30, జూన్ 2025, సోమవారం

సుబ్రమణ్య భుజంగ స్తోత్రం*

 *సుబ్రమణ్య భుజంగ స్తోత్రం*


గురూజీ, వివిధ స్తోత్రాలు మరియు వాటిని స్మరించు విధానాలను మీరు ప్రతి ఆదివారం నేర్పించు ఆన్లైన్ తరగతులలో నేను మరియు నా సతీమణి ఇద్దరూ సభ్యులే. మీరు కొన్ని రోజులుగా నేర్పిస్తున్న సుబ్రమణ్యస్వామిని స్తుతించు సుబ్రమణ్య భుజంగ స్తోత్రం ద్వారా నా జీవితంలో జరిగిన అసాధారణ మరియు ఆశ్చర్యకరమైన విషయాల గురించి మీకు నేను విన్నవిస్తున్నాను.


నేనూ నా భార్య ఇద్దరూ 68 సంవత్సరాల వయస్సు పైబడినవాళ్ళమే. మా ఇద్దరు కొడుకులు ఇతర పట్టణాల్లో విదేశాల్లో వారి వారి ఉద్యోగాలు కుటుంబాలతో నిమగ్నమై ఉండడంతో నేను నా భార్యతో సహా ఒంటరిగానే ఉంటున్నాను.


ఈ సంవత్సరం మే నెల రెండవ ఆదివారం గురువు గారు సుబ్రమణ్య భుజంగ స్తోత్రంలోని 24 నుండి 28 వరకు సంఖ్య గల శ్లోకాలను వివరిస్తున్నారు. వాటిలో ప్రత్యేకంగా 28వ శ్లోక ప్రస్తావనలో ఆ శ్లోకం పఠించడం మూలానా ఎన్నో ఆరోగ్య సమస్యలు, ఉదాహరణకు టీబీ, ఆర్తరైటిస్, లెప్రసి, డిప్రెషన్ మొదలగు దీర్ఘకాల వ్యాధులు నయమవుతాయని, ఇలాంటి అనారోగ్య పరిస్థితులు రూపుమాపడానికి కావలిసిందల్లా నమ్మకంతో వినయ విధేయలతో ప్రతిరోజు సుబ్రమణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించి, తిరుచెందూరు సుబ్రమణ్యస్వామి విభూతిని నుదుటన ధరించాలి అని వివరించారు. 


నా భార్య చాలా రోజుల నుండి మానసిక ఆందోళనతో (mental depression) బాధపడుతున్నారు. గత 8 నెలలుగా ఈ విషమ పరిస్థితి తీవ్రస్థాయికు చేరడంతో వైద్యులు ఆవిడకు అల్జైమర్ వ్యాధి సంక్రమించే అపాయము కూడా కలదన్న సందేహాన్ని కూడా వెలిబుచ్చారు. 


ఇలాంటి మానసిక ఆందోళనలవల్ల తను ఎప్పుడూ ఒంటరిగా ఉండడానికే ప్రయత్నించడం, ఎవ్వరితోనూ అంటే కొడుకు కోడళ్ళతోనూ మనుమలతోను సరిగ్గా మాట్లాడకపోవడం, చివరకు నాతో కూడా ఆచితూచి మాట్లాడడం, ఇంటి పనులు, వంట పనులపై ఎక్కువ ఆసక్తి చూపకపోవడం, సరియైన దుస్తులు ధరించక పోవడం, ఇలా ఎన్నెన్నో సమస్యలు ఎదురయ్యేవి. మానసిక వైద్య నిపుణులు మరియు హోమియో వైద్యుల పర్యవేక్షణలోనే తను జీవనం కొనసాగుతూ ఉండేది. 


మే నెల రెండవ ఆదివారం గురూజీ ఆన్లైన్ తరగతుల్లో నేను పాల్గొని ఆదిశంకరాచార్య విరచిత సుబ్రమణ్య భుజంగ స్తోత్రం గురించిన ప్రసంగాలు విన్న తర్వాత సుమారు సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో సుబ్రమణ్యస్వామిని ప్రతిరోజు సుబ్రమణ్య భుజంగా స్తోత్రాన్ని పఠిస్తానని నా భార్య అనారోగ్య పరిస్థితుల నుండి విముక్తి పొందితే తిరుచెందూరుకు ఇద్దరూ ఏతెంచి మొక్కుబడులు చెల్లిస్తామని వేడుకొన్నాను. నేను వేడుకొన్న విషయాన్ని గురించి ఆవిడతో చర్చించలేదు. 


ఆనాటి సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. అది ఏంటంటే అప్పటిదాకా తను ఎటువంటి విషయాలపై ఆసక్తి చూపేవారు కారు. కాని ఆ సాయంత్రం నుండి తాను అకస్మాత్తుగా ఎంతో చురుకుగా చక్కని దుస్తులు ధరించి ఇంటి దగ్గర్లోనున్న వినాయకుడి దేవాలయానికి వెళ్ళారు, ఇంటికి తిరిగి రాగానే కొడుకు కోడళ్ళు మనుమలు మనుమరాండ్లతో సంభాషించడం ప్రారంభించారు. ఇరుగుపొరుగు వారితో ఎంతో చనువుగా కలుపుగోలుగా మాటలు కలిపారు. ఇంటి పనులు వంట పనుల్లో ఎంతో ఆసక్తి కనబరిచారు. ప్రతిరోజు మందులు తీసుకోవడంతో పొద్దున 7.30 గంటలకు పైబడే లేసే ఆవిడ 5.30 కే లేచి తన పనుల్లో తీవ్రంగా నిమగ్నమయ్యారు. ఇలా ప్రతి రోజూ ఆవిడ ఆరోగ్యం ఎంతో అభివృద్ధి చెందింది. ఆవిడలో ఈ పరిణామాలు చూసిన తర్వాత మొన్న దాకా తను ఒక వ్యాధితో బాధపడే ఆనవాళ్లే లేవు.


ఓ రెండు వారాలు తన ఆరోగ్య పరిస్థితులు మెరుగవడంతో గురూజీ వివరించిన సుబ్రమణ్య భుజంగ స్తోత్రాన్ని అత్యంత నియమ నిష్టలతో ధ్యానించడం వల్ల తనలో ఇలాంటి అభివృద్ధి చేకూరిందని ఆవిడతో చెప్పాను. ఈ స్తోత్రాలపై ఆవిడకూ ఆసక్తి పెరిగి ప్రతిరోజు ఆ శ్లోకాలను పఠించడం మొదలెట్టారు, తిరుచెందూరుకు వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం గురించి ఉవ్విళ్లూరేవారు.


మేము సుబ్రమణ్యస్వామి వారి అనుగ్రహం పొందినట్టే. ఇలాంటి ఓ అనూహ్య అనుభవంతో కొద్ది రోజుల క్రితమే తిరుచెందూరుకు వెళ్ళి స్వామిని దర్శించుకొన్నాము. ఆ కోవెల ప్రాకారంలోనే కూర్చుండి సుబ్రమణ్యస్వామి భుజంగ స్తోత్రాన్ని తనివితీరా పఠించాము.


మానసిక వైద్య నిపుణులు కూడా ఆవిడలోని ఈ మార్పును చూసి ఆశ్చర్యచకితులయ్యారు. వెంటనే తను తీసుకోవలసిన మందులను కూడా చాలా వరకు ఆపేయమన్నారు. తన ఆరోగ్య పరిస్థితులు ఇంతలా మెరుగుపడడం వైద్యులకే అర్థం కాని పరిస్థితి.


అసలు తన మెదడు పూర్తిగా దెబ్బతినే పరిస్థితులనుండి కోలుకొని తన పూర్వ ఆరోగ్యా వైభవాన్ని మరల పొందినందుకు సుబ్రమణ్యస్వామి అనుగ్రహమే కారణం. ఆది శంకరాచార్యుల వారి సుబ్రమణ్యస్వామి భుజంగ స్తోత్రం ఒక్కటే కాకుండా గురువు గారి దిశా నిర్దేశం, ఆశీర్వాదములు కూడా దోహదకారయ్యాయి. నేను గురువు గారికి ఎల్లప్పుడూ ఋణపడి యున్నాను. 


ఈ వృత్తాంతాలన్నీ నా స్నేహితులు ఒకరితో పంచుకొన్నాను. వారు కూడా సుబ్రమణ్య భుజంగ స్తోత్ర పుస్తకాన్ని కొనుక్కొని చదవడం ప్రారంభించడంతో వారికి ఎన్నో రోజులుగా సతాయిస్తున్న కుటుంబ కలహాలు అంతరించి సానుకూల వాతావరణం ఏర్పడడం, వారికి రావలసిన డబ్బులు తిరిగి రావటం లాంటివి జరిగిందట. 


ఈ సందేశాన్ని అందరికి అందుబాటులో ఉంచిన యెడల సుబ్రమణ్య భుజంగ స్తోత్రాన్ని అందరూ పఠించి వారి వారి అనారోగ్య పరిస్థితుల నుండి విముక్తి పొందగలరని ఆశిస్తున్నాను. 


ఈ సందేశం మూలంగా గురువు గారికి సాష్టాంగ ప్రణామాలను అర్పిస్తున్నాను. నమస్కారం గురూజీ.

కామెంట్‌లు లేవు: