11, మే 2025, ఆదివారం

ధర్మము ధర్మమంచు మది ధర్మజుc డెంచుటదేమి ధర్మమో.*

 *ధర్మము ధర్మమంచు మది ధర్మజుc డెంచుటదేమి ధర్మమో.*

ఈ సమస్యకు నా పూరణ. 


*శ్రీకృష్ణరాయబారం సందర్భంలో దుర్యోధనుడు.*


కర్మము ముంచి వేసినది కౌరవ రాజ్యము భాగమెట్లగున్


ధర్మము మీరెరుంగనిదె ధర్మజు పందెము న్యాయమే గదా


ధర్మము ధర్మమంచు మది ధర్మజుc డెంచుటదేమి ధర్మమో


మర్మము లెన్ని జెప్పినను మానను యుద్ధము గెల్వజాలుదున్.


అల్వాల లక్ష్మణ మూర్తి.

మమతల కోవెల అమ్మ!

 *అంతర్జాతీయ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు*


శీర్షిక..మమతల కోవెల అమ్మ!


నవమాసాలు ఆశల కలల కౌగిలిలో నిను బంధించి.

కనురెప్పల మాటున కలకాలం నీడగా నేనున్నానంటూ,

లాలి జోలల్లో వొడి గుడిలో ప్రేమగా ఊయలలూపి.

తడబడు నడకల బుజ్జాయికి స్నేహంతో చేయందిస్తుంది.

వెన్నంటి నిస్వార్ధంగా కలకాలం ప్రేమిస్తుంది.


సృష్టికి సాక్షిగా పుట్టుకకు విథాతగా మనోధైర్యాన్ని అందిస్తుంది.

త్రిమూర్తుల కన్నతల్లిగా సుధామృతమును పంచుతుంది

ఆత్మీయానురాగాలతో నిను లాలిస్తుంది


సహనం శాంతం త్యాగం ప్రతీకగా హృదయం నిండుగా.

కష్టమైనా సుఖమైనా నిను వీడక, అండగా నిండుగ

జీవన సర్వస్వం క్రొవ్వొత్తిలా నిరతం కరిగిస్తుంది.

ప్రతి అడుగులో నీ వ్యక్తిత్వాన్ని దీటుగా నిలబెడుతుంది.


అపూర్వం అనంతం అమూల్యం,  

అమ్మ ప్రేమ

అమ్మ సామ్రాజ్యం.

మహిలో ఏ నిధితో తులతూగని దయా సముద్రం అమ్మ.

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

ఇది నా స్వీయ కవిత

రామాయణం

 🌹🌷🏹🪔🛕🪔🏹🌷🌹

*🌞ఆదివారం 11 మే 2025🌞*


           *రామాయణం*


ఒకసారి చదివినంత 

మాత్రాన మన సమస్త 

పాపాలని తీసేస్తుంది... ``


  *వాల్మీకి రామాయణం*

         *35వ భాగం*

                

అందరూ రాముడిని చేరుకోవడం కోసమని అయోధ్య నుంచి బయలుదేరారు. కాని, అందరి కంటే ముందు కైకేయి బయలుదేరింది. తాను ఎవరికోసమైతే ఈ పని చేసిందో, ఆ భరతుడే తనని కాదన్నప్పుడు ఆమెను ఆవహించిన మోహం పోయింది. తన తప్పుని తెలుసుకుంది. అలా కొన్ని లక్షల సైన్యంతో బయలుదేరి వాళ్ళు గంగా నదిని చేరుకున్నారు. అప్పుడు ఆ నిషాద రాజైన గుహుడు వాళ్ళని చూసేసరికి, ఒక పెద్ద సముద్రము వచ్చినట్టు, కోవిదార వృక్షము చిహ్నముగా ఉన్నటువంటి సైన్యం వచ్చి నిలబడింది.


అప్పుడు గుహుడు తన బంధువులని, సైన్యాన్ని, యువకులని పిలిచి… “భరతుడు ఇంత సైన్యంతో వచ్చాడంటే, కచ్చితంగా మనందరినీ చంపడం కోసమైనా వచ్చి ఉండాలి, లేదా 14 సంవత్సరాల తరువాత రాముడు తిరిగి వస్తే ఆయన పరాక్రమము ముందు నిలబడలేనని, ఇదే అదునుగా ఒక్కడే ఉన్న రాముడిని, లక్ష్మణుడిని సంహరించడం కోసమైనా వచ్చి ఉండాలి. రాముడు నాకు పరమ మిత్రుడు, ఆయనని మనం రక్షించుకోవాలి. ఇంత పెద్ద సైన్యాన్ని మనం ఎదిరించలేము, కాకపోతే మన సహాయం లేకుండా వీళ్ళు ఎవరూ గంగని దాటలేరు. అందుకని 500 పడవలని ఈ సైన్యం అంతా వెళ్ళడానికి సిద్ధం చెయ్యండి. మీరందరూ కూడా ఒక్కొక్క పడవలో 100 మంది చొప్పున కవచాలు కట్టుకొని, ఆయుధాలు పట్టుకొని నిలబడండి. నేను ఏమీ ఎరుగని వాడిలా భరతుడి దగ్గరికి వెళ్ళి, “నువ్వు రాముడిని కలుసుకోడానికి వెళుతున్నావా, రాముడిని సంహరించడానికి వెళుతున్నావా” అని అడుగుతాను. ఒకవేళ రాముడిని సంహరించడానికే భరతుడు వచ్చి ఉంటే, పడవలలో గంగని దాటిస్తామని చెప్పి, పడవ ఎక్కించి, గంగ మధ్యలో ముంచేద్దాము. ఒకవేళ రాముడిని కలుసుకోవడానికే భరతుడు వచ్చి ఉంటే, రాముడు ఎక్కడున్నాడో చెప్పి, వాళ్ళతో నేను కూడా వెళతాను” అన్నాడు.


అప్పుడాయన కొంత మాంసము, పుష్పములు, ధాన్యములు, కందమూలములు, తేనె పట్టుకొని భరతుడు విడిది చేసిన గృహం దగ్గరికి వెళ్ళాడు. గుహుడు రావడాన్ని చూసిన సుమంత్రుడు లోపలికి వెళ్ళి భరతుడితో “భరతా! నువ్వు రాముడు ఎక్కడున్నాడో అని వెతుకుతున్నావు కదా, రాముడు ఎక్కడున్నాడో గుహుడికి తెలుస్తుంది. రాముడికి గుహుడి మీద అపారమైన ప్రేమ, అలాగే గుహుడికి రాముడి మీద అపారమైన భక్తి!” అని చెప్పగానే భరతుడు గుహుడిని లోపలికి ప్రవేశపెట్టమన్నాడు.```


*యదా తుష్టః తు భరతః రామస్య ఇహ భవిష్యతి।*

*సా ఇయం స్వస్తిమయీ సేనా గంగాం అద్య తరిష్యతి॥*```


లోపలికి వెళ్ళిన గుహుడు తాను తీసుకువచ్చిన వాటిని అక్కడ పెట్టి “నువ్వు ఈ రాజ్యాన్ని దశరథ మహారాజుగారి వల్ల పొందావు, ఇంకా నీ తృప్తి తీరక రాముడిని చంపుదామని వచ్చావా, లేకపోతే రాముడిని కలుసుకుందామని వచ్చావా, నాకు మనస్సులో శంకగా ఉంది. నిజం చెప్పు భరతా, ఎందుకు వచ్చావు ఇక్కడికి” అని అడిగాడు.


అప్పుడు భరతుడు “నువ్వు అన్నమాట వలన నాకు బాధ కలిగినా, నీ అమాయకత్వం నాకు తెలుస్తోంది. నేను ఈ గంగ దాటి భారద్వాజ ఆశ్రమానికి వెళ్ళి, ఆ ఆశ్రమం దగ్గరలో ఉన్న రాముడిని కలుసుకోవాలని అనుకుంటున్నాను" అన్నాడు.


“సరే నువ్వు రాముడిని కలుసుకోవాలని వచ్చావు, మరి నీ వెనకాల ఇంత సైన్యం ఎందుకు వచ్చింది” అని గుహుడు భరతుడిని ప్రశ్నించాడు.


అప్పుడు భరతుడు ఆకాశమంత నిర్మలమైన మనసుతో… “ఒక తమ్ముడు ఒక అన్నగారిని రాజ్యం కోసం చంపేటటువంటి దురాలోచన ఎన్నడూ రాకుండుగాక, ఒక తమ్ముడు అన్నగారి గురించి ఎప్పుడన్నా ఆలోచిస్తే, అన్నగారి కాళ్ళుపట్టి నమస్కరించడానికి మాత్రమే ఆలోచించేటటువంటి సౌజన్యము నిలబడుగాక” అన్నాడు.


ఈ మాటలు విన్న గుహుడు… 

“ఇక్ష్వాకు వంశంలో పుట్టిన నీకే చెల్లిందయ్యా ఈ మాట చెప్పడం. నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ఇద్దరూ కలిస్తే, చూసి మురిసిపోవాలని ఉంది, దగ్గరుండి గంగని దాటించి నేను మీతో వస్తాను. రాముడు ఇక్కడే పడుకొని వెళ్ళాడు, నన్ను తన తల మీద మర్రి పాలు పోయమన్నాడు, జటలు ధరించి, నార వస్త్రాలు కట్టుకొని వెళ్ళాడయ్యా రాముడు” అని అన్నాడు. 


ఆ రాత్రి భరతుడు రాముడి గురించి ఆలోచిస్తూ, తన వల్ల రాముడు ఇన్ని కష్టాలు పడుతున్నాడని బాధపడుతూ ఉండడం వలన నిద్రపట్టక గుహుడిని పిలిచి, “నాకు రాముడి గురించి ఏదైనా చెప్పు!” అని అడిగాడు. 


అప్పుడా గుహుడు “రాముడు ఇక్కడికి వచ్చి ఇంగుది వృక్షం కింద కూర్చున్నాడు. అప్పుడు నేను ఆయనకి అన్నము, కందమూలాలు, తేనె మొదలైనవి తీసుకువెళ్ళాను, అప్పుడు రాముడు ‘నేను క్షత్రియుడిని, ఒకరికి మేము ఇవ్వాలి, ఇతరుల దగ్గర మేము తీసుకోకూడదు, మా తండ్రిగారికి ఇష్టమైన ఆ గుర్రాలకి కొంచెం దాణా పెట్టు. ఆ గంగ నుంచి కొన్ని నీళ్ళు తీసుకురా, అవి తాగి పడుకుంటానయ్యా' అన్నాడు. 


అప్పుడు నేను గంగ నుంచి కొన్ని నీళ్ళు తీసుకువచ్చి వాళ్ళకి ఇచ్చాను. సీతారాములు తాగగా మిగిలిన నీళ్ళని లక్ష్మణుడు కళ్ళకి అద్దుకొని తాగాడు. అప్పుడు నేను రాముడిని లోపల హంసతూలికా తల్పం మీద పడుకోమనగా, ఆయన, నేను ఇప్పుడు ఒక తాపసిలాగ బతకాలి అని చెప్పి, లక్ష్మణుడు తీసుకొచ్చిన దర్భగడ్డి మీద పడుకున్నాడు. 


రాముడు పడుకోయేముందు, లక్ష్మణుడు సీతారాముల పాదములు కడిగి, తడిగుడ్డతో తుడిచాడు. అప్పుడు సీతమ్మ రాముడి భుజాన్ని తలగడగా చేసుకొని పడుకుంది. నేను కాపలా కాస్తాను నువ్వు పడుకో లక్ష్మణా అంటే, ఆయన నన్ను, ఎలా పడుకోమంటావు గుహా ఇంత దారుణమైన దృశ్యం చూశాక, అని నీ తమ్ముడు లక్ష్మణుడు ఏడిచాడయ్యా. ఇదుగో ఈ గడ్డి మీదే సీతారాములు పడుకున్నారు” అని గుహుడు సీతారాములు పడుకున్న గడ్డిని భరతుడికి చూపించాడు.


అప్పుడు భరతుడు, సీతారాములు పడుకున్న ఆ గడ్డి దగ్గరికి వెళ్ళి చూడగా, ఒకవైపు గట్టిగా ఒత్తుకొని, గడ్డి భూమిలోకి నొక్కుకొని ఉంది. ఇది రాముడు పడుకున్న చోటని భరతుడు గ్రహించాడు.```


*మన్యే సాభరణా సుప్తా సీతా అస్మిన్ శయనే తదా।*

*తత్ర తత్ర హి దృశ్యంతే సక్తాః కనక బిందవః॥*```


అలాగే, సీతమ్మ పడుకున్న వైపు బంగారు రవ్వలు పడిఉన్నాయి. సీతమ్మ కట్టుకున్న పట్టుచీర కొంగు యొక్క దారములు ఆ గడ్డికి చుట్టుకొని ఉన్నాయి. ఎక్కడో రాజభవానాల్లో పడుకోవలసిన సీతారాములు, ఇంతమంది ఆటవికులు చూస్తుండగా గడ్డి మీద పడుకోవలసి వచ్చిందని, దీనికంతటికి తనే కారణమని భరతుడు నేలమీద పడి మూర్చపోయాడు.


తరువాత భరతుడు “ఈ క్షణం నుంచి 14 సంవత్సరాల పాటు నేను కూడా పట్టుబట్ట కట్టను. నార వస్త్రాలు కట్టుకుంటాను, జటలు ధరిస్తాను. నేను కూడా కందమూలములు, తేనె, తింటాను” అని ప్రతిజ్ఞ చేశాడు. 


వెంటనే నార వస్త్రాలు ధరించి, భరతుడు ఆ రాత్రికి రాముడు పడుకున్న చోటనే పక్కన భూమి మీద పడుకున్నాడు.


మరునాడు ఉదయం అందరూ గంగని దాటి ముందుకి బయల్దేరారు. అలా కొంత దూరం ప్రయాణించాక వారు భారద్వాజ ఆశ్రమాన్ని చేరుకున్నారు. 


అప్పుడు సైన్యాన్ని కొంత దూరంలో ఉంచి, భరత,శత్రుఘ్నులు వశిష్ఠుడితో కలిసి ఆ ఆశ్రమంలోకి ప్రవేశించారు. (ఒకసారి భారద్వాజుడు బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై ఏమి నీ కోరిక అని అడిగాడు. 


నాకు వేదం చదువుకోడానికి 100 సంవత్సరాల ఆయుర్దాయం కావాలని భారద్వాజుడు అడిగాడు, బ్రహ్మగారు సరే అన్నారు. అలా ఆయన బ్రహ్మగారి దగ్గర 3 సార్లు ఆయుర్దాయం పుచ్చుకున్నాడు. అలా 4వ సారి కూడా తపస్సు చెయ్యగా, బ్రహ్మగారు ప్రత్యక్షమై, వేదాలు ఎంత ఉంటాయో తెలుసా చూడు అని చూపిస్తే అవి పర్వతాల అంత ఎత్తు ఉన్నాయి. నువ్వు 300 సంవత్సరాల్లో చదివింది 3 గుప్పిళ్ళంత. వేదం అనంతం, దాన్ని ఎంతకాలం చదివినా అది తెలిసేది కాదు, పూర్తిగా చదవగలిగేది కాదు. అందుకని నువ్వు చదివినదానితో తృప్తిపడు’ అన్నారు బ్రహ్మగారు,

అలా బ్రహ్మగారిచే ఆయుర్దాయాన్ని పొందిన మహానుభావుడు భారద్వాజుడు).


ఎదురుగా వస్తున్న వశిష్ఠుడిని చూసి భారద్వాజుడు గబగబా వచ్చి అర్ఘ్య పాద్యములు ఇచ్చారు. తరువాత ఒకరిని ఒకరు కుశల ప్రశ్నలు అడిగారు. అప్పుడు భారద్వాజుడు, “నువ్వు ఈ అరణ్యానికి ఎందుకు వచ్చావు అని అడుగగా, నేను రామ దర్శనానికి వచ్చానని భరతుడు చెప్పాడు. (భారద్వాజుడు త్రికాలవేది, దశరథుడు మరణించాడని ఆయనకి తెలుసు) అప్పుడు భారద్వాజుడు “మీ తండ్రిగారు 14 సంవత్సరాలు రాముడిని అరణ్యాలకి పంపించి నీకు రాజ్యం ఇచ్చారు. ఆ రాజ్యాన్ని పరిపాలించుకునే స్థితిలో నువ్వు ఉన్నావు, అయినా కాని ఇంత సైన్యాన్ని తీసుకొని అరణ్యానికి వచ్చావు. మహా పాపకార్యమైన రామ హత్య కోసమని నువ్వు వచ్చావని నాకు మనసులో శంకగా ఉంది” అని అన్నాడు.```


*హతొ అస్మి యది మాం ఎవం భగవాన్ అపి మన్యతె ।*

*మత్తొ న దొషం ఆషంకెర్ న ఎవం మాం అనుషాధి హి ॥*```


ఈ మాటలు విన్న భరతుడు కన్నీరు కారుస్తూ… “మహానుభావా! నా దౌర్భాగ్యమయ్య, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను చూసి రాముడిని చంపడానికి వచ్చావా అంటారు. నేను రాముడిని చంపడానికి రాలేదు. నువ్వు అడిగిన ప్రశ్న చేత నేను చచ్చిపోయాను మహర్షీ. ఈ మాట గుహుడు అడిగాడంటే అర్థం చేసుకోవచ్చు, కాని ఇంత గొప్ప మహర్షులు మీరు కూడా ఈ మాట అన్నారంటే నేను బ్రతకడం ఎందుకు. నేను ఎన్నడూ రాజ్యం కావాలని, రాముడు అరణ్యవాసం చెయ్యాలని కోరలేదు, కాని నా మీద ఉన్న విపరీతమైన ప్రేమ చేత మా అమ్మ నేను లేనప్పుడు రెండు వరాలు అడిగింది. 

రాముడికి పట్టాభిషేకం చేయించాలని అరణ్యానికి వచ్చాను. నేను రాముడిని చంపేంత దుర్మార్గుడిని కాదు మహర్షీ” అని ఆయన పాదముల మీద పడి ఏడ్చాడు.


అప్పుడు భారద్వాజుడు “నువ్వు ఎటువంటివాడివో నాకు తెలుసు భరతా, నువ్వు ఇటువంటి దురాలోచనలు చెయ్యవని తెలుసు, అయినా నేను నిన్ను ఎందుకడిగానో తెలుసా. నీ శీలం ఎటువంటిదో లోకానికి చెప్పడం కోసమని నేను ఈ మాట అడిగాను. నువ్వు నీ మాటయందు నిలబడెదవు గాక” అని ఆశీర్వదించిన పిమ్మట “నాయనా! ఈ రాత్రికి నా ఆతిధ్యాన్ని స్వీకరించు” అన్నాడు.


అప్పుడు భరతుడు “మీరు నాకు అర్ఘ్యం, పాద్యం ఇచ్చారు, నాకు ఇంతకన్నా ఏమి కావాలి, నాకు ఏమీ వద్దు” అన్నాడు. 


“మరి నీ సైన్యాన్ని ఎక్కడ పెట్టావు అని భారద్వాజుడు అడుగగా, సైన్యాన్ని ఇక్కడికి తీసుకువస్తే ఆశ్రమం పాడవుతుందని వాళ్ళని దూరంగా పెట్టాను” అని భరతుడు అన్నాడు.


అప్పుడు భారద్వాజుడు “అంత దూరంగా ఎందుకు పెట్టావయా, ఇవాళ నేను ఆతిధ్యం ఇవ్వాలని అనుకుంటున్నాను, కావున నువ్వు నా ఆతిధ్యాన్ని తీసుకొని వెళ్ళాల్సిందే. నీ గుర్రాలకి, ఏనుగులకి, ఒంటెలకి, సైన్యానికి, పురోహితులకి, మంత్రులకి, నీ తల్లులకి ఎటువంటి ఆతిధ్యం ఇవ్వాలో అటువంటి ఆతిధ్యం ఇస్తాను” అన్నాడు.```


*ఆహ్వయె విష్వ కర్మాణం అహం త్వష్టారం ఎవ చ।*

*ఆతిథ్యం కర్తుం ఇగ్చ్ఛామి తత్ర మె సంవిధీయతాం॥

*ఆహ్వయె దెవ గంధర్వాన్ విష్వా వసు హహా హుహూన్।*

*తథైవ అప్సరసొ దెవీర్ గంధర్వీహ్ చ అపి సర్వషహ్ ॥*

*ఇహ మె భగవాన్ సొమొ విధత్తాం అన్నం ఉత్తమం।*

*భక్ష్యం భొజ్యం చ చొష్యం చ లెహ్యం చ వివిధం బహు ॥*

*తత్ర రాజ ఆసనం దివ్యం వ్యజనం చత్రం ఎవ చ ।*

*భరతొ మంత్రిభిహ్ సార్ధం అభ్యవర్తత రాజవత్ ॥*```


అప్పుడా భారద్వాజ మహర్షి ఆచమనం చేసి విశ్వకర్మని, త్వష్టని ప్రార్ధన చేసి.. “ఇక్కడికి రాజకుమారులైన భరత శత్రుఘ్నులు వచ్చారు, వారి వెనకాల సేనాబలం వచ్చింది. పురోహితులు, మహర్షులు వచ్చారు. వీళ్ళల్లో ఎవరెవరు ఎటువంటి భవనములలో నివసిస్తారో అటువంటి భవనములను ఓ విశ్వకర్మ! నువ్వు నిర్మించెదవుగాక." (రాజులు నివసించేవాటిని హర్మ్యములు, బాగా డబ్బున్నవాళ్ళు ఉండేవాటిని ప్రాసాదములు అని అంటారు)


విశ్వకర్మ ఉత్తరక్షణంలో ఎవరికి కావలసిన భవనాన్ని వాళ్ళకి నిర్మించాడు.

తరవాత ఆయన కుబేరుడిని, బ్రహ్మగారిని ప్రార్ధన చేసి “కుబేరా! నీ దగ్గర ఉన్న వేలమంది అప్సరసలని పంపించు, ఓ బ్రహ్మదేవా!, నీ దగ్గర ఉన్న అప్సరసలని కూడా పంపించాలి, వారితో పాటుగా నారదుడు, తుంబురుడు, హుహు అనే దేవగాయకులు రావాలి. అలాగే ఇక్కడ పాయసం ఏరులై ప్రవహించాలి. పులియ పెట్టిన పళ్ళనుంచి, పిండి నుంచి, బెల్లం నుంచి పుట్టిన కల్లు(సుర) ఇక్కడ నదులుగా ప్రవహించాలి. ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు తినడానికి కావలసిన వాటి ఆహారం గుట్టలు గుట్టలుగా పడిపోవాలి, పర్వతాలలా అన్నపురాసులు ఏర్పడాలి, వాటితో పాటు కూరలు, పచ్చళ్ళు, పులుసులు కావాలి. ఇవన్నీ తిన్నాక జీర్ణం అవ్వడానికి సొంఠి, లవంగం, ఇంగువ కలిగిన యవ్వనపు పెరుగు కావాలి. ఆకలి పుట్టించడానికి కొంచెం పుల్లగా ఉన్న పెరుగు కావాలి. అన్నంలో కలుపుకోడానికి కమ్మగా ఉన్న పెరుగు పుట్టాలి. వీటితో పాటు అందరూ మొహం కడుక్కోవడానికి చూర్ణములు(powder & paste ) కావాలి, వంటికి, జుట్టుకి రాసుకునే ఆమలకం(ఉసిరికాయలతో చేసిన ముద్ద), సున్నిపిండి, నూనె మొదలైనవి మంచి మంచి బంగారు పాత్రలలో కావాలి. కొన్ని వేల మంది అప్సరసలు వచ్చి, ఒక్కొక్క సైనికుడిని పీఠం మీద కూర్చోబెట్టి ఒళ్ళంతా నూనె రాసి, నలుగు పెట్టి స్నానం చేయించాలి. ఇక్కడున్న వాళ్ళలో బాగా గెడ్డాలు పెంచుకున్న ఋషులు, బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళు గెడ్డం దువ్వుకోడానికి మంచి దువ్వెనలు రావాలి. వీళ్ళు ఇవన్నీ తిన్నాక ఇంకా తినాలనిపిస్తే, తొందరగా జీర్ణం అవ్వడానికి ఔషదాలు కావాలి, అందుకని ఓ సోముడా!, చంద్రుడా! మీరు ఇవి సిద్ధం చెయ్యండి.


అప్సరసలు నాట్యం చెయ్యాలి, ఇప్పటికిప్పుడు ఇక్కడ పెద్ద పళ్ళతో వెలగ చెట్లు, పనస చెట్లు పుట్టాలి, ఎక్కడెక్కడినుంచో చిలుకలు రావాలి. కుబేరుడి రథమైన చైత్రరథం రావాలి, మామిడి చెట్లు పుట్టాలి, కుంకుడు చెట్లు పుట్టాలి, వీటితో పాటు ఎవరికి ఎంత వేడి కావాలో, అంత వేడితో నీళ్ళు పుట్టాలి, అందరికి కట్టుకోవడానికి బట్టలు, తొడుక్కోవడానికి చెప్పులు కావాలి. భరతుడి కోసం ఒక బ్రహ్మాండమైన హర్మ్యం ఏర్పడాలి” అని ప్రార్ధించాడు.


అప్పుడా గుర్రాలు, ఏనుగులు తమ జీవితంలో తిననటువంటి భోజనం చేశాయి. ఒక్కక్కడికి నలుగురు అప్సరసలు నలుగు పెట్టి స్నానం చేయించారు. భరతుడు తన మంత్రులతో కలిసి ఆ హర్మ్యంలోనికి ప్రవేశించాడు. అందులో ఒక పెద్ద వేదిక, దాని మీద కనకపు సింహాసనం, దాని మీద ఒక పెద్ద గొడుగు ఉన్నాయి. లోపలికి వెళ్ళిన భరతుడు ఆ సింహాసనం మీద రాముడు కూర్చున్నట్టు భావించి, కిందన ఉన్న పాదపీఠానికి తల తగిలేటట్టు నమస్కారం చేసి, చామరాన్ని ఒకసారి విసిరి, ఇవన్నీ రాముడికి చెందవలసినవి అని, మంత్రి కూర్చునే చోట కూర్చున్నాడు.


అప్పుడా సభలోకి రంభ మొదలైన వారు వచ్చి నాట్యం చేశారు, అలాగే నారదుడు, తుంబురుడు మొదలైన వారు వచ్చి పాటలు పాడారు. ఏదన్నా తాగడానికి ఉంటె బాగుండు అని భరతుడు అనుకున్నాడు, అంతే, వెంటనే అక్కడ ఒక పాయసపు నది ప్రవహించింది, అందరూ ఆ నది నుంచి ఎంత కావాలో అంత పాయసాన్ని బంగారు పాత్రలలో ముంచుకొని తాగారు. అందరూ అన్నిటినీ బాగా అనుభవించారు. సైనికులందరూ బాగా తినేసి, తాగేసి పడుకుంటే అప్సరసలు వచ్చి వాళ్ళ కాళ్ళు పట్టారు. అప్పుడా సైనికులు “మనం వెనక్కి అయోధ్యకి వెళ్ళద్దు, ముందు చిత్రకూట పర్వతాలకి వద్దు, ఇక్కడే భారద్వాజ ఆశ్రమంలో ఉండిపోదాము” అని సంతోషంతో కేకలు వేస్తున్నారు. ఏనుగులు, గుర్రాలు కూడా ఆనందపడ్డాయి. మరునాడు తెల్లవారే సరికి అన్నీ అదృశ్యమయిపోయాయి.


తరువాత భరతుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయ వచ్చి భారద్వాజ మహర్షి పాదాలకి నమస్కారం చేశారు. అప్పుడు భారద్వాజుడు భరతుడిని దగ్గరికి పిలిచి “వీళ్ళు ముగ్గురూ మీ అమ్మలు కదా, వీళ్ళల్లో ఎవరు ఎవరో నాకు చెప్తావా” అన్నాడు. 


అప్పుడు భరతుడు “సుమిత్ర చెయ్యి పట్టుకొని ఉన్న ఈ అమ్మ, సింహంలా నడవగలిగినవాడు, అదితి ధాతని కన్నట్టు రామచంద్రుడిని కన్నతల్లి, మా అమ్మ కౌసల్య. 

వీరులు, పరాక్రమవంతులైన లక్ష్మణ శత్రుఘ్నులను కన్నతల్లి ఈ సుమిత్ర.. రాముడు అరణ్యవాసానికి వెళ్ళడానికి కారణమైనది, కట్టుకున్న భర్త మరణించడానికి కారణమైన దుష్టచరిత్ర కలిగినటువంటిది, ఎప్పుడూ కోరికలు కోరుతూ, క్రోధంగా ఉండేటటువంటి ఈ కైకేయి నా తల్లి” అని అన్నాడు.```


*న దొషెణ అవగంతవ్యా కైకెయీ భరత త్వయా ।*

*రామ ప్రవ్రాజనం హ్య్ ఎతత్ సుఖ ఉదర్కం భవిష్యతి ॥*

*దెవానాం దానవానాం చ ఋ్ఇశీణాం భావితాత్మనాం।*

*హితమెవ భవిశ్యద్ధి రామప్రవ్రాజనాదిహ ॥*```


అప్పుడు భారద్వాజుడు “ఈవిడ రాముని యొక్క అరణ్యవాసమునకు కారణమైన మాట వాస్తవమే. కాని రాముడు అలా అరణ్యవాసానికి వెళితే తప్ప దేవతలకి, ఋషులకి రక్షణ అనేది కలగడం జరగదు. అలా రాముడు అరణ్యవాసానికి వెళ్ళేటట్టు దేవతలు కైకేయి చేత పలికించారు. అందుచేత నువ్వు ఇంక ఎన్నడూ కైక యందు దోషం పట్టకు” అన్నాడు. 


భారద్వాజుడి మాటలు విన్న భరతుడు “సరే మీరు చెప్పినట్టే ప్రవర్తిస్తాను, రాముడు ఎక్కడున్నాడో మీరు మాకు సెలవియ్యండి” అన్నాడు.


“అయితే నువ్వు ఇలా దక్షిణాభి ముఖంగా వెళ్ళి నైరుతికి తిరిగితే, అక్కడ ఒక ఇరుకైనటువంటి దారి వస్తుంది, అందులోనుంచి జాగ్రత్తగా ఏనుగుల్ని, గురాలని నడిపించుకుంటూ వెళ్ళితే, అక్కడ చిత్రకూట పర్వతం మీద, మందాకినీ నది పక్కన రాముడు ఆశ్రమాన్ని నిర్మించుకొని ఉన్నాడు” అని భారద్వాజ మహర్షి చెప్పారు. 


అందరూ భారద్వాజ మహర్షి చెప్పిన విధంగా రాముడిని చేరుకోవడానికి బయలుదేరారు. 


ఈలోగా ఆ చిత్రకూట పర్వతం దగ్గర రాముడు మందాకిని నది యొక్క ప్రవాహాన్ని సీతమ్మకి చూపిస్తూ 

“సీతా! నువ్వు లక్ష్మణుడు నాపక్కన ఉండగా, ఈ నదిలో స్నానం చేస్తూ, ఈ వనాలని, ఈ వనంలోని మృగాల అందాలని, ఇక్కడి పర్వతాల్ని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. నాకు అయోధ్య జ్ఞాపకం రావడం లేదు. 14 సంవత్సరాలు చిటికెలో గడిచిపోతాయి అనిపిస్తుంది” అన్నాడు.


అప్పుడు లక్ష్మణుడు, తాను వేటాడి తీసుకువచ్చిన జంతువు మాంసాన్ని కాల్చి రాముడికి తినమని ఇచ్చాడు. రాముడు దాన్ని తిని, “ఇది చాలా బాగుంది, సీతా నువ్వు కూడా తిను”అన్నాడు. 


అలా తాను తెచ్చిన మాంసాన్ని సీతారాములు భుజిస్తుండగా, చూస్తున్న లక్ష్మణుడు పొంగిపోయాడు. అన్నావదినలని సంతోష పెట్టానని, వాళ్ళు పొందుతున్న ఆనందాన్ని చూసి తాను ఆనందపడ్డాడు. 


రాముడి దర్శనం చేసుకోవాలని భరతుడు వేగంగా ముందుకి వెళుతున్నాడు. 


అప్పుడు ఆయనకి కొంత దూరంలో పొగ కనిపించింది, అలాగే చెట్లకి గుడ్డలు కట్టి ఉన్నాయి. లక్ష్మణుడు రాత్రి పూట మందాకిని నుంచి నీరు తెచ్చేటప్పుడు దారి మరిచిపోకుండా ఉండడానికి ఇలా చెట్లకి గుడ్డలు కట్టడాని భరతుడు గ్రహించాడు. ఇంక రాముడు ఎంతో దూరంలో లేడని భరతుడు ఆ ఆశ్రమం వైపు వేగంగా పరుగులు తీశాడు.


*రేపు...36వ భాగం*


*🚩జై శ్రీరామ్.! జై శ్రీ రామ్.!🚩*                           

       *🙏జై జై శ్రీ రామ్.!🙏*


                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏

ఆదివారం🌞* *🌹11 మే 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       *🌞ఆదివారం🌞*

    *🌹11 మే 2025🌹*

    *దృగ్గణిత పంచాంగం* 

                

*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - వసంత ఋతౌః*

*వైశాఖ మాసం - శుక్లపక్షం*


        *ఈనాటి పర్వం*

  *శ్రీ నృసింహ జయంతి*      

     *నిజకర్తరి ప్రారంభం*


*తిథి      : చతుర్దశి* రా 08.01 వరకు ఉపరి *పౌర్ణమి*

*వారం    : ఆదివారం* ( భానువాసరే )

*నక్షత్రం   : స్వాతి* పూర్తిగా రోజంతా *రాత్రితో సహా*


*యోగం : వ్యతీపాత* రా 05.01 తె వరకు ఉపరి *వరీయాన్* 

*కరణం   : గరజి* సా 06.46 *వణజి* 08.01 ఉపరి *భద్ర*


*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 06.00 - 09.30 మ 02.00 - 04.30*

అమృత కాలం  : *రా 08.22 - 10.10*

అభిజిత్ కాలం  : *ప 11.38 - 12.30*

*వర్జ్యం            : ఉ 09.34 - 11.22*

*దుర్ముహూర్తం  : సా 04.47 - 05.38*

*రాహు కాలం    : సా 04.53 - 06.30*

గుళికకాళం       : *మ 03.17 - 04.53*

యమగండం     : *మ 12.04 - 01.40*

సూర్యరాశి : *మేషం*

చంద్రరాశి : *తుల*

సూర్యోదయం :*ఉ 05.46*

సూర్యాస్తమయం :*సా 06.40*

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.38 - 08.12*

సంగవకాలం         :*08.12 - 10.47*

మధ్యాహ్న కాలం    :     *10.47 - 01.21*

అపరాహ్న కాలం    : *మ 01.21 - 03.55*


*ఆబ్ధికం తిధి         : వైశాఖ శుద్ధ చతుర్దశి*

సాయంకాలం      :*సా03.55 - 06.30*

ప్రదోష కాలం         :  *సా 06.30 - 08.43*

రాత్రి కాలం           :*రా 08.43 - 11.41*

నిశీధి కాలం          :*రా 11.41 - 12.26*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.09 - 04.53*

--------------------------------------------------

         *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🌞శ్రీ సూర్య చంద్ర కళా స్తోత్రం*🌝


*శనితారేయజనకౌ వార్ధిశోషకతోషకౌ |*

*వృష్టిసస్యాకరకరౌ సూర్యచంద్రౌ గతిర్మమ ||*


🙏 *ఓం నమో సూర్యాదేవాయ నమః* 

          

🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>

         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌞🌞🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌞🌞🍃🌷

 🌹🌷🌞🌞🌞🌞🌷🌹

భగవద్గీత ను అర్ధం చేసుకోవలసిందే

 


శ్రీభారత్ వీక్షకులకు శుభాకాంక్షలు 🌹ఈ ప్రపంచంలో అత్యున్నతమైన వ్యక్తిత్వ వికాస గ్రంథం భగవద్గీత ఒక్కటే. మనిషి జీవితానికి అది ఒక గైడ్. జీవిత ధర్మాన్ని తెలుసుకోవాలంటే భగవద్గీత ను అర్ధం చేసుకోవలసిందే.. అంటున్నారు యువ సాధకుడైన సునీల్ కుమార్ ఆకెళ్ల. ఆయన దర్శించిన ' గీత' ను అందరికీ చూపుతున్నారు. వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

కుచేలోపాఖ్యానం

 🙏శ్రీ మహాభాగవతము 🙏

కుచేలోపాఖ్యానం

మొదటి భాగం

సంక్షిప్త కథ ముందు చదవండి.తరువాత భాగములలో పద్యాలు వ్రాస్తాను.


చిన్నప్పుడు గురుకులంలో ఉంటూన్నప్పుడు కృష్ణుడు కుచేలుడనే బ్రాహ్మణకుమారునితో మంచి స్నేహం చేసుకున్నాడు. ఆ తరువాత కృష్ణుడు ద్వారకలో, కుచేలుడు తన పల్లెలోనూ పెరిగి పెద్దయారు. కుచేలుడు నిజమైన బ్రాహ్మణుడిలా ధనార్జన మీద ఆశ లేకుండా, పరమ భాగవతోత్తముడిగా గృహస్థాశ్రమం సాగించుకుంటున్నాడు. అతని భార్య ఉత్తమురాలు. పతికి అన్నివిధాలా అనుకూలంగా నడుచుకుని బ్రతుకుతోంది.


ఆ దంపతులు యెంతో దారిద్ర్యం అనుభవిస్తూ, చివరికి బ్రతుకే కటకటలాడవస్తే, పాపం, ఆ యిల్లాలు ఒకనాడు భర్తతో, "మీరెప్పుడూ మీ మిత్రుడు కృష్ణుని గురించి చెపుతూ ఉంటారే? అతనో గొప్ప ప్రభువు కదా? ఐశ్వర్యవంతుడు. అతనిని అడిగితే, కాదనక తప్పక సహాయం చేయగలడు. దానితో మన దారిద్ర్యబాధ తీరి కాస్త సుఖంగా ఆకలన్నది యెరుగకుండా జీవిస్తాం. ఆయనని వెళ్లి కలుసుకోరాదూ?" అని యెంతో దీనంగా వేడుకుంది. కుచేలుడు తనలో, "ధనమేమి దొరకక పోయినా, యీ నెపంతో నైనా చాలాకాలం తరువాత నా స్నేహితుడిని చూసి ఆనందించే అవకాశం లభిస్తుంది" అని ఆలోచించి, "సరే్, అలాగే" అన్నాడు.


ద్వారకకి వెళ్దామని సిద్ధమవుతూ, "నా నేస్తానికి తీసుకు వెళ్లడానికి మనయింట్లో యేమైనా ఉందా?" అని కుచేలుడు భార్యని అడిగాడు. ఆమె, ఆ రోజునే యాచించి తీసుకువచ్చిన అటుకులు నాలుగు పిడికెళ్లు, కుచేలుని అంగవస్త్రంలో ముడికట్టింది.


సంతోషంగా ద్వారక యెప్పుడు వస్తుందా, యెప్పుడు నేస్తాన్ని చూస్తానా అని కుచేలుడు అడుగులు వేసాడు.


ద్వారకలో మూడు ప్రహారీగోడలు దాటి కృష్ణుడు తన భార్యలకి నిర్మించిన భవనాల దగ్గరకు వెళ్లి, కుచేలుడు అందులోని ఒక భవనంలోకి ప్రవేశించాడు. అది రుక్మిణి భవనం.


దూరం నుంచి తన స్నేహితుని చూసి కృష్ణుడు లేచి, రెండు చేతులూ ముందుకు చాచి వెళ్లి, కుచేలుని కౌగిలించుకున్నాడు. కుచేలుడిని లోనికి తీసుకుపోయి, ఆసనమిచ్చి, దీపధూపాలతో నివాళించి సాదరంగా స్వాగతం పలికాడు.


కుచేలుడు, చిక్కి శల్యంలా మురికిగుడ్డలతో చూడ బిచ్చగాడిలా ఉన్నాడు. అతనికీ, ముల్లోకాలకు అధిపతి అయిన కృష్ణునికీ యేమంత స్నేహం అని అంతఃపురవాసులంతా ఆశ్చర్యపొయారు.


కుశల ప్రశ్నలయాక, చిన్ననాటి గురుకులం కబుర్లు చెప్పుకుంటూ ఆ యిద్దరు మిత్రులూ మురిసిపోయారు. కొంచెం సేపయాక నవ్వుతూ, "మిత్రమా, నాకోసం యేం తెచ్చేవేమిటి?" అని కృష్ణుడు కుచేలుని అడిగాడు. కుచేలుడు అటుకులమూట పట్టుకుని, 'ఇంతటి ఐశ్వర్యవంతుడి కిదే నే తేగలిగేను" అని సిగ్గుతో తలవంచుకున్నాడు. అది చూసి కృష్ణుడు, ఆ అటుకులమూటని తీసుకుంటూ, "భక్తితో నాకు పత్రమర్పించినా చాలు. అని ఆ మూట విప్పి, రుక్మిణితో, "చూసేవా, ఎంత ఆప్యాయంగా నాకిష్టమని అటుకులు తీసుకొచ్చాడు " అని చెప్తూ, అందులోంచి ఓ పిడికేడు అటుకులు నోట్లో వేసుకున్నాడు. బాగున్నాయని తల ఆడించి, మరొ పిడికెడు వేసుకోబోయాడు తన నోట్లో. అప్పుడు రుక్మిణి, "ఒక్క పిడికెడు నీకిచ్చినందుకే నీ మిత్రుడికి యిహంలోనూ, పరంలోనూ సకలసంపదలూ కలుగుతాయి. చాలు" అని మరి వద్దని కృష్ణుడికి చెప్పగా, సరే అని ఊరుకున్నాడు. ఆ రాత్రికి కృష్ణుని మందిరంలో సంతుష్టిగా భోజనం చేసి స్వర్గసుఖం పొందినట్లు హయిగా మెత్తని పరుపుల మీద కుచేలుడు నిదురించాడు. తెల్లవారగానే కుచేలుడు సెలవు తీసుకుంటానంటే, అతనితో కృష్ణుడు కొంతవరకూ వెళ్లి సాగనంపేడు.


ఇంటికి వస్తూ, తోవలో, "అరెరే, అ పరమసంతోషంలో మా ఆవిడ మరీమరీ చెప్పినది కృష్ణుని ధనం అడుగనే లేదు. ఐనా, ఎలా నోరు విప్పి, నాకేమైనా సర్దిపెట్టు అని అడుగను? ఆ మహాత్ముని చూడగలిగిన భాగ్యమే చాలు. ఎందరు నోచుకోగలరు అ భాగ్యానికి?" అని తృప్తిగా అడుగులు వేసాడు.


ఇంటి దరిదాపులకి చేరుకున్నాక, అక్కడ అంతా కొత్తగా కనిపించింది. అంత పెద్ద భవనం తన పల్లెలో యెన్నడూ చూడనే లేదు. ఆశ్చర్యంగా అలా కళ్లప్పగిస్తూ, వస్తూండగా నౌకరులు ముందుకు వచ్చి, " దయచేయండి స్వామీ" అని ఆ భవనంలోకి కుచేలుని తీసుకునిపోయారు. లోనికి వెళ్లగానే, ఆభరణాలతో అలంకరించుకుని అతని భార్య యెదురై, "స్వామీ! దయచేయండి" అని రత్నమాణిక్యాలతో దేదీప్యమానంగా వెలుగుతూన్న ఆ ఐశ్వర్య నిలయం లోనికి తీసుకుని వెళ్లింది. కాస్త తేరుకున్నాక కుచేలుడికి అదంతా ఆ కృష్ణపరమాత్ముని అనుగ్రహమే అని అర్థమయింది. అడుగకపోయినా యిచ్చే ఆ దాతకి, చిన్ననాడెంతో సఖ్యంగా ఉండేవాడో, అంతకంటే యెక్కువ మక్కువతో ఆదరించిన తన స్నేహితునికీ, కుచేలుడు నమస్కరించాడు.


కృష్ణుడు ప్రసాదించిన ఐహికభోగభాగ్యాలని అనుభవిస్తున్నా, వాటియందు మోహమే లెకుండా, నిరంతరమైన భక్తితో కృష్ణుని మొక్కుతూ, కుచేలుడు తన జీవితమంతా గడిపాడు. ఆ తరువాత దేవదేవుని పరమపదం చేరుకున్నాడు.

ఇందు ముఖ్యమైన పద్యరాజము వ్రాస్తున్నాను చక్కగా చదవండి 


ఇందీవర శ్యాము వందిత సుత్రాముఁ


గరుణాల వాలు భాసురకపోలుఁ


గౌస్తుభాలంకారుఁ గామిత మందారు


సురుచిర లావణ్యు సురశరణ్యు


హర్యక్షనిభ మధ్యు నఖిల లోకారాధ్యు


ఘన చక్రహస్తు జగత్ర్పశస్తు


ఖగకులాధిపయానుఁ గౌశేయ పరిధానుఁ


బన్నగశయను నబ్జాతనయను


మకరకుండల సద్బూషు మంజు భాషు


నిరుప మాకారు దుగ్ధసాగర విహరు


భూతి గుణసాంద్రు యదు కులాంబోధి చంద్రు


విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణుఁ గృష్ణు


ఇందీవర = నల్లకలువల వంటి; శ్యామున్ = నల్లనిఛాయకలవాడు; వందిత = నమస్కరించిన; సుత్రామున్ = ఇంద్రుడు కలవానిని; కరుణాల = దయలకు; వాలున్ = పాదు ఐనవానిని; భాసుర = ప్రకాశించునట్టి; కపోలున్ = చెక్కిళ్ళు కలవానిని; కౌస్తుభ = కౌస్తుభమణి; అలంకారున్ = అలంకారముకలవానిని; కామిత = కోరినవారికి; మందారున్ = కల్పవృక్షమైన వానిని; సు = మంచి; రుచిర = కాంతివంతమైన; లావణ్యున్ = లావణ్యము కలవానిని; సుర = దేవతలకు; శరణ్యున్ = రక్షకముగా ఉండువాడు; హర్యక్షము = సింహము {హర్యక్షము - పచ్చకన్నుల మృగము, సింహము}; నిభ = వంటి; మధ్యున్ = నడుము కలవానిని; అఖిల = సర్వ; లోకా = లోకములకు; ఆరాధ్యున్ = ఆరాధింపబడువాడు; ఘన = గొప్ప; చక్ర = చక్రమును; హస్తున్ = చేతియందు కలవానిని; జగత్ = విశ్వముచేత; ప్రశస్తున్ = స్తుతింపబడువానిని; ఖగకులాధిప = గరుడ; యాను = వాహనముగా కలవానిని; కౌశేయ = పట్టు; పరిధానున్ = బట్టలుకట్టుకొన్నవానిని; పన్నగ = ఆదిశేషునిపై; శయనున్ = పరుండువానిని; అబ్జాతనయనున్ = పద్మాక్షుని;

మకరకుండల = మొసలికుండలములు; సత్ = చక్కటి; భూషున్ = ఆభరణములుకలవానిని; మంజు = మనోజ్ఞమైన; భాషున్ = మాట్లాడువానిని; నిరుపమ = సాటిలోని; ఆకారున్ = స్వరూపము కలవానిని; దుగ్దసాగర = పాలసముద్రము నందు; విహారున్ = మెలగువానిని; భూరి = గొప్పవైన; గుణ = గుణములు; సాంద్రున్ = దట్టముగా కలవానిని; యదు = యదువు యొక్క; కుల = వంశము అను; అంభోధిన్ = సముద్రమునకు; చంద్రున్ = చంద్రుడైనవానిని; విష్ణున్ = సర్వవ్యాపకశీలుని; రోచిష్ణున్ = ప్రకాశించుశీలుని; జిష్ణున్ = జయించుశీలుని; సహిష్ణున్ = సహనశీలుని; కృష్ణున్ = కృష్ణుని.( చూచెను )


సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం - వసంత ఋతువు - వైశాఖ మాసం - శుక్ల పక్షం - చతుర్దశి - స్వాతి -‌‌ భాను వాసరే* (11.05.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

తిరుమల సర్వస్వం 235-*

 *తిరుమల సర్వస్వం 235-*

 *పద్మావతిదేవి పూర్వజన్మ వృత్తాంత-1* 

‌ *శిలాతోరణం* 


 తిరుమల క్షేత్రంలో శ్రీమహావిష్ణువుతో ప్రగాఢ అనుబంధం ఉన్న పౌరాణిక అవశేషాలలో ముఖ్యమైనది 'శిలాతోరణం'. దీనినొక భౌగోళిక అద్భుతంగా కూడా పరిగణించవచ్చు.


 ప్రధానాలయానికి ఉత్తరదిశగా, వేదపాఠశాలకు నెలవై ఉన్న 'ధర్మగిరి' అనే ప్రాంతానికి వెళ్ళే మార్గంలో తిరుమల లోని ముఖ్యమైన తీర్థాలలో ఒకటైన 'చక్రతీర్థం' ఉందని ఇంతకు మునుపే తెలుసుకున్నాం. దీనికి అత్యంత సమీపంలో 'ఈ 'శిలాతోరణం' ప్రకృతిసిద్ధంగా ఏర్పడింది. ఇక్కడ చూడ చక్కనైన ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసి, ఆ ప్రాంతాన్ని 'శిలాతోరణం ఉద్యానవన సముదాయం' పేరుతో ప్రముఖ పర్యాటక స్థలంగా తీర్చిదిద్దారు.


 1980 వ సంవత్సరంలో ఈ ప్రదేశంలో త్రవ్వకాలు జరుపు తున్నప్పుడు అప్పటివరకు రాతి పొరల్లో నిక్షిప్తమై ఉన్న ఈ 'శిలాతోరణం' వెలుగు చూసింది. తరువాతి కాలంలో ఇది జాతీయ స్మారకచిహ్నంగా గుర్తించ బడింది. దీనిని కోట్లాది సంవత్సరాల క్రితంనాటి ప్రోటోజాయిక్ కాలానికి చెందిన భౌగోళిక అవశేషంగా భూగర్భ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అంతే గాకుండా ఆ సమయంలో ఈ ప్రాంతంలో ఉన్న బండరాతి శిలలు అతి తీవ్రమైన నీటికోతకు గురవ్వడంతో ఈ ఆకార మేర్పడినట్లు కూడా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. మనం అప్పుడప్పుడు వినేటట్లు యుగాంతంలో సమున్నతమైన శేషాచలశిఖరాలు సైతం సాగరగర్భంలో మునిగి పోతాయన్న సత్యాన్ని శిలాతోరణం ఉనికి మరియు దాని ఆవిర్భావం నిర్ధారిస్తున్నాయన్న మాట.


 భౌగోళిక, నైసర్గిక పరిణామ క్రమాల్ని అలా ఉంచితే, దీనికి విశేషమైన పౌరాణిక ప్రాశస్త్యం కూడా ఉంది.

3  శ్రీమహావిష్ణువు శ్రీమహాలక్ష్మి జాడకోసం ప్రప్రథమంగా వైకుంఠం నుండి భూలోకానికి వేంచేసినప్పుడు తన మొదటి అడుగును నారాయణగిరి పర్వతశిఖరంపై, నేడు 'శ్రీవారి పాదాలు'గా చెప్పుకునే ప్రాంతంలో మోపాడని ఇంతకుముందే తెలుసుకున్నాం. అక్కడి నుండి ఈ 'శిలాతోరణం' ద్వారా వెళ్ళి, ఇప్పుడు ఆనందనిలయం ఉన్న ప్రాంతానికి చేరుకున్నాడని భక్తుల విశ్వాసం. మూలవిరాట్టు ఎత్తు మరియు శిలాతోరణం ఎత్తు కూడా ఇంచుమించు సరిసమానంగా ఉండటం ఈ నమ్మకాన్ని ధృవపరుస్తుంది.


 శ్రీనివాసుడు ఈ ప్రాంతంలో రెండవ అడుగును, ఇప్పుడు మూలవిరాట్టు కొలువై ఉన్న ప్రాంతంలో మూడవ అడుగును మోపాడని కూడా మరి కొందరు భావిస్తారు.


 ఈ శిలాతోరణంపై స్వామివారి ఆయుధాలైన శంఖువు, సుదర్శనచక్రం, కటి-వరదహస్తాలు, స్వామివారికి అత్యంత ఆప్తుడు మరియు వాహనము అయిన గరుత్మంతుని రూపం మొదలైనవి సహజసిద్ధంగా ఏర్పడి ఉండటంతో ఈ శిలాతోరణానికి, శ్రీవారికి అనుబంధం ఉన్నదనే విశ్వాసం మరింత బలోపేత మవుతుంది.


 ఇన్ని విశేషాల సమాహారమైన 'శిలాతోరణం' తిరుమలక్షేత్రంలో తప్పనిసరిగా చూడవలసిన యాత్రాస్థలమనడంలో అతిశయోక్తి లేదు. 


[ రేపటి భాగంలో ... *ద్వాదశ ఆళ్వారులు* గురించి తెలుసుకుందాం]

*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*కర్ణ పర్వము ప్రథమాశ్వాసము*


*373 వ రోజు*


*కర్ణుడు శల్యుని తనకు సారధిని చెయ్యమని అడుగుట*


కర్ణుడు " సుయోధనా ! ఈ రోజు నుండి యుద్ధము నాకు అర్జునుడికి మధ్య మాత్రమే జరుగుతుంది. అర్జునుడిని చంపడమే నా లక్ష్యము. నా వద్ద ఇంద్ర శక్తి లేదని అర్జునుడు తప్పక విజృంభిస్తాడు. కనుక మనం అర్జునుడిని చంపుటకు ఉపాయం ఆలోచించాలి. నా వద్ద ఉన్న అస్త్రములు అర్జునుడి వద్ద ఉన్న అస్త్రములు సమానమే. యుద్ధములో చురుకుగా కదలడంలో అర్జునుడి కన్నా నేనే మిన్న. అర్జునుడికి గాండీవం ఉంది. నా వద్ద లేదు. పూర్వము విశ్వకర్మ,అ ఇంద్రుడికి ఒక అస్త్రము తయారు చేసి ఇచ్చాడు. దానితో ఇంద్రుడు అసురసంహారం చేసాడు. ఇంద్రుడు దానిని పరశురాముడికి ఇచ్చాడు. నా మీద కలిగిన వాత్సల్యంతో నా గురువైన పరశురాముడు దానిని నాకు నాకు ఇచ్చాడు. ఆ మహనీయచాపంతో నేను ఈ రోజు అర్జుడిని చంపి యుద్ధము పూర్తి చేసి నీకు కురుసామ్రాజ్యాన్ని కట్టబెడతాను. ఇక అర్జునుడికి ఎన్నటికీ మరణించని హయములు, అపూర్వమైన రధము, అక్షయ తుణీరములు ఉన్నాయి. వాటి గురించి నాకు భయము లేదు నా వెంట అనేక ఆయుధములున్న శకటములు ఉంటాయి. నిరంతరము నాకు ఆయుధములు అందుతూ ఉంటాయి కనుక అక్షయతుణీరముకు సమానమే. అనేక మేలు జాతి అశ్వములు నా వెంట ఉంటాయి కనుక అశ్వములు పడి పోగానే వేరు వాటిని సమ కూర్చుకుంటాను. అలాగే అనేక రధములు నా వెంట ఉంటాయి కనుక రధము విరిగిన వేరు రధమును ఏర్పరచు కొనగలను. అర్జుడికి కృష్ణుడి సారధ్యము ఉంది. నాకు అతడికి ధీటైన సారధి కావాలి. మధ్రదేశాధిపతి శల్యుడు అందుకు తగిన వాడు. అతడికి అశ్వహృదయం తెలుసు. రధము నడపడంలో కృష్ణుడికంటే నేర్పరి. కనుక నీవు అతడిని నాకు సారధిని చేయాలి. సుయోధనుడు " కర్ణా ! అదెంత పని. నేను ఇప్పుడే మధ్ర దేశాధిపతిని ఒప్పించి నీకు సారథిని చేస్తాను. నీ వెంట అనేక శకటములు ఆయుధములతో నడుస్తాయి. శతాధిక రథములు, అనేక అశ్వములు నీ వెంట ఉంటాయి. రా మనం శల్యుని వద్దకు పోతాము " అన్నాడు.


*శల్యుని కర్ణుడికి సారధ్యం వహించమని కోరుట*


సుయోధనుడు శల్యునికి నమస్కరించి " మీరు మాకు పెద్దలు నిత్యసత్యవ్రతులు, పూజ్యులు కనుక నేను మిమ్ము అధికంగా గౌరవిస్తాను. ఇందరి మధ్య నేను మిమ్ము ఒక కోరిక అడుగుతున్నాను కాదనకుండా తీర్చండి. ఇతడు కర్ణుడు, నా మిత్రుడు, మన స్వర్వసైన్యాధ్యక్షుడు, అర్జునుడిని సంహారముకు దీక్షాబద్ధుడు, అర్జునుడి సారథి కృష్ణుడు, కృష్ణుడికి దీటుగా సారథ్యం చేయగల సామర్ధ్యం మీకే ఉంది. భీష్మ ద్రోణులు చని పోయిన తరువాత నేను నిన్ను, కర్ణుడిని నమ్మి యుద్ధము చేస్తున్నాను. మీరు కర్ణుడికి సారథ్యం వహిస్తేనే అతడు అర్జునుడిని వధించ కలడు " అన్నాడు. ఆ మాటలకు శల్యుడు కోపంతో ఊగిపోతూ " సుయోధనా ! నేనెవరో తెలిసీ నన్ను ఇలాంటి నీచపు కోరిక అడుగుతావా ! నీకు వర్ణాశ్రమ ధర్మాలు తెలువవా ! మద్రదేశాధిపతిని, సుక్షత్రియుని నన్ను ఒక సూతునికి సారథ్యం వహించి అతడిని సేవించమని అడుగుతావా! నేను ఒక సూతకుల సంజాతునికి సారథిగా ఉండలేను. నేను నీకు సాయం చేయ వచ్చాను. నువ్వు ఎవరితో యుద్ధం చేయమంటే వారితో యుద్ధం చేసి శత్రు సంహారం చేస్తాను. అందరిని ఒక్కసారిగా ఎదుర్కొనమని చెప్పినా చేస్తాను. నేను రణరంగమున అర్జునుడిని కృష్ణుడినే లెక్క చేయను నా బలములో పదహారవ వంతు కూడా శక్తి లేని ఈ కర్ణుడు నాకు ఎంత. తెలియక పోతే సరే అన్నీ తెలిసి నన్ను కర్ణుడికి సారథిగా ఉండమంటే నేను నా దారిన పోతాను. అంతే కాని ఇలాంటి నీచపు పని చెయ్యను " అని చెప్పాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: ఐదవ అధ్యాయం

కర్మసన్యాసయోగం: శ్రీ భగవానువాచ:


స్పర్శాన్‌కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః 

ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ (27)


యతేంద్రియమనోబుద్ధిః మునిర్మోక్షపరాయణః 

విగతేచ్ఛాభయక్రోధో యః సదా ముక్త ఏవ సః (28)


బాహ్యవిషయాలమీద ఆలోచనలు లేకుండా, దృష్టిని కనుబొమల మధ్య నిలిపి, ముక్కులోపల సంచరించే ప్రాణాపానవాయువులను సమానం చేసి, ఇంద్రియాలనూ, మనస్సునూ, బుద్ధినీ వశపరచుకుని, మోక్షమే పరమలక్ష్యంగా ఆశ, క్రోధం, భయం విడిచిపెట్టిన ముని నిరంతరమూ ముక్తుడై వుంటాడు.