🌹🌷🏹🪔🛕🪔🏹🌷🌹
*🌞ఆదివారం 11 మే 2025🌞*
*రామాయణం*
ఒకసారి చదివినంత
మాత్రాన మన సమస్త
పాపాలని తీసేస్తుంది... ``
*వాల్మీకి రామాయణం*
*35వ భాగం*
అందరూ రాముడిని చేరుకోవడం కోసమని అయోధ్య నుంచి బయలుదేరారు. కాని, అందరి కంటే ముందు కైకేయి బయలుదేరింది. తాను ఎవరికోసమైతే ఈ పని చేసిందో, ఆ భరతుడే తనని కాదన్నప్పుడు ఆమెను ఆవహించిన మోహం పోయింది. తన తప్పుని తెలుసుకుంది. అలా కొన్ని లక్షల సైన్యంతో బయలుదేరి వాళ్ళు గంగా నదిని చేరుకున్నారు. అప్పుడు ఆ నిషాద రాజైన గుహుడు వాళ్ళని చూసేసరికి, ఒక పెద్ద సముద్రము వచ్చినట్టు, కోవిదార వృక్షము చిహ్నముగా ఉన్నటువంటి సైన్యం వచ్చి నిలబడింది.
అప్పుడు గుహుడు తన బంధువులని, సైన్యాన్ని, యువకులని పిలిచి… “భరతుడు ఇంత సైన్యంతో వచ్చాడంటే, కచ్చితంగా మనందరినీ చంపడం కోసమైనా వచ్చి ఉండాలి, లేదా 14 సంవత్సరాల తరువాత రాముడు తిరిగి వస్తే ఆయన పరాక్రమము ముందు నిలబడలేనని, ఇదే అదునుగా ఒక్కడే ఉన్న రాముడిని, లక్ష్మణుడిని సంహరించడం కోసమైనా వచ్చి ఉండాలి. రాముడు నాకు పరమ మిత్రుడు, ఆయనని మనం రక్షించుకోవాలి. ఇంత పెద్ద సైన్యాన్ని మనం ఎదిరించలేము, కాకపోతే మన సహాయం లేకుండా వీళ్ళు ఎవరూ గంగని దాటలేరు. అందుకని 500 పడవలని ఈ సైన్యం అంతా వెళ్ళడానికి సిద్ధం చెయ్యండి. మీరందరూ కూడా ఒక్కొక్క పడవలో 100 మంది చొప్పున కవచాలు కట్టుకొని, ఆయుధాలు పట్టుకొని నిలబడండి. నేను ఏమీ ఎరుగని వాడిలా భరతుడి దగ్గరికి వెళ్ళి, “నువ్వు రాముడిని కలుసుకోడానికి వెళుతున్నావా, రాముడిని సంహరించడానికి వెళుతున్నావా” అని అడుగుతాను. ఒకవేళ రాముడిని సంహరించడానికే భరతుడు వచ్చి ఉంటే, పడవలలో గంగని దాటిస్తామని చెప్పి, పడవ ఎక్కించి, గంగ మధ్యలో ముంచేద్దాము. ఒకవేళ రాముడిని కలుసుకోవడానికే భరతుడు వచ్చి ఉంటే, రాముడు ఎక్కడున్నాడో చెప్పి, వాళ్ళతో నేను కూడా వెళతాను” అన్నాడు.
అప్పుడాయన కొంత మాంసము, పుష్పములు, ధాన్యములు, కందమూలములు, తేనె పట్టుకొని భరతుడు విడిది చేసిన గృహం దగ్గరికి వెళ్ళాడు. గుహుడు రావడాన్ని చూసిన సుమంత్రుడు లోపలికి వెళ్ళి భరతుడితో “భరతా! నువ్వు రాముడు ఎక్కడున్నాడో అని వెతుకుతున్నావు కదా, రాముడు ఎక్కడున్నాడో గుహుడికి తెలుస్తుంది. రాముడికి గుహుడి మీద అపారమైన ప్రేమ, అలాగే గుహుడికి రాముడి మీద అపారమైన భక్తి!” అని చెప్పగానే భరతుడు గుహుడిని లోపలికి ప్రవేశపెట్టమన్నాడు.```
*యదా తుష్టః తు భరతః రామస్య ఇహ భవిష్యతి।*
*సా ఇయం స్వస్తిమయీ సేనా గంగాం అద్య తరిష్యతి॥*```
లోపలికి వెళ్ళిన గుహుడు తాను తీసుకువచ్చిన వాటిని అక్కడ పెట్టి “నువ్వు ఈ రాజ్యాన్ని దశరథ మహారాజుగారి వల్ల పొందావు, ఇంకా నీ తృప్తి తీరక రాముడిని చంపుదామని వచ్చావా, లేకపోతే రాముడిని కలుసుకుందామని వచ్చావా, నాకు మనస్సులో శంకగా ఉంది. నిజం చెప్పు భరతా, ఎందుకు వచ్చావు ఇక్కడికి” అని అడిగాడు.
అప్పుడు భరతుడు “నువ్వు అన్నమాట వలన నాకు బాధ కలిగినా, నీ అమాయకత్వం నాకు తెలుస్తోంది. నేను ఈ గంగ దాటి భారద్వాజ ఆశ్రమానికి వెళ్ళి, ఆ ఆశ్రమం దగ్గరలో ఉన్న రాముడిని కలుసుకోవాలని అనుకుంటున్నాను" అన్నాడు.
“సరే నువ్వు రాముడిని కలుసుకోవాలని వచ్చావు, మరి నీ వెనకాల ఇంత సైన్యం ఎందుకు వచ్చింది” అని గుహుడు భరతుడిని ప్రశ్నించాడు.
అప్పుడు భరతుడు ఆకాశమంత నిర్మలమైన మనసుతో… “ఒక తమ్ముడు ఒక అన్నగారిని రాజ్యం కోసం చంపేటటువంటి దురాలోచన ఎన్నడూ రాకుండుగాక, ఒక తమ్ముడు అన్నగారి గురించి ఎప్పుడన్నా ఆలోచిస్తే, అన్నగారి కాళ్ళుపట్టి నమస్కరించడానికి మాత్రమే ఆలోచించేటటువంటి సౌజన్యము నిలబడుగాక” అన్నాడు.
ఈ మాటలు విన్న గుహుడు…
“ఇక్ష్వాకు వంశంలో పుట్టిన నీకే చెల్లిందయ్యా ఈ మాట చెప్పడం. నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ఇద్దరూ కలిస్తే, చూసి మురిసిపోవాలని ఉంది, దగ్గరుండి గంగని దాటించి నేను మీతో వస్తాను. రాముడు ఇక్కడే పడుకొని వెళ్ళాడు, నన్ను తన తల మీద మర్రి పాలు పోయమన్నాడు, జటలు ధరించి, నార వస్త్రాలు కట్టుకొని వెళ్ళాడయ్యా రాముడు” అని అన్నాడు.
ఆ రాత్రి భరతుడు రాముడి గురించి ఆలోచిస్తూ, తన వల్ల రాముడు ఇన్ని కష్టాలు పడుతున్నాడని బాధపడుతూ ఉండడం వలన నిద్రపట్టక గుహుడిని పిలిచి, “నాకు రాముడి గురించి ఏదైనా చెప్పు!” అని అడిగాడు.
అప్పుడా గుహుడు “రాముడు ఇక్కడికి వచ్చి ఇంగుది వృక్షం కింద కూర్చున్నాడు. అప్పుడు నేను ఆయనకి అన్నము, కందమూలాలు, తేనె మొదలైనవి తీసుకువెళ్ళాను, అప్పుడు రాముడు ‘నేను క్షత్రియుడిని, ఒకరికి మేము ఇవ్వాలి, ఇతరుల దగ్గర మేము తీసుకోకూడదు, మా తండ్రిగారికి ఇష్టమైన ఆ గుర్రాలకి కొంచెం దాణా పెట్టు. ఆ గంగ నుంచి కొన్ని నీళ్ళు తీసుకురా, అవి తాగి పడుకుంటానయ్యా' అన్నాడు.
అప్పుడు నేను గంగ నుంచి కొన్ని నీళ్ళు తీసుకువచ్చి వాళ్ళకి ఇచ్చాను. సీతారాములు తాగగా మిగిలిన నీళ్ళని లక్ష్మణుడు కళ్ళకి అద్దుకొని తాగాడు. అప్పుడు నేను రాముడిని లోపల హంసతూలికా తల్పం మీద పడుకోమనగా, ఆయన, నేను ఇప్పుడు ఒక తాపసిలాగ బతకాలి అని చెప్పి, లక్ష్మణుడు తీసుకొచ్చిన దర్భగడ్డి మీద పడుకున్నాడు.
రాముడు పడుకోయేముందు, లక్ష్మణుడు సీతారాముల పాదములు కడిగి, తడిగుడ్డతో తుడిచాడు. అప్పుడు సీతమ్మ రాముడి భుజాన్ని తలగడగా చేసుకొని పడుకుంది. నేను కాపలా కాస్తాను నువ్వు పడుకో లక్ష్మణా అంటే, ఆయన నన్ను, ఎలా పడుకోమంటావు గుహా ఇంత దారుణమైన దృశ్యం చూశాక, అని నీ తమ్ముడు లక్ష్మణుడు ఏడిచాడయ్యా. ఇదుగో ఈ గడ్డి మీదే సీతారాములు పడుకున్నారు” అని గుహుడు సీతారాములు పడుకున్న గడ్డిని భరతుడికి చూపించాడు.
అప్పుడు భరతుడు, సీతారాములు పడుకున్న ఆ గడ్డి దగ్గరికి వెళ్ళి చూడగా, ఒకవైపు గట్టిగా ఒత్తుకొని, గడ్డి భూమిలోకి నొక్కుకొని ఉంది. ఇది రాముడు పడుకున్న చోటని భరతుడు గ్రహించాడు.```
*మన్యే సాభరణా సుప్తా సీతా అస్మిన్ శయనే తదా।*
*తత్ర తత్ర హి దృశ్యంతే సక్తాః కనక బిందవః॥*```
అలాగే, సీతమ్మ పడుకున్న వైపు బంగారు రవ్వలు పడిఉన్నాయి. సీతమ్మ కట్టుకున్న పట్టుచీర కొంగు యొక్క దారములు ఆ గడ్డికి చుట్టుకొని ఉన్నాయి. ఎక్కడో రాజభవానాల్లో పడుకోవలసిన సీతారాములు, ఇంతమంది ఆటవికులు చూస్తుండగా గడ్డి మీద పడుకోవలసి వచ్చిందని, దీనికంతటికి తనే కారణమని భరతుడు నేలమీద పడి మూర్చపోయాడు.
తరువాత భరతుడు “ఈ క్షణం నుంచి 14 సంవత్సరాల పాటు నేను కూడా పట్టుబట్ట కట్టను. నార వస్త్రాలు కట్టుకుంటాను, జటలు ధరిస్తాను. నేను కూడా కందమూలములు, తేనె, తింటాను” అని ప్రతిజ్ఞ చేశాడు.
వెంటనే నార వస్త్రాలు ధరించి, భరతుడు ఆ రాత్రికి రాముడు పడుకున్న చోటనే పక్కన భూమి మీద పడుకున్నాడు.
మరునాడు ఉదయం అందరూ గంగని దాటి ముందుకి బయల్దేరారు. అలా కొంత దూరం ప్రయాణించాక వారు భారద్వాజ ఆశ్రమాన్ని చేరుకున్నారు.
అప్పుడు సైన్యాన్ని కొంత దూరంలో ఉంచి, భరత,శత్రుఘ్నులు వశిష్ఠుడితో కలిసి ఆ ఆశ్రమంలోకి ప్రవేశించారు. (ఒకసారి భారద్వాజుడు బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై ఏమి నీ కోరిక అని అడిగాడు.
నాకు వేదం చదువుకోడానికి 100 సంవత్సరాల ఆయుర్దాయం కావాలని భారద్వాజుడు అడిగాడు, బ్రహ్మగారు సరే అన్నారు. అలా ఆయన బ్రహ్మగారి దగ్గర 3 సార్లు ఆయుర్దాయం పుచ్చుకున్నాడు. అలా 4వ సారి కూడా తపస్సు చెయ్యగా, బ్రహ్మగారు ప్రత్యక్షమై, వేదాలు ఎంత ఉంటాయో తెలుసా చూడు అని చూపిస్తే అవి పర్వతాల అంత ఎత్తు ఉన్నాయి. నువ్వు 300 సంవత్సరాల్లో చదివింది 3 గుప్పిళ్ళంత. వేదం అనంతం, దాన్ని ఎంతకాలం చదివినా అది తెలిసేది కాదు, పూర్తిగా చదవగలిగేది కాదు. అందుకని నువ్వు చదివినదానితో తృప్తిపడు’ అన్నారు బ్రహ్మగారు,
అలా బ్రహ్మగారిచే ఆయుర్దాయాన్ని పొందిన మహానుభావుడు భారద్వాజుడు).
ఎదురుగా వస్తున్న వశిష్ఠుడిని చూసి భారద్వాజుడు గబగబా వచ్చి అర్ఘ్య పాద్యములు ఇచ్చారు. తరువాత ఒకరిని ఒకరు కుశల ప్రశ్నలు అడిగారు. అప్పుడు భారద్వాజుడు, “నువ్వు ఈ అరణ్యానికి ఎందుకు వచ్చావు అని అడుగగా, నేను రామ దర్శనానికి వచ్చానని భరతుడు చెప్పాడు. (భారద్వాజుడు త్రికాలవేది, దశరథుడు మరణించాడని ఆయనకి తెలుసు) అప్పుడు భారద్వాజుడు “మీ తండ్రిగారు 14 సంవత్సరాలు రాముడిని అరణ్యాలకి పంపించి నీకు రాజ్యం ఇచ్చారు. ఆ రాజ్యాన్ని పరిపాలించుకునే స్థితిలో నువ్వు ఉన్నావు, అయినా కాని ఇంత సైన్యాన్ని తీసుకొని అరణ్యానికి వచ్చావు. మహా పాపకార్యమైన రామ హత్య కోసమని నువ్వు వచ్చావని నాకు మనసులో శంకగా ఉంది” అని అన్నాడు.```
*హతొ అస్మి యది మాం ఎవం భగవాన్ అపి మన్యతె ।*
*మత్తొ న దొషం ఆషంకెర్ న ఎవం మాం అనుషాధి హి ॥*```
ఈ మాటలు విన్న భరతుడు కన్నీరు కారుస్తూ… “మహానుభావా! నా దౌర్భాగ్యమయ్య, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను చూసి రాముడిని చంపడానికి వచ్చావా అంటారు. నేను రాముడిని చంపడానికి రాలేదు. నువ్వు అడిగిన ప్రశ్న చేత నేను చచ్చిపోయాను మహర్షీ. ఈ మాట గుహుడు అడిగాడంటే అర్థం చేసుకోవచ్చు, కాని ఇంత గొప్ప మహర్షులు మీరు కూడా ఈ మాట అన్నారంటే నేను బ్రతకడం ఎందుకు. నేను ఎన్నడూ రాజ్యం కావాలని, రాముడు అరణ్యవాసం చెయ్యాలని కోరలేదు, కాని నా మీద ఉన్న విపరీతమైన ప్రేమ చేత మా అమ్మ నేను లేనప్పుడు రెండు వరాలు అడిగింది.
రాముడికి పట్టాభిషేకం చేయించాలని అరణ్యానికి వచ్చాను. నేను రాముడిని చంపేంత దుర్మార్గుడిని కాదు మహర్షీ” అని ఆయన పాదముల మీద పడి ఏడ్చాడు.
అప్పుడు భారద్వాజుడు “నువ్వు ఎటువంటివాడివో నాకు తెలుసు భరతా, నువ్వు ఇటువంటి దురాలోచనలు చెయ్యవని తెలుసు, అయినా నేను నిన్ను ఎందుకడిగానో తెలుసా. నీ శీలం ఎటువంటిదో లోకానికి చెప్పడం కోసమని నేను ఈ మాట అడిగాను. నువ్వు నీ మాటయందు నిలబడెదవు గాక” అని ఆశీర్వదించిన పిమ్మట “నాయనా! ఈ రాత్రికి నా ఆతిధ్యాన్ని స్వీకరించు” అన్నాడు.
అప్పుడు భరతుడు “మీరు నాకు అర్ఘ్యం, పాద్యం ఇచ్చారు, నాకు ఇంతకన్నా ఏమి కావాలి, నాకు ఏమీ వద్దు” అన్నాడు.
“మరి నీ సైన్యాన్ని ఎక్కడ పెట్టావు అని భారద్వాజుడు అడుగగా, సైన్యాన్ని ఇక్కడికి తీసుకువస్తే ఆశ్రమం పాడవుతుందని వాళ్ళని దూరంగా పెట్టాను” అని భరతుడు అన్నాడు.
అప్పుడు భారద్వాజుడు “అంత దూరంగా ఎందుకు పెట్టావయా, ఇవాళ నేను ఆతిధ్యం ఇవ్వాలని అనుకుంటున్నాను, కావున నువ్వు నా ఆతిధ్యాన్ని తీసుకొని వెళ్ళాల్సిందే. నీ గుర్రాలకి, ఏనుగులకి, ఒంటెలకి, సైన్యానికి, పురోహితులకి, మంత్రులకి, నీ తల్లులకి ఎటువంటి ఆతిధ్యం ఇవ్వాలో అటువంటి ఆతిధ్యం ఇస్తాను” అన్నాడు.```
*ఆహ్వయె విష్వ కర్మాణం అహం త్వష్టారం ఎవ చ।*
*ఆతిథ్యం కర్తుం ఇగ్చ్ఛామి తత్ర మె సంవిధీయతాం॥
*ఆహ్వయె దెవ గంధర్వాన్ విష్వా వసు హహా హుహూన్।*
*తథైవ అప్సరసొ దెవీర్ గంధర్వీహ్ చ అపి సర్వషహ్ ॥*
*ఇహ మె భగవాన్ సొమొ విధత్తాం అన్నం ఉత్తమం।*
*భక్ష్యం భొజ్యం చ చొష్యం చ లెహ్యం చ వివిధం బహు ॥*
*తత్ర రాజ ఆసనం దివ్యం వ్యజనం చత్రం ఎవ చ ।*
*భరతొ మంత్రిభిహ్ సార్ధం అభ్యవర్తత రాజవత్ ॥*```
అప్పుడా భారద్వాజ మహర్షి ఆచమనం చేసి విశ్వకర్మని, త్వష్టని ప్రార్ధన చేసి.. “ఇక్కడికి రాజకుమారులైన భరత శత్రుఘ్నులు వచ్చారు, వారి వెనకాల సేనాబలం వచ్చింది. పురోహితులు, మహర్షులు వచ్చారు. వీళ్ళల్లో ఎవరెవరు ఎటువంటి భవనములలో నివసిస్తారో అటువంటి భవనములను ఓ విశ్వకర్మ! నువ్వు నిర్మించెదవుగాక." (రాజులు నివసించేవాటిని హర్మ్యములు, బాగా డబ్బున్నవాళ్ళు ఉండేవాటిని ప్రాసాదములు అని అంటారు)
విశ్వకర్మ ఉత్తరక్షణంలో ఎవరికి కావలసిన భవనాన్ని వాళ్ళకి నిర్మించాడు.
తరవాత ఆయన కుబేరుడిని, బ్రహ్మగారిని ప్రార్ధన చేసి “కుబేరా! నీ దగ్గర ఉన్న వేలమంది అప్సరసలని పంపించు, ఓ బ్రహ్మదేవా!, నీ దగ్గర ఉన్న అప్సరసలని కూడా పంపించాలి, వారితో పాటుగా నారదుడు, తుంబురుడు, హుహు అనే దేవగాయకులు రావాలి. అలాగే ఇక్కడ పాయసం ఏరులై ప్రవహించాలి. పులియ పెట్టిన పళ్ళనుంచి, పిండి నుంచి, బెల్లం నుంచి పుట్టిన కల్లు(సుర) ఇక్కడ నదులుగా ప్రవహించాలి. ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు తినడానికి కావలసిన వాటి ఆహారం గుట్టలు గుట్టలుగా పడిపోవాలి, పర్వతాలలా అన్నపురాసులు ఏర్పడాలి, వాటితో పాటు కూరలు, పచ్చళ్ళు, పులుసులు కావాలి. ఇవన్నీ తిన్నాక జీర్ణం అవ్వడానికి సొంఠి, లవంగం, ఇంగువ కలిగిన యవ్వనపు పెరుగు కావాలి. ఆకలి పుట్టించడానికి కొంచెం పుల్లగా ఉన్న పెరుగు కావాలి. అన్నంలో కలుపుకోడానికి కమ్మగా ఉన్న పెరుగు పుట్టాలి. వీటితో పాటు అందరూ మొహం కడుక్కోవడానికి చూర్ణములు(powder & paste ) కావాలి, వంటికి, జుట్టుకి రాసుకునే ఆమలకం(ఉసిరికాయలతో చేసిన ముద్ద), సున్నిపిండి, నూనె మొదలైనవి మంచి మంచి బంగారు పాత్రలలో కావాలి. కొన్ని వేల మంది అప్సరసలు వచ్చి, ఒక్కొక్క సైనికుడిని పీఠం మీద కూర్చోబెట్టి ఒళ్ళంతా నూనె రాసి, నలుగు పెట్టి స్నానం చేయించాలి. ఇక్కడున్న వాళ్ళలో బాగా గెడ్డాలు పెంచుకున్న ఋషులు, బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళు గెడ్డం దువ్వుకోడానికి మంచి దువ్వెనలు రావాలి. వీళ్ళు ఇవన్నీ తిన్నాక ఇంకా తినాలనిపిస్తే, తొందరగా జీర్ణం అవ్వడానికి ఔషదాలు కావాలి, అందుకని ఓ సోముడా!, చంద్రుడా! మీరు ఇవి సిద్ధం చెయ్యండి.
అప్సరసలు నాట్యం చెయ్యాలి, ఇప్పటికిప్పుడు ఇక్కడ పెద్ద పళ్ళతో వెలగ చెట్లు, పనస చెట్లు పుట్టాలి, ఎక్కడెక్కడినుంచో చిలుకలు రావాలి. కుబేరుడి రథమైన చైత్రరథం రావాలి, మామిడి చెట్లు పుట్టాలి, కుంకుడు చెట్లు పుట్టాలి, వీటితో పాటు ఎవరికి ఎంత వేడి కావాలో, అంత వేడితో నీళ్ళు పుట్టాలి, అందరికి కట్టుకోవడానికి బట్టలు, తొడుక్కోవడానికి చెప్పులు కావాలి. భరతుడి కోసం ఒక బ్రహ్మాండమైన హర్మ్యం ఏర్పడాలి” అని ప్రార్ధించాడు.
అప్పుడా గుర్రాలు, ఏనుగులు తమ జీవితంలో తిననటువంటి భోజనం చేశాయి. ఒక్కక్కడికి నలుగురు అప్సరసలు నలుగు పెట్టి స్నానం చేయించారు. భరతుడు తన మంత్రులతో కలిసి ఆ హర్మ్యంలోనికి ప్రవేశించాడు. అందులో ఒక పెద్ద వేదిక, దాని మీద కనకపు సింహాసనం, దాని మీద ఒక పెద్ద గొడుగు ఉన్నాయి. లోపలికి వెళ్ళిన భరతుడు ఆ సింహాసనం మీద రాముడు కూర్చున్నట్టు భావించి, కిందన ఉన్న పాదపీఠానికి తల తగిలేటట్టు నమస్కారం చేసి, చామరాన్ని ఒకసారి విసిరి, ఇవన్నీ రాముడికి చెందవలసినవి అని, మంత్రి కూర్చునే చోట కూర్చున్నాడు.
అప్పుడా సభలోకి రంభ మొదలైన వారు వచ్చి నాట్యం చేశారు, అలాగే నారదుడు, తుంబురుడు మొదలైన వారు వచ్చి పాటలు పాడారు. ఏదన్నా తాగడానికి ఉంటె బాగుండు అని భరతుడు అనుకున్నాడు, అంతే, వెంటనే అక్కడ ఒక పాయసపు నది ప్రవహించింది, అందరూ ఆ నది నుంచి ఎంత కావాలో అంత పాయసాన్ని బంగారు పాత్రలలో ముంచుకొని తాగారు. అందరూ అన్నిటినీ బాగా అనుభవించారు. సైనికులందరూ బాగా తినేసి, తాగేసి పడుకుంటే అప్సరసలు వచ్చి వాళ్ళ కాళ్ళు పట్టారు. అప్పుడా సైనికులు “మనం వెనక్కి అయోధ్యకి వెళ్ళద్దు, ముందు చిత్రకూట పర్వతాలకి వద్దు, ఇక్కడే భారద్వాజ ఆశ్రమంలో ఉండిపోదాము” అని సంతోషంతో కేకలు వేస్తున్నారు. ఏనుగులు, గుర్రాలు కూడా ఆనందపడ్డాయి. మరునాడు తెల్లవారే సరికి అన్నీ అదృశ్యమయిపోయాయి.
తరువాత భరతుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయ వచ్చి భారద్వాజ మహర్షి పాదాలకి నమస్కారం చేశారు. అప్పుడు భారద్వాజుడు భరతుడిని దగ్గరికి పిలిచి “వీళ్ళు ముగ్గురూ మీ అమ్మలు కదా, వీళ్ళల్లో ఎవరు ఎవరో నాకు చెప్తావా” అన్నాడు.
అప్పుడు భరతుడు “సుమిత్ర చెయ్యి పట్టుకొని ఉన్న ఈ అమ్మ, సింహంలా నడవగలిగినవాడు, అదితి ధాతని కన్నట్టు రామచంద్రుడిని కన్నతల్లి, మా అమ్మ కౌసల్య.
వీరులు, పరాక్రమవంతులైన లక్ష్మణ శత్రుఘ్నులను కన్నతల్లి ఈ సుమిత్ర.. రాముడు అరణ్యవాసానికి వెళ్ళడానికి కారణమైనది, కట్టుకున్న భర్త మరణించడానికి కారణమైన దుష్టచరిత్ర కలిగినటువంటిది, ఎప్పుడూ కోరికలు కోరుతూ, క్రోధంగా ఉండేటటువంటి ఈ కైకేయి నా తల్లి” అని అన్నాడు.```
*న దొషెణ అవగంతవ్యా కైకెయీ భరత త్వయా ।*
*రామ ప్రవ్రాజనం హ్య్ ఎతత్ సుఖ ఉదర్కం భవిష్యతి ॥*
*దెవానాం దానవానాం చ ఋ్ఇశీణాం భావితాత్మనాం।*
*హితమెవ భవిశ్యద్ధి రామప్రవ్రాజనాదిహ ॥*```
అప్పుడు భారద్వాజుడు “ఈవిడ రాముని యొక్క అరణ్యవాసమునకు కారణమైన మాట వాస్తవమే. కాని రాముడు అలా అరణ్యవాసానికి వెళితే తప్ప దేవతలకి, ఋషులకి రక్షణ అనేది కలగడం జరగదు. అలా రాముడు అరణ్యవాసానికి వెళ్ళేటట్టు దేవతలు కైకేయి చేత పలికించారు. అందుచేత నువ్వు ఇంక ఎన్నడూ కైక యందు దోషం పట్టకు” అన్నాడు.
భారద్వాజుడి మాటలు విన్న భరతుడు “సరే మీరు చెప్పినట్టే ప్రవర్తిస్తాను, రాముడు ఎక్కడున్నాడో మీరు మాకు సెలవియ్యండి” అన్నాడు.
“అయితే నువ్వు ఇలా దక్షిణాభి ముఖంగా వెళ్ళి నైరుతికి తిరిగితే, అక్కడ ఒక ఇరుకైనటువంటి దారి వస్తుంది, అందులోనుంచి జాగ్రత్తగా ఏనుగుల్ని, గురాలని నడిపించుకుంటూ వెళ్ళితే, అక్కడ చిత్రకూట పర్వతం మీద, మందాకినీ నది పక్కన రాముడు ఆశ్రమాన్ని నిర్మించుకొని ఉన్నాడు” అని భారద్వాజ మహర్షి చెప్పారు.
అందరూ భారద్వాజ మహర్షి చెప్పిన విధంగా రాముడిని చేరుకోవడానికి బయలుదేరారు.
ఈలోగా ఆ చిత్రకూట పర్వతం దగ్గర రాముడు మందాకిని నది యొక్క ప్రవాహాన్ని సీతమ్మకి చూపిస్తూ
“సీతా! నువ్వు లక్ష్మణుడు నాపక్కన ఉండగా, ఈ నదిలో స్నానం చేస్తూ, ఈ వనాలని, ఈ వనంలోని మృగాల అందాలని, ఇక్కడి పర్వతాల్ని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. నాకు అయోధ్య జ్ఞాపకం రావడం లేదు. 14 సంవత్సరాలు చిటికెలో గడిచిపోతాయి అనిపిస్తుంది” అన్నాడు.
అప్పుడు లక్ష్మణుడు, తాను వేటాడి తీసుకువచ్చిన జంతువు మాంసాన్ని కాల్చి రాముడికి తినమని ఇచ్చాడు. రాముడు దాన్ని తిని, “ఇది చాలా బాగుంది, సీతా నువ్వు కూడా తిను”అన్నాడు.
అలా తాను తెచ్చిన మాంసాన్ని సీతారాములు భుజిస్తుండగా, చూస్తున్న లక్ష్మణుడు పొంగిపోయాడు. అన్నావదినలని సంతోష పెట్టానని, వాళ్ళు పొందుతున్న ఆనందాన్ని చూసి తాను ఆనందపడ్డాడు.
రాముడి దర్శనం చేసుకోవాలని భరతుడు వేగంగా ముందుకి వెళుతున్నాడు.
అప్పుడు ఆయనకి కొంత దూరంలో పొగ కనిపించింది, అలాగే చెట్లకి గుడ్డలు కట్టి ఉన్నాయి. లక్ష్మణుడు రాత్రి పూట మందాకిని నుంచి నీరు తెచ్చేటప్పుడు దారి మరిచిపోకుండా ఉండడానికి ఇలా చెట్లకి గుడ్డలు కట్టడాని భరతుడు గ్రహించాడు. ఇంక రాముడు ఎంతో దూరంలో లేడని భరతుడు ఆ ఆశ్రమం వైపు వేగంగా పరుగులు తీశాడు.
*రేపు...36వ భాగం*
*🚩జై శ్రీరామ్.! జై శ్రీ రామ్.!🚩*
*🙏జై జై శ్రీ రామ్.!🙏*
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి