15, జూన్ 2025, ఆదివారం

Panchaag


 

ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్‌’🙏

 🙏ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్‌’🙏

భృగువు ఒకసారి తన తండ్రియైున వరుణుని వద్దకు వెళ్లి.. బ్రహ్మమును గురించి తెలుపవలసిందిగా కోరుతాడు. అప్పుడు వరుణుడు పుత్రునితో ‘‘దేనివలన ఈ ప్రాణులు, పదార్థాలన్నీ పుడుతున్నాయో, దేని వలన పుట్టినవి జీవిస్తున్నాయో, దేని యందు లీనమవుతున్నాయో అది బ్రహ్మము’’ అని చెప్పి, ‘దానిని నీవే తెలుసుకో’ అని చెబుతాడు. అప్పుడు భృగువు బ్రహ్మమును తెలుసుకోవడానికి తపస్సు చేస్తాడు. ఆ తపస్సులో ఆయనకు.. అన్నమే బ్రహ్మమని తెలుస్తుంది. ఎందుకంటే ప్రాణుల శరీరాలన్ని అన్నము వలననే పుడుతున్నాయి. పుట్టిన ప్రాణులన్నీ అన్నము చేతనే పోషింపబడుతున్నాయి. చివరకు అన్నము (మట్టి) యందే కలిసి పోతున్నాయి. కాబట్టి అన్నమునే బ్రహ్మముగా తెలుసుకున్నానని తండ్రిని సమీపించి చెబుతాడు. అప్పుడు వరుణుడు ఆయనను ఇంకా తపస్సు చేయమంటాడు. 

మళ్లీ తపస్సు చేసిన భృగువు.. ఈసారి ప్రాణమును బ్రహ్మముగా తెలుసుకుంటాడు. ఎందుకంటే ప్రాణము వలనే ప్రాణుల శరీరాలు పుడుతున్నాయి. ప్రాణము చేతనే పుట్టినవి జీవిస్తున్నాయి. ప్రాణములందే లీనమవుతున్నాయి. కాబట్టి ప్రాణమే బ్రహ్మముగా ఎరిగినానని చెప్పగా.. ‘‘ఇంకా తపస్సు చెయ్యి. బ్రహ్మము నెరుగుటకు తపస్సే సాధనం’’ అని వరుణుడు చెబుతాడు. ఈసారి తపస్సులో.. ‘మనసే బ్రహ్మము’ అని భృగువుకు తెలుస్తుంది. ఎందుకంటే మనసులోనే సంకల్పాలు కలుగుతాయి. ఇంద్రియాలన్నింటికీ మనసే ఆధారం. సంకల్పాల కారణంగానే జీవులకు శరీరాలు లభిస్తాయి. కర్మఫలాలను అనుభవించడానికి శరీరస్థితి ఏర్పడుతుంది. శరీరం నశించినప్పుడు జీవుడు వాయురూపంలో వెళ్లిపోతాడు. కాబట్టి శరీరోత్పత్తి, స్థితి, లయములకు మనసు కూడా కారణమవుతున్నది. కావున అది బ్రహ్మమని తలచి తండ్రికి ఆ విషయమే చెబుతాడు. అప్పుడు తండ్రి.. ఇంకా తపస్సు చేయాల్సిందిగా సూచిస్తాడు. ఈసారి విజ్ఞానం బ్రహ్మమని భృగువు తలుస్తాడు. విజ్ఞానమంటే నిశ్చయాత్మక జ్ఞానం. అదే బుద్ధి. ఆ విషయం చెప్తే.. ఇంకా తపస్సు చేయమంటాడు వరుణుడు. తపస్సులో మరలయత్నించిన భృగువు ఆనందమే బ్రహ్మముగా తెలుసుకుంటాడు. ‘ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్‌’ ఆనంద రూపమగు బ్రహ్మమే కారణమని, బ్రహ్మమే కర్త అని రూఢి చేసుకుంటాడు. 

భృగువును వరుణుడు అన్నిసార్లు తపస్సు చేయాల్సిందిగా ఎందుకు ఆదేశించాడంటే.. అసలైన బ్రహ్మము గురించి ఆయన తెలుసుకోవడానికే. భృగువు మొదట అన్నము బ్రహ్మమని ఎరిగినప్పటికీ.. అన్నానికి కారణం ఉంది. బ్రహ్మమంటే కారణం లేనిది. కాబట్టి మరోసారి తపస్సు చేయాలంటాడు. అదే విధంగా ప్రాణం, మనసు, విజ్ఞానం అన్నింటికీ కారణం ఉన్నది. ఔషధుల నుండి అన్నం, అన్నం నుండి ప్రాణం జనిస్తున్నాయి. మనసు, విజ్ఞానం ఆత్మాశ్రితాలు. కాబట్టి, ఆనంద స్వరూపమైన బ్రహ్మమే ఈ జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయములకు కారణమని, బ్రహ్మమునకు ఇంకొక కారణం లేదు అని చివరకు తెలుసుకుంటాడు. ఆనంద స్వరూపమైన బ్రహ్మము నెరిగినవాడు ఆనందంలో ఉండి దానిననుభవిస్తాడు. ప్రపంచంలో ఆనందంగా ఉన్నవాడు తృప్తిగా ఉంటాడు. మనం పొందే ఆనందం ఏదో కారణంచేత కాబట్టి ఆ దొరికిన దానిని బట్టి అది క్షణికమైనది లేదా కొద్దికాలం ఉండేది అవుతుంది. కాబట్టి కారణం లేకుండా ఆనందంగా ఉండడమే మోక్షం అనబడుతుంది. 

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

Arunachala

 అరుణాచలం వెళ్లి రూమ్ కోసం ఇబ్బంది పడకుండా ముందుగానే బుక్ చేసుకోండి.


Tamilnadu Tourism Alayam తమిళనాడు టూరిజం వారి ఆలయం రూమ్స్ : 7358100396, 041752999118


Arunachala Residency : 9487333851, 9384124751


ఆంధ్ర ఆశ్రమం : 8297672348


అరుణాచలం శివ సన్నిధి Shiva Sannidhi: 04175-250980


ఆర్యవైశ్య నిత్య అన్నదానం ట్రస్ట్ Aryavaisya Trust: 9493482811


మాచర్ల వారి ఆంధ్రామెస్ : 9150551700


మీకు రమణాశ్రమం లో రూమ్స్ కావాలంటే వెళ్ళగానే ఇవ్వరు ఒక నెల రోజుల ముందుగా వారికి మెయిల్ చెయ్యాలి. 

Visitors wishing to stay at Sri Ramanasramam are advised to write to stay@gururamana.org one month in advance to ascertain whether accommodations are available.


సురభి లాడ్జ్ Surabhi Lodge: 9843856509


శ్రీ శేషాద్రి స్వామి ఆశ్రమం Seshadri Swamy Ashramam: 04175-236999, 238599


అర్యవైశ్య వాసవీ నిత్య అన్నదానం ట్రస్ట్ : 9493482811, 9704863635, 9908632020


శ్రీ పూంగ భవన్ లాడ్జి Sri Poonga Bhavan: 9487517499

https://chat.whatsapp.com/CW3KU11WsA46NEQ246bxJc

స్వాతిశ్రీ రెసిడెన్సీ Swathi Sri Residency : 9442614126

శ్రీ చన్ద్రశేఖరేన్ద్ర యతీంద్ర చరితామృతం -2

 శ్రీ చన్ద్రశేఖరేన్ద్ర యతీంద్ర చరితామృతం -2


చంద్రశేఖరుల యొక్క జన్మ చాలా విచిత్రమైన స్థితి.వారి తాతగారి పేరు గణపతిశాస్త్రి గారు. ఆయనకు ముగ్గురు కుమారులు. పెద్దకొడుకు సుబ్రహ్మణ్యశాస్త్రి గారు.ఆయనకు ఐదుగురు కుమారులు.తాతగారైన గణపతిశాస్త్రి గారి పేరుని సుబ్రమణ్యశాస్త్రి గారు తమ పెద్ద కొడుక్కిపెట్టారు.


సుబ్రహ్మణ్యశాస్త్రి గారు మెట్రిక్యులేషన్ వరకు చదువుకొని తమిళనాడు విల్లుపురం స్కూల్స్ ఇన్స్పెక్టరుగా పని చేస్తూ ఉండేవారు.'ఒక్క కుమారుడు కుమారుడు కాదు, ఒక కన్ను కన్ను కాదు' అని స్వామిమలైన ఉన్న స్వామినాథునికి మొక్కుకున్నారు.రెండో కుమారుని ప్రసాదించిన దీక్ష చేత రెండో కుమారునికి 'స్వామినాథశాస్త్రి' అని పేరు పెట్టుకున్నారు.రెండో కుమారుని తర్వాత మరో ముగ్గురు కుమారులు కలిగారు.వారు సాంబమూర్తిశాస్త్రి, సదాశివశాస్త్రి, కృష్ణమూర్తిశాస్త్రి.అయిదుగురు కుమారుల తరువాత పుట్టిన అమ్మాయికి లలితాంబిక అని పేరు పెట్టుకున్నారు. 

ఈ రెండో కుమారులు స్వామినాథశాస్త్రి గారే భవిష్యత్ కాలంలో చంద్రశేఖర సరస్వతీ స్వాములు అయ్యారు.స్వామినాథశాస్త్రి గారు చిన్నప్పటి నుంచి కూడా పంచవన్నెల చిలుకలా అందంగా మాట్లాడేవారు.కన్నడంలో 'గిని 'అంటే పంచవన్నెల చిలుక అని అర్థం. అలా చిలుకలా మాట్లాడేవారు కనుక ఆయనని 'గిని 'అని పిలుచుకునేవారు.ఇంట్లో ఆ పిల్లవాడు ముద్దుల మూట కడుతూ చిలక పలుకులు పలుకుతూ తల్లిదండ్రులతో ఆనందంగా ఉంటుండేవారు.వాళ్ళ నాన్నగారు సుబ్రహ్మణ్యశాస్త్రి గారు ప్రభుత్వోద్యోగంలో ఉన్నారు కనుక తరచూ బదిలీలు జరుగుతూ ఉండేవి.విల్లుపురం,తిండివనం, చిదంబరం, ఫిరంగిపురం మొదలైన అనేక ప్రాంతాలలో తిరుగుతూ ఉండేవారు.

స్వామినాథుని మూడవ సంవత్సరంలో మహోత్కృష్టమైన సంఘటన జరిగింది. దాని నుంచి ఆయన ప్రేరణ పొందే వయసు కాదు కానీ పొందారు.


ఒక రోజు రాత్రి తల్లిదండ్రులతో ఆ పిల్లవాడు నిద్రపోతున్నాడు.వీళ్ళు కాపురం ఉంటున్న ప్రాంతంలో ప్రక్క ఇంటిలో పెద్ద అలజడి వినపడింది ఇంటిలో ఉంటున్న వారు ఇంటికి తాళం వేసి ఊరు వెళ్లి ఉన్నారు.లోపల గిన్నెలు మూట కడుతున్నట్లు, గిన్నెలు అన్నీ క్రిందకు పడిపోతున్నట్టు పెద్ద చప్పుడు వినిపిస్తోంది ఆ ఇంట్లో నుంచి.


'ఇంట్లోకి దొంగలు ప్రవేశించారు, నిర్భయంగా మూటలు కట్టేస్తున్నారు' అని ఒకరే వెళ్లి ఎదుర్కోలేక ఆ సందులో ఉన్నవారంతా ఆయుధం పట్టుకొని, 'దొంగలు పని పూర్తి చేసుకుని వస్తారు, అప్పుడు వారిని పట్టుకుని కొడదామూ అని ద్వారం దగ్గర ఎదురు చూస్తున్నారు.

చప్పుడు ఎక్కువ అవుతోంది కానీ దొంగలు బయటకి రాలేదు.ఏదో విచిత్రమైన పరిస్థితి లోపల ఉంది అనుకుని కొందరు సాహసవంతులు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు.జరిగింది ఏమిటి అంటే, ఆ ఇంట్లో వారు ఊరు వెళ్ళే ముందు బెల్లంపాకంతో ఒక మధుర పదార్ధం తయారు చేసుకొని ఆ బెల్లంపాకం గిన్నె కడగకుండా అలాగే ఉంచి వెళ్ళిపోయారు.ఒక పిల్లి ఆ గిన్నెలో తల దూర్చి పానకం పూర్తిగా నాకేసింది.ఆ పాత్ర మూత సన్నగా ఉండటంతో దాని తల గిన్నెలోంచి ఊడి రాలేదు.అది భయపడి తల అందులో ఉండగా అటు ఇటు పరిగెత్తడం ప్రారంభించింది.అది ఆ శబ్దాలకి కారణం.ఆఖరికి అందరూ కలిసి దానిని పట్టుకుని ఒక స్తంభానికి కట్టేసి ఆ గిన్నెని బలవంతంగా లాగారు, గిన్నె ఊడి వచ్చింది.దీన్ని కొన్ని రోజుల పాటు అందరూ చెప్పుకునేని నవ్వుకుంటూ ఉండేవారు.


ఎనిమిది సంవత్సరముల స్వామినాథుడు మాత్రం రాత్రి పడుకుని ఆలోచించసాగాడు.మానవాళి 'ఆశ' అనే పాత్రలో ఇలాగే ఇరుక్కుని దారీ తెన్నూ తెలియక కొట్టుకుంటున్నారు.ఈనాడు పిల్లికి జరిగింది.నా జీవితానికి పెద్ద తేడా ఏమిటి?ఆనాడు ఆయనకి 'ఆశ' అనే దాని మీద అసహ్యం పుట్టింది.


పెద్ద పెద్ద వాళ్ళు, గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు ఆ కథ చెప్పుకుని నవ్వుకుంటుంటే,పిల్లవాడికి వైరాగ్యం కలగడం ఎంత అపూర్వం.


ఆయనకి డెబ్భై ఏళ్ళు వచ్చిన తరువాత ఒక ఉపన్యాసంలో ఆ కథ గుర్తు తెచ్చుకుని కొంతసేపు ధ్యానమగ్నులు అయిపోయారు.


ఈ కథ చెప్పిన రెండు రోజుల అనంతరం ఒక పిల్లి వచ్చి వారి ఆశ్రమంలో అలాగే ఇబ్బంది పడింది.ఆ సంఘటనతో అందరూ పరమాచార్యులవారితో, "స్వామీ!పిల్లులు ఇలా తలదూర్చడానికి వీలు లేకుండా ఆ పాత్రలకి మర మూతలు తెచ్చి బిగిస్తాము" అని అన్నారు.అంతా విన్నాక పరమాచార్యులవారు, "మర మూతలు పెట్టకండి!పాలు విశాలమైన పాత్రలలో పోసిపెట్టండి.కావలసినంత పాలు త్రాగేసి పిల్లి వెళ్ళిపోతుంది" అన్నారు.

పాలు ఎలా దాచుకుందామని ఆశ్రమవాసులు, పరమాచార్యుని చుట్టూ చేరిన వాళ్ళు ఆలోచిస్తుంటే, స్వామి ఆలోచన ఎలా ఉందో చూడండి.ఆశ్రమంలో చేరినంత మాత్రాన వైరాగ్యసిద్ధి పొందినట్లు కాదు. 

మహాత్ముల యొక్క మాటలు, విశాల భావాలు అంత గొప్పగా ఉంటాయి. ఆశ్రమంలో ఉండేవాడే ఒక వంట మనిషి ఒక రోజు నాలుగు సేర్ల మినప్పప్పు ఇంటికి పట్టుకుని పోదామని తీసుకుని తలక్రింద పెట్టుకొని పడుకున్నాడు.


అందరూ పడుకున్నాకా ఆ వ్యక్తిని పరమాచార్యుల వద్దకి తీసుకుని వచ్చి, "స్వామీ!వీడు మినప్పప్పు పట్టుకుని పోతున్నాడు!" అని చెప్పారు.


స్వామి వారు , "ఆ దోషం అతనిది కాదు, మనది.అతనికి తినడానికి సరిపడా వడలు పెట్టలేదేమో ఇక్కడ.ఈరోజు మినపప్పు నానబెట్టి శుభ్రంగా రుబ్బి,జీలకర్ర, కొత్తిమీర వేసి వడలు తయారు చేయించి ఇతనికి కడుపునిండా తినగలిగినంత పెట్టండి.ముందుకు మన దోషం పోవాలి" అన్నారు.


అందరిముందూ కూర్చోబెట్టి వానికి వడలు తినిపించారు.అందరూ ఒక దృష్టితో చూస్తే వారు ఒక దృష్టితో చూస్తారు.

నాన్న

 నాన్న


సీ.II తనకన్ననున్నతిన్ తనసంతతియు గాంచ త్యాగమ్మునొనరించు యోగియతడు, తనుబడ్డ కష్టముల్ తనబిడ్డ గననీక మంచిగా పోషించు మహితుడతడు, తనకున్న లేకున్న తనసంతుకన్నింటి సమకూర్చ తపియించు సాధువతడు, తనుమించి విద్యలన్దనరారనాత్మజుల్ సాధించ యత్నించు యోధుడతడు, తే.గీ.II ”నాన్న” కన్నుల ముందఱ నడచుదైవ మన్నమాటె కాదరయంగ నున్నమాట యెన్ని జన్మలనెత్తిన నెవరికైన తండ్రిఋణమును దీర్పంగఁ దరము కాదు!!


సురభి శంకరశర్మ, అష్టావధాని.

🙏వేదం వెంకటరాయ శాస్త్రిగారు 🙏

 🙏వేదం వెంకటరాయ శాస్త్రిగారు 🙏

తెలుగు నేల గర్వించదగ్గ మహనీయులలో వేదం వెంకటరాయ శాస్త్రి గారు ప్రముఖులు.

వేదం వెంకటరాయ శాస్త్రి 1853 డిసెంబర్ 21న మద్రాసులో (ఇప్పుడు చెన్నై) వెంకటరమణ శాస్త్రి మరియు లక్ష్మమ్మ దంపతులకు జన్మించారు . ఆయన 1887లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పొందారు మరియు 25 సంవత్సరాలు మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో సంస్కృత పండిట్‌గా పనిచేశారు . 


శాస్త్రి తెలుగు నాటక రంగం మరియు సాహిత్యానికి గణనీయమైన కృషి చేసిన గొప్ప రచయిత మరియు నాటక రచయిత . ఆయన మూల నాటకాలను రచించి, కాళిదాసు మరియు హర్షుని సంస్కృత రచనలను తెలుగులోకి అనువదించారు. 1899లో, ఆయన ఆంధ్ర భాషాభిమాని నాటక సమాజాన్ని స్థాపించారు, ఇది తెలుగు నాటక రంగాన్ని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించిన నాటక సంఘం.


ఆయన రాసిన మూల రచనలలో, ప్రతాపరుద్రీయ నాటకం (1897) మరియు ఉషా పరిణయం (1901) ముఖ్యమైనవి. ప్రతాపరుద్రీయ నాటకం అనే చారిత్రక నాటకం, కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు మరియు చాణక్యుడి చాకచక్యుడి చాకచక్యంతో ప్రేరణ పొందిన అతని మంత్రి యుగంధర పాత్రను పోషించినందుకు ప్రశంసలు అందుకుంది . ఈ నాటకం కవి విద్యానాథుడు; రాజభటుడు చెకుముకి శాస్త్రి; మరియు తెలుగు నాటక రంగంలో హాస్యానికి ప్రసిద్ధి చెందిన గ్రామీణ ద్వయం పెరిగాడు మరియు యెల్లి వంటి చిరస్మరణీయ పాత్రలను కూడా పరిచయం చేసింది.


1916లో సూర్యరాయాంధ్ర నిఘంటువుకు ప్రధాన సంపాదకుడిగా పనిచేసి తెలుగు నిఘంటురచనకు శాస్త్రి తన వంతు కృషి చేశారు , ఇది తెలుగు నిఘంటువుల సంకలనంలో ఒక ముఖ్యమైన మైలురాయి.


ఆయన 1929 జూన్ 18న మద్రాసులో మరణించారు. 


సాహిత్య రచనలు 

నాగనందము (1891)శకుంతలము (1896)

ప్రతాపరుద్రీయ నాటకం (1897)

ఉషా పరిణయం (1901)

విక్రమోర్వశీయం (1901)

నన్నెచోడుని కవిత్వము 

పుష్పబాణ విలాస

విసంధి వివేకము (1912)

బొబ్బిలి యుద్ధం (1916)

మాళవికాగ్నిమిత్రము (1919)

తిక్కన సోమయాజి విజయము (1919)

ఉత్తరరామ చరిత్ర (1920)

ఆంధ్ర సాహిత్య దర్పణము

వ్యామోహము

తానాషా, అక్కన్న మాదన్నలు

పరిశోధన వ్యాసము

మయసభ (దుర్యోధనుడు)

వేదము వేంకటరాయశాస్త్రులవారి జీవితచరిత్ర సంగ్రహము

రసమంజరి (1950)

గౌరవాలు


1920 : ఆంధ్ర మహాసభ ద్వారా మహామహోపాధ్యాయ పురస్కారం .

1922 : ద్వారకా పీఠం శంకరచే సర్వతంత్ర స్వతంత్ర, మహామహోపాధ్యాయ మరియు విద్యాదానవ్రత మహోరాధి సౌకర్యాలు.

1927: ఆంధ్ర విశ్వకళా పరిషత్ ద్వారా కళాప్రపూర్ణ . ఆ గౌరవాన్ని పొందిన మొదటి వ్యక్తి ఆయన


ఉషా పరిణయం నాటకం 


రాక్షసుల రాజు బాణాసురుడు శివుని ఆశీస్సులు కోరుతూ తీవ్రమైన తపస్సు చేస్తాడు. శివుడు బాణాసురుడికి ప్రత్యక్షమై తన కోరికను వెల్లడించమని అడుగుతాడు. బాణాసురుడు శివుడిని, పార్వతిని మరియు వారి కుటుంబాన్ని తన నగర సోనాపురి ప్రవేశ ద్వారం వద్ద కాపలాగా ఉంచమని అడుగుతాడు. శివుడు తన కుటుంబమంతా ప్రమధగణాలతో సహా నగరాన్ని కాపాడటానికి సోనాపురికి వెళ్తాడు. ఇది అహంకారి బాణాసురుడికి అతి విశ్వాసం కలిగిస్తుంది మరియు అతను దేవతలతో యుద్ధం చేస్తాడు. దేవతలు శివుని రక్షణలో ఉన్న శక్తివంతమైన బాణాసురుడికి సరిపోలరు మరియు తరువాతి యుద్ధంలో ఓడిపోతారు. అతను దేవతలను ఓడించిన శక్తి అయిన శివుడిని మరింత సవాలు చేస్తాడు. బాణాసురుడి అహంకారానికి కోపంగా ఉన్న శివుడు, అతని రథం యొక్క జెండా కారణం లేకుండా పడిపోయినప్పుడు, శ్రీ కృష్ణుడు అతనితో పోరాడి అతని గర్వాన్ని అణచివేస్తాడని శపిస్తాడు.


బాణాసురుడి అందమైన కుమార్తె ఉష, తన తండ్రి కోట ప్రవేశద్వారం వద్ద ఉన్న శివుడు మరియు పార్వతిని ప్రార్థిస్తుంది మరియు పార్వతి నుండి నృత్య కళను నేర్చుకుంటుంది. ఒక రోజు, ఉష నిద్రపోతుంది మరియు ఆమె కలలలో ఒక అందమైన యువకుడితో సన్నిహిత మరియు శృంగార ప్రేమ ఆటను అనుభవిస్తుంది. అది కలనా లేక వాస్తవమా అని ఆమె గ్రహించలేకపోతుంది. ఆమె దీనితో భయపడి, గందరగోళానికి గురవుతుంది. ఆమె తన కలల యువకుడితో తన అనుభవాన్ని గుర్తుచేసుకుంటుంది మరియు తరువాత వచ్చే శృంగార బాధను భరించలేక మూర్ఛపోతుంది.


ఉష సహచరులు సహాయం కోసం ఆమె ప్రియమైన స్నేహితురాలు చిత్రలేఖను పిలుస్తారు. ఉషతో సంభాషణ ద్వారా చిత్రలేఖ పరిస్థితిని అర్థం చేసుకుని, తన కలల నుండి ఆ యువకుడి చిత్రాన్ని గీయమని ఉషను ఒప్పిస్తుంది. చిత్రలేఖ ఆ చిత్రాన్ని చూసి వెంటనే అతన్ని శ్రీకృష్ణుని మనవడు అనిరుద్ధుడిగా గుర్తిస్తుంది.


చిత్రలేఖ నిద్రపోతున్న అనిరుద్ధుడిని ఉష గదికి తీసుకువస్తుంది. ఉష అతన్ని చూసి చాలా సంతోషిస్తుంది. అనిరుద్ధుడు మేల్కొని అందమైన ఉషతో ఒక వింత ప్రదేశంలో తనను కనుగొన్నప్పుడు. ఉష తన ప్రేమను వ్యక్తపరుస్తుంది మరియు చిత్రలేఖ తనను తన గదికి తీసుకువచ్చిందని చెబుతుంది. అనిరుద్ధ మొదట్లో కోపంగా ఉంటాడు, కానీ చివరికి ఆమె తన ప్రేమను అర్థం చేసుకుని ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు.


ఉషా పరిణయం కథ అనిరుద్ధుడు మరియు ఉష మధ్య వివాహంతో ముగుస్తుంది.

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

కాటుక కంటినీరు*

 *కాటుక కంటినీరు*


ఆంధ్రమహాభాగవతాన్ని రాజుకి అంకితం యిమ్మని, బమ్మెర పోతనను అనేక రకాలుగా వత్తిడి చేస్తున్నారు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువా. పోతరాజు (అంటే మన బమ్మెర పోతన గారే నండి) నలిగిపోతున్నారు. అయినా శ్రీరామునికి తప్ప నరుల కెవ్వరికి అంకితమివ్వను అని అంటున్నారు. గంటం పట్టింది సంపాదించటానికి కాదు, నా నాగలి పెట్టేది మాకు చాలు అంటున్నారు. 


అట్టి పరిస్థితులలో ఒకమారు దేవతా పీఠం వద్ద కలత మనసుతో వచ్చి వారు కూర్చున్నారు. సాక్షాత్తు తల్లి వాణి కన్నీరు కారుస్తూ ప్రత్యక్షమైంది.


చూసి తట్టుకోలేని బాధలో చెమర్చిన కన్నులతో పోతన గారి నోటివెంట ఈ పద్యం అలవోకగా జాలువారిందిట. ఆమె తృప్తిగా వెళ్ళింది. ఎలా అయితేనేమి ఈ పరమాద్భుతమైన చాటువు తెలుగువారికి దక్కింది.


*కాటుక కంటి నీరు చనుకట్టు పయింబడ నేల యేడ్చెదో కైటభదైత్యమర్దనుని గాదిలి కోడల! యో మదంబ! యో హాటకగర్భురాణి! నిను నాకటికిం గొనిపోయి యల్ల కర్ణాట కిరాట కీచకులు కమ్మ త్రిశుద్ధిగ నమ్ము భారతీ!*


నీవు కంటికి పెట్టుకున్న కాటుక, కన్నీటికి కరిగి రవికపై పడేలా ఎందుకు ఏడుస్తావు, తల్లీ? ఆ మహా విష్ణువునకు ఇష్టమైన కోడలా! ఓ మా తల్లీ, బ్రహ్మదేవునికి సాక్షాత్తు ఇల్లాలా! నిన్ను తీసుకుపోయి అంగట్లో పెట్టినట్లు, ఆ కర్ణాట కిరాట కీచకులకు అమ్మివేయను. త్రికరణశుద్ధిగా ఒట్టు వేస్తున్నాను. నన్ను నమ్ము సరస్వతీదేవి!


శ్రీరామునికి తప్పించి నర మహారాజులకు అంకితమివ్వనని భీష్మించి కూర్చున్న వైనానికి తార్కాణమే ఈ పద్యం.  


ఈ పద్య సంధర్భంపై మరో కథనం కూడా ప్రచారంలో ఉందండి. ఆ వృత్తాంతము ఇదిగో.


ఆనాటి పోతన కాలమానం ప్రకారం మాలిక్ కాఫిర్ ఓరుగల్లుపై దండెత్తి సామ్రాజ్యాన్ని జయించిన తరువాత ఓరుగల్లు రాజు సింగభూపాలుడు అడవులలోకి వెళ్ళి అఙ్ఞాతంగా ఉండి సైన్యాన్ని తయారు చేసుకుంటాడు.    


గర్భవతియైన సింగ భూపాలుని కోడలుని అడవులలోకి తీసుకొని వెళ్ళక పోతన ఇంట్లో మారు వేషంలో ఒక పనిమనిషిలాగా ఉంచేస్తారు. ఆవిడ పేరు సత్యవాణి. ఆవిడ గురించి మాలిక్ కాఫూర్ భటులు వెదుకుతూ ఉంటారు. 


పోతన ఇంటికి విచారించడాని వచ్చి వారికి చాలా ధనాన్ని ఆశ చూపిస్తారు. పోతన లొంగలేదు. నాకు తెలియదు అని చెప్పి పంపించేస్తారు. 


రాజ భటులు వెళ్ళిన తరువాత కంటికి మింటికి ఏక ధారగా నిశ్శబ్ధంగా రోదిస్తున్న ఆవిడతో పోతన ఆశువుగా చెప్పిన పద్యం ఇదని మరో వృత్తాంతం చరిత్రపుటలలో ఉన్నాయి.


ఆ పద్యాన్ని సింగభూపాలుని కోడలుకు అన్వయిస్తే  


ఎందుకు అంతలా ఏడుస్తావు సింగ భూపాలుని కోడలా (విష్ణుమూర్తిని రాజుగా భావించాడు, అదేకాకుండా ఎంతోమంది మహామ్మదీయ రాజులని మట్టు బెట్టి, మాలిక్ కాఫిర్ ని కూడా ఒక సారి ఓడించాడు సింగ భూపాలుడు), మాలిక్ కాఫిర్ మారు వేషంలో తిరిగి వచ్చి కోట రహస్యాలు తెలుసుకొని, కొంతమందికి ధనం ఆశచూపి రహస్యంగా కోట తలుపులు తెరిపించుకొని అర్ధరాత్రి దాడి చేసి జయించాడు, మా అందరికీ నీవే అమ్మవు, బంగారం లాంటి సంతానాన్ని, మాకు కాబోయే రాజుని గర్భంలో ఉంచుకున్నావు, ఆకలి కోసం, తుచ్ఛమైన ధనం కోసం, నిన్ను యీ కర్ణాటకనుంచి వచ్చిన కిరాతకులు, కీచకులు అయిన మహమ్మదీయులుకు అమ్మను, త్రికరణ శుధ్ధిగ, మనసా వాచా, కర్మణా నన్ను నమ్ము భారతీ


అన్న అర్థం కూడా స్ఫురించగలదు.


అంటే పోతన కాలమానానికి అనుగుణమైన కథనం. సమంజసమే కావొచ్చు.

నిస్వార్థ జీవి నాన్న!!

 *June 15th Happy Fathers day*

--------------------------------------------------


ఎద రహదారి పై జీవన గమనం!

నాన్న ఇచ్చిన చిటికెన వ్రేలుతో

నా ప్రయాణం ప్రారంభం!!


అప్పుడు తెలియదు.... 

ఆ చిటికెన వ్రేలు నన్ను 

ఆకాశపుటంచుల దాకా తీసుకెళ్తుందని!

అప్పుడు తెలియదు...

అది చిటికెన వ్రేలు మాత్రమే కాదని,

బ్రతుకు పోరాటంలో అహర్నిశలు 

నన్ను కాపాడే అస్త్రమని!!


ఆశలు, ఆశయాలు

సుఖాలు, సంతోషాలు

విందులు, వినోదాలు....

చివరకు తన జీవితాన్ని‌ కూడా

బిడ్డలకు అర్పణ చేసే 

ఏకైక నిస్వార్థ జీవి నాన్న!!


నాన్నంటే గమనం, నాన్నంటే గమ్యం!

నాన్నంటే ఆశ, నాన్నంటే శ్వాస!

నాన్న ఉంటే గెలుపు,

నాన్న వెంటే జీవితపు మలుపు!


కష్టాలు తనవి, సుఖాలు బిడ్డలవి!

కన్నీటిని‌ తాగుతాడు,

కలిమిని‌ పంచుతాడు!

వెన్నంటే ఉంటాడు,

వెన్నుదన్నుగా నిలుస్తాడు!!


నిద్ర లేని‌ రాత్రులు నాన్నవి,

విందు వినోదాలు బిడ్డలవి!

కన్న వారి‌ కళ్ళల్లో సంతోషంతో

తన కడుపు నింపుకునే పిచ్చి న్నాన్న,

ప్రేమకు‌ ప్రతి రూపం నాన్న!

దేవుని రూపంలో నాన్న!!

-----------------------------------------------------

*A. Dattatreya, Zphs Veljerla*

పితృదినోత్సవం

 పితృదినోత్సవం సందర్భంగా


................. నాన్నే నా సైన్యం ..........


నాన్న నీరు పోస్తే అమ్మ ఆయుష్షు పోసి జన్మనిచ్చింది

నాచేయిపట్టి నడిపించిందీ ప్రపంచాన్ని చూపించిందీ

ఆకాశమంతా ఔదార్యంతో తనగుండెను ఆటస్థలిగా 

తనబాహువులను ఎవరెస్ట్ శిఖరంగా మార్చిందీ నాన్నే

నాన్నే నాఆయుధం-నాసైన్యం-నాధైర్యం-నాప్రాణం


కొండంత చదువుల భారాన్ని తనభుజాలపై మోసిందీ

పాదాలు కందకుండా హృదయాన్ని పాన్పు చేసిందీ

గంపెడు సంసారాన్ని మోస్తూ దుఃఖాగ్ని జ్వాలల్ని దిగమింగి బాధల్ని భరిస్తూ బాధ్యతగా నిలుస్తూ

ఓర్పుకు ఓదార్పుకు నాలోమార్పుకు మార్గదర్శి నాన్నే


నాతో పరుగుపెట్టి నాలో వెలుగు నింపింది నాన్నే

నాలో చెడును తుంచి మంచిని పెంచిందీ నాన్నే

నే ఏడిస్తేఏడ్చి నవ్వితేనవ్వి వెన్నుతట్టి ప్రోత్సాహించి

తన అనుభవాలను జీవిత పాఠాలుగా నేర్పిందీ నాన్నే

నాఊసులన్నీ నాన్నే ఆయన ఆశలన్నీ నేనే


నాన్న చేతి స్పర్శ నాకు భరోసానిచ్చే దివ్యౌషధం

నిస్వార్థ స్నేహితుడైన నాన్నే నాభవితకు పునాది

నాన్నకోపం పాలపొంగు తనగుండెల్లో ప్రేముప్పొంగు

నాఉన్నతికి భద్రతకి ప్రగతికి సోపానం వేసింది నాన్నే

జీవనగమ్యం తెలిపిన ఘనుడు త్యాగదనుడు నాన్నే

____________________________________________డా.డా.నూనె అంకమ్మరావు, ఆంధ్రోపన్యాసకులు

చరవాణి:9397907776

కళామిత్రమండలి తెలుగులోగిలి, జాతీయాధ్యక్షులు

ప్రకాశం జిల్లా రచయితల సమాఖ్య, అధ్యక్షులు

శివప్రసాద్ కాలనీ కొత్త డొంక

బుల్లెట్ షో రూం ముందు వీధి, ఒంగోలు

ప్రకాశం జిల్లా-523002

పంచాంగం

 ఈ రోజు పంచాంగం 15.06.2025 Sunday,


స్వస్తి శ్రీ చాన్ద్రమాన విశ్వావసు నామసంవత్సర: ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాస కృష్ణ పక్ష చతుర్థి తిథి భాను వాసర శ్రవణం నక్షత్రం ఇంద్ర యోగః బాలవ తదుపరి కౌలవ కరణం


రాహుకాలం : సాయంత్రం 04:30 నుండి 06:00 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు. 




నమస్కారః , శుభోదయం

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత:  ఏడవ అధ్యాయం

విజ్ఞానయోగం: శ్రీ భగవానువాచ


తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే 

ప్రియో హి జ్ఞానినో௨త్యర్థమహం స చ మమ ప్రియః (17)


ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతమ్ 

ఆస్థితః స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిమ్ (18)


ఈ నలుగురిలో నిత్యమూ భగవంతుణ్ణి భక్తితో భజించే ఆత్మజ్ఞాని అత్యుత్తముడు. అలాంటి జ్ఞానికి నేనూ, నాకు అతనూ ఎంతో ప్రియులం కావడమే దీనికి కారణం.

వీళ్ళంతా గొప్పవాళ్ళే అయినప్పటికీ జ్ఞాని మాత్రం నా ఆత్మస్వరూపుడే అని నా అభిప్రాయం. ఎందువల్లనంటే అతను నన్నే పరమగతిగా భావించి సేవిస్తాడు.

⚜ శ్రీ వేల్నేశ్వర్ ఆలయం

 🕉 మన గుడి : నెం 1143


⚜ మహారాష్ట్ర : గుహాగర్ - రత్నగిరి 


⚜ శ్రీ వేల్నేశ్వర్ ఆలయం



💠 వెల్నేశ్వర్ ఆలయం శివుడు మరియు అతని భార్య పార్వతి దేవికి అంకితం చేయబడిన పురాతన ఆలయాలలో ఒకటిగా నమ్ముతారు.


💠 ఆలయం యొక్క మూలం పురాతన కాలం నుండి ఉన్నందున, ప్రస్తుత నిర్మాణం సుమారు 400 సంవత్సరాల క్రితం నిర్మించబడిందని నమ్ముతారు.



💠 'వేలెనేశ్వర్' అనే పేరుకు ఒక ఆసక్తికరమైన మూలం ఉంది. 

ఈ ఈశ్వరుడు తన భక్తులు వ్యక్తపరిచే కోరికను శాశ్వతంగా నెరవేరుస్తాడు. కాబట్టి తన భక్తుని సమయాన్ని వృధా చేయని దేవుడిని వేల్-నీశ్వర్ అని పిలుస్తారు [ఎటువంటి సమయాన్ని వృధా చేయని (మరాఠీలో 'వేల్')].



💠 పురాతన హిందూ నిర్మాణ శైలికి ఉదాహరణగా, ఈ ఆలయంలో విష్ణువు, గణేశుడు మరియు కాళ భైరవుడికి అంకితం చేయబడిన అనేక చిన్న ఆలయాలు ఉన్నాయి. 

ఆలయం యొక్క ప్రధాన గర్భగుడి పురాణాల యొక్క వివిధ ఘట్టాలను సూచించే చిత్రాలు మరియు రాతి శిల్పాలతో అలంకరించబడి ఉంటుంది.


💠 ఈ ఆలయం మహాశివరాత్రి పండుగ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులతో నిండి ఉంటుంది. 

ఇది మార్చి నెలలో జరుగుతుంది మరియు శివుని గౌరవార్థం జరుపుకుంటారు.


💠 వెల్నేశ్వర్ యొక్క మరొక ప్రధాన ఆకర్షణ వెల్నేశ్వర్ బీచ్, ఇది కొబ్బరి చెట్లతో కప్పబడి ఉంటుంది.  

ఇది మొత్తం కొంకణ్ ప్రాంతంలో అత్యంత ఏకాంతమైన మరియు స్వచ్ఛమైన బీచ్‌లలో ఒకటి మరియు గుహగర్ మరియు గణపతిపులే వంటి ప్రసిద్ధ గమ్యస్థానాలు దీనికి ఇరువైపులా ఉన్నాయి. 

ఈ బీచ్ దాని స్థానానికి మరియు ప్రశాంతమైన పరిసరాలకు కూడా ప్రసిద్ధి చెందింది. ఈ బీచ్ ఏడాది పొడవునా స్థిరమైన అలలను అనుభవిస్తుంది మరియు ఈత కొట్టడానికి మరియు సూర్య స్నానానికి అనువైన బీచ్. ఇక్కడ తరచుగా జరిగే కార్యకలాపాలు జల క్రీడలు.



💠 గుహగర్ నుండి 17 కి.మీ మరియు గణపతిపులే నుండి 72 కి.మీ దూరం.



రచన

©️ Santosh Kumar

18-16-గీతా మకరందము

 18-16-గీతా మకరందము.

        మోక్షసన్న్యాసయోగము

    

      -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - సాక్షియగు ఆత్మను కర్తయని తలంచువాడు అవివేకియని తెలుపుచున్నారు–


తత్త్రెవం సతి కర్తారం 

ఆత్మానం కేవలం తు యః పశ్యత్యకృతబుద్ధిత్వాత్

న స పశ్యతి దుర్మతిః


తాత్పర్యము:- కర్మవిషయమందు ఇట్లుండగా (పైన తెలిపిన అయిదున్ను కారణములై యుండగా) ఎవడు సంస్కరింపబడని బుద్ధిగలవాడగుటచే, నిరుపాధికుడగు ఆత్మను కర్తగా తలంచుచున్నాడో, అట్టి అవివేకి కర్మముయొక్కగాని, ఆత్మయొక్కగాని వాస్తవస్వరూపమును ఎఱుంగకున్నాడు.


వ్యాఖ్య: - కర్మయందు ఆత్మ కర్తకాదు, పైనదెల్పిన అయిదుమాత్రమే కర్తలు. ఆత్మసాక్షి, కేవలుడు, నిరుపాధికుడు, సంగరహితుడు. కర్తృత్వమును ఆత్మయందారోపించువాడు వివేకహీనుడేయగును. ఆతడు పరమార్థతత్త్వమును తెలియనివాడు; శ్రవణాది సంస్కారములేని బుద్ధిగలవాడు - దుర్మతి. 


అసంగమగు ఆత్మను కర్తగ జూచువాడు నేత్రములున్నను గ్రుడ్డివాడేయగును. ఏలయనిన అతడు సత్యమును గాంచుటలేదు. ఆత్మకు కర్తృత్వమును ఆరోపించుట అజ్ఞానమేయగును. కావుననే అట్టివారు గ్రుడ్డివారే యని చెప్పబడినది. దీనికి కారణము వారిబుద్ధికి సరియైన సంస్కారము లేకుండుటయే (అకృతబుద్ధిత్వాత్). ఎంత పాండిత్యము, ఎన్ని లౌకికవిద్యలు గలిగియున్నప్పటికిని సత్యదృష్టిలేనిచో, ఆత్మజ్ఞానములేనిచో అట్టివారు అంధప్రాయులే యగుదురు. ఏలయనిన వారు జ్ఞాననేత్రవిహీనులై యున్నారు. వారెంత గొప్పవారైనప్పటికిని చీకటిలోనున్నవారి చందముననే యుండుచు వాస్తవమును గ్రహించజాలకయుందురు.

కాబట్టి ఎంతటి ప్రాపంచిక వివేకమున్నను ఆత్మజ్ఞానము లేనివారు దుర్మతులు, అంధులే కనుక, ప్రపంచదృష్టిలో కీర్తిప్రతిష్టలు సంపాదించుకొనినప్పటికిని పరమార్థదృష్టిలో వారు గణనీయులుకారు. కనుక, జనులు ఆత్మతత్త్వమెరింగి మానవులకేకాక, భగవంతునకుగూడ ప్రీతిపాత్రులు కావలయును.


దోషము - అసంగమగు ఆత్మను కర్తగ భావించుట. 

దోషకారణము - బుద్ధి శ్రవణాదులచే సంస్కరింపబడకుండుట.

దోషఫలితము - అజ్ఞానరూప అంధత్వము (సత్యమును జూడజాలకుండుట).


ప్రశ్న:- ఆత్మ ఎట్టిది?

ఉత్తరము: - కేవలమై, సాక్షియై, అసంగమైయున్నది.

ప్రశ్న:- అట్టి నిష్క్రియ అసంగఆత్మను కర్తయని మనుజు డేల చెప్పుచున్నాడు?

ఉత్తరము: - అజ్ఞానమువలన, బుద్ధికి ఇంకను శ్రవణాది సంస్కారము లేనందువలన.

ప్రశ్న:- కాబట్టి ఆతని స్థితి ఎట్లున్నది?

ఉత్తరము: - గ్రుడ్డివానివలె నున్నది. సత్యము నతడు కాంచుటలేదు.

తిరుమల సర్వస్వం -271*

 *తిరుమల సర్వస్వం -271*


 *సుప్రభాత గానం 1* 


 దక్షిణభారతదేశం లోని లక్షలాది గృహాలలో, మరీ ముఖ్యంగా విశ్వవ్యాప్తంగా విస్తరించి ఉన్న తెలుగు వారిళ్ళలో దినచర్య నేటికీ సుప్రభాతగాన శ్రవణం తోనే ప్రారంభమవుతుంది. గృహాల లోనే కాకుండా తిరుమలతో సహా ప్రపంచం నలుమూలలా ఉన్న శ్రీవేంకటేశ్వరుని దేవాలయాల లోను, ఎన్నో హిందూ ధార్మిక సంస్థల్లోను, ప్రసార మాధ్యమాలలో కూడా ఉదయపు వేళల్లో సుప్రభాతగానం చేయబడుతుంది. కోట్లాదిమంది తెలుగువారు కంఠస్థంగా చెప్పగలిగిన ఆధ్యాత్మిక గీతమేదైనా ఉందంటే అది ముమ్మాటికీ *'సుప్రభాతం'* మాత్రమే. అంతటి ప్రఖ్యాతి గాంచిన సుప్రభాత గానాన్ని శ్రవణానందకరంగా విని, ఆనందించి, భక్తిపారవశ్యంలో మునిగిపోవడమే గానీ ఆ గీత రచయిత ఎవరు? అది ఏ సందర్భంలో, ఎలా రచింపబడింది? దానిలోని భావర్థమేమిటి? అన్న విషయాలు అతికొద్ది మందికి మాత్రమే తెలుసు. ఈనాటి ప్రకరణంలో ఆ విషయాలను ముచ్చటించుకుందాం.


 *సుప్రభాతగానం ఆవిర్భావం* 


 అర్థసహస్రాబ్దానికి పైగా కోట్లాది భక్తజనులను తన ఆధ్యాత్మిక శోభతో, భావలాలిత్యంతో, వీనులవిందైన ఛందోబద్ధ శ్లోకాలతో పులకింపజేస్తున్న *'సుప్రభాతగానం'* ప్రణాళికాబద్ధంగా, ఎంతోకాలం వెచ్చించి వ్రాసినది కాదు. భక్త్యావేశాన్ని తనువెల్లా రంగరించుకున్న ఒక భక్తాగ్రేసరుని గుండె లోతుల్లోంచి అసంకల్పితంగా, ఆశువుగా పొరలి వచ్చిన గానామృతమే *'సుప్రభాతం'.*



 *మనవాళ మహాముని* 


 దాదాపు ఆరు శతాబ్దాలక్రితం మనవాళ మహాముని అనే శ్రీవారి మహాభక్తుడుండేవారు. విశిష్టాద్వైత సాంప్రదాయాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చిన మహామహులలో వీరు కూడా ఒకరు. శ్రీవారి భక్తితత్వ వ్యాప్తికి, హైందవమత సాంప్రదాయం వ్రేళ్ళూను కోవడానికి ఆ మహనీయుడు సలిపిన విశేషకృషికి గుర్తుగా తిరుపతి పట్టణం నడిబొడ్డున ఉన్న గోవిందరాజస్వామి ఆలయ ప్రాంగణంలో వారికో ఉపాలయాన్ని నిర్మించి, అందులో నేటికీ నిత్యపూజలు నిర్వహించబడుతున్నాయి.


 ఆ ఋషిసత్తముడు, తన ఎనిమిది మంది ప్రముఖ శిష్యులలో ఒకరైన 'హస్తగిరినాథన్' వారితో ఒకసారి తిరుమలకు విచ్చేశారు.


 *హస్తగిరినాథన్* 


 హస్తగిరినాథన్ వారు ప్రఖ్యాత వైష్ణవమత ప్రచారకులు 'ముడుంబైనంబి' వారసులైన అనంతాచారి, ఆండాళ్ పుణ్యదంపతులకు; పధ్నాలుగవ శతాబ్దపు ద్వితీయార్థభాగంలో, కాంచీపురంలో జన్మించారు. ఆధ్యాత్మిక గ్రంథాలెన్నింటినో అలవోకగా పఠించిన హస్తగిరినాథన్ తన అసమానమైన కవితాకౌశలంతో, పాండితీప్రకర్షతో; ఆధ్యాత్మిక చర్చల్లో ప్రతివాదులకు పెనుసవాలుగా నిలిచారు. ఎందరో ఉద్దండ పండితులను తన వాక్ఫటిమతో ఓడించిన 'నరశింహ మిశ్రుడు' అనే అద్వైత పండితోత్తముడిని పరాజయం పాలు గావించి, వారిని తన శిష్యునిగా చేసుకొనడం వల్ల హస్తగిరినాథన్ *'ప్రతివాద భయంకర అణ్ణన్'* గా ప్రఖ్యాతి గాంచారు. వారి వంశీయులు ఇప్పటికీ సంగీతసాధనలో తరించుతున్నట్లు కొందరి కథనం. తెలుగు చలనచిత్రసీమను ఒకానొక సమయంలో తన గానమాధుర్యంతో ఉర్రూతలూగించిన, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన *ప్రతివాద భయంకర శ్రీనివాస్ (పి. బి. శ్రీ నివాస్)* కూడా అదే వంశనామంతో ప్రఖ్యాతి గాంచడం కేవలం కాకతాళీయం కాకపోవచ్చు.


 *ఆమోదముద్ర!* 


 ఆనాడు, శ్రీవేంకటేశ్వరునికి ప్రత్యేకంగా సుప్రభాతం లేదు. ప్రాతఃకాల సమయాలలో ప్రబంధపఠనం మాత్రమే జరుగుతుండేది. ఒకనాటి ప్రాతఃసంధ్యలో గురుశిష్యులిద్దరూ (మణవాళ మహాముని, హస్తగిరినాథన్) స్వామివారి దివ్యమూర్తిని అలౌకిక ఆనందంతో కాంచుతున్నప్పుడు; గురువుగారు భగవత్సంకల్ప ప్రేరితుడై శ్రీనివాసుణ్ణి మేల్కొలుపుతూ ఒక ప్రత్యేక ప్రార్థనాగీతాన్ని ఆలపించ వలసిందిగా తన శిష్యుణ్ణి ఆదేశించారు. వెనువెంటనే ద్వాదశాళ్వారులలో ఒకరైన తొండరడిప్పొడి ఆళ్వార్ శ్రీరంగనాథునిపై రచించిన, అప్పటికే విస్తృతంగా ప్రచారంలో ఉన్న సుప్రభాతం శిష్యుని మదిలో మెదిలగా, దానిలోని భావార్థాన్ని వారు స్మరణకు తెచ్చుకున్నారు. గురువు గారి ఆజ్ఞను మహాప్రసాదంగా, అందివచ్చిన అవకాశంగా భావించిన అణ్ణన్ స్వామి, *శ్రీరంగశాయి సుప్రభాత స్ఫూర్తితో 29 శ్లోకాలతో కూడిన శ్రీ వేంకటేశ సుప్రభాతాన్ని, 11 శ్లోకాలున్న శ్రీ వేంకటేశ స్తోత్రాన్ని, 16 శ్లోకాలు గల శ్రీ వేంకటేశ ప్రపత్తిని, 14 శ్లోకాలు గలిగిన శ్రీ వేంకటేశ మంగళాశాసనాన్ని ఇలా మొత్తం నాలుగు భాగాలను ఆశువుగా పఠించాడు.* అప్పటివరకు తమిళభాషలో ప్రబంధపారాయణం జరిగే తిరుమల ఆలయంలో అణ్ణన్ స్వామి సంస్కృతభాషలో రచించిన మేలుకొలుపు గీతాన్ని నిత్యం పఠించే *'శ్రీ వేంకటేశ సుప్రభాతం'* గా అంగీకరించే విషయంలో చర్చోపచర్చలు జరిగాయి. కానీ భావసౌందర్యం లోను, రాగయుక్తంగా పాడబడడం లోను, ఛందోబద్ధత లోను ఏ విధమైన లోటుపాట్లు కానరాకపోవడంతో; ఎట్టకేలకు 1430 వ సంవత్సరం, శ్రీవీరప్రతాపరాయల వారి పరిపాలనాకాలంలో అణ్ణన్ స్వామి రచించిన గీతం, 'శ్రీ వేంకటేశ సుప్రభాతం' గా ముక్తకంఠంతో ఆమోదించబడింది. అంటే, నేటికి దాదాపు 590 సంవత్సరాల నుండి సుప్రభాతగానం అవిచ్ఛిన్నంగా కొనసాగుతోందన్న మాట.

తన అమోఘమైన ఆధ్యాత్మిక, సాహిత్య, కవితా, గాన పటిమతో అశేషంగా ఉన్న శ్రీవారి భక్తుల గుండెల్లో అజరామరమైన స్థానాన్ని సంపాదించుకున్న అణ్ణన్ స్వామి ధన్యజీవి.

*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*శల్య పర్వము ప్రథమాశ్వాసము*

*408 వ రోజు*


*సుయోధనుడు సంధిని నిరాకరించుట*


కృపాచార్యుని సంధి ప్రస్థావన సుయోధనుడు మర్యాదగానే నిరాకరించాడు. " ఆ చార్యా ! మీరు నా మంచి కోరి నేను చెడిపోవడం చూడ లేక నాలుగు మంచి మాటలు చెప్పారు. ఆ మాటలు నేను అంగీకరించలేను. ఎందుకంటే మాయా జూదం ఆడించి పాండవుల రాజ్యం అపహరించి వారిని అరణ్యములకు పంపాను. నిండు సభలో పాండవ పత్నిని జుట్టు పట్టి ఈడ్పించి ఘోరంగా అవమానించాను. సంధి చేయ వచ్చిన కృష్ణుడిని పట్టి బంధించాలనుకున్నాను. భీష్మ, ద్రోణ, కర్ణుల చావును కళ్ళారా చూసాను. పసి వాడైన అభిమన్యుడిని అధర్మంగా ఒంటరిని చేసి చుట్టుముట్టి కిరాతకంగా వధించాను. దుశ్శాసనుడిని చంపి రుధిరం తాగి భీముడు చంపడం చూసాను. ఇన్ని చేసిన నేను ఈ నాడు సంధి చేసుకుంటే నా తొడలు విరిచి భీముడు రెండవ శపథం నెరవేర్చుకుంటాడని భయపడి సంధి చేసుకున్నానని లోకులు నవ్వి పోరా ! నిందించరా ! ఏమైనా జరగని ఒకరి దయా దాక్షిణ్యాలతో వచ్చే రాజ్యానికంటే యుద్ధం చేసి మరణించి వీర స్వర్గం పొందుట మేలు కదా ! కనుక యుద్ధం కొనసాగించ నిశ్చయించుకున్నాను. అడ్డు చెప్పకండి. మిగిలిన సైన్యాలతో యుద్ధానికి వెళతాను. ఏమో రేపు నేనే గెలువగలనో ఏమో ఎవరికి తెలుసు " అన్నాడు. సుయోధనుడు తన సైన్యాలను ఉత్సాహపరచి యుద్ధోన్ముఖులను చేసాడు. తరువాత మరునాటి యుద్ధానికి తగిన వ్యూహము కొరకు ఆలోచించాడు. అశ్వత్థామ శకుని, కృపాచార్య, శల్య, కృతవర్మలతో కలిసి ఆలోచించి " సుయోధనా ! మనమీ రాత్రి ఈ శిబిరంలో నిద్రించుట శ్రేయస్కరం కాదు. విజయోత్సాహంతో ఉన్న పాండవులు అర్ధరాత్రి మన మీద దాడి జరిపి మనలను సంహరించ వచ్చు. కనుక మనం ఇచ్చటికి దూరంగా వెళ్ళి విడిది చేస్తాము " అన్నాడు. ఆ మాటలకు సంతోషించిన సుయోధనుడు బంధు మిత్ర సహితంగా సైన్యములతో అక్కడకు రెండు ఆమడల దూరంలో ఉన్న సరస్వతీ నదీ తీరంలో విడిది చేసారు. అలసట తీరేలా అందరూ స్నానాలు చేసారు.


*కౌరవ సైన్యాధ్యక్షత*


కౌరవ యోధులు సేదతీరిన తరువాత సుయోధనుడు మరునాటి యుద్ధానికి సైన్యాధ్యత ఎవరికి అప్పచెప్పాలో నిర్ణయించమని అశ్వత్థామను అడిగాడు. అశ్వత్థామ " సుయోధనా ! ఈ క్లిష్ట సమయంలో యుద్ధకళానైపుణ్యం ఉన్న వాడు. వయసులో పెద్ద వాడు, తన మేనళ్ళులను వదిలి మన మీద అభిమానంతో తరఫున యుద్ధం చేస్తున్న వాడు అయిన మధ్ర దేశాధిపతి శల్యుడికంటే మన సైన్యాలకు అధ్యక్షత వహించగల వాడు ఎవ్వడు. కనుక మధ్రదేశాధిపతి శల్యుని మన సైన్యాధిపతిని చేద్దాము " అన్నాడు. సుయోధనుడు " శల్యమహారాజా ! తమరు మా సకల సైన్యములకు అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాను " అని చేతులు జోడించి అడిగాడు. అందుకు శల్యుడు అంగీకరించాడు. వెంటనే సుయోధనుడు సరస్వతీ నదీ జలాలను తెప్పించి శల్యుని సైన్యాధ్యక్షుడిగా అభిషేకించాడు. విజయసూచకంగా కౌరవసేనలు జయజయధ్వానాలు చేస్తూ శంఖం పూరించాయి. పాండవ శిబిరంలో ధర్మరాజు చారులద్వారా ఎప్పటి విషయములు అప్పుడే తెలుసుకుంటున్నాడు. శల్యుడు కౌరవులకు సైన్యాధ్యక్షత వహించిన విషయం తెలుసుకుని " కృష్ణా ! విన్నావా సుయోధనుడు శల్యుడిని కౌరవ సేనకు సైన్యాధ్యక్షుడిని చేసాడు. అందుకు దీటుగా మనం ఏమి చేయాలి " అని అడిగాడు. కృష్ణుడు " ధర్మరాజా ! శల్యుడు మహా బలవంతుడు, బలశాలి, భుజబల సంపన్నుడు. రణకౌశలంలో భీష్మ, ద్రోణ, కర్ణులను మించిన వాడు. నివురుకప్పిన నిప్పులాంటి శల్యుడు రణరంగమున విజృంభించిన మీరు తట్టుకోవడం కష్టం. శల్యుడిని ఎదుర్కొనగల సమర్ధుడివి నువ్వే కనుక రేపటి యుద్ధంలో శల్యుని సంహరించు ఉపాయం చూడు. అతడి మాద్రికి సోదరుడు మీ మేన మామ అందు వలన మీకు అతడి మీద అభిమానం ఉండవచ్చు కాని ఇప్పుడు అతడు శత్రుపక్షమున సైన్యాధ్యక్షత వహించి యుద్ధం చేస్తున్నాడు. కనుక నిర్ధాక్షిణ్యంగా అతడిని వధించిన నీకు విజయం చేకూరగలదు " అన్నాడు. ధర్మరాజు " కృష్ణా ! నీవు చెప్పినట్లు చేస్తాను. యుద్ధంలో మనకు విజయం ముఖ్యం కాని బంధుత్వాలు కాదు " అన్నాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

అపరోక్షానుభూతిని

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో|| *సతి సక్తో నరో యాతి సద్భావం హ్యేకనిష్ఠయా।*

          *కీటకో భ్రమరం ధ్యాయన్ భ్రమరత్వాయ కల్పతే॥*


               *.. వివేకచూడామణిః ..*


*తా|| "కీటకము నిత్యమూ దీక్షగా భ్రమరాన్ని ధ్యానిస్తూ ఉండటంవల్ల ఏ విధంగా భ్రమరత్వాన్ని పొందుచున్నదో అదే విధంగా ఆత్మను గురించి నిరంతరమూ చింతించేవాడు అపరోక్షానుభూతిని పొందుతాడు."*


 ✍️🌹💐🌸🙏

పేదవాడు

 పక్షవికలశ్చ పక్షీ శుష్కశ్చ తరుః సరశ్చ జలహీనమ్ |

సర్పశ్చోద్ధృతదంష్ట్రః తుల్యం లోకే దరిద్రశ్చ || 




రెక్కలు లేని పక్షి, ఎండిన చెట్టు, నీరు లేని సరస్సు, దంతాలు తెగిపోయిన పాము, పేదవాడు అన్నీ ఒకటే.

విశిష్టమైన(విద్య అనే) భాండాగారం

 అపూర్వః కోऽపి కోశోऽయం 

విద్యతే తవ భారతి।

వ్యయతో వృద్ధి మాయాతి 

క్షయ మాయాతి సంచయాత్ ।।


భారతి-ఓ సరస్వతీ దేవీ!,

అపూర్వ-ఇంతకు ముందు లేని,

కః అపి-ఏదో తెలియని,

అయం కోశః-ఈ(విద్య అనే) భాండాగారం,

తవ-నీకు,

విద్యతే-ఉన్నది,

వ్యయతః-ఖర్చు చేసిన కొద్దీ,

వృద్ధిం-పెరుగుదలను,

ఆయాతి-పొందుతోంది,

సంచయాత్-పోగు చేసిన కొద్దీ,

క్షయం-తరుగుదలను,

ఆయాతి-పొందుతోంది।। 


అమ్మా ఓ సరస్వతీ దేవీ! ఇంతకు ముందు ఎక్కడా లేని విశిష్టమైన(విద్య అనే) భాండాగారం నీ దగ్గర ఉంది. ఆ నిధి ఖర్చు చేసిన కొద్దీ పెరుగి పోతుంది.పోగు చేసిన కొద్దీ తరిగి పోతుంది కదా।।

15-6-25/ఆదివారం/ రెంటాల

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు - జేష్ఠ మాసం - కృష్ణ పక్షం -‌ చతుర్థి - శ్రవణం -‌‌ భాను వాసరే* (15.06.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

నాగసాని

 *నాపసాని: తెలుగు జాతీయాలు*

⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡

పెండ్లి చివరిరోజు తంతుగా జరిగే నాకబలి/ నాగవల్లి తంతులో పెద్ద ముత్తయిదువుల పాత్ర చాలా ఉండేది. వరస పాటలు పాడటం దగ్గరినుంచి మర్యాదలు జరపటం దాకా, వధూవరులను పీటల మీద కూర్చోపెట్టడం దగ్గరినుంచి తాంబూలాలిప్పించటం దాకా నాపసానులకు చాలా పనులూ ప్రాముఖ్యమూ ఉండేవి. నాగసాని, నాగవసాని, నాగప్పసాని అనే పర్యాయ రూపాలతో ఈ నాపసానిని వ్యవహరించటం కద్దు. జాణ అయిన ముత్తయిదువులు ఈ తంతు నడిపేవాళ్ళు. అందువల్ల నాపసాని అనే మాటకు కాలక్రమాన జాణ, నేర్పరి, అనుభవజ్ఞురాలు అనే అర్థాలు వచ్చాయి. వయసులో పెద్దదై నాపసానిగా వ్యవహరించిన ఆమెను ముదినాపసాని అనేవాళ్ళు. వ్యక్తులు కాని ఆడపిల్లలు వినికిడి పాండిత్యంతో ఏవయినా సరససల్లాపాలు సాగిస్తే 'ఏమ్మా, ముదినాపసానిలా మాట్లాడుతున్నావు?' అని అధిక్షేపించటం కద్దు. నాకబలి సందర్భంలో పెద్దరికం వెలిగించినామె 'నాకసాని' అయి, కాలక్రమాన నాగసాని అయిందంటారు కొందరు.

రామాయణం

 🌹🌷🏹🪔🛕🪔🏹🌷🌹

*🌞ఆదివారం 15 జూన్ 2025🌞*

``

          *రామాయణం.*


ఒకసారి చదివినంత 

మాత్రాన మన సమస్త 

పాపాలని తీసేస్తుంది…

``

     *వాల్మీకి రామాయణం*                

            *69 వ భాగం*


*నమోస్తు రామాయ సలక్ష్మణాయ, దేవ్యైచ తస్యై జనకాత్మజాయై,।*

*నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో, నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః॥*```

(దీనిని రామాయణానికి ప్రార్ధనా శ్లోకంగా చెబుతారు)


“లక్ష్మణుడితో కూడుకుని ఉన్న రాముడికి నమస్కారం, జనకుని కూతురైన సీతమ్మకి నమస్కారం, రుద్రుడికి, ఇంద్రుడికి, యముడికి, వాయుదేవుడికి నమస్కారం, చంద్రుడికి, సూర్యుడికి, దేవతలందరికి నమస్కారం. నాకు సీతమ్మ తల్లి దర్శనం అయ్యేటట్టు దేవతలందరు కాటాక్షించెదరుగాక” అని నమస్కారం చేశాడు.


అప్పుడు హనుమంతుడికి ఎదురుగా అశోకవనం కనపడింది. అప్పుడాయన ఒక ధనుస్సు నుండి విడవబడిన బాణంలా ముందుకి వెళ్ళి అశోకవనంలో దిగారు. 


హనుమంతుడు అక్కడున్న అన్ని చెట్ల మీదనుంచి అటూ ఇటూ దూకుతూ సీతమ్మని వెతికాడు. 


ఆ అశోకవనంలో రావణుడు తన తపఃశక్తితో నిర్మించిన కృత్రిమమైన ఒక కొండ, ఆ కొండ మీదనుంచి ప్రవహిస్తున్న నది ఉన్నాయి.


అలా హనుమంతుడు ఆ అశోకవనాన్ని వెతుకుతుండగా ఆయనకి దూరంగా వెయ్యి స్తంభాలతో కూడుకున్న ఒక బ్రహ్మాండమైన ప్రాసాదం కనపడింది. 


అది అక్కడున్న సైనికులు విశ్రాంతి తీసుకోవడం కోసం ఏర్పాటు చేసిన మంటపం, దాని మీదకి శింశుపా వృక్షం ఉంది. 


అప్పుడాయన ఆ శింశుపా వృక్షం మీదకి దూకి, ఆ చెట్టు కొమ్మల నుంచి కిందకి చూస్తే, చుట్టూ రాక్షస స్త్రీల మధ్యలో ఒక స్త్రీ పట్టుపుట్టం కట్టుకుని ఉంది. 


ఆమె సీతమ్మే అయి ఉంటుందని, ఆ ఆకులని పక్కకి తోస్తూ హనుమంతుడు చూసేసరికి మట్టి పట్టిన బట్టతో, చుట్టూ అనేకమంది రాక్షస స్త్రీలతో, ఉపవాసాల చేత క్షీణించిపోయి దీనురాలిగా ఉన్న, కన్నులనిండా నీరు ఉన్న, మళ్ళి మళ్ళి వేడి నిట్టూర్పులు వదులుతున్న, శుక్ల పక్షంలో వచ్చే మొదటి చంద్రరేఖలా, ప్రయత్నపూర్వకంగా చూస్తే తప్ప తెలియని ప్రకాశంతో, పొగతో కప్పబడిన అగ్నిజ్వాలలా, నలిగిన పసుపుపచ్చ బట్ట కట్టుకొని, అంగారకుడి చేత పీడింపబడిన రోహిణిలా, పెరిగిన వృద్ధి తగ్గిన దానిలా, శ్రద్ధని కోల్పోయిన దానిలా, ఆశ నెరవేరని దానిలా, అవమానంతో సిగ్గుపడుతూ ఉన్న సీతమ్మని హనుమంతుడు చూశాడు.


అలా ఉన్న సీతమ్మని చూసిన హనుమంతుడి కళ్ళ నుండి ఆనందబాష్పాలు కారాయి. అలా నల్లటి కళ్ళతో ఉన్న సీతమ్మని చూసిన హనుమకి, ఆవిడ అంగ ప్రత్యంగములయందు రాముడు జ్ఞాపకానికి వచ్చాడు ( సీతమ్మని చూడడం అంటె ప్రకృతిని చూడడం, ఆ ప్రకృతియందు పురుషుడిని {రాముడిని} చూడడం, అంటె హనుమ ఈనాడు అద్వైత దర్శనం చేశాడు).

సీతమ్మని అలా చూసిన హనుమంతుడు అనుకున్నాడు 

“మా రాముడి గుండె చాలా గట్టిది, ఎవ్వరూ చెయ్యలేని పని రాముడు చేశాడని ఇప్పుడు నేను గుర్తించాను. అదేంటంటే, పది నెలలనుంచి ఈ సీతమ్మ రాముడి పేరు చెప్పుకుంటూ, తపస్సు చేసుకుంటూ, రాముడి గురించి శోకిస్తూ ఇక్కడ ఉంటె, అటువంటి భార్యకి దూరంగా ఉండి కూడా 10 నెలలనుంచి ప్రాణాలు నిలబెట్టుకొని ఉన్నాడు, కనుక రాముడు ఎవ్వరూ చెయ్యలేని పని చేశాడు. రాముడి మనస్సు సీతమ్మ దగ్గర ఉంది, సీతమ్మ మనస్సు రాముడి దగ్గర ఉంది, అందుకని ఇద్దరూ ఒకరికి ఒకరు దూరంగా ఉండి కూడా ఇంత కాలం బతకగలిగారు. 


మూడు లోకములలో ఉండే ఐశ్వర్యాన్ని అంతా తీసుకొచ్చి ఒకపక్క పెట్టి, మరోపక్క సీతమ్మని పెడితే, సీతమ్మ యొక్క వైభవంలో 16వ వంతుతో కూడా ఆ ఐశ్వర్యము, వైభవము సరితూగదు. నల్లటి జుట్టుతో, ఎర్రటి పెదవితో, సన్నటి నడుముతో, పద్మములవంటి కన్నులతో ఆ తల్లి శింశుపా వృక్షం కింద కూర్చుని ఉంది. 


గురువుల చేత శిక్షింపబడిన బుద్ధి కలిగిన లక్ష్మణుడి చేత ఆరాధింపబడే సీతమ్మ, పెద్దలచే పొగడబడే సీతమ్మ, లక్ష్మణుడి గురువైన రాముడి యొక్క ఇల్లాలైన సీతమ్మ, ముందు రాముడు వెనుక లక్ష్మణుడు ఉండగా మధ్యలో నడవవలసిన సీతమ్మ, దశరథుడి పెద్ద కోడలైన సీతమ్మ, జనకుడి కూతురైన సీతమ్మ ఇవ్వాళ చుట్టూ రాక్షస స్త్రీలు ఉండగా, పది నెలల నుండి ఒకే వస్త్రాన్ని కట్టుకొని పడి ఉందంటే,```


*యది సీతాపి దుఃఖార్తా కాలోహి దురతిక్రమః|*```


ఈ కాలం అన్నది ఏదన్నా చెయ్యగలదు, ఈ కాలాన్ని ఎవరూ అతిక్రమించలేరు.


ఈ సీతమ్మ కోసమే 14,000 రాక్షసులు మరియు ఎంతో మంది రాక్షసులు చనిపోయారు. ఈ తల్లి కారణంగానే సుగ్రీవుడు పట్టాభిషేకం పొందాడు, వాలి తెగటారిపోయాడు. నువ్వు ఇక్కడ కూర్చున్నావు కాని, నీ వల్ల అక్కడ ఎంత కథ నడుస్తుందో తెలుసా అమ్మా. 


నీకు నీ అమ్మ(భూదేవి) పోలిక వచ్చిందమ్మా, అందుకే నీకు ఇంత ఓర్పు ఉంది, రామలక్ష్మణుల చేత రక్షింపబడవలసిన తల్లివి, ఇలా వికృతమైన రాక్షస స్త్రీల మధ్యన చెట్టుకింద కూర్చున్నావా అమ్మా. 


శీలం, వయస్సు, నడవడి, వంశాలు, శరీరాలు అనే ఈ అయిదు లక్షణాలలో(వివాహం చేసేముందు వధువు, వరుడు ఈ 5 లక్షణాలలో సరిపోతారో లేదో చూడాలి) నువ్వు రాముడికి తగినదానివి, మా సీతమ్మ ముందు పాపాత్ముడైన రావణుడు నిలుచున్నా ఆమె కళ్ళు ఎప్పుడూ నల్లగానే, శాంతంగా ఉంటాయి. కాని రాముడి కళ్ళు కోపంతో అప్పుడప్పుడు ఎరుపెక్కుతాయి" అని అనుకున్నాడు.```


        *రేపు… 70వ భాగం*


*🚩జై శ్రీరామ్.! జై శ్రీ రామ్.!🚩*                           

       *🙏జై జై శ్రీ రామ్.!🙏*


                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏

ఆదివారం🌞* *🌹15 జూన్ 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       *🌞ఆదివారం🌞*

  *🌹15 జూన్ 2025🌹*  

    *దృగ్గణిత పంచాంగం*   

              

*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*

*జ్యేష్ఠ మాసం - కృష్ణ పక్షం*


*తిథి  : చవితి* మ 03.51 వరకు ఉపరి *పంచమి*

*వారం    : ఆదివారం* (భానువాసరే)

*నక్షత్రం   : శ్రవణం* రా 01.00 వరకు ఉపరి *ధనిష్ఠ*


*యోగం : ఐంద్ర* మ 12.20 వరకు ఉపరి *వైధృతి*

*కరణం   : బాలువ* మ 03.51 *కౌలువ* రా 03.44 ఉపరి *తైతుల*


*సాధారణ శుభ సమయాలు:* *ఉ 06.30-09.30 & 11.00-12.00 మ 02.30-04.00*

అమృత కాలం  : *మ 02.19 - 03.58*

అభిజిత్ కాలం  : *ప 11.42 - 12.34*


*వర్జ్యం          : శేషం ఉ 06.06 వరకు*

*దుర్ముహూర్తం  : సా 04.56 - 05.49*

*రాహు కాలం    : సా 05.03 - 06.41*

గుళికకాళం       : *మ 03.25 - 05.03*

యమగండం     : *మ 12.08 - 01.46*

సూర్యరాశి :*వృషభం/మిధునం* 

చంద్రరాశి : *మకరం*

సూర్యోదయం :*ఉ 05.42*

సూర్యాస్తమయం :*సా 06.52*

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.35 - 08.12*

సంగవ కాలం         :      *08.12 - 10.49*

మధ్యాహ్న కాలం    :     *10.49 - 01.27*

అపరాహ్న కాలం    : *మ 01.27 - 04.04*


*ఆబ్ధికం తిధి         : జ్యేష్ఠ బహుళ చవితి*

సాయంకాలం       :*సా 04.04 - 06.41*

ప్రదోష కాలం         :  *సా 06.41 - 08.52*

రాత్రి కాలం           :*రా 08.52 - 11.46*

నిశీధి కాలం          :*రా 11.46 - 12.30*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.08 - 04.51*

******************************

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🌞శ్రీ సూర్య పంజర స్తోత్రం🌞* 


*తిమిరకరిమృగేంద్రం*  

*బోధకం పద్మినీనాం*

*సురవరమభివంద్యం* 

*సుందరం విశ్వదీపమ్*


🙏 *ఓం నమో సూర్యాదేవాయ నమః* 

          

🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌞🌞🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌞🌞🍃🌷

 🌹🌷🌞🌞🌞🌞🌷🌹