింది. కొంత దూరం ప్రయాణించిన తరవాత- భరద్వాజుడు వర్ణించి చెప్పిన ప్రకృతి దృశ్యాలు కనిపించడంతో ఇదే చిత్రకూటమని భరతుడు నిర్ధారణకు వచ్చాడు వసిష్ఠులవారితో అదే అన్నాడు. ఆ వనం అయోధ్యలా భాసించింది భరతుడి కంటికి. సైన్యాన్ని విడిది చేయించాడు.


అల్లంతదూరంలో కొందరికి పొగ కనిపించింది. మనుష్యులు లేనిదే అగ్ని ఉండదు. అగ్ని లేనిదే పాగరాదు కాబట్టి రామలక్ష్మణులు అక్కడ ఉండి ఉంటారు అనుకున్నారు. లేదా మరెవరైనా తపస్వులు ఉండి ఉండవచ్చు

సైనికులారా! మీరంతా ఇక్కడే ఆగిపొండి, నేనూ వసిష్ఠుడూ సుమంత్రుడూ వెడతాం- అని భరతుడు ఆజ్ఞాపించి ఆ

పొగవైపే చూస్తూ నడక సాగించాడు......

శివభక్తుడు

 *రెండు నిముషాలు కేటాయించి ఈ అద్భుతమైన శివ లీల చదవండి*...

*🌹ఈ లీల కచ్చితంగా మిమ్మల్ని రోమాంచితం చేస్తుంది పూర్తిగా చదవండి🌹*

ఒక సారి ఒక శివభక్తుడు తన ఊరినుండి కేదారనాథ్ ధామానికి యాత్రకోసం బయలుదేరాడు. అప్పట్లో యాత్రాసాధనాలు, ప్రయాణ సౌకర్యాలు లేనందున, అతడు నడక ద్వారానే పయనించాడు. దారిలో ఎవరు కలిస్తే వారిని కేదారనాథ్ మార్గం అడిగేవాడు. మనసులో శివుని ధ్యానిస్తూ ఉండేవాడు అట్లా నడుస్తూ నడుస్తూ నెలలు గడిచిపోయాయి

చివరకు ఒక రోజు అతడు కేదారధామం చేరనే చేరాడు.

కేదారనాథ్ లో మందిరం ద్వారాలను ఆరు నెలలే తెరుస్తారు, ఆరు నెలలు మూసి ఉంచుతారు. అతడు మందిరం ద్వారాలు మూసే వేళ అక్కడకు చేరాడు

పూజారికి అతడు ఆర్తితో చెప్పాడు ‘నేనెంతో దూరం నుంచి పాదయాత్ర చేస్తూ వచ్చాను కృప ఉంచి తలుపులు తీయండి. ఈశ్వరుని దర్శించనివ్వండి’ అని. కానీ అక్కడ నియమం ఏంటంటే ఒకసారి తలుపును మూస్తే ఇక మూసినట్టే. నియమం నియమమే, మరి అతడు చాలా దుఃఖపడ్డాడు మాటిమాటికీ శివుని స్మరించాడు.

*‘ప్రభో, ఒకే ఒక్కసారి దర్శనం ఇవ్వవా'? అని అతడు అందరిని ఎంత ప్రార్థించినా, ఎవరూ వినలేదు*

పూజారి అన్నాడు కదా ‘ఇహ ఇక్కడకు ఆరు నెలలు గడిచాక రావాలి, ఆరునెలలు అయ్యాకే తలుపును తెరిచేది’ అని ‘ఆరు నెలలపాటు ఇక్కడ మంచు కురుస్తుంది’ అని చెప్పి అందరూ అక్కడి నుంచి వెళిపోయారు. అతడక్కడే ఏడుస్తూ ఉండిపోయాడు, ఏడుస్తూ ఏడుస్తూ రాత్రి కాసాగింది. నలుదిక్కులా చీకట్లు కమ్మిపోయాయి కానీ అతడికి విశ్వాసం తన శివుని మీద ఆయన తప్పక కృప చూపుతాడని. అతడికి చాలా ఆకలి దప్పిక కూడా కలగసాగాయి. అంతలోకి అతడు ఎవరో వస్తున్న శబ్దాన్ని విన్నాడు చూస్తే ఒక సన్యాసి బాబా అతని వైపు వస్తున్నాడు ఆ సన్యాసి బాబా అతడి వద్దకు వచ్చి దగ్గరలో కూర్చున్నాడు.

*అడిగాడు ‘నాయనా, ఎక్కడినుంచి వస్తున్నావు?’ అని*

అతడు తన కథంతా చెప్పాడు. చెప్పి, ‘నేను ఇంత దూరం రావటం వ్యర్థం అయింది బాబాజీ’ అని బాధపడ్డాడు. బాబాజీ అతడిని ఓదార్చి, అన్నం తినిపించాడు, తరువాత చాలా సేపటివరకు బాబాజీ అతడితో మాట్లాడుతూండి పోయాడు బాబాజీకి అతడి పై దయ కలిగింది ఆయన ‘నాయనా, నాకు రేపుదయం మందిరం తప్పక తెరుస్తారని అనిపిస్తున్నది, నీకు తప్పక దర్శనం దొరుకుతుందని అనిపిస్తున్నది’ అని అన్నాడు.

మాటల్లో పడి ఆ భక్తుడికి ఎప్పుడు కన్ను అంటిందో తెలియదు సూర్యుడు కొద్దిగా ప్రకాశించేవేళకు భక్తుని కళ్ళు తెరుచుకున్నాయి అతడు అటూ ఇటూ చూస్తే బాబాజీ చుట్టుపక్కల ఎక్కడా లేడు అతడికి ఏదైనా అర్థమయ్యే లోపు పూజారి తమ మండలి అంతటితో కలిసి రావటం చూశాడు అతడు పూజారికి ప్రణామం చేసి అన్నాడు

'నిన్ననేమో మీరు మందిరం ఆరునెలలాగి తీస్తామన్నారు కదా? ఈ మధ్య సమయంలో ఎవరూ ఇటు తొంగి చూడరని కూడా చెప్పారు కదా, కానీ మీరు ఉదయాన్నే వచ్చేశారే’ అని అన్నాడు.

పూజారి అతడి వంక పరిశీలించి చూస్తూ, గుర్తు పట్టటానికి ప్రయత్నిస్తూ, అడిగాడు ‘నువ్వు మందిరం ద్వారం మూసేసే వేళకు వచ్చినవాడివే కదా? నన్ను కలిశావు కదా ఆరునెలలయ్యాక తిరిగి వచ్చావా!’ అని అన్నాడు.

అప్పుడు ఆ భక్తుడు అన్నాడు ఆశ్చర్యంగా – ‘లేదు, నేనెక్కడికీ పోనేలేదే నిన్ననే కదా మిమ్మల్ని కలిసింది, రాత్రి నేను ఇక్కడే పడుకున్నాను నేనెటూ కదలలేదు’ అని చెప్పాడు.

పూజారికి ఆశ్చర్యానికి అంతే లేదు ఆయన అన్నాడు ‘కానీ నేను ఆరునెలల ముందు మందిరం మూసి వెళిపోయాక ఇదే రావటం నీవు ఆరు నెలలు పాటు ఇక్కడ జీవించి ఎట్లా ఉండగలిగావు?’ పూజారి, అతడి బృందం అంతా విపరీతంగా ఆశ్చర్యపోయారు.

*ఇంత చలిలో ఒక వ్యక్తి ఒంటరిగా ఆరునెలల పాటు జీవించి ఎట్లా ఉండగలడు?*

అప్పుడు ఆ భక్తుడు ఆయనకు ఆ సన్యాసి బాబా రావటం, కలవటం, ఆయనతో గడిపిన సమయం, విషయం అంతా వివరించాడు ‘ఒక సన్యాసి వచ్చాడు- పొడుగ్గా ఉన్నాడు, పెద్ద గడ్డం, జటలు, ఒక చేతిలో త్రిశూలం మరొక చేతిలో డమరుకం పట్టుకుని, మృగచర్మం కప్పుకుని ఉండినాడు’ అని.

వెంటనే పూజారి, ఇతరులు అందరూ అతడి చరణాలపై పడిపోయారు ఇట్లా అన్నారు ‘మేము జీవితమంతా వెచ్చించాము, కానీ ఈశ్వరుని దర్శనం పొందలేకపోయాము, నిజమైన భక్తుడివి నీవే నీవు సాక్షాత్తు భగవంతుడినే, శివుడినే దర్శనం చేసేసుకున్నావు ఆయనే తన యోగమాయతో నీకు ఆరునెలలు ఒక రాత్రిగా మార్పు చేసేశాడు కాలఖండాన్ని తగ్గించి చిన్నగా చేసేశాడు ఇదంతా నీ పవిత్రమైన మనస్సు, శ్రద్ధ విశ్వాసాల కారణంగానే అయింది మేము నీ భక్తి కి ప్రణామాలు అర్పిస్తున్నాము...

భగవద్గీత

 🌹భగవద్గీత🌹


పదమూడవ అధ్యాయము

క్షేత్ర - క్షేత్రజ్ఞవిభాగయోగము 

నుంచి 33వ శ్లోకము


క్షేత్రక్షేత్రజ్ఞయోరేవమ్  అంతరం  జ్ఞానచక్షుషా ౹

భూతప్రకృతిమోక్షం చ యే విదుర్యాంతి తే పరమ్ ౹౹(34)


క్షేత్రక్షేత్రజ్ఞయోః , ఏవమ్ ,

అంతరమ్ , జ్ఞానచక్షుషా ౹

భూతప్రకృతిమోక్షమ్ , చ , యే ,

విదుః , యాన్తి , తే , పరమ్ ౹౹(34)


ఏవమ్ = ఈ విధముగా 

క్షేత్ర , క్షేత్రజ్ఞయోః = క్షేత్రక్షేత్రజ్ఞుల మధ్యగల 

అంతరమ్ =  భేధమును ;

చ = మఱియు

భూతప్రకృతిమోక్షమ్ = కార్యసహిత ప్రకృతి నుండి ముక్తులగు ఉపాయములను 

యే = యే పురుషులయితే 

జ్ఞానచక్షుషా = జ్ఞాననేత్రముల ద్వారా 

విదుః = తెలిసికొందురో 

తే = అట్టి మహాత్ములు 

పరమ్ = పరబ్రహ్మ పరమాత్మను 

యాన్తి = పొందుదురు 


తాత్పర్యము:- ఈ విధముగా క్షేత్ర ౼ క్షేత్రజ్ఞుల మధ్యగల అంతరమును , కార్యసహిత ప్రకృతినుండి విముక్తులగుటకు ఉపాయములను జ్ఞాననేత్రములద్వారా ఎఱింగిన మహాత్ములు పరమగతిని పొందుదురు. (34)

                      

ఓం తత్సదితి శ్రీభగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీ కృష్ణార్జునసంవాద క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగో నామ త్రయోదశోఽధ్యాయః ౹౹ ౧౩ ౹౹ 

   

        ఆత్మీయులందరికి శుభ శుభోదయం

                Yours Welwisher

    Yennapusa Bhagya Lakshmi Reddy

హృదయార్పణం

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

           🌷 *నేటి మాట*🌷


*హృదయార్పణం అంటే! ఎలా?*


మనిషి తనకు మానవ జన్మ ప్రసాదించిన భగవంతుడికి అనేక విధాలుగా పూజలు చేస్తుంటాడు. 

పూజా సమయంలో యథాశక్తి తనకు ఉన్నంతలో పత్రమో, పుష్పమో, ఫలమో, జలమో సమర్పించు కుంటూ ఉంటాడు. 

ఈ విధంగా సమర్పించడం కృతజ్ఞతా సూచకం అయితే కావచ్చునేమో గానీ.. అసలు మనిషి భగవంతుడికి సమర్పించగల శక్తిమంతుడేనా...


ఇలా ఆలోచిస్తే, ఎంతమాత్రం కాదని చెప్పవచ్చు... భగవంతుడిదే ఈ యావత్‌సృష్టి...

అలాంటివాడికి భక్తుడు ఇచ్చే కానుకలు అత్యల్పమైనవే.  కానీ ఏదో ఒకటి సమర్పించకపోతే భక్తుడి మనసు వూరుకోదు...


పూర్వం ఒక యోగి భగవంతుణ్ని అర్చించడానికి సిద్ధమయ్యాడు. 

అప్పుడు అతడిలో వివేకం ఉదయించింది. 

పూజలో ఒక్కొక్క ఉపచారాన్నీ చేస్తూ భగవంతుడితో ఇలా విన్నవించుకున్నాడు... 


"పరమేశ్వరా... నీవు బ్రహ్మాండమంతా నిండి ఉన్నావు, కనుక నిన్ను ఎలా ఆవాహన చేయాలి..


అన్నింటికీ ఆధారమై నీవు ఉండగా నీకు ఆసనం ఎక్కడ వేయాలి..


నిరంతరం స్వచ్ఛంగా ఉండే నీకు కాళ్లు కడుక్కోవడానికి నీళ్లెందుకు..


పరిశుద్ధుడవైన నీకు ఆచమనం అవసరమా..


నిత్యనిర్మలుడవైన నీకు స్నానం ఎలా చేయించాలి..


ప్రపంచమంతా నీలోనే ఉండగా నీకు వస్త్రం ఎలా ధరింపజేయాలి..


గోత్ర వర్ణాలకు అతీతుడవైన నీకు యజ్ఞోపవీతం అవసరమా..


ఏ లేపనాలూ అవసరం లేని నీకు గంధం ఎలా పూయాలి..


నిత్య పరిమళుడవైన నీకు పూలు పెట్టడం ఎందుకు..


మహిమతోనే వెలిగిపోయే నీకు ఆభరణాలు తొడగాలా..


నిరంజనుడవైన నీకు ధూపం వేయడం సరి అయినదేనా..


జగత్తుకే సాక్షిగా నిలిచిన నీకు దీపం అవసరమా..


నిజమైన ఆనందంతో నిలిచే నీకు నైవేద్యం ఎందుకు..


విశ్వానికే ఆనందాన్ని అందించే నీకు తాంబూలాన్ని అర్పించి సంతృప్తి పరచగలనా..


అంతమే లేకుండా అంతటా వ్యాపించిన నీకు ప్రదక్షిణం ఎలా చేయాలి..


అద్వయుడవైన నీకు నమస్కారం ఎలా చేయాలి..


వేదాలే నిన్ను స్తుతించడానికి శక్తి చాలనివి అవుతుంటే నేను నిన్ను ఎలా స్తుతించాలి.."


...ఈ పలుకుల్లో నిజం లేకపోలేదు, భగవంతుడి ముందు ఎంతటి మానవోత్తముడైనా అత్యల్పుడే...

వీడి శక్తి భగవంతుడి ముందు పరిగణనలోకి రానే రాదు. అయినా భగవంతుడు మనిషి చేసే పూజలను స్వీకరిస్తున్నాడంటే ఆయన అపార కారుణ్యం వర్ణించలేనిది...

నిజంగా భగవంతుడు మనిషి నుంచి కోరేవి సంపదలు కావు, వస్తువులు అంతకన్నా కావు...


ఆయన మనిషి నుంచి హృదయార్పణను కోరతాడు, భక్తితో స్మరిస్తే చాలునంటాడు, కానీ మనిషి మనసు చంచలం, చపలం. 

స్థిరంగా ఒకచోట ఉండదు, లౌకిక లంపటాల వల్ల భగవంతుడిపై లగ్నం కాదు. అందుకే... శంకరభగవత్పాదులు...


ఓ పరమేశ్వరా... నా మనసు ఒక కోతి వంటిది. అది ఎప్పుడూ సంసారవాంఛ అనే అడవిలో తిరుగుతూ ఉంటుంది...

భార్యా పుత్రుల ప్రేమ అనే చెట్టుకొమ్మను పట్టుకొని వేలాడుతూ ఉంటుంది...

క్షణం తీరిక లేకుండా అటూ ఇటూ పరుగులు తీస్తుంటుంది, అందువల్ల నా మనసు అనే కోతిని నీకు అర్పిస్తున్నాను, దాన్ని తాడుతో గట్టిగా కట్టి నీ అధీనంలో ఉంచుకో' అని ప్రార్థిస్తారు...


సామాన్య భక్తులను తరింప జేయడానికి ఆయన చేసిన విన్నపం ఇది...


ఓ పరమేశ్వరా... బంగారు కొండ మేరు పర్వతమే నీ చేతిలో ఉంది, అపార ధనవంతుడైన కుబేరుడు నీ పాదదాసుడై ఉన్నాడు...

కల్పవృక్షం, కామధేనువు, చింతామణి నీ ఇంటిలోనే ఉన్నాయి, షోడశ కళలను కురిపించే చంద్రుడు అమృతాన్ని వర్షిస్తూ నీ తలపైనే ఉన్నాడు. 

సమస్త మంగళాలనూ కలిగించే జగన్మాత సర్వమంగళయై నీ పక్కనే ఉంది. 

కనుక నీకు నేనేమీ ఇవ్వలేను, నా దగ్గర ఉన్నది ఒక్క మనసే, అది నీకు సమర్పిస్తున్నాను..


అని హృదయాన్ని అర్పిస్తే భగవంతుడు ఎంతో ఇష్టపడతాడు. 

అచంచల విశ్వాసం, అకుంఠిత భక్తి, అన్నింటినీ నివేదించగల మనసు ఉంటే చాలు, భగవంతుడు ఏ రూపంలో ఉన్నా పూజల్ని అందుకుంటాడు. 

అట్టహాసాలు, ఆర్భాటాలు నిజమైన పూజలు కావు, హృదయార్పణమే పూజ, నిశ్చల ధ్యానమే భక్తి, అంతేకానీ లోకమంతా చూడాలని చేసే నటనలు పూజలు కావు... ఈ సత్యాన్ని మనిషి గ్రహించాలి... 


            *_🌻శుభమస్తు🌻_*

🙏 సమస్త లోకా సుఖినోభవంతు🙏

 *సేకరణ:* వాట్సాప్ పోస్ట్.