21, జూన్ 2025, శనివారం

18-23-గీతా మకరందము

 18-23-గీతా మకరందము.

        మోక్షసన్న్యాసయోగము

    

      -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అII ఇంతదనుక మూడు విధములైన జ్ఞానములనుగూర్చి తెలిపి ఇక మూడు విధములైన కర్మలను గురించి తెలుపబోవుచు మొట్టమొదట సాత్త్వికకర్మనుగూర్చి చెప్పుచున్నారు –


నియతం సంగరహితం 

అరాగద్వేషతః కృతమ్

అఫలప్రేప్సునా కర్మ

యత్తత్సాత్త్వికముచ్యతే


తా:- శాస్త్రముచే నియమింపబడినదియు, ఫలాపేక్షగాని, ఆసక్తి (సంగము) అభిమానముగాని, రాగద్వేషములుగాని లేకుండ చేయబడునదియు సాత్త్వికకర్మ యనబడును.


వ్యాఖ్య: - కర్మను గురించి ఎచట చెప్పవలసివచ్చినను "నియతం, నియతం" అని భగవానుడు పదేపదే వాక్రుచ్చుచున్నారు. నియతమనగా వేదశాస్త్రాదులచే నియమింపబడినది అని యర్థము. వారివారికి తోచినదే సత్యమని భావించక జనులు శాస్త్రప్రమాణమునుగైకొని, దానితో తన యనుభవమును మేళవింపజేసికొని వ్యవహరింపవలెను. కనుకనే ఇష్టమువచ్చిన కర్మనుచేయక శాస్త్రనియతమగు కర్మనే చేయవలెనని యాదేశించుటకు కారణమైనది. "న హి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్యకర్మకృత్ " అనునట్లు ప్రపంచములో కర్మచేయక ఎవడును ఉండలేడుగనుక, కర్మయనునది నిత్యజీవితములో సర్వులకును అవశ్యకర్తవ్యమైయుండుటవలన దానిరహస్యమును ఎల్లరును బాగుగ తెలిసికొనియుండుట భావ్యమై యున్నది. కాబట్టి సాత్త్వికకర్మను గూర్చి భగవాను డిచట తెలిపిన ఈ భావములు సర్వులకును చాల ముఖ్యములైయున్నవి. కర్మ ఏప్రకారము ఉండవలెననగా -

(1) శాస్త్ర నియతమై యుండవలెను.

(2) సంగరహితముగ (ఆసక్తి, అభిమానములేకుండ) గావింపబడవలెను.

(3) రాగద్వేషములులేకుండ చేయబడవలెను. (4) ఫలాపేక్షలేక నొనర్చబడవలెను.

ఈ నాలుగు విధముల సరిపోయి ఆచరింపబడు కర్మ చిత్తశుద్ధికరమై, హృదయమాలిన్యనివారకమై, దోషభంజకమై, జ్ఞానదాయకమై, మోక్షప్రదమైయుండగలదు.


'సంగరహితమ్ - "బుద్దిర్యస్య న లిప్యతే' అని ఇదివరలో తెలుపబడినట్లు కర్మలందు అంటుకొనకయుండుటయే అసంగత్వము. అనగా "నేను చేయుచున్నాన"ను అభిమానముగాని,

మమత్వముగాని, ఆసక్తిగాని యుండరాదు. అట్టివాడు కర్మపాశముచే “ న నిబధ్యతే "- బంధింపబడనేరడని గీతాశయము. కావున సంగరహితముగ, ఫలాపేక్షావర్జితముగ కార్యముల నాచరించుటను అభ్యసింపవలెను.


" అరాగద్వేషతః" - పదార్థములపై రాగద్వేషములులేనపుడే సంగరహితముగ కార్యమాచరించుటకు వీలుపడును. మరియు ఫలాభిలాషను త్యజించుటకును అనుకూలపడును. కాబట్టి కర్మయొక్క శుద్ధత్వమున కీ రాగద్వేషరాహిత్యము అత్యంతావశ్యకమైయున్నది.


ప్ర:- సాత్త్వికకర్మయెట్టిది?

ఉ:- (1) శాస్త్రనియమితమైనది (2) సంగరహితముగ నాచరింపబడునది (3) రాగద్వేషవర్జితముగ నొనర్చబడునది (4) ఫలాభిలాషలేక గావింపబడునది - సాత్త్వికకర్మయనబడును.

కామెంట్‌లు లేవు: