15, జూన్ 2025, ఆదివారం

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*శల్య పర్వము ప్రథమాశ్వాసము*

*408 వ రోజు*


*సుయోధనుడు సంధిని నిరాకరించుట*


కృపాచార్యుని సంధి ప్రస్థావన సుయోధనుడు మర్యాదగానే నిరాకరించాడు. " ఆ చార్యా ! మీరు నా మంచి కోరి నేను చెడిపోవడం చూడ లేక నాలుగు మంచి మాటలు చెప్పారు. ఆ మాటలు నేను అంగీకరించలేను. ఎందుకంటే మాయా జూదం ఆడించి పాండవుల రాజ్యం అపహరించి వారిని అరణ్యములకు పంపాను. నిండు సభలో పాండవ పత్నిని జుట్టు పట్టి ఈడ్పించి ఘోరంగా అవమానించాను. సంధి చేయ వచ్చిన కృష్ణుడిని పట్టి బంధించాలనుకున్నాను. భీష్మ, ద్రోణ, కర్ణుల చావును కళ్ళారా చూసాను. పసి వాడైన అభిమన్యుడిని అధర్మంగా ఒంటరిని చేసి చుట్టుముట్టి కిరాతకంగా వధించాను. దుశ్శాసనుడిని చంపి రుధిరం తాగి భీముడు చంపడం చూసాను. ఇన్ని చేసిన నేను ఈ నాడు సంధి చేసుకుంటే నా తొడలు విరిచి భీముడు రెండవ శపథం నెరవేర్చుకుంటాడని భయపడి సంధి చేసుకున్నానని లోకులు నవ్వి పోరా ! నిందించరా ! ఏమైనా జరగని ఒకరి దయా దాక్షిణ్యాలతో వచ్చే రాజ్యానికంటే యుద్ధం చేసి మరణించి వీర స్వర్గం పొందుట మేలు కదా ! కనుక యుద్ధం కొనసాగించ నిశ్చయించుకున్నాను. అడ్డు చెప్పకండి. మిగిలిన సైన్యాలతో యుద్ధానికి వెళతాను. ఏమో రేపు నేనే గెలువగలనో ఏమో ఎవరికి తెలుసు " అన్నాడు. సుయోధనుడు తన సైన్యాలను ఉత్సాహపరచి యుద్ధోన్ముఖులను చేసాడు. తరువాత మరునాటి యుద్ధానికి తగిన వ్యూహము కొరకు ఆలోచించాడు. అశ్వత్థామ శకుని, కృపాచార్య, శల్య, కృతవర్మలతో కలిసి ఆలోచించి " సుయోధనా ! మనమీ రాత్రి ఈ శిబిరంలో నిద్రించుట శ్రేయస్కరం కాదు. విజయోత్సాహంతో ఉన్న పాండవులు అర్ధరాత్రి మన మీద దాడి జరిపి మనలను సంహరించ వచ్చు. కనుక మనం ఇచ్చటికి దూరంగా వెళ్ళి విడిది చేస్తాము " అన్నాడు. ఆ మాటలకు సంతోషించిన సుయోధనుడు బంధు మిత్ర సహితంగా సైన్యములతో అక్కడకు రెండు ఆమడల దూరంలో ఉన్న సరస్వతీ నదీ తీరంలో విడిది చేసారు. అలసట తీరేలా అందరూ స్నానాలు చేసారు.


*కౌరవ సైన్యాధ్యక్షత*


కౌరవ యోధులు సేదతీరిన తరువాత సుయోధనుడు మరునాటి యుద్ధానికి సైన్యాధ్యత ఎవరికి అప్పచెప్పాలో నిర్ణయించమని అశ్వత్థామను అడిగాడు. అశ్వత్థామ " సుయోధనా ! ఈ క్లిష్ట సమయంలో యుద్ధకళానైపుణ్యం ఉన్న వాడు. వయసులో పెద్ద వాడు, తన మేనళ్ళులను వదిలి మన మీద అభిమానంతో తరఫున యుద్ధం చేస్తున్న వాడు అయిన మధ్ర దేశాధిపతి శల్యుడికంటే మన సైన్యాలకు అధ్యక్షత వహించగల వాడు ఎవ్వడు. కనుక మధ్రదేశాధిపతి శల్యుని మన సైన్యాధిపతిని చేద్దాము " అన్నాడు. సుయోధనుడు " శల్యమహారాజా ! తమరు మా సకల సైన్యములకు అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాను " అని చేతులు జోడించి అడిగాడు. అందుకు శల్యుడు అంగీకరించాడు. వెంటనే సుయోధనుడు సరస్వతీ నదీ జలాలను తెప్పించి శల్యుని సైన్యాధ్యక్షుడిగా అభిషేకించాడు. విజయసూచకంగా కౌరవసేనలు జయజయధ్వానాలు చేస్తూ శంఖం పూరించాయి. పాండవ శిబిరంలో ధర్మరాజు చారులద్వారా ఎప్పటి విషయములు అప్పుడే తెలుసుకుంటున్నాడు. శల్యుడు కౌరవులకు సైన్యాధ్యక్షత వహించిన విషయం తెలుసుకుని " కృష్ణా ! విన్నావా సుయోధనుడు శల్యుడిని కౌరవ సేనకు సైన్యాధ్యక్షుడిని చేసాడు. అందుకు దీటుగా మనం ఏమి చేయాలి " అని అడిగాడు. కృష్ణుడు " ధర్మరాజా ! శల్యుడు మహా బలవంతుడు, బలశాలి, భుజబల సంపన్నుడు. రణకౌశలంలో భీష్మ, ద్రోణ, కర్ణులను మించిన వాడు. నివురుకప్పిన నిప్పులాంటి శల్యుడు రణరంగమున విజృంభించిన మీరు తట్టుకోవడం కష్టం. శల్యుడిని ఎదుర్కొనగల సమర్ధుడివి నువ్వే కనుక రేపటి యుద్ధంలో శల్యుని సంహరించు ఉపాయం చూడు. అతడి మాద్రికి సోదరుడు మీ మేన మామ అందు వలన మీకు అతడి మీద అభిమానం ఉండవచ్చు కాని ఇప్పుడు అతడు శత్రుపక్షమున సైన్యాధ్యక్షత వహించి యుద్ధం చేస్తున్నాడు. కనుక నిర్ధాక్షిణ్యంగా అతడిని వధించిన నీకు విజయం చేకూరగలదు " అన్నాడు. ధర్మరాజు " కృష్ణా ! నీవు చెప్పినట్లు చేస్తాను. యుద్ధంలో మనకు విజయం ముఖ్యం కాని బంధుత్వాలు కాదు " అన్నాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: