15, జూన్ 2025, ఆదివారం

నాగసాని

 *నాపసాని: తెలుగు జాతీయాలు*

⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡

పెండ్లి చివరిరోజు తంతుగా జరిగే నాకబలి/ నాగవల్లి తంతులో పెద్ద ముత్తయిదువుల పాత్ర చాలా ఉండేది. వరస పాటలు పాడటం దగ్గరినుంచి మర్యాదలు జరపటం దాకా, వధూవరులను పీటల మీద కూర్చోపెట్టడం దగ్గరినుంచి తాంబూలాలిప్పించటం దాకా నాపసానులకు చాలా పనులూ ప్రాముఖ్యమూ ఉండేవి. నాగసాని, నాగవసాని, నాగప్పసాని అనే పర్యాయ రూపాలతో ఈ నాపసానిని వ్యవహరించటం కద్దు. జాణ అయిన ముత్తయిదువులు ఈ తంతు నడిపేవాళ్ళు. అందువల్ల నాపసాని అనే మాటకు కాలక్రమాన జాణ, నేర్పరి, అనుభవజ్ఞురాలు అనే అర్థాలు వచ్చాయి. వయసులో పెద్దదై నాపసానిగా వ్యవహరించిన ఆమెను ముదినాపసాని అనేవాళ్ళు. వ్యక్తులు కాని ఆడపిల్లలు వినికిడి పాండిత్యంతో ఏవయినా సరససల్లాపాలు సాగిస్తే 'ఏమ్మా, ముదినాపసానిలా మాట్లాడుతున్నావు?' అని అధిక్షేపించటం కద్దు. నాకబలి సందర్భంలో పెద్దరికం వెలిగించినామె 'నాకసాని' అయి, కాలక్రమాన నాగసాని అయిందంటారు కొందరు.

కామెంట్‌లు లేవు: