21, జూన్ 2025, శనివారం

రామాయణం

 🌹🌷🏹🪔🛕🪔🏹🌷🌹

*🚩శనివారం 21 జూన్ 2025🚩*

``

           *రామాయణం*


ఒకసారి చదివినంత 

మాత్రాన మన సమస్త 

పాపాలని తీసేస్తుంది.

``

     *వాల్మీకి రామాయణం*                

            *75వ  భాగం*


*రక్షితా జీవలోకస్య ధర్మస్య పరి రక్షితా।*

*రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా॥*

```

హనుమంతుడు అన్నాడు… 

“రాముడంటే మూర్తీభవించిన ధర్మం, తన ధర్మాన్ని తాను రక్షించుకుంటాడు, ఇతరుల ధర్మాన్ని కూడా రక్షిస్తాడు.”

```

*రామః కమల పత్రాక్షః సర్వసత్వ మనోహరః।*

*రూప దాక్షిణ్య సంపన్నః ప్రసూతో జనకాత్మజే॥*```


“రాముడు పద్మముల వంటి కన్నులున్నవాడు, అన్ని ప్రాణులు ఆయనని చూసి ఆనందపడతాయి, ఆయనకి ఇవన్నీ పుట్టుకతో వచ్చాయి తల్లీ!”


``` *తేజసా ఆదిత్య సంకాశః*  

*క్షమయా పృథివీ సమః।*

*బృహస్పతి సమో బుద్ధ్యా యశసా వాసవో సమః॥*```


“తేజస్సులో సూర్యుడితో సమానమైనవాడు, క్షమించడంలో భూమితో సమానమైనవాడు, బుద్ధియందు బృహస్పతితో సమానమైనవాడు, కీర్తినందు ఇంద్రుడితో సమానమైనవాడు. రాముడికి యజుర్వేదము, ధనుర్వేదము, వేదవేదాంగములు తెలుసు” అని చెపుతూ, రాముడి కాలిగోళ్ళ నుంచి శిరస్సు మీద ఉండే వెంట్రుకల వరకూ ఏ ఒక్క అవయవాన్ని విడిచిపెట్టకుండా హనుమంతుడు వర్ణించాడు. అలానే “అమ్మా! రాముడు మర్యాదా పురుషోత్తముడు. ఎవరిని, ఎప్పుడు, ఏ లోకంలో, ఎలా కాపాడాలో తెలిసున్నవాడు, నడువడి ప్రధానమైనవాడు రాముడంటే. ఆయన కర్త, కారణమై ఈ సమస్త జగత్తునందు నిండిపోయాడు.”


```

*వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః।*

*రామనామాంకితం చేదం పశ్య దేవ్యంహుళీయకం॥*


*ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మనా।*

*సమాశ్వసిహి భద్రం తే క్షీణ దుఃఖఫలా హ్యసి॥*

```

(ఈ శ్లోకాలు పరమ పావనమైనవి, వీటిని సుందరకాండలో మంత్రం అంటారు. సీతమ్మకి ఉన్న బాధని హనుమ ఈ మాటల చేత పోగొట్టాడు, 10 నెలల తరువాత సీతమ్మ ఈ మాటలు విని ఆనందపడింది)


“అమ్మా! నేను వానరుడిని, రాముడి పలుకున వచ్చిన రామదూతని. రామ రామనామాంకితమైన ఉంగరాన్ని నీకు తీసుకొచ్చాను, నీకు నమ్మకం కలగడం కోసమని రాముడు దీనిని నాకిచ్చి పంపించాడు. ఈ ఉంగరాన్ని తీసుకున్నాక ఇవ్వాల్టితో నీ కష్టాలన్నీ పోయాయి, ఇక నువ్వు ఉపశాంతిని పొందుతావు” అన్నాడు.


హనుమంతుడు ఇచ్చిన ఆ ఉంగరాన్ని ముట్టుకోగానే సీతమ్మ సిగ్గుపడింది. రాముడినే చూసినంత ఆనందాన్ని సీతమ్మ పొందినదై, ఆ ఉంగరాన్ని కన్నులకి అద్దుకొని పరవశించిపోయింది.


హనుమంతుడు ఇచ్చిన ఉంగరాన్ని తీసుకున్న సీతమ్మ “నాయనా హనుమా! లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, కోసల దేశంలో ఉన్న సమస్త జనులు, సుగ్రీవుడు, వానరములు కుశలమే కదా” అని పలు ప్రశ్నలు అడిగాక,  “రాముడికి నాకన్నా ఎక్కువైనవారు ఎవరూ లేరు, నేను పక్కన లేకపోవడం వల్ల రాముడు తాను ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించడంలో వైక్లవ్యాన్ని పొందలేదు కదా? రాముడు కేవలము తన పౌరుషము మీదనే ఆధారపడి, దైవమును తిరస్కరించి తిరుగుతున్నాడా, లేక తన పౌరుషాన్ని పూర్తిగా విడిచిపెట్టి కేవలం భగవంతుడిని మాత్రమే విశ్వసించి తిరుగుతున్నాడా? రాముడికి నేను జ్ఞాపకం ఉన్నానా, నన్ను తలుచుకుంటున్నాడా. రావణుడిని, రాక్షసులని నిగ్రహించాలంటే రాముడు అక్కడినుండి అస్త్రప్రయోగం చెయ్యలేడా? రాముడు అస్త్రప్రయోగం చెయ్యకుండా నాయందు ఎందుకు ఉపేక్ష వహించాడు? నాకు రావణుడు 12 నెలల గడువు ఇచ్చాడు, అందులో 10 నెలల కాలం పూర్తయిపోయింది. ఇంక 2 నెలలు మాత్రమే వాడు నన్ను బతకనిస్తాడు. కాని నేను ఒక నెల మాత్రమే బతికి ఉంటాను. ఈ ఒక నెల లోపల రాముడు వచ్చి నన్ను విడిపిస్తే సరి, ఒకవేళ రాముడు రాకపోతే నేను ప్రాణములను విడిచిపెట్టేస్తాను. నేను ఇంక ఒక నెల మాత్రమే జీవించి ఉంటాను అని రాముడికి నివేదించు” అంది.


సీతమ్మ అలా బాధపడుతూ చెప్పిన మాటలని విన్న హనుమంతుడు శిరస్సు మీద చేతులు పెట్టుకొని… 

“ఎందుకమ్మా అలా ఖేద పడతావు. మలయము, వింధ్యము, మేరు మొదలైన పర్వతముల మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను, మా వానరములు తినే కందమూలముల మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను, రాముడు నీయందు విశేషమైన ప్రేమతో ఉన్నాడు. ఆయన ఎంతగా తపిస్తుంటాడంటే, ఎక్కడైనా ఒక అందమైన పద్మము కనపడితే 'హా సీతా, హా సీతా' అంటున్నాడు. వానప్రస్థులలాగ రాముడు కూడా సూర్యాస్తమయం అయ్యాక సాత్వికమైన ఆహారాన్ని తీసుకుంటున్నాడు. నిరంతరము నీగురించే ధ్యానము చేస్తున్నాడు, ప్రతిక్షణం శోకిస్తూనే ఉన్నాడు. రాముడు ప్రస్రవణ పర్వతం గుహలో పడుకుని ఉన్నప్పుడు ఆయన ఒంటి మీద నుంచి తేళ్ళు, జర్రులు, పాములు పాకినా కాని ఆయనకి స్పృహ ఉండడం లేదు. 100 యాగములు చేసి ఐరావతం మీద కూర్చున్న ఇంద్రుడి దగ్గర శచీదేవి ఉన్నట్టు, ప్రస్రవణ పర్వత గుహలో కూర్చున్న రాముడి దగ్గరికి నిన్ను తీసుకెళ్ళి దింపుతానమ్మా. యజ్ఞంలో వేసిన హవిస్సుని హవ్యవాహనుడైన అగ్నిదేవుడు ఎంత పరమపవిత్రంగా తీసుకెళతాడో, అలా నిన్ను తీసుకెళ్ళి రాముడి పాదాల దగ్గర పెడతాను. అమ్మా! నువ్వు వచ్చి నా వీపు మీద కుర్చో” అన్నాడు.


కాని హనుమంతుడు అప్పటిదాక చాలా చిన్నగా ఉండడం వలన, సీతమ్మ హనుమని చూసి ఫక్కున నవ్వి… “ఎంతమాట అన్నావోయి హనుమ. నువ్వే ఇంత స్వరూపం, ఆ వీపు మీద నేను కూర్చోనా, నన్ను ఈ సముద్రాన్ని దాటించి తీసుకెళతావా. నీ వానర బుద్ధిని బయటపెట్టావు కదా” అంది.


సీతమ్మ మాటకి అలిగిన హనుమంతుడు తన స్వరూపాన్ని సీతమ్మకి చూపించాలి అనుకొని, మేరు పర్వత శిఖరాలు ఆకాశాన్ని చుంబిస్తున్నట్టు ఎలా ఉంటాయో, అలా పర్వత స్వరూపాన్ని పొందాడు. 


అప్పుడు హనుమంతుడు పెద్ద పాదాలతో, బలిసిన తొడలతో, సన్నటి నడుముతో, విశాలమైన వక్షస్థలంతో, శంఖంలాంటి కంఠంతో, కాల్చిన పెనంలాంటి ముఖంతో, పచ్చటి కన్నులతో, పెద్ద శిరోజములతో, పరిఘలవంటి భుజములతో నిలబడ్డాడు.```


        *రేపు…76వ భాగం*


*🚩జై శ్రీరామ్.!   జై శ్రీ రామ్.!🚩*                           

       *🙏జై జై శ్రీ రామ్.!🙏*


                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏

యాభై (50) దాటుతుందంటే

 *💚మీ వయస్సు యాభై (50) దాటుతుందంటే ఈ ఐదు(5) సూత్రాలు తప్పక పాటించండి...*


🩷మీరు చాలా బాధ్యతయుతంగా మెలగాలి మీ కుటుంబానికి మీరే ఆధారం మీ వయసు 50 ప్లస్ దాటిందంటే ఆరోగ్యం పై దృష్టి పెట్టాల్సిందే ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందే. 

ఇప్పుడు ఆ 5 సూత్రాలు ఏమిటో చూద్దాం. 


*🧡1.ఒకటో సూత్రం*

ఈ రెండిటిని అప్పుడప్పుడు పరీక్ష చేయించండి. 

* బీపీ,

* షుగర్. 


*🩵2.రెండో సూత్రం*

ఈ నాలుగింటిని సాధ్యమైనంత తగ్గించండి. 

* ఉప్పు, 

* చక్కెర, 

* డైరీ పదార్థాలు, 

* పిండి పదార్థాలు. 


*🤎3.మూడో సూత్రం*

ఈ నాలుగింటిని ఎక్కువ తీసుకోండి. 

* ఆకుకూరలు, 

* కూరగాయలు, 

* పండ్లు, 

* గింజలు. 


*💗4.నాలుగో సూత్రం*

ప్రతిరోజు ఈ నాలుగు ఉండేటట్టు చూసుకోండి

* నియమితో ఉపవాసం,

* వ్యాయామం, 

* బరువు తగ్గుట, 

* నవ్వడం.


*💖5.అయిదవ సూత్రం*

మూడిటిని వదిలేయండి,

మూడిటిని పొందండి.

* గడిచిపోయిన రోజులు(వదిలేయండి), 

* మీ వయసు(వదిలేయండి), 

* కోపతాపాలు (వదిలేయండి),

* ప్రేమించే కుటుంబం (పొందండి), 

* ప్రాణ స్నేహితులు (పొందండి), 

* ఉన్నతమైన ఆలోచనలు (పొందండి).


🚩💚విజయవంతంగా 50 సంవత్సరాలు నిండిన మీ మిత్రులతో కుటుంబ సభ్యులతో ఈ పోస్ట్ షేర్ చేసుకోండి.🙏  

🚩❤️🧡💛💚🩵💙💜

⚜ శ్రీ కోపేశ్వర్ శివాలయం

 🕉 మన గుడి : నెం 1149


⚜ మహారాష్ట్ర : ఖిద్రాపూర్


⚜ శ్రీ కోపేశ్వర్ శివాలయం



💠 మహారాష్ట్రలోని ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన నిర్మాణ అద్భుతాలలో ఒకటిగా, కోపేశ్వర్ ఆలయం శివుడికి అంకితం చేయబడిన ఒక నిర్మాణ కళాఖండం మరియు మతపరమైన ప్రదేశంగా నిలుస్తుంది.


💠 12వ శతాబ్దంలో నిర్మించబడిన ఇది అద్భుతమైన వాస్తుశిల్పం మరియు హిందూ పురాణాలు మరియు దైనందిన జీవితం నుండి కథలను చెప్పే క్లిష్టమైన శిల్పాలను కలిగి ఉంది



💠 మహారాష్ట్రలోని మరుగున పడ్డ మహనీయ క్షేత్రమిది.

ఇక్కడి శిల్పకళారామమైన కోపేశ్వర మందిరం ప్రతి ఒక్కరూ చూడవలసినది.

కృష్ణ నది ఒడ్డున నిర్మించబడిన కోపేశ్వర్ ఆలయం శివుడికి అంకితం చేయబడింది మరియు కొల్హాపూర్ పర్యటనలో తప్పనిసరిగా చేర్చవలసిన ప్రదేశాలలో ఒకటి . 


💠 కోపేశ్వర్ ఆలయంని 12వ శతాబ్దంలో శిలాహర రాజు గండరాదిత్య 1109 మరియు 1178 మధ్య నిర్మించారు . 

సిలాహరలు జైన రాజులు అయినప్పటికీ , వారు వివిధ హిందూ దేవాలయాలను నిర్మించి, పునరుద్ధరించారు, తద్వారా అన్ని మతాల పట్ల వారి గౌరవం మరియు ప్రేమను ప్రతిబింబిస్తుంది. 

కోపేశ్వర్ అంటే కోపంగా ఉన్న శివుడు.



🔆 స్థల పురాణం


💠 తన చిన్న కూతురు సతి శివుడిని వివాహం చేసుకోవడం ఇష్టం లేని దక్షుడు ఒక యజ్ఞం నిర్వహించాడని, దానికి అతను ఆ జంటను ఆహ్వానించలేదని నమ్ముతారు. 

సతి తన తండ్రిని ఎదుర్కోవడానికి శివుని నందిపై తన తండ్రి ఇంటికి వెళ్ళింది. యజ్ఞంలో ఉన్న అతిథుల ముందు దక్ష ఆమెను అవమానించారు .

మరిన్ని అవమానాలు భరించలేక, సతి యజ్ఞం యొక్క అగ్నిలో దూకి ఆత్మాహుతి చేసుకుంది. 


💠 శివుడు ఆ విషయం తెలుసుకున్నప్పుడు, అతను కోపంతో దక్షుని తలను నరికి శిక్షించాడు. విష్ణువు శివుడిని శాంతింపజేశాడు, ఆ తర్వాత అతను దక్షుని తలను మేక తలను పునరుద్ధరించాడు. 

కోపంగా ఉన్న శివుడిని శాంతింపజేయడానికి విష్ణువు ఈ ప్రదేశానికి తీసుకువచ్చాడు. 

అందుకే ఈ ఆలయానికి కోపేశ్వర్ (కోప దేవుడు) అనే అసాధారణ పేరు వచ్చింది. 


💠 శివలింగంతో పాటు విష్ణువు లింగ రూపంలో ఆలయంలో ఎందుకు ఉన్నాడనేది దీని అర్థం మరియు సతి తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళేటప్పుడు నందిపై స్వారీ చేస్తున్నందున ఈ ఆలయంలో నంది కనిపించదు.


🔅 చరిత్ర


💠 ప్రస్తుత ఆలయాన్ని మహారాష్ట్రకు చెందిన శిలహార రాజులు నిర్మించారు. వారు రాష్ట్రకూట సామంతులు. పురాణగాథతో పాటు, ఈ పేరు పట్టణం యొక్క పురాతన పేరు "కొప్పం" నుండి ఉద్భవించి ఉండవచ్చు. 


🔅 స్వర్గ మండపం


💠 స్వర్గ మండపంలోకి ప్రవేశించగానే, పై భాగంలో ఒక వృత్తాకార ద్వారం కనిపిస్తుంది. దీనికి 48 చేతితో చెక్కబడిన స్తంభాలు మద్దతు ఇస్తున్నాయి. స్వర్గ మండపం యొక్క అంచున గణేష్, కార్తికేయ స్వామి, కుబేరుడు, యమరాజు, ఇంద్రుడు మొదలైన వారి విగ్రహాలతో పాటు నెమలి, ఎలుక, ఏనుగు వంటి వాటి వాహక జంతువులు చెక్కబడ్డాయి. స్వర్గ మండపం మధ్యలో నిలబడి, సభ మండపం ప్రవేశ ద్వారం యొక్క ఎడమ వైపు గోడపై బ్రహ్మ విగ్రహాలను చూడవచ్చు. మధ్యలో, గర్భ గృహంలో ఉన్న శివ కోపేశ్వర శివలింగాన్ని మరియు కుడి వైపు గోడ వైపు విష్ణువు చెక్కిన విగ్రహం కనిపిస్తుంది. 


💠 ఆలయ దక్షిణ ద్వారానికి తూర్పున అమర్చబడిన రాతి పీఠంపై సంస్కృతంలో చెక్కబడిన శాసనం ఉంది , ఇది దేవనాగరి లిపిలో వ్రాయబడింది . 

ఈ ఆలయాన్ని 1136లో యాదవ్ రాజవంశానికి చెందిన రాజ్ సింఘదేవ్ పునరుద్ధరించారని అందులో పేర్కొన్నారు.


💠 లోపల దేవతల వివరణాత్మక శిల్పాలు దాని గోడలకు అందంగా ఉంటాయి మరియు బయట, క్లిష్టమైన వివరాలు జంతువులు మరియు మానవులను వర్ణిస్తాయి.


💠 ఈ అద్భుతమైన మతపరమైన ప్రదేశం ఆకర్షణీయమైన చారిత్రక వైభవం మధ్య అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవం కోసం సమీప మరియు దూర ప్రాంతాల నుండి సందర్శకులను ఆకర్షిస్తుంది. 

దాని ప్రశాంతమైన వాతావరణం మరియు అద్భుతమైన అందంతో, మీరు ఈ చారిత్రక మరియు గౌరవనీయమైన ఆలయం చూసి ఆకర్షితులవుతారు.


💠bప్రతి సంవత్సరం, కోపేశ్వర్ ఆలయంలో ఒక ఉత్సవం నిర్వహించబడుతుంది మరియు సమీప ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు. అంతేకాకుండా, సోమవారం మరియు మహాశివరాత్రి రోజుల్లో ఈ ఆలయం పెద్ద సంఖ్యలో భక్తులను ఆకర్షిస్తుంది.


💠 సమయాలు: 

ఉదయం 5.30 నుండి రాత్రి 8 గంటల వరకు.


💠 ఈ శైవ క్షేత్రం చేరటానికి సాంగ్లి నుండి 40 కి.మీ మరియు కొల్హాపూర్ నుండి 61 కి.మీ దూరం


రచన

©️ Santosh Kumarj

18-23-గీతా మకరందము

 18-23-గీతా మకరందము.

        మోక్షసన్న్యాసయోగము

    

      -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అII ఇంతదనుక మూడు విధములైన జ్ఞానములనుగూర్చి తెలిపి ఇక మూడు విధములైన కర్మలను గురించి తెలుపబోవుచు మొట్టమొదట సాత్త్వికకర్మనుగూర్చి చెప్పుచున్నారు –


నియతం సంగరహితం 

అరాగద్వేషతః కృతమ్

అఫలప్రేప్సునా కర్మ

యత్తత్సాత్త్వికముచ్యతే


తా:- శాస్త్రముచే నియమింపబడినదియు, ఫలాపేక్షగాని, ఆసక్తి (సంగము) అభిమానముగాని, రాగద్వేషములుగాని లేకుండ చేయబడునదియు సాత్త్వికకర్మ యనబడును.


వ్యాఖ్య: - కర్మను గురించి ఎచట చెప్పవలసివచ్చినను "నియతం, నియతం" అని భగవానుడు పదేపదే వాక్రుచ్చుచున్నారు. నియతమనగా వేదశాస్త్రాదులచే నియమింపబడినది అని యర్థము. వారివారికి తోచినదే సత్యమని భావించక జనులు శాస్త్రప్రమాణమునుగైకొని, దానితో తన యనుభవమును మేళవింపజేసికొని వ్యవహరింపవలెను. కనుకనే ఇష్టమువచ్చిన కర్మనుచేయక శాస్త్రనియతమగు కర్మనే చేయవలెనని యాదేశించుటకు కారణమైనది. "న హి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్యకర్మకృత్ " అనునట్లు ప్రపంచములో కర్మచేయక ఎవడును ఉండలేడుగనుక, కర్మయనునది నిత్యజీవితములో సర్వులకును అవశ్యకర్తవ్యమైయుండుటవలన దానిరహస్యమును ఎల్లరును బాగుగ తెలిసికొనియుండుట భావ్యమై యున్నది. కాబట్టి సాత్త్వికకర్మను గూర్చి భగవాను డిచట తెలిపిన ఈ భావములు సర్వులకును చాల ముఖ్యములైయున్నవి. కర్మ ఏప్రకారము ఉండవలెననగా -

(1) శాస్త్ర నియతమై యుండవలెను.

(2) సంగరహితముగ (ఆసక్తి, అభిమానములేకుండ) గావింపబడవలెను.

(3) రాగద్వేషములులేకుండ చేయబడవలెను. (4) ఫలాపేక్షలేక నొనర్చబడవలెను.

ఈ నాలుగు విధముల సరిపోయి ఆచరింపబడు కర్మ చిత్తశుద్ధికరమై, హృదయమాలిన్యనివారకమై, దోషభంజకమై, జ్ఞానదాయకమై, మోక్షప్రదమైయుండగలదు.


'సంగరహితమ్ - "బుద్దిర్యస్య న లిప్యతే' అని ఇదివరలో తెలుపబడినట్లు కర్మలందు అంటుకొనకయుండుటయే అసంగత్వము. అనగా "నేను చేయుచున్నాన"ను అభిమానముగాని,

మమత్వముగాని, ఆసక్తిగాని యుండరాదు. అట్టివాడు కర్మపాశముచే “ న నిబధ్యతే "- బంధింపబడనేరడని గీతాశయము. కావున సంగరహితముగ, ఫలాపేక్షావర్జితముగ కార్యముల నాచరించుటను అభ్యసింపవలెను.


" అరాగద్వేషతః" - పదార్థములపై రాగద్వేషములులేనపుడే సంగరహితముగ కార్యమాచరించుటకు వీలుపడును. మరియు ఫలాభిలాషను త్యజించుటకును అనుకూలపడును. కాబట్టి కర్మయొక్క శుద్ధత్వమున కీ రాగద్వేషరాహిత్యము అత్యంతావశ్యకమైయున్నది.


ప్ర:- సాత్త్వికకర్మయెట్టిది?

ఉ:- (1) శాస్త్రనియమితమైనది (2) సంగరహితముగ నాచరింపబడునది (3) రాగద్వేషవర్జితముగ నొనర్చబడునది (4) ఫలాభిలాషలేక గావింపబడునది - సాత్త్వికకర్మయనబడును.

తిరుమల సర్వస్వం -277*

 *తిరుమల సర్వస్వం -277*


*సుప్రభాత గానం 7*


 *పన్నెండవ శ్లోకం*


*"పద్మేశమిత్రశతపత్రగతాళివర్గాః* 

*హర్తుం శ్రియం కువలయస్య నిజాంగ లక్ష్మ్యా* 

*భేరీనినాదమివ బిభ్రతి తీవ్రనాదం* 

*శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్."*


*శ్లోకార్థం:*  


 సూర్యదేవునికి మిత్రులు, సూర్యోదయంతో వికసించే కలువపూల యొక్క కాడలలో నివసిస్తున్న తుమ్మెదలు మిసమిసలాడే తమ నల్లని మేని ఛాయతో నల్లకలువల మెరుపును మరపింప జేస్తూ; భేరీనినాదాన్ని తలపించేంత బిగ్గరగా ఝంకారం చేస్తున్నాయి. శేషాచల వాసా నీకు సుప్రభాతం.


 ఈ శ్లోకంలో మరోసారి తుమ్మెదలు, నల్లకలువల ప్రస్తావన వచ్చింది. శ్రీమహాలక్ష్మికి అత్యంత ప్రీతిపాత్రమైన కలువపూలను పదేపదే ప్రస్తావించడంలో ఆవగింజంతైనా ఆశ్చర్యం లేదు. అర్థాంగి అంటే ఆనందనిలయునికి అపరిమితమైన ఆదరాభిమానాలు కదా!


 ఈ శ్లోకంలో సూర్యభగవానుని ప్రసక్తి కూడా వచ్చింది. సూర్యుడు శ్రీవేంకటేశ్వరునికి పరమ భక్తుడే కాకుండా ఆప్తమిత్రుడు కూడా.


 సూర్యుని తొలికిరణాలతో పద్మం వికసించడం వల్ల, ఆ పద్మంలో నివసించే శ్రీమహాలక్ష్మికి కూడా సూర్యుడంటే పుట్టింటివారంత ప్రీతి. అదే కారణంతో, శ్రీవేంకటేశ్వరుడు పద్మావతిదేవితో తనకు జరుగబోయే పరిణయానికి తనపై అలిగి వైకుంఠం నుండి వెడలి కరివీరపురంలో (నేటి కోల్హాపూరు) నివాసముంటున్న శ్రీమహాలక్ష్మికి ఆహ్వానం, రాయబారం పంపించాడు. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడంతో శ్రీనివాసునికి సూర్యుడు మరింత ఆప్తుడయ్యాడు.


 అటువంటి పద్మాలను, సూర్యభగవానుణ్ణి పదే పదే తలపుకు తేవడం ద్వారా శ్రీవేంకటేశ్వరుని త్వరితగతిని మేల్కొలప వచ్చని అణ్ణన్ మహాశయులు భావించారు.


 అణ్ణన్ స్వామి తన భక్తి భావోద్వేగ తరంగాలను వ్యక్తపరచడం కోసం ఉపమానాలంకారన్ని కడు సమర్థవంతంగా ఉపయోగించుకున్నారు. ముందటి శ్లోకంలో కవ్వంతో మజ్జిగ చిలుకగా వచ్చే శబ్దాన్ని చల్లకుండలు దిక్కులతో తలపడుతుండగా వచ్చే భీకరశబ్దాలతో పోల్చగా; ఈ శ్లోకంలో తుమ్మెదల ఝంకారాన్ని యుద్ధభేరి నినాదంతో పోల్చారు. దిగ్దిగంతాలను ఏలే శ్రీనివాసుని సన్నిధిలో ఉత్పన్నమయ్యే చిరుధ్వని సైతం దిక్కులు పిక్కటిల్లేలా ఉంటుందేమో!!


 *పదమూడవ శ్లోకం*


*"శ్రీమన్నభీష్టవరదాఖిలలోకబంధో* 

*శ్రీ శ్రీనివాస జగదేకదయైకసింధో* 

*శ్రీదేవతాగృహభుజాంతరదివ్యమూర్తే* 

*శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతమ్"*


*శ్లోకార్థం* 


 శ్రీమహాలక్ష్మికి ప్రియతమమైన వానివి, కోరిన కొర్కెలు తీర్చేవానివి, విశ్వమంతటికీ ఆప్తుడైన వానివి, శ్రీమహాలక్ష్మికి నెలవైన వానివి అయిన నీవు విశ్వానికంతటికీ ఏకైక దయాసముద్రుడవై విలసిల్లుతున్నావు. శ్రీమహాలక్ష్మికి నిలయమైన దివ్యదేహముతో వెలుగొందే శ్రీవేంకటాచలాధీశా నీకు సుప్రభాతం.


 ఈ శ్లోకంలో శ్రీవేంకటేశ్వరుణ్ణి 'దయాసముద్రుని' గా సంబోధించడం ద్వారా వారి కరుణాంతరంగాన్ని కొనియాడటమే కాకుండా; క్షీరసాగరతనయ యైన శ్రీమహాలక్షిని కూడా తలపుకు తెచ్చుకున్నారు. లక్ష్మీదేవి క్షీరసాగరమథనంలో ఉద్భవించింది.


 అప్టైశ్వర్యాలకు అధినేత్రియైన శ్రీమహాలక్ష్మి కటాక్షించితేనే శ్రీవేంకటేశ్వరుడు సైతం సిరిసంపదలు చేకూర్చగలడు. వక్షస్థలంలో లక్ష్మీదేవిని ధరించడం వల్లనే శ్రీనివాసునికి అసమాన సౌందర్యం గల దివ్యరూపం సంప్రాప్తించింది. మనవల్ల జరిగే తప్పిదాలను సైతం అమ్మవారు మాతృహృదయంతో క్షమించి, శ్రీవారి ఆగ్రహాతిశయాన్నుండి కాపాడుతారు. అందువల్ల శ్రీమహాలక్ష్మిని శ్రీవేంకటేశ్వరునితో అభిన్నంగా భావిస్తూ, ఇరువురినీ ఏక కాలంలో స్తుతించడం జరిగింది.



 *పదునాల్గవ శ్లోకం* 


*"శ్రీ స్వామిపుష్కరిణికా ప్లవ నిర్మలాంగాః* 

*శ్రేయోర్థినో హరవిరించిసనందనాద్యాః* 

*ద్వారే వసంతి వరవేత్రహతోత్తమాంగాః* 

*శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్"*


*శ్లోకార్థం* 


 పరమశివుడు, బ్రహ్మదేవుడు, సనందాది మునీశ్వరులు స్వామిపుష్కరిణిలో పవిత్ర స్నానమాచరించి, పవిత్రశరీరులై; నీ దర్శనార్థం ఆలయద్వారం ముందు వేచియున్నారు. నిన్ను త్వరితంగా దర్శించుకోవాలనే అతృతతో వారు నీ ద్వారపాలకుల బెత్తం దెబ్బలు చవిచూస్తున్నారు.


 ఈ శ్లోకంలో తిరుమలక్షేత్రంలో కొలువై ఉన్న స్వామిపుష్కరిణి ప్రాశస్త్యాన్ని అన్యాపదేశంగా ఉదహరించడం జరిగింది. సృష్టి-లయకు కారణభూతులు, త్రిమూర్తులలో ఇరువురు అయిన బ్రహ్మరుద్రులు; బ్రహ్మ మానసపుత్రులైన సనందాది మునులు సైతం స్వామిపుష్కరిణిలో స్నానమాడి పవిత్రులయ్యారంటే ఆ పుష్కరిణి మహాత్మ్యాన్ని అవగాహన చేసుకోవచ్చు.


 స్వామివారి క్షణకాల దర్శనానికై ఆలయద్వారం ముందు వేచియుండే ఇక్కట్లు ఆనాడే ఉన్నాయన్నమాట. శ్రీవారి దర్శనార్థం ఈనాడు మనం చూస్తున్న తొక్కిసలాటలకు ఆనాడే నాందీప్రస్తావన జరిగింది. బ్రహ్మరుద్రాదులకు సైతం ద్వారపాలకులైన జయవిజయులతో బెత్తం దెబ్బలు తినే వెతలు తప్పలేదు. మనమెంత? 


 *సిఫారసులకు ఎగబడడం, వక్రమార్గాలు వెదకడం మాని ఓర్పుతో వేచియుండి, స్వామివారిని సరియైన రీతిలో దర్శించుకోవడం సర్వదా శ్రేయస్కరం. దేవుని ముందున్నా లేక క్యూ వరుసల్లో కాలం గడిపినా దైవసన్నిధిలో ఉన్నట్లే! క్షణకాల దర్శనం తోనే శ్రీవారి దివ్యమూర్తిని మన మనోఫలకంపై ముద్రించుకోవాలి. ఎంత త్వరగా, ఎన్నిసార్లు, ఎంతసేపు స్వామివారిని దర్శించుకున్నామన్న దానికంటే క్షణకాలమైనా ఎంత ఆర్తితో శ్రీవారి దివ్యసుందర విగ్రహాన్ని దర్శించు కున్నామన్నదే ముఖ్యం.* 


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*శల్య పర్వము ప్రథమాశ్వాసము*

*414 వ రోజు*

*కురుపాండవ యోధుల సమరం*


కౌరవసేనలో నిరాశా నిస్పృహలు ఆవరించాయి. ఇక కురుసామ్రాజ్యానికి అధిపతి ధర్మరాజు సుయోధనుడి పతనం తథ్యం అనుకున్నారు. అది గమనించిన సుయోధనుడు ఏనుగు దిగి ఒక రథం అధిరోహించి తన సైన్యం మధ్య తిరుగుతూ వారికి తన శాయ శక్తులా ధైర్యోత్సాహాలు కలిగిస్తూ " సైనికుల్లారా! వెనుకకు మరలండి పిరికి పందల్లా పారిపోకండి. విజయమో వీరస్వర్గమో తేల్చుకోండి మీరు పారి పోయినంత మాత్రాన శత్రువులు మిమ్ము విడువరు తరిమి తరిమి చంపుతారు. అలాంటి దిక్కులేని చావు చచ్చేకంటే వీరోచితంగా పోరాడి మరణించి వీరస్వర్గం అలంకరించండి. మన బలం ఎక్కువగా ఉంది పాండవుల బలం తక్కువగా ఉంది. మనం తప్పక గెలుస్తాము " అన్నాడు. ఆ మాటలకు కౌరవసేనలో ధైర్యోత్సాహాలు పెల్లుబుకి రణభూమికి తిరిగి వచ్చారు. వారంతా భీమసేనుడిని చుట్టుముట్టారు. భీముడు తనగద తీసుకుని కౌరవసేనలో మారణహోమం సృష్టించి ఒక్క దెబ్బకు ఇరవై ఒక్క వేలమందిని యమసదనానికి పంపాడు. మరొక పక్క అర్జునుడు కౌరవసేనలకు తన గాండీవం నుండి వెలువడే బాణాల రుచి చూపిస్తున్నాడు. నకులుడు, సహదేవుడు, సాత్యకి శకునిని ఎదుర్కొన్నారు. శకుని కూడా వారిని ధైర్యంతో ఎదుర్కొన్నాడు. ఇంతలో సాళ్వుడు ఏనుగు ఎక్కి పాండవసేనలో ప్రవేశించి పాండవ సేనను కకావికలు చేస్తున్నాడు. సాళ్వుని ధృష్టద్యుమ్నుడు ఎదుర్కొని తన బాణంతో సాళ్వుని ఏనుగు కుంభస్థలం మీద కొట్టాడు. ఆ దెబ్బకు సాళ్వుని ఏనుగు పారి పోయింది. సాళ్వుడు దానిని దారికి తెచ్చికుని ధృష్టద్యుమ్నుడిని ఎదుర్కొన్నాడు. సాళ్వుని ఏనుగు ధృష్టద్యుమ్నుడి రథాన్ని పైకి ఎత్తింది. అది గమనించిన ధృష్టద్యుమ్నుడు తన గద తీసుకుని కిందికి దూకాడు. భీముడు, సాత్యకి, శిఖండి కూడా సాళ్వుని ఎదుర్కొన్నారు. సాళ్వుడు కూడా అత్యంత ధైర్యసాహసాలతో వారిని ఎదుర్కొన్నాడు. ధృష్టద్యుమ్నుడు తనగదతో సాళ్వుని కుంభస్థలం మీద కొట్టాడు. ఆ దెబ్బకు ఏనుగు కింద పడిపోయింది. సాత్యకి ఒకే దెబ్బతో సాళ్వుని తెల తెగనరికాడు. సాళ్వుని మరణం చూసి కౌరవ సేన పారిపోసాగింది. కృతవర్మ వారిలో ధైర్యోత్సాహలు కలిగించాడు. సాత్యకి ఎనిమిది పదునైన బాణములతో కృతవర్మను కొట్టాడు. కృతవర్మ సాత్యకి విల్లు విరిచాడు. సాత్యకి మరొక విల్లందుకుని కృతవర్మ సారథిని హయములను చంపాడు. కృతవర్మ విరధుడై ఒక శూలం తీసుకున్నాడు. అది చూసి కృపాచార్యుడు తన రథంలో కృతవర్మను ఎక్కించుకుని అక్కడి నుండి తీసుకు వెళ్ళాడు. అప్పటికి కురుసైన్యం చెదిరి పోయింది. నీ కుమారుడు సుయోధనుడు పాండవులను ఒంటరిగా ఎదుర్కొన్నాడు. పాండవ యోధులంతా చేరి సుయోధనుడిని ఎదుర్కొన్నారు. అంతటా తానై సుయోధనుడు యుద్ధం చేస్తూ ధర్మరాజు మీద నూరు బాణములు భీముని మీద డెబ్బై బాణములు వేసాడు. సహదేవుడు సుయోధనుడిని ఎదిరించారు. కురుసైన్యం ప్రాణముల మీద ఆశ వదులుకుని యుద్ధం చేస్తుంది. శకుని ధర్మరాజు రథాశ్వాలను చంపాడు. సహదేవుడు ధర్మరాజును తన రథం మీద ఎక్కించుకున్నాడు. ధర్మరాజు శకునిని బాణ వర్షంలో తడిపాడు. సుయోధనుడు ధృష్టద్యమ్నుడి విల్లు విరిచాడు. ధృష్టద్యుమ్నుడు మరొక బాణం తీసుకుని సుయోధనుడి మీద బాణ ప్రయోగం చేసాడు. అంతలో ఉపపాండవులు సుయోధనుడిని ఎదుర్కొన్నారు. ధర్మరాజు మూడు శరములతో కృపాచార్యుని కొట్టి నాలుగు బాణములతో కృతవర్మ హయములను చంపాండు. అశ్వత్థామ కృతవర్మను తన రథం మీద ఎక్కించుకుని తీసుకు వెళ్ళాడు. సుయోధనుడు ఏడు వందల రథములతో ధర్మరాజును చుట్టుముట్టాడు. శిఖండి విజృంభించి ఆ రథములను తన బాణములతో ఖండించాడు. శకుని తన సేనలతో ధర్మరాజును ఎదుర్కొన్నాడు. ధర్మరాజు సహదేవుని పిలిచి శకునిని ఎదుర్కొమ్మని అదేశించాడు. శకుని సహదేవుల మధ్య యుద్ధం ఘోరంగా జాగుతుంది. ఇరుపక్షాల అయిదు వేల మూడు వందల ఏనుగులు నేల కూలాయి. యుద్ధ భూమి అంతా పీనుగుల పెంట అయింది. మిగిలిన ఏడు వందల హయములతో శకుని తప్పించుకున్నాడు. శకుని సుయోధనుడి వద్దకు వెళ్ళి " ముందు పాండవుల వద్దకు వెళ్ళి వారి గజబలమును అశ్వబలమును తుద ముట్టించాలి. తరువాత కాల్బలములను నాశనం చేయవచ్చు" అన్నాడు. శకుని మాటలు విని సుయోధనుడు తన గజ, అశ్వబలాలను సమాయత్తం చేసాడు


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కన్నడ భాష తమిళం

 


శ్రీభారత్ వీక్షకులకు శుభాకాంక్షలు 🌹 కన్నడ భాష తమిళం నుంచి పుట్టిందంటూ ఇటీవల బయల్దేరిన ఒక వివాదం ఎంత అర్ధరహితమో సోదాహరణంగా వివరిస్తున్నారు భాషా పరిశోధకురాలైన డా. తిరుమల నీరజ గారు. తమిళుల భాషా దురభిమానం ఎంతగా శ్రుతి మించుతున్నదో వినాల్సిందే. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

అంతర్జాతీయ యోగా దినోత్సవ

 అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా 

సనాతన ధర్మం లో మన ప్రాచీన శాస్త్రజ్ఞులైన ఋషులు, ప్రకృతి పై లోతైన పరిశోధనలతో పాటు మనిషి శరీరధర్మములను నిశితంగా గమనించి  ప్రతి మనిషీ నిత్యజీవితములో ఆరోగ్యంగా  ఉండటానికి ఒక సమగ్రమైన నిత్యజీవన విధానం నిర్దేశించినారు. 

అందులో భాగంగా, వారు మనకు అందించిన విజ్ఞానమే యోగ శాస్త్రము. 

యోగము అనగా కలయిక అని అర్ధము. శరీరము, మనస్సు మరియు ఆలోచనలనల కలయిక విధానమే యోగము. ఇది యమ, నియమ, ఆసన, ప్రాణాయామ  ప్రత్యాహార, ధ్యాన, ధారణ  సమాధి అనే ఎనిమిది పురోగమన విధానాలుగా వుంటుంది. ఇవన్నీ అష్టాంగ యోగములు గా కూడా చెప్పుకుంటాము. 

ఇందులో ప్రాధమిక యోగము యమము అయితే అత్యున్నతమైనది సమాధి యోగము. సమాధి స్థితి లో మనిషి జన్మ పరిపూర్ణమై సిద్ధి పొందటం జరుగుతుంది.  

మొదటి నాలుగు, అనగా “యమ, నియమ, ఆసన, ప్రాణాయామ” యోగ విధానాలు దైనందిన జీవితములో ప్రతి ఒక్కరూ అభ్యాసము చేయవలసినవి. వీటి సాధన వలన సాధకుడు మంచి ఆరోగ్యముతో, మంచి ఆలోచనలతో ఎల్లప్పుడూ సుఖంగా వుంటాడు. 

*వీటిలోని “ఆసన” మరియు “ప్రాణాయామ” యోగ విధానములే నేటి కాలములో ఒక చికిత్సా విధానంగా “యోగా” గా బహుళ ప్రచారం పొందుతున్నాయి.*

*యమము, నియమము* అనేవి పది సామాన్య ధర్మాలు, ప్రతి మనిషీ  పాటించవలసినవి.అవి: 

1. *అహింస:*. ఇతరులు నాకు ఏమి చేస్తే నా శరీరానికి, మనసుకు బాధ కలుగుతుందో అది నేను ఇతరుల పట్ల చేయకూడదు.

2. *సత్యవాదం:* అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడం, అబద్ధాలు చెప్పకపోవడం. 

3. *అస్తేయం:* ఒకరి వస్తువు తీసుకోకూడదు. తనకు ఉన్నదానితో తృప్తిపడటం.

4. *బ్రహ్మచర్యం:* నిరంతరం జిజ్ఞాస తో కొత్త విషయాలు నేర్చుకుంటూ వుండాలి, పవిత్రమైన జీవితం గడపాలి, త్రికరణములు (మనోవాక్కాయకర్మలు ) శుద్ధిగా ఉంచుకోవాలి.

5. *అపరిగ్రహం:* ఎంత అవసరమో అంతే సంపాదించడం,లేదా ఇతరులనుండి వారి అనుమతితో తీసుకోవడం.

6. *శౌచం:* శారీరక, మానసిక పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతను పాటించడం. శరీరము మాదిరే మనసును కూడా ఎల్లప్పుడు నిర్మలంగా శుభ్రంగా ఉంచుకోవడం.

7. *సంతోషము:* ఉన్నదానితో తృప్తిపడటం, అసూయ, ద్వేషము ఉండకూడదు.

8. *తపస్సు:* స్వీయ క్రమశిక్షణ, ప్రతి పనిని శ్రద్దగా ఏకాగ్రతతో, నిష్కామబుద్ధితో, కర్తృత్వ భావనలేకుండా చేయడం.

9. *స్వాధ్యాయము:* శాస్త్రములు చదువుతూఉండాలి. ఏదో ఒక ప్రయోజనకరమైన కొత్త విషయం నేర్చుకుంటూ ఉండాలి.

10. *సమర్పణ లేదా అంకితం:* చేసే ప్రతి పనీ భగవంతుడి దయ తోనే చేయగలిగాము అనుకోవాలి. అహంకారభావన వదిలివేయాలి.   

ఇవన్నీ పాటిస్తూ “ఆసనములు”, “ప్రాణాయామము” చేయువారే  ప్రాధమిక స్థాయి లో *యోగులు* అవుతారు. మంచి ఆరోగ్యముతో దీర్ఘాయుష్కులుగా వుంటారు. 

“ప్రత్యాహార” యోగమునుండి మిగిలిన యోగములు (అంటే ప్రత్యాహార, ధ్యాన,  ధారణ, సమాధి) అభ్యాసం చేస్తే ముక్తి సాధకులయ్యే *ఉన్నత స్థాయి* యోగులవుతారు.

అందరం - యోగశాస్త్ర విజ్ఞానం పెంచుకుందాం, పంచుకుందాం. 

యోగా చేద్దాం. ఆరోగ్యంగా ఉందాం - అని, ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భముగా ప్రతిజ్ఞ చేద్దాం. ఎల్లప్పుడూ ఆరోగ్యంగా వుందాము.