*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*శాంతి పర్వము తృతీయాశ్వాసము*
*519 వ రోజు*
*విశ్వదించతగిన వారు*
ధర్మరాజు " పితామహా ! ఎవరిని నమ్మితే మనశ్శాంతి కలుగుతుంది. ఎవరిని నమ్మితే కష్టాలపాలౌతాము. అందరినీ నమ్మతగునా ! లేక ఎవరినీ నమ్మ తగదా ! " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! పూర్వము బ్రహ్మదత్తుడు అనే రాజు ఒక చిలుకను పెంచి దానితో స్నేహంగా ఉండ సాగాడు. ఆ చిలుకకు ఒక పిల్ల పుట్టింది. ఆ పిల్లతో రాజ కుమారుడు ఆడుకుంటూ ఉండే వాడు. ఆ చిలుక తన పిల్లతో సమానంగా రాజకుమారుడిని చూడసాగింది. ఒక రోజు చిలుక బయటకు వెళ్ళిన సమయంలో రాజకుమారుడు ఆ చిలుక పిల్లను చంపేసాడు. తిరిగి వచ్చిన చిలుక ఏడుస్తూ " ప్రతి రోజూ పండ్లు ఫలాలు తెచ్చి తన బిడ్డతో సమానంగా చూసినందుకు రాజకుమారుడు నిర్ధాక్షిణ్యంగా చంపేసాడు. రాజ బిడ్డలకు జాలి దయా ఉండవేమో నాకు మాత్రం జాలి ఎందుకు ఉండాలి అని రాజకుమారుడి కళ్ళని తన వాడి అయిన గోళ్ళతో పొడిచి గుడ్డి వాడిను చేసి రాజు ముందు నిలిచి " రాజా నీ బిడ్డ నిర్ధాక్షిణ్యంగా నా బిడ్డను చంపి పాపం చేసి ఫలితం అనుభవిస్తున్నాడు కనుక ఇక నేను ఇక్కడ ఉండడం తగదు కనుక నేను వెళ్ళి పోతున్నాను " అని పలికింది. ఆ రాజు " చిలుకా ! నీవు ఏ పాపం చేయ లేదు కనుక నీకు పాపం అంటదు. నీవు వెళ్ళకు మనం ఎప్పటిలా స్నేహంగా ఉంటాము " అన్నాడు. చిలుక " రాజా నేను నీ కుమారుడి కళ్ళొ పొడిచినందుకు నీకు నా మీద అంతర్లీనంగా కోపం ఉండకపోదు. కనుక నీతో స్నేహం నాకు ఆపత్కరం. కనుక మన స్నేహం అసంభవం " అని చెప్పింది. రాజు " చిలుకా ! నీ పిల్లను నా కొడుకు చంపినందుకు ప్రతిగా నీవు నా కుమారుడి కళ్ళు పొడిచావు కనుక ఆ విషయం అంతటితో తీరింది. నేను నీ వంటి మంచి స్నేహం వదల లేను " అన్నాడు. చిలుక " రాజా ! ఒక సారి స్నేహం చెడి పోయిన తరువాత తీయని మాటలతో ఆ పగ మరచినా చివరకు కీడు రాక మానదు. రాజా ! పగ అయిదు రకాలుగా ఉంటుంది. పరుల భూములు ఆక్రమించుకోవడం వలన కాని దాయాదుల మధ్య ఆస్తి తగాదా వలన కాని, ఆడవాళ్ళు మాటా మాటా అనుకోవడం వలన కాని మరొకరికి తీవ్రమైన ఆపద కలగడం వలన కాని పగ పుడుతుంది. ఒక సారి పుట్టిన పగ నివురు కప్పిన నిప్పులా అలాగే రగులుతూ ఉంటుంది కాని చల్లారదు. పగ కనిపించ లేదని పగవాడిని నమ్మితే వినాశనం తప్పదు. ఒక సారి పగపుట్టిన తరువాత తల్లి తండ్రులైనా, అన్నదమ్ములైనా, కన్నబిడ్డలైనా, ప్రాణ స్నేహితులైనా నమ్మరాదు. కనుక మీ తియ్యటి స్నేహం నమ్మి నేను నీతో స్నేహం కొనసాగించ లేను " అని పలికింది. రాజు " చిలుకా ! కాలవశం వలన మంచి చెడు కలుగుతాయి. వాటిని నియంత్రించ లేము కనుక నీ వంటి స్నేహితుడిని నేను వదల లేను " అన్నది. చిలుక " రాజా ! నువ్వు నాతో ఎంతో సౌమ్యంగా మాట్లాడుతున్నా ఆ మాటల వెనుక నాకు పగద్వేషం కనపడుతున్నాయి. కనుక నేను నీతో స్నేహం చేయ లేను " అని చెప్పి చిలుక ఎగిరిపోయింది. కనుక ధర్మరాజా ! రాజు తన వారిని కాని మిత్రులను కాని ప్రజలను కాని నమ్మ రాదు.
*కణిక శత్రుంజయులు*
భీష్ముడు ధర్మనందనా ! ఈ సందర్భంలో కణికుడు శత్రుంజయుడు అనే రాజుకు చెప్పిన విషయం వివరిస్తాను విను. రాజు బయటకు తియ్యగా మాట్లాడుతూనే లోపల కరుగ్గా ఉండాలి. అందరినీ నమ్మినట్లే ఉండాలి కానీ ఎవరినీ నమ్మ రాదు. దాయాదుల సాయంతో రాజ్యాన్ని జయించి తరువాత వారికి తగిన పారితోషికం ఇవ్వాలి. అంతే కాని వారిని నమ్మి దగ్గరగా ఉంచుకోకూడదు. అవసరానికి రాజు శత్రువును తలకెక్కించుకుని అవసరంతీరగానే కుండలా నేలకేసి కొట్టాలి. మద్యపానము, జూదము, వేట, స్త్రీలోలత్వం రాజులకు వినోద సాధనము. కాని మితిమీరక ఉండాలి. రాజు ఒక కార్యం తలపెట్టిన అది పూర్తయ్యే వరకు ఎవరికీ తెలియనివ్వ రాదు. ఒక వేళ తెలిసినా తెలియనట్లు, చూడనట్లు, విననట్లు ఉండాలి. రాజుకు ఇష్టం లేని పనిని అదుగో చేస్తాను, ఇదుగో చేస్తాను అని కాలయాపన చేయాలి. తరువాత ఎలాగైన చేయక విడువాలి. అత్యంత గర్వంతో విర్రవీగే వాడిని, కార్యా కార్య వచక్షణ లేని వాడిని, మంచీ చెడు తెలియని వాడిని, చెడుమార్గంలో నడిచేవారిని గురువైనా వదలక దండించాలి. తీరని అప్పు, ఆరని నిప్పు, పూర్తిగా తీరని పగ ఎప్పటికైన కీడు చేస్తాయి. మృదుత్వంతో ఏదైనా సాధించ వచ్చు. సామరస్యంతో శత్రువునైనా నాశనం చేయ వచ్చు. కనుక మృధు స్వభావులు ఉత్తములు అది ఉత్తమ గుణం " అన్నాడు.
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి