18-16-గీతా మకరందము.
మోక్షసన్న్యాసయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
అవతారిక - సాక్షియగు ఆత్మను కర్తయని తలంచువాడు అవివేకియని తెలుపుచున్నారు–
తత్త్రెవం సతి కర్తారం
ఆత్మానం కేవలం తు యః పశ్యత్యకృతబుద్ధిత్వాత్
న స పశ్యతి దుర్మతిః
తాత్పర్యము:- కర్మవిషయమందు ఇట్లుండగా (పైన తెలిపిన అయిదున్ను కారణములై యుండగా) ఎవడు సంస్కరింపబడని బుద్ధిగలవాడగుటచే, నిరుపాధికుడగు ఆత్మను కర్తగా తలంచుచున్నాడో, అట్టి అవివేకి కర్మముయొక్కగాని, ఆత్మయొక్కగాని వాస్తవస్వరూపమును ఎఱుంగకున్నాడు.
వ్యాఖ్య: - కర్మయందు ఆత్మ కర్తకాదు, పైనదెల్పిన అయిదుమాత్రమే కర్తలు. ఆత్మసాక్షి, కేవలుడు, నిరుపాధికుడు, సంగరహితుడు. కర్తృత్వమును ఆత్మయందారోపించువాడు వివేకహీనుడేయగును. ఆతడు పరమార్థతత్త్వమును తెలియనివాడు; శ్రవణాది సంస్కారములేని బుద్ధిగలవాడు - దుర్మతి.
అసంగమగు ఆత్మను కర్తగ జూచువాడు నేత్రములున్నను గ్రుడ్డివాడేయగును. ఏలయనిన అతడు సత్యమును గాంచుటలేదు. ఆత్మకు కర్తృత్వమును ఆరోపించుట అజ్ఞానమేయగును. కావుననే అట్టివారు గ్రుడ్డివారే యని చెప్పబడినది. దీనికి కారణము వారిబుద్ధికి సరియైన సంస్కారము లేకుండుటయే (అకృతబుద్ధిత్వాత్). ఎంత పాండిత్యము, ఎన్ని లౌకికవిద్యలు గలిగియున్నప్పటికిని సత్యదృష్టిలేనిచో, ఆత్మజ్ఞానములేనిచో అట్టివారు అంధప్రాయులే యగుదురు. ఏలయనిన వారు జ్ఞాననేత్రవిహీనులై యున్నారు. వారెంత గొప్పవారైనప్పటికిని చీకటిలోనున్నవారి చందముననే యుండుచు వాస్తవమును గ్రహించజాలకయుందురు.
కాబట్టి ఎంతటి ప్రాపంచిక వివేకమున్నను ఆత్మజ్ఞానము లేనివారు దుర్మతులు, అంధులే కనుక, ప్రపంచదృష్టిలో కీర్తిప్రతిష్టలు సంపాదించుకొనినప్పటికిని పరమార్థదృష్టిలో వారు గణనీయులుకారు. కనుక, జనులు ఆత్మతత్త్వమెరింగి మానవులకేకాక, భగవంతునకుగూడ ప్రీతిపాత్రులు కావలయును.
దోషము - అసంగమగు ఆత్మను కర్తగ భావించుట.
దోషకారణము - బుద్ధి శ్రవణాదులచే సంస్కరింపబడకుండుట.
దోషఫలితము - అజ్ఞానరూప అంధత్వము (సత్యమును జూడజాలకుండుట).
ప్రశ్న:- ఆత్మ ఎట్టిది?
ఉత్తరము: - కేవలమై, సాక్షియై, అసంగమైయున్నది.
ప్రశ్న:- అట్టి నిష్క్రియ అసంగఆత్మను కర్తయని మనుజు డేల చెప్పుచున్నాడు?
ఉత్తరము: - అజ్ఞానమువలన, బుద్ధికి ఇంకను శ్రవణాది సంస్కారము లేనందువలన.
ప్రశ్న:- కాబట్టి ఆతని స్థితి ఎట్లున్నది?
ఉత్తరము: - గ్రుడ్డివానివలె నున్నది. సత్యము నతడు కాంచుటలేదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి