14, నవంబర్ 2021, ఆదివారం

శ్రీమద్భాగవతము

 *11.11.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2319(౨౩౧౯)*


*10.1-1462*


*శా. రోలంబేశ్వర! నీకు దౌత్యము మహారూఢంబు; నీ నేరుపుల్*

*చాలున్; మచ్చరణాబ్జముల్ విడువు మస్మన్నాథపుత్రాదులన్*

*లీలం బాసి పరంబు డించి తనకున్ లీనత్వముం బొందు మ*

*మ్మేలా పాసె విభుండు? ధార్మికులు మున్నీ చందముల్ మెత్తురే.* 🌺



*_భావము: భ్రమరేశ్వరా! మకరందం త్రావి త్రావి మదించియున్నావు. నీకు రాయబారాలు నడపటం బాగా అలవాటనుకుంటాను. నీ గడసరి తనము మాను. చమత్కారములు చాలించు. మా పాదాలు వదులు. మేము మా భర్తలను, కొడుకులను, ఇతర బంధువులందరిని అలక్ష్యము చేసి, మోక్షము మాటే తలపెట్టక, ఆయనలో ఐక్యమవ్వాలనే కాంక్ష తో వస్తే, మమ్ములను తృణీకరించి దూరమయ్యాడు ఆ శ్రీకృష్ణ ప్రభువు. ఈ చేష్టలను ధర్మ నిష్ఠ కల ప్రభువులు మెచ్చుకుంటారా?"_* 🙏



*_Meaning: "O king of the bees! You have become arrogant and fully intoxicated by drinking nectar from flowers. You are used to conducting mediation and Intercessions and are very adept at these. Enough with your shrewdness and stop your artfulness. Leave our feet and get away. We neglected and abandoned our husbands and children, never thought of Moksha but were completely involved in uniting with the Supreme being Sri Krishna. He made light of us and distanced from us, the ardent followers and puppets. Would the Supreme being approve of such misdemeanor?."_* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan kumar (9347214215).*

ఉన్మత్తుడు..ఉద్యోగి..

 *ఉన్మత్తుడు..ఉద్యోగి..*


"కొండారెడ్డీ! గురుబ్రహ్మం ఉన్నాడా?.." 

" ఉన్నాడు సార్ ..అన్నదానం వంటకు సరుకులిస్తున్నాడు.."


    " పరమేషూ..ఈరోజు లడ్లు చేయించే దగ్గర ఎవరున్నారు?.." 

" గురుబ్రహ్మమున్నాడు సార్..


  "అన్నదానం దగ్గర వడ్డనకు నేనూ, గురుబ్రహ్మం వెళుతున్నాము..మీకు చెప్పి వెళదామని వచ్చాము.." 


           "వెంకన్న గారూ..మీరు లీవు పెడితే, కౌంటర్ ఎవరు చూసుకుంటారు?..ఉన్న ఇద్దరూ సరుకులకెళుతున్నారు.." 


   మాట ముగించేలోపలే వచ్చే సమాధానం గురుబ్రహ్మం ఉన్నాడు అనే! 


       అర్చక స్వాములు, భక్తులకు ఇచ్చే కుంకుమను చక్కగా పోట్లాలుగా చుట్టి పెడుతూనో..లేదా..భక్తులకు ప్రసాదంగా తయారు చేసిన లడ్లు కవర్లలో ప్యాక్ చేస్తూనో..పల్లకీ సేవ కు మైక్ ఏర్పాటు చేస్తూనో...ఆలయం లో ఉన్నంత సేపూ ఏదో ఒక పని లో నిమగ్నుడై,.... మా దత్తాత్రేయ స్వామి మందిర వ్యవస్థ లో ఇంతగా మమేకం అయిన వ్యక్తీ...గురుబ్రహ్మం అనబడే సన్నగా రివటలా ఉండే వ్యక్తీ ....ఎనిమిరెడ్డి గురుబ్రహ్మారెడ్డి..


     2004 వ సంవత్సరం లో తన అమ్మగారికి ఆరోగ్యం సరిగా లేక, తల్లి వెంబడి మొదటిసారి మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరానికి వచ్చాడు..ప్రకాశం జిల్లా, పెద చెర్లో పల్లి మండలం, పోతవరం గ్రామ నివాసి..వాళ్ళ కులదైవం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు..ఇద్దరు సోదరులు..తల్లి, తను..


       కొన్నాళ్ళు ఇక్కడ వుండి, తల్లికి స్వస్థత చేకూరగానే తిరిగి వాళ్ళ వూరు వెళ్ళిపోయాడు..I.T.I. పాస్ అయ్యాడు..B.A., డిగ్రీ పూర్తీ చేసాడు.. 2006 వ సంవత్సరంలో AP TRANSCO లో హెల్పర్ గా ఉద్యోగం లో చేరాడు..


        అంతవరకు బాగానే ఉన్న గురుబ్రహ్మారెడ్డి మానసిక స్థితి క్రమంగా మారిపోయింది..2007 నాటికి అతను ప్రపంచం దృష్టిలో ఒక మానసిక రోగి..అంతుచిక్కని ఆరోగ్య సమస్య..సోదరుల ప్రయత్నాలన్నీ నిష్పలం అయ్యాక, వారికి చివరిగా తోచిన ఉపాయం మొగలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామి వారి సన్నిధి..తీసుకొని వచ్చి ఆ దత్తుడి పాదాల చెంత వదిలిపెట్టారు..తమ బిడ్డ మళ్లీ మామూలు మనిషిగా మారుతాడనే నమ్మకం ఆ కుటుంబ సభ్యుల్లో సన్నగిల్లే సమయం అది..ఆ పరిస్థితి లో గురుబ్రహ్మారెడ్డి ని శ్రీ స్వామివారి సన్నిధికి తీసుకొచ్చారు..


        ఎప్పుడు ఏవిధంగా ప్రవర్తిస్తాడో తెలీని స్థితి..యెంత శాంతంగా ఉన్నట్టు కనిపిస్తాడో, మరుక్షణం విపరీత రౌద్రం..ఉన్మత్త స్థాయి కి పరాకాష్ట గా మారిపోయే స్వభావం..వంటి మీద బట్టలు సైతం తీసి గిరాటు వేసేవాడు..క్షణానికో రకంగా మారిపోయే తత్వం..తనలో తానే మాట్లాడుకోవడం..పూర్తి ఉన్మత్త లక్షణాలు..సరిగ్గా అవధూతల గురించి చెప్పిన "బాలోన్మత్త పిశాచ వేషాయా.." అన్న పరిస్థితి కి తగ్గట్టుగా ఉన్నది అతని ప్రవర్తన..


 కుటుంబ సభ్యులు సహనం తో పట్టుబట్టి, శ్రీ స్వామివారి మందిరం చుట్టూ ప్రదక్షిణాలు చేయించసాగారు.. క్రమంగా మార్పు రావడం మొదలు పెట్టింది..2008 డిసెంబర్ నాటికి, గురుబ్రహ్మం మామూలు స్థాయికి వచ్చాడు..దేవాలయం లో పనులు చేసుకుంటూ..సాటివారి పనుల్లో సహాయం చేస్తూ.. స్వామి సన్నిధి లోనే కాలం గడపసాగాడు..


2009 లో శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరానికి నైట్ వాచ్ మాన్ హఠాన్మరణం తో, ఖాళీ ఏర్పడింది..అంతకుముందు నుంచీ గురుబ్రహ్మాన్ని దగ్గరగా పరిశీలిస్తూ ఉన్నాను కనుక, అతను ఆ ఉద్యోగం చేస్తాడో..లేదో..అని..అడిగి చూద్దామనుకున్నాను.. ఇతరులనూ సలహా అడిగి, చివరిగా గురుబ్రహ్మాన్ని సంప్రదించాను..."ఈ దత్తాత్రేయుడి దగ్గర ఏ పని చెప్పినా చేస్తాను" అని చెప్పాడు..అలా శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిర ఉద్యోగుల్లో ఒకడిగా మారిపోయాడు..దేవాదాయ శాఖ వారి అనుమతీ తీసుకున్నాము..


 ఈ నాటికి సుమారు పది పదకొండు సంవత్సరాలు దాటిపోయింది గురుబ్రహ్మం శ్రీ స్వామివారి మందిరం లో ఉద్యోగిగా చేరి..మానసిక రోగి, మామూలు వ్యక్తిగా మారి, మాలో ఒకడుగుగా ఒదిగిపోయాడు..అదే మొగలిచెర్ల లో సిద్ధిపొందిన దిగంబర అవధూత శ్రీ దత్తాత్రేయుడి లీల!..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం.. లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా.. పిన్ : 523114...సెల్..94402 66380 & 99089 73699).

శ్రీమద్భాగవతము

 *10.11.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2318(౨౩౧౮)*


*10.1-1461*


*శా. సమదాళీశ్వర! చూడు ముజ్జ్వలిత హాసభ్రూవిజృంభంబులన్*

*రమణీయుండగు శౌరిచేఁ గరఁగరే రామల్ త్రిలోకంబులం?*

*బ్రమదారత్నము లక్ష్మి యాతని పదాబ్జాతంబు సేవించు ని*

*క్కము నే మెవ్వర మా కృపాజలధికిం గారుణ్యముం జేయఁగన్?* 🌺



*_భావము: "మదించిన తుమ్మెదల రాజా! నువ్వే చెప్పు! ఆ భువన మనోహరుని దరహాస చంద్రికలకు, కనుబొమల అందమైన కదలికలకు కరగిపోని వారుంటారా? ముల్లోకములు పూజనీయురాలు, శ్రేష్ఠ వనితారత్నమగు లక్ష్మీదేవియే ఆయన పాదపద్మములను ఆశ్రయించి కొలుస్తూ ఉంటుంది, మేమేపాటివారము? ఆ కరుణాసముద్రుని దయకు పాత్రులము కావటానికి మేమెంత వారము?"_*🙏



*_Meaning: "Hey King of fully drunk bees! You tell us whether there can be a mortal who is not in raptures on seeing the enticing smiling face of charming Sri Krishna and the captivating beauty of the movement of His eyebrows. Even the queen and the best of women LakshmiDevi serves Him with diligence and devotion. In comparison, we are minions and can we wish to become subjects to the benevolent glances of Sri Krishna, the ocean of compassion and magnanimity."_* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454).*

కర్తృత్వభావన

 💐కర్తృత్వభావన "ఖాళీ" అయిపోవడమే కర్మయోగం.*

 వ్యక్తిత్వభావన "ఖాళీ" అయిపోవడమే భక్తియోగం.💐


వివేకానందులు అమెరికా చేరిన మొదటి వారంలోనే అన్ని ఆధారాలూ పోగొట్టుకుని "ఖాళీ"గా నిలబడ్డారు.

 అక్కణ్ణుండి దైవీశక్తి అతడ్ని నడిపింది.


 అరవిందులు పాండిచ్చేరి సముద్రతీరంలో తన వద్ద మిగిలిన చివరి నాణేన్ని సముద్రంలోకి విసిరిపారేసి "ఖాళీ"గా నిలబడ్డారు. అక్కణ్ణుండి దైవీశక్తి అతడ్ని నడిపింది.


 రమణులు ప్రయాణంలో మిగిలిన పైకాన్ని కోనేరులో విసిరివేసి, దుస్తులను సైతం వదిలి కేవలం ఓ గోచీతో "ఖాళీ"గా నిలబడ్డారు.అక్కణ్ణుండి దైవీశక్తి అతడ్ని నడిపింది.


 ఒకరు గురువుగారిని అడిగారు దైవీశక్తిని నేను చవిచూడాలంటే ఏంచేయాలి? అని..అతనికి* *గురువుగారు ఇలా చెప్పారు- 


 500 రూపాయిలు జేబులో ఉంచుకుని, ఆ పైకంతో బస్సులోగానీ, రైలులోగానీ ఎంతదూరం ప్రయాణం చేయగలవో అంతదూరం ప్రయాణం చేసి అక్కడ దిగేయ్.నీ జేబులో ఒక్కరూపాయి కూడా ఉండకూడదు....అక్కడ ఓ నెలరోజులు గడిపి, తిరిగి నీ స్వస్థలానికి చేరుకోగలిగితే తెలుస్తుంది..ఆ దైవీశక్తి నిన్ను ఎలా నడిపించిందో అనేది.


 ప్రత్యక్షానుభవం కలుగుతుంది.

 కోటి ఆధ్యాత్మికగ్రంథాలు చదివినా కలగని అనుభవం, ఈ ఒక్క పని చేయడం వలన కలుగుతుంది...అన్నారు.

 అతడు నవ్వుతూ ఓ హాస్యకథలాగా విన్నాడేగానీ, ప్రయత్నం చేయలేకపోయాడు.


 ఈ ఘట్టం విని అతని స్నేహితుడు, గురుభక్తుడు అయిన సుధాకర్ అనేవాడు అలా రైలులో బయలుదేరి దత్తక్షేత్రమైన గాణ్గాపురం చేరాడు..అక్కడ దిగి మిగిలిన చిల్లరపైకాన్ని పారవేసి, ఊళ్లోకి ప్రవేశించాడు.


 అక్కడే ఓ కాషాంబరధారి వద్ద శిష్యుడిగా చేరి, ఊళ్లో భిక్షం చేసుకుంటూ ఓ నెలరోజులు గడిపి, తిరిగి స్వస్థలమైన శ్రీకాళహస్తి చేరాడు. గురు బోధను అతనొక్కడే అలా 

 ప్రయత్నం చేసి దైవీశక్తిని అనుభవించాడు.


 తిరిగొచ్చాక అతడు ఓ అవధూతలా మారిపోయాడు..

 కొందరు "అతడు పిచ్చివాడైపోయాడు" అని దూరమైపోయారు...

 కొందరు అతన్ని ఓ గురువుగా ఆరాధించడం మొదలుపెట్టారు. 

 అతడు పిచ్చివాడో, అవధూతో దైవానికెరుక.


 వాస్తవానికి ప్రతి ఒక్కరు ఈ భూమ్మీదకు దిగంబరంగానే 

 వస్తారు."ఖాళీ"గానే ఈ ప్రపంచంలోకి ప్రవేశిస్తారు..


 తనువును, తల్లిదండ్రులను, బంధువులను, స్నేహితులను, భార్యాబిడ్డలను, సంపదలను, అనుభవాలను ఉచితంగానే పొందుతారు...తిరిగి అందరినీ, అన్నింటినీ, చివరకు తనువును కూడా "ఖాళీ" చేసి వెళ్లిపోతారు.


 " ఖాళీ" అవడం తథ్యం....

 కాబట్టి అన్నీ ఉన్నప్పుడు కూడా "ఖాళీ"గా ఉండడమే

 గురువుగారు చెప్పిన "మెలకువలో నిద్ర".


 భగవద్గీతలో చెప్పినట్టు "అందరూ మేలుకుని ఉంటే, యోగి నిద్రిస్తుంటాడు."

 నిద్ర అంటే పడుకుని నిద్రపోవడం కాదు.

 "ఖాళీ"గా ఉండడం. అదే* యోగనిద్ర.


 భగవద్గీత చరమశ్లోకంలో

 సర్వధర్మాన్ పరిత్యజ్య....అన్నాడు కృష్ణభగవానుడు.

 సర్వధర్మాలను వదిలేసి "ఖాళీ" అయిపొమ్మన్నారు.


 ధర్మములన్నీ ఇహానికి సంబంధించినవి.

 "ఖాళీ" అనేది పరానికి సంబంధించినది.


 శ్రీరామకృష్ణులు ఆరాధించిన "ఖాళీ"యే కాళీమాత.

 కాళీమాత అనేది ఓ విగ్రహం కాదు, 


 అర్థరాత్రి... ప్రపంచంలో ఉండే నిశ్శబ్ధాన్ని(మౌనాన్ని) అంధకారాన్ని(అభేదాన్ని)

 ఆస్వాదించడమే కాళీమాత దర్శనం.


 పట్టపగలు కూడా ఆ నిశ్శబ్ధాన్ని, ఆ "ఖాళీ"ని అనుభవించగలగడమే సహజ సమాధి.


 కర్తృత్వభావన "ఖాళీ" అయిపోవడమే కర్మయోగం.*

 వ్యక్తిత్వభావన "ఖాళీ" అయిపోవడమే భక్తియోగం.

 అహమిక "ఖాళీ" అయిపోవడమే జ్ఞానయోగం. 


 నిజానికి తాను "ఖాళీ" అయిపోతే.... ఆ ఖాళీ ఖాళీగా ఉండదు... ఆ ఖాళీ దైవంతో నిండిపోయి ఉంటుంది.

ఇదే "ఖాళీతత్త్వరహస్యం".


 అదే ఇది.... ఎవరూ లేకపోవడమే దేవుడు* ఉండడం. ఏమీ తెలియకపోవడమే దేవుణ్ణి తెలియడం. ఏ అనుభవమూ లేకపోవడమే దైవానుభవం.


 నేను చేస్తున్నాను అనేది మన భ్రమ అదే మన కర్మ కు మూలం. అలా కాకుండా ఈ జగత్తు మొత్తం జగన్మాత(ఖాళీ)

 నడుపుతోంది. అని అనుకుంటే

అది దైవ దర్శనం మార్గం అవుతుంది మన ప్రయాణం శక్తి (ఖాళీ) తో కూడి చక్కగా సాగిపోతుంది అదే ఖాళీ తత్వ మార్గం. ఈ మార్గం కర్మలకు దూరంగా వున్న సర్వ సంతోషాల నిలయానికి 

 చేరుకోవడానికి సహాయపడుతుంది. ఆజగన్మాత దర్శనం మనకు లభిస్తుంది.

 తింటేనే రుచి తెలుస్తుంది,అనుభవంతోనే అమ్మ (ఖాళీ) గొప్పతనం తెలుస్తుంది.