5, నవంబర్ 2025, బుధవారం

ప్రతి ఫలం

 15, సెప్టెంబర్ 2024, ఆదివారం

ప్రతి ఫలం

 


 ప్రతి ఫలం 


కొన్ని సందర్భాలలో మనం చేసే చిన్న చిన్న పనులు కూడా ఎంతో గొప్ప ఫలితాన్ని ఇవ్వవచ్చు.  ఇటువంటి దానికి నిదర్శనంగా శ్రీ ఆది శంకరుల ఒక వృత్తాంతం తెలుపుతారు. 


ఆది  శంకరుల వారు సన్యాసాశ్రమం సవీకరించిన తోలి రోజుల్లో అంటే ఇంకా స్వామి బాల్యంలోనే వున్నారు.  బిక్షాటన కొరకు ఒకసారి ఒక గుడిశముందు నిలబడి " భవతి బిక్షం దేహి" అని యాచించారట  కానీ ఆ గృహంలోనుంచి ఎంతసేపటికి ఎవ్వరు రాలేదు.   అయినా కానీ మన శంకరులవారు ఇంకా నిరీక్షిస్తూ ఆ గుడిసె ముందే ఉన్నారు.  కొంతసేపటికి ఒక పేదరాలు వణుకుతున్న చేతులతో స్వామికి లేదు అని చెప్పటానికి మనస్కరించక ఒక ఉసిరిక పండును మాత్రం ఆయన జోలెలో వేసిందట. ఆమె దైన్యతను గమనించిన శంకరాచార్యులవారు ఒకసారి ఆమె గుడిసెను సంపూర్ణంగా పరికించి చుస్తే మొత్తం ఇల్లంతా కాళీగా ఎటువంటి వస్తువులు లేకుండా  ఉండటం చూసి ఆమె కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నదని తెలుసుకున్నారు. 


ఆది శంకరాచార్యుల వారి  మనస్సు ఆర్ద్రతమైనదట. వెంటనే శంకరాచార్యులవారు మహాలక్షిని స్తుతిస్తూ స్తోత్రము చేశారట.  ఆయన స్తోత్రానికి ప్రసన్నమైన అమ్మవారు ఆయనకు ప్రత్యక్షం అయి నాయనా ఎందుకు నన్ను పిలిచావు అని అడిగింది.  దానికి శంకరులవారు అమ్మా ఇది నీకేమైనా న్యాయంగా ఉన్నదా ఈ సాద్వి మణి  దీనత్వం చూసి నీకు కొంచమైనా దయరాలేదా తల్లి అని వేడుకొన్నాడు. అప్పుడు అమ్మవారు నాయనా నేను ఏమి చేతును ఆమె గతజన్మలో పూర్తిగా పిసినారిగా వుంటూ ఎవరికి కూడా ఎటువంటి దానధర్మాలు చేయకుండా ఉండి పూర్తిగా పుణ్యరహితంగా ఉండటం వలన ఆమెకు ఈ జన్మలో ఈ దారిద్యం దాపురించింది అని అన్నది.   అమ్మా ఆమె ఏ పుణ్యము చేయలేదు సరే మరి ఆమె భర్త పుణ్యము వలన అయినా ఈమెకు కొంత ఊరట కలగాలి కదా తల్లి అని అన్నాడు. దానికి తల్లి నాయనా ఆమె భర్త ఈమెకన్నా ఎక్కువ పాపాత్ముడు . అందుకే వారిద్దరిని కలిపాడు పరమేశ్వరుడు.  ఇద్దరు ఒకరిని మించిన వారు ఇంకొకరు.  కాబట్టి వారు ఈ దారిద్యాన్ని అనుభవిస్తున్నారు అని అన్నారు అమ్మవారు. 


నాయనా ప్రస్తుత పరిస్థితుల్లో వారి దారిద్యాన్ని బాపటం ఆ పరమేశ్వరుని వశం కూడా కాదు వారు అంత పాపాత్ములు అని తల్లి ఉన్నసంగతి ఉన్నట్లు చెప్పింది.  అప్పుడు ఆలోచించటం శంకరులవారి వంతయినది శంకరులు అంటే సాక్షాత్తు శంకరులేకదా మరి శంకరాచారులవారు ఊరుకుంటారా.  తల్లి నీవు చెప్పింది నిజమే కావచ్చు  ఆ సాద్విమణి ఏ పుణ్యము గత జన్మలో చేసి ఉండకపోవచ్చు.  మరి ఈ జన్మలో విషయం ఏమిటి తల్లీ అని అమ్మవారిని మరల వినమ్రుడై అడిగాడు.  ఈ జన్మలోకూడా ఆమె ఏ రకమైన దానం చేయలేదు అని లక్ష్మీదేవి  బదులిచ్చింది. అప్పుడు శంకరులవారు ఒక్కసారి ఆమె గుడిశ మొత్తం పరికించి చూడు తల్లీ అని వేడుకున్నాడు.  మొత్తం చూసిన మహాలక్షి ఏమున్నది నాయనా అని అన్నది.  తల్లీ నేను చెప్పేది కూడా అదే ఆ సాద్వీమణికి ఇవ్వటానికి ఏమిలేకపోయినా నాకు ఒక ఉసిరిక పండును దానం చేసింది తల్లీ మరి ఆ దానఫలితాన్ని ఇవ్వవా అని మరల వేడుకొన్నాడు. అప్పుడు శంకరుని తెలివికి మెచ్చుకొనిన లక్ష్మీ దేవి ఆ ఇంట బంగారపు ఉసిరికాయలను వర్షించిందట దానితో ఆ పేదరాలి పేదరికం అంతా మటుమాయం అయిపొయింది. 


ఆది శంకరులు లక్షి అమ్మవారిని ప్రసన్నురాలిగా చేసిన స్తోత్రం కనకధారా స్తోత్రముగా చాల ప్రసిద్ధి చెందింది.  ఈ స్తోత్రాన్ని భక్తితో రోజు పారాయణ చేసే భక్తులకు సిరి సంపదలు సమకూరుతాయని ప్రతీతి. త్రికరణ శుద్ధిగా అకుంఠిత దీక్షతో ఈ స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేస్తే తప్పకుండా ఆ మహాలక్షి ప్రత్యక్షం అవుతుంది కోరిన కోరికలు నెరవేరుతాయి అని అంటారు. .  


చూసారా సత్పురుషునికి చేసిన ఒక చిన్న దాన ఫలితంగా యెంత ఫలితం లభించిందో కదా.  కాబట్టి మనం ఎప్పుడూ సపాత్ర దానాన్ని చేయాలి. అంటే పాత్రనెఱిగి దానం చేయాలి.  దానం చేసేటప్పుడు దాన గ్రహీత మీరు చేసే దానానికి యోగ్యుడా కాదా అని నిర్ధారణ చేసుకొని మరి దానం చేయాలి. మీరు చేసిన దాన ద్రవ్యముతో దాన గ్రహీత ఏదైనా పాపపు కృత్యాలు చేస్తే మీకు దానఫలితంగా పుణ్య ఫలం రాకపోగా ఆ పాపంలో భాగం వస్తుంది. అంటే డబ్బులు ఇచ్చి మరి పాపాలను కొనుక్కోవటం అన్నమాట. 


మన పూర్వికులు అందుకేనేమో అన్నిదానాలలోకి అన్నదానం గొప్పది అని అన్నారు. అన్నదానం చేయటం  వలన రెండు విషయాలు అవగతం  అవుతాయి. ఒకటి అన్నం తిన్న దాన గ్రహీత ఇక నాకు చాలు అంటాడు అంటే అతను మీ దానంతో తృప్తి చెందుతాడు. కాబట్టి అతని తృప్తివలన మీకు దాని ఫలితంగా పుణ్యఫలం వస్తుంది.   ఇంకొక విషయం. మీరు పెట్టిన అన్నాన్ని మీ సమక్షంలోనే ఆరగిస్తాడు కాబట్టి ఎట్టి పరిస్థితిలో అన్న దానం వలన పాపం రాదు.  ఏదానానికైనా పాత్రను యెరిగి దానం చేయాలి కానీ అన్నదానానికి మాత్రం ఆకలితోవున్న ఎవ్వరికైనా చేయవచ్చు. పుణ్య ఫలితం ఒకేవిధంగా ఉంటుంది.  అన్నదానం కేవలం మనుస్యులకు మాత్రమే చేయాలనీ నియమం లేదు. పశుపక్ష్యాదులకు కూడా చేయవచ్చు. నిత్యం పక్షులకు అన్నం పెట్టె వారికి ఈ జన్మలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కటి జీవితం కలుగుతుంది. వారి పితృదేవతలు కూడా సంతోషిస్తారు.


కాబట్టి ప్రతివారు  ఇతర దానాలకన్నా అన్నదానమే శ్రేష్ఠము కావున అన్నదానాన్ని విరివిగా చేయటం శ్రేయస్కరం. . అన్నదానాన్ని ప్రోత్సహించండి. ఆలా అని రోజు ఒక్కరికే అన్నాన్ని పెట్టి మనుషులను ఏ పని పాట చేసుకొని సోమరులుగా తయారు చేయకూడదు.  


అన్నదానం తరువాత చెప్పుకోదగిన దానం విద్య దానం. ప్రతి విద్వంసుడు తాను సముపార్జించిన విద్యను పలువురికి దానం చేసి విద్యావంతులను చేయాలి.  విద్యావంతుడైన వాడు తన విద్యతో చక్కగా జీవితాంతం సంపాదించుకొని తానూ సుఖపడి పలువురిని సుఖపెట్టగలడు.  కాబట్టి విద్యాదానం చేయటం కూడా చాలా మంచి విషయం. 


ఓం తత్సత్ 


ఓం శాంతి శాంతి శాంతిః 


చేరువేల భార్గవ శర్మ

కార్తీకపురాణం - 15 వ అధ్యాయము*

 🌴🌹🪔🕉️🛕🕉️🪔🌹🌴

   🪷 _*బుధవారం*_🪷

🕉️ *నవంబర్ 5, 2025*🕉️


*కార్తీకపురాణం - 15 వ అధ్యాయము*


🕉🕉🕉🕉🕉🕉️🕉️🕉️

             

*దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మస్మృతితో నరరూపమందుట*

```

అంతట జనకమహారాజుతో వశిష్ఠమహాముని - “జనకా! కార్తీకమహాత్మ్యము గురించి యెంత వివరించిననూ పూర్తికానేరదు. కాని, మరియొక యితిహాసము తెలియ చెప్పెదను సావధానుడవై ఆలకింపుమ”ని ఇట్లు చెప్పెను..

          

“ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట, చేయుట, శివకేశవులవద్ద దీపారాధనను చేయుట, పురాణమును చదువుట, లేక, వినుట, సాయంత్రము దేవతాదర్శనము చేయలేనివారు కాలసూత్రమనెడి నరకమునబడి కొట్టుమిట్టాడుదురు. కార్తీకశుద్ద ద్వాదశీ దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగును.

            

శ్రీమన్నారాయణుని గంధపుష్ప అక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యములు యిచ్చిన యెడల, విశేషఫలము పొందగలరు. ఈ విధముగా నెలరోజులు విడువక చేసిన యెడల అట్టివారు దేవదుందుభులు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు.

          

నెలరోజులు చేయలేనివారు కార్తీకశుద్ద త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపమునుంచవలెను.

           

ఈ మహాకార్తీకములో ఆవుపాలు పితికినంతసేపు మాత్రము దీపముంచిన యెడల మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును. ఇతరులు వుంచిన దీపము యెగద్రోసి వృద్ధి చేసినయెడలను, లేక, ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టివారల సమస్త పాపములు హరించును. అందులకు ఒక కథ కలదు, వినుమని వశిష్ఠులవారు యిట్లు చెప్పుచున్నారు..

           

“సరస్వతీ నదీతీరమున శిధిలమైన దేవాలయ మొకటి కలదు. కర్మ నిష్ఠుడనే దయార్ద్రహృదయుడగు ఒక యోగిపుంగవుడు ఆ దేవాలయము వద్దకు వచ్చి కార్తీకమాసమంతయు అచటనే గడిపి పురాణ పఠనముజేయు తలంపురాగా ఆ పాడుబడియున్న దేవాలయమును శుభ్రముగా వూడ్చి, నీళ్లతో కడిగి, బొట్లుపెట్టి, ప్రక్క గ్రామమునకు వెళ్లి ప్రమిదలు తెచ్చి, దూదితో వత్తులుజేసి, పండ్రెండు దీపములుంచి, స్వామిని పూజించుచు, నిష్ఠతో పురాణము చదువుచుండెను. ఈ విధముగా కార్తీకమాసము ప్రారంభమునుండి చేయు చుండెను.

          

ఒకరోజున ఒక మూషికము ఆ దేవాలయములో ప్రవేశించి, నలుమూలలు వెదకి, తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయియున్న వత్తిని తినవలసినదేనని అనుకొని నోట కరచుకొని ప్రక్కనున్న దీపము వద్ద ఆగెను. నోటకరచియున్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తికూడా వెలిగి వెలుతురు వచ్చెను.

         

అది కార్తీకమాస మగుటవలనను, శివాలయములో ఆరిపోయిన వత్తి యీ యెలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపములో నిలబడెను.

             

ధ్యాన నిష్ఠలో వున్న యోగిపుంగవుడు తన కన్నులను తెరచిచూడగా, ప్రక్కనొక మానవుడు నిలబడి యుండుటను గమనించి “ఓయీ! నీవెవ్వడవు? ఎందుకిట్లు నిలబడియుంటివి?" అని ప్రశ్నించగా, 


“ఆర్యా! నేను మూషికమును, రాత్రి నేను ఆహారమును వెదుకుకొంటూ ఈ దేవాలయములోనికి ప్రవేశించి యిక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యివాసనలతో నుండి ఆరిపోయిన వత్తిని తినవలెనని దానిని నోటకరచి ప్రక్కనున్న దీపం చెంత నిలబడి వుండగ, నా అదృష్టము కొలదీ ఆ వత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మ మెత్తితిని.

         

కాని, ఓ మహానుభావా! నేను యెందుకీ మూషిక జన్మ మెత్తవలసివచ్చెనో దానికి గల కారణమేమిటో విశదీకరింపు"మని కోరెను.


అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్యదృష్టిచే సర్వము తెలుసుకొని, "ఓయీ! క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు. నిన్ను బాహ్లికుడని పిలిచెడివారు. నీవు జైనమత వంశానికి చెందిన వాడవు. నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయము చేస్తూ, ధనాశపరుడై దేవపూజలు, నిత్యకర్మలు మరచి, నీచుల సహవాసము వలన నిషిద్ధాన్నము తినుచు, మంచివారలను, యోగ్యులను నిందించుచు పరులచెంత స్వార్థచింత గలవాడై ఆడపిల్లలను అమ్మువృత్తిచేస్తూ, దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు,

సమస్త తినుబండారములను కడుచౌకగా కొని, తిరిగి వాటిని యెక్కువ ధరకు అమ్మి, అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక యితరులకు యివ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు.

మరణించిన తరువాత యెలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపమనుభవించుచుంతివి. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవైతివి. దానివలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది.

కాన, నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటియందు పాతిపెట్తిన ధనమును త్రవ్వి, ఆ ధనముతో దానధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షముపొందు"మని అతనికి నీతులు చెప్పి పంపించెను.```


*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యమందలి*


      *పదిహేనవ అధ్యాయము*  

      _*పదిహేనవ రోజు*_ 

 *పారాయణము సమాప్తం*


           🌷 *సేకరణ*🌷

      🌹🌷🌞🌞🌷🌹

              *న్యాయపతి*

           *నరసింహా రావు*

🙏🌹🍁🕉️🛕🕉️🍁🌹🙏

బుధవారం*🌷 *🪷05నవంబర్2025🪷* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

      🌷 *బుధవారం*🌷 

 *🪷05నవంబర్2025🪷*    

    *దృగ్గణిత పంచాంగం* 

              

          *ఈనాటి పర్వం*     

         *జ్వాలాతోరణం*

          *కార్తీక పౌర్ణమి* 


*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - శరదృతువు*

*కార్తీకమాసం - శుక్లపక్షం*


*తిథి  : పౌర్ణమి* ‌సా 06.48 వరకు ఉపరి *కృష్ణ పాడ్యమి*

*వారం    : బుధవారం* ( సౌమ్యవాసరే )

*నక్షత్రం  : అశ్విని* ఉ 09.40 వరకు ఉపరి *భరణి*

*యోగం : సిద్ధి* ఉ 11.28 వరకు ఉపరి *వ్యతీపాత*

*కరణం  : భద్ర* ఉ 08.44 *బవ* సా 06.48 ఉపరి 

 *బాలువ* (06) తె 04.51 ఆపైన *కౌలువ*


*సాధారణ శుభ సమయాలు:*

 *ఉ 09.00 - 10.00 సా 04.00 - 05.00*

అమృత కాలం  : *రా 02.23 - 03.47*

అభిజిత్ కాలం  : *ఈరోజు లేదు*

*వర్జ్యం    : ఉ 06.09 - 07.33 & సా 06.01 - 07.25*

*దుర్ముహూర్తం  : ప 11.28 - 12.14*

*రాహు కాలం   : ప 11.51 - 01.17*

గుళికకాళం      : *ఉ 10.25 - 11.51*

యమగండం    : *ఉ 07.33 - 08.59*

సూర్యరాశి : *తుల                        

చంద్రరాశి : *మేషం*

సూర్యోదయం :*ఉ 06.16*

సూర్యాస్తమయం :*సా 05.43*

*ప్రయాణశూల   : ఉత్తరం దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :*ఉ 06.06 - 08.24*

సంగవ కాలం         :     *08.24 - 10.42*

మధ్యాహ్న కాలం    :    *10.42 - 01.00*

అపరాహ్న కాలం    : *మ 01.00 - 03.18*

*ఆబ్ధికం తిధి         : కార్తీక పౌర్ణమి*

సాయంకాలం        :  *సా 03.18 - 05.35*

ప్రదోష కాలం         :  *సా 05.35 - 08.06*

రాత్రి కాలం           :*రా 08.06 - 11.26*

నిశీధి కాలం          :*రా 11.26 - 12.16*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.27 - 05.17*

******************************

        *🌷ప్రతినిత్యం🌷*

       *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🔯శ్రీ సరస్వతీ కవచం🔯*


*ఓం ఐం జిహ్వాగ్రవాసిన్యై* 

*స్వాహా మాం వారుణేఽవతు*


🌷 *ఓం సరస్వత్యై నమః* 🌷


🌷🪷🌹🛕🌹🌷🪷🌷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🪷🪷🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🪷🪷🍃🌷

    🌹🌷🪷🌷🌷🪷🌹

పదకొండు ఇంద్రియాలు

 పదకొండు ఇంద్రియాలు

సృష్టిలో మానవజన్మ ఎంతో క్లిష్టమైనది. అతడు పుట్టడంతోనే అతనిలో మమేకమై ఉన్నవి పదకొండు ఇంద్రియాలు. అవి లేకుంటే అతడు మనుగడ సాగించలేడు.


ఆ పదకొండులో....


1. అయిదు జ్ఞానేంద్రియాలు,

2. అయిదు కర్మేంద్రియాలు, మనసు ఉన్నాయి.


1.శ్రోత్రం (చెవి),

2.త్వక్‌ (చర్మం),

3.చక్షుషీ (కన్నులు),

4.జిహ్వా (నాలుక),

5.నాసికా (ముక్కు) అనేవి జ్ఞానేంద్రియాలైతే,


1.పాయు (మలద్వారం),

2.ఉపస్థ (మూత్రద్వారం),

3.హస్త (చేతులు),

4.పాద (కాళ్లు),

5.వాక్‌ (మాట) అనేవి కర్మేంద్రియాలు.

ఈ పదింటికి చివర మనసు.


ఇదీ ఇంద్రియ సమూహం.

ఈ పదకొండు ఇంద్రియాలు పదకొండు విధాలుగా మనిషిని కష్టపెడతాయి.

ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తాయి.

ఇంద్రియనిగ్రహం అనేది మనిషికి బతుకు సమస్య.

ఇంద్రియాలు గుర్రాల వంటివని, రథాన్ని నడిపే సారథి పగ్గాలను సమర్థంగా పట్టుకొని అదుపు చేయకపోతే గుర్రాలు ఇష్టం వచ్చిన దిక్కుకు ప్రయాణిస్తాయని, అప్పుడు ప్రమాదాలు సంభవిస్తాయని,

కనుక సారథి వంటి మనిషి ఇంద్రియాలు అనే గుర్రాల పగ్గాలు లాగి అదుపులో పెట్టుకోవాలని అంటాడు మనువు.


1.మనిషి సంయమనాన్ని కోల్పోతే చెవులు చెడు మాటలనే వింటాయి.

2.చర్మం పనికిరాని స్పర్శను కోరుతుంది.

3.కళ్లు అశ్లీలాన్ని చూస్తాయి.

4.నాలుక అనారోగ్యకరమైన రుచులను కోరుతుంది.

5.ముక్కు దుర్గంధాలనే స్వీకరిస్తుంది.

6.మల, మూత్రద్వారాలు పనిచేయకుండా పోతాయి.

7.కాళ్లూ చేతులూ హింసను ఆచరిస్తాయి.

8.మాట అదుపు తప్పుతుంది. ఇలా పది ఇంద్రియాలు చేసే నష్టం ఒక ఎత్తయితే,

9.మనసు అనే పదకొండో ఇంద్రియం చేసే నష్టం ఒక ఎత్తు.

అసలు పది ఇంద్రియాలను మంచిగాను, చెడుగాను మార్చేది మనసే.

మనసు చెప్పినట్లే ఇంద్రియాలు వింటాయి.

అందుకే వాల్మీకి- ‘ఇంద్రియాల సత్‌ప్రవర్తనకు, అసత్‌ప్రవర్తనకు మనసే మూలకారణం’ అని రామాయణ మహాకావ్యంలో అంటాడు.

చెడు వినకుండా, చెడు కనకుండా, చెడు అనకుండా, చెడు తినకుండా, చెడు ఆఘ్రాణించకుండా ఉండగలిగేవాడే జితేంద్రియుడని శాస్త్రాల ప్రబోధం.

ఇలా ఉండాలంటే మనిషి మొదట జ్ఞానవంతుడు కావాలి. జ్ఞానం లేని కర్మాచరణ పిచ్చివాడి చేతిలో రాయి వంటిదే.

అది ఎవరిమీదనైనా పడవచ్చు. నిప్పును తాకితే కాలుతుందని తెలిసిన జ్ఞాని, నిప్పును తాకడానికి సాహసించడు. 

ఆ విషయం తెలియని బాలుడు నిప్పును తాకి చేతులు కాల్చుకుంటాడు.

కనుక ఏ పనిచేసే సమయంలో అయినా ఆ పనికి సంబంధించిన జ్ఞానం అవసరం.

లేకుంటే ఇంద్రియాలు మనిషిని పక్కదారి పట్టిస్తాయి.

ఇంద్రియాలు అదుపులో ఉన్నంతవరకు మనిషి ఉజ్జ్వలంగా వెలిగిపోతాడు.

ఇంద్రియాల్లో ఏ ఒక్కటి అదుపుతప్పినా, అన్ని ఇంద్రియాలూ క్రమంగా పట్టుతప్పిపోతాయి.

పర్యవసానంగా మనిషిలోని ప్రజ్ఞ నశించిపోతుంది.

ప్రకృష్టమైన (విశిష్టమైన) జ్ఞానమే ప్రజ్ఞ. అంటే అన్నింటినీ చక్కగా గుర్తించే గుణం. 

అది ఉన్నంతకాలం మనిషి మెదడు అనే యంత్రం పనిచేస్తుంది.   

మెదడును చక్కగా ఉంచుకోవడానికి ‘ఆయుర్వేదం’ ఇలా మార్గోపదేశం చేస్తోంది-


’పరిశుద్ధమైన ఆహారాన్ని మాత్రమే ప్రతినిత్యం స్వీకరించాలి. అలా స్వచ్ఛమైన ఆహారాన్ని తినడంవల్ల ఇంద్రియాలన్నీ పటిష్ఠంగా ఉంటాయి. అవి దృఢంగా ఉన్నప్పుడే మెదడు బాగా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి వర్ధిల్లుతుంది’ 

ఇంద్రియాల వెనక ఉన్న ఇంతటి సాంద్రమైన విషయాన్ని మనిషి ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.

అందువల్ల జితేంద్రియుడు (ఇంద్రియాలను జయించినవాడు) కావాలో, ఇంద్రియజితుడు (ఇంద్రియాలతో ఓడిపోయినవాడు) కావాలో తేల్చుకోవలసింది మనిషే!