🌹🌷🏹🪔🛕🪔🏹🌷🌹
*🌞ఆదివారం 15 జూన్ 2025🌞*
``
*రామాయణం.*
ఒకసారి చదివినంత
మాత్రాన మన సమస్త
పాపాలని తీసేస్తుంది…
``
*వాల్మీకి రామాయణం*
*69 వ భాగం*
*నమోస్తు రామాయ సలక్ష్మణాయ, దేవ్యైచ తస్యై జనకాత్మజాయై,।*
*నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో, నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః॥*```
(దీనిని రామాయణానికి ప్రార్ధనా శ్లోకంగా చెబుతారు)
“లక్ష్మణుడితో కూడుకుని ఉన్న రాముడికి నమస్కారం, జనకుని కూతురైన సీతమ్మకి నమస్కారం, రుద్రుడికి, ఇంద్రుడికి, యముడికి, వాయుదేవుడికి నమస్కారం, చంద్రుడికి, సూర్యుడికి, దేవతలందరికి నమస్కారం. నాకు సీతమ్మ తల్లి దర్శనం అయ్యేటట్టు దేవతలందరు కాటాక్షించెదరుగాక” అని నమస్కారం చేశాడు.
అప్పుడు హనుమంతుడికి ఎదురుగా అశోకవనం కనపడింది. అప్పుడాయన ఒక ధనుస్సు నుండి విడవబడిన బాణంలా ముందుకి వెళ్ళి అశోకవనంలో దిగారు.
హనుమంతుడు అక్కడున్న అన్ని చెట్ల మీదనుంచి అటూ ఇటూ దూకుతూ సీతమ్మని వెతికాడు.
ఆ అశోకవనంలో రావణుడు తన తపఃశక్తితో నిర్మించిన కృత్రిమమైన ఒక కొండ, ఆ కొండ మీదనుంచి ప్రవహిస్తున్న నది ఉన్నాయి.
అలా హనుమంతుడు ఆ అశోకవనాన్ని వెతుకుతుండగా ఆయనకి దూరంగా వెయ్యి స్తంభాలతో కూడుకున్న ఒక బ్రహ్మాండమైన ప్రాసాదం కనపడింది.
అది అక్కడున్న సైనికులు విశ్రాంతి తీసుకోవడం కోసం ఏర్పాటు చేసిన మంటపం, దాని మీదకి శింశుపా వృక్షం ఉంది.
అప్పుడాయన ఆ శింశుపా వృక్షం మీదకి దూకి, ఆ చెట్టు కొమ్మల నుంచి కిందకి చూస్తే, చుట్టూ రాక్షస స్త్రీల మధ్యలో ఒక స్త్రీ పట్టుపుట్టం కట్టుకుని ఉంది.
ఆమె సీతమ్మే అయి ఉంటుందని, ఆ ఆకులని పక్కకి తోస్తూ హనుమంతుడు చూసేసరికి మట్టి పట్టిన బట్టతో, చుట్టూ అనేకమంది రాక్షస స్త్రీలతో, ఉపవాసాల చేత క్షీణించిపోయి దీనురాలిగా ఉన్న, కన్నులనిండా నీరు ఉన్న, మళ్ళి మళ్ళి వేడి నిట్టూర్పులు వదులుతున్న, శుక్ల పక్షంలో వచ్చే మొదటి చంద్రరేఖలా, ప్రయత్నపూర్వకంగా చూస్తే తప్ప తెలియని ప్రకాశంతో, పొగతో కప్పబడిన అగ్నిజ్వాలలా, నలిగిన పసుపుపచ్చ బట్ట కట్టుకొని, అంగారకుడి చేత పీడింపబడిన రోహిణిలా, పెరిగిన వృద్ధి తగ్గిన దానిలా, శ్రద్ధని కోల్పోయిన దానిలా, ఆశ నెరవేరని దానిలా, అవమానంతో సిగ్గుపడుతూ ఉన్న సీతమ్మని హనుమంతుడు చూశాడు.
అలా ఉన్న సీతమ్మని చూసిన హనుమంతుడి కళ్ళ నుండి ఆనందబాష్పాలు కారాయి. అలా నల్లటి కళ్ళతో ఉన్న సీతమ్మని చూసిన హనుమకి, ఆవిడ అంగ ప్రత్యంగములయందు రాముడు జ్ఞాపకానికి వచ్చాడు ( సీతమ్మని చూడడం అంటె ప్రకృతిని చూడడం, ఆ ప్రకృతియందు పురుషుడిని {రాముడిని} చూడడం, అంటె హనుమ ఈనాడు అద్వైత దర్శనం చేశాడు).
సీతమ్మని అలా చూసిన హనుమంతుడు అనుకున్నాడు
“మా రాముడి గుండె చాలా గట్టిది, ఎవ్వరూ చెయ్యలేని పని రాముడు చేశాడని ఇప్పుడు నేను గుర్తించాను. అదేంటంటే, పది నెలలనుంచి ఈ సీతమ్మ రాముడి పేరు చెప్పుకుంటూ, తపస్సు చేసుకుంటూ, రాముడి గురించి శోకిస్తూ ఇక్కడ ఉంటె, అటువంటి భార్యకి దూరంగా ఉండి కూడా 10 నెలలనుంచి ప్రాణాలు నిలబెట్టుకొని ఉన్నాడు, కనుక రాముడు ఎవ్వరూ చెయ్యలేని పని చేశాడు. రాముడి మనస్సు సీతమ్మ దగ్గర ఉంది, సీతమ్మ మనస్సు రాముడి దగ్గర ఉంది, అందుకని ఇద్దరూ ఒకరికి ఒకరు దూరంగా ఉండి కూడా ఇంత కాలం బతకగలిగారు.
మూడు లోకములలో ఉండే ఐశ్వర్యాన్ని అంతా తీసుకొచ్చి ఒకపక్క పెట్టి, మరోపక్క సీతమ్మని పెడితే, సీతమ్మ యొక్క వైభవంలో 16వ వంతుతో కూడా ఆ ఐశ్వర్యము, వైభవము సరితూగదు. నల్లటి జుట్టుతో, ఎర్రటి పెదవితో, సన్నటి నడుముతో, పద్మములవంటి కన్నులతో ఆ తల్లి శింశుపా వృక్షం కింద కూర్చుని ఉంది.
గురువుల చేత శిక్షింపబడిన బుద్ధి కలిగిన లక్ష్మణుడి చేత ఆరాధింపబడే సీతమ్మ, పెద్దలచే పొగడబడే సీతమ్మ, లక్ష్మణుడి గురువైన రాముడి యొక్క ఇల్లాలైన సీతమ్మ, ముందు రాముడు వెనుక లక్ష్మణుడు ఉండగా మధ్యలో నడవవలసిన సీతమ్మ, దశరథుడి పెద్ద కోడలైన సీతమ్మ, జనకుడి కూతురైన సీతమ్మ ఇవ్వాళ చుట్టూ రాక్షస స్త్రీలు ఉండగా, పది నెలల నుండి ఒకే వస్త్రాన్ని కట్టుకొని పడి ఉందంటే,```
*యది సీతాపి దుఃఖార్తా కాలోహి దురతిక్రమః|*```
ఈ కాలం అన్నది ఏదన్నా చెయ్యగలదు, ఈ కాలాన్ని ఎవరూ అతిక్రమించలేరు.
ఈ సీతమ్మ కోసమే 14,000 రాక్షసులు మరియు ఎంతో మంది రాక్షసులు చనిపోయారు. ఈ తల్లి కారణంగానే సుగ్రీవుడు పట్టాభిషేకం పొందాడు, వాలి తెగటారిపోయాడు. నువ్వు ఇక్కడ కూర్చున్నావు కాని, నీ వల్ల అక్కడ ఎంత కథ నడుస్తుందో తెలుసా అమ్మా.
నీకు నీ అమ్మ(భూదేవి) పోలిక వచ్చిందమ్మా, అందుకే నీకు ఇంత ఓర్పు ఉంది, రామలక్ష్మణుల చేత రక్షింపబడవలసిన తల్లివి, ఇలా వికృతమైన రాక్షస స్త్రీల మధ్యన చెట్టుకింద కూర్చున్నావా అమ్మా.
శీలం, వయస్సు, నడవడి, వంశాలు, శరీరాలు అనే ఈ అయిదు లక్షణాలలో(వివాహం చేసేముందు వధువు, వరుడు ఈ 5 లక్షణాలలో సరిపోతారో లేదో చూడాలి) నువ్వు రాముడికి తగినదానివి, మా సీతమ్మ ముందు పాపాత్ముడైన రావణుడు నిలుచున్నా ఆమె కళ్ళు ఎప్పుడూ నల్లగానే, శాంతంగా ఉంటాయి. కాని రాముడి కళ్ళు కోపంతో అప్పుడప్పుడు ఎరుపెక్కుతాయి" అని అనుకున్నాడు.```
*రేపు… 70వ భాగం*
*🚩జై శ్రీరామ్.! జై శ్రీ రామ్.!🚩*
*🙏జై జై శ్రీ రామ్.!🙏*
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి