*తిరుమల సర్వస్వం -271*
*సుప్రభాత గానం 1*
దక్షిణభారతదేశం లోని లక్షలాది గృహాలలో, మరీ ముఖ్యంగా విశ్వవ్యాప్తంగా విస్తరించి ఉన్న తెలుగు వారిళ్ళలో దినచర్య నేటికీ సుప్రభాతగాన శ్రవణం తోనే ప్రారంభమవుతుంది. గృహాల లోనే కాకుండా తిరుమలతో సహా ప్రపంచం నలుమూలలా ఉన్న శ్రీవేంకటేశ్వరుని దేవాలయాల లోను, ఎన్నో హిందూ ధార్మిక సంస్థల్లోను, ప్రసార మాధ్యమాలలో కూడా ఉదయపు వేళల్లో సుప్రభాతగానం చేయబడుతుంది. కోట్లాదిమంది తెలుగువారు కంఠస్థంగా చెప్పగలిగిన ఆధ్యాత్మిక గీతమేదైనా ఉందంటే అది ముమ్మాటికీ *'సుప్రభాతం'* మాత్రమే. అంతటి ప్రఖ్యాతి గాంచిన సుప్రభాత గానాన్ని శ్రవణానందకరంగా విని, ఆనందించి, భక్తిపారవశ్యంలో మునిగిపోవడమే గానీ ఆ గీత రచయిత ఎవరు? అది ఏ సందర్భంలో, ఎలా రచింపబడింది? దానిలోని భావర్థమేమిటి? అన్న విషయాలు అతికొద్ది మందికి మాత్రమే తెలుసు. ఈనాటి ప్రకరణంలో ఆ విషయాలను ముచ్చటించుకుందాం.
*సుప్రభాతగానం ఆవిర్భావం*
అర్థసహస్రాబ్దానికి పైగా కోట్లాది భక్తజనులను తన ఆధ్యాత్మిక శోభతో, భావలాలిత్యంతో, వీనులవిందైన ఛందోబద్ధ శ్లోకాలతో పులకింపజేస్తున్న *'సుప్రభాతగానం'* ప్రణాళికాబద్ధంగా, ఎంతోకాలం వెచ్చించి వ్రాసినది కాదు. భక్త్యావేశాన్ని తనువెల్లా రంగరించుకున్న ఒక భక్తాగ్రేసరుని గుండె లోతుల్లోంచి అసంకల్పితంగా, ఆశువుగా పొరలి వచ్చిన గానామృతమే *'సుప్రభాతం'.*
*మనవాళ మహాముని*
దాదాపు ఆరు శతాబ్దాలక్రితం మనవాళ మహాముని అనే శ్రీవారి మహాభక్తుడుండేవారు. విశిష్టాద్వైత సాంప్రదాయాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చిన మహామహులలో వీరు కూడా ఒకరు. శ్రీవారి భక్తితత్వ వ్యాప్తికి, హైందవమత సాంప్రదాయం వ్రేళ్ళూను కోవడానికి ఆ మహనీయుడు సలిపిన విశేషకృషికి గుర్తుగా తిరుపతి పట్టణం నడిబొడ్డున ఉన్న గోవిందరాజస్వామి ఆలయ ప్రాంగణంలో వారికో ఉపాలయాన్ని నిర్మించి, అందులో నేటికీ నిత్యపూజలు నిర్వహించబడుతున్నాయి.
ఆ ఋషిసత్తముడు, తన ఎనిమిది మంది ప్రముఖ శిష్యులలో ఒకరైన 'హస్తగిరినాథన్' వారితో ఒకసారి తిరుమలకు విచ్చేశారు.
*హస్తగిరినాథన్*
హస్తగిరినాథన్ వారు ప్రఖ్యాత వైష్ణవమత ప్రచారకులు 'ముడుంబైనంబి' వారసులైన అనంతాచారి, ఆండాళ్ పుణ్యదంపతులకు; పధ్నాలుగవ శతాబ్దపు ద్వితీయార్థభాగంలో, కాంచీపురంలో జన్మించారు. ఆధ్యాత్మిక గ్రంథాలెన్నింటినో అలవోకగా పఠించిన హస్తగిరినాథన్ తన అసమానమైన కవితాకౌశలంతో, పాండితీప్రకర్షతో; ఆధ్యాత్మిక చర్చల్లో ప్రతివాదులకు పెనుసవాలుగా నిలిచారు. ఎందరో ఉద్దండ పండితులను తన వాక్ఫటిమతో ఓడించిన 'నరశింహ మిశ్రుడు' అనే అద్వైత పండితోత్తముడిని పరాజయం పాలు గావించి, వారిని తన శిష్యునిగా చేసుకొనడం వల్ల హస్తగిరినాథన్ *'ప్రతివాద భయంకర అణ్ణన్'* గా ప్రఖ్యాతి గాంచారు. వారి వంశీయులు ఇప్పటికీ సంగీతసాధనలో తరించుతున్నట్లు కొందరి కథనం. తెలుగు చలనచిత్రసీమను ఒకానొక సమయంలో తన గానమాధుర్యంతో ఉర్రూతలూగించిన, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన *ప్రతివాద భయంకర శ్రీనివాస్ (పి. బి. శ్రీ నివాస్)* కూడా అదే వంశనామంతో ప్రఖ్యాతి గాంచడం కేవలం కాకతాళీయం కాకపోవచ్చు.
*ఆమోదముద్ర!*
ఆనాడు, శ్రీవేంకటేశ్వరునికి ప్రత్యేకంగా సుప్రభాతం లేదు. ప్రాతఃకాల సమయాలలో ప్రబంధపఠనం మాత్రమే జరుగుతుండేది. ఒకనాటి ప్రాతఃసంధ్యలో గురుశిష్యులిద్దరూ (మణవాళ మహాముని, హస్తగిరినాథన్) స్వామివారి దివ్యమూర్తిని అలౌకిక ఆనందంతో కాంచుతున్నప్పుడు; గురువుగారు భగవత్సంకల్ప ప్రేరితుడై శ్రీనివాసుణ్ణి మేల్కొలుపుతూ ఒక ప్రత్యేక ప్రార్థనాగీతాన్ని ఆలపించ వలసిందిగా తన శిష్యుణ్ణి ఆదేశించారు. వెనువెంటనే ద్వాదశాళ్వారులలో ఒకరైన తొండరడిప్పొడి ఆళ్వార్ శ్రీరంగనాథునిపై రచించిన, అప్పటికే విస్తృతంగా ప్రచారంలో ఉన్న సుప్రభాతం శిష్యుని మదిలో మెదిలగా, దానిలోని భావార్థాన్ని వారు స్మరణకు తెచ్చుకున్నారు. గురువు గారి ఆజ్ఞను మహాప్రసాదంగా, అందివచ్చిన అవకాశంగా భావించిన అణ్ణన్ స్వామి, *శ్రీరంగశాయి సుప్రభాత స్ఫూర్తితో 29 శ్లోకాలతో కూడిన శ్రీ వేంకటేశ సుప్రభాతాన్ని, 11 శ్లోకాలున్న శ్రీ వేంకటేశ స్తోత్రాన్ని, 16 శ్లోకాలు గల శ్రీ వేంకటేశ ప్రపత్తిని, 14 శ్లోకాలు గలిగిన శ్రీ వేంకటేశ మంగళాశాసనాన్ని ఇలా మొత్తం నాలుగు భాగాలను ఆశువుగా పఠించాడు.* అప్పటివరకు తమిళభాషలో ప్రబంధపారాయణం జరిగే తిరుమల ఆలయంలో అణ్ణన్ స్వామి సంస్కృతభాషలో రచించిన మేలుకొలుపు గీతాన్ని నిత్యం పఠించే *'శ్రీ వేంకటేశ సుప్రభాతం'* గా అంగీకరించే విషయంలో చర్చోపచర్చలు జరిగాయి. కానీ భావసౌందర్యం లోను, రాగయుక్తంగా పాడబడడం లోను, ఛందోబద్ధత లోను ఏ విధమైన లోటుపాట్లు కానరాకపోవడంతో; ఎట్టకేలకు 1430 వ సంవత్సరం, శ్రీవీరప్రతాపరాయల వారి పరిపాలనాకాలంలో అణ్ణన్ స్వామి రచించిన గీతం, 'శ్రీ వేంకటేశ సుప్రభాతం' గా ముక్తకంఠంతో ఆమోదించబడింది. అంటే, నేటికి దాదాపు 590 సంవత్సరాల నుండి సుప్రభాతగానం అవిచ్ఛిన్నంగా కొనసాగుతోందన్న మాట.
తన అమోఘమైన ఆధ్యాత్మిక, సాహిత్య, కవితా, గాన పటిమతో అశేషంగా ఉన్న శ్రీవారి భక్తుల గుండెల్లో అజరామరమైన స్థానాన్ని సంపాదించుకున్న అణ్ణన్ స్వామి ధన్యజీవి.
*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం*
*రచన*
*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*
ఫోన్ నెంబర్
99490 98406
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి