21, జూన్ 2025, శనివారం

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*శల్య పర్వము ప్రథమాశ్వాసము*

*414 వ రోజు*

*కురుపాండవ యోధుల సమరం*


కౌరవసేనలో నిరాశా నిస్పృహలు ఆవరించాయి. ఇక కురుసామ్రాజ్యానికి అధిపతి ధర్మరాజు సుయోధనుడి పతనం తథ్యం అనుకున్నారు. అది గమనించిన సుయోధనుడు ఏనుగు దిగి ఒక రథం అధిరోహించి తన సైన్యం మధ్య తిరుగుతూ వారికి తన శాయ శక్తులా ధైర్యోత్సాహాలు కలిగిస్తూ " సైనికుల్లారా! వెనుకకు మరలండి పిరికి పందల్లా పారిపోకండి. విజయమో వీరస్వర్గమో తేల్చుకోండి మీరు పారి పోయినంత మాత్రాన శత్రువులు మిమ్ము విడువరు తరిమి తరిమి చంపుతారు. అలాంటి దిక్కులేని చావు చచ్చేకంటే వీరోచితంగా పోరాడి మరణించి వీరస్వర్గం అలంకరించండి. మన బలం ఎక్కువగా ఉంది పాండవుల బలం తక్కువగా ఉంది. మనం తప్పక గెలుస్తాము " అన్నాడు. ఆ మాటలకు కౌరవసేనలో ధైర్యోత్సాహాలు పెల్లుబుకి రణభూమికి తిరిగి వచ్చారు. వారంతా భీమసేనుడిని చుట్టుముట్టారు. భీముడు తనగద తీసుకుని కౌరవసేనలో మారణహోమం సృష్టించి ఒక్క దెబ్బకు ఇరవై ఒక్క వేలమందిని యమసదనానికి పంపాడు. మరొక పక్క అర్జునుడు కౌరవసేనలకు తన గాండీవం నుండి వెలువడే బాణాల రుచి చూపిస్తున్నాడు. నకులుడు, సహదేవుడు, సాత్యకి శకునిని ఎదుర్కొన్నారు. శకుని కూడా వారిని ధైర్యంతో ఎదుర్కొన్నాడు. ఇంతలో సాళ్వుడు ఏనుగు ఎక్కి పాండవసేనలో ప్రవేశించి పాండవ సేనను కకావికలు చేస్తున్నాడు. సాళ్వుని ధృష్టద్యుమ్నుడు ఎదుర్కొని తన బాణంతో సాళ్వుని ఏనుగు కుంభస్థలం మీద కొట్టాడు. ఆ దెబ్బకు సాళ్వుని ఏనుగు పారి పోయింది. సాళ్వుడు దానిని దారికి తెచ్చికుని ధృష్టద్యుమ్నుడిని ఎదుర్కొన్నాడు. సాళ్వుని ఏనుగు ధృష్టద్యుమ్నుడి రథాన్ని పైకి ఎత్తింది. అది గమనించిన ధృష్టద్యుమ్నుడు తన గద తీసుకుని కిందికి దూకాడు. భీముడు, సాత్యకి, శిఖండి కూడా సాళ్వుని ఎదుర్కొన్నారు. సాళ్వుడు కూడా అత్యంత ధైర్యసాహసాలతో వారిని ఎదుర్కొన్నాడు. ధృష్టద్యుమ్నుడు తనగదతో సాళ్వుని కుంభస్థలం మీద కొట్టాడు. ఆ దెబ్బకు ఏనుగు కింద పడిపోయింది. సాత్యకి ఒకే దెబ్బతో సాళ్వుని తెల తెగనరికాడు. సాళ్వుని మరణం చూసి కౌరవ సేన పారిపోసాగింది. కృతవర్మ వారిలో ధైర్యోత్సాహలు కలిగించాడు. సాత్యకి ఎనిమిది పదునైన బాణములతో కృతవర్మను కొట్టాడు. కృతవర్మ సాత్యకి విల్లు విరిచాడు. సాత్యకి మరొక విల్లందుకుని కృతవర్మ సారథిని హయములను చంపాడు. కృతవర్మ విరధుడై ఒక శూలం తీసుకున్నాడు. అది చూసి కృపాచార్యుడు తన రథంలో కృతవర్మను ఎక్కించుకుని అక్కడి నుండి తీసుకు వెళ్ళాడు. అప్పటికి కురుసైన్యం చెదిరి పోయింది. నీ కుమారుడు సుయోధనుడు పాండవులను ఒంటరిగా ఎదుర్కొన్నాడు. పాండవ యోధులంతా చేరి సుయోధనుడిని ఎదుర్కొన్నారు. అంతటా తానై సుయోధనుడు యుద్ధం చేస్తూ ధర్మరాజు మీద నూరు బాణములు భీముని మీద డెబ్బై బాణములు వేసాడు. సహదేవుడు సుయోధనుడిని ఎదిరించారు. కురుసైన్యం ప్రాణముల మీద ఆశ వదులుకుని యుద్ధం చేస్తుంది. శకుని ధర్మరాజు రథాశ్వాలను చంపాడు. సహదేవుడు ధర్మరాజును తన రథం మీద ఎక్కించుకున్నాడు. ధర్మరాజు శకునిని బాణ వర్షంలో తడిపాడు. సుయోధనుడు ధృష్టద్యమ్నుడి విల్లు విరిచాడు. ధృష్టద్యుమ్నుడు మరొక బాణం తీసుకుని సుయోధనుడి మీద బాణ ప్రయోగం చేసాడు. అంతలో ఉపపాండవులు సుయోధనుడిని ఎదుర్కొన్నారు. ధర్మరాజు మూడు శరములతో కృపాచార్యుని కొట్టి నాలుగు బాణములతో కృతవర్మ హయములను చంపాండు. అశ్వత్థామ కృతవర్మను తన రథం మీద ఎక్కించుకుని తీసుకు వెళ్ళాడు. సుయోధనుడు ఏడు వందల రథములతో ధర్మరాజును చుట్టుముట్టాడు. శిఖండి విజృంభించి ఆ రథములను తన బాణములతో ఖండించాడు. శకుని తన సేనలతో ధర్మరాజును ఎదుర్కొన్నాడు. ధర్మరాజు సహదేవుని పిలిచి శకునిని ఎదుర్కొమ్మని అదేశించాడు. శకుని సహదేవుల మధ్య యుద్ధం ఘోరంగా జాగుతుంది. ఇరుపక్షాల అయిదు వేల మూడు వందల ఏనుగులు నేల కూలాయి. యుద్ధ భూమి అంతా పీనుగుల పెంట అయింది. మిగిలిన ఏడు వందల హయములతో శకుని తప్పించుకున్నాడు. శకుని సుయోధనుడి వద్దకు వెళ్ళి " ముందు పాండవుల వద్దకు వెళ్ళి వారి గజబలమును అశ్వబలమును తుద ముట్టించాలి. తరువాత కాల్బలములను నాశనం చేయవచ్చు" అన్నాడు. శకుని మాటలు విని సుయోధనుడు తన గజ, అశ్వబలాలను సమాయత్తం చేసాడు


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: