14, జూన్ 2020, ఆదివారం

నేను


నేను, నాది అనే భావనను అహంభావం అని సంస్కృతంలో అంటాము, స్వార్ధం అని మనం అంటాము. ఎవరైనా తనకోసం మాత్రమే తాపత్రయపడుతుంటే వానిని స్వార్ధపరుడు అని అంటుంటాము.  ఇది ఐహికమైన విషయం.  కానీ ప్రతివారు ఆధ్యాత్మిక దృష్టితో పూర్తి స్వార్ధపరుడు కావలి అప్పుడే మోక్షం కరతలామలకం అవుతుంది.
ఇక్కడ నేను మూడు నేనుల గూర్చి చెపుతాను.
ఒకటవ నేను :  ఈ పని ఎవరు చేశారు -- నేను
ఈ ఇల్లు ఎవరు కట్టించారు  -- నేను 
ఈ కారు ఎవరు  కొన్నారు  --  నేను
ఇలా మనం రోజు నేను అని పలుమార్లు పలుకుతుంటాము. ఆ నేను ఎవరు అంటే ఈ శరీరం అని అనుకోవాలి కానీ ఇంకొకటి కాదు ఎందుకంటె కాలికి దెబ్బ ఎవరికి తాకింది అంటే నాకు అని జవాబు. జ్వరం ఎవరికి వచ్చింది అంటే కూడా నాకు అనే జవాబు. ఈ నేనే ఈ జగత్తుతో సంబంధం కలిగి వున్నది.  ఈ జగత్తుని పంచేంద్రియాలతో సంబంధం కలిగి వుంటున్నది.  నేను అనే ఈ శరీరంకోసం మనం నిత్యం అనేక కర్మలు చెడ్డ కర్మలు చేస్తున్నాము.  దానిలో భాగంగా మనం మన శరీర అంధ చందాలు, ఆనందాలు, సంతోషాలకు ప్రాకులాడుతున్నాము. ఎవరైనా పొగిడితే పొంగిపోవటం, దూషిస్తే బాధ పడటం చేస్తున్నాము. ఎదుటివాడిమీద ఈర్ష్య పడటం. ఇవన్నీ మనం నేను అనే శరీరంతో చేస్తున్నాం. నిజానికి ఈ శరీరానికి ఇవి ఏవి సంబందించినవి కావు. ఇవన్నీ చేయిస్తున్నది శరీరం కాదు శరీరంలో వున్నా ఇంకో నేను ఆ నేనే రెండవ నేను.  ఇక్కడ మనం ఒక చిన్న ఉదాహరణతో ఈ విషయాన్ని తెలుసుకోవచ్చు అది మనం ఒక కారు చూస్తాం అది మనకు కొంత దూరంలో పోతూ కనబడిందనుకోండి మనం అంటాం అదిగో చూడు అక్కడ మారుతి కారు పోతున్నది అని.  కానీ నిజానికి అక్కడ పోతున్నది మారుతి కారు కాదు మారుతి కారులో వున్న మనిషి.  ఆ మనిషి మనకు కనపడటంలేదు.  మనం ఆ మనిషి (డ్రైవర్) గూర్చి చెప్పకుండా కేవలం కారు గూర్చే చెప్పుతున్నాం ఎందుకంటె మన కంటికి కారు మాత్రమే కనపడుతున్నది.  ఆ కారు ఒక చోట ఆగితే ఆ కారు ఆగింది అంటున్నాము కానీ కారులోని మనిషి ఆగాడని అనటంలేదు.  నిజానికి మనం చేస్తున్న ప్రస్తావన అంతాకూడా కారులోని మనిషి గూర్చి మాత్రమే కానీ మనం కారుకి అవి ఆపాదిస్తున్నాము. అదే విధంగా రామా రావు అనే మనిషి కూడా ఒక కారు లాంటి వాడే అందుకే మనం మారుతి కారు అన్నట్లు రామా రావు అని సంబోధిస్తున్నాం.  ఆ రామా రావు కూడా తానూ రామా రావు అనే అనుకుంటున్నాడు.  నిజానికి అతను మొదటి నేను. కానీ రెండో నేను అతనిలో ఉండి రామా రావు అనే మొదటి నేనుని చెతన్యం చేస్తున్నాడు.  మొదటి నేనుతో సుఖం దుఃఖం ఆనందం, విషాదం అనుభవిస్తున్నాడు.  చూసే వారు కూడా ఈ మొదటి నేనే అన్ని అనుభవిస్తున్నాడని అనుకుంటున్నారు.  కానీ యదార్ధం ఏమిటంటే మొదటి నేను కేవలం శరీరం మాత్రమే అందులో రెండవ నేను లేకపోతె ఈ మొదటి నేనుకి ఉనికి లేదు. ఎప్పుడైతే రెండవ నేను మొదటి నేనులోంచి తొలగి పోతుందో అప్పుడు మొదటి నేను కళ్ల ముందర వున్నా అందరు మొదటి నేను చనిపోయిందని అంటారు.  నిజానికి చనిపోయంది (తొలగిపోయంది మొదటి నేను కాదు రెండవ నేను ) రెండవ నేను. ఎప్పుడైతే రెండవ నేను మొదటి నేనుని విడిచిపెట్టిందో అప్పుడు మొదటి నేను చెతన్య రహితం అవుతుంది. ఎలాగైతే డ్రైవరు దిగిన తరువాత కారు కదలకుండా ఉంటుందో అదే విధంగా.  అప్పుడు రామా రావు పార్థివ శరీరం అంటారు.  నిజానికి పార్థివ శరీరం రామా రావుది కాదు ఎందుకంటె ఇక్కడ వ్యవహార నామం పెట్టింది మొదటి నేనుకి మాత్రమే కానీ రెండవ నేనుకి కాదు కానీ లోకం ఆ పేరుని మొదటి నేనుకి కాక రెండవ నేనుకి ఆపాదిస్తున్నారు.  యంత చిత్రమో చుడండి. రెండవ నేనుకి రామా రావు అనే పేరు లేనేలేదు కేవలం ఇక్కడికి (ప్రపంచం)వచ్చిన తరువాతే మొదటి నేనుతో కలిసి దానికి పెట్టిన  రామా రావు అనే పేరుతొ వ్యవహారం నడిపింది రెండవ నేను మాత్రమే. మొదటి నేనుతో చేసిన కర్మల ఫలితాన్ని మాత్రమే రెండవ నేను తన వెంట తీసుకొని పోతాడు. 
విజ్ఞులైన వారు తాము బైటి ప్రపంచానికి కనపడుతున్న మొదటి నేను కాదు కేవలం రెండవ నేనునే నేను అనే భావం కలిగి మొదటి నేనును ఎంతవరకు, ఎలా ఉపయోగించుకోవాలో ఆలా ఉపయోగించుకొని రెండవ నేను కోసం మాత్రమే తాపత్రయ పడతారు. వారు ఈ మొదటి నేను కేవలం రెండవ నేను ఈ లోకంలో సంచరించటానికి ఉపయోగ పడే కారు లాంటిదే అని దానికి ఏర్పడ్డ బంధాలు కేవలం మొదటి నేనువి మాత్రమే కానీ రెండవ నేనుకి చెందినవి కావనే జ్ఞనంతో వుంటారు.  వారినే మనం యోగులని అంటాము. 
మూడవ నేను గూర్చి తెలుసుకోటం చాలా దుర్లభం ఏ కొద్దీ మందికి మాత్రమే ఈ మూడవ నేను జ్ఞ్యానం కలుగుతుంది.  ఆ జ్ఞ్యానం కలగటమే జీవన్ముక్తి.
మూడవ నేను గూర్చి తెలుసుకోవటానికి ముందుగా మనం ఇక్కడ ఆత్మా పరమాత్మా అనే విషయాలను గూర్చి క్లుప్తంగా తెలుసుకుంటేనే మనకు ఈ మూడవ నేను అర్ధం కాదు. 
మన సాధారణ దృష్టిలో ప్రతి మనిషి తనలో ఒక ఆత్మ కలిగి ఉంటాడని ఈ జగత్తుకు కారణం పరమాత్మా అనే భావనలో వుంటారు. అందుకే మనం దేముడు, భగవంతుడు అని నేను కానీ ఇంకొక శక్తి ఉందని విశ్వసిస్తాము  ఆ శక్తికే భగవంతుడు, పరమాత్మా అని పేరు పెట్టాము. ఇక్కడ మనం తెలుసుకోవలసింది ఏమిటంటే నిజానికి మనం అనుకునే ఆ పరమాత్మా కానీ, భగవంతుడు కానీ లేనే లేడు మరైతే వున్నది ఎవరు.  ఆ వున్నది కేవలం నేను నేను మాత్రమే నేను కానిది నాకన్నా భిన్నంగా వున్నది వేరే ఏది లేదు ఆ నేనే ఆ మూడవ నేను. 
మొదటి నేను తో రెండవ నేనును ఉపయోగించుకొని మూడవ నేనును తెలుసుకోవటమే ముక్తి, లేక మోక్షం. మూడవ నేను గూర్చి ఇంత క్లుప్తంగా వ్రాసానని అనుకుంటున్నారా అది అంత క్లుప్తం కానీ కాదు.  ఎన్నో జన్మలు ఎన్నో వేల సంత్సరాలు సాధన చేస్తేనో కానీ నేను ఈ మూడవ నేనును తెలుసుకుంటాను, చేరుకుంటాను. అది తెలుసుకోవటం చాలా దుర్లభం. అది తెలుసుకుంటే ఇంక తెలుసుకోవటానికి ఈ జగత్తులో ఏమి లేదు అందుకే ఆ జ్ఞానాన్ని బ్రహ్మ జ్ఞానం అన్నారు బ్రహ్మ అనే పదానికి అతి ఉత్తమం అని అర్ధం. బ్రహ్మ జ్ఞానం అది పొందిన జ్ఞాని రెండు ఒక్కటే అందుకే " బ్రహ్మ విత్ సాక్షాత్ భ్రహ్మయేవ భావ" అని ఉపనిషత్ వాక్యం . 

మనం ఈ పవిత్ర భారత ఖండంలో జన్మించటం మన పూర్వ జన్మ పుణ్యం. ఈ పవిత్ర భారతంలోనే మన ఋషులు వారి వారి దివ్య అనుభవాలతో మనకు ఉపనిషత్తులు అందించారు.  ఆ ఉపనిషత్ జ్ఞానాన్ని వేదాంతం అంటారు.  వేదాంతం అనే పదంలోనే దాని అర్ధం వుంది అంటే అది వేదాలకు చివర అని అర్ధం వేదాలు కర్మ కాండను తెలిపితే వేదాంతం జ్ఞాన కాండను చెపుతుంది. జ్ఞ్యాన పిపాసకులకి ఋషులు బోధించినది, దేవతలు బోధించిన కధలే ఈ ఉపనిషతులు. ఉపనిషతులు ఎన్నో వున్నాయి అన్నారు.  కానీ 108 మాత్రం ప్రముఖమైనవిగా పేర్కొంటే అందులో 10 ఉపనిషత్తులు ముఖ్యమైనవిగా చెపుతున్నారు. ఒక్కో ఉపనిషత్ ఒక్కో వేదానికి సంబంధించి ఉంటుంది.   

మనకు అద్భుత జ్ఞానాన్ని ప్రసాదించిన మన ఋషులు సదా స్మరణీయులు.  నిత్యం మనం చేసే ప్రీతి సత్ కర్మ కూడా వారు మనకు ప్రసాదించిన దివ్య జ్ఞానమే. 
నా గురువు గారి వద్దనుండి నేను పొందిన జ్ఞానాన్ని నా తోటి ముముక్షువులతో పంచుకోవాలనే భావంతో ఇది వ్రాస్తున్నాను. జిజ్ఞాసువుల సాధనకు నా వ్యాసం ఊతం ఇస్తే నేను నా ప్రయత్నంలో సఫలీకృతుడని అయినట్లే  
నా భావన ముముక్షువులకు చేరుతుందని విశ్వసిస్తూ మీ 
బుధజన విధేయుడు 
భార్గవ శర్మ   
ఓం శాంతి శాంతి శాంతిః 
సర్వే జన సుఖినోభవంతు