5, అక్టోబర్ 2025, ఆదివారం

అనగనగా

 🔔 *అనగనగా...* 🔔


పూర్వం శ్రీ రామచంద్రుని తాతగారైన రఘుమహారాజు ధర్మవర్తనుడై ప్రజలను పాలించేవాడు.


ఆ మహానుభావుని రాజ్యంలో అనేక గురుకులాలుండేవి. ఒక్కొక్క గురుకులం లో వేయి తక్కువ కాకుండా శిష్యులుండే వారు. ఆ కాలంలో గురు శిష్యుల అనుబంధం చాలా విశేషంగా ఉండేది.


ఒకానొక గురుకులంలో ఓ శిష్యుని శిక్షణ పూర్తి అయింది. గురువుగారు “నాయనా! నాకు తెలిసిన విద్యలన్నీ నీకు నేర్పాను. నీవూ శ్రమించి శ్రద్ధగా విద్యను అభ్యసించావు. ఇక గృహస్థాశ్రమును స్వీకరించి సమాజ కళ్యాణానికి ఉపకరించు. శాస్త్ర పఠనం మొదలైనవి ఎప్పటికీ మఱువకు” అని అన్నారు.


శిష్యుడైన‘కౌత్సుడు’వినయపూర్వకంగా ఇలా జవాబిచ్చాడు “అయ్యా! నాకు విద్యాబుద్ధులు నేర్పించి సంస్కార వంతుడిని చేశారు. తల్లిదండ్రులను మఱిపించే ప్రేమాభిమానాలు చూపారు. కృతజ్ఞతా చిహ్నంగా గురుదక్షిణను ఇచ్చే అవకాశాన్ని ప్రసాదించండి”


“నిరుపేదవు నీవేమి ఇచ్చుకుంటావు నాయనా” అంటూ ఏమీ వద్దని ఎంతో నచ్చచెప్పాడు గురువు.


ఎంత చెప్పినా వినని కౌత్సునితో విసిగి ఈతనిని పరీక్షిద్దామని గురువు ఇలా అన్నాడు “నీకు 14 విద్యలు నేర్పాను. ఒక మనిషి ఏనుగుపై నిలబడి రివ్వున ఓ రాయి విసిరితే ఎంత ఎత్తు వెళుతుందో అంత ధనరాశులు 14 ఇమ్ము”అన్నాడు.


గురుదక్షిణ ఇద్దామన్న సత్సంకల్పమే కాని అది ఎలా నెరవేర్చాలో తెలియలేదు కౌత్సునికి.


రాజు తండ్రి వంటివాడు అని తలచి రఘుమహారాజు వద్దకు వచ్చాడు కౌత్సుడు.


అంతకు ముందురోజే రఘుమహారాజు ఒక మహాయజ్ఞం చేశాడు. ఆ యజ్ఞదానాల్లో తనకున్న సర్వస్వం (సుమారు 14 కోట్ల దీనారాలు) దానం చేశాడు! కౌత్సుడొచ్చేసరికి రఘుమహారాజు మట్టికుండలు పెట్టుకుని సంధ్యావందనం చేస్తున్నాడు. రఘుమహారాజు యొక్క దానగుణాన్ని చూసి ఆశ్చర్యపోయాడు కౌత్సుడు.


కౌత్సుని చూసి వచ్చిన కారణమేమని అడిగాడు రఘుమహారాజు. “రాజా! అది కష్టములే. నేను వెళతాను” అంటూ వెళిపోతున్న కౌత్సుని పిలిచి రాజు “వట్టి చేతులతో వెనుతిరిగి పోవటమా! సంశయించక అడుగు నాయనా” అని అన్నాడు.


వచ్చిన పని చెప్పి తలదించుకుని నిలుచున్నాడు కౌత్సుడు.


“ఱేపు ప్రొద్దున్న రా. నీవు కోరిన ధనం ఇస్తా” అని చెప్పి పంపాడు రఘుమహారాజు.


పురతః(అందరికంటే ముందుగా) హితం చేసే వాడు పురోహితుడని ఎఱిగిన రఘుమహారాజు తన గురువైన వశిష్ఠ మహర్షి వద్దకు వెళ్ళి సమస్యను వివరించాడు.


మహాజ్ఞాని అయిన వశిష్ఠుడు “రాజా! నీవు సంపాదించి ఇవ్వడానికి వ్యవధిలేదు. ఇంద్రునిపై దండెత్తు” అని హితం చెప్పాడు.


విజయ భేరీలు మ్రోగాయి.


ఆ భీకర భేరీనినాదాలు వజ్రి చెవులకు వినిపించాయి. రఘుమహారాజు రాజ్యంనుంచి వస్తున్నాయని తెలుసుకొని దేవేంద్రుడు “ఎంతో ధర్మాత్ముడు రఘుమహారాజు. ఆయన కోశాగారాలన్నీ ధనంతో నింపమని” ఆజ్ఞాపించాడు.


రాజబంట్లు కోశాగారాలు నిండి ఉన్నాయని రఘుమహారాజుతో విన్నవించారు. దండయాత్రకు స్వస్తిచెప్పి కౌత్సుడు రాగానే “మీ ధనం కోశాగారాల్లో ఉంది. తీసుకు వెళ్ళండి” అన్నాడు.


తను అడిగినదానికన్నా ఎక్కువుందని తెలిసిన కౌత్సుడు “రాజా! నాకు కావలసినవి 14రాశులే. మిగతా ధనం నాది కాదు” అని వెళ్ళిపోయి గురుదక్షిణ చెల్లించుకున్నాడు.


“మరి ఈ ధనమెవరిది” అని రఘుమహారాజు మిగిలినదంతా దేవేంద్రునికి పంపివేశాడు! అంతటి ధర్మాత్ముడు కాబట్టే పరమాత్మ అతని పౌత్రునిగా పుట్టినాడు.```


*ఈ కథలోని నీతులను చూద్దాం:*


```


గురు శిష్యుల అన్యోన్యమైన సంబంధం ఈ కథలో మనకు తెలిసింది. ప్రతిఫలం ఆశించకుండా సర్వవిద్యలూ నేర్పే గురువులు, గురువుని దైవంగా పూజించి కృతజ్ఞత తెలియ చేయాలనుకునే శిష్యులు ఉన్న భారతదేశం భూలోక స్వర్గం.


రఘుమహారాజు యొక్క దానగుణం


ఈ కథలో వ్యక్తమైంది. అతడు సంపాదించినదంతా దానం చేసేవాడు. దానం చేయటానికి మళ్ళీ సంపాదించేవాడు.


కౌత్సుడి యొక్క, రఘుమహారాజుయొక్క నిజాయితీ శ్లాఘనీయం. ధర్మపరంగా వారికెంతకావాలో అంతే తీసుకుని మిగిలినది ఇంద్రునికి ఇచ్చివేశారు

దేవీ తలాబ్ మందిర్

 


⚜  పంజాబ్ : జలంధర్ 


⚜  శ్రీ దేవీ తలాబ్ మందిర్ 




💠 దుర్గాదేవికి అంకితం చేయబడిన ఈ పురాతన ఆలయం 200 సంవత్సరాలకు పైగా పురాతనమైనదని మరియు భారతదేశంలోని 51 శక్తి పీఠాలలో ఒకటిగా నమ్ముతారు. 


💠 ఆలయ సముదాయం అందంగా నిర్వహించబడుతుంది, దాని మధ్యలో పవిత్రమైన తలాబ్ (చెరువు) ఉంది, ఇది ప్రశాంతత మరియు దైవిక వాతావరణాన్ని జోడిస్తుంది.


💠 ప్రధాన ఆలయంలో అద్భుతమైన బంగారు గోపురం మరియు సంక్లిష్టమైన శిల్పాలు ఉన్నాయి. 



💠 దేవి తలాబ్ ఆలయం ఇటీవల పునరుద్ధరించబడింది మరియు పాత నిర్మాణానికి అనేక మార్పులు చేయబడ్డాయి. 

అలాగే, ఆలయ ప్రాంగణంలో కొత్త ఆలయం నిర్మించబడింది. 

అమర్‌నాథ్ యాత్ర నమూనా కూడా కొంతకాలం క్రితం నిర్మించబడింది.


💠 ప్రధాన దేవి తలాబ్ మందిర్ పక్కన, కాళి దేవి యొక్క పాత ఆలయం ఉంది. 

ఆలయం యొక్క ప్రధాన ఆకర్షణలలో ఒకటి పాత చెరువు, ఇది హిందూ భక్తులు పవిత్రంగా భావిస్తారు.


💠 ఈ ఆలయం జమ్మూ కాశ్మీర్‌లోని అమర్‌నాథ్ గుహ ఆలయాన్ని పోలి ఉండే నిర్మాణం కలిగి ఉంది.


🔆 మందిర్ చరిత్ర


💠 తన తండ్రి దక్షుడు తన భర్త శివుడిని అవమానించిన తర్వాత సతీ మాత తనను తాను దహనం చేసిందని పురాణాలు చెబుతున్నాయి.  

దీనితో కోపోద్రిక్తుడైన శివుడు తన భయంకరమైన మూడవ కన్ను తెరిచి తన ప్రియమైన సతి శరీరాన్ని చేతుల్లో పట్టుకుని భూమి అంతటా భయంకరమైన తాండవం నృత్యం చేశాడు.


💠 దేవుని కోపం విశ్వాన్ని నాశనం చేస్తుందని భయపడిన దేవతలు విష్ణువు సహాయం కోరగా, అతను తన సర్వశక్తిమంతుమైన సుదర్శన చక్రాన్ని పంపి సతి శరీరాన్ని ముక్కలుగా నరికివేశాడు. 


💠 సతీ శరీరంలో కొంత భాగాన్ని పొందిన ప్రతి ప్రదేశం తరువాతి యుగాలలో దేవతలు , భక్తులకు ప్రార్థనా స్థలంగా మారింది. 

ఈ ప్రదేశాలలో ప్రతి ఒక్కటి శక్తి పీఠంగా గౌరవించబడుతుంది, వారిని శక్తి అని కూడా పిలుస్తారు. 


💠 దేవి తలాబ్ మందిర్ ఉపఖండంలోని 51 ప్రముఖ శక్తి పీఠాలలో ఒకటిగా ప్రత్యేకతను కలిగి ఉంది. 

ఈ ఆలయం సతీ కుడి వక్షస్థలంతో ఆశీర్వదించబడిన ప్రదేశాన్ని సూచిస్తుంది.


💠 దుర్గాదేవి స్త్రీ మరియు శక్తిని ప్రతిబింబిస్తుండటంతో ఈ ఆలయం గురించిన ఇతిహాసాలు ఆమె పట్ల ఆధ్యాత్మిక రహస్యాన్ని మరియు భక్తిని సృష్టిస్తాయి. 

రెండు శతాబ్దాల తరువాత, ఈ పూజ్యమైన ప్రదేశం దాని అసలు నిర్మాణాలు మరియు వారసత్వాన్ని గర్వంగా ప్రదర్శిస్తుంది. 


💠 ఆలయ ప్రాంగణంలో ఒక పెద్ద మరియు పురాతనమైన మర్రి చెట్టు ఉంది, ఇది ఆలయం వలె పురాతనమైనదని నమ్ముతారు. భక్తులు తమ కోరికలను నెరవేర్చుకోవడానికి ప్రార్థన రూపంగా దాని కాండం చుట్టూ దారాలను కట్టి, దాని ఉనికికి ఒక ఆధ్యాత్మిక ప్రకాశాన్ని జోడిస్తారు.


💠 భారతదేశం మరియు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు, దేవి తలాబ్ జలాలు వైద్యం చేసే లక్షణాలను మరియు ఆశీర్వాదాలను ప్రసాదించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని నమ్ముతారు. 


💠 నిమజ్జనం తరచుగా శుద్ధీకరణకు ప్రతీకగా పరిగణించబడుతుంది, ఇక్కడ ఒకరు శారీరక మరియు ఆధ్యాత్మిక మలినాలను కడిగివేసి, పునరుజ్జీవింపబడతారు.


💠 ఈ ఆచారం గత పాపాలు మరియు దుష్కార్యాల నుండి ఆత్మను శుద్ధి చేసుకునే హిందూ తత్వశాస్త్రంలో లోతుగా పాతుకుపోయింది. 

ఈ ఆచారం వ్యక్తులు తమ ఆధ్యాత్మిక మార్గాన్ని తిరిగి స్థాపించుకోవడానికి మరియు ఆరోగ్యం, శాంతి మరియు శ్రేయస్సు కోసం ఆశీర్వాదాలను కోరుకోవడానికి అనుమతిస్తుంది.


💠 ఆలయ ప్రశాంతమైన వాతావరణం, నీటి ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో కలిపి, దైవంతో లోతైన సంబంధాన్ని సృష్టిస్తుంది, అంతర్గత శాంతి మరియు దైవిక కృపను పెంపొందిస్తుంది.


💠 ఈ ఆలయంలో పిరమిడ్ లాంటి సమాధి ఉంది, దీనిని ఒక పొడవైన మార్గం ద్వారా చేరుకోవచ్చు. ఆలయానికి అనుసంధానించబడిన ఒక చెరువు ఉంది, ఇక్కడ భక్తులు దీవెన మరియు మోక్షానికి చిహ్నంగా స్నానం చేస్తారు. 


💠 అలాగే, ఆలయం పక్కనే కాళి దేవత యొక్క పురాతన ఆలయం ఉంది. 

ఇటీవలి కాలంలో, ఆలయం లోపల అమర్‌నాథ్ గుహను పోలిన నిర్మాణం నిర్మించబడింది. 


💠 ఈ ఆలయంలో అనేక పండుగలు జరుగుతాయి. 

ముఖ్యంగా, డిసెంబర్ నెలలో, హర్వల్లభ్ సంగీత సమ్మేళన్ అనే ప్రసిద్ధ ఆచారం నిర్వహిస్తారు.

ఈ సమయంలో చాలా మంది పిల్లలు దుర్గాదేవిని స్తుతిస్తూ పాటలు పాడతారు మరియు శ్లోకాలను కూడా పఠిస్తారు.


రచన

©️ Santosh Kumar

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*


*520 వ రోజు*


*కరువులో ద్విజులు*


ధర్మరాజు " పితామహా ! ధర్మభ్రష్టత్వం కలిగినప్పుడు కరువు కాటకాలు సంభవిస్తాయి. అప్పుడు ద్విజులైన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు ఎలా బ్రతకాలి " అని భీష్ముడిని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! త్రేతాయుగము ద్వాపర యుగసంధిలో పన్నెండు సంవత్సరాల కాలం తీవ్రమైన కరువు సంభవించింది. నదులు, చెరువులు, పచ్చిక బయళ్ళు చివరకు అడవులు ఎండి పోయాయి. ఆహారం దొరకక జంతువులు చచ్చిపోసాగాయి. రాజులు ప్రజల వద్ద ఉన్న ధాన్యాలను పన్నుల రూపంలో దోచుకున్నారు. బలవంతులు బలహీనులను దోచుకోసాగారు. బ్రాహ్మణులు ధర్మం తప్పి ప్రవర్తించ సాగారు. యజ్ఞ యాగాదులు ఆగి పోయాయి. ఆకలికి తాళలేని జనం చనిపోసాగారు. ఆ సమయంలో విశ్వామిత్రుడనే మహర్షి ఆకలికి తట్టుకోలేక ఆహారం కొరకు వెదకుతూ సాయం సమయానికి ఒక పల్లెను చేరుకున్నాడు. విశ్వామిత్రుడు క్షుద్భాధతో సొమ్మసిల్లి పడి పోయాడు. అతడి పక్కన ఒక కుక్క శరీరం పడి ఉంది దాని చర్మం వలిచి మిగిలిన శరీరం అక్కడ ఎండ పెట్టారు. ప్రాణం పోయే సమయంలో కుక్క మాంసభక్షణం చేయడం పాపం కాదని కుక్కమాసం దొంగలించ బోయాడు. అక్కడ ఉన్న ఒక చంఢాలుడు అది చూసి " అయ్యా ! నీ వెవరు ఈ పనికి ఎందుకు పూనుకున్నావు? " అని అడిగాడు. విశ్వామిత్రుడు " అయ్యా ! నా పేరు విశ్వామిత్రుడు. ఆకలితో ఉన్నాను, చాలా రోజులుగా ఆహార పానీయాలు లేకుండా ఉన్నాను. ప్రాణాలు నిలిపు కోవడానికి కుక్క మాంసం తిన్నా తప్పు లేదనుకుని ఈ కుక్క మాంసం తీసుకుంటున్నాను. అగ్ని పవిత్రుడు అయినా సర్వభక్షకుడు కదా అలాగే నేనూ " అని చెప్పాడు. " మహాత్మా ! అన్ని మాంసాలలోకి కుక్క మాంసం నీచమైనది. దానిని మీ వంటి తాపసులు తీసుకోవడం దోషం కాదా ! " అని అడిగాడు. బ్రహ్మ అండగా ఉన్న నాకు ఏ పాపం అంటదు. ముందు ప్రాణాలు నిలుపుకోవడం ముఖ్యం. బ్రతికి ఉంటే యగ్న యాగాదులు చేసి పాపపరిహారం చేయ వచ్చు. నాకు జీవనాధరం అయిన కుక్కమాంసం వదలను " అన్నాడు. " మహాత్మా ! కుక్క మాంసం తినడం అధమాధమం. మీ వంటి తాపసులు అలాంటి పని చేయ వచ్చా ! " అని అడిగాడు. విశ్వామిత్రుడు " అయ్యా ! అగస్త్యమహాముని రాక్షస మాంసం తిన్నా అతడి ప్రతిష్ఠ తగ్గలేదు కదా ! " అని అన్నాడు. చంఢాలుడు " అగస్త్యుడు రాక్షస బారి నుండి మానవాళిని రక్షించడానికి రాక్షస మాంసం మేకమాంస రూపంలో తిన్నాడు. మీరు మీ ఆకలి మాత్రం తీసుకోవడానికి కుక్క మాంసం తినాలని అనుకుంటున్నారు. మీరు అగస్త్యుడు ఒకటి ఎలా ఔతారు " అని అడిగాడు. విశ్వామిత్రుడు " ఓయీ ! బ్రహ్మజ్ఞానానికి ఆలవాలమైన ఈ దేహం కోసం ఏమి చేసినా పాపం కాదు. అడ్డులే " అన్నాడు. చంఢాలుడు " మహాత్మా ! దొరికినఆహారం వదల లేక ఇలా అంటున్నావు కాని దీని వలన మీ తేజసు క్షీణించదా !" అన్నాడు. విశ్వామిత్రుడు " అయ్యా ! నేను బ్రతకాలని అనుకుంటున్నాను. నాకు ఈ మాంసం ఇవ్వు. నేను నిన్ను అడిగి తీసుకుంటున్నాను కనుక నాకు దొంగతనం చేసిన పాపం అంటదు " అని అన్నాడు. చంఢాలుడు " మహానుభావా ! ఎంతో పుణ్యాత్ములైన మీరు అధముడినైన నా వద్ద దానం పుచ్చుకొనుట ధర్మమా ! నేను ఇంతకంటే కాఠిన్యం వహించ లేను. ఇదుగో కుక్క మాంసం మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి " అన్నాడు. విశ్వా మిత్రుడు కుక్క మాంసం తిని ప్రాణాలు నిలుపుకున్నారు. ఆ తరువాత వానలు కురిసాయి చెట్లు చిగురించాయి, పంటలు పండాయి కరువు దూరమైంది. విశ్వామిత్రుడు కుక్క మాంసం తిన్న పాపపరిహారం చేసుకున్నాడు. కనుక ధర్మనందనా ! ఆపత్కాలంలో ఏ తప్పు చేసినా దోషం లేదు " అన్నాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: పదమూడవ అధ్యాయం

క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగం: శ్రీ భగవానువాచ


బహిరంతశ్చ భూతానామ్ అచరం చరమేవ చ 

సూక్ష్మత్వాత్‌తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్ (16)


అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితమ్ 

భూతభర్తృ చ తజ్జ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ (17)



అది సర్వభుతాల వెలపల, లోపల కూడా ఉన్నది; కదలదు, కదులుతుంది; అతిసూక్ష్మస్వరూపం కావడం వల్ల తెలుసుకోవడానికి శక్యంకాదు; అది ఎంతో దూరంలోనూ బాగా దగ్గరలోనూ ఉన్నది. ఆ బ్రహ్మం ఆకారమంతా ఒకటే అయీనప్పటికీ సర్వప్రాణులలోనూ ఆకారభేదం కలిగినదానిలాగా కనపడుతుంది. అది భూతాలన్నిటినీ పోషిస్తుంది, భుజిస్తుంది, సృజిస్తుంది.

సర్వ భూత సంక్షేమం

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో!!    *యః సర్వభూతప్రశమే నివిష్టః* 

         *సత్యో మృదుర్మానకృచ్ఛుద్ధభావః!*

         *అతీవ స జ్ఞాయతే జ్ఞాతిమధ్యే* 

         *మహామణిర్జాత్య ఇవ ప్రసన్నః!!*


             #~== *విదురనీతిః* ==~#


భావం!! : *ఎవరైతే సర్వ భూత సంక్షేమం పట్ల నిష్టగా ఉంటారో, మృదువు, మర్యాదపుర్వక మైన భావజాలం కలిగి ఉంటారో, అందరినీ తన బంధువుగా భావిస్తారో వారిని అందరూ మహామణిజాతికి చెందినవారుగా గౌరవిస్తారు....*


*{ ఇది మనం పిల్లలలో కల్పించ వలసిన భావజాలం..నిన్ను తోశాడా, నువ్వూ తోసిపడేయ్...... తిట్టాడా, తిట్టేయ్, కొట్టాడా, కొట్టేయ్! అని నూరిపోస్తే అసాంఘిక శక్తిగా మారుతాడు } ....నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది.*


✍️💐🌹🌸🙏

మహా ఓషది శొంఠి.

 సర్వరోగ నివారిణి.......మహా ఓషది శొంఠి.


👉అల్లం పై పొట్టు ని తీసేసి సున్నపుతేటలో ముంచి ఎండబెడితే సొంఠిగా మారుతుంది.


👉శొంఠిని సంస్కృతంలో మహా ఓషది, విశ్వభేషజాం అని కూడా అంటారు.


👉 ఈ భూమి మీద అతి విలువైన, అనేక రోగాలను ధ్వంసం చేయగల మహా మహా మూలికలలో ఈ శొంఠి అనేది ఒకటి.


👉దీనిలోని అపూర్వమైన గుణాలను తెలుసుకున్న మన మహర్షులు దీని శక్తికి ఆశ్చర్యపోయి దీనికి మహా ఓషది అని అర్థం వచ్చేటట్లుగా విశ్వభేజనం అని నామకరణం చేశారు.


👉ప్రతి గృహిణీ శొంఠి ప్రయోజనాలని తెలుసుకుని ఉంటే తన కుటుంబ సభ్యులకు వచ్చే అనేక చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు తానే పరిష్కరించగలుగుతుంది.


👉దీనిని లోనికి వాడిన తర్వాత ఇది శరీరం అంతా వ్యాపించి ప్రతి అవయవాన్ని మృదువుగా, లోపరహితంగా చేయడానికి తోడ్పడుతుంది.


👉మానవునిలో జీవనశక్తిని ( వ్యాధినిరోధక శక్తి) వృద్ధి చేస్తుంది. 


👉కడుపు ఉబ్బరాన్ని, గ్యాస్ ని తగ్గిస్తుంది.


👉మూత్రపిండ రోగాలను తగ్గిస్తుంది.


👉పురుషులకు వీర్యవృద్ధి చేస్తుంది.


👉శ్వాశ రోగాలను, ఉదరశూలాలను, దగ్గులను, హృదయ రోగములను, బోదకాలను, వాత రోగములను తగ్గిస్తుంది.


👉ఉదరములో గ్యాస్ ఎక్కువైనపుడు గుండెలో నొప్పి వస్తుంది. ఈ సమస్య కోసం పావు చెంచా శొంఠిపొడిని ఒక చెంచా తేనెతో కలిపి సేవిస్తూ ఉంటే గ్యాస్ తగ్గిపోయి గుండెనొప్పి కూడా తగ్గుతుంది.


👉దోరగా వేయించిన శొంఠి పొడిని మేక పాలతో కలిపి సేవిస్తే విష జ్వరాలు తగ్గిపోతాయి.


👉ఒకవైపు తలనొప్పి వచ్చేవారు శొంఠిని నీటితో కలిపి మెత్తగా నూరి నుదుటిపైన పట్టు వేస్తే ఆ నొప్పి తగ్గుతుంది.


👉జాయింట్లలో వాపు (ఆమవాతము) వచ్చి విపరీతమైన నొప్పి తో బాధపడే వారు దోరగా వేయించిన శొంఠి పొడి అరచెంచా మోతాదు గా చెరకు రసంలో కలిపి సేవిస్తూ ఉంటే ఈ సమస్య తొందరగా తగ్గుతుంది.


👉అదేవిధంగా శొంఠి పొడిని తిప్పతీగ సమూల రసం పావుకప్పులో కలిపి సేవిస్తూ ఉంటే దీర్ఘకాలిక ఆమవాత సమస్య తగ్గిపోతుంది.


👉కొంతమందికి పొట్ట మందగించి ఆకలి కాకుండా ఉంటుంది. అలాంటి వారు దోరగా వేయించిన శొంఠి 50గ్రా, పాతబెల్లం 100గ్రా కలిపి మెత్తగా దంచి నిలువ ఉంచుకుని రోజూ రెండుపూటలా 5గ్రా మోతాడుతో సేవిస్తూ వస్తే మందాగ్ని హరించిపోయి మంచి ఆకలి పుడుతుంది.


👉 ఎక్కిళ్ళు ఎక్కువగా వచ్చే వాళ్ళు పావుచెంచా శొంఠిపొడి, పావు చెంచా కరక్కాయ పొడి రెండింటిని కలిపి ఒక కప్పు వేడినీటిలో వేసి రెండుపూటలా సేవిస్తూ ఉంటే దగ్గు,దమ్ము, ఎక్కిళ్ళు అన్ని తగ్గిపోతాయి.


👉రక్తక్షీణత వల్ల వచ్చే పాండు రోగాలకు శొంఠిని నున్నని రాతి మీద అరగదీసిన గంధము 10గ్రా తీసుకుని దానిని 50గ్రా ఆవు నెయ్యిలో వేసి నెయ్యిని కరగబెట్టి దించి ఆ నెయ్యిని రోజు ఆహారంలో వాడుతూ ఉంటే పాండురోగము తగ్గి రక్తము వృద్ధి చెందును.


👉పక్షవాతం ఉన్నవారు దోరగా వేయించిన శొంఠిపొడి, సైన్ధవ లవణం పొడి రోజూ మూడుపూటలా గోరు వెచ్చని నీటిలో గాని, తేనెతో గానీ కలిపి ఆహారం తర్వాత తీసుకుంటూ ఉంటే క్రమంగా పక్షవాతం తగ్గుముఖం పడుతుంది.


👉మూత్రం కష్టంగా వచ్చేవారికి శొంఠి పొడి, సైన్ధవ లవణం కలిపి తీసుకుని పల్లెరుకాయలతో కాచిన ఒక కప్పు కషాయంలో కలిపి రోజూ రెండుపూటలా సేవిస్తూ ఉంటే మూత్రం ధారాళంగా వస్తుంది.


👉నడుం నొప్పి ఉన్నవాళ్లు రోజు రాత్రిపూట నిద్రపోయేముందు చిటికెడు శొంఠి ని ఒక చెంచా వంటాముదంతో కలిపి తాగుతూవుంటే నడుము నొప్పి, పక్కటెముకల నొప్పి, ఉదరశూల తగ్గిపోతాయి.

సేకరణ....


👉ఇంకా ఎన్నో సమస్యలకు ఈ మహా ఓషది పనిచేస్తుంది.. 


ముందుకు తోయబడినది

అందమైన పద్యం

 అందమైన పద్యం

ఇంతలు కన్నులుండ తెరువెవ్వరి వేడెదు భూసురేంద్ర

ఏకాంతమునందునున్న జవరాండ్ర నెపంబిడి పల్కరించు

లాగింతియ కాక నీవెరుగవే మునువచ్చిన త్రోవచొప్పు

నీకింత భయంబులే కడుగ నెల్లిదమైతిమె మాటలేటికిన్‌

⚜ శ్రీ దుర్గియానా మందిర్

 🕉 మన గుడి : నెం 1254


⚜  పంజాబ్ : అమృతసర్ 


⚜  శ్రీ దుర్గియానా మందిర్ 



💠 దుర్గియానా ఆలయం లేదా శ్రీ దుర్గియానా మందిర్ భారతదేశంలోని పంజాబ్‌లోని అమృత్‌సర్ నగరంలో ఉన్న ఒక హిందూ దేవాలయం. 


💠 హిందూ దేవాలయం అయినప్పటికీ, దీని నిర్మాణం స్వర్ణ దేవాలయాన్ని పోలి ఉంటుంది. 

ఈ ఆలయం ఇక్కడ పూజించబడే ప్రధాన దేవత దుర్గాదేవి నుండి దాని పేరు వచ్చింది. 

లక్ష్మీ మరియు విష్ణువు విగ్రహాలు కూడా ఆలయంలో ఉన్నాయి మరియు పూజించబడుతున్నాయి.



💠 అమృత్‌సర్‌లోని దుర్గియానా ఆలయం, తరచుగా "వెండి ఆలయం" అని పిలుస్తారు, ఇది దుర్గాదేవికి నివాళులర్పిస్తూ నగరం యొక్క గొప్ప సాంస్కృతిక వస్త్రధారణకు నిదర్శనంగా నిలుస్తుంది. 


💠 దేశ విభజన సమయంలో, ఈ ఆలయం నిరాశ్రయులైన వారికి ఆశ్రయం మరియు ఓదార్పునిచ్చిందని, ఐక్యత మరియు కరుణ యొక్క స్ఫూర్తిని కలిగి ఉందని పురాణాల ప్రకారం ఉంది.


💠 ఈ ఆలయం పంజాబ్ లోని స్వర్ణ దేవాలయంతో నిర్మాణ సారూప్యతలను పంచుకుంటుంది, ఎందుకంటే అవి సాంప్రదాయ సిక్కు నిర్మాణ శైలిలో రూపొందించబడ్డాయి - సిఖారా, గోపురాలు, పందిరి మరియు అలంకరించబడిన బాహ్య భాగాలతో నిండి ఉన్నాయి. 


💠 దుర్గియానా ఆలయం మరియు స్వర్ణ దేవాలయం మధ్య సారూప్యత అమృత్‌సర్ మరియు పంజాబ్ ప్రాంతాన్ని నిర్వచించే శాశ్వత సాంస్కృతిక మరియు నిర్మాణ వారసత్వానికి నిదర్శనం.


💠 ఈ ఆలయం ఒక పవిత్ర సరస్సు మధ్యలో నిర్మించబడింది. 

ఆలయ గోపురం బంగారు పూతతో కప్పబడి ఉంటుంది, ఆలయ లక్షణాలలో పాలరాయిని విస్తృతంగా ఉపయోగిస్తారు మరియు గోపురం రంగురంగుల లైట్లతో ప్రకాశిస్తుంది. అద్భుతంగా రూపొందించబడిన పెద్ద వెండి తలుపుల కారణంగా ఈ ఆలయాన్ని కొన్నిసార్లు వెండి ఆలయం అని పిలుస్తారు. 


💠 శ్రీ దుర్గియానా ఆలయం హిందువులకు చాలా ముఖ్యమైన ఆలయం. 

ఆలయ ప్రాంగణంలో అశ్వమేధ యజ్ఞంలో బంధించబడిన గుర్రం ,

 లవ మరియు కుశలు హనుమంతుడిని బంధించిన చెట్టు ఉంది. 

సూర్యదేవుని మనవడు ఇక్ష్వాకు ఈ భూమిపై అనేక యాగాలు చేసాడు. 


💠 అసలు ఆలయం 16వ శతాబ్దంలో నిర్మించబడింది. శ్రీ దుర్గియానా ఆలయ నిర్మాణం శ్రీ హర్మందిర్ సాహిబ్‌ను పోలి ఉంటుంది. 

దీనిని 1921లో గురు హర్సాయి మల్ కపూర్ నిర్మించారు.


💠 ఈ ఆలయంలో జరుపుకునే ప్రధాన హిందూ పండుగలు దసరా , జన్మాష్టమి , రామ నవమి మరియు దీపావళి . 

హిందూ క్యాలెండర్‌లోని పవిత్ర శ్రావణ మాసంలో దుర్గియానా మందిర్‌లో సావన్ పండుగ కూడా జరుపుకుంటారు, ఇక్కడ నూతన వధూవరులు రాధా కృష్ణుడిని పూజించడానికి ఆలయంలో గుమిగూడతారు . 

మహిళలు తమ భర్తలతో పాటు పూల ఆభరణాలతో అలంకరించుకుని ఆలయంలో పూజలు చేస్తారు. 


💠 దుర్గియానా ఆలయ సముదాయంలో జరుపుకునే మరో పండుగ నవరాత్రి మరియు దసరా 10 రోజులలో ప్రసిద్ధి చెందిన 'లంగూర్ మేళా' . 

దుర్గియానా ఆలయ సముదాయంలో ఉన్న ఈ ఆలయంలో ప్రార్థనలు చేయడానికి భక్తులు తమ పిల్లలతో లంగూర్ వేషధారణలో ఉన్న బడా హనుమాన్ ఆలయానికి పెద్ద సంఖ్యలో వస్తారు.


💠 ఇది రైల్వే స్టేషన్ నుండి కేవలం అర కిలోమీటరు దూరంలో మరియు బస్ స్టాండ్ నుండి దాదాపు 1.5 కి.మీ దూరంలో ఉంది.



రచన

©️ Santosh Kumar

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*శాంతి పర్వము తృతీయాశ్వాసము*


*519 వ రోజు*

*విశ్వదించతగిన వారు*


ధర్మరాజు " పితామహా ! ఎవరిని నమ్మితే మనశ్శాంతి కలుగుతుంది. ఎవరిని నమ్మితే కష్టాలపాలౌతాము. అందరినీ నమ్మతగునా ! లేక ఎవరినీ నమ్మ తగదా ! " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! పూర్వము బ్రహ్మదత్తుడు అనే రాజు ఒక చిలుకను పెంచి దానితో స్నేహంగా ఉండ సాగాడు. ఆ చిలుకకు ఒక పిల్ల పుట్టింది. ఆ పిల్లతో రాజ కుమారుడు ఆడుకుంటూ ఉండే వాడు. ఆ చిలుక తన పిల్లతో సమానంగా రాజకుమారుడిని చూడసాగింది. ఒక రోజు చిలుక బయటకు వెళ్ళిన సమయంలో రాజకుమారుడు ఆ చిలుక పిల్లను చంపేసాడు. తిరిగి వచ్చిన చిలుక ఏడుస్తూ " ప్రతి రోజూ పండ్లు ఫలాలు తెచ్చి తన బిడ్డతో సమానంగా చూసినందుకు రాజకుమారుడు నిర్ధాక్షిణ్యంగా చంపేసాడు. రాజ బిడ్డలకు జాలి దయా ఉండవేమో నాకు మాత్రం జాలి ఎందుకు ఉండాలి అని రాజకుమారుడి కళ్ళని తన వాడి అయిన గోళ్ళతో పొడిచి గుడ్డి వాడిను చేసి రాజు ముందు నిలిచి " రాజా నీ బిడ్డ నిర్ధాక్షిణ్యంగా నా బిడ్డను చంపి పాపం చేసి ఫలితం అనుభవిస్తున్నాడు కనుక ఇక నేను ఇక్కడ ఉండడం తగదు కనుక నేను వెళ్ళి పోతున్నాను " అని పలికింది. ఆ రాజు " చిలుకా ! నీవు ఏ పాపం చేయ లేదు కనుక నీకు పాపం అంటదు. నీవు వెళ్ళకు మనం ఎప్పటిలా స్నేహంగా ఉంటాము " అన్నాడు. చిలుక " రాజా నేను నీ కుమారుడి కళ్ళొ పొడిచినందుకు నీకు నా మీద అంతర్లీనంగా కోపం ఉండకపోదు. కనుక నీతో స్నేహం నాకు ఆపత్కరం. కనుక మన స్నేహం అసంభవం " అని చెప్పింది. రాజు " చిలుకా ! నీ పిల్లను నా కొడుకు చంపినందుకు ప్రతిగా నీవు నా కుమారుడి కళ్ళు పొడిచావు కనుక ఆ విషయం అంతటితో తీరింది. నేను నీ వంటి మంచి స్నేహం వదల లేను " అన్నాడు. చిలుక " రాజా ! ఒక సారి స్నేహం చెడి పోయిన తరువాత తీయని మాటలతో ఆ పగ మరచినా చివరకు కీడు రాక మానదు. రాజా ! పగ అయిదు రకాలుగా ఉంటుంది. పరుల భూములు ఆక్రమించుకోవడం వలన కాని దాయాదుల మధ్య ఆస్తి తగాదా వలన కాని, ఆడవాళ్ళు మాటా మాటా అనుకోవడం వలన కాని మరొకరికి తీవ్రమైన ఆపద కలగడం వలన కాని పగ పుడుతుంది. ఒక సారి పుట్టిన పగ నివురు కప్పిన నిప్పులా అలాగే రగులుతూ ఉంటుంది కాని చల్లారదు. పగ కనిపించ లేదని పగవాడిని నమ్మితే వినాశనం తప్పదు. ఒక సారి పగపుట్టిన తరువాత తల్లి తండ్రులైనా, అన్నదమ్ములైనా, కన్నబిడ్డలైనా, ప్రాణ స్నేహితులైనా నమ్మరాదు. కనుక మీ తియ్యటి స్నేహం నమ్మి నేను నీతో స్నేహం కొనసాగించ లేను " అని పలికింది. రాజు " చిలుకా ! కాలవశం వలన మంచి చెడు కలుగుతాయి. వాటిని నియంత్రించ లేము కనుక నీ వంటి స్నేహితుడిని నేను వదల లేను " అన్నది. చిలుక " రాజా ! నువ్వు నాతో ఎంతో సౌమ్యంగా మాట్లాడుతున్నా ఆ మాటల వెనుక నాకు పగద్వేషం కనపడుతున్నాయి. కనుక నేను నీతో స్నేహం చేయ లేను " అని చెప్పి చిలుక ఎగిరిపోయింది. కనుక ధర్మరాజా ! రాజు తన వారిని కాని మిత్రులను కాని ప్రజలను కాని నమ్మ రాదు.

*కణిక శత్రుంజయులు*


భీష్ముడు ధర్మనందనా ! ఈ సందర్భంలో కణికుడు శత్రుంజయుడు అనే రాజుకు చెప్పిన విషయం వివరిస్తాను విను. రాజు బయటకు తియ్యగా మాట్లాడుతూనే లోపల కరుగ్గా ఉండాలి. అందరినీ నమ్మినట్లే ఉండాలి కానీ ఎవరినీ నమ్మ రాదు. దాయాదుల సాయంతో రాజ్యాన్ని జయించి తరువాత వారికి తగిన పారితోషికం ఇవ్వాలి. అంతే కాని వారిని నమ్మి దగ్గరగా ఉంచుకోకూడదు. అవసరానికి రాజు శత్రువును తలకెక్కించుకుని అవసరంతీరగానే కుండలా నేలకేసి కొట్టాలి. మద్యపానము, జూదము, వేట, స్త్రీలోలత్వం రాజులకు వినోద సాధనము. కాని మితిమీరక ఉండాలి. రాజు ఒక కార్యం తలపెట్టిన అది పూర్తయ్యే వరకు ఎవరికీ తెలియనివ్వ రాదు. ఒక వేళ తెలిసినా తెలియనట్లు, చూడనట్లు, విననట్లు ఉండాలి. రాజుకు ఇష్టం లేని పనిని అదుగో చేస్తాను, ఇదుగో చేస్తాను అని కాలయాపన చేయాలి. తరువాత ఎలాగైన చేయక విడువాలి. అత్యంత గర్వంతో విర్రవీగే వాడిని, కార్యా కార్య వచక్షణ లేని వాడిని, మంచీ చెడు తెలియని వాడిని, చెడుమార్గంలో నడిచేవారిని గురువైనా వదలక దండించాలి. తీరని అప్పు, ఆరని నిప్పు, పూర్తిగా తీరని పగ ఎప్పటికైన కీడు చేస్తాయి. మృదుత్వంతో ఏదైనా సాధించ వచ్చు. సామరస్యంతో శత్రువునైనా నాశనం చేయ వచ్చు. కనుక మృధు స్వభావులు ఉత్తములు అది ఉత్తమ గుణం " అన్నాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

ఖ‌ర్జూరపండు

 


              *ఖ‌ర్జూరపండు*

                 ➖➖➖✍️


```

Dates : చ‌లికాలంలో ఖ‌ర్జూరాల‌ను రోజూ తినాలి.. ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే 4 ఖ‌ర్జూరాల‌ను తింటే చాలు..!


కాలం మారుతున్న కొద్దీ మన ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. కాలానికి అనుగుణంగా శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి, కనుక ఆహారం విషయంలోనూ మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.


ముఖ్యంగా చలి కాలంలో మన ఆరోగ్య విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. చలికాలంలో వాతావరణంలో ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోవటం వల్ల వీలైనంతవరకు మన శరీరాన్ని వెచ్చగా ఉంచటం కోసం ప్రయత్నం చేయాలి. ఈ క్రమంలోనే చలికాలంలో ఖర్జూరాలు మన శరీరానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఖర్జూరాలను తీసుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం...


1. ఖర్జూరాలను పోషక విలువల రారాజు అని చెప్పవచ్చు. ముఖ్యంగా రక్తహీనత సమస్యతో బాధపడే వారికి ఖర్జూరాలు ఒక వరం. ఇందులో ఐరన్ అధికంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్యతో బాధపడేవారికి ఖర్జూరాలు ఎంతో మేలు చేస్తాయి. వీటిని తింటే రక్తం బాగా తయారవుతుంది.


2. ముందు రోజు రాత్రి ఖర్జూరాలను నానబెట్టి మరుసటి రోజు ఉదయం పరగడుపున ప్రతి రోజూ రెండు ఖర్జూరాలను తినడం వల్ల గుండె సమస్యలు మీ దరిచేరవు.


3. చాలా మంది మలబద్ధకం, జీర్ణక్రియ సమస్యలతో సతమతం అవుతుంటారు. చలికాలంలో ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కనుక అలాంటి వారు ప్రతి రోజూ రాత్రి రెండు లేదా మూడు ఖర్జూరాలను తిని పడుకోవడం ద్వారా ఎలాంటి జీర్ణక్రియ సమస్యలు లేకుండా జీర్ణక్రియను మెరుగుపరుచుకోవచ్చు. దీంతోపాటు మలబద్దకం కూడా తగ్గుతుంది. మరుసటి రోజు ఉదయం వరకు ఆహారం పూర్తిగా జీర్ణమవుతుంది. సుఖ విరేచనం అవుతుంది.


4. చలికాలంలో ప్రతి ఒక్కరినీ దగ్గు, జలుబు వంటి సమస్యలు వెంటాడుతుంటాయి. ఇలాంటి సమస్యలతో సతమతమయ్యేవారు ఒక గ్లాస్ నీటిలో రెండు ఖర్జూరాలు, 5 నల్ల మిరియాలు వేసి బాగా మరిగించి ఆ తర్వాత ఆ నీటిని వడబోసి తాగటం ద్వారా.. దగ్గు, జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు.


5. ఆస్తమా సమస్యతో సతమతమయ్యే వారికి ఖర్జూరాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. బాలింతలు ఖర్జూరాలను తీసుకోవడం వల్ల పిల్లలకు సరిపడా పాలు ఉత్పత్తి అవుతాయి. ఈ విధంగా ఖర్జూరాలతో ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.

*సుగర్ పేషెంట్స్ డాక్టర్ సలహాతో వాడవలెను.✍️``` -సేకరణ.

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

కైలాసం కావాలా?*

 


*కైలాసం కావాలా?*

               *వైకుంఠం కావాలా?*

                ➖➖➖✍️

```

ఓసారి భక్తతుకారామ్ భగవన్నామాన్ని ఉచ్చరిస్తూ, స్మరణ చేస్తూ వెళ్తున్నాడు.


అపుడు ఒకడు ఎదురు వచ్చాడు. “నువ్వు ఈ నామాన్ని ఇలా స్మరిస్తున్నావ్ కదా? ఏమి కోరుకుంటున్నావ్. నీకు కైలాసం కావాలా? వైకుంఠం కావాలా? స్వర్గం కావాలా?” అని తుకారాంని అడిగేడు.


ఆ ప్రశ్నకి తుకారాం అంటాడు- “అయ్యా! నాకు కైలాసం, వైకుంఠం అంటే అర్థం కాదు. ఇక స్వర్గమంటారా? ఈ నామస్మరణ చేస్తున్నపుడు నేను అనుభవించేదే, అనుభవిస్తున్నదే ‘స్వర్గం “ అని బదులిస్తాడు. 


భగవన్నామం హృదయంలో నినదిస్తే, నినాదాలు చేస్తే అదే స్వర్గం.


నామస్మరణ మనసు పడే ఆరాటాన్ని, ఆందోళనని, అశాంతిని అణచివేస్తుంది.


ఓ ఇనుప ముక్కను ఓ రాయిమీద రాస్తూ రాస్తూ పోతే వేడి పుడుతుంది.


భగవన్నామం అనే ఇనుప ముక్కతో, రాయిలాంటి మనసుని అటు ఇటు అనంతంగా, అఖండంగా రాస్తూ పోతే, 'భక్తి’ అనే వేడి పుడుతుంది.


పుట్టిన భక్తి అనే వేడి, పరమాత్మునికి ఉండే వెన్నలాంటి హృదయాన్ని కరిగిస్తుంది, కదిలిస్తుంది.


నారదుని ఉపదేశ కారణంగా రత్నాకరుడు రామనామాన్ని స్మరించిన కారణంగా శ్లోకదాతగా మారాడే.


వాల్మీకి మహర్షియై రామాయణ మహాకావ్యానికి సృష్టికర్తయ్యాడు.


అయితే నామస్మరణ, దైవచింతన అని రెండు ఉన్నాయి.


నామాన్ని జపించటం నామస్మరణ. ఆ నామం చేసిన లీలలను మహిమలను, మననం చేసుకోవటమే చింతన.


కృష్ణా కృష్ణా అని జపించటం స్మరణ. ఆ కృష్ణుడే ఎపుడో చేసిన లీలను మహిమలను మనం ఇపుడు మననం చేసుకోవటం చింతన.


నామాన్ని మనోభావంగా ఉచ్ఛరించాలి! పెదవులనుండి కాక హృదయంలోంచి ఉచ్ఛరించాలి.


ఆర్తితో ఉచ్ఛరించాలి.


అనుభవిస్తూ ఉచ్ఛరించాలి.


అనుభవంలోకి తెచ్చుకుంటూ ఉచ్ఛరించాలి.


మనసనే సరస్సులో నామం ఓ తామరపూవు.


తామరపూవులోని మకరందాన్ని త్రాగడానికి భక్తులు ఐహిక భావనలు వదిలి తుమ్మెదలవలె పరుగుతీయాలి.


హృదయపూర్వకంగా మనం ప్రార్థన చేస్తే భగవంతుడు మన పూజ గది ముందు దాసుడిగా వేచి ఉంటాడు.. నిజమే కదా...✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

అంతరంగం

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


 శ్లో𝕝𝕝 *నారికేళ సమాకారా*

*దృశ్యంతే హి సుహృజ్జనాః* | 

          *అన్యే బదరికాకారా*

 *బహిరేవ మనోహరాః* ||

               

*తా𝕝𝕝 సజ్జనుడు కొబ్బరికాయవలె పైకి కఠినంగా కనపడతాడు..... కానీ, కఠినమైన కొబ్బరికాయ లోపల రుచికరమైన కొబ్బరి, తియ్యని నీరు ఉన్నట్లే, సజ్జనుని కఠినత్వం వెనుక అతని మృదువైన మంచి మనసు దాగి ఉంటుంది, దుర్జనుడు మాత్రం పైకి చాలా మృదువుగా ఆకర్షణీయంగా రేగిపండు లాగా కనబడతాడు..... కానీ, మృదువైన రేగిపండు లోపల కఠినమైన గింజ ఉన్నట్లు, దుర్జనుడి మృదుత్వం వెనుక కఠినమైన అతని అంతరంగం ఉంటుంది*.


 ✍️🌸🌹💐🙏

పంచాంగం

 ఈ రోజు పంచాంగం 05.10.2025

Sunday,


స్వస్తి శ్రీ చాన్ద్రమాన విశ్వావసు నామసంవత్సర: దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాస శుక్ల పక్ష త్రయోదశి తిథి భాను వాసర శతభిషం నక్షత్రం గండ యోగః తైతుల తదుపరి గరజి కరణం


రాహుకాలం : సాయంత్రం 04:30 నుండి 06:00 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు. 



నమస్కారః , శుభోదయం

Panchaag