30, జూన్ 2025, సోమవారం

మౌనం మహా భాగ్యం*

 *మౌనం మహా భాగ్యం*

```

రోజూ ఒక్క అరగంట లేదా కనీసం పది నిమిషాలు మౌనంగా ఉంటే చాలు. 

చక్కటి శారీరక, మానసిక ఆరోగ్యం 

మీ సొంతమవ్వటమే కాదు... 

మీ ఆశలు, ఆశయాలు, కలలు, కోరికలు అన్నీ నెరవేరతాయి. 


ఇదెలా సాధ్యం అంటే, ప్రయత్నిస్తే తెలుస్తుంది- ఎలా సాధ్యమో. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు ఎంతసేపు మనం మాట్లాడతాం? ఎంత సేపు మౌనంగా ఉంటాం?


మౌనంగా ఉండటమంటే ఇంట్లో పనులు చేస్తూ లేదా ఏ టీవీలోని కార్యక్రమాన్ని చూస్తూనో, కంప్యూటర్ ముందు కూర్చునీ పనిచేయడం కాదు. మౌనమంటే. అచ్చంగా మౌనంగా ఉండటం. 


ఈ పనులన్నీ చేస్తున్నప్పుడు మన నోరు మాట్లాడకపోయినా, మనసులో ఆలోచనలు పరుగులు పెడుతూనే ఉంటాయి. అంటే మన మెదడు పనిచేస్తూనే ఉంటుంది. అవి మనల్ని మన నుంచి వేరుగా ఉంచుతాయి.


అదే కళ్ళు మూసుకుని మాటని, మనసుని మౌనంలోకి జార్చామనుకోండి. కనీసం ఓ పదినిమిషాలు చాలు. కళ్ళు తెరిచాక ఎంతో హాయిగా ఉంటుంది. మౌనం మనకి మనల్ని దగ్గర చేస్తుంది. మనమంటే ఏమిటో మనకు తెలియజేస్తుంది. రోజంతా ఎవరెవరితోనో మాటలు, వాదనలు, కోపాలు అరుపులు అక్కడితో అయిపోతుందా, అవన్నీ మనసులో చేరి ఆలోచనలుగా మారి మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మౌనంగా ఉండటాన్ని ధ్యానం, మెడిటేషన్, ప్రాణాయామం ఏదైనా పిలవండి ఏకాగ్రతగా శ్వాసపై ధ్యాస పెట్టగలిగితే చాలు. ఆ తర్వాత అంతకు ముందు వరకు ఉన్న చికాకు ఇట్టే మాయమవుతుంది. అంతే కాదు మౌనంగా ఉండటం వల్ల మాటలు చక్కగా వస్తాయి.

కామెంట్‌లు లేవు: