30, జూన్ 2025, సోమవారం

నారాయణావతార వైభవమ్!!

 శు భో ద యం 🙏

నారాయణావతార వైభవమ్!!

వామనారతార ఘట్టంలోనియీపద్యరాజం వెలగట్టలేని మాణిక్యం! ఈభూమియే సంహాసనమట! ఆకాశమే ఛత్రమట! దేవతలంతా సేవకులట! వేదాలు వంది మాగధులట! చరాచరమైన యీబ్రహ్మాండమే ఆకారమట! కలుములతల్లి లక్ష్మియే భార్యయట! చరాచర సృష్టి కర్త బ్రహ్మ కొడుకట! పరమపావని గంగ కూతురట!ఆహా యేమి యా నారాయణుని వైభవం! అలాంటి వైభవంతో వర్ధిల్లమని ఆశీర్వాదం! యెవరీయగలరండీ యింతటి మహదాశీర్వాదం!! ఆనారాయణుని చేతనే యిప్పించాడు పోతన! అందుకే భాగవతం చదవమని చెప్పటం: కొంతైనా సుకృతం కోసం!

"ధరసింహాసనమై నభంబుగొడుగై తద్దేవతల్ భృత్యులై

పరమమ్నాయములెల్ల వందిగణమై బ్రహ్మండమాగారమై

సిరిభార్యామణియై విరించి కొడుకై శ్రీ గంగ సత్పుత్రియై

వరసన్నీ ఘనరాజసంబ నిజమై వర్థిల్లు నారాయణా!!

ఈ పద్యం పోతనగారి నారాయణశతకం లోనిది.

మా చిన్నతనంలో దసరా శెలవల్లో బడి పంతుళ్ళు 

బడి పిల్లలను అందరి ఇళ్ళకు ఈపద్యం చెబుతూ

తీసుకవెళ్ళేవారు. శ్రీమన్నాయణుని వైభవం తెలిపే పద్యం.

ముందుగనే ఎవరింటికి వెళ్తామో చెప్పేవారు. ఆ గృహస్థు 

సాదరంగా ఎదురొచ్చి పంతులు గారికి కుర్చీ వేసి కూర్చోమని మర్యాద

చేసేవారు. అప్పుడు పిల్లలంతా ఈ పద్యం అందుకునేవారు.

మగపిల్లల చేతిలో విల్లంబులు

ఆడపిల్లల చేతిలో అట్టతో చేసిన హనుమంతుడు వుండేది

ఏమయా మీదయా మామీదలేదు.

దసరాకు వస్తిమని విసవిసలు పడక

చేతిలో లేదని, అప్పివ్వరనక

పావలా అయితేను పట్టేది లేదు

అర్ధరూపాయి అయితేను అంటేది లేదు

ముప్పావలా అయితేను ముట్టేది లేదు

ఇచ్చ రూపాయి అయితేను పుచ్చుకుంటాము

అయ్యవారికి చాలు ఐదు వరహాలు

పిల్లవాళ్ళకు చాలు పప్పు బెల్లాలు.

జయీ భవ దిగ్విజయీ భవ .............

తల్లితండ్రులు పంతులుగారికి పళ్ళెంలో

బట్టలు తాంబూలం కొంత డబ్బు పెట్టి ఇచ్చేవారు

అటుకులు బెల్లం మరుమరాలు పిల్లలకు పంచేవారు

అమ్మానాన్నలో తాతలో తమ పిల్లలు ఎలా చదువుతున్నారో

అడిగి తెలుసు కునేవారు.గురువు అంటే అంత మర్యాదా గౌరవము..

అప్పుడు ఎక్కువగా మునిసిపల్ గ్రాంటు స్కూళ్ళే.🌷🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

ప్ర హ్లా ద ప్ర బో ధ ము!

 శు భో ద యం 🙏

ప్ర హ్లా ద ప్ర బో ధ ము!

అచ్చపుఁజీకటింబడిగృహవ్రతులై విషయప్రవిష్టులైపుట్టుచుఁ

జచ్చుచున్మరలఁజర్వితచర్వణులైనవారికిన్

గ్రచ్చరఁగల్గునే? యొరులుజెప్పిననైన, నిజేఛ్ఛనైన, నే

మిచ్చిననైన కానలకునేగిన నైన హరిప్రబోధముల్;

పోతన:భాగవతము.ప్రహ్లాదోపాఖ్యానము;

భావము:అజ్ఞానాంధకారమున (మాయావరణమున)మునిగి

సంసారకూపమునబడి విషయభోగానురక్తుడై పలుజన్మలనెత్తుచు

మరలసంసారాదిసుఖానురక్తింబడుచు

చర్విత చర్వణమొనరించువారికి హరిభక్తి తమమంతకలుగదు ఒరులుచెప్పినను కలుగదు.కర్మపరిపక్వమగుదాక హరిభక్తియే ముక్తికి మార్గమనితోచదు.

అని ప్రహ్లాదుడు తండ్రికి హితబోధచేయుచున్నాడు.

     పాలు గారెడు పసివాడు పరమ వేందాంతమునుపదేశించుట!ఎంతచిత్రము!! ఇదియాప్రహ్లాదునకేచెల్లు!.ఆపోతనకేచెల్లు.!! తక్కొరులకసాధ్యము.

                                  స్వస్తి!!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

నల్లనయ్యకై గోపికల యన్వేషణము

 శు భో ద యం🙏

నల్లనయ్యకై గోపికల యన్వేషణము

 ఉ: నల్లనివాఁడు పద్మ నయనంబులవాఁడు కృపారసంబు పై

                 జల్లెడువాఁడు మౌళి పరిసర్పిత ఫింఛమువాఁడు నవ్వురా

                జిల్లెడు మోమువాఁడొకఁడు చెల్వల మాన ధనంబుఁదెచ్చె నో

                మల్లియలార ! మీ పొదల మాటున లేఁడు గదమ్మ! చెప్పరే?

                   భాగవతము-- దశమస్కంథము--1010 వ:పద్యం: బమ్మెఱ పోతన మహాకవి.

                          భక్తిని శృంగారాన్ని మిళితం చేసి ,దానికి 'మధుర భక్తి ' యనేసంకేతాన్ని పొందేలా మనోజ్ఙంగా మధుర మధురంగా గోపికా కృష్ణుల ప్రణయాన్ని చిత్రించాడు పోతన కవి. ఏమా కృష్ణుడు? ఒకచో తుంటరి .మరియొకచో భక్త రక్షణాపరాయణుడు.కొండొకచో దుష్ఠ సం హారి.వేరొచోరాసవిహారి. అతనిలీలలనుపమానముములు.

                         పాపమామా వెర్రిగొల్ల పడుచులు ఆయన ప్రేమలో చిక్కుకున్నారు. తలస్పర్శిప్రణయమున మునిగిన వారికి కృష్ణయ్య యెడబాటు. మిగుల దుర్భరమైనది. కంసుని పనుపున కృష్ణుడు మధురకేగినాడు. వచ్చుటకు తడవైనది. ఆవిరహమునోర్వజాలక గోపికలు బృందావనమునకు బరువెత్తినారు. కృష్ణుడెందైన దాగియున్నాడేమోనని వారిభ్రమ. చెట్టును పుట్టను గుట్టను కృష్ణుని జాడదెలుప గోరుచున్నారు. 

                                ఆసందర్భములోనిది యీపద్యరత్నము! ఎవరిజాడ గోరెదరో వారిరూపురేఖలను చెప్పవలసియుండునుగదా!

గోపికలు మల్లెపొదల కడకేగి ఆపనియే చేయుచున్నారు.

                         " ఓమల్లియలారా! నల్లనిమేనివాడు .తామరలవంటి విశాలనేత్రములుగలవాడు ,దయావర్షమునుగురియు వాడు ,నెమలిపింఛమును శిరమున ధరించువాడు, నగుమోముతో నొప్పువాడు.అగు దొంగయొకడు వనితామానధనమును కొల్లగొని

యిటువచ్చినాడు. వాడేమైన మీపొదల మాటున లేడుగదా! చెప్పుడు? -- అంటున్నారు. 

                    అసలు చెట్లనడగటం యేమిటి? ఉన్మాదం. విరహంలోకూడా ఉన్మాదం వస్తుంది. అదిగో విరహాధిక్యతచే వారంతా ఉన్మాదులయ్యారు. అందుచేత వారికి యెవరిని యడుగు చుంటిరో తెలియుపరిస్థితికాదు. అయినను కృష్ణుని ఆకారమును గుణములను చక్కగాచెపుతున్నారు. ఇదినిరంతరము కృష్ణదర్శనముచేత వారికి గలిగిన జ్ఙానము. 

                            నీలమేఘ శ్యాముడై విశాలనేత్రుడై దయాప్రవర్షియై శిఖిపింఛమౌళియై సుందర దరస్మిత వదనుడై యొప్పు నల్లనయ్య గోపవనితా మానస చోరుడగుట విచిత్రముగదా!చివరకు గోపికలకడ నతడు దొంగయైనాడు. ఆహా !కృష్ణయ్యా! ఏమినీమాయ? ఏమినీలీలలు? విన్నంతనే పులకితులమగుచుంటిమే , నిను గని నీసన్నిధి ననుభవించిన గోపిక లెంతధన్యలో?

మనసార నిను వర్ణించిన మాపోతనకవీంద్రుడు ధన్యతముడనుటయదార్ధమే!

                                                                      స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

శ్రీ కాళహస్తీశ్వర శతకము

 శు భో ద యం 🙏

శ్రీ కాళహస్తీశ్వర శతకము

                       (200)

(400 సంవత్సరాల కిందట శ్రీ కృష్ణ దేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో ఒకరైన "ధూర్జటి" మహాకవిచే ఆవిష్కరించబడినది.

వెనుకం జేసిన ఘోరదుర్దశలు భావింపంగ రోఁతయ్యెడున్

వెనుకన్ ముందట వచ్చు దుర్మరణముల్ వీక్షింప భీతయ్యెడున్

నను నేఁజూడగ నావిధుల్దలంచియున్ నాకే భయం బయ్యెడుం

జెనకుం జీఁకటియాయెఁ గాలమునకున్ శ్రీ కాళహస్తీశ్వరా!

తాత్పర్యం

శ్రీ కాళహస్తీశ్వరా! నా ఈ జన్మముననే మునుపు ఆయా యౌవనాది దశలయందు చేసిన దుష్కర్మముల నాలోచించిన కొలది రోత కల్గుచున్నది. రానున్న దుర్మరణము తలుచుకొనగా - ఈ ఉన్న కాలమైన సదుపయోగము చేసికొని నిన్ను ఆరాధింపనిచో జీవితమునందు ఏమి మంచి సాధించనివాని నగుదునే?? నేను చేసిన పనులను తల్చుకొనిన నన్ను చూడగా నాకే భయము కల్గుచున్నది. ఏది ఏమైనను కాలమునకు (నా ఆయువునకు) అత్యంత బాధాకరమగు చీకటి క్రమ్ముకొనివచ్చుచున్నట్లగుచున్నది. మిగిలిన ఈ కొంతకాలమైన నిన్ను ఏకాంతముగ ఆరాధించి నీ అనుగ్రహము పొందుటకు యత్నము చేయుదును.

(శివ భక్తుడైన శ్రీ ధూర్జటి ఆత్మ నివేదన -మీలో కొందరిని 'పద్య భాగం' అలరింపచేయలేక పోయివుండవచ్చు గాక. కానీ భావం ద్వారా నైనా ఆయన హృదంతరాళాల్లోని ఆర్తిని మీరు గ్రహించి వుంటారు. ఎందుకంటే చాలా సందర్భాలలో..మనకు కూడా వర్తిస్తుంది కనుక!

                       స్వస్తి!🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

రామాయణం

 🌹🌷🏹🪔🛕🪔🏹🌷🌹

*🕉️సోమవారం 30 జూన్ 2025🕉️*

``

             *రామాయణం*

ఒకసారి చదివినంత 

మాత్రాన మన సమస్త 

పాపాలని తీసేస్తుంది. 

``

     *వాల్మీకి రామాయణం*              

           *84వ భాగం*

```

యుద్ధం ప్రారంభమయ్యింది

వానరులందరూ ఆ యుద్ధంలో ప్రాసాదాలని తిరగ తోసేసారు, పర్వత శిఖరాలని తీసుకొచ్చి విసిరేశారు, చెట్లతో కొట్టారు. కనపడ్డ ప్రతి రాక్షసుడిని చంపేశారు. నాలుగు ద్వారాలనీ మూసి ఉంచారు. బయట ఉన్నవాళ్లు బయట ఉన్నవాళ్ళతో యుద్ధం చేస్తున్నారు.

అలా ఆ వానరములకు రాక్షసులకు యుద్ధం జరగబోయేముందు రాముడు అన్నాడు… “యుద్ధం చేస్తున్న రాక్షసులు కామరుపాన్ని పొందగలరు, అలాగే వానరములలో కూడా కొంతమంది కామరూపాన్ని పొందగలరు. ఎట్టి పరిస్థితులలోను మీరు మాత్రం కామ రూపాన్ని తీసుకోకండి. ఏడుగురము మాత్రమే నర రూపంలో ఉండి యుద్ధం చేస్తాము. విభీషణుడు, ఆయన నలుగురు మంత్రులు నర రూపంలో ఉంటారు, నేను, లక్ష్మణుడు ఉంటాము. మిగిలినవారందరూ వానర రూపంలోనే ఉండండి” అని చెప్పాడు.

ఆరోజున జరిగిన యుద్ధంలో వానరములు విశేషమైన బలాధిక్యతను ప్రదర్శించి అద్భుతమైన యుద్ధాన్ని చేశారు. ఆ సమయంలో రాక్షసులు ముసలాలు, ముద్గరాలు, శూలాలు, త్రిశూలాలు, కత్తులు, బరిసెలు వంటి ఆయుధములను పట్టుకొచ్చి కనపడ్డ వానరాన్ని కొట్టి చంపి తినేస్తున్నారు. ఆ వానరములలో ఉన్న భల్లూకములు కనపడ్డ రాక్షసుడిని గట్టిగా కౌగలించుకుని మరీ తింటున్నాయి. ఆ యుద్ధ సమయంలో ఎక్కడ చూసినా పట్టుకో, తన్ను, గుద్దు, నరుకు అనే కేకలే వినపడుతున్నాయి. ఆ రాత్రంతా మహా భయంకరమైన యుద్ధం జరిగింది. శిరస్సులు బంతులు ఎగిరినట్టు ఆకాశంలోకి ఎగిరాయి. ఎక్కడ చూసినా చీలిపోయిన వక్షస్థలాలు, తెగిపోయిన కాళ్ళు, చేతులు ఉన్నాయి. ఆ ప్రాంతమంతా నెత్తుటితో బురదయ్యి యుద్ధం చేస్తుంటే కాళ్ళు జారిపోతున్నాయి. ఏనుగుల తొండాలు, కాళ్ళు, గుర్రాల కాళ్ళు మొదలైన శరీర భాగాలు ఆ యుద్ధ భూమిలో పడి ఉన్నాయి.

అటువంటి సమయంలో ఇంద్రజిత్ యుద్ధానికి వచ్చాడు. రథంలో వస్తున్న ఇంద్రజిత్ ని చూడగానే అంగదుడికి అపారమైన ఉత్సాహం వచ్చింది. అప్పుడాయన ఒక పెద్ద పర్వత శిఖరాన్ని పట్టుకొచ్చి ఇంద్రజిత్ రథం మీద పారేశాడు. 

ఆ దెబ్బకి ఇంద్రజిత్ రథం మడిసిపోయింది. ఎప్పుడైతే ఎవ్వరూ ఊహించని విధంగా అంగదుడు ఆ ఇంద్రజిత్ యొక్క రథాన్ని, గుర్రాలని, ఛత్రాన్ని విరిగిపోయేటట్టు కొట్టాడో, ఆ సంఘటనని చూసి దేవతలు, రామ లక్ష్మణులు కూడా ఆశ్చర్యపోయారు. ఇంద్రజిత్ జీవితంలో ఇప్పటిదాకా అతని రథాన్ని కొట్టినవాడు లేడు.

తన రథం విరిగిపోయేసరికి ఇంద్రజిత్ కి ఎక్కడలేని ఆగ్రహం వచ్చి ఆకాశంలోకి ఎగిరి అంతర్ధానం అయిపోయాడు. అప్పుడాయన మాయ చేత మంత్రములను అభిమంత్రించగానే చీకటి అలుముకుంది. తరువాత మాయ చేత సృష్టింపబడిన ఒక దివ్యమైన రథాన్ని ఎక్కి, ఆకాశంలో ఎవరికీ కనపడకుండా ఉండి, రామలక్ష్మణుల మీద బాణ పరంపర కురిపించాడు. కద్రువ యొక్క కుమారులైన సర్పాలని ఇంద్రజిత్ బాణములుగా వేశాడు. అవి బాణములుగా వచ్చి కొడతాయి, సర్పాలుగా చుట్టుకుని మర్మ స్థానములయందు కరుస్తుంటాయి. ఇంద్రజిత్ విడిచిపెట్టిన ఆ బాణములు రామలక్ష్మణులని నాగాస్త్ర బంధనంగా చుట్టేసింది. 

అప్పుడు రాముడు లక్ష్మణుడితో…  

“లక్ష్మణా! మనం ఇప్పుడు ఈ ఇంద్రజిత్ ని ఏమీ చెయ్యలేము. ఆబోతు వర్షాన్ని ఎలా భరిస్తుందో అలా మనం కూడా ఈ బాణాలని వహించడమే కొంతసేపు” అన్నాడు. 

తరువాత రాముడు మూర్చపోయి కిందపడిపోయాడు. 

ఓర్చుకుని నిలబడ్డ లక్ష్మణుడు రాముడి వంక చూసి ఏడుస్తూ… 

'ఏ మహానుభావుడిని ఎవ్వరూ యుద్ధ భూమిలో నిగ్రహించలేరో, ఎవరు విశ్వామిత్రుడి దగ్గర ధనుర్వేదాన్ని ఉపదేశం పొందాడో, ఏ మహానుభావుడు భార్యని విడిపించుకోడానికి ఈ లంకా పట్టణానికి వచ్చాడో అటువంటి రాముడు ఇవ్వాళ నాగాస్త్ర బంధనం చేత కట్టబడి, ఉత్సాహము ఉపశమించి, భూమి మీద పడి ప్రాణములను విడిచిపెట్టాడు' అని అనుకున్నాడు. 

తరువాత లక్ష్మణుడు కూడా కిందపడిపోయాడు. 

రాముడు పట్టుకున్న కోదండం చేతిలోనుంచి వదులయిపోయి దూరంగా పడిపోయింది. 

రామలక్ష్మణుల వేళ్ళ యొక్క చివరి భాగాల నుండి శరీరం అంతా అంగుళం చోటు లేకుండా ఇంద్రజిత్ బాణాలతో కొట్టి… “మీ వలన 

నా తండ్రి ఎన్నో రాత్రులు పాన్పు మీద నిద్రపోకుండా అటు ఇటూ దొర్లాడు. ఏ రామలక్ష్మణుల వల్ల ఈ లంకా పట్టణం పీడింపబడిందో, ఏ రామలక్ష్మణుల వల్ల మా తండ్రి నిద్రపోలేదో, అటువంటి తండ్రి ఋణం తీర్చుకోడానికి ఈ రామలక్ష్మణుల ప్రాణములు పోయే వరకూ కొడతాను” అని, వారి యొక్క మర్మస్థానములలో గురి చూసి వజ్రములవంటి బాణములతో కొట్టాడు.

అప్పుడు రాముడు మెల్లగా బాహ్య స్మృతిని కూడా కోల్పోయి భూమి మీద ఒరిగిపోయాడు, లక్ష్మణుడు కూడా ఒరిగిపోయాడు. 

అలా రామలక్ష్మణులు పడిపోగానే చుట్టూ ఉన్న వానర నాయకులు అక్కడికి వచ్చారు. 

అప్పుడు ఇంద్రజిత్ హనుమని, ఋషభుడిని, వేగదర్సిని, విభీషణుడిని, సుషేనుడిని, గంధమాధనుడిని బాణాలతో కొట్టి, వానర సైన్యం అంతటినీ కలచి వేశాడు. 

ఆ సమయంలో వానరాలు ఎటు వెళుతున్నారో, ఎవరి మీద నుంచి దాటుతున్నారో, ఎవరిని తొక్కుతున్నారో, ఎవరిని ఈడ్చేస్తున్నారో అని చూసుకోకుండా దిక్కులు పట్టి పారిపోయారు.

రామలక్ష్మణులు ప్రాణములు విడిచిపెట్టారని సుగ్రీవుడు దుఃఖితుడై ఉన్నాడు. అప్పుడు విభీషణుడు అక్కడికి వచ్చి … 

“నాయనా సుగ్రీవా! అన్ని వేళలా అందరికీ యుద్ధంలో జయము కలుగుతుందని అనుకోడానికి వీలులేదు, ఎంతటివారికైనా ప్రమాదం వస్తుంది. నువ్వు ఈ పరిస్థితులలో శోకాన్ని పొందకూడదు. ఈ సమయంలో నువ్వు శోకాన్ని పొందితే చెయ్యవలసిన పని స్ఫురణలోకి రాదు. అవతల వాళ్ళిద్దరూ ప్రమాదకరమైన స్థితిలో పడిపోయి ఉన్నారు. వాళ్ళిద్దరికీ కాని తెలివి వచ్చిందా మనం రక్షింపబడినట్టే, వాళ్ళిద్దరికీ కాని తెలివి రాకపోతే మనిద్దరమూ నాశనం అయినట్టే. రామలక్ష్మణుల శరీరాలలో కాంతి తగ్గలేదు, అంగుళం మేర కూడా విడిచిపెట్టకుండా బాణములతో కొట్టేసినా తట్టుకోగలిగిన బలము, వీర్యము, ప్రకాశము, శక్తి, మనోధైర్యము వాళ్ళకి ఉన్నాయి" అని చెప్పి, పారిపోతున్న వానర సైన్యాన్ని వెనక్కి తీసుకురావడానికి వెళ్ళాడు.

కొంతసేపటికి విభీషణుడు ఆ సైన్యంతో తిరిగి వచ్చాడు. 

అప్పటికీ రామలక్ష్మణులు కిందపడిపోయే ఉన్నారు. 

పర్వతాల నుంచి సెలయేళ్ళు ప్రవహించినట్టు ఇంద్రజిత్ యొక్క బాణములు పెట్టిన ప్రతి రంధ్రం నుండి రక్తం ఏరులై ప్రవహించింది. అలా రక్తం వెళ్ళిపోతుండడం వలన వాళ్ళ శరీరాలు నీరసపడిపోతున్నాయి. అప్పటిదాకా సుగ్రీవుడికి ధైర్యం చెప్పిన విభీషణుడు ఈ పరిస్థితిని చూసి ఏడ్చి… “నేను ఈ రాముడి మీద, లక్ష్మణుడి మీద ఆశ పెట్టుకున్నాను. రామలక్ష్మణులని ఆశ్రయిస్తే నాకు రాజ్యం లభిస్తుందని అనుకున్నాను. కాని ఈ రామలక్ష్మణులే యుద్ధంలో నిహతులయిపోయారు. ఇంక నాకు ఎవరు దిక్కు. మా అన్నయ్య నన్ను విడిచిపెట్టడు, నాకు లోకంలో ఎక్కడా రక్షణ దొరకదు. నేను దురదృష్టవంతుడిని” అని బాధపడ్డాడు.

విభీషణుడు అలా మాట్లాడేసరికి అప్పటివరకూ అక్కడ నిలబడ్డ వానర సైన్యం పారిపోవడం మొదలుపెట్టింది. 

అప్పుడు అంగదుడు అక్కడికి వచ్చి “ఇంత అసహ్యంగా, ఇంత సిగ్గులేకుండా వానర సైన్యం ఎందుకు పారిపోతోంది” అని అడిగాడు. 

అప్పుడు వాళ్ళన్నారు… “మేము రామలక్ష్మణులు పడిపోయారని పారిపోవట్లేదు, ఎక్కడైనా ఇంద్రజిత్ వస్తాడేమో అని పారిపోతున్నాము” అన్నారు. 

ఇలా పారిపోవడమనేది చాలా భయంకరమైన విషయం, దయచేసి మీరందరూ వెనక్కి రండని ఆ వానర సైన్యాన్ని వెనక్కి తీసుకొచ్చారు.

ఆ సమయంలోనే ఇంద్రజిత్ లంకా నగరానికి చేరుకొని రావణుడితో… 

“తండ్రి గారూ… మీరింక బెంగపడవలసిన అవసరం లేదు. నరులైన రామలక్ష్మణులని నేను సంహరించాను. నేను నిర్మించిన నాగాస్త్ర బంధనం చేత ఆ ఇద్దరూ యుద్ధ భూమిలో పడిపోయి ఉన్నారు. వాళ్ళ శరీరంలో నుంచి నెత్తురు ఏరులై పారుతోంది. వాళ్ళిద్దరూ మరణించారు, ఇక మీరు ప్రశాంతంగా ఉండండి” అన్నాడు.

ఈ మాట వినగానే రావణుడు అపారమైన సంతోషాన్ని పొంది అక్కడున్న భటులని పిలిచి… 

“యుద్ధానికి వచ్చిన రామలక్ష్మణులు ఇద్దరూ నా కుమారుడైన ఇంద్రజిత్ చేత సంహరింపబడ్డారు, అని లంకలో చాటింపు వేయించండి. లంకంతా తోరణాలు కట్టండి, భేరీలు మ్రోగించండి. అందరూ సంతోషించేటట్టుగా పెద్ద ఉత్సవం చెయ్యండి" అని ఆజ్ఞాపించాడు.

తరువాత అక్కడ ఉన్న రాక్షస స్త్రీలని పిలిచి… “మీరు ఒకసారి అశోకవనంలో ఉన్న సీత దగ్గరికి వెళ్ళండి. సీతని పుష్పక విమానం ఎక్కించి యుద్ధ భూమిలోకి తీసుకెళ్ళండి. ఆ యుద్ధ భూమిలో మరణించిన రామలక్ష్మణులని సీత చూస్తుంది. 'ఇంక ఎలాగూ నా భర్త మరణించాడు కదా, ఇంక రాముడి మీద ఎందుకు ఆశ' అని లంకకి వచ్చి అలంకారం చేసుకుంటుంది, మంచి చీర కట్టుకుని సర్వాలంకారభూషితై నా పాన్పు చేరుతుంది. తొందరగా వెళ్ళి చూపించండి” అన్నాడు.

యుద్ధ భూమిలో రాక్షసులు ఉత్సాహంతో గెంతులు వేస్తూ, కేకలు వేస్తూ ఆనందంగా ఉన్నారు. వానరులందరూ చాలా నిరుత్సాహంతో, దీనంగా నిలుచుని ఉన్నారు. 

అప్పుడు ఆ రాక్షసులు సీతమ్మని పుష్పక విమానంలో తీసుకెళ్ళి యుద్ధ భూమిలో పడిపోయున్న రామలక్ష్మణులని చూపించారు. 

సీతమ్మ కిందకి చూడగా, ముళ్ళు విప్పిన ముళ్ళ పంది ఎలా ఉంటుందో, అలా బాణములు చేత కొట్టబడిన రామలక్ష్మణులు ఉన్నారు. రామలక్ష్మణులు ఇద్దరూ మరణించారు అనుకొని గుండెలు బాదుకొని ఏడ్చింది. అప్పుడు సీతమ్మ… “నేను పుట్టింట్లో ఉన్నప్పుడు మహా జ్ఞానులైన జోతిష్యులు నా పాదాలు చూసి… 

'అమ్మా! నీ పాదాలలో పద్మాలు ఉన్నాయి. ఏ స్త్రీ అరికాళ్ళలో పద్మాలు ఉంటాయో, ఆ పద్మములు కలిగిన స్త్రీ తన భర్తతో పాటు సింహాసనం మీద కూర్చుని మహారాణిగా పట్టాభిషేకం చేసుకుంటుంది' అన్నారు. కాని వారు చెప్పిన మాటలన్నీ అసత్యాలు అయ్యాయి. చిన్నతనంలో మా తండ్రిగారి పక్కన నేను కూర్చుని ఉంటే దైవజ్ఞులైన వారు మా ఇంటికి ఎక్కువగా వస్తుండేవారు, అప్పుడు వాళ్ళు నా సాముద్రిక లక్షణాలు చూసి 'తల మీద వెంట్రుకలు చాలా మెత్తగా, ఒత్తుగా, నల్లగా ఉన్నటువంటి స్త్రీ ఈమె, కనుబొమ్మలు కలవని స్త్రీ ఈమె, పిక్కలు గుండ్రంగా ఉండి వాటి మీద వెంట్రుకలు లేని స్త్రీ ఈమె, దంతముల మధ్యలో ఖాళీలు లేని స్త్రీ ఈమె కనుక ఈమె అయిదోతనాన్ని పూర్ణంగా పొందుతుంది, మహానుభావుడైన వాడిని భర్తగా పొందుతుంది' అని చెప్పారు. కాని అవన్నీ అబద్ధాలు అయిపోయాయి. నా వేళ్ళ మీద ఉండే గుర్తులు, నేత్రములు, చేతులు, పాదములు, తొడలు గుండ్రంగా, సమంగా ఉండేవి, నా గోళ్ళు ఎర్రటి కాంతితో ఉండేవి, అలా ఉండడం వలన నేను పూర్ణమైన అయిదోతనాన్ని పొందుతానని మా ఇంటికొచ్చిన జ్యోతిష్యులు చెప్పేవారు.

రామా! రావణుడు నన్ను అపహరించాక దండకారణ్యం అంతా వెతికావు, హనుమని పంపించావు, నాకోసం సముద్రానికి సేతువుని కట్టి, దాటి వచ్చావు, చివరికి యుద్ధంలో ఇంద్రజిత్ మాయ వల్ల మరణించావు, ఎంత ఆశ్చర్యం రామా, నీకు బ్రహ్మాస్త్రం తెలుసు, బ్రహ్మశిరోనామకాస్త్రం తెలుసు, వారుణాస్త్రం తెలుసు, ఆగ్నేయాస్త్రం తెలుసు, ఇన్ని అస్త్రములు తెలిసిన నిన్ను ఒకడు కేవలం మాయతో కనపడకుండా కొట్టిన బాణములకు శరీరం వదిలేశావు. నువ్వు మరణించావన్న వార్త విని కౌసల్యాదులు బతుకుతారా? అయోధ్య అయోధ్యలా ఉంటుందా. నువ్వు ఇన్ని కష్టాలు పడడానికి, అర్ధాంతరంగా శరీరం విడిచెయ్యడానికి నన్ను పెళ్ళి చేసుకున్నావా. నువ్వు నన్ను చేసుకోకపోతేనే బాగుండేదేమో " అని సీతమ్మ ఏడుస్తుంటే పుష్పకంలో ఉన్న త్రిజట చూడలేకపోయింది. 

అప్పుడు త్రిజట… “ఏడవకు సీతమ్మా. రామలక్ష్మణులు మరణించలేదు, వాళ్ళిద్దరూ సజీవంగా ఉన్నారు. నేను నిన్ను ఓదార్చడానికి ఈ మాటలు చెబుతున్నానని అనుకుంటున్నావా, కాని నేను నీకు రామలక్ష్మణులు బతికున్నారని చెప్పడానికి ఒక బలవత్తరమైన కారణాన్ని చెబుతాను. భర్త మరణించిన స్త్రీ కాని ఈ పుష్పక విమానం ఎక్కితే ఇది పైకి ఎగరదు, నువ్వు పుష్పకంలోకి ఎక్కగా ఇది ఆకాశంలో నిలబడిందంటే, నువ్వు సౌభాగ్యవతిగా ఉన్నావు అని అర్ధం. యోధుడైనవాడు నిజంగా శరీరాన్ని విడిచిపెడితే సైన్యాలు ఇలా నిలబడవు, ఎవరి మానాన వాళ్ళు పారిపోతుంటారు. రామలక్ష్మణుల ముఖాల్లో కాంతి ఏ మాత్రం తగ్గలేదు. కొద్దిసేపు మూర్చపోయారు అంతే. కొద్దికాలంలో రావణుడి పది తలలు పడిపోయి ఇదే పుష్పకంలో రాముడితో కలిసి నువ్వు అయోధ్యకి వెళ్ళిపోతావు. ఏ రాక్షస స్త్రీకీ నామీద లేని ప్రేమ నీ ఒక్కదానికే నా మీద ఎందుకు అంటావేమో, నిన్ను ఇక్కడికి తీసుకొచ్చినప్పటినుంచి నీ ప్రవర్తన చూస్తున్నాను. నీ ప్రవర్తన చేత, నీకు నీభర్త అంటే ఉన్న ప్రేమ చేత, నాకు నువ్వంటే విపరీతమైన ప్రేమ ఏర్పడింది. అందుకని నీకెప్పుడూ మంచి చెయ్యాలనే చూస్తుంటాను. అమ్మా! ఇంతకముందెన్నడూ నేను అబద్ధాలు చెప్పలేదు, ఇక ముందు కూడా ఎన్నడూ అబద్ధాలు చెప్పను. రామలక్ష్మణులు జీవించి ఉన్నారని నేను చెప్పినది పరమ సత్యం, నువ్వు బెంగ పెట్టుకోకు తల్లీ!” అని చెప్పింది.

తరువాత ఆ పుష్పక విమానాన్ని అశోకవనానికి తీసుకెళ్ళి దింపేశారు.

ఇంతలో రాముడు మెల్లగా తేరుకుని ఎదురుగా మూర్చపోయి పడిఉన్న లక్ష్మణుడిని చూసి… “ఒకవేళ లక్ష్మణుడి ప్రాణములు దక్కకపోతే, నేనొక్కడినే బతికితే, సీత నాకు దక్కినా ఆ బ్రతుకు నాకెందుకు. ఏలోకంలోనైనా వెతికితే సీతలాంటి భార్య దొరకచ్చు, కాని లక్ష్మణుడిలాంటి తమ్ముడు దొరకడు. 

కార్తవీర్యార్జునుడు(ఈయన ఒకసారి రావణుడిని ఓడించి చెఱసాలలో బంధించాడు. ఈయనకి 1000 చేతులు ఉండేవి) ఒకేసారి 500 బాణములను ప్రయోగం చేసేవాడు, అంతకన్నా ఎక్కువ బాణములను ప్రయోగం చెయ్యగలిగే శక్తి లక్ష్మణుడికి ఉంది. నాకోసమని యుద్ధానికి వచ్చి లక్ష్మణుడు ఇలా పడిపోతే నాకు ఇంక సీత ఎందుకు. నాకు ఈ జీవితం అక్కరలేదు” అని రాముడు బాధపడ్డాడు.

అప్పుడాయన సుగ్రీవుడిని పిలిచి… 

“సుగ్రీవా! ఇప్పటివరకూ నువ్వు నాకు చేసిన ఉపకారం చాలు, లక్ష్మణుడిని ఇలా చూస్తూ నేను బ్రతకను. నేను శరీరాన్ని వదిలేస్తాను. ఇది తెలిశాక రావణుడు నిన్ను విడిచిపెట్టడు, అందుకని నువ్వు నీ సైన్యాన్ని తీసుకొని సేతువు దాటి వెనక్కి వెళ్ళిపో. జాంబవంతా, హనుమా, అంగదా, మీరందరూ నాకు మహోపకారం చేశారు, మీరందరూ వెళ్ళిపొండి. నేను ఒక్క విషయానికే సిగ్గుపడుతున్నాను, విభీషణుడికి లంకా రాజ్యం ఇస్తానని ప్రతిజ్ఞ చేశాను, ఇప్పుడది అసత్య వాక్కు అయ్యింది. అసత్య వాక్యం నా నోటి నుండి దొర్లిందని నేను బాధపడుతున్నాను” అన్నాడు.

అప్పుడు సుగ్రీవుడు… “విభీషణా! నువ్వు వానరాలని తీసుకొని కిష్కిందకి వెళ్ళు, నేను రావణుడిని సంహరించి సీతమ్మని తీసుకొస్తాను. సుషేణా! వీళ్ళు మూర్చపోయి ఉన్నారు, ఇంకా వీళ్ళ ప్రాణములు పోలేదు, తొందరగా వీళ్ళని కిష్కిందకి తీసుకుపో!”అన్నాడు.```

        *రేపు…85వ భాగం*

*🚩జై శ్రీరామ్.! జై శ్రీ రామ్.!🚩*                           

       *🙏జై జై శ్రీ రామ్.!🙏*

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*

 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏

_స్కంద పంచమి / స్కంద షష్ఠి_*

 *_𝕝𝕝ॐ𝕝𝕝 నేడు - ఆషాఢ శుద్ధ పంచమీ - స్కంద పంచమీ 𝕝𝕝卐𝕝𝕝_*

*≈≈≈❀┉┅━❀ 🕉️ ❀┉┅━❀≈≈≈*

*_స్కంద పంచమి / స్కంద షష్ఠి_* 

ఆషాడ శుక్ల పంచమినీ స్కంద పంచమి అని, ఆషాడ శుక్ల షష్ఠినీ స్కంద షష్ఠి / కుమార షష్ఠి అని అంటారు.

తెలుగునాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే నమ్మకం ఎక్కువే. పిల్లలు పుట్టకపోయినా, జాతకపరంగా ఎలాంటి దోషాలు ఉన్నా కూడా ఆ స్వామిని పూజిస్తే ఫలితం కనిపిస్తుందని నమ్ముతారు. ఇంతకీ ఆ సుబ్రహ్మణ్యస్వామి జన్మించింది ఎప్పుడూ అంటే కుమార షష్ఠి రోజే.

శివుడు ఓసారి తీవ్రమైన ధ్యానంలో ఉన్నాడు. ఆ సమయంలో మన్మధుడు ఆయన ధ్యానానికి ఆటంకం కలిగించాడట. అంతే ! మన్మధుడి మీద శివునికి విపరీతమైన కోపం వచ్చేసింది. వెంటనే తన మూడో కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేసేశాడు. అదే సమయంలో ఆయన నుంచి గొప్ప తేజస్సు కూడా బయటకు వచ్చింది. ఆ తేజస్సుని అగ్నిదేవుడు కూడా భరించలేకపోయాడు. దాంతో ఆయన దాన్ని గంగానదిలో రెల్లుపొదల మధ్య విడిచిపెట్టాడు. ఆ తేజస్సే కుమారస్వామిగా అవతరించింది.

*కుమారస్వామి అవతరించింది ఆషాఢమాసంలోని షష్ఠి తిథినాడే అని కొందరి నమ్మకం. అందుకే ఆ రోజుని *కుమార షష్ఠి* పేరుతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. కుమారస్వామి ఆరు ముఖాలతో అవతరించాడు కాబట్టి ఆయనను షణ్ముఖుడు అని పిలుస్తారు. అందుకే ఆయనకు *షష్ఠి తిథి* అంటే చాలా ఇష్టం. ఇక *ఆషాఢమాసంలో తను పుట్టిన రోజైన కుమార షష్ఠి అంటే మరీ ఇష్టం.*

కుమార షష్ఠిని రెండు రోజులపాటు ఘనంగా చేసుకుంటారు. ఆ ముందు రోజుని *స్కంద పంచమిగా* పిలుస్తారు. ఈ పంచమి రోజున ఉపవాసం ఉండి , కుమారషష్టి రోజున స్వామిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ రెండు రోజుల్లో వల్లీ, దేవసేన సమేతంగా ఉన్నా స్వామి ఆలయానికి వెళ్తి దర్శించుకుంటే సంతానం కలిగి తీరుతుంది. ఈ రోజుల్లో స్వామికి అభిషేకం చేయించినా , సుబ్రహ్మణ్యాష్టకాన్ని చదువుకున్నా కూడా ఆయన అనుగ్రహం లభిస్తుంది. వీలైతే మనకి దగ్గరలో ఉన్న నాగరాళ్లు లేదా పుట్ట దగ్గర చిమ్మిలి ప్రసాదాన్ని ఉంచి పాలు పోసినా మంచిదే !

*స్కంద పంచమి, కుమార షష్ఠి* రోజులలో ఇలా స్వామిని కనుక ఆరాధిస్తే జాతకపరంగా ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయట. సంతానం కలగాలన్నా , సంపదలు రావాలన్నా ఈ రోజు స్వామిని పూజించాలి. కోర్టు లావాదేవీలలో విజయం సాధించాలన్నా , రాబోయే పరీక్షలలో మంచి మార్కులు రావాలన్నా ఈ స్కంద పంచమి, షష్ఠి తిథులలో స్వామిని తల్చుకోవాలి.

*_𝕝𝕝ॐ𝕝𝕝 oఓo శరవణ భవాయ నమః 𝕝𝕝卐𝕝𝕝_*

🌹 *శుభమస్తు* 🌹

*_𝕝𝕝 లోకాస్సమస్తాః సుఖినో భవన్తు 𝕝𝕝_*

అవస్థా త్రయం

 అవస్థా త్రయం --- తురీయావస్తా 🙏

        మొదటి భాగం 

ముందుగా మనస్సు స్థితి ఎల్లావుంటుంది చూద్దాము

ఎల్లప్పుడు మనస్సు అనేక విషయాలపై సంచరిస్తూ వుంటుంది. మనస్సును ఒక వస్తువుపై లగ్నంచేయటం మన చేతుల్లో లేదు. కాని కొన్ని సమయాల్లో మనకు తెలియకుండానే అది జరుగుతుంది. మనం దాన్ని స్థిరీకరిద్దామని యత్నిస్తే స్థిరీకరింపబడదు. ఉదాహరణకు పూజలు, ధ్యానం చేస్తున్నప్పుడు మనమనస్సు ఒకే విషయంపై పరిభ్రమిస్తూ వుంటుంది. కాని మనకు తెలియని స్థితిలో అది అప్రయత్నంగా మరొక విషయంపై లగ్నమై వుంటుంది. మనస్సు అలా లగ్నం కాకుండా ఉందంటే అది నిద్రాసమయం. వ్యక్తి మనస్సును లగ్నం చేసినా, చేయకపోయినా, నిద్రాసమయంలో మనస్సు సుఖాన్ని పొందుతుంది.

మనసు చాలా చంచలమైంది. దానిని నిశ్చలం చేయుటకు ఎన్ని పాట్లు పడాలి. ఆలోచనల పరంపరలో సంచారిస్తూ ఉంటుంది.

మనసు, బుద్ది, అహంకారం, చిత్తం ఇది అంతరంగ చతుష్టయం 

శ్రీచక్రార్చనలో మనో బుద్ది చిత్త అహంకారాత్మక అని చతుర్ధావరణలో వస్తుంది. అసలు ఏది మనస్సు? ఏది బుద్ది? ఏది చిత్తం? ఏది అహంకారం తెలుసుకోవాలి 

 అహంకార మమకారాలన్న సంకెళ్లలో మనిషిని బంధించాలన్నా, వాటి నుండి విముక్తి కలిగించాలన్నా, మనసే కారణం’ అంటోంది అమృత బిందూపనిషత్తు. మనిషి ఈ జీవితంలో ఏ కార్యకలాపాల్ని కొన సాగించాలన్నా, ఏ వ్యవహారాల్ని నిర్వహించాలన్నా, ఆతనికి ఉన్న సాధనాలు రెండే రెండు. పంచ కర్మేంద్రియాలతో, పంచ జ్ఞానేంద్రి యాలతో కూడిన శరీరం అందులో మొదటి బహిరంగ సాధనం. రెండవది అంతరంగం అనబడే సాధనం. ఈ అంతరంగం వాస్తవంగా ఒకటే అయినా, వృత్తి భేదాన్ని బట్టి మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అని పిలుస్తుంటారు.

 ఒకే వ్యక్తి ఆఫీస్‌లో ఉన్నప్పుడు ఉద్యోగి అనీ, ఇంటికి వచ్చినప్పుడు భార్యకు భర్త అనీ, పుత్రునికి తండ్రి అనీ, సహచరునకు మిత్రుడనీ, వ్యవహారాన్ని బట్టి వివిధంగా ఎలా పిలవబడతాడో, అలాగే అంత రంగమే డోలాయమాన స్థితిలో ఉన్నప్పుడు, ఈ పని చేయాలా ఆ పని చేయాలా, అసలు ఏ పనీ చేయకుండా ఉండాలా అని ఆలోచించేటప్పుడు మనస్సు అనీఅంటాము , ఈ పనినే చేద్దాం అని నిశ్చయించుకున్నప్పుడు బుద్ధి అనీఅంటాము , ఆ చేసిన పనిని గుర్తు ఉంచుకునేటప్పుడు చిత్తమనీ అంటాము , ఆ పని ఫలితాన్ని అనుభ వించేటప్పుడు అహంకారమనీ పిలుస్తారు. ఈ అంతరంగం అధీ నంలోనే, బహిరంగ సాధనమైన శరీరం స్పందిస్తుంది

మనసు, బుద్ధి, అహంకారంo, చిత్తం-ఈ నాలుగూ మనసులోని విభిన్న స్థితులు. అవి ఏమిటో వాటి పనులేమిటో చూద్దాం! 

మనసు అన్నది ఇక్కడ చేతన మనసును సూచిస్తుంది. మనం కన్ను, చెవి, ముక్కు మొదలగు ఇంద్రియాలద్వారా బాహ్య జగత్తును అనుభవించటం ఈ మనసు ద్వారానే జరుగుతుంది. ఇంద్రియాలు పంపే సమాచారాన్ని సేకరించి ఈ మనసే మన సుఖ లేక దుఃఖ అనుభూతులకు హేతువు అవుతుంది.

మనసు యొక్క నిర్ణయాత్మకమైన భాగం బుద్ధి అనబడుతుంది. "ఇటుగా వచ్చేది ఎవరు?రాముడేనా లేక భీముడా?" అంటూ తికమక పడేది మనసు. "ఆ వచ్చేది నిశ్చయంగా రాముడే" అని నిర్ణయించేది లేక ద్రువీకరించేది బుద్ధి. 

ఇంద్రియాల ద్వారా మనం అనుక్షణం పొందే అనుభవాలు ప్రతి ఒకటి మన మనసు పొరలలో ఒక్కొక్క విభాగం గా ప్రోగుచేయ బడతాయి. దీనినే చిత్తం అంటారు. మనసు ఒక విషయాన్నీ గురించి నిర్ణయించలేక తికమక పడినప్పుడు, చిత్తం లో ఉన్న పాత అనుభవాలను జోడించి బుద్ధి ఒక నిర్ణయానికి వస్తుంది. "ఇతడా లేక అతడా?" అన్న ప్రశ్న తలెత్తినప్పుడు బుద్ది మనసును సలహా అడుగుతుంది. అతనిని ఇంతకు క్రితమే మనం చూసిన అనుభవం ఉంటె, వాటి తాలూకు గుర్తులు అక్కడ వుంటాయి. దానిని బట్టి "ఇది అతడే!" అని బుద్ధి నిర్ణయానికి వస్తుంది. 

మనం మెలకువగా ఉన్నప్పుడూ, కల కంటున్నప్పుడూ, గాఢ నిద్రపోతున్నప్పుడూ, లేక ఏ స్థితిలో ఉన్నప్పటికీ, 'నేను ఉన్నాను' అన్న స్ఫురణ మనను విడిచిపోదు. అది మన మనసు వెంటే ఎప్పుడూ ఉంటుంది. దీనినే అహం లేక నేను అంటారు. ప్రతి అనుభవానికి ప్రాతిపదిక గా అహం ఉంటుంది. అది లేకుండా మనకు ఏ అనుభవం ఉండదు. కనుక అన్నిటినీ ' నా అనుభవాలు' అంటాము

ఇక విషయంలోకి వద్దాము 

శ్రీం బీజాక్షరానికి ఉన్న అనేక అర్ధములలో జాగ్రత్, స్వప్న, సుషుప్తి, తురీయ అవస్తా చతుష్టయం అని అర్ధం కూడా ఉంది. త్రిపుటి అనేక అర్ధములలో చెప్పబడిన వాటిలో జాగ్రత్, స్వప్న, సుషుప్తి కూడా ఒకటి.జాగ్రత్, స్వప్న, సుషుప్తి జీవకోటికి సర్వ సాధారణము. తమో గుణానికి ప్రతీక నిద్ర. ఇదే మాయా స్వరూపము.అసలు మాయ అంటే అర్ధం ఏమిటి? " మా " అంటే కాదు అని అర్ధం "యా " అంటే ఏది అని అర్ధం.

ఇప్పుడు తాత్పర్యం చూస్తే..ఏది సత్యం కాదో అది మాయ.

మెలకువలో ఉండడం , కలలుకనడం , గాఢనిద్ర ఈ మూడు స్థితులనూ జాగ్రత్‌, స్వప్న, సుషుప్తి అంటారు . వీటినే అవస్థాత్రయం అంటారు. మెలకువ స్థితిలో బాహ్యప్రపంచ జ్ఞానంతో వ్యవహరిస్తాం. పనులు చేస్తుంటాం. ఇది జాగృతావస్థ.

ఇక స్వప్నా వస్థలో మెలకువగా ఉన్నప్పటి అనుభవాలు, జ్ఞాపకాలు మనసులో సూక్ష్మసంస్కారాలుగా ఏర్పడి స్వప్నంలో మనకు , క్రమపద్ధతిలోనో లేకపోతే మరొక విధంగానో కనిపిస్తాయి. స్వప్నావస్థను అర్ధసుషుప్తి అని కూడా అంటారు. అంటే సగం నిద్ర అన్నమాట. స్వప్నంలో శరీర అవయవాలకు విశ్రాంతి లభించినా, జ్ఞానేంద్రియాలకు విశ్రాంతి లభించదు.మనస్సు పనిచేస్తూ ఉంటుంది.ఇక సుషుప్తిలో.. అంటే గాఢ నిద్రలో శరీరంతో పాటు ఇంద్రియాలకు కూడా పూర్తి విశ్రాంతి లభిస్తుంది. హాయిగా నిద్రిస్తాం.

జాగృత్ (మెలకువ) స్థితిలో ఆత్మతత్వం అనేది కన్నులయందు.., స్వప్నావస్థలో హృదయమునందు, సుషుప్తిలో ప్రాణమునందు ఉంటుంది. సుషుప్తిలో ఆత్మ శరీరాన్ని ప్రాణాలకు అప్పగించి తాను అంతర్యామితో (జీవాత్మ ) కలిసి సుఖిస్తుంది. అందుకే గాఢనిద్ర నుంచి మేల్కొన్న తర్వాత ‘నేను సుఖంగా నిద్రపోయాను’ అంటాం. ఇది మనందరికీ అనుభవంలోని విషయమే.

అవస్థాత్రయం కాకుండా ఆత్మకు నాల్గవ పాదం ఉన్నది. అది తురీయ స్థితి. తురీయము.. యోగం ద్వారా పొందవలసింది.మనకు అనుభవంలో ఉండదు.

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

మౌనంగా ఉండాల్సిన

 *🧘‍♂️ మౌనంగా ఉండాల్సిన 10 సందర్భాలు:*

1️⃣ నీ కోపాన్ని సరైన మాటల్లోకి మార్చలేకపోతే – మౌనంగా ఉండు.

2️⃣ బాగా కోపం వచ్చిన వేళ కూడా – మౌనంగా ఉండు.

3️⃣ నీ మాటలు ఎవరినైనా బాధించే పరిస్థితి ఉంటే – మౌనంగా ఉండు.

4️⃣ నీ మాటలు స్నేహాన్ని చెడగొట్టే పరిస్థితిలో – మౌనంగా ఉండు.

5️⃣ నీ మౌనం ఒక బంధాన్ని కాపాడగలిగితే – మౌనంగా ఉండు.

6️⃣ నీకు పూర్తిగా సంగతులు తెలియనప్పుడు – మౌనంగా ఉండు.

7️⃣ మాట్లాడటం కేవలం నీ స్వార్థం కోసం, గర్వాన్ని చూపించటానికి అయితే – మౌనంగా ఉండు.

8️⃣ నీ మాటలు ఎవరైనా నమ్మకాన్ని దెబ్బతీస్తే – మౌనంగా ఉండు.

9️⃣ ఆ విషయం మీద సరైన అవగాహన లేనప్పుడు – మౌనంగా ఉండు.

🔟 ఎవరైనా వారి వ్యక్తిగత సమస్యలు లేదా బాధలు చెప్పుతున్నప్పుడు – మౌనంగా ఉండు.

📌 ఎప్పుడు మాట్లాడాలి అన్నదాని కన్నా , ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలుసుకోవడం నిజమైన జ్ఞానం.

తీర్థయాత్రలకి వెళ్ళాలి

 *👉మీ పిల్లలకు స్నానం చేయగానే నుదుటన కనిపించే విధంగ బొట్టు పెట్టుకునేలా చూడండి.*

 *👉సూర్యునికి నమస్కారం, పూజగదిలో దేవునికి నమస్కారం చేయించండి*

*👉వారానికి ఒక్కసారి దేవాలయంకి తీసుకోని వెళ్ళండి.*

*👉పుట్టిన రోజు నాడు హిందూ పద్ధతిలో జన్మదినం చేయండి*

*👉టివి, సెల్ ఫోన్ పిల్లలకి ఇవ్వకండి. వారితో స్నేహంగా ఉండండి.*

*👉స్కూల్ నుండి వచ్చిన తరువాత హోమ్ వర్క్ చేయించండి. వారి చదువుపైన శ్రద్ధ పెట్టండి.*

*👉పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్ తినే విధంగా చూడండి*

*👉రోజుఆటలు, ఆడే విధంగచూడండి.*

*👉నీతి కథలు, మహనీయులజీవితచరిత్రలు, చదివే విధంగా ఏర్పాటు చేయండి*

*👉పెద్దలను గౌరవించేవిధంగా చూడాలి. అందరితో స్నేహంగా ఉండాలి*

*👉ఒకరికి ఇవ్వడం, పంచుకొని తినడం, సహాయం చేయడం లాంటివి నేర్పాలి*

*👉పిల్లలకి ఇంట్లో చిన్న చిన్న పనులు చేయించాలి*

*👉మీగోత్రం, వంశం, కులం, మీ పూర్వికుల గురించి చెప్పండి.*

*👉సంవత్సరానికి ఒక్కసారి కుటుంబంతో కలసి తీర్థయాత్రలకి వెళ్ళాలి. అక్కడ ఆ క్షేత్రం గురించి చెప్పండి*

*👉ఇంట్లో వృద్ధులు ఉంటే వారికి సేవచేసే విధంగా చూడాలి*

*👉పై విషయాలు ముందు మీరు పాటిస్తూ, పిల్లలచేత చేయించండి*

*🙏

గురుత్వాకర్షణ సిద్ధాంతం

 గురుత్వాకర్షణ సిద్ధాంతం కనుగొన్నది ఎవరు? Many Apples had fallen down prior to Newton's Gravity Laws

గురుత్వాకర్షణ సిద్ధాంతం (Law of Gravitation) కనుగొన్నది న్యూటనా!? ఇది పూర్తిగా అసత్యం. ఎందుకంటే ప్రాచీన భారతీయ గ్రంథాల నిండా గురుత్వాకర్షణ సిద్ధాంతం గురించి ప్రస్తావించబడి వుంది.

1. "సూర్య సిద్ధాంతమనే ప్రాచీన గ్రంథంలో ఇలా చెప్పబడింది. "ధారణాత్మక శక్తి కారణంగా భూమి ఆకాశంలో పడిపోకుండా నిలబడుతున్నది. (సూ. సి. 12 అ- 32 శ్లో॥)

శ్లో॥ మధ్యే సమన్తాదణ్ణస్య భూగోలో వ్యోమ్ని తిష్ఠతి। బిభ్రాణః పరమాం శక్తిం బ్రహ్మణో ధారణాత్మికామ్ ||

2. వరాహమిహురుడు (క్రీ. శ. 505) తన "పంచ సిద్ధాంతి" అనే గ్రంథంలో గురుత్వాకర్షణ శక్తి గురించి- "భూతలంలోని ఏ భాగంలో అయినా.. అన్ని జ్వాలలు పైకెగుస్తాయి. పైకి వేసిన వస్తువు కింద పడుతుంది. ఈ అనుభవం అందరికీ తెలిసినదే. సమానమైనదే" అని అంటాడు. (పం. సి. 13 4)

శ్లో॥ గగనముపైతి శిఖిశిఖా క్షిప్తమపి క్షితముపైతి గురు కించిత్| యద్వదిహ మానవానాం అసురాణాం తద్వదేవా!

3. "లీలావతి" అనే గ్రంథంలో “భువనకోశం" అనే సర్గలో భాస్కరాచార్యుడు (క్రీ. శ. 1114) తన పుత్రిక లీలావతికి "భూమి గురుత్వాకర్షణ శక్తి కలిగి ఉంది. ఖగోళంలో గ్రహాల పరస్పర ఆకర్షణ శక్తి వల్లా అవి అక్కడ తమకు తామే ఆధారభూతమై నిలిచి ఉన్నాయని" చక్కగా వివరించాడు.

4. "సిద్దాంత శిరోమణి" (భాస్కరాచార్యుడు) అనే గ్రంథంలో 'భువనకోశం' అనే అధ్యాయంలో 6వ శ్లోకంలో గురుత్వాకర్షణ శక్తి గురించి చాలా చక్కగా వివరించాడు.

శ్లో॥ ఆకృష్టిశక్తిశ్చ మహీతయా యత్ స్వస్థం/ గురు స్వాభిముఖం స్వశక్త్యాం ఆకృష్యతే తత్పతతీవతి/ సమే సమన్తాత్ క్వ పతత్వియం భే॥

భూమి ఆకాశంలో ఉన్న వస్తువులను సహజంగా, స్వశక్తితో.. తన వైపునకు ఆకర్షిస్తుంది. ఈ ఆకర్షణ వలన అన్ని వస్తువులు భూమిమీద పడతాయి. ఆకాశంలోని వివిధ గ్రహాల మధ్య సమాన ఆకర్షణ శక్తి ఉన్నప్పుడు అవి ఎక్కడ పడతాయి?

5. బ్రహ్మగుప్తుడు (క్రీ. శ. 591) రచించిన 'బ్రహ్మస్పుర సిద్ధాంతం'లో "వస్తువులు భూమి వైపు ఆకర్షింప బడతాయి. నీటికి ఎలా సహజ ప్రవాహశక్తి ఉన్నదో. అలా భూమికి సహజమైన ఆకర్షణశక్తి ఉంది. అని చెప్పాడు.

6. జగద్గురువు ఆదిశంకరుల వారు వారి 'ప్రశ్నోపనిషత్' భాష్యంలో 'అపాన'శక్తి గురించి రాస్తూ... "ఒక వస్తువును పైకి ఎగురవేస్తే దానిని ఎట్లు భూమి ఆకర్షిస్తుందో... అటులనే పైకి లాగబడే 'ప్రాణ' శక్తిని 'అపాన'శక్తి కిందకు లాగుతోంది. (3-8 శ్లో॥ అని చెప్పారు.

శ్లో॥ "తథా పృథివ్యామభిమానినీ యా దేవతా ప్రసిద్ధా సైషా పురుషస్య అపానవృత్తిమవష్టఖ్యాకృష్య వశీకృత్యాధ ఏవ అపకర్షణ అనుగ్రహం కుర్వతీ వర్తత ఇత్యర్థ॥ అన్యథా హి శరీరం గురుత్వాత్ పఠేత్ సావకాశే వోద్గచ్ఛేత్||"

ఆ తరువాతి భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞుల గ్రంథాలలో కూడా "గురుత్వాకర్షణ" సిద్ధాంతం వివరింపబడి ఉంది. న్యూటను కంటే ఎన్నో వందల సంవత్సరాల పూర్వమే 'గురుత్వాకర్షణ' గురించి భారతీయ విజ్ఞానం ఘోషించింది.(భారతీయ ప్రతిభా విశేషాలు 108 నిజాలు పుస్తక సౌజన్యం)

మక్క నొప్పి గాని

 మక్క నొప్పి గాని మడమలో నొప్పైన

నడుము మెడను యరిగి నరము నొప్పి

సరిగ జేయు యోగ సరియౌను హోమ్యోతొ

సకురు అప్ప రావు సత్య మిదిర!

భావం: కీళ్ళలో, మక్కల్లో, వెన్ను పూసలలో, మడమల్లో రక్త ప్రసరణ తగ్గి, తగిన పోషక పదార్థాలు అందకపోవడం వలన అక్కడి మృదులాస్థి క్షీణించి, రెండు ఎముకల సందుల్లో ఉండే కండరాలు, నాడులు, రక్తనాళాలు, రుబ్బురోలులో పడి నలిగి పోయినట్లు నలిగిపోతూ,తీవ్రమైన నొప్పి కలుగుతుంది! అలాగే గౌట్ వలన, యూరిక్ ఆసిడ్ పెరగటం వలన, ఆక్సిడెంట్లు, శ్రమ వలన కూడా కీళ్ళు, నడుము, మెడ, మడమ నొప్పులు వచ్చినా, పెయిన్ కిల్లర్, ఏంటీబయోటిక్, కాల్షియం, స్టెరాయిడ్లు వాడుకుంటూ సమస్యను ముదరబెట్టుకోవడం మానేసి, యోగా, హోమియోల ద్వారా సవ్యంగా నయం చేసుకుని, పది కాలాలు మీ కాళ్ళపై మీరు సుఖంగా నడవండి! ఇన్స్టెంట్ రిలీఫ్ కోసం ఇంగ్లీషు వైద్యం వెంట పరుగెత్తి, చివరకు కీళ్ళ మార్పిడి ఆపరేషన్లతో జీవితాన్ని చంకనాకించుకోవద్దు! 

సకురు అప్పారావూ ఇది తప్పకుండా అందరూ తెలుసుకోవాల్సిన నిజం! 

ఈ ఆటవెలది పద్యాల శతక కవి: హోమియో వైద్యులు సకురు అప్పారావు గారు, 9848025870

(ఎంతటి కఠినమైన, అసాధ్యమైన వ్యాధులకైనా దేశంలో ఎంతటి మారుమూల గ్రామంలో ఉన్న వారికైనా, ఇంటి వద్దకే మందులు పంపుతూ, అనునిత్యం ఫోన్ ద్వారా టచ్ లో ఉంటూ, క్షణక్షణం సూచనలిస్తూ, అనేక మంది వ్యాధులను నివారణ చేస్తున్నవారు! అలాగే కుటుంబ సభ్యులలో ఎవరికి ఎటువంటి ఎమర్జెన్సీ మరియు ప్రాణాపాయ ఆపద కలిగినా, ఎవరికి వారే వైద్యం చేసుకుని, ఇంటిలోని అందరినీ కాపాడుకోగలిగే సర్వరోగ నివారిణి లాంటి అమృతాన్ని కనిపెట్టి, "సకురు అప్పారావు గారి 1,2,3 ఫార్ములా ఫామిలీ కిట్" అనే పేరుతో ప్రజలకు అందిస్తున్నవారు!)

Panchaag

సుబ్రమణ్య భుజంగ స్తోత్రం*

 *సుబ్రమణ్య భుజంగ స్తోత్రం*

గురూజీ, వివిధ స్తోత్రాలు మరియు వాటిని స్మరించు విధానాలను మీరు ప్రతి ఆదివారం నేర్పించు ఆన్లైన్ తరగతులలో నేను మరియు నా సతీమణి ఇద్దరూ సభ్యులే. మీరు కొన్ని రోజులుగా నేర్పిస్తున్న సుబ్రమణ్యస్వామిని స్తుతించు సుబ్రమణ్య భుజంగ స్తోత్రం ద్వారా నా జీవితంలో జరిగిన అసాధారణ మరియు ఆశ్చర్యకరమైన విషయాల గురించి మీకు నేను విన్నవిస్తున్నాను.

నేనూ నా భార్య ఇద్దరూ 68 సంవత్సరాల వయస్సు పైబడినవాళ్ళమే. మా ఇద్దరు కొడుకులు ఇతర పట్టణాల్లో విదేశాల్లో వారి వారి ఉద్యోగాలు కుటుంబాలతో నిమగ్నమై ఉండడంతో నేను నా భార్యతో సహా ఒంటరిగానే ఉంటున్నాను.

ఈ సంవత్సరం మే నెల రెండవ ఆదివారం గురువు గారు సుబ్రమణ్య భుజంగ స్తోత్రంలోని 24 నుండి 28 వరకు సంఖ్య గల శ్లోకాలను వివరిస్తున్నారు. వాటిలో ప్రత్యేకంగా 28వ శ్లోక ప్రస్తావనలో ఆ శ్లోకం పఠించడం మూలానా ఎన్నో ఆరోగ్య సమస్యలు, ఉదాహరణకు టీబీ, ఆర్తరైటిస్, లెప్రసి, డిప్రెషన్ మొదలగు దీర్ఘకాల వ్యాధులు నయమవుతాయని, ఇలాంటి అనారోగ్య పరిస్థితులు రూపుమాపడానికి కావలిసిందల్లా నమ్మకంతో వినయ విధేయలతో ప్రతిరోజు సుబ్రమణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించి, తిరుచెందూరు సుబ్రమణ్యస్వామి విభూతిని నుదుటన ధరించాలి అని వివరించారు. 

నా భార్య చాలా రోజుల నుండి మానసిక ఆందోళనతో (mental depression) బాధపడుతున్నారు. గత 8 నెలలుగా ఈ విషమ పరిస్థితి తీవ్రస్థాయికు చేరడంతో వైద్యులు ఆవిడకు అల్జైమర్ వ్యాధి సంక్రమించే అపాయము కూడా కలదన్న సందేహాన్ని కూడా వెలిబుచ్చారు. 

ఇలాంటి మానసిక ఆందోళనలవల్ల తను ఎప్పుడూ ఒంటరిగా ఉండడానికే ప్రయత్నించడం, ఎవ్వరితోనూ అంటే కొడుకు కోడళ్ళతోనూ మనుమలతోను సరిగ్గా మాట్లాడకపోవడం, చివరకు నాతో కూడా ఆచితూచి మాట్లాడడం, ఇంటి పనులు, వంట పనులపై ఎక్కువ ఆసక్తి చూపకపోవడం, సరియైన దుస్తులు ధరించక పోవడం, ఇలా ఎన్నెన్నో సమస్యలు ఎదురయ్యేవి. మానసిక వైద్య నిపుణులు మరియు హోమియో వైద్యుల పర్యవేక్షణలోనే తను జీవనం కొనసాగుతూ ఉండేది. 

మే నెల రెండవ ఆదివారం గురూజీ ఆన్లైన్ తరగతుల్లో నేను పాల్గొని ఆదిశంకరాచార్య విరచిత సుబ్రమణ్య భుజంగ స్తోత్రం గురించిన ప్రసంగాలు విన్న తర్వాత సుమారు సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో సుబ్రమణ్యస్వామిని ప్రతిరోజు సుబ్రమణ్య భుజంగా స్తోత్రాన్ని పఠిస్తానని నా భార్య అనారోగ్య పరిస్థితుల నుండి విముక్తి పొందితే తిరుచెందూరుకు ఇద్దరూ ఏతెంచి మొక్కుబడులు చెల్లిస్తామని వేడుకొన్నాను. నేను వేడుకొన్న విషయాన్ని గురించి ఆవిడతో చర్చించలేదు. 

ఆనాటి సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. అది ఏంటంటే అప్పటిదాకా తను ఎటువంటి విషయాలపై ఆసక్తి చూపేవారు కారు. కాని ఆ సాయంత్రం నుండి తాను అకస్మాత్తుగా ఎంతో చురుకుగా చక్కని దుస్తులు ధరించి ఇంటి దగ్గర్లోనున్న వినాయకుడి దేవాలయానికి వెళ్ళారు, ఇంటికి తిరిగి రాగానే కొడుకు కోడళ్ళు మనుమలు మనుమరాండ్లతో సంభాషించడం ప్రారంభించారు. ఇరుగుపొరుగు వారితో ఎంతో చనువుగా కలుపుగోలుగా మాటలు కలిపారు. ఇంటి పనులు వంట పనుల్లో ఎంతో ఆసక్తి కనబరిచారు. ప్రతిరోజు మందులు తీసుకోవడంతో పొద్దున 7.30 గంటలకు పైబడే లేసే ఆవిడ 5.30 కే లేచి తన పనుల్లో తీవ్రంగా నిమగ్నమయ్యారు. ఇలా ప్రతి రోజూ ఆవిడ ఆరోగ్యం ఎంతో అభివృద్ధి చెందింది. ఆవిడలో ఈ పరిణామాలు చూసిన తర్వాత మొన్న దాకా తను ఒక వ్యాధితో బాధపడే ఆనవాళ్లే లేవు.

ఓ రెండు వారాలు తన ఆరోగ్య పరిస్థితులు మెరుగవడంతో గురూజీ వివరించిన సుబ్రమణ్య భుజంగ స్తోత్రాన్ని అత్యంత నియమ నిష్టలతో ధ్యానించడం వల్ల తనలో ఇలాంటి అభివృద్ధి చేకూరిందని ఆవిడతో చెప్పాను. ఈ స్తోత్రాలపై ఆవిడకూ ఆసక్తి పెరిగి ప్రతిరోజు ఆ శ్లోకాలను పఠించడం మొదలెట్టారు, తిరుచెందూరుకు వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం గురించి ఉవ్విళ్లూరేవారు.

మేము సుబ్రమణ్యస్వామి వారి అనుగ్రహం పొందినట్టే. ఇలాంటి ఓ అనూహ్య అనుభవంతో కొద్ది రోజుల క్రితమే తిరుచెందూరుకు వెళ్ళి స్వామిని దర్శించుకొన్నాము. ఆ కోవెల ప్రాకారంలోనే కూర్చుండి సుబ్రమణ్యస్వామి భుజంగ స్తోత్రాన్ని తనివితీరా పఠించాము.

మానసిక వైద్య నిపుణులు కూడా ఆవిడలోని ఈ మార్పును చూసి ఆశ్చర్యచకితులయ్యారు. వెంటనే తను తీసుకోవలసిన మందులను కూడా చాలా వరకు ఆపేయమన్నారు. తన ఆరోగ్య పరిస్థితులు ఇంతలా మెరుగుపడడం వైద్యులకే అర్థం కాని పరిస్థితి.

అసలు తన మెదడు పూర్తిగా దెబ్బతినే పరిస్థితులనుండి కోలుకొని తన పూర్వ ఆరోగ్యా వైభవాన్ని మరల పొందినందుకు సుబ్రమణ్యస్వామి అనుగ్రహమే కారణం. ఆది శంకరాచార్యుల వారి సుబ్రమణ్యస్వామి భుజంగ స్తోత్రం ఒక్కటే కాకుండా గురువు గారి దిశా నిర్దేశం, ఆశీర్వాదములు కూడా దోహదకారయ్యాయి. నేను గురువు గారికి ఎల్లప్పుడూ ఋణపడి యున్నాను. 

ఈ వృత్తాంతాలన్నీ నా స్నేహితులు ఒకరితో పంచుకొన్నాను. వారు కూడా సుబ్రమణ్య భుజంగ స్తోత్ర పుస్తకాన్ని కొనుక్కొని చదవడం ప్రారంభించడంతో వారికి ఎన్నో రోజులుగా సతాయిస్తున్న కుటుంబ కలహాలు అంతరించి సానుకూల వాతావరణం ఏర్పడడం, వారికి రావలసిన డబ్బులు తిరిగి రావటం లాంటివి జరిగిందట. 

ఈ సందేశాన్ని అందరికి అందుబాటులో ఉంచిన యెడల సుబ్రమణ్య భుజంగ స్తోత్రాన్ని అందరూ పఠించి వారి వారి అనారోగ్య పరిస్థితుల నుండి విముక్తి పొందగలరని ఆశిస్తున్నాను. 

ఈ సందేశం మూలంగా గురువు గారికి సాష్టాంగ ప్రణామాలను అర్పిస్తున్నాను. నమస్కారం గురూజీ.

వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు - ఆషాడ మాసం - శుక్ల పక్షం -‌ పంచమి - మఘ -‌‌ ఇందు వాసరే* (30.06.2025)

ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.

.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

రామాయణం

 🌹🌷🏹🪔🛕🪔🏹🌷🌹

*🕉️సోమవారం 30 జూన్ 2025🕉️*

``

             *రామాయణం*

ఒకసారి చదివినంత 

మాత్రాన మన సమస్త 

పాపాలని తీసేస్తుంది. 

``

     *వాల్మీకి రామాయణం*              

           *84వ భాగం*

```

యుద్ధం ప్రారంభమయ్యింది

వానరులందరూ ఆ యుద్ధంలో ప్రాసాదాలని తిరగ తోసేసారు, పర్వత శిఖరాలని తీసుకొచ్చి విసిరేశారు, చెట్లతో కొట్టారు. కనపడ్డ ప్రతి రాక్షసుడిని చంపేశారు. నాలుగు ద్వారాలనీ మూసి ఉంచారు. బయట ఉన్నవాళ్లు బయట ఉన్నవాళ్ళతో యుద్ధం చేస్తున్నారు.

అలా ఆ వానరములకు రాక్షసులకు యుద్ధం జరగబోయేముందు రాముడు అన్నాడు… “యుద్ధం చేస్తున్న రాక్షసులు కామరుపాన్ని పొందగలరు, అలాగే వానరములలో కూడా కొంతమంది కామరూపాన్ని పొందగలరు. ఎట్టి పరిస్థితులలోను మీరు మాత్రం కామ రూపాన్ని తీసుకోకండి. ఏడుగురము మాత్రమే నర రూపంలో ఉండి యుద్ధం చేస్తాము. విభీషణుడు, ఆయన నలుగురు మంత్రులు నర రూపంలో ఉంటారు, నేను, లక్ష్మణుడు ఉంటాము. మిగిలినవారందరూ వానర రూపంలోనే ఉండండి” అని చెప్పాడు.

ఆరోజున జరిగిన యుద్ధంలో వానరములు విశేషమైన బలాధిక్యతను ప్రదర్శించి అద్భుతమైన యుద్ధాన్ని చేశారు. ఆ సమయంలో రాక్షసులు ముసలాలు, ముద్గరాలు, శూలాలు, త్రిశూలాలు, కత్తులు, బరిసెలు వంటి ఆయుధములను పట్టుకొచ్చి కనపడ్డ వానరాన్ని కొట్టి చంపి తినేస్తున్నారు. ఆ వానరములలో ఉన్న భల్లూకములు కనపడ్డ రాక్షసుడిని గట్టిగా కౌగలించుకుని మరీ తింటున్నాయి. ఆ యుద్ధ సమయంలో ఎక్కడ చూసినా పట్టుకో, తన్ను, గుద్దు, నరుకు అనే కేకలే వినపడుతున్నాయి. ఆ రాత్రంతా మహా భయంకరమైన యుద్ధం జరిగింది. శిరస్సులు బంతులు ఎగిరినట్టు ఆకాశంలోకి ఎగిరాయి. ఎక్కడ చూసినా చీలిపోయిన వక్షస్థలాలు, తెగిపోయిన కాళ్ళు, చేతులు ఉన్నాయి. ఆ ప్రాంతమంతా నెత్తుటితో బురదయ్యి యుద్ధం చేస్తుంటే కాళ్ళు జారిపోతున్నాయి. ఏనుగుల తొండాలు, కాళ్ళు, గుర్రాల కాళ్ళు మొదలైన శరీర భాగాలు ఆ యుద్ధ భూమిలో పడి ఉన్నాయి.

అటువంటి సమయంలో ఇంద్రజిత్ యుద్ధానికి వచ్చాడు. రథంలో వస్తున్న ఇంద్రజిత్ ని చూడగానే అంగదుడికి అపారమైన ఉత్సాహం వచ్చింది. అప్పుడాయన ఒక పెద్ద పర్వత శిఖరాన్ని పట్టుకొచ్చి ఇంద్రజిత్ రథం మీద పారేశాడు. 

ఆ దెబ్బకి ఇంద్రజిత్ రథం మడిసిపోయింది. ఎప్పుడైతే ఎవ్వరూ ఊహించని విధంగా అంగదుడు ఆ ఇంద్రజిత్ యొక్క రథాన్ని, గుర్రాలని, ఛత్రాన్ని విరిగిపోయేటట్టు కొట్టాడో, ఆ సంఘటనని చూసి దేవతలు, రామ లక్ష్మణులు కూడా ఆశ్చర్యపోయారు. ఇంద్రజిత్ జీవితంలో ఇప్పటిదాకా అతని రథాన్ని కొట్టినవాడు లేడు.

తన రథం విరిగిపోయేసరికి ఇంద్రజిత్ కి ఎక్కడలేని ఆగ్రహం వచ్చి ఆకాశంలోకి ఎగిరి అంతర్ధానం అయిపోయాడు. అప్పుడాయన మాయ చేత మంత్రములను అభిమంత్రించగానే చీకటి అలుముకుంది. తరువాత మాయ చేత సృష్టింపబడిన ఒక దివ్యమైన రథాన్ని ఎక్కి, ఆకాశంలో ఎవరికీ కనపడకుండా ఉండి, రామలక్ష్మణుల మీద బాణ పరంపర కురిపించాడు. కద్రువ యొక్క కుమారులైన సర్పాలని ఇంద్రజిత్ బాణములుగా వేశాడు. అవి బాణములుగా వచ్చి కొడతాయి, సర్పాలుగా చుట్టుకుని మర్మ స్థానములయందు కరుస్తుంటాయి. ఇంద్రజిత్ విడిచిపెట్టిన ఆ బాణములు రామలక్ష్మణులని నాగాస్త్ర బంధనంగా చుట్టేసింది. 

అప్పుడు రాముడు లక్ష్మణుడితో…  

“లక్ష్మణా! మనం ఇప్పుడు ఈ ఇంద్రజిత్ ని ఏమీ చెయ్యలేము. ఆబోతు వర్షాన్ని ఎలా భరిస్తుందో అలా మనం కూడా ఈ బాణాలని వహించడమే కొంతసేపు” అన్నాడు. 

తరువాత రాముడు మూర్చపోయి కిందపడిపోయాడు. 

ఓర్చుకుని నిలబడ్డ లక్ష్మణుడు రాముడి వంక చూసి ఏడుస్తూ… 

'ఏ మహానుభావుడిని ఎవ్వరూ యుద్ధ భూమిలో నిగ్రహించలేరో, ఎవరు విశ్వామిత్రుడి దగ్గర ధనుర్వేదాన్ని ఉపదేశం పొందాడో, ఏ మహానుభావుడు భార్యని విడిపించుకోడానికి ఈ లంకా పట్టణానికి వచ్చాడో అటువంటి రాముడు ఇవ్వాళ నాగాస్త్ర బంధనం చేత కట్టబడి, ఉత్సాహము ఉపశమించి, భూమి మీద పడి ప్రాణములను విడిచిపెట్టాడు' అని అనుకున్నాడు. 

తరువాత లక్ష్మణుడు కూడా కిందపడిపోయాడు. 

రాముడు పట్టుకున్న కోదండం చేతిలోనుంచి వదులయిపోయి దూరంగా పడిపోయింది. 

రామలక్ష్మణుల వేళ్ళ యొక్క చివరి భాగాల నుండి శరీరం అంతా అంగుళం చోటు లేకుండా ఇంద్రజిత్ బాణాలతో కొట్టి… “మీ వలన 

నా తండ్రి ఎన్నో రాత్రులు పాన్పు మీద నిద్రపోకుండా అటు ఇటూ దొర్లాడు. ఏ రామలక్ష్మణుల వల్ల ఈ లంకా పట్టణం పీడింపబడిందో, ఏ రామలక్ష్మణుల వల్ల మా తండ్రి నిద్రపోలేదో, అటువంటి తండ్రి ఋణం తీర్చుకోడానికి ఈ రామలక్ష్మణుల ప్రాణములు పోయే వరకూ కొడతాను” అని, వారి యొక్క మర్మస్థానములలో గురి చూసి వజ్రములవంటి బాణములతో కొట్టాడు.

అప్పుడు రాముడు మెల్లగా బాహ్య స్మృతిని కూడా కోల్పోయి భూమి మీద ఒరిగిపోయాడు, లక్ష్మణుడు కూడా ఒరిగిపోయాడు. 

అలా రామలక్ష్మణులు పడిపోగానే చుట్టూ ఉన్న వానర నాయకులు అక్కడికి వచ్చారు. 

అప్పుడు ఇంద్రజిత్ హనుమని, ఋషభుడిని, వేగదర్సిని, విభీషణుడిని, సుషేనుడిని, గంధమాధనుడిని బాణాలతో కొట్టి, వానర సైన్యం అంతటినీ కలచి వేశాడు. 

ఆ సమయంలో వానరాలు ఎటు వెళుతున్నారో, ఎవరి మీద నుంచి దాటుతున్నారో, ఎవరిని తొక్కుతున్నారో, ఎవరిని ఈడ్చేస్తున్నారో అని చూసుకోకుండా దిక్కులు పట్టి పారిపోయారు.

రామలక్ష్మణులు ప్రాణములు విడిచిపెట్టారని సుగ్రీవుడు దుఃఖితుడై ఉన్నాడు. అప్పుడు విభీషణుడు అక్కడికి వచ్చి … 

“నాయనా సుగ్రీవా! అన్ని వేళలా అందరికీ యుద్ధంలో జయము కలుగుతుందని అనుకోడానికి వీలులేదు, ఎంతటివారికైనా ప్రమాదం వస్తుంది. నువ్వు ఈ పరిస్థితులలో శోకాన్ని పొందకూడదు. ఈ సమయంలో నువ్వు శోకాన్ని పొందితే చెయ్యవలసిన పని స్ఫురణలోకి రాదు. అవతల వాళ్ళిద్దరూ ప్రమాదకరమైన స్థితిలో పడిపోయి ఉన్నారు. వాళ్ళిద్దరికీ కాని తెలివి వచ్చిందా మనం రక్షింపబడినట్టే, వాళ్ళిద్దరికీ కాని తెలివి రాకపోతే మనిద్దరమూ నాశనం అయినట్టే. రామలక్ష్మణుల శరీరాలలో కాంతి తగ్గలేదు, అంగుళం మేర కూడా విడిచిపెట్టకుండా బాణములతో కొట్టేసినా తట్టుకోగలిగిన బలము, వీర్యము, ప్రకాశము, శక్తి, మనోధైర్యము వాళ్ళకి ఉన్నాయి" అని చెప్పి, పారిపోతున్న వానర సైన్యాన్ని వెనక్కి తీసుకురావడానికి వెళ్ళాడు.

కొంతసేపటికి విభీషణుడు ఆ సైన్యంతో తిరిగి వచ్చాడు. 

అప్పటికీ రామలక్ష్మణులు కిందపడిపోయే ఉన్నారు. 

పర్వతాల నుంచి సెలయేళ్ళు ప్రవహించినట్టు ఇంద్రజిత్ యొక్క బాణములు పెట్టిన ప్రతి రంధ్రం నుండి రక్తం ఏరులై ప్రవహించింది. అలా రక్తం వెళ్ళిపోతుండడం వలన వాళ్ళ శరీరాలు నీరసపడిపోతున్నాయి. అప్పటిదాకా సుగ్రీవుడికి ధైర్యం చెప్పిన విభీషణుడు ఈ పరిస్థితిని చూసి ఏడ్చి… “నేను ఈ రాముడి మీద, లక్ష్మణుడి మీద ఆశ పెట్టుకున్నాను. రామలక్ష్మణులని ఆశ్రయిస్తే నాకు రాజ్యం లభిస్తుందని అనుకున్నాను. కాని ఈ రామలక్ష్మణులే యుద్ధంలో నిహతులయిపోయారు. ఇంక నాకు ఎవరు దిక్కు. మా అన్నయ్య నన్ను విడిచిపెట్టడు, నాకు లోకంలో ఎక్కడా రక్షణ దొరకదు. నేను దురదృష్టవంతుడిని” అని బాధపడ్డాడు.

విభీషణుడు అలా మాట్లాడేసరికి అప్పటివరకూ అక్కడ నిలబడ్డ వానర సైన్యం పారిపోవడం మొదలుపెట్టింది. 

అప్పుడు అంగదుడు అక్కడికి వచ్చి “ఇంత అసహ్యంగా, ఇంత సిగ్గులేకుండా వానర సైన్యం ఎందుకు పారిపోతోంది” అని అడిగాడు. 

అప్పుడు వాళ్ళన్నారు… “మేము రామలక్ష్మణులు పడిపోయారని పారిపోవట్లేదు, ఎక్కడైనా ఇంద్రజిత్ వస్తాడేమో అని పారిపోతున్నాము” అన్నారు. 

ఇలా పారిపోవడమనేది చాలా భయంకరమైన విషయం, దయచేసి మీరందరూ వెనక్కి రండని ఆ వానర సైన్యాన్ని వెనక్కి తీసుకొచ్చారు.

ఆ సమయంలోనే ఇంద్రజిత్ లంకా నగరానికి చేరుకొని రావణుడితో… 

“తండ్రి గారూ… మీరింక బెంగపడవలసిన అవసరం లేదు. నరులైన రామలక్ష్మణులని నేను సంహరించాను. నేను నిర్మించిన నాగాస్త్ర బంధనం చేత ఆ ఇద్దరూ యుద్ధ భూమిలో పడిపోయి ఉన్నారు. వాళ్ళ శరీరంలో నుంచి నెత్తురు ఏరులై పారుతోంది. వాళ్ళిద్దరూ మరణించారు, ఇక మీరు ప్రశాంతంగా ఉండండి” అన్నాడు.

ఈ మాట వినగానే రావణుడు అపారమైన సంతోషాన్ని పొంది అక్కడున్న భటులని పిలిచి… 

“యుద్ధానికి వచ్చిన రామలక్ష్మణులు ఇద్దరూ నా కుమారుడైన ఇంద్రజిత్ చేత సంహరింపబడ్డారు, అని లంకలో చాటింపు వేయించండి. లంకంతా తోరణాలు కట్టండి, భేరీలు మ్రోగించండి. అందరూ సంతోషించేటట్టుగా పెద్ద ఉత్సవం చెయ్యండి" అని ఆజ్ఞాపించాడు.

తరువాత అక్కడ ఉన్న రాక్షస స్త్రీలని పిలిచి… “మీరు ఒకసారి అశోకవనంలో ఉన్న సీత దగ్గరికి వెళ్ళండి. సీతని పుష్పక విమానం ఎక్కించి యుద్ధ భూమిలోకి తీసుకెళ్ళండి. ఆ యుద్ధ భూమిలో మరణించిన రామలక్ష్మణులని సీత చూస్తుంది. 'ఇంక ఎలాగూ నా భర్త మరణించాడు కదా, ఇంక రాముడి మీద ఎందుకు ఆశ' అని లంకకి వచ్చి అలంకారం చేసుకుంటుంది, మంచి చీర కట్టుకుని సర్వాలంకారభూషితై నా పాన్పు చేరుతుంది. తొందరగా వెళ్ళి చూపించండి” అన్నాడు.

యుద్ధ భూమిలో రాక్షసులు ఉత్సాహంతో గెంతులు వేస్తూ, కేకలు వేస్తూ ఆనందంగా ఉన్నారు. వానరులందరూ చాలా నిరుత్సాహంతో, దీనంగా నిలుచుని ఉన్నారు. 

అప్పుడు ఆ రాక్షసులు సీతమ్మని పుష్పక విమానంలో తీసుకెళ్ళి యుద్ధ భూమిలో పడిపోయున్న రామలక్ష్మణులని చూపించారు. 

సీతమ్మ కిందకి చూడగా, ముళ్ళు విప్పిన ముళ్ళ పంది ఎలా ఉంటుందో, అలా బాణములు చేత కొట్టబడిన రామలక్ష్మణులు ఉన్నారు. రామలక్ష్మణులు ఇద్దరూ మరణించారు అనుకొని గుండెలు బాదుకొని ఏడ్చింది. అప్పుడు సీతమ్మ… “నేను పుట్టింట్లో ఉన్నప్పుడు మహా జ్ఞానులైన జోతిష్యులు నా పాదాలు చూసి… 

'అమ్మా! నీ పాదాలలో పద్మాలు ఉన్నాయి. ఏ స్త్రీ అరికాళ్ళలో పద్మాలు ఉంటాయో, ఆ పద్మములు కలిగిన స్త్రీ తన భర్తతో పాటు సింహాసనం మీద కూర్చుని మహారాణిగా పట్టాభిషేకం చేసుకుంటుంది' అన్నారు. కాని వారు చెప్పిన మాటలన్నీ అసత్యాలు అయ్యాయి. చిన్నతనంలో మా తండ్రిగారి పక్కన నేను కూర్చుని ఉంటే దైవజ్ఞులైన వారు మా ఇంటికి ఎక్కువగా వస్తుండేవారు, అప్పుడు వాళ్ళు నా సాముద్రిక లక్షణాలు చూసి 'తల మీద వెంట్రుకలు చాలా మెత్తగా, ఒత్తుగా, నల్లగా ఉన్నటువంటి స్త్రీ ఈమె, కనుబొమ్మలు కలవని స్త్రీ ఈమె, పిక్కలు గుండ్రంగా ఉండి వాటి మీద వెంట్రుకలు లేని స్త్రీ ఈమె, దంతముల మధ్యలో ఖాళీలు లేని స్త్రీ ఈమె కనుక ఈమె అయిదోతనాన్ని పూర్ణంగా పొందుతుంది, మహానుభావుడైన వాడిని భర్తగా పొందుతుంది' అని చెప్పారు. కాని అవన్నీ అబద్ధాలు అయిపోయాయి. నా వేళ్ళ మీద ఉండే గుర్తులు, నేత్రములు, చేతులు, పాదములు, తొడలు గుండ్రంగా, సమంగా ఉండేవి, నా గోళ్ళు ఎర్రటి కాంతితో ఉండేవి, అలా ఉండడం వలన నేను పూర్ణమైన అయిదోతనాన్ని పొందుతానని మా ఇంటికొచ్చిన జ్యోతిష్యులు చెప్పేవారు.

రామా! రావణుడు నన్ను అపహరించాక దండకారణ్యం అంతా వెతికావు, హనుమని పంపించావు, నాకోసం సముద్రానికి సేతువుని కట్టి, దాటి వచ్చావు, చివరికి యుద్ధంలో ఇంద్రజిత్ మాయ వల్ల మరణించావు, ఎంత ఆశ్చర్యం రామా, నీకు బ్రహ్మాస్త్రం తెలుసు, బ్రహ్మశిరోనామకాస్త్రం తెలుసు, వారుణాస్త్రం తెలుసు, ఆగ్నేయాస్త్రం తెలుసు, ఇన్ని అస్త్రములు తెలిసిన నిన్ను ఒకడు కేవలం మాయతో కనపడకుండా కొట్టిన బాణములకు శరీరం వదిలేశావు. నువ్వు మరణించావన్న వార్త విని కౌసల్యాదులు బతుకుతారా? అయోధ్య అయోధ్యలా ఉంటుందా. నువ్వు ఇన్ని కష్టాలు పడడానికి, అర్ధాంతరంగా శరీరం విడిచెయ్యడానికి నన్ను పెళ్ళి చేసుకున్నావా. నువ్వు నన్ను చేసుకోకపోతేనే బాగుండేదేమో " అని సీతమ్మ ఏడుస్తుంటే పుష్పకంలో ఉన్న త్రిజట చూడలేకపోయింది. 

అప్పుడు త్రిజట… “ఏడవకు సీతమ్మా. రామలక్ష్మణులు మరణించలేదు, వాళ్ళిద్దరూ సజీవంగా ఉన్నారు. నేను నిన్ను ఓదార్చడానికి ఈ మాటలు చెబుతున్నానని అనుకుంటున్నావా, కాని నేను నీకు రామలక్ష్మణులు బతికున్నారని చెప్పడానికి ఒక బలవత్తరమైన కారణాన్ని చెబుతాను. భర్త మరణించిన స్త్రీ కాని ఈ పుష్పక విమానం ఎక్కితే ఇది పైకి ఎగరదు, నువ్వు పుష్పకంలోకి ఎక్కగా ఇది ఆకాశంలో నిలబడిందంటే, నువ్వు సౌభాగ్యవతిగా ఉన్నావు అని అర్ధం. యోధుడైనవాడు నిజంగా శరీరాన్ని విడిచిపెడితే సైన్యాలు ఇలా నిలబడవు, ఎవరి మానాన వాళ్ళు పారిపోతుంటారు. రామలక్ష్మణుల ముఖాల్లో కాంతి ఏ మాత్రం తగ్గలేదు. కొద్దిసేపు మూర్చపోయారు అంతే. కొద్దికాలంలో రావణుడి పది తలలు పడిపోయి ఇదే పుష్పకంలో రాముడితో కలిసి నువ్వు అయోధ్యకి వెళ్ళిపోతావు. ఏ రాక్షస స్త్రీకీ నామీద లేని ప్రేమ నీ ఒక్కదానికే నా మీద ఎందుకు అంటావేమో, నిన్ను ఇక్కడికి తీసుకొచ్చినప్పటినుంచి నీ ప్రవర్తన చూస్తున్నాను. నీ ప్రవర్తన చేత, నీకు నీభర్త అంటే ఉన్న ప్రేమ చేత, నాకు నువ్వంటే విపరీతమైన ప్రేమ ఏర్పడింది. అందుకని నీకెప్పుడూ మంచి చెయ్యాలనే చూస్తుంటాను. అమ్మా! ఇంతకముందెన్నడూ నేను అబద్ధాలు చెప్పలేదు, ఇక ముందు కూడా ఎన్నడూ అబద్ధాలు చెప్పను. రామలక్ష్మణులు జీవించి ఉన్నారని నేను చెప్పినది పరమ సత్యం, నువ్వు బెంగ పెట్టుకోకు తల్లీ!” అని చెప్పింది.

తరువాత ఆ పుష్పక విమానాన్ని అశోకవనానికి తీసుకెళ్ళి దింపేశారు.

ఇంతలో రాముడు మెల్లగా తేరుకుని ఎదురుగా మూర్చపోయి పడిఉన్న లక్ష్మణుడిని చూసి… “ఒకవేళ లక్ష్మణుడి ప్రాణములు దక్కకపోతే, నేనొక్కడినే బతికితే, సీత నాకు దక్కినా ఆ బ్రతుకు నాకెందుకు. ఏలోకంలోనైనా వెతికితే సీతలాంటి భార్య దొరకచ్చు, కాని లక్ష్మణుడిలాంటి తమ్ముడు దొరకడు. 

కార్తవీర్యార్జునుడు(ఈయన ఒకసారి రావణుడిని ఓడించి చెఱసాలలో బంధించాడు. ఈయనకి 1000 చేతులు ఉండేవి) ఒకేసారి 500 బాణములను ప్రయోగం చేసేవాడు, అంతకన్నా ఎక్కువ బాణములను ప్రయోగం చెయ్యగలిగే శక్తి లక్ష్మణుడికి ఉంది. నాకోసమని యుద్ధానికి వచ్చి లక్ష్మణుడు ఇలా పడిపోతే నాకు ఇంక సీత ఎందుకు. నాకు ఈ జీవితం అక్కరలేదు” అని రాముడు బాధపడ్డాడు.

అప్పుడాయన సుగ్రీవుడిని పిలిచి… 

“సుగ్రీవా! ఇప్పటివరకూ నువ్వు నాకు చేసిన ఉపకారం చాలు, లక్ష్మణుడిని ఇలా చూస్తూ నేను బ్రతకను. నేను శరీరాన్ని వదిలేస్తాను. ఇది తెలిశాక రావణుడు నిన్ను విడిచిపెట్టడు, అందుకని నువ్వు నీ సైన్యాన్ని తీసుకొని సేతువు దాటి వెనక్కి వెళ్ళిపో. జాంబవంతా, హనుమా, అంగదా, మీరందరూ నాకు మహోపకారం చేశారు, మీరందరూ వెళ్ళిపొండి. నేను ఒక్క విషయానికే సిగ్గుపడుతున్నాను, విభీషణుడికి లంకా రాజ్యం ఇస్తానని ప్రతిజ్ఞ చేశాను, ఇప్పుడది అసత్య వాక్కు అయ్యింది. అసత్య వాక్యం నా నోటి నుండి దొర్లిందని నేను బాధపడుతున్నాను” అన్నాడు.

అప్పుడు సుగ్రీవుడు… “విభీషణా! నువ్వు వానరాలని తీసుకొని కిష్కిందకి వెళ్ళు, నేను రావణుడిని సంహరించి సీతమ్మని తీసుకొస్తాను. సుషేణా! వీళ్ళు మూర్చపోయి ఉన్నారు, ఇంకా వీళ్ళ ప్రాణములు పోలేదు, తొందరగా వీళ్ళని కిష్కిందకి తీసుకుపో!”అన్నాడు.```

        *రేపు…85వ భాగం*

*🚩జై శ్రీరామ్.! జై శ్రీ రామ్.!🚩*                           

       *🙏జై జై శ్రీ రామ్.!🙏*

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*

 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏

సోమవారం🕉️* *🌹30 జూన్ 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*   

    *🕉️సోమవారం🕉️*

 *🌹30 జూన్ 2025🌹*        

  *దృగ్గణిత పంచాంగం*                   

*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం -గ్రీష్మ ఋతౌః*

*ఆషాఢమాసం - శుక్లపక్షం*

*తిథి  : పంచమి* ఉ 09.23 వరకు ఉపరి *షష్ఠి*

*వారం    : సోమవారం* (ఇందువాసరే)

*నక్షత్రం   : మఖ* ఉ 07.20 ఉపరి *పూర్వ ఫల్గుణి (పుబ్బ)* 

*యోగం : సిద్ధి* సా 05.21 వరకు ఉపరి *వ్యతీపాత*

*కరణం   : బాలువ* ఉ 09.23 *కౌలువ* రా 09.46 ఉపరి *తైతుల*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 06.00 - 07.00 సా 05.30 - 06.30*

అమృత కాలం  : *రా 02.05 - 03.47*

అభిజిత్ కాలం  : *ప 11.44 - 12.37*

*వర్జ్యం          :మ 03.52 - 05.34*

*దుర్ముహూర్తం  : మ 12.37 - 01.30 & 03.15 - 04.07*

*రాహు కాలం   : ఉ 07.16 - 08.55*

గుళికకాళం       : *మ 01.49 - 03.28*

యమగండం     : *ఉ 10.33 - 12.11*

సూర్యరాశి : *మిధునం* 

చంద్రరాశి : *సింహం*

సూర్యోదయం :*ఉ 05.45*

సూర్యాస్తమయం :*సా 06.54*

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.38 - 08.15*

*సంగవ కాలం*        :      *08.15 - 10.53*

మధ్యాహ్న కాలం    :     *10.53 - 01.30*

అపరాహ్న కాలం    : *మ 01.30 - 04.07*

*ఆబ్ధికం తిధి       : ఆషాఢ శుద్ధ షష్ఠి*

సాయంకాలం        :*సా 04.07 - 06.44*

ప్రదోష కాలం         :  *సా 06.44 - 08.55*

రాత్రి కాలం           :*రా 08.55 - 11.49*

నిశీధి కాలం          :*రా 11.49 - 12.33*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.11 - 04.55*

-------------------------------------------------

        *🌷ప్రతినిత్యం🌷*

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*

*🕉️శివాపరాధ క్షమాపణ స్తోత్రం🔯*

*వార్ధక్యే చేంద్రియాణాం* *విగలగతిమతిశ్చాధి*  

*దైవాదితాపైః ప్రాప్తై* 

*రోగైర్వియోగైర్వ్యసన* 

*కృశతనోర్జ్ఞప్తి హీనం చ దీనమ్*

    🕉️ *ఓం నమః శివాయ*🕉️

🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>

         🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🕉️🕉️🌹🌷

🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹

రామాయణం

``

          *రామాయణం*

ఒకసారి చదివినంత 

మాత్రాన మన సమస్త 

పాపాలని తీసేస్తుంది.

``

     *వాల్మీకి రామాయణం*               

            *81వ భాగం*

```

తరువాత రాముడన్నాడు… “అంతా బాగానే ఉంది కాని, ఆ 100 యోజనముల సముద్రాన్ని దాటి ఎవరు వెళతారు. మనకున్న ఈ వానర సముహంతో ఆ సముద్రాన్ని దాటి ఎలా వెళ్ళగలుగుతాము? అందులో క్రూరమైన రాక్షసులు, తిమింగలాలు, మొసళ్ళు మొదలైనవి ఎన్నో ఉంటాయి కదా...” అని రాముడు ఆలోచిస్తున్న సమయంలో సుగ్రీవుడు ఒక మాట అంటాడు, “రామా! నువ్వు శోకాన్ని పొందకు. నీకున్న ఉత్సాహమును, పౌరుష పరాక్రమములను ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు కోదండం పట్టుకొని నిలబడిననాడు నీముందు నిలబడగలిగిన మొనగాడు ఎవడు? నువ్వు సమస్త బ్రహ్మండములను శాసించగలిగిన వాడివి. నువ్వు ఆజ్ఞాపిస్తే నీ వెంట రావడానికి సమస్త వానర సైన్యము సిద్ధంగా ఉంది. ఒకసారి వానర సైన్యము లంకా పట్టణంలో అడుగుపెట్టిందంటే, రావణుడు నిహతుడయ్యిపోయినట్టే. అందుకని సముద్రాన్ని దాటడం ఎలాగన్న విషయం మీద నీ దృష్టి కోణాన్ని నిలిపి ఒక మంచి మార్గాన్ని మాకు ఉపదేశం చెయ్యి” అన్నాడు.

సుగ్రీవుడి మాటలకి ఉత్సాహం పొందిన రాముడు… “నిజమే, నేను తలుచుకుంటే నా తపఃశక్తి చేత ఈ వానరములను సముద్రాన్ని దాటించగలను. నేను తలుచుకుంటే నా అస్త్ర ప్రయోగం చేత సముద్రాన్ని ఇంకింప చేస్తాను” అని చెప్పి, హనుమ వంక తిరిగి… “హనుమా! ఆ లంకా పట్టణం యొక్క బలం ఏమిటో నాకు చెప్పు. అక్కడ సైన్యం ఎంత ఉంటుంది. ద్వారములు, దుర్గములు ఎలా ఉంటాయి?" అని అడిగాడు. 

అప్పుడు హనుమంతుడు… "ఆ లంకా పట్టణం 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళితే త్రికూటా పర్వత శిఖరాల మధ్యన ఉంటుంది. అది శత్రు దుర్భేధ్యమైనది, దేవదానవులు కూడా దానిని ఆక్రమించలేరు. ఆ లంకా పట్టణం చుట్టూ ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది, అందులో ఒక విశాలమైన అగడ్త నిర్మించారు. దానిమీద నాలుగు వైపులా నాలుగు వంతెనలు ఉంటాయి. ఈ వంతెనల మీద సర్వకాలములయందు కొన్ని వందల శతఘ్నులు సిద్ధం చెయ్యబడి ఉంటాయి. దానితో పాటు ఆ లంకకి నాలుగు దుర్గాలున్నాయి, అరణ్యంలో ఉన్న దుర్గానికి అరణ్య దుర్గము అని పేరు. నది చేత రక్షింపబడుతున్న దుర్గానికి నదీ దుర్గము అని పేరు. పర్వతము చేత రక్షింపబడుతున్న దుర్గానికి పర్వత దుర్గము అని పేరు. కృత్రిమంగా నిర్మించిన దుర్గానికి కృత్రిమ దుర్గము అని పేరు. ఆ లంకా పట్టణము ఈ నాలుగు దుర్గములతోటి శోభిల్లుతోంది. లంకకి నాలుగు వైపులా నాలుగు ద్వారాలు ఉన్నాయి. తూర్పు ద్వారం దగ్గర 10,000 మంది రాక్షసులు ఆయుధములు పట్టుకొని గుర్రాల మీద, ఏనుగుల మీద తిరుగుతూ కాపు కాస్తుంటారు. దక్షిణ ద్వారాన్ని లక్ష మంది సైనికులు కాపు కాస్తుంటారు. పది లక్షల మంది పశ్చిమ ద్వారాన్ని కాపు కాస్తుంటారు. కోటి మంది సైనికులు ఉత్తర ద్వారాన్ని కాపు కాస్తుంటారు. ఆ రాక్షసులకి యుద్ధం చెయ్యడమంటే మహా ప్రీతికరమైన విషయం. రాజద్వారమునకు భయంకరమైన ఇనుప గడియలు, పరిఘలు బిగించి ఉంటాయి. ఆ లంకని చేరుకొని యుద్ధం చెయ్యడం అంత సామాన్యమైన విషయం కాదు.

మీరు కాని ఆజ్ఞాపిస్తే ఒక సుషేణుడు, గంధమాదనుడు, నీలుడు, నలుడు, ద్వివిదుడు, మైందుడు, సుగ్రీవుడు, అంగదుడు లంకని సర్వనాశనం చేసేస్తారు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు, అక్కడున్న మొత్తం రాక్షస సైన్యంలో ఒక వంతు సైన్యాన్ని నాశనం చేశాను. అక్కడున్న అనేక వంతెనలలో ఒక వంతెనని పూర్తిగా విరిచేశాను. అనేక ప్రాసాదాలని విరగ్గొట్టాను. ప్రస్తుతం లంక చెదిరిపోయిన శోభతో ఉంది, రాక్షసులు ఉద్విగ్నులై ఉన్నారు. వాళ్ళతో యుద్ధం చెయ్యడానికి ఇది చాలా అనువైన సమయం అని నేను అనుకుంటున్నాను” అన్నాడు.

అప్పుడు సుగ్రీవుడు “నాకన్నీ శుభనిమిత్తములు కనపడుతున్నాయి. నా మనస్సులో ఉత్సాహం పరవళ్ళు తొక్కుతోంది. మనం ఆ సముద్రాన్ని సేతువు కట్టి దాటితే రావణుడు నిహతుడు అయిపోయినట్టే. మంచి ముహూర్త నిర్ణయం చెయ్యండి, మనం బయలుదేరదాము” అన్నాడు.

అప్పుడు రాముడు… “మనం ఈ ఆలోచన చేస్తున్న సమయంలో సూర్యుడు ఆకాశంలో మధ్యన ఉన్నాడు. ఈ రోజున ఉన్న విశాఖ నక్షత్రం మా ఇక్ష్వాకు వంశీయులది, ఈ రోజున ఉన్న ముహూర్తాన్ని విజయము అని పిలుస్తారు. ఈ ముహూర్తం చాలా బాగుంది కనుక మనం వెంటనే సైన్యాన్ని తీసుకొని బయలుదేరదాము” అన్నాడు.

రాముడు ఈ మాట అనగానే అక్కడున్న వానరములన్నీ సంతోషాన్ని పొంది “జై శ్రీరాం, జై జై రామ, బయలుదేరదాము, లంక చేరిపోదాము, రావణుడిని సంహరిద్దాము” అన్నాయి.

తరువాత రాముడు సుగ్రీవుడితో 

“వృద్ధులైన వారు, శరీరంలో శక్తిలేనివారు, దెబ్బలు తిని ఉన్నవారు, నిస్సత్తువతో ఉన్నవారు, ఇటువంటి వానరములని తీసుకొని రావద్దు. మొదట నీలుడు వెళ్ళాలి, ఆయనతో పాటుగా విశేషమైన బలం కలిగిన లక్ష వానరములు వెళ్ళాలి. మిగతా వానరాలన్నీ రావడానికి కావలసిన త్రోవని వారు నిర్ణయించాలి. అందరూ వెళ్ళడానికి అనువైనరీతిలో ఉన్న రహదారిని నిర్మించాలి. కొన్ని గంటలు ప్రయాణం చేశాక అందరూ బడలిపోతారు, అప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి చక్కని వృక్ష సముదాయం ఉండాలి, తాగడానికి మంచి నీరు దొరకాలి, పళ్ళు, తేనె దొరకాలి, అటువంటి అరణ్య మార్గాన్ని నీలుడు నిర్ణయించాలి. ఈ సైన్యం అంతా వెళుతున్నప్పుడు గజుడు, గవాక్షుడు, గవయుడు సైన్యానికి ముందు నడుస్తూ వెళ్ళాలి. ఈ సైన్యాన్ని కుడి పక్కన ఋషభుడు చూస్తూ వాళ్ళని రక్షించాలి. ఎడమ పక్కన గంధమాదనుడు కొన్ని లక్షల మంది వానరములతో ఆ సైన్యాన్ని రక్షించాలి. అలాగే వెనుక కూడా కొన్ని లక్షల వానరములు రక్షిస్తూ రావాలి.

వెళ్ళేటప్పుడు మధ్య మధ్యలో సరస్సులు ఉంటాయి. అటువంటి సరోవరాలలో శత్రువులు విషం కలిపి నాశనం చేస్తారు. ఆ విషపూరిత జలాలను తాగితే వానరులందరు కూడా శరీరాలని విడిచిపెట్టే ఉపద్రవం ఏర్పడవచ్చు. అందుకని చాలా ముందుగా వెళ్ళి అటువంటి నీటి సరోవరాలకి, సరస్సులకి ప్రమాదం ఏర్పడకుండా కాపలా కాయాలి. నేను సైన్య మధ్య భాగంలో హనుమ భుజాల మీద కూర్చుని వస్తాను. అంగదుడి భుజాల మీద లక్ష్మణుడు బయలుదేరతాడు. జాంబవంతుడు మొదలైనవారు ఈ వానర సైన్యాన్ని అన్నివైపులా రక్షిస్తూ ఉండాలి” అని చెప్పాడు.

అప్పుడా వానర సైన్యం అంతా బయలుదేరింది. అప్పుడా సైన్యంలో కొంతమంది వెనుక నడవకుండా ముందుకొచ్చి నడుస్తున్నారు. రాముడికి పక్కన నడుస్తున్నవారు అంటున్నారు… “ఒరేయ్! చూడరా లంకకి వెళ్ళగానే రావణుడిని ఏమి చేస్తానో” అని ఒకడు, “నేను ఒక్క గుద్దు గుద్దానంటే వాడి తలకాయలు పగిలిపోతాయి. చూడరా నా కండ” అని రాముడికి వినపడేటట్టుగా తమ ప్రతాపాలు చెప్పుకుంటున్నారు. 

ఆ సైన్యంలో బలంగా ఉన్నవాళ్ళు మెల్లగా నడుస్తున్నవారిని ఎత్తి పక్కకు పారేసి ముందుకి వెళ్ళిపోతున్నారు. కొంతమంది తొందరగా వెళ్ళాలని పర్వతాల మీద ఎక్కి వెళుతున్నారు. కొంతమంది చెట్లని పీకేసి వాటిని గొడుగులుగా పట్టుకొని వెళుతున్నారు. 

వాళ్ళందరూ అలా వెళుతుంటే అరణ్యం అరణ్యమే వెళ్ళిపోతోందా అన్నట్టుగా ఉంది. అలా వాళ్ళందరూ బయలుదేరి దక్షిణ దిక్కున ఉన్న సహ్యాద్రి పర్వత శిఖరముల మీదకి చేరుకున్నారు. అప్పుడు వాళ్ళు అక్కడున్న రకరకాల పళ్ళని తిని కాలం గడిపారు. తరువాత అక్కడినుంచి బయలుదేరి కొంచెం ముందుకి వెళ్ళగా వాళ్ళకి సముద్రం కనపడింది. వాళ్ళు సముద్రాన్ని చేరుకునేసరికి చీకటి పడింది.

అప్పుడు రాముడు “మీరందరూ చాలా జాగ్రత్తగా ఈ సైన్యాన్ని విడిది చేయించి, రాక్షసుల బారిన పడకుండా ఈ వానరములను 3 భాగములు చెయ్యండి” అన్నాడు. 

అప్పుడు కొన్ని కోట్ల వానరములని ఒక వైపు నిలబెట్టారు, కొండముచ్చులని ఒక వైపు నిలబెట్టారు, భల్లూకాలని ఒక వైపు నిలబెట్టారు.

చంద్రుని కాంతి కెరటాలు మీద, కదులుతున్న నీటిమీద పడి మెరుస్తోంది. చంద్రుడిని చూసి పొంగుతున్న సముద్రాన్ని, పైనున్న చంద్రుడిని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. గాలి చేత తోయబడుతున్న నీరు చంద్రుని కాంతికి మెరుస్తూ వెండి పళ్ళెంలా ఉంది. పైన ఆకాశంలో ఉన్న నక్షత్రాలు సముద్రం మీద ప్రతిఫలిస్తూ, అగ్నిచూర్ణం తీసుకొచ్చి సముద్రం మీద ఎవరో చల్లేసినట్టు ఉన్నాయి. ఆకాశం సముద్రంలా, సముద్రం ఆకాశంలా ఉన్నాయి, రెండిటికి తేడా తెలియడం లేదు. ఆకాశము, సముద్రము రెండూ కలిసిపోయినట్టు ఉన్నాయి, ఆకాశంలో తారలు ఉన్నాయి, సముద్రంలో రత్నాలు ఉన్నాయి. కదులుతున్న మేఘాలతో ఆకాశం ఉంది, కదులుతున్న తరంగాలతో సముద్రం ఉంది, అని ఆ సముద్రం గురించి వాల్మీకి మహర్షి తనదైన శైలిలో వర్ణించారు.

ఆ సమయంలో రాముడు సముద్రం వంక చూస్తూ… “సీత లంకలో ఉండిపోయింది, నేను ఇక్కడ ఉండిపోయాను. చంద్రుడా! సీత నిన్ను చూసుంటుంది, అలా చూడబడిన నువ్వు నా వంక చూస్తే నాకు ఉపశాంతి కలుగుతుంది. అటువైపు నుంచి వస్తున్న గాలి సీతకి తగిలి వస్తే నాకు ఉపశాంతి కలుగుతుంది” అన్నాడు.

***********

అటుపక్క లంకలో మంత్రులతో కూర్చుని దీనంగా తల దించుకుని రావణుడు ఉన్నాడు. అప్పుడాయన వాళ్ళతో … “జరగకూడని పని జరిగిపోయింది. నేను సీతని అపహరించిన విషయం మీ అందరికి తెలుసు కదా. రాముడు నా మీదకి యుద్ధానికి వస్తున్నాడు. నిన్న హనుమంతుడు ఒక్కడే వచ్చి ఈ లంకా పట్టణాన్ని ఎంత పీడించాడో మీరు చూశారు. ఈ మాట చెప్పడానికి నాకు చాలా సిగ్గుగా ఉంది. రాముడు సముద్ర తీరానికి వచ్చేశాడు, ఎలాగోలా సముద్రాన్ని దాటుతాడు (తన గూఢచారుల వల్ల రాముడు సముద్ర తీరానికి వచ్చాడని రావణుడు తెలుసుకున్నాడు). అప్పుడు మనం రామలక్ష్మణులతో, వానరములతో యుద్ధం చెయ్యాల్సి ఉంటుంది. మీరందరూ కలిసికట్టుగా నాకు ఒక ఆలోచన చెప్పండి. మంత్రులందరూ ఏకాభిప్రాయంగా చెప్పిన మాట, ఉత్తమమైన మాట. 

మంత్రులు తమలో తాము విభేదించుకుని, తమ విభేదాలు పక్కకి పెట్టి కలిసి ఒక్కటిగా చెప్పిన మాట, మధ్యమమైన మాట. 

మంత్రులు విడిపోయి, ఎవరిమానాన వాళ్ళు తలోమాట చెబితే, అది అధమమైన మాట. 

అందుకని నాకు ఒక మంచి మాట చెప్పండి” అన్నాడు.

అప్పుడా మంత్రులన్నారు… “ప్రభూ! మీరు దేనికింత బెంగ పెట్టుకుంటున్నారు. మీరు ఒకనాడు హిమాలయాలలో ఉన్న మీ అన్న కుబేరుడితో యుద్ధం చేసి, ఆయనని ఓడించి పుష్పక విమానం ఎత్తుకొచ్చారు. ఆయన ఉన్న ఇంట్లోనుంచి ఆయనని తరిమేసి ఈ లంకా పట్టణాన్ని మీదిగా స్వాధీనం చేసుకున్నారు. నీ చెల్లెలైన కుంభీనస యొక్క భర్త అయిన మధువుని ఓడించి అక్కడినుంచి తెచ్చుకోవలసిన వస్తువులన్నీ తెచ్చుకున్నారు. పాతాళ లోకంలోకి వెళ్ళి అక్కడున్న నాగులని, తక్షకి, జటి మొదలైన వాళ్ళని ఓడించి అపారమైన కీర్తి గడించారు. అక్కడినుంచి దేవలోకానికి వెళ్ళి దేవేంద్రుడిని ఓడించారు. తరువాత యమలోకానికి వెళ్ళి యముడిని ఓడించారు, యముడు మిమ్మల్ని చూసి పారిపోయాడు. ఇంతమందిని కొట్టిన మీరు ఎందుకు భయపడుతున్నారు. మీ దగ్గర ఇంద్రజిత్ ఉన్నాడు, ఇంద్రజిత్ ముందు ఆ రాజకుమారులు ఎంత?” అన్నారు.

ఇంతలో మంత్రులలో ఒకడైన ప్రహస్తుడు లేచి “రావణా! నువ్వు భయపడవద్దు, నేను ఒక్కడిని యుద్ధానికి వెళితే చాలు. ఆ రామలక్ష్మణులిద్దరిని సంహరించి వస్తాను. నిన్నటి రోజున ప్రమత్తంగా ఉండడం వలన ఆ వానరాన్ని పట్టుకోలేకపోయాము” అన్నాడు.

అప్పుడు దుర్ముఖుడు అనే మంత్రి అక్కడికి రక్తంతో తడిసిన పరిఘని పట్టుకొచ్చి “నేను ఒక్కడినే వెళ్ళి ఈ పరిఘతో వాళ్ళని కొట్టి వచ్చేస్తాను” అన్నాడు.

అప్పుడు వజ్రదంష్ట్రుడు … “రాముడిని మోసం చేసి గెలిచే ఒక గొప్ప ప్రణాలిక నీకు చెబుతాను. మన దగ్గర కామరూపులైన రాక్షసులు ఉన్నారు. వాళ్ళందరినీ భరతుడి సైన్యంలా రూపం మార్చమని చెప్పి రాముడి దగ్గరికి పంపి ‘అయోధ్యలో ముఖ్యమైన పని వచ్చింది, భరతుడు చాలా కష్టంలో ఉన్నాడు, అందుకని నిన్ను తొందరగా రమ్మన్నాడు' అని రాముడితో చెబుతారు. భరతుడి మీద ఉన్న ప్రేమ చేత రాముడు వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. ఆ సమయంలో మన సైన్యం సముద్రాన్ని దాటి రాముడిని కొట్టేస్తుంది, అప్పుడు వానరులందరూ దిక్కులు పట్టి పారిపోతారు. మీరు అనుజ్ఞ ఇవ్వండి, ఒక్క నిమిషంలో వెళ్ళిపోతాము” అన్నాడు.

అప్పుడు నికుంభుడు(కుంభకర్ణుడి కుమారుడు) అన్నాడు… “దీనికింత మోసం ఎందుకు, నేను వెళ్ళి వాళ్ళని చంపేసి, రామలక్ష్మణులని తినేసి వస్తాను” అన్నాడు.

అప్పుడు విభీషణుడు…  

“3 విషయాలున్న శత్రువు విషయంలోనే యుద్ధానికి సిద్ధపడాలి. ఆ రాజు ఏమరపాటుతో ఉంటే యుద్ధానికి వెళ్ళడం తేలిక, మరొక శత్రువుతో పీడింపబడుతున్న రాజు మీదకి వెళ్ళడం తేలిక, దైవము ప్రతికూలంగా ఉన్న రాజుమీదకి వెళ్ళడం తేలిక. ఈ మూడు లోపాలు ఉన్న రాజు మీదకి దండయాత్ర చెయ్యడం తేలిక. కాని, మీరందరూ రాముడిని చంపేస్తాము, కొట్టేస్తాము అని ఎగురుతున్నారే, రాముడంటే అంత చేతకానివాడిలా కనపడుతున్నాడా? రాముడు ఇవ్వాళ యుద్ధానికి వచ్చాడు, అప్రమత్తుడై ఉన్నాడు, దైవము ఆయన పట్ల అనుకూలించి ఉంది. మీరు భరతుడి సైన్యం వేషాలు కట్టుకొని వెళితే తెలుసుకోలేనంత మూర్ఖుడు కాదు. నదులకు(తూర్పు దిక్కుకి ప్రవహించేవాటిని నదులు అంటారు), నదములకు(పశ్చిమ దిక్కుకి ప్రవహించేవాటిని నదములు అంటారు) భర్త అయిన సముద్రాన్ని దాటి ఈవలి ఒడ్డుకి నిన్న హనుమ వచ్చి లంకా పట్టణం అంతటినీ కాల్చేశారు. మరి నిన్న మీరు హనుమని ఎందుకు పట్టుకోలేక పోయారు? ఇన్ని కోట్లమంది ఇక్కడికి వచ్చినవాడిని పట్టుకోలేకపోయారు. మీరందరూ ఇవ్వాళ ప్రభువు దగ్గర నిలబడి నేను కొట్టేస్తాను, నేను చంపేస్తాను, నేను తినేస్తాను అంటున్నారు. ఇవి మంత్రులు చెప్పవలసిన మాటలేనా? మీ మాటలకి ఆలోచన కాని, విచక్షణ కాని ఉందా. యుద్ధానికి వెళ్ళేముందు శత్రుసైన్యం యొక్క బలం ఎంత ఉంది అని జాగ్రత్తగా అంచనా వెయ్యాలి. అందులో పక్షపాత బుద్ధి ఉండకూడదు. శత్రువుకి మనకన్నా ఎక్కువ బలం ఉంటె వేరొక మార్గాన్ని ఆలోచించాలి, శత్రువు కన్నా మనకే ఎక్కువ బలం ఉంటె, ఆనాడు యుద్ధానికి వెళ్ళాలి. అసలు శత్రువు బలం ఏమిటో, ఎంతమంది వస్తున్నారో, ఎవరు ఎటువంటివారో మీరు అంచనా వేశారా?

మీరు ఒక్కసారి ఆలోచించండి, రాముడు యుద్ధానికి రావలసిన అవసరం ఏమిటి? రాముడి భార్య అయిన సీతమ్మని మా అన్న రావణుడు ఎత్తుకొచ్చి అశోక వనంలో పెట్టాడు. అందుకని రాముడు తన భార్యని విడిపించుకోవడానికని యుద్ధానికి వస్తున్నాడు. ధర్మం రాముడి పట్ల ఉంది, ధర్మం ఎక్కడుంటె దేవతలు అక్కడ ఉంటారు, కావున దేవతల అనుగ్రహం రాముడికి ఉంటుంది. మీరు రాముడి మీదకి యుద్ధానికి వెళదామని ఎలా అనుకుంటున్నారు. ఏ రకంగా చూసినా రాముడిదే పైచేయి. లంకకి, రాక్షసులకి, రావణుడికి ఉపద్రవం రాకూడదు అనుకుంటె, ఏ సీతమ్మ కారణంగా ఇటువంటి కలహం వస్తోందో, ఆ సీతమ్మని రాముడికి అప్పగిస్తే రాముడు యుద్ధానికి రాడు. తప్పు చేసింది మనం, ఆ తప్పుని సమర్ధించుకోడానికి ఇన్ని కోట్ల మందిని ఫణంగా పెట్టడం మంచిది కాదు. నా మాట విని సీతమ్మని ఇచ్చెయ్యండి” అన్నాడు. 

విభీషణుడు చెప్పిన మంచి మాటలు చెవికి ఎక్కని రావణుడు తన మంత్రులని ఆ సభ నుండి వెళ్ళమని చెప్పి, తాను కూడా వెళ్ళిపోయాడు.

విభీషణుడు మరునాడు ఉదయం రావణుడు ఉన్న గృహానికి వెళ్ళాడు. అక్కడ కొన్ని వేల మంది స్త్రీలు ఉన్నారు, బ్రాహ్మణులు స్వస్తి వాచకాలు చెబుతున్నారు, పూజలు, అగ్నికార్యాలు జరుగుతున్నాయి. రావణుడు ఒక మంచి తల్పం మీద కూర్చుని ఉండగా విభీషణుడు అక్కడికి తల వంచి నమస్కరిస్తూ వెళ్ళి… “అన్నయ్యా! నిన్న నీకు సభలో కొన్ని విషయాలు చెబుతుంటే వెళ్ళిపోయావు కదా. నీకు కొన్ని విషయాలు ఆంతరముగా చెబుదాము అనుకున్నాను. ఎందుకంటే, ఈ విషయాలు లంకలో అందరికీ తెలుసు. నీ మంత్రులకి కూడా తెలుసు. కాని నీకు భయపడి ఎవరూ నీతో చెప్పడం లేదు. నేను కూడా చెప్పకపోతె నా అన్నని రక్షించుకోనివాడిని అవుతానని, నీ మీద ప్రేమ చేత చెప్పడానికి వచ్చాను.

నువ్వు ఏనాడైతే సీతమ్మని అపహరించి లంకకి తీసుకొచ్చావో, ఆనాటినుంచి నాకు కొన్ని దుర్నిమిత్తములు కనపడుతున్నాయి. ఎప్పుడైనా హోమం చేద్దామని నాలుగు పుల్లలు ఆ హోమగుండంలో వేస్తే, ప్రారంభం నుంచి కూడా అగ్ని పెద్దగా పైకి రావడం లేదు, పొగ చుట్టుముట్టి ఉంటోంది. అన్ని హోమగుండాలలోని అగ్ని కూడా పొగతోనే ఉంటోంది, నిప్పురవ్వలు బయటకి కనపడుతున్నాయి. అగ్నిశాలలోకి, వేదశాలలోకి, పూజా గృహంలోకి విశేషంగా పాములు వస్తున్నాయి. అన్నిటినీమించి తెల్లవారుజామున హోమం చేద్దామని పాయసం కాని, తేనె కాని పెట్టుకుంటె, వాటినిండా చీమలు పట్టి ఉంటున్నాయి. ఇవన్నీ కూడా అమంగళకరమైన శకునములు.

ఆవు పాలు తీసుకొచ్చి పెట్టగానే అవి విరిగిపోతున్నాయి. ఏనుగులకు మదజలాలు కారకుండా అలా నిలబడి ఉంటున్నాయి. గుర్రాలు ఉత్సాహంగా సకిలించడం లేదు, దీనంగా సకిలిస్తూ కన్నుల వెంట నీరు కారుస్తున్నాయి. గాడిదలు, కంచర గాడిదలు, ఒంటెలు మొదలైన జంతువుల మీద ఉన్న వెంట్రుకలు తమంతట తాముగా ఊడి పడిపోతున్నాయి. పశు వైద్యులని తీసుకొచ్చి వాటికి వైద్యం చేయించినా, ఈ జాతి మృగాల మీద వెంట్రుకలు నిలబడడం లేదు. కాకులు గుంపులు గుంపులుగా వచ్చి ఇళ్ళ మీద కూర్చుని అదే పనిగా అరుస్తున్నాయి. ప్రతిరోజు గ్రద్దలు ఇళ్ళ మీద కూర్చుంటున్నాయి. అరణ్యంలో ఉండే నక్కలు పగటివేళ, రాత్రివేళ ఊరి పోలిమేరలకొచ్చి పెద్దగా ఏడుస్తూ అరుస్తున్నాయి. క్రూరమైన మృగాలు భయంకరమైన ధ్వనులు చేస్తున్నాయి. అందుకని సీతమ్మని తీసుకెళ్ళి మనం రాముడికి అప్పచెప్పేద్దాము” అన్నాడు.

అప్పుడు రావణుడు విభీషణుడి వంక కోపంగా చూసి… “ఇవన్నీ నీకు ఎక్కడ కనపడుతున్నాయిరా. నాకు ఎక్కడా కనపడడం లేదు. రాముడు యుద్ధానికి దేవేంద్రుడిని తీసుకొచ్చినా సరే, సీతని ఇవ్వను. ఇక నువ్వు వెళ్ళవచ్చు” అన్నాడు. 

విభీషణుడు తల వంచుకొని వెళ్ళిపోయాడు.

తన మనస్సు నిరంతరము పరకాంత యందు ఉండుట చేత, సోదరుడు చెప్పిన మంచి మాట వినకపోవడము చేత రావణాసురుడు రోజురోజుకి కృశించిపోవుచున్నాడు.

తరువాత రావణుడు ఒక గొప్ప రథం ఎక్కి అందరినీ సభా మండపానికి రమ్మన్నాడు. అందరూ సభలో కూర్చున్నాక ఆయనంటాడు… “నేను సీతని అపహరించి తీసుకొచ్చిన మాట పరమ వాస్తవం. ఆ సమయంలో కుంభకర్ణుడు నిద్రపోతున్నాడు కనుక నేను వాడికి చెప్పలేదు. ప్రహస్తా! వెళ్ళి కుంభకర్ణుడిని తీసుకురా” అన్నాడు.

తరువాత ఆ సభని ఉద్దేశించి రావణుడు అన్నాడు “మూడు లోకాలలో సీతకన్నా అందగత్తె లేదు, కనుక నేను ఆమెని అపహరించి తీసుకొచ్చాను. ప్రతిరోజు సన్నటి నడుము కలిగిన సీతని చూస్తుంటే నాలో కామ ప్రచోదనం పెరిగిపోయి నేను తట్టుకోలేకపోతున్నాను. ఆ కామం ఎక్కువ అవ్వడం వల్ల నేను నీరసించిపోతున్నాను (ఆ రావణుడు సీతమ్మ గురించి ఇంకా నీచంగా వర్ణిస్తాడు, అది ఇక్కడ రాయడం బాగోదని రాయడం లేదు). నేను సీతని అపహరించి తీసుకొచ్చాక 'రాముడు ఒకవేళ తిరిగి వస్తాడేమో, ఒక సంవత్సర కాలం చూద్దాము' అని సీత నన్ను అడిగింది. ఒక సంవత్సరం వరకూ నా మంచం ఎక్కను అనింది, పోనిలే ఒక సంవత్సరమే కదా అని సంవత్సరం గడువు ఇచ్చాను” అన్నాడు.

అప్పుడు అక్కడికి వచ్చిన కుంభకర్ణుడు “నువ్వు చేసిన పని పరమ తప్పు. ఇప్పుడు మా అందరినీ పిలిచి, ఏమి చెయ్యను అని అంటావేంటి. ఈ మాట నువ్వు మమ్మల్ని అపహరించే ముందు అడగాలి. రాజు ఒక నిర్ణయం చేసేముందు న్యాయాన్యాయములను బాగా ఆలోచించాలి. యుక్తాయుక్త విచక్షణ లేకుండా చపలచిత్తంతో రాజు కాని నిర్ణయం చేస్తే, ఆ నిర్ణయం నుంచి బయట ఉన్నవారు ప్రయోజనం పొందుతారు. నువ్వు తొందరపడి సీతని తీసుకొచ్చావు, నీ అదృష్టం బాగుంది కాబట్టి ఇంకా రాముడి చేతిలో చచ్చిపోకుండా బతికి ఉన్నావు. ఏదో తప్పు చేశావు సరె, ఇంక బెంగపెట్టుకోమాకు. హాయిగా లోపలికి వెళ్ళి మధ్యం తాగి, నీ కాంతలతో సుఖంగా విహరించు. నేను ఉన్నాను కదా, నేను వెళ్ళి ఆ రామలక్ష్మణులని సంహరించి, ఆ వానరులందరినీ తినేసి వస్తాను” అన్నాడు.

అప్పుడు మహాపార్షుడు అనే మంత్రి అన్నాడు… “ఒక కోడిపుంజుకి కోరిక కలిగితే కోడిపెట్టని తరిమి, బలాత్కారంగా దానిని అనుభవిస్తుంది. అలా నువ్వు కూడా సీతని అనుభవించు” అన్నాడు.

రావణుడు ఆ మహాపార్షుడిని దగ్గరికి పిలిచి… “ఎంత గొప్ప ఆలోచన చెప్పావు. కాని నాకు ఒక శాపం ఉండిపోయింది. ఒకనాడు నేను బ్రహ్మ సభకి వెళుతున్నప్పుడు పుంజకస్థల అనే అప్సరస నన్ను చూసి దాక్కుంది. అప్పుడు నేను ఆమెని వెంట తరిమి, వివస్త్రని చేసి అనుభవించాను. బహుశా ఆవిడ బ్రహ్మగారికి చెప్పుంటుంది, అందుకని బ్రహ్మగారు నన్ను పిలిచి… 'ఇకముందు నీయందు మనస్సులేని స్త్రీని నువ్వు బలాత్కారంగా అనుభవిస్తే, ఉత్తర క్షణం నీ శిరస్సు నూరు ముక్కలవుతుందని' బ్రహ్మగారు శపించారు. అందుకని నేను సీత జోలికి వెళ్ళలేదు” అన్నాడు.

అప్పుడు విభీషణుడు పైకి లేచి అన్నాడు… “మీ అందరికీ రాముడంటే చాలా తేలికగా ఉంది. సీతమ్మ అంటే మీకు చాలా చులకనగా ఉంది. ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి, కుంభకర్ణుడు కాని, ఇంద్రజిత్ కాని, రావణాసురుడు కాని, మహాపార్షుడు కాని, మహోదరుడు కాని, నికుంభుడు కాని, వీరెవ్వరు కూడా రాముడి జోలికి వెళ్ళలేరు” అన్నాడు.

అప్పుడు ప్రహస్తుడు… “ఏమిటయ్యా విభీషణా అలా మాట్లాడుతున్నావు, మన ప్రభువు దేవదానవులని ఓడించాడు. అసలు మనకి భయమన్న మాట ఇప్పటివరకూ తెలీదు. అటువంటిది నువ్వు ఎందుకు రాముడిని చూసి భయపడుతున్నావు” అన్నాడు.

విభీషణుడు… “ఇక్ష్వాకు వంశస్తుడైన ఆ రాముడు పరమ ధర్మాత్ముడు. మీకు లేనిది ఆయనకి ఉన్నది ధర్మం ఒక్కటే. ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది. ప్రహస్తా! నీకేమి తెలుసని మాట్లాడుతున్నావు. ఎప్పుడైనా గ్రద్ద రెక్కలు కట్టబడిన రామ బాణములు నీ వక్షస్థలంలో నాటుకుని నీ గుండెలు చీరేసి ఉంటె నువ్వు ఇలా మాట్లాడి ఉండేవాడివి కాదు. నీకు రామ బాణం యొక్క రుచి ఎలా ఉంటుందో తెలీదు కాబట్టి ఇలా ప్రవర్తిస్తున్నావు. మీరందరూ బతకాలనుకుంటె, అందరూ కలిసి మాట్లాడుకొని ఒక నిర్ణయం చెయ్యండి, రావణుడి మీద తిరగబడండి, ఆయనకి బుద్ధి చెప్పండి, సీతమ్మని ఇచ్చెయ్యండి, అలా చేస్తే మీరు బతికుంటారు లేకపోతే నశించిపోతారు” అన్నాడు.

ఆ సభలోనే ఉన్న ఇంద్రజిత్ పైకి లేచి “వీర్యంలొ కాని, పరాక్రమంలో కాని, బలంలో కాని, తేజస్సులో కాని మా తండ్రి రావణాసురుడు, ఆయన తమ్ముడు కుంభకర్ణుడు సాటిలేనివారు. నువ్వు ఇంత పౌరుషహీనుడిగా ఎలా పుట్టావు పినతండ్రీ!పదేపదే'రాముడు వచ్చేస్తాడు' అని మాట్లాడుతున్నావు, ఎందుకంత భయం నీకు, ఏంచేస్తాడు రాముడు వస్తే?” అన్నాడు.

అప్పుడు విభీషణుడు… “నువ్వు బాలుడివి, నీకేమి తెలియదు. నిన్ను ఈ సభలోకి తీసుకొచ్చినవాడిని, నిన్ను చంపాలి. నీకేమి తెలుసని ఇక్కడికి వచ్చావు. ఈ సభలో మీ నాన్న పరస్త్రీయందు తనకున్న కామం గురించి మాట్లాడుతుంటే వినడానికి నీకు సిగ్గుగా లేదా. నీ పౌరుషం, నీ పరాక్రమం రాముడి ముందు నిలబడలేదు. లేనిపోని వ్యగ్రత తెచ్చుకొని విర్రవీగకురా ఇంద్రజిత్, కుర్చో!” అన్నాడు. 

అప్పుడు రావణుడు అన్నాడు… 

“ఇంట్లో పగబట్టిన పాము తిరుగుతుంటే ఆ పాముతో కలిసి ఇంట్లో ఉండచ్చు. శత్రువు అని తెలిసి, ఆ శత్రువు ఉన్న చోట ఉండచ్చు. కాని మిత్ర రూపంలో ఉండి శత్రువుగా ప్రవర్తిస్తున్నవాడితో కలిసి ఉండకూడదు. పూర్వం కొన్ని ఏనుగులు సరోవరంలో ఉండేవి, ఆ ఏనుగులు చెప్పిన మాటలని నీకు చెబుతాను జాగ్రత్తగా విను విభీషణా. ఆ ఏనుగులు అన్నాయి 

'మనకి అగ్నివల్ల భయం లేదు, పాశాల వల్ల భయం లేదు, నీటి వల్ల భయం లేదు, మనకి మన జాతి వల్లే భయం’ అన్నాయి. నిన్ను చూస్తే నాకు ఆ మాట నిజం అనిపిస్తోంది. ఆవులే ఐశ్వర్యము, బ్రాహ్మణులే తపస్సు, స్త్రీలదే చాపల్య బుద్ధి, బంధువుల వల్ల భయము కలుగుతాయి. నాకు నీవల్లే భయమొస్తోంది. ఇవ్వాళ నన్ను అందరూ కీర్తిస్తుంటే నువ్వు చూడలేకపోతున్నావు. నువ్వు నాకు తమ్ముడివి కాదు, నువ్వు నా శత్రువువి” అన్నాడు.```

          *రేపు…82వ భాగం*

*🚩జై శ్రీరామ్.! జై శ్రీ రామ్.!🚩*                           

       *🙏జై జై శ్రీ రామ్.!🙏*

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*

 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏

``

          *రామాయణం*

ఒకసారి చదివినంత 

మాత్రాన మన సమస్త 

పాపాలని తీసేస్తుంది.

``

     *వాల్మీకి రామాయణం*            

            *82వ భాగం*

```

అప్పుడు విభీషణుడు… “నువ్వు నాకన్నా ముందు పుట్టినవాడివి, తండ్రి తరువాత పెద్దన్నగారు తండ్రిలాంటి వారు. నువ్వు నాకు తండ్రిలాంటి వాడివి కనుక, నిన్ను రక్షించుకోవాలనే బుద్ధితో నాకు తోచిన సలహా చెప్పే ప్రయత్నం చేశాను. నాకన్నా పెద్దవాడిని అధిక్షేపించాలన్న కోరిక నాకు ఎన్నడూ లేదు. ఒకవేళ నేను ఏదన్నా పొరపాటుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించు. నిన్ను పొగుడుతూ గోతుల్లోకి దింపేవాళ్ళు, తప్పుడు సలహాలు చెప్పేవాళ్ళు చాలామంది దొరుకుతారు. యదార్ధమైన సలహా చెప్పి నిన్ను గట్టెక్కించేవాడు ఎక్కడో ఒక్కడు ఉంటాడు. అలా చెప్పేవాడు దొరకడు, చెప్పినా వినేవాడు దొరకడు. నేను ఇక్కడ ఉండడం వల్ల నీకు భయం ఏర్పడుతోందని అన్నావు కాబట్టి, నేను నీకు ప్రమాదకరంగా ఉన్నానన్నావు కాబట్టి, నీ కీర్తిని నేను ఓర్చలేకపోతున్నాను అన్నావు కాబట్టి, నేను నీకు ఎప్పటికైనా కంటకుడిని అవుతానని అన్నావు కాబట్టి నేను ఇక్కడినుంచి వెళ్ళిపోతాను. ఇప్పటికీ నా కోరిక ఒకటే, నువ్వు, నీ పరిజనం, ఈ లంక, రాక్షసులు, నీ బంధువులు, అందరూ సుఖంగా ఉండండి” అని చెప్పి, రావణుడికి నమస్కరించి వెళ్ళిపోయాడు. 

ఆయనతోపాటు మరో నలుగురు రాక్షసులు కూడా ఆయనతో వెళ్ళిపోయారు. ఆ అయిదుగురు ఒకేసారి ఆకాశమండలంలోకి ఎగిరిపోయారు.

విభీషణుడు, మిగతా నలుగురు రాక్షసులు ఉత్తర దిక్కున రామలక్ష్మణులు ఉన్న ప్రదేశానికి చేరి ఆకాశంలో నిలబడ్డారు. 

ఆకాశంలో ఉన్న విభీషణుడిని చూడగానే అక్కడున్న వానరాలు…

“రాక్షసుడు వచ్చాడు, కొట్టెయ్యండి” అని అక్కడున్న చెట్లని, పర్వతాలని పెకలించేశారు.

ఆ సమయంలో విభీషణుడు బెదరకుండా… “నేను లంకని పాలించే రావణాసురుడి తమ్ముడిని, నన్ను విభీషణుడు అని పిలుస్తారు. మా అన్నగారు సీతమ్మని అపహరించి లంకలో పెట్టాడు. సీతమ్మని అపహరించేటప్పుడు ఆమెని రక్షించాలని ప్రయత్నించిన జటాయువుని నిగ్రహించి చంపాడు. దురాత్ముడైన రావణుడికి నేను ఎన్నో మంచి మాటలు చెప్పాను. కాని ఆయన నా మాటలు వినలేదు. ఆయనయందు అధర్మము ఉంది కనుక నేను ఆయనని విడిచిపెట్టి రాముడిని శరణు వేడడానికి వచ్చాను. రాముడు నాకే కాదు ఈ లోకములన్నిటికి శరణు ఇవ్వగలిగినవాడు. నేను మీకు శత్రువుని కాదు” అన్నాడు.

వెంటనే సుగ్రీవుడు పరుగు పరుగున రాముడి దగ్గరికి వెళ్ళి… “వచ్చినవాడు మనకి పరమ శత్రువైన రావణుడి తమ్ముడు. ఆయన ఒక రాక్షసుడు. ఈ యుద్ధ సమయంలో మనం యుద్ధాన్ని ప్రారంభించేముందు వచ్చి ఆకాశంలో నిలబడ్డాడు. ఈయనకి అభయమిచ్చి కిందకి దింపావంటే మన సైన్యంలో ఎటువంటి లోపాలున్నాయో కనిపెడతాడు. ఈయన రావణుడి గూఢచారి. ఇక్కడి రహస్యాలన్నీ కనిపెట్టి మనలో మనకి బేధాలు కల్పిస్తాడు. అందుకని రామా, నువ్వు ఆయనకి శరణాగతి ఇవ్వకు. మాకు అనుమతి ఇవ్వు, వాళ్ళని సంహరిస్తాము. ఒక్కసారి గుడ్లగూబని కాని కాకులు తమ గూటిలోకి రానిస్తే, కాకి పిల్లలని ఆ గుడ్లగూబ తినేస్తుంది. ఈ విభీషణుడు కూడా అదే పని చేస్తాడు” అన్నాడు.

అప్పుడు రాముడన్నాడు… 

“నాయందు నీకున్న ప్రీతి ఎటువంటిదో నాకు తెలుసు సుగ్రీవా. నువ్వు మాట్లాడిన మాటల వెనుక ఉన్న ఆదుర్దాని కూడా నేను కనిపెట్టగలను. నీకున్న అనుభవం చేత చక్కని ఉదాహరణలను చెప్పి బాగా మాట్లాడావు. ఈ విషయంలో నాకు సలహా ఇవ్వాలని మీలో ఎవరన్నా అనుకుంటున్నారా” అని అడిగాడు.

అంగదుడు లేచి అన్నాడు… “మనం విభీషణుడిని పరీక్ష చేసి ఆయనలో సద్గుణాలు కనపడితే స్వీకరిద్దాము. ఒకవేళ దుర్గుణాలు ఎక్కువగా కనపడితే ఆయనని విడిచిపెట్టేద్దాము” అన్నాడు.

తరువాత శరభుడు అన్నాడు…      

“మనం కొంతమంది గూఢచారులని పంపిద్దాము. గూఢచారులు ఆయనని పరిశీలించి ఇతనికి మనం ఆశ్రయం ఇవ్వవచ్చా లేదా అన్నది నిర్ణయిస్తారు. గూఢచారులు చెప్పిన మాటలని బట్టి మనం నిర్ణయించుకుందాము” అన్నాడు.

అప్పుడు జాంబవంతుడు… “ఇది వేళ కాని వేళ. ఇటువంటి సమయంలో రావణుడిని విడిచిపెట్టి మన వైపుకి వచ్చాడు. ఇప్పుడు మనం ఉన్నది పరుల ప్రదేశంలో. దేశం కాని దేశంలో, కాలం కాని కాలంలో రావణుడి తమ్ముడైన విభీషణుడు శరణాగతి చేస్తున్నాడు. అందుకని ఈయనని తీసుకోకపోవడమే మంచిది” అన్నాడు.

మైందుడు అన్నాడు… “మనం ఎవరన్నా పెద్దవాళ్ళని ఆ విభీషణుడి దగ్గరికి పంపిద్దాము. అప్పుడు వాళ్ళు వేసిన ప్రశ్నలకి విభీషణుడు ఏ సమాధానాలు చెబుతాడో గమనిద్దాము, విభీషణుడు చెప్పిన సమాధానాలు మనకి అనుకూలంగా ఉంటే ఆయనని స్వీకరిద్దాము, లేకపోతే ఆయనని స్వీకరించద్దు” అన్నాడు.

రాముడు హనుమ వంకతిరిగి… 'నువ్వేమి చెప్పవా, హనుమా!' అన్నట్టు చూశాడు. 

అప్పుడు హనుమంతుడు లేచి అన్నాడు… “మహానుభావా! మూడు లోకములలో జరిగే సమస్త విషయాలని తెలుసుకోగలిగే ప్రాజ్ఞుడవి నువ్వు, నీకు వేరొకరు చెప్పవలసిన అవసరం లేదు. నేను ఈ విషయం చెప్పేటప్పుడు వాదించడానికి చెబుతున్నాననో, తర్కం చెయ్యడానికి చెబుతున్నాననో, వేరొకరు చెప్పిన అభిప్రాయాలని ఖండించి సంఘర్షణ పడాలనుకొని చెబుతున్నాననో మీరు మాత్రం భావించకూడదు. మీరు నాయందు గౌరవముంచి అడిగారు, నేను మీయందు గౌరవముంచి నాకు యుక్తము అనిపించిన మాటలు చెబుతాను. మీరు ఆలోచన చేసి నిర్ణయించుకోండి…

ఇందులో కొంతమంది విభీషణుడిని నమ్మకూడదు అన్నారు, విభీషణుడు కామరూపాన్ని పొందగలిగినవాడైతే, మన సైన్యంలోకి వచ్చి గూఢచర్యం చెయ్యవలసినవాడైతే, తన స్వరూపంతో వచ్చి ఆకాశంలో నిలబడి 'నేను రాముడిని శరణు వేడుకుంటున్నాను' అని అతను చెప్పవలసిన అవసరం లేదు. కొంతమంది గూఢచారులని పంపమన్నారు, మనకి తెలీకుండా మనకి అపకారం చేస్తాడేమో అన్న అనుమానం ఉన్నవాడి మీదకి గూఢచారులని పంపి నిర్ణయించుకోవచ్చు. కాని ఎదురుగా నిలబడి ఉన్నవాడి మీదకి గూఢచారిని ఎలా పంపిస్తారు. కొంతమంది మంచి ప్రశ్నలు వేసి ఆ ప్రశ్నల వల్ల సమాధానాలు రాబట్టమన్నారు, మనం అతనిని ఏమని ప్రశ్నిస్తాము? జవాబు చెప్పేవాడికన్నా ప్రశ్న వేసేవాడు తెలివి తక్కువ ప్రశ్న వెయ్యవచ్చు. ఆ తెలివి తక్కువ ప్రశ్న వల్ల మిత్రుడిగా ఉండవలసినవాడు అమిత్రత్వంతో అక్కడినుంచి వెళ్ళిపోవచ్చు, దానివల్ల మనం నష్టపోతాము. అందుకని అన్నివేళలా ప్రశ్నలు వేసి నిర్ణయించడం సాధ్యం కాదు. కొంతమంది గుణములు ఉంటే స్వీకరిద్దాము అన్నారు, వేరొకరియందు ఉండకూడని గుణము అని చెప్పబడినది మనయందు గుణము అవ్వచ్చు. కొంతమంది దేశము, కాలము యందు దోషముందని చెప్పారు, దేశము చేత, కాలము చేత ఇప్పుడే యదార్ధమైన స్థితి ఉంది.

ఇవతలవారికి అపకారము చేద్దామనే బుద్ధితో వచ్చి ఆకాశంలో నిలబడినవాడైతే ఆయన ముఖం అంత తేజోవంతంగా, నిర్మలంగా, ప్రశాంతంగా ఉండదు, అంత ధైర్యంగా నిలబడలేడు. ఆయన ముఖంలో ఏ విధమైన దోషం కాని, శఠుడికి ఉండే బుద్ధికాని నాకు కనపడడంలేదు. ఆయన మాట్లాడిన మాటలలో దోషం పట్టుకోడానికి నాకు ఏమి కనపడలేదు. ఇటువంటప్పుడు మనం ఆయన యందు వేరొక భావనని ఆపాదించి శరణు ఇవ్వకుండా ఉండవలసిన అగత్యం ఉన్నది అని నేను అనుకోవడం లేదు. నేను మాత్రం నా బుద్ధి చేత ఒక నిర్ణయానికి వచ్చాను. విభీషణుడికి మీ పౌరుష పరాక్రమాల గురించి, మీ ధర్మము గురించి తెలుసు, ఆయనకి రావణుడి పౌరుషము తెలుసు, మీ పౌరుషం ముందు రావణుడి పౌరుషం నిలబడదు అని విభీషణుడు నిర్ణయానికి వచ్చాడు. అలాగే, మీరు వాలిని సంహరించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేసిన విషయాన్ని విభీషణుడు విన్నాడు, అధర్మాత్ముడిని సంహరించి ధర్మాత్ముడికి పట్టాభిషేకం చేస్తారు అని నమ్మి ఇక్కడికి వచ్చాడు. మీరు ఆయనకి శరణు ఇవ్వవచ్చు అని నేను అనుకుంటున్నాను” అన్నాడు.

అప్పుడు రాముడు… “ఇప్పటిదాకా మీరందరూ, దోషములు ఉన్నాయా, దోషములు లేవా, తీసుకోవచ్చా, తీసుకోకూడదా అని పలు మాటలు చెప్పారు, నేను ఒక మాట చెబుతున్నాను వినండి… నా దగ్గరికి వచ్చి భూమి మీద పడి… 'రామా! నేను నీవాడనయ్యా, నువ్వు నన్ను రక్షించు' అన్నవాడియందు నేను గుణదోష విచారణ చెయ్యను.

```

*“సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే*

*అభయం సర్వ భూతేభ్యో దదామ్యేతద్ వ్రతం మమ”*

```

వచ్చినవాడు విభీషణుడే కాని, రావణుడే కాని, నన్ను శరణు కోరినవాడు ఎవడైనా సరే రక్షిస్తాను. యదార్ధమునకు ఇటువంటి యుద్ధం జరుగుతున్నప్పుడు పక్క రాజ్యం మీద ఇద్దరికి ఆశ ఉంటుంది. అదే కులంలో జన్మించినవాడు ఎవడు ఉంటాడో వాడికి రాజ్యాధికారం మీద ఆశ ఉంటుంది, అలాగే పక్కనున్న రాజుకి ఆశ ఉంటుంది. అందుకని ఈ రెండిటి విషయంలో మనం తటస్థులము, కాని ఈ రెండు కారణములు తన వైపు ఉన్నాయి కాబట్టి విభీషణుడు వచ్చి శరణాగతి అడిగాడు.

సుగ్రీవా! ప్రపంచంలో భరతుడులాంటి సోదరుడు ఉండడు(కోరి వచ్చిన రాజ్యాన్ని వదిలాడు కనుక), నాలాంటి కొడుకు ఉండడు(తండ్రి ప్రేమని అంతలా పొందాడు కనుక), నీలాంటి మిత్రుడు ఉండడు. అందుకని అన్నీ ఆ కోణంలో పోల్చి చూడకు. వాడు దుష్టుడు కాని, మంచివాడు కాని, నా దగ్గరికి వచ్చి శరణాగతి చేశాడు కనుక ఆయనకి శరణు ఇచ్చేస్తాను. ఈ బ్రహ్మాండములో ఉన్న పిశాచములు, దానవులు, యక్షులు, ఈ సమస్త పృధ్విలో ఉన్న భూతములు కలిసి నా మీదకి యుద్ధానికి వస్తే, నేను నా చిటికిన వేలి గోటితో చంపేస్తాను.

పూర్వకాలంలో ఒక చెట్టు మీద రెండు పావురాలు ఉండేవి. అవి ఒక ఆడ పావురము, ఒక మగ పావురము. ఒకనాటి సాయంకాలం ఒక బోయవాడు అటుగా వెళ్ళిపోతూ ఆనందంతో రమిస్తున్న రెండు పావురములను చూశాడు. అప్పుడాయన బాణం పెట్టి ఆడ పావురాన్ని కొట్టాడు. బాణం దెబ్బకి కిందపడిన ఆడ పావురాన్ని అక్కడే కాల్చుకొని తిని వెళ్ళిపోయాడు. ఆడ పావురం చనిపోయిందని ఆ మగ పావురం చాలా బాధ పడింది. కొంతకాలానికి ఆ బోయవాడు విశేషమైన వర్షం పడుతుండగా వేటకని వచ్చి, ఏమీ కనపడకపోయేసరికి ఒక చెట్టుకింద ఉండిపోయాడు. తరువాత ఆ అరణ్యంలో నడుస్తూ నీరసం చేత కళ్ళు తిరిగి, పూర్వం తాను ఏ ఆడ పావురాన్ని చంపి తిన్నాడో ఆ చెట్టు కింద పడిపోయాడు. అప్పుడా మగ పావురం ఆ బోయవాడిని చూసి గబగబా వెళ్ళి నాలుగు ఎండు పుల్లలని తీసుకొచ్చి, ఎక్కడినుంచో అగ్నిని తీసుకువచ్చి నిప్పు పెట్టింది. అప్పుడా వేడికి ఈ బోయవాడు పైకి లేచి స్వస్థతని పొందాడు. ఆకలితో ఉన్న ఆ బోయవాడి ఆకలి తీర్చడం కోసం ఆ మగ పావురం ఆ అగ్నిలో పడిపోయి ప్రాణం వదిలేసింది. తన భార్యని చంపిన బోయవాడు తన చెట్టు దగ్గరికి వచ్చి పడిపోతే, ఒక మగ పావురం ఆతిధ్యం ఇచ్చి, తన చెట్టు కింద పడిపోవడమే శరణాగతి అని భావించి తన ప్రాణములు ఇచ్చి ఆ బోయవాడిని రక్షించింది. నేను మనుష్యుడిలా పుట్టి, క్షత్రియ వంశ సంజాతుడనై, దశరథుడి కొడుకునై, నన్ను శరణాగతి చేసినవాడి గుణదోషములను ఎంచి, నీకు శరణాగతి ఇవ్వను అంటే నేను రాజుని అవుతానా? క్షత్రియుడని అవుతానా? ఈ భూలోకంలో ఉన్న సమస్త భూతములలో ఏదన్నా సరే నన్ను శరణాగతి చేస్తే, వాళ్ళ యోగక్షేమాలు నేను వహిస్తాను. శరణాగతి చేసినవాడు బలహీనుడై, శరణు ఇవ్వవలసినవాడు బలవంతుడై ఉండి కూడా శరణు ఇవ్వకపోతే, వాడు చూస్తుండగా శరణాగతి చేసినవాడు మరణిస్తే, మరణించినవాడు రక్షించనివాడి యొక్క పుణ్యాన్ని అంతా తీసుకొని ఊర్ధలోకాలకి వెళ్ళిపోతాడు. రక్షించనివాడి కీర్తి ప్రతిష్టతలు నశించిపోతాయి. అందుచేత నేను విభీషణుడికి శరణు ఇస్తున్నాను, ఆయనని తీసుకురండి” అన్నాడు.

అప్పుడు సుగ్రీవుడు అన్నాడు…  

“రామా! నీకు తప్ప ఇలా మాట్లాడడం ఎవరికి చేతనవుతుంది. నీ ప్రాజ్ఞతకి మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను” అన్నాడు.

రాముడి మాటలకు సంతోషించిన విభీషణుడు ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన భూమి మీదకి దిగుతూనే… 'ఇది రాముడు నిలబడిన భూమి' అని, ఆ భూమికి నమస్కరించి ఇలా అన్నాడు… “రామచంద్రా! నేను రావణుడి తమ్ముడిని, నన్ను విభీషణుడు అంటారు. నేను లంకా పట్టణాన్ని విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చేశాను. నా ఐశ్వర్యాన్ని, భార్యని, బిడ్డలని వదిలేసి నువ్వే నా సర్వస్వం అని నమ్మి వచ్చేశాను. నా శిరస్సుని నీ పాదాలకి తగిల్చి శరణాగతి చేస్తున్నాను. నా యోగక్షేమములను నువ్వే వహించాలి” అన్నాడు.

రాముడు విభీషణుడిని తన పక్కన కూర్చోపెట్టుకొని లంకలో ఉన్న రాక్షసుల బలాబలాల గురించి అడిగాడు. అప్పుడు విభీషణుడు రావణుడి గురించి, కుంభకర్ణుడి గురించి, ఇంద్రజిత్ గురించి మరియు ఆ లంక ఎంత శత్రు దుర్భేద్యమో కూడా చెప్పాడు. 

అప్పుడు రాముడన్నాడు… “విభీషణా బెంగపెట్టుకోకు, రావణుడిని బంధువులతో, సైన్యంతో సహా సంహరిస్తాను. నీకు లంకని దానం చేస్తాను. నిన్ను లంకకి రాజుగా పట్టాభిషేకం చేస్తాను. రావణుడు హతమయ్యేవరకు నువ్వు ఆగక్కరలేదు, ఇప్పుడే నిన్ను లంకకి రాజుగా చేసేస్తాను” అన్నాడు.

అప్పుడు విభీషణుడు… “మీకు శరణాగతి చేశాను కనుక మీరు ఏమాట చెబితే ఆ మాట వింటాను. రావణుడి మీద యుద్ధం చెయ్యమంటే యుద్ధం చేస్తాను. మీకు ఎప్పుడన్నా సలహా కావలసి వచ్చి నన్ను అడిగితే నేను చెప్పగలిగిన సలహా చెబుతాను” అన్నాడు.

మళ్ళి రాముడు అన్నాడు… “లక్ష్మణా! వెంటనే వెళ్ళి సముద్ర జలాలని తీసుకురా. ఈయనకి అభిషేకం చేసి లంకా రాజ్యానికి రాజుగా ప్రకటిస్తాను” అని విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు.

ఆ తరువాత రావణుడు శార్దూలుడనే గూఢచారిని రాముడి దగ్గరికి పంపించాడు. 

ఆ శార్దూలుడు అక్కడ ఉన్న వానర బలాన్ని అంతటినీ చూసి రావణుడి దగ్గరికి వెళ్ళి… “అది వానర సైన్యమా? సముద్రం పక్కన నిలబడ్డ మరో సముద్రంలా ఉందయ్యా. నువ్వు ఆ వానర బలాన్ని గెలవలేవు, అక్కడున్న వీరులు సామాన్యులు కారు, నా మాట విని సీతమ్మని రాముడికి అప్పగించు” అన్నాడు. 

“నేను మాత్రం సీతని ఇవ్వను” అని, సుకుడు అనేవాడిని పిలిచి… “నువ్వు పక్షి రూపంలో సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి నేను చెప్పానని ఒక మాట చెప్పు.

'నువ్వు వానరుడివి, నేను రాక్షసుడిని. నేను అపహరించింది నరకాంతని, మధ్యలో నీకు నాకు కలహం ఎందుకు? మీరు ఈ సముద్రాన్ని దాటి రాలేరు. ఒకవేళ దాటాలని ప్రయత్నించినా నా చేతిలో మీరు చనిపోతారు. ఒక మానవకాంత కోసం వానరులు ఎందుకు మరణించడం? నా మాట విని మీరు వెళ్ళిపొండి' అని సోదరుడైన సుగ్రీవుడితో చెప్పి, నేను ఆయన కుశలమడిగానని చెప్పు” అని సుకుడిని పంపించాడు.

ఆ సుకుడు పక్షి వేషంలో వచ్చి ఆకాశంలో నిలబడి, సుగ్రీవుడిని ఉద్దేశించి రావణుడు చెప్పిన మాటలని చెప్పాడు. 

ఇదంతా విన్న సుగ్రీవుడు అన్నాడు… “దుర్మార్గుడు, దురాత్ముడు అయిన రావణుడు నిజంగా అంత శక్తి కలిగినవాడైతే, రామలక్ష్మణులు లేని సమయంలో సీతమ్మని ఎందుకు అపహరించాడు. రాముడి కోదండ విద్యా పాండిత్యము ముందు రావణుడు నిలబడలేడు. వాడి స్నేహము, వాడి సందేశము నాకు అక్కరలేదు” అన్నాడు.

ఈలోగా అక్కడున్న వానరాలు గూఢచారిని విడిచిపెట్టకూడదని చెప్పి, అందరూ పైకి ఎగిరి ఆయన రెక్కలు విరిచేస్తున్నారు. అప్పుడా సుకుడు ‘రామా రామా' అని ఏడిస్తే, రాముడు వెంటనే ఆ వానరాలని శాంతింప చేసి సుకుడుని విడిపించాడు. 

కాని వానరములు సుకుడిని బందీగా పట్టుకుని ఉంచాయి.

ఏమిచేస్తే ఈ సముద్రం మనకి దారి ఇస్తుంది అని విభీషణుడిని అడుగగా, ఆయన అన్నాడు…  

“రాముడు శరణాగతి చేస్తే సముద్రం దారి ఇస్తుంది” అన్నాడు.

చందనము మొదలైన వాటి చేత ఒకనాడు అలదబడినటువంటి బాహువు, కోట్ల గోవులని దానము చేసిన బాహువు, మణులతో కూడిన కేయూరములు మొదలైనవాటితో అలంకరింపబడ్డ బాహువు, అనేకమంది స్త్రీలచేత స్పృసింపబడ్డ బాహువు, ఒకనాడు సీతమ్మ తలగడగా వాడుకున్న బాహువుని ఈనాడు తనకి తలగడగా చేసుకొని రాముడు సముద్రానికి శరణాగతి చేసి సముద్రపు ఒడ్డున పడుకున్నాడు. 

మూడు రాత్రులు గడిచిపోయినప్పటికీ సముద్రుడు రాకపోవడం వల్ల రాముడికి ఆగ్రహం వచ్చి లక్ష్మణుడితో అన్నాడు… “పౌరుషం ఉన్నవాడు తన పౌరుషాన్ని ప్రకటించకుండా మంచితనాన్ని ప్రకటిస్తే చేతకానివాడిగా చూస్తుంది ఈ ప్రపంచం. ఈ సాగరం దారి ఇవ్వకపోతే నేను వెళ్ళలేను అనుకుంటోంది. బ్రహ్మాస్త్రం చేత ఈ సాగరాన్ని ఎండించేస్తాను. ఇందులో ఉన్న తిమింగలాలని, మొసళ్ళని, పాములని, రాక్షసులని నిగ్రహిస్తాను. ఒక్క ప్రాణి కూడా బతకకుండా చేసేస్తాను. ఈ బ్రహ్మాస్త్రం విడిచిపెట్టిన తరువాత ఇక్కడ నీరు ఉత్తర క్షణం ఆవిరయిపోయి ధూళి ఎగురుతుంది. అప్పుడు వానరులందరూ భూమి మీద నడుచుకుంటూ లంకని చేరుకుంటారు” అని చెప్పి, కోదండాన్ని తీసి బ్రహ్మాస్త్రాన్ని అనుసంధానం చేశాడు.

అలా చేసేటప్పటికి పర్వతాలన్ని కదిలిపోయాయి, వ్యాకులంగా గాలి వీచింది, అగ్నిహోత్రపు మంటలు సూర్యుడి నుండి కిందపడ్డాయి, ప్రాణులన్నీ దీనంగా ఘోష పెట్టాయి, 2 యోజనముల దూరం సముద్రము వెనక్కి వెళ్ళిపోయింది. ఆ సమయంలో సముద్రుడు లోపలినుంచి బయటకి వచ్చాడు.

ఆ సముద్రంలో పుట్టిన అనేకమైన బంగారములు, రత్నములతో కూడిన ఒక పెద్ద హారాన్ని సముద్రుడు వేసుకొని ఉన్నాడు. శ్రీ మహావిష్ణువు ధరించే కౌస్తుభానికి తోడపుట్టిన ఒక మణిని మెడలో వేసుకొని ఉన్నాడు. పైకి కిందకి వెళుతున్న తరంగ సద్రుస్యమైన వస్త్రాన్ని ధరించి ఉన్నాడు. గంగ, సిందు మొదలైన నదులన్నీ స్త్రీల స్వరూపాన్ని పొంది ఆయన వెనుక వస్తున్నాయి. అలా పైకిలేచిన సముద్రుడు రాముడికి నమస్కరించి… “భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశములు అనే పంచ భూతములు ఉన్నాయి. వీటన్నిటికి ఒక స్వభావం ఉంటుంది, ఆ స్వభావాన్ని ఈ పంచ భూతములు అతిక్రమించలేవు. సముద్రం అంటే అగాధంగా ఉండాలి, లోతుగా ఉండాలి, అందులోకి దిగినవాడికి ఆధారం చిక్కకూడదు, సముద్రంలో ఏదన్నా పడితే మునిగిపోవాలి, వ్యాకులితమైన తరంగాలతో ఒడ్డుని కొడుతూ ఉండాలి. ఇలా ఉండకపోతే దానిని సముద్రము అనరు. అందుకని ఈ సముద్రాన్ని ఎండింపచెయ్యడం, సముద్రంలో నుంచి దారి ఇవ్వడం నాకు వీలుపడే విషయం కాదు. నువ్వు అభిమంత్రించిన బ్రహ్మాస్త్రాన్ని నా మీదకి వెయ్యకు. నీ దగ్గర ఉన్న వానరములలో విశ్వకర్మ కుమారుడైన నలుడు ఉన్నాడు. విశ్వకర్మ గొప్ప గొప్ప కట్టడములను నిర్మిస్తూ ఉంటాడు, అటువంటివాడి తేజస్సు కనుక ఈ నలుడికి సేతువు నిర్మాణం తెలుసు. మీరు నా మీద సేతువుని నిర్మించుకోండి. అందుకని వానరులు తెచ్చి పడేసిన చెట్లు, బండలు మొదలైనవి అటూ ఇటూ చిమ్మకుండా నా తరంగముల చేత తేలేటట్టు చేస్తాను. నాలో ఉన్న ఏ క్రూర మృగము వల్ల వారధిని దాటేటప్పుడు వానరములకి ఎటువంటి భీతి లేకుండా నేను కాపాడతాను. సేతు నిర్మాణం వెంటనే ప్రారంభించండి. ద్రుమకుల్యము అని ఉత్తర తీరంలో ఉంది. అక్కడుండే జలాలని ఆభీరులు, దాస్యులు అనే వారు తాగేస్తుంటారు. సముద్రాన్ని క్షోభింప చేస్తుంటారు. అందుకని నువ్వు ఈ బ్రహ్మాస్త్రాన్ని ఇక్కడి నుంచి అక్కడికి ప్రయోగించు” అన్నాడు.

అప్పుడు రాముడు బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించగా అది ఉత్తర దిక్కుకి వెళ్ళి ఆభీరులు, దాస్యులు మీద పడింది. 

ఆ దెబ్బకి అక్కడున్నవారందరూ మరణించారు. ఈ బాణం భూమిలోకి వెళ్ళి భూమిని పెకలించగా అందులో నుంచి గంగ పుట్టింది. “అక్కడ మందాకినీ జలాలలాంటి తియ్యటి జలాలు ప్రవహిస్తాయి, అక్కడ గో సంపద పెరుగుతుంది, రోగాలు ఉండవు, మనుష్యులు ప్రశాంతంగా ఉంటారు, అక్కడ విశేషంగా తేనె, చెట్లు, పళ్ళు, పెరుగు, నెయ్యి మొదలైనవి లభిస్తాయి. ఆ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది” అని రాముడు బ్రహ్మాస్త్రం గుచ్చుకున్న ప్రాంతానికి వరం ఇచ్చాడు.```

         *రేపు…83వ భాగం*

*🚩జై శ్రీరామ్.! జై శ్రీ రామ్.!🚩*                           

       *🙏జై జై శ్రీ రామ్.!🙏*

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*

 *

``

            *రామాయణం*

ఒకసారి చదివినంత  

మాత్రాన మన సమస్త 

పాపాలని తీసేస్తుంది. ``

      *వాల్మీకి రామాయణం*                 

             *83వ భాగం*

```

వెంటనే నలుడు పరిగెత్తుకొచ్చి సేతు నిర్మాణం ప్రారంభిస్తానన్నాడు. 

అప్పుడు అక్కడున్న వానరులందరూ సంతోషపడిపోయి పర్వతాలు, కొండలు ఎక్కి పెద్ద పెద్ద శిలలు మోసుకొచ్చి సముద్రంలో పడేస్తున్నారు. ఆ సమయంలో ఎవరినోట విన్నా 'సీతారామ ప్రభువుకి జై' అంటూ, ఉత్సాహంగా రకరకాల చెట్లని తీసుకొచ్చి సముద్రంలో పడేశారు. మొదటి రోజున 14 యోజనముల సేతువుని నిర్మించారు, రెండు మూడు నాలుగు అయిదు రోజులలో 20, 21, 22, 23 యోజనాల సేతువుని నిర్మించేసారు. మొత్తం అయిదు రోజులలో 100 యోజనముల సేతువు నిర్మాణం అయిపోయింది.

“మీరందరూ ఈ సేతువు మీద ప్రయాణం చేసి ఆవలికి చేరుకోండి” అని రాముడు అన్నాడు.

అప్పుడా వానరములలో కొంతమంది సేతువు మీద నడవకుండా సేతువు యొక్క అంచుల మీద నడిచేవారు. కొంతమంది సముద్రంలోకి దూకి మళ్ళి సేతువు ఎక్కి వెళ్ళేవారు. ఇంకొంతమంది సముద్రంలో ఈదుకుంటూ వచ్చారు. కొంతమంది ఒక పెద్ద చెట్టుని పెకలించి సముద్రంలో పడేసి, దాని మీద కూర్చుని తోసుకుంటూ వచ్చేవారు. ఆ రోజున సముద్ర ఘోష గొప్పదా వానర ఘోష గొప్పదా అంటే, ఎవరూ చెప్పలేకపోయారు, అంతగా అల్లరి చేసుకుంటూ వెళ్ళారు. ఎన్నిరోజులైనా ఆ సైన్యం లంకా పట్టణానికి వస్తూనే ఉంది. చివరికి అన్ని కోట్ల వానర సైన్యం లంకని చేరుకుంది.

అప్పుడు రాముడు సుగ్రీవుడిని, విభీషణుడిని పిలిచి “మనం అవతల ఒడ్డున ఉండగా సుకుడన్నవాడు రాయబారం చెయ్యడానికి వచ్చాడు కదా, వాడు ఎక్కడున్నాడు” అని అడిగాడు.

అప్పుడు ఆ సుకుడిని తీసుకొచ్చి రాముడి ముందు ప్రవేశపెట్టారు. 

అప్పుడు రాముడు “నువ్వు ఎందుకొచ్చావు” అని అడిగాడు.

సుకుడన్నాడు… “బుద్ధిహీనుడైన రావణుడు మీ బలాన్ని చూసి రాయబారం చెప్పమన్నాడు, ఇందులో నా తప్పు లేదు. నీ వంటి ప్రాజ్ఞుడు రాయబారిని చంపడు” అన్నాడు.

అప్పుడు రాముడు ఒక చిరునవ్వు నవ్వి “నువ్వు అన్నీ చూశావా?” అని అడిగాడు. 

అప్పుడా సుకుడు “ఇంకా చూడలేదు” అన్నాడు.

“విభీషణా! వీడిని తీసుకెళ్ళి దగ్గరుండి మన సైన్యం అంతా ఒకసారి చూపించు. చూపించాక వీడిని వదిలెయ్యండి, వెళ్ళిపోతాడు” అన్నాడు.

ఆ సుకుడు వానర సైన్యం అంతా చూశాక రావణుడి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు రావణుడు… “రెక్కలు విరిగిపోయాయే” అని సుకుడిని చూసి ఎకిలించాడు.

సుకుడన్నాడు… “నీలాంటి దుర్మార్గుడు కాదు రాముడు. ఆయన నన్ను ప్రాణాలతో విడిచిపెడితే వాళ్ళ సైన్యాన్ని చూసి వచ్చాను. ఆ సైన్యం సామాన్యమైన సైన్యం కాదు, అందులో అరివీర భయంకరులైన వానరులు ఉన్నారు. వాళ్ళు సముద్రాన్ని దాటి వచ్చేశారు. వాళ్ళందరూ నిన్ను మట్టుపెట్టకముందే నా మాట విని సీతమ్మని విడిచిపెట్టవయ్యా. వానరులందరినీ గరుడ వ్యూహంగా నిలుచోబెట్టారు. శిరస్థానం దగ్గర రాముడు, లక్ష్మణుడు నిలబడ్డారు. హృదయ స్థానమునందు అంగదుడు నిలబడ్డాడు. కుడి వైపున ఋషభుడు, ఎడమ వైపున గంధమాదనుడు, వెనుక భాగమునందు సుగ్రీవుడు నిలబడ్డారు. అలా కొన్ని కోట్ల కోట్ల వానరాలని నిలబెట్టారు” అన్నాడు.

తరువాత రావణుడు సుక, సారణులు అనే మరో ఇద్దరు గూఢచారులని పిలిచి వానర సైన్యాన్ని చూసి, ఎంత సైన్యం ఉందో లెక్కపెట్టి రమ్మన్నాడు. ఆ ఇద్దరు గూఢచారులు ప్రచ్ఛన్న రూపాలలో ఆకాశంలో ఉండి వానర సైన్యం ఎంత ఉందో అని చూస్తుండగా విభీషణుడు వాళ్ళని పసిగట్టి రాముడి దగ్గరికి తీసుకెళ్ళి “వీళ్ళు దుర్మార్గులు, అందుకని వీళ్ళని బంధించి తీసుకొచ్చాను” అన్నాడు.

ఇంతకముందు సుకుడితో ఎలా మాట్లాడాడో అలానే ఈ ఇద్దరు గూఢచారులతో రాముడు మాట్లాడి, విభీషణుడితో వాళ్ళని పంపించి సైన్యాన్ని చూపమన్నాడు.

ఆ సుక సారణులు వానర సైన్యాన్ని చూసి, రావణుడికి ఆ సైన్యం గురించి వివరించారు. 

అప్పుడు రావణుడు… “వాళ్ళందరూ 100 యోజనాల సముద్రాన్ని దాటి వచ్చేశారు అంటున్నారు కదా, వాళ్ళని ఒకసారి నాకు చూపించండి” అన్నాడు.

అప్పుడు రావణుడు సుక సారణులతో కలిసి ఒక ప్రాసాదం ఎక్కి … “వాళ్ళలో ఎవరు ఎవరో నాకు చెప్పు” అన్నాడు.

అప్పుడు సారణుడు అన్నాడు… 

“రావణా! అక్కడ చూడు, అక్కడున్నాడే ఆయన ధూమ్రుడు. ఆ ధూమ్రుడి తమ్ముడే జాంబవంతుడు. ఆయన అపారమైన పరాక్రమము ఉన్నవాడు, కొన్ని కోట్ల వానరములతో యుద్ధానికి వచ్చాడు. వాడు గట్టిగా పెద్ద పెద్ద కేకలు వేస్తే వాడి నోట్లోనుంచి వచ్చే నాదానికి శత్రువుల గుండెలు బద్దలయిపోతాయి. వాళ్ళకి వేరే ఆయుధములు అక్కరలేదు, వాళ్ళకి గోళ్ళు, కోరలు ఆయుధములు. పళ్ళతో కొరుకుతారు, మోచేతులతో పొడుస్తారు, చెట్లు పెకలిస్తారు, పర్వత శిఖరాలని ఊపుతారు, పెద్ద పెద్ద శిలలని విసురుతారు. ఒక్కొక్కడిది 10 ఏనుగుల బలం, కొంతమందిది 100 ఏనుగుల బలం, 1000 ఏనుగుల బలం, లక్ష ఏనుగుల బలం, కొంతమందిది ఎంత బలమో చెప్పడం కుదరదు. ఇందులో ఇంకా ఆశ్చర్యమైనవాడు ఇంకోడు ఉన్నాడు, ఆయన అడుగు తీసి అడుగు వేస్తే యోజనం దూరం పడుతుంది అడుగు. ఆయనంత విశాలమైన శరీరం ఉన్నవాడు ఈ భూమిలో లేడు. అదిగో ఎదురుగా కనపడుతున్నది ఆయనే. ఆయన పేరు పనసుడు, 

4 యోజనముల విశాలమైన శరీరాన్ని పొంది ఉంటాడు. అదిగో ఆయన పక్కన కనపడుతున్నవాడు సుగ్రీవుడు. 36 కోట్ల వానరములు సర్వకాలములయందు ఆయన చుట్టూ ఉంటాయి. గద ఎత్తి 'రారా రావణా' అని ఆయన అక్కడ అరుస్తుంటే ఇక్కడ లంకలో ప్రాసాదములు కదులుతున్నాయి. ఇన్ని కోట్ల వానరాలకు ఆయన అధినాధుడు, ఆయన ఆజ్ఞకి తిరుగులేదు. ఆయన కిష్కిందని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తాడు. ఈయన కన్నా బలవంతుడైన ఈయన అన్న వాలిని రాముడు ఒక్క బాణంతో కొట్టి చంపేశాడు. వాలి మెడలో ఉండే మహేంద్ర మాల ఇప్పుడు సుగ్రీవుడి మెడలో ఉంది.

అదిగో అటు చూడు, ఆయన కేసరి, హనుమ యొక్క తండ్రి. ఆయన మేరు పర్వత శిఖరాల మీద తిరుగుతుంటాడు, కొన్ని లక్షల సైన్యంతో యుద్ధానికి వచ్చాడు. ఆయనది సామాన్యమైన శక్తి కాదు. 

ఆ పక్కన ఉన్న గంధమాధనుడి శక్తి అంత ఇంత అని చెప్పడానికి కుదరదు. అక్కడున్న వానరములలో కొంతమంది బంగారు రంగులో మెరుస్తూ ఉంటారు, కొంతమంది కాటుక కొండల్లా ఉంటారు, కొంతమంది భయంకరమైన దంతాలతో ఉంటారు, కొంతమంది తోకలు పొడుగ్గా ఉంటాయి, కొంతమంది ఎర్రగా, కొంతమంది పచ్చగా ఉంటారు. అక్కడున్న గుహల నిండా, పర్వతాల నిండా వాళ్ళే, సముద్రం మీద వాళ్ళే, ఆ వారధి మీద వాళ్ళే, లంకా పట్టణం చుట్టూ వానరాలే. ఈ వానరాలే కాకుండా ఇంకా వానరాలు వస్తూనే ఉన్నాయి వారధి దాటుతూ. లంకా పట్టణం చుట్టూ ఉన్న వనాలలొ ఉన్న ప్రతి చెట్టు మీద భల్లూకాలు ఉన్నాయి, ఈ భల్లూకాలన్నిటికి జాంబవంతుడు నాయకుడు. ఇంకా గవయుడు, గయుడు, గవాక్షుడు కోటి ఏనుగుల బలం ఉన్నవారు. నీ మీదకి ఇవ్వాళ ఎంత సైన్యం యుద్ధానికి వచ్చిందో చెబుతాను విను, పది పదివేలయితే ఒక లక్ష, పది లక్షలయితే పదిలక్షలు, పది పదిలక్షలు అయితే ఒక కోటి, లక్ష కోట్లయితే ఒక సంకువు, వెయ్యి సంకువులు ఒక మహా సంకువు, వెయ్యి మహా సంకువులు ఒక వృందము, వెయ్యి వృందములు ఒక మహా వృందము, వెయ్యి మహా వృందములు ఒక పద్మము, వెయ్యి పద్మములు ఒక మహా పద్మము, వెయ్యి మహా పద్మములు ఒక ఖర్వము, వెయ్యి ఖర్వములు ఒక మహా ఖర్వము, వెయ్యి మహా ఖర్వములు ఒక సముద్రము, వెయ్యి సముద్రములు ఒక ఓధము, వెయ్యి ఓధములు ఒక మహా ఓధము. ఇటువంటి మహా ఓధములు ఎన్నున్నాయో చెప్పడం కుదరదు.

అదుగో అక్కడ మధ్యలో నిలబడినవాడు హనుమ, ఆయన బంగారు శరీరంతో మెరిసిపోతుంటాడు. ఆయనకి బ్రహ్మగారి వరం ఉంది, ఏ అస్త్ర-శస్త్రములకి ఆయన కట్టుబడడు. ఆయన పక్కన నీలమైన శరీరంతో, పద్మాలవంటి కన్నులతో, ఎడమ చేతితో కోదండం పట్టుకుని, సాముద్రిక శాస్త్రంలో ఎలా ఉండాలని చెప్పబడిందో అలా పోతపోసిన సౌందర్యంతో ఉన్నాడే, ఆయనే రాముడు. ఆయన పరమ ధర్మాత్ముడు, పితృవాక్య పరిపాలకుడు. ఆ రాముడి బహి ప్రాణం లక్ష్మణుడు, కంటిని కనురెప్ప కాపాడినట్టు ఆయన నిరంతరం అన్నని కాపాడుతూ ఉంటాడు. రామతుల్యమైన పరాక్రమము ఉన్నవాడు. రాముడికి ఎన్ని అస్త్ర-శస్త్రములు తెలుసో లక్ష్మణుడికి కూడా అన్ని అస్త్ర-శస్త్రములు తెలుసు” అని పొంగిపోతూ ఆ రామ సైన్యం గురించి రావణుడికి చెబుతున్నాడు.

అప్పుడు రావణుడు ఆ సారణుడిని ఆపి… “నీకు ఎంత సంతోషంగా ఉందిరా వాళ్ళ గురించి చెప్పడం అంటే! నా అన్నం తిని వాళ్ళని పొగుడుతావా. ఇంకొకళ్ళు అయితే ఇప్పుడే పీకలు తీయించేవాడిని, కాని మీరు నాకు గతంలో చాలా ఉపకారాలు చేశారు కనుక వదిలేస్తున్నాను. ఇంకెప్పుడన్నా మీ ముఖాలు నాకు కనపడితే మీ పీకలు ఎగిరిపోతాయి, పోండి ఇక్కడినుంచి!” అని, మళ్ళి శార్దూలుడిని పిలిచి… “ఈ సారి నువ్వు వెళ్ళి గూఢచర్యం చేసి, ఎవడు ఏ వంశానికి చెందినవాడు, ఎవడు ఎవడి పుత్రుడు, రాముడు ఆహారం ఎక్కడ తింటాడు, ఎక్కడ పడుకుంటాడు, పక్కన ఎవరుంటారు, ఎవరు రక్షిస్తూ ఉంటారు మొదలైన ఈ విషయాలని కనిపెట్టి రా” అన్నాడు.

తరువాత రావణుడు విద్యుజిహ్వుడిని పిలిచి… “నువ్వు నాకు ఒక ఉపకారం చెయ్యాలి. నువ్వు గొప్ప మాయాజాలం ఉన్నవాడివి. రాముడి శరీరం నుండి శిరస్సు విడిపోతే ఆ శిరస్సు ఎలా ఉంటుందో ముమ్మూర్తులా అటువంటి శిరస్సు తయారుచెయ్యాలి. రాముడి చేతిలో ఎటువంటి కోదండం ఉంటుందో అటువంటి కోదండాన్ని సృష్టించాలి. అలాగే రాముడి బాణాలు, అక్షయతూణీరాలు ఎలా ఉంటాయో అటువంటివి సృష్టించాలి” అన్నాడు.

కొంతసేపటికి ఆయన అశోక వనానికి వెళ్ళి “సీతా! నా భర్త అంత గొప్పవాడు అని గొప్పగా చెప్పావు కదా, ఆ రాముడు వానరములతో కలిసి సముద్రానికి సేతువు కట్టి దాటాడు. రాముడు దక్షిణ తీరంలో లంకకి సమీపంగా పడుకొని ఉండగా, ప్రహస్తుడి నాయకత్వంలో సైన్యం వెళ్ళి ఆదమరచి నిద్రిస్తున్న రాముడి శిరస్సుని శరీరం నుండి వేరు చేశారు. నిద్రపోతున్న వానరముల మీద మా సైన్యం దాడి చేసి అందరినీ సంహరించారు. హనుమంతుడు దవడల నుండి రక్తం కక్కుతూ చనిపోయాడు. రాముడి శిరస్సు వేరవడం చూసి లక్ష్మణుడు దిక్కులుపట్టి పారిపోయాడు. జాంబవంతుడు, సుషేణుడు, గంధమాదనుడు, శతబలి, అంగదుడు మొదలైన వీరులందరూ మరణించారు. మిగిలిన వానరాలని సముద్రంలోకి తోసేసారు. లక్ష్మణుడు మాత్రం కొంతమంది వానరములతో కలిసి పారిపోయాడు. ఇదుగో నీ భర్త శిరస్సు చూసుకుని సంతోషించు!” అని చెప్పాక, అక్కడున్న ఒక రాక్షస స్త్రీని పిలిచి… “రాత్రి ప్రహస్తుడు రాముడి శిరస్సుని వేరు చేసి తీసుకొచ్చాడు. విద్యుజిహ్వుడిని ఆ శిరస్సు తీసుకురమ్మన్నానని చెప్పండి” అన్నాడు.

అప్పుడు విద్యుజిహ్వుడు తీసుకొచ్చిన రామ శిరస్సుని, బాణాలని, కోదండాన్ని అక్కడ పెట్టారు. వాటిని చూడగానే సీతమ్మ నేల మీద పడి మూర్చపోయింది. అప్పుడు రావణుడు ఆ కోదండాన్ని, బాణాలని సీతమ్మ దగ్గరికి విసిరేసి… “సీతా! ఇప్పటికైనా నువ్వు నా పాన్పు చేరుతావా” అన్నాడు.

అప్పుడు సీతమ్మ ఆ శిరస్సుని పట్టుకొని రాముడిదో కాదో అని అవలోకనం చేసి చూసింది. అది యధాతధంగా రాముడి శిరస్సులా ఉంది. అప్పుడు సీతమ్మ అన్నది… “రామా! నాకు చాలా సౌభాగ్యము ఉందని, నువ్వు దీర్ఘాయుష్మంతుడవని పెద్దలు, జ్యోతిష్కులు చెప్పారు. ఇవ్వాళ 

ఆ జ్యోతిష్కులు చెప్పిన మాట అబద్ధమయ్యింది. నువ్వు గొప్ప యజ్ఞాగ్నితో అంతిమ సంస్కారం జరుపుకోవలసినవాడివి, కాని ఇవ్వాళ దిక్కులేకుండా యుద్ధ భూమిలో పడిపోయి ఉంటే క్రూరమృగాలు 

నీ శరీరాన్ని తినేస్తూ ఉండుంటాయి. భార్యయందు దోషం ఉంటే, భార్య ప్రవర్తనయందు విశేషమైన వైక్లవ్యం ఉంటే భర్త వెళ్ళిపోతాడని శాస్త్రం చెబుతుంది. నాయందు ఏ దోషముందని నాకన్నా ముందు వెళ్ళిపోయావు రామా?” అని సీతమ్మ ఏడ్చింది.

సీతమ్మ అలా ఏడుస్తుంటే చిరునవ్వులు చిందిస్తున్న రావణుడిని చూసి ఆమె అన్నది…”ఇప్పటికైనా నా శిరస్సుని రాముడి శిరస్సుతోటి, నా కాయాన్ని రాముడి కాయంతోటి కలిపి అంత్యేష్టి సంస్కారం పూర్తిచెయ్యి. ఈ ఒక్క కోరిక తీర్చు!” అని సీతమ్మ అన్నది.

అదృష్టవశాత్తు అదే సమయంలో అక్కడికి ఒక భటుడు వచ్చి… 

“మహారాజా! మీకోసం ప్రహస్తుడు ఎంతో ఆదుర్దాతో ఎదురుచూస్తున్నాడు. మీరు వెంటనే సభకి రావలసింది” అన్నాడు.

వెంటనే రావణుడు అక్కడినుంచి వెళ్ళిపోయాడు, రావణుడు వెళ్ళగానే ఆ శిరస్సు, ధనుర్-బాణములు అదృశ్యమయ్యాయి. ఏడుస్తున్న సీతమ్మ దగ్గరికి విభీషణుడి భార్య అయిన సరమ వచ్చి.. “నువ్వు శోకించకమ్మా, నాకు అపారమైన శక్తి ఉంది. నేను ఆకాశంలో నిలబడినప్పుడు ఎవ్వరికీ కనపడను. నేను రాముడిని చూశాను, ఆయన గుండ్రమైన బాహువులతో ఆ వానర సైన్యాన్ని కాపాడుతూ ఆవలి ఒడ్డున ఉన్నాడు. అంత అప్రమత్తంగా రాముడు నిద్రపోతాడా? రాక్షసులు రాముడిని సంహరించగలరా? ఇంద్రుడు దేవతలని రక్షిస్తున్నట్టు, రాముడు వానరములని రక్షిస్తుంటాడు. నేను ఇప్పుడే చూసి వచ్చాను ఇది విద్యుజిహ్వుడి మాయ. అందుకనే రావణుడు వెళ్ళగానే ఇక్కడున్న శిరస్సు అంతర్దానమయ్యిపోయింది. రావణుడి మాయలు నమ్మకు, ఉపశాంతిని పొందు!” అంది.

“నువ్వు చెప్పినది నిజమైతే రావణుడు ఇప్పుడు ఏమి చేస్తున్నాడో చూసి, నాకు చెప్పు” అని సీతమ్మ సరమతో అన్నది.

అప్పుడు సరమ రావణుడి అంతఃపురానికి వెళ్ళి, కొంతసేపటికి తిరిగొచ్చి… “ఇప్పుడే నేను విని వచ్చాను, రావణుడి తల్లి కైకసి, ఒక వృద్ధుడైన మంత్రి రావణుడికి నచ్చచెప్పారు. 'ఏది ఏమైనా సీతని విడిచిపెట్టడం జరగదు' అని రావణుడు అన్నాడు. రాముడితో యుద్ధం చెయ్యడానికి కారణం చెప్పకుండా సైన్యాన్ని పిలవమన్నాడు. రాక్షసుల కోలాహలం గట్టిగా వినపడుతోంది. మేరు పర్వత శిఖరాల చుట్టూ తన గుర్రముల మీద ఎక్కి తిరిగే సూర్యనారాయణమూర్తిని ఉపాసన చెయ్యి, నీకు సమస్త శుభములు కలుగుతాయి” అని చెప్పింది.

సరమ మాటలకి సీతమ్మ ఉపశాంతిని పొందింది.

ఈలోగా మాల్యవంతుడు(తాత వరస) రావణుడి దగ్గరికి వచ్చి … “సృష్టిలో ధర్మం ఎప్పుడూ కూడా దేవతల వైపు ఉంటుంది, అధర్మం అసురుల వైపు ఉంటుంది. అధర్మపక్షం ధర్మపక్షం చేత ఓడింపబడుతుంది. నువ్వు సీతమ్మని అపహరించి తెచ్చినప్పటినుంచి దుర్నిమిత్తములు కనపడుతున్నాయి, అందుకని మనం ఓడిపోక తప్పదు. నువ్వు సీతమ్మని తెచ్చినప్పటినుంచి, తెల్లటి రెక్కలు ఉండి ఎర్రటి పాదాలతో ఉండే పావురాలు అరుస్తూ గోల చేస్తున్నాయి, ఇంట్లో పెంచుకునే చిలకలు, గోరింకలు మంచి మాటలు చెప్పడం మానేసి వీచి-కూచి మాటలు చెబుతున్నాయి, ఎక్కడినుంచో క్రూరమైన పక్షులు వచ్చి వీటితో యుద్ధం చేస్తున్నాయి, ఏ ఇంటిముందు చూసినా నల్లనివాడు, బోడిగుండువాడు, ఎర్రటి వస్త్రములు కట్టుకున్నవాడు ఉదయము సాయంకాలము ఇళ్ళల్లోకి తొంగిచూస్తున్నట్టు కనపడుతోంది. వచ్చినవాడు సామాన్యుడు కాదు, శ్రీ మహావిష్ణువు వచ్చాడు, సీతమ్మని రాముడికి అప్పగించి సంధి చేసుకుని బతికిపో, నా మాట విని యుద్ధం చెయ్యకు” అన్నాడు.

అప్పుడు రావణుడు… “చేతిలో పద్మములేని లక్ష్మీదేవి ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఉన్న సీతని నేను వదులుతానా, రాముడు గొప్పవాడే కావచ్చు, కాని నేను కూడా సురాసురులని ఓడించాను. అందరూ నాకు నీతులు చెబుతున్నారు కాని నన్ను ప్రోత్సహించే వాడు కనపడడం లేదు. మీరందరూ బుద్ధిహీనులు. తాతా! నువ్వే కాదు, ఒకవేళ బాణం పెట్టి నా శరీరాన్ని రెండుగా చీల్చినా, కత్తి పెట్టి నా శరీరాన్ని రెండుగా నరికేసినా ఆ రెండు ముక్కలు మాత్రం ముందుకి వంగవు, వెనక్కే పడిపోతాయి. ఒకరిమాట వినడం నాకు చేతకాదు, ఇది నా స్వభావం” అని చెప్పాడు.

అటుపక్క రాముడు లంకా పట్టణాన్ని చూద్దామని సువేల పర్వత ఎక్కాడు. అప్పుడే ఎదురుగా ఉన్న అంతఃపురంలోకి రావణుడు విశేషమైన మాలలు, వస్త్రాలు వేసుకుని బయటకి వచ్చాడు. అలా వస్తున్న రావణుడిని చూసిన సుగ్రీవుడు ఆగ్రహించి ఒక్క దూకు దూకి రావణుడి మీద పడ్డాడు. ఇద్దరూ పొడుచుకున్నారు, కొట్టుకున్నారు, రక్తాలు కారేటట్టు గుద్దుకున్నారు. ఇంతలో రావణుడు మాయలు ప్రదర్శించడం మొదలుపెట్టాడు. వీడు మాయా యుద్ధం చేస్తున్నాడని సుగ్రీవుడు ఎగిరి మళ్ళి రాముడి పక్కకి వచ్చేశాడు. 

అప్పుడు రాముడన్నాడు… “సుగ్రీవా! ఇలా నువ్వు వెళ్ళిపోయావే, నీకు ఏదన్నా అయితే నాకు సీత ఎందుకు, లక్ష్మణుడు ఎందుకు, భరతుడు ఎందుకు, శత్రుఘ్నుడు ఎందుకు. నేను మనస్సులో ఏమనుకున్నానో తెలుసా, ఒకవేళ రావణుడి చేతిలో నీకు జరగరానిది జరిగితే, ఈ రావణుడిని ఇక్కడే చంపేసి, విభీషణుడికి పట్టాభిషేకం చేసేసి, లక్ష్మణుడిని వెనక్కి పంపి భరతుడిని రాజ్యం ఏలుకోమని చెప్పి, నేను కూడా శరీరాన్ని ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోదామనుకున్నాను. నువ్వు లేకుండా నేను ఒక్కడినీ మాత్రం వెనెక్కి వెళ్ళకూడదని నిశ్చయించుకున్నాను. ఇంకెప్పుడూ ఇలాంటి సాహసాలు చెయ్యకు!” అన్నాడు.

తరువాత అంగదుడిని పిలిచి రావణుడి దగ్గరికి రాయబారానికి పంపారు. రాముడు అంగదుడితో… “నువ్వు ఎందరో మహర్షులని బాధలు పెట్టావు, ఎందరో స్త్రీలని అపహరించావు. నువ్వు చేసిన పాపాలకి దండన విధించడానికి, నా భార్యని కూడా అపహరించావు కనుక నీయందు దోషమున్నది కనుక, నిన్ను నేను సంహరించవచ్చు కనుక, ఇవ్వాళ లంకా పట్టణానికి వచ్చాను. ఏ దేవర్షులని, రాజులని నిష్కారణంగా వధించి పంపించావో ఆ మార్గంలోనే నిన్ను పంపిస్తాను. అంతఃపురం విడిచి బయటకి రా!” అని రాముడు అంగదుడితో చెప్పాడు.

అంగదుడు వెంటనే వెళ్ళి రావణుడితో ఈ మాటలు చెప్పాడు. 

ఆ మాటలు విన్న రావణుడు ఆగ్రహించి తన సైనికులతో అంగదుడిని పట్టుకోమని చెప్పాడు. 

ఆ సైనికులు అంగదుడిని పట్టుకోగా, అంగదుడు ఆ సైనికులతో సహా పైకి ఎగిరి ఒళ్ళు దులుపుకున్నాడు, అప్పుడా సైనికులందరూ కింద పడిపోయారు. 

అంగదుడు వెళ్ళిపోతూ రావణుడి అంతఃపుర ప్రాసాదాన్ని ఒక్క తన్ను తన్నాడు, ఆ దెబ్బకి ఆ ప్రాసాదం ఊడి కదిలిపోయింది.

రావణుడు వెంటనే ద్వారాలన్నీ మూయించేసాడు. “యుద్ధం ప్రారంభం అవుతోంది అందరూ సిద్ధంకండి!”అన్నాడు. తూర్పు దిక్కుకి సర్వసైన్యాధికారి అయిన ప్రహస్తుడు మోహరించాడు, దక్షిణ దిక్కుకి మహోదర, మహోపార్షులని నియమించాడు, పశ్చిమ దిక్కుకి ఇంద్రజిత్ ని పెట్టాడు, ఉత్తర దిక్కుకి సుక సారణులని పెట్టి, నేను మీతో యుద్ధానికి వస్తాను” అన్నాడు. 

ఇదంతా చూసిన విభీషణుడి గూఢచారులు విషయాన్ని వెనక్కి వెళ్ళి చెప్పారు.

అప్పుడు రాముడు “తూర్పు దిక్కున ఉన్న ప్రహస్తుడిని మన సర్వసైన్యాధికారి అయిన నీలుడు ఎదుర్కొంటాడు. దక్షిణ దిక్కున ఉన్న మహోదర, మహోపార్షులని యువరాజైన అంగదుడు ఎదుర్కొంటాడు. పశ్చిమ దిక్కున ఉన్న ఇంద్రజిత్ ని హనుమంతుడు ఎదుర్కొంటాడు. ఉత్తర దిక్కున ఉన్న సుక సారణులకి నాయకత్వం వహించి రావణుడు ఉన్నాడు కనుక లక్ష్మణుడితో కలిసి నేనే వెళ్ళి ఎదుర్కొంటాను. నాలుగు దిక్కులా యుద్ధం ప్రారంభం అవుతోంది, బయలుదేరండి!” అన్నాడు. ```

        *రేపు…84వ భాగం*

*🚩జై శ్రీరామ్.! జై శ్రీ రామ్.!🚩*                           

       *🙏జై జై శ్రీ రామ్.!🙏*

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*

 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏

[30/06, 8:47 am] K Sudhakar Adv Br: 🌹🌷🏹🪔🛕🪔🏹🌷🌹