5, అక్టోబర్ 2025, ఆదివారం

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*


*520 వ రోజు*


*కరువులో ద్విజులు*


ధర్మరాజు " పితామహా ! ధర్మభ్రష్టత్వం కలిగినప్పుడు కరువు కాటకాలు సంభవిస్తాయి. అప్పుడు ద్విజులైన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు ఎలా బ్రతకాలి " అని భీష్ముడిని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! త్రేతాయుగము ద్వాపర యుగసంధిలో పన్నెండు సంవత్సరాల కాలం తీవ్రమైన కరువు సంభవించింది. నదులు, చెరువులు, పచ్చిక బయళ్ళు చివరకు అడవులు ఎండి పోయాయి. ఆహారం దొరకక జంతువులు చచ్చిపోసాగాయి. రాజులు ప్రజల వద్ద ఉన్న ధాన్యాలను పన్నుల రూపంలో దోచుకున్నారు. బలవంతులు బలహీనులను దోచుకోసాగారు. బ్రాహ్మణులు ధర్మం తప్పి ప్రవర్తించ సాగారు. యజ్ఞ యాగాదులు ఆగి పోయాయి. ఆకలికి తాళలేని జనం చనిపోసాగారు. ఆ సమయంలో విశ్వామిత్రుడనే మహర్షి ఆకలికి తట్టుకోలేక ఆహారం కొరకు వెదకుతూ సాయం సమయానికి ఒక పల్లెను చేరుకున్నాడు. విశ్వామిత్రుడు క్షుద్భాధతో సొమ్మసిల్లి పడి పోయాడు. అతడి పక్కన ఒక కుక్క శరీరం పడి ఉంది దాని చర్మం వలిచి మిగిలిన శరీరం అక్కడ ఎండ పెట్టారు. ప్రాణం పోయే సమయంలో కుక్క మాంసభక్షణం చేయడం పాపం కాదని కుక్కమాసం దొంగలించ బోయాడు. అక్కడ ఉన్న ఒక చంఢాలుడు అది చూసి " అయ్యా ! నీ వెవరు ఈ పనికి ఎందుకు పూనుకున్నావు? " అని అడిగాడు. విశ్వామిత్రుడు " అయ్యా ! నా పేరు విశ్వామిత్రుడు. ఆకలితో ఉన్నాను, చాలా రోజులుగా ఆహార పానీయాలు లేకుండా ఉన్నాను. ప్రాణాలు నిలిపు కోవడానికి కుక్క మాంసం తిన్నా తప్పు లేదనుకుని ఈ కుక్క మాంసం తీసుకుంటున్నాను. అగ్ని పవిత్రుడు అయినా సర్వభక్షకుడు కదా అలాగే నేనూ " అని చెప్పాడు. " మహాత్మా ! అన్ని మాంసాలలోకి కుక్క మాంసం నీచమైనది. దానిని మీ వంటి తాపసులు తీసుకోవడం దోషం కాదా ! " అని అడిగాడు. బ్రహ్మ అండగా ఉన్న నాకు ఏ పాపం అంటదు. ముందు ప్రాణాలు నిలుపుకోవడం ముఖ్యం. బ్రతికి ఉంటే యగ్న యాగాదులు చేసి పాపపరిహారం చేయ వచ్చు. నాకు జీవనాధరం అయిన కుక్కమాంసం వదలను " అన్నాడు. " మహాత్మా ! కుక్క మాంసం తినడం అధమాధమం. మీ వంటి తాపసులు అలాంటి పని చేయ వచ్చా ! " అని అడిగాడు. విశ్వామిత్రుడు " అయ్యా ! అగస్త్యమహాముని రాక్షస మాంసం తిన్నా అతడి ప్రతిష్ఠ తగ్గలేదు కదా ! " అని అన్నాడు. చంఢాలుడు " అగస్త్యుడు రాక్షస బారి నుండి మానవాళిని రక్షించడానికి రాక్షస మాంసం మేకమాంస రూపంలో తిన్నాడు. మీరు మీ ఆకలి మాత్రం తీసుకోవడానికి కుక్క మాంసం తినాలని అనుకుంటున్నారు. మీరు అగస్త్యుడు ఒకటి ఎలా ఔతారు " అని అడిగాడు. విశ్వామిత్రుడు " ఓయీ ! బ్రహ్మజ్ఞానానికి ఆలవాలమైన ఈ దేహం కోసం ఏమి చేసినా పాపం కాదు. అడ్డులే " అన్నాడు. చంఢాలుడు " మహాత్మా ! దొరికినఆహారం వదల లేక ఇలా అంటున్నావు కాని దీని వలన మీ తేజసు క్షీణించదా !" అన్నాడు. విశ్వామిత్రుడు " అయ్యా ! నేను బ్రతకాలని అనుకుంటున్నాను. నాకు ఈ మాంసం ఇవ్వు. నేను నిన్ను అడిగి తీసుకుంటున్నాను కనుక నాకు దొంగతనం చేసిన పాపం అంటదు " అని అన్నాడు. చంఢాలుడు " మహానుభావా ! ఎంతో పుణ్యాత్ములైన మీరు అధముడినైన నా వద్ద దానం పుచ్చుకొనుట ధర్మమా ! నేను ఇంతకంటే కాఠిన్యం వహించ లేను. ఇదుగో కుక్క మాంసం మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి " అన్నాడు. విశ్వా మిత్రుడు కుక్క మాంసం తిని ప్రాణాలు నిలుపుకున్నారు. ఆ తరువాత వానలు కురిసాయి చెట్లు చిగురించాయి, పంటలు పండాయి కరువు దూరమైంది. విశ్వామిత్రుడు కుక్క మాంసం తిన్న పాపపరిహారం చేసుకున్నాడు. కనుక ధర్మనందనా ! ఆపత్కాలంలో ఏ తప్పు చేసినా దోషం లేదు " అన్నాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: