21, జూన్ 2025, శనివారం

రామాయణం

 🌹🌷🏹🪔🛕🪔🏹🌷🌹

*🚩శనివారం 21 జూన్ 2025🚩*

``

           *రామాయణం*


ఒకసారి చదివినంత 

మాత్రాన మన సమస్త 

పాపాలని తీసేస్తుంది.

``

     *వాల్మీకి రామాయణం*                

            *75వ  భాగం*


*రక్షితా జీవలోకస్య ధర్మస్య పరి రక్షితా।*

*రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా॥*

```

హనుమంతుడు అన్నాడు… 

“రాముడంటే మూర్తీభవించిన ధర్మం, తన ధర్మాన్ని తాను రక్షించుకుంటాడు, ఇతరుల ధర్మాన్ని కూడా రక్షిస్తాడు.”

```

*రామః కమల పత్రాక్షః సర్వసత్వ మనోహరః।*

*రూప దాక్షిణ్య సంపన్నః ప్రసూతో జనకాత్మజే॥*```


“రాముడు పద్మముల వంటి కన్నులున్నవాడు, అన్ని ప్రాణులు ఆయనని చూసి ఆనందపడతాయి, ఆయనకి ఇవన్నీ పుట్టుకతో వచ్చాయి తల్లీ!”


``` *తేజసా ఆదిత్య సంకాశః*  

*క్షమయా పృథివీ సమః।*

*బృహస్పతి సమో బుద్ధ్యా యశసా వాసవో సమః॥*```


“తేజస్సులో సూర్యుడితో సమానమైనవాడు, క్షమించడంలో భూమితో సమానమైనవాడు, బుద్ధియందు బృహస్పతితో సమానమైనవాడు, కీర్తినందు ఇంద్రుడితో సమానమైనవాడు. రాముడికి యజుర్వేదము, ధనుర్వేదము, వేదవేదాంగములు తెలుసు” అని చెపుతూ, రాముడి కాలిగోళ్ళ నుంచి శిరస్సు మీద ఉండే వెంట్రుకల వరకూ ఏ ఒక్క అవయవాన్ని విడిచిపెట్టకుండా హనుమంతుడు వర్ణించాడు. అలానే “అమ్మా! రాముడు మర్యాదా పురుషోత్తముడు. ఎవరిని, ఎప్పుడు, ఏ లోకంలో, ఎలా కాపాడాలో తెలిసున్నవాడు, నడువడి ప్రధానమైనవాడు రాముడంటే. ఆయన కర్త, కారణమై ఈ సమస్త జగత్తునందు నిండిపోయాడు.”


```

*వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః।*

*రామనామాంకితం చేదం పశ్య దేవ్యంహుళీయకం॥*


*ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మనా।*

*సమాశ్వసిహి భద్రం తే క్షీణ దుఃఖఫలా హ్యసి॥*

```

(ఈ శ్లోకాలు పరమ పావనమైనవి, వీటిని సుందరకాండలో మంత్రం అంటారు. సీతమ్మకి ఉన్న బాధని హనుమ ఈ మాటల చేత పోగొట్టాడు, 10 నెలల తరువాత సీతమ్మ ఈ మాటలు విని ఆనందపడింది)


“అమ్మా! నేను వానరుడిని, రాముడి పలుకున వచ్చిన రామదూతని. రామ రామనామాంకితమైన ఉంగరాన్ని నీకు తీసుకొచ్చాను, నీకు నమ్మకం కలగడం కోసమని రాముడు దీనిని నాకిచ్చి పంపించాడు. ఈ ఉంగరాన్ని తీసుకున్నాక ఇవ్వాల్టితో నీ కష్టాలన్నీ పోయాయి, ఇక నువ్వు ఉపశాంతిని పొందుతావు” అన్నాడు.


హనుమంతుడు ఇచ్చిన ఆ ఉంగరాన్ని ముట్టుకోగానే సీతమ్మ సిగ్గుపడింది. రాముడినే చూసినంత ఆనందాన్ని సీతమ్మ పొందినదై, ఆ ఉంగరాన్ని కన్నులకి అద్దుకొని పరవశించిపోయింది.


హనుమంతుడు ఇచ్చిన ఉంగరాన్ని తీసుకున్న సీతమ్మ “నాయనా హనుమా! లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, కోసల దేశంలో ఉన్న సమస్త జనులు, సుగ్రీవుడు, వానరములు కుశలమే కదా” అని పలు ప్రశ్నలు అడిగాక,  “రాముడికి నాకన్నా ఎక్కువైనవారు ఎవరూ లేరు, నేను పక్కన లేకపోవడం వల్ల రాముడు తాను ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించడంలో వైక్లవ్యాన్ని పొందలేదు కదా? రాముడు కేవలము తన పౌరుషము మీదనే ఆధారపడి, దైవమును తిరస్కరించి తిరుగుతున్నాడా, లేక తన పౌరుషాన్ని పూర్తిగా విడిచిపెట్టి కేవలం భగవంతుడిని మాత్రమే విశ్వసించి తిరుగుతున్నాడా? రాముడికి నేను జ్ఞాపకం ఉన్నానా, నన్ను తలుచుకుంటున్నాడా. రావణుడిని, రాక్షసులని నిగ్రహించాలంటే రాముడు అక్కడినుండి అస్త్రప్రయోగం చెయ్యలేడా? రాముడు అస్త్రప్రయోగం చెయ్యకుండా నాయందు ఎందుకు ఉపేక్ష వహించాడు? నాకు రావణుడు 12 నెలల గడువు ఇచ్చాడు, అందులో 10 నెలల కాలం పూర్తయిపోయింది. ఇంక 2 నెలలు మాత్రమే వాడు నన్ను బతకనిస్తాడు. కాని నేను ఒక నెల మాత్రమే బతికి ఉంటాను. ఈ ఒక నెల లోపల రాముడు వచ్చి నన్ను విడిపిస్తే సరి, ఒకవేళ రాముడు రాకపోతే నేను ప్రాణములను విడిచిపెట్టేస్తాను. నేను ఇంక ఒక నెల మాత్రమే జీవించి ఉంటాను అని రాముడికి నివేదించు” అంది.


సీతమ్మ అలా బాధపడుతూ చెప్పిన మాటలని విన్న హనుమంతుడు శిరస్సు మీద చేతులు పెట్టుకొని… 

“ఎందుకమ్మా అలా ఖేద పడతావు. మలయము, వింధ్యము, మేరు మొదలైన పర్వతముల మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను, మా వానరములు తినే కందమూలముల మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను, రాముడు నీయందు విశేషమైన ప్రేమతో ఉన్నాడు. ఆయన ఎంతగా తపిస్తుంటాడంటే, ఎక్కడైనా ఒక అందమైన పద్మము కనపడితే 'హా సీతా, హా సీతా' అంటున్నాడు. వానప్రస్థులలాగ రాముడు కూడా సూర్యాస్తమయం అయ్యాక సాత్వికమైన ఆహారాన్ని తీసుకుంటున్నాడు. నిరంతరము నీగురించే ధ్యానము చేస్తున్నాడు, ప్రతిక్షణం శోకిస్తూనే ఉన్నాడు. రాముడు ప్రస్రవణ పర్వతం గుహలో పడుకుని ఉన్నప్పుడు ఆయన ఒంటి మీద నుంచి తేళ్ళు, జర్రులు, పాములు పాకినా కాని ఆయనకి స్పృహ ఉండడం లేదు. 100 యాగములు చేసి ఐరావతం మీద కూర్చున్న ఇంద్రుడి దగ్గర శచీదేవి ఉన్నట్టు, ప్రస్రవణ పర్వత గుహలో కూర్చున్న రాముడి దగ్గరికి నిన్ను తీసుకెళ్ళి దింపుతానమ్మా. యజ్ఞంలో వేసిన హవిస్సుని హవ్యవాహనుడైన అగ్నిదేవుడు ఎంత పరమపవిత్రంగా తీసుకెళతాడో, అలా నిన్ను తీసుకెళ్ళి రాముడి పాదాల దగ్గర పెడతాను. అమ్మా! నువ్వు వచ్చి నా వీపు మీద కుర్చో” అన్నాడు.


కాని హనుమంతుడు అప్పటిదాక చాలా చిన్నగా ఉండడం వలన, సీతమ్మ హనుమని చూసి ఫక్కున నవ్వి… “ఎంతమాట అన్నావోయి హనుమ. నువ్వే ఇంత స్వరూపం, ఆ వీపు మీద నేను కూర్చోనా, నన్ను ఈ సముద్రాన్ని దాటించి తీసుకెళతావా. నీ వానర బుద్ధిని బయటపెట్టావు కదా” అంది.


సీతమ్మ మాటకి అలిగిన హనుమంతుడు తన స్వరూపాన్ని సీతమ్మకి చూపించాలి అనుకొని, మేరు పర్వత శిఖరాలు ఆకాశాన్ని చుంబిస్తున్నట్టు ఎలా ఉంటాయో, అలా పర్వత స్వరూపాన్ని పొందాడు. 


అప్పుడు హనుమంతుడు పెద్ద పాదాలతో, బలిసిన తొడలతో, సన్నటి నడుముతో, విశాలమైన వక్షస్థలంతో, శంఖంలాంటి కంఠంతో, కాల్చిన పెనంలాంటి ముఖంతో, పచ్చటి కన్నులతో, పెద్ద శిరోజములతో, పరిఘలవంటి భుజములతో నిలబడ్డాడు.```


        *రేపు…76వ భాగం*


*🚩జై శ్రీరామ్.!   జై శ్రీ రామ్.!🚩*                           

       *🙏జై జై శ్రీ రామ్.!🙏*


                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏

కామెంట్‌లు లేవు: