*కాటుక కంటినీరు*
ఆంధ్రమహాభాగవతాన్ని రాజుకి అంకితం యిమ్మని, బమ్మెర పోతనను అనేక రకాలుగా వత్తిడి చేస్తున్నారు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువా. పోతరాజు (అంటే మన బమ్మెర పోతన గారే నండి) నలిగిపోతున్నారు. అయినా శ్రీరామునికి తప్ప నరుల కెవ్వరికి అంకితమివ్వను అని అంటున్నారు. గంటం పట్టింది సంపాదించటానికి కాదు, నా నాగలి పెట్టేది మాకు చాలు అంటున్నారు.
అట్టి పరిస్థితులలో ఒకమారు దేవతా పీఠం వద్ద కలత మనసుతో వచ్చి వారు కూర్చున్నారు. సాక్షాత్తు తల్లి వాణి కన్నీరు కారుస్తూ ప్రత్యక్షమైంది.
చూసి తట్టుకోలేని బాధలో చెమర్చిన కన్నులతో పోతన గారి నోటివెంట ఈ పద్యం అలవోకగా జాలువారిందిట. ఆమె తృప్తిగా వెళ్ళింది. ఎలా అయితేనేమి ఈ పరమాద్భుతమైన చాటువు తెలుగువారికి దక్కింది.
*కాటుక కంటి నీరు చనుకట్టు పయింబడ నేల యేడ్చెదో కైటభదైత్యమర్దనుని గాదిలి కోడల! యో మదంబ! యో హాటకగర్భురాణి! నిను నాకటికిం గొనిపోయి యల్ల కర్ణాట కిరాట కీచకులు కమ్మ త్రిశుద్ధిగ నమ్ము భారతీ!*
నీవు కంటికి పెట్టుకున్న కాటుక, కన్నీటికి కరిగి రవికపై పడేలా ఎందుకు ఏడుస్తావు, తల్లీ? ఆ మహా విష్ణువునకు ఇష్టమైన కోడలా! ఓ మా తల్లీ, బ్రహ్మదేవునికి సాక్షాత్తు ఇల్లాలా! నిన్ను తీసుకుపోయి అంగట్లో పెట్టినట్లు, ఆ కర్ణాట కిరాట కీచకులకు అమ్మివేయను. త్రికరణశుద్ధిగా ఒట్టు వేస్తున్నాను. నన్ను నమ్ము సరస్వతీదేవి!
శ్రీరామునికి తప్పించి నర మహారాజులకు అంకితమివ్వనని భీష్మించి కూర్చున్న వైనానికి తార్కాణమే ఈ పద్యం.
ఈ పద్య సంధర్భంపై మరో కథనం కూడా ప్రచారంలో ఉందండి. ఆ వృత్తాంతము ఇదిగో.
ఆనాటి పోతన కాలమానం ప్రకారం మాలిక్ కాఫిర్ ఓరుగల్లుపై దండెత్తి సామ్రాజ్యాన్ని జయించిన తరువాత ఓరుగల్లు రాజు సింగభూపాలుడు అడవులలోకి వెళ్ళి అఙ్ఞాతంగా ఉండి సైన్యాన్ని తయారు చేసుకుంటాడు.
గర్భవతియైన సింగ భూపాలుని కోడలుని అడవులలోకి తీసుకొని వెళ్ళక పోతన ఇంట్లో మారు వేషంలో ఒక పనిమనిషిలాగా ఉంచేస్తారు. ఆవిడ పేరు సత్యవాణి. ఆవిడ గురించి మాలిక్ కాఫూర్ భటులు వెదుకుతూ ఉంటారు.
పోతన ఇంటికి విచారించడాని వచ్చి వారికి చాలా ధనాన్ని ఆశ చూపిస్తారు. పోతన లొంగలేదు. నాకు తెలియదు అని చెప్పి పంపించేస్తారు.
రాజ భటులు వెళ్ళిన తరువాత కంటికి మింటికి ఏక ధారగా నిశ్శబ్ధంగా రోదిస్తున్న ఆవిడతో పోతన ఆశువుగా చెప్పిన పద్యం ఇదని మరో వృత్తాంతం చరిత్రపుటలలో ఉన్నాయి.
ఆ పద్యాన్ని సింగభూపాలుని కోడలుకు అన్వయిస్తే
ఎందుకు అంతలా ఏడుస్తావు సింగ భూపాలుని కోడలా (విష్ణుమూర్తిని రాజుగా భావించాడు, అదేకాకుండా ఎంతోమంది మహామ్మదీయ రాజులని మట్టు బెట్టి, మాలిక్ కాఫిర్ ని కూడా ఒక సారి ఓడించాడు సింగ భూపాలుడు), మాలిక్ కాఫిర్ మారు వేషంలో తిరిగి వచ్చి కోట రహస్యాలు తెలుసుకొని, కొంతమందికి ధనం ఆశచూపి రహస్యంగా కోట తలుపులు తెరిపించుకొని అర్ధరాత్రి దాడి చేసి జయించాడు, మా అందరికీ నీవే అమ్మవు, బంగారం లాంటి సంతానాన్ని, మాకు కాబోయే రాజుని గర్భంలో ఉంచుకున్నావు, ఆకలి కోసం, తుచ్ఛమైన ధనం కోసం, నిన్ను యీ కర్ణాటకనుంచి వచ్చిన కిరాతకులు, కీచకులు అయిన మహమ్మదీయులుకు అమ్మను, త్రికరణ శుధ్ధిగ, మనసా వాచా, కర్మణా నన్ను నమ్ము భారతీ
అన్న అర్థం కూడా స్ఫురించగలదు.
అంటే పోతన కాలమానానికి అనుగుణమైన కథనం. సమంజసమే కావొచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి